ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మీడియాలో ఒక కథనం ప్రచురితమైంది. ‘‘కేసులను నీరుగార్చే కుట్ర’’ శీర్షికతో వచ్చిన ఈ వార్త ఆసక్తికరంగా ఉంది కానీ.. ఆశ్చర్యకరంగా ఏమీ లేదు. ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో తనకు తానే సాటి అని బాబు ఇప్పటికే చాలాసార్లు రుజువు చేసుకున్నారు మరి! ఈ తాజా కథనంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే...గతంలో సీఐడీ అధికారులు ఎవరినైతే అవినీతి కేసుల్లో నిందితులుగా పేర్కొన్నారో.. వారికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నదట! ఇది అత్యంత అరుదైన ఘటనే. అప్పట్లో స్కామ్‌లకు పాల్పడిన వారు ఇప్పుడు అధికారంలో ఉండటం దీనికి కారణమవుతోంది.
అయితే నైతిక విలువలు పాటించేవారైతే.. తప్పు చేయలేదని నమ్మేవారైతే తామే నిందితులుగా ఉన్న కేసుల జోలికి అధికారంలోకి వచ్చినా అస్సలు పోరు. నిజం కోర్టులు నిగ్గుతేలుస్తాయని వదిలేస్తారు. ఈ కాలంలో ఇంతటి ఉదాత్త స్వభావాన్ని ఆశించలేము కానీ నిందితులే కేసు సమీక్షకు దిగడం దేశ చరిత్రలో సరికొత సంప్రదాయానికి తెరతీస్తుందన్నది మాత్రం సత్యం. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలు, స్కామ్ లపై, 2019-24 వరకు ప్రభుత్వాన్ని నడిపించిన వైసీపీ విచారించింది. సీఐడీ, సిట్ వంటి సంస్థలు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిర్దిష్ట అభియోగాలతో చంద్రబాబు, తదితరులపై కేసులు పెట్టింది. ఆ కేసులలో ఛార్జ్‌షీట్లు వేసేందుకు సమయం బాగా అవసరమైంది. అయితే ఈలోగా ప్రభుత్వం మారి టీడీసీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో చాలా చిత్రమైన పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ కేసులను నీరుకార్చడానికి, వీలైతే వాటి నుంచి తప్పించుకోవడానికి సన్నద్దం అవుతున్నారని వార్తలు సూచిస్తున్నాయి బాబు ఇలా చేయకపోతేనే ఆశ్చర్యపోవాలి. కాకపోతే ఇక్కడ విశేషం ఏమిటంటే తనపై కేసులు పెట్టిన సీఐడీ, సిట్‌లే ఇప్పుడు బాబుకు ప్రెజెంటేషన్ ఇస్తూండటం మాత్రం హైలైట్. ఇంకో విషయం ఈ కేసుల్లో విచారణ చేసిన అధికారులతో కాకుండా.. చంద్రబాబు నియమించుకున్న అధికారులు ఈ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. అంటే అవన్నీ తప్పుడు కేసులని, వాస్తవాలు లేవని, గత ప్రభుత్వంలోని అధికారులు కక్షకట్టి కేసులు పెట్టారని ఇప్పటి అధికారులతో చెప్పించుకునే ప్రయత్నం అన్నమాట! ఒక కేసు నిందితుడే అధికారం అడ్డుపెట్టుకుని తీర్పునిచ్చే విధంగా తన అభిప్రాయాలను ఈ ప్రెజెంటేషన్ సాకుతో వెల్లడించబోతున్నారన్నమాట.
చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో ఆయన అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసు విషయంలో కొన్ని చర్యలు తీసుకుంది. సుమారు 54 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తులు చంద్రబాబు లేదా, ఇతర ముఖ్యులవి కావు. నిధులను మళ్లించిన డిజిటెక్ సంస్థవి. ఈడీ ఈ సంస్థ అధికారులతోపాటు కొందరు ప్రభుత్వ అధికారులను కూడా గతంలోనే అరెస్ట్ చేసిన విషయం ఇక్కడ ఒకసారి చెప్పుకోవాలి. ప్రధాన నిందితుల్లో ఒకరైన చంద్రబాబును అప్పట్లో ఏపీ సీఐడి అరెస్ట్ చేసినా ఆయనపై ఈడీ ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదు. కారణం ఊహించదగినదే. ప్రస్తుతం ఆయన పార్టీ కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉంది. తదుపరి చర్య తీసుకోవడానికి కేంద్రంలోని సంబంధిత మంత్రులు ఆమోదం ఇస్తారని ఎవరూ అనుకోవడం లేదు. పైడి ఎప్పుడు అవకాశం ఉన్నా దేశ ప్రధాని మోడీతో భేటీ అయిన ఫోటోలు కనిపిస్తుంటాయి. అలాంటి వ్యక్తిపై ఈడి చర్య తీసుకోవడం కష్టమే.
గతంలో నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరిన వెంటనే వారిలో ఇద్దరిపై ఉన్న కేసుల విచారణ వేగం మందగించింది. ఆ నలుగురు ప్రధానితో కలిసి కూర్చున్న ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. వారికే అంతటి సదుపాయం కలిగినప్పుడు ఇప్పడు చంద్రబాబు మరింత పవర్ ఫుల్ గా ఉన్నందున కేసు నీరుకారిపోకుండా ఉంటుందా అన్నది చర్చనీయాంశం. స్కిల్ స్కామ్‌లో సుమారు రూ.300 కోట్ల అవ్యవహారాలు జరిగాయన్నది అభియోగం. డొల్ల కంపెనీలకు భారీ ఎత్తున డబ్బు చేరితే అందులో కొంత మనీ లాండరింగ్ మార్గాల్లో నేరుగా టీడీపీ ఆఫీసు ఖాతాల్లోకి వచ్చిందని సీఐడీ అభియోగాలు మోపింది. కానీ అప్పట్లో కేసు విచారించిన అధికారులు ఇప్పుడు టీడీపీ కారణంగా శంకరగిరి మాన్యాలు పట్టారు. పోస్టింగ్‌లు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వారిని వేధిస్తోంది. ఏదో కేసులో ఇరికించి సస్పెన్షన్ వేటు వేసేందుకూ వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం. వలపు వల విసిరి మోసగించే నటి ఒకరిని రంగంలోకి దింపి ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బాబు ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నలుగురు ఏడు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిపై తదుపరి చర్యల కోసం అవినీతి నిరోధక చట్టం కింద గవర్నర్ అనుమతి కోరాల్సి ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అనుమతి రావడం కల్లే. ఇక్కడ ఒక మాట చెప్పాలి. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఓటుకు నోటు కేసులో ఆడియో వాయిస్ తో సహా దొరికిపోయారు. దానిని ఆయన ఎంత సమర్థంగా మేనేజ్ చేసుకున్నారో తెలిసిందే. ఛార్జ్‌షీట్‌లో సుమారు 30 సార్లు చంద్రబాబు పేరు ఉన్నా, ఎఫ్ఐఆర్ లో మాత్రం ఆయన పేరు చేర్చకుండా అప్పటి కేసీఆర్ ప్రభుత్వంపై కొందరు ప్రముఖుల ద్వారా ప్రభావితం చేయగలిగారని అంటారు. అంతేకాదు. 2019 ఎన్నికల తర్వాత ఆయన కార్యదర్శి ఇంటిపై సీబీటీడీ అధికారులు దాడి చేసి, సుమారు రూ. రెండు వేల కోట్ల విలెవూర అక్రమాలకు సంబంధించి ఆధారాలు గుర్తించినట్లు ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన ఆ కేసునే ఆయన ముందుకు సాగకుండా కేంద్రంలోని బీజేపీ పెద్దలను సమర్థంగా మేనేజ్ చేసుకోగలిగారు. ఇప్పుడు వారితో మళ్లీ స్నేహం పెట్టుకున్నాక ఎవరు ఆ కేసు జోలికి వెళతారు?.
ఈడీ అధికారులు నిజంగానే ఈ కేసు లోతుపాతులను విచారించాలని అనుకుంటే ముందుగా షెల్ కంపెనీలకు వచ్చిన డబ్బు, టీడీపీ ఆఫీస్ ఖాతాకు చేరిన డబ్బు గురించి ఆరా తీయాలి. ఆ విషయాన్ని వెల్లడి చేయాలి. కేసు అక్కడదాకా వెళితే అది గొప్ప విషయమే అవుతుంది. కేంద్రంలోని బీజేపీతో ఏదైనా గొడవ వస్తే జరుగుతుందేమో కానీ, అంతవరకు కదలకపోవచ్చు. స్కిల్ స్కామ్‌ను నీరుగార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆంధ్రప్రదేశ్ మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి డిజిపికి లేఖ రాశారు. కాని ఆయన మాత్రం ఏమి చేస్తారు? ఆయన కూడా టీడీపీ ప్రభుత్వం నియమించిన వారే కదా! చంద్రబాబు ఏమి చెబితే అది చేయవలసిందే కదా? చంద్రబాబు, తదితర టీడీపీ నేతలపై వచ్చిన స్కామ్ కేసులను సీబీఐకి అప్పగించాలని ఒక పాత్రికేయుడు, సామాజిక వేత్త కెబిజి తిలక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అది ఎప్పటికి తేలుతుందో చెప్పలేం.
గతంలో చంద్రబాబు తనపై కేసు పెట్టడానికి ముందు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గవర్నర్ అనుమతి తీసుకోలేదంటూ సుప్రీం కోర్టులో వాదించారు. సెక్షన్ 17 వర్తిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కానీ సుప్రీం కోర్టు ఆ కేసులో ఇప్పటికీ తీర్పు ఇవ్వకుండా ఉండిపోయింది. అంతేకాదు. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్నప్పుడు కింది కోర్టు బెయిల్ ఇవ్వలేదు. కాని గౌరవ హైకోర్టు మాత్రం బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఒక ప్రైవేటు ఆస్పత్రి ఇచ్చిన ఆరోగ్య నివేదిక ఆధారంగా బెయిల్ ఇవ్వడం ఏమిటా అని పలువురు విస్తుపోయారు. తనకు రకరకాల వ్యాధులు ఉన్నాయని చెప్పిన ఆయన, విడుదల తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా టూర్లు చేశారు.
కేసు గురించి బహిరంగంగా మాట్లాడకూడదని కోర్టు ఆంక్షలు పెట్టింది. అయినా తన బావమరిది బాలకృష్ణ నిర్వహించే అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో పాల్గొని కేసు గురించి ప్రస్తావించి, తాను ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారట. ఈ పరిస్థితిలో ఏ అధికారి ఈ కేసులను ముందుకు తీసుకువెళతారు? ఏ విధంగా చంద్రబాబు, ఇతర ముఖ్య నిందితులు కోర్టుకు వరకు వెళ్లకుండా చూడవచ్చో అన్నదానిపైనే అధికారులు గురిపెడతారు. ఈ కేసుల రికార్డులను తారుమారు చేయవచ్చని పొన్నవోలు అన్నారు. ఆయన ఎంత వాపోయినా అది వృథా ప్రయాసగానే మిగిలిపోవచ్చు.
దేశ వ్యాప్తంగా ఇలాంటి కేసుల విషయంలో ఒక నిర్దిష్ట విధానం రూపొందించుకోకపోతే , అసలు స్కాములు జరిగినట్లా? కాదా? అన్నదానిపై ప్రజలకు స్పష్టత రాకుండా పోతుంది. అధికారంలో ఉంటే ఎలాంటి కేసు నుంచైనా తప్పించుకోవచ్చన్న భావన మరింతగా ప్రబలుతుంది.ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా? కాదా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,
రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment