మళ్లీ తెరపైకి చంద్రబాబు మాజీ పీఎస్
స్కిల్ స్కామ్‌లో కీలక పాత్రధారి.. నిధుల తరలింపులో సూత్రధారి
సీఐడీ నోటీసులతో అమెరికాకు పరారీ
ప్రణాళిక శాఖ మెమో బేఖాతరు.. సస్పెండ్ చేసిన ప్రభుత్వం
చంద్రబాబు సీఎం కాగానే అజ్ఞాతవాసానికి ముగింపు
తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని వినతిపత్రం సమర్పణ
సాక్షి, అమరావతి: గతంలో టీడీపీ ప్రభుత్వంలో ‘స్కిల్’ కుంభకోణంలో కీలక పాత్ర పోషించి, సీఐడీ నోటీసులివ్వడంతో విదేశాలకు పరారైన పెండ్యాల శ్రీనివాస్ మళ్లీ తెరపైకి వచ్చారు. వందల కోట్ల నిధులను దారి మళ్లించిన ఈ ‘స్కిల్’ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నిధుల తరలింపులో పెండ్యాల శ్రీనివాస్ కీలక సూత్రధారి అని సీఐడీ తేల్చింది. దీంతో ఆయన అమెరికాకు వెళ్లిపోయారు.
ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న ఆయన వెంటనే విధులకు హాజరుకావాలని జారీ చేసిన మెమోను కూడా బేఖాతరు చేయంతో ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో శ్రీనివాస్ అమెరికాలో అజ్ఞాతవాసాన్ని ముగించుకుని సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేసి, పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను కోరారు.
నల్లమూటలు బాబు బంగ్లాకు చేర్చించి పెండ్యాలే
2014 – 19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో పలు కుంభకోణాల్లో పెండ్యాల శ్రీనివాస్ కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అప్పట్లో సీఎం చంద్రబాబుకు పీఎస్‌గా వ్యవహరించిన ఆయనకు కేంద్ర ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడంతో డొంకంతా కదిలింది. అమరావతిలో రూ.3 వేల కోట్లతో తాత్కాలిక సచివాలయాల నిర్మాణ కాంట్రాక్టుల కుంభకోణంతోపాటు ఇతర అక్రమాల్లో ఆయన పాత్రధారిగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. కాగా కేంద్ర జీఎస్టీ విభాగం సమాచారంతో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో చంద్రబాబు అవినీతి బాగోతం బయటపడింది. దీనిపై సీఐడీ దర్యాప్తు చేయడంతో మొత్తం అవినీతి దందా బట్టబయలైంది.
నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులను షెల్ కంపెనీల ద్వారా తరలించినట్టు వెల్లడైంది. ఆ నిధులను పెండ్యాల శ్రీనివాస్‌తోపాటు షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసాని హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేర్చినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. కీలక ఆధారలు లభించడంతో సీఐడీ అధికారులు పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసానిలకు గత ఏడాది సెప్టెంబరు 5న నోటీసులు జారీ చేశారు. వారిని ఈ కేసులో సాక్షులగా పేర్కొంటూ గత ఏడాది సెప్టెంబరు 14న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
పెండ్యాల శ్రీనివాస్‌కు ఉన్న రెండు ఈ మెయిల్ ఐడీలకు మెయిల్‌చేయడంతోపాటు హైదరాబాద్‌లోని ఆయన చిరునామాకు స్పీడ్‌పోస్ట్ ద్వారా నోటీసులు పంపారు. నోటీసులు అందినట్లు ఆయన కుమార్తె సీఐడీ అధికారులకు తెలిపారు. నోటీసులు జారీ కాగానే పెండ్యాల శ్రీనివాస్ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే అమెరికాకు పరారయ్యారు. తనకు హఠాత్తుగా ఆరోగ్యం దెబ్బతినడంతో అమెరికా వెళ్తున్నట్టు ఆయన ప్రణాళిక శాఖకు ఓ మెయిల్ ద్వారా తెలిపి వెళ్లిపోయారు.
మెమో జారీ చేసినా బేఖాతరు.. సస్పెన్షన్
పెండ్యాల శ్రీనివాస్ అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లిపోవడాన్ని ప్రణాళిక శాఖ తీవ్రంగా పరిగణించింది. ఆయన సెలవు దరఖాస్తును తిరస్కరించి, మెమో జారీచేసింది. అధికారులు హైదరాబాద్‌లోని పెండ్యాల శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రికి మెమో కాపీని అందించారు. మెమో అందుకున్నప్పటి నుంచి వారం రోజుల్లో ఆఫీసుకు వచ్చి సంజాయిషీ ఇవ్వాలని పెండ్యాల శ్రీనివాసరావును ప్రణాళిక శాఖ ఆదేశించింది. ఆ మెమోను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో ప్రభుత్వ సర్వీసు నిబంధనలను అనుసరించి పెండ్యాల శ్రీనివాస్‌ను ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 30న సస్పెండ్ చేసింది.
బాబు రాగానే మళ్లీ ప్రత్యక్షం
కాగా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పెండ్యాల శ్రీనివాస్ రాష్ట్రానికి తిరిగి వచ్చారు. బుధవారం నేరుగా సచివాలయానికి వచ్చి తనపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించి, పోస్టింగ్ ఇవ్వాలని ప్రణాళిక శాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు. ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే సాగుతోందన్నది సుస్పష్టమవుతోంది. ఎందుకంటే స్కిల్ కుంభకోణం కేసులోనే చంద్రబాబు అరెస్ట్ అయి 52 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఆ కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న పెండ్యాల శ్రీనివాస్‌ను సీఐడీ సాక్షిగా పేర్కొంది. దాంతో ఆ కేసు దర్యాప్తును పూర్తిగా పక్కదారి పట్టించేందుకు పెండ్యాల శ్రీనివాస్‌ను కూడా ఒక సాధనంగా వాడుకోవాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా స్పష్టమవుతోంది. స్కిల్ కుంభకోణం కేసును నీరుగార్చే దిశగా చంద్రబాబు పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే పెండ్యాల శ్రీనివాస్ తిరిగి వచ్చారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment