
ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. అందరూ అర్థం చేసుకోండి
నీతి ఆయోగ్ నివేదికపై ప్రజెంటేషన్‌లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
ఎలాగైనా బాబు చేస్తారని నమ్మి ఓట్లు వేశాం కదా..! అనే ఫీలింగ్‌లోకి జనం వెళ్తున్నారు
అందుకే వాస్తవాలను వెల్లడించి వారికి అవగాహన కల్పిస్తున్నా ..
ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు తొమ్మిదేళ్లు పడుతుందో.. పదేళ్లు పడుతుందో..
సంపద సృష్టించి.. వృద్ధి రేటు 15 శాతానికి పెరిగితేనే సూపర్ సిక్స్ హామీల అమలు
గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ హామీల ఎగవేతకు పక్కా ప్రణాళికతో బాబు అడుగులు
తల్లికి వందనంపై ఇక తర్జన భర్జన లేదు..
46 లక్షల మంది తల్లులకు షాక్!
అన్నదాతా సుఖీభవపై ఆలోచనే అనవసరం..
54 లక్షల మంది రైతన్నల్లో నిర్వేదం!
ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేల సాయం గల్లంతే..
1.80 కోట్ల మంది అక్క చెల్లెమ్మల ఆక్రందన!
నిరుద్యోగ భృతి నీటి పాలేనని కోటి మంది యువతలో తీవ్ర ఆందోళన!
సూపర్ సిక్స్‌లు.. సెవెన్లు ఇక గాలిలో కలిసినట్లే!
ఎందుకంటే.. సూపర్ సిక్స్‌లు కావాలంటే ఏపీ వృద్ధి రేటు 15 శాతానికి పెరగాలి!
అందుకే.. విజన్ 2047 డాక్యుమెంట్లను ఇంట్లో భద్రంగా దాచుకోమని
తనను నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు పరోక్షంగా చెప్పేశారు!
ప్రెస్ మీట్ సాక్షిగా వారిలో ఏ మూలో దాగిన ఆశలను పటాపంచలు చేశారు!!
సాక్షి, అమరావతి: ఇందుమూలంగా ఐదున్నర కోట్ల మంది ప్రజానీకానికి తెలియచేయునది ఏమనగా.. సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామంటూ ఎన్నికల వాగ్దానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులెత్తేశారు! తన మార్కు రాజకీయాన్ని ప్రజలకు మరోసారి రుచి చూపించారు. మోకాలికి బోడి గుండుకు ముడిపెడుతూ.. సూపర్ సిక్స్ హామీలకు, వృద్ధి రేటుకు లంకె పెట్టారు! కేంద్రం ఇస్తున్న డబ్బులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి.. సంపద సృష్టించి.. ఆదాయం పెరిగితే.. అప్పుడు రైతు భరోసా, తల్లికి వందనం అమలు చేస్తామని వెల్లడించారు.
గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాటన పెట్టేందుకు తొమ్మిదేళ్లు పడుతుందో పదేళ్లు పడుతుందో అంతుబట్టడం లేదంటూ కాడి పారేశారు. సూపర్ సిక్స్‌లు.. సెవెన్లు అంటూ ఎన్నికల హామీలతో ఊరించి ఏడు నెలల పాటు దాగుడు మూతలతో నెట్టుకొచ్చిన సీఎం చంద్రబాబు ఎట్టకేలకు ముసుగు తొలగించారు! వాస్తవ పరిస్థితిని చెప్పి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నానంటూ తన మనసులో ఎప్పుడో ఆవిష్కృతమైన వాటిని కుండబద్ధలు కొట్టారు. రాష్ట్రాల ఆర్ధిక ఆరోగ్య సూచికలపై నీతి ఆయోగ్ నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు.
అబ్బే... ఇప్పుడు చేయలేం...!
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) ఏటా 15 శాతం మేర పెరిగి తద్వారా ఆదాయం, సంపద సమకూరిన తరువాతే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాబడి తగ్గుతోందని.. ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల అమలుకు వెసులుబాటు లేదని, అవకాశం ఉంటే ఒక్క నిమిషం కూడా జాప్యం చేయనని చెప్పారు.
వృద్ధి రేటు పెరిగి సంపద, ఆదాయం పెరిగితేనే వెసులుబాటు వస్తుందని, అప్పటి వరకు సూపర్ సిక్స్ అమలులో జాప్యం తప్పదని సీఎం స్పష్టం చేశారు. వీటితో మాకేం సంబంధం? బాబు చేస్తారని ఓటు వేశామని, హామీలు అమలు చేయాలనే విధంగా సామాన్య ప్రజలు ఆలోచన చేస్తున్నారని, అందుకే వాస్తవ పరిస్థితిని చెప్పి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నానని వెల్లడించారు.
నమ్మి ఓట్లు వేశాం కదా..!
ఇంకా హామీలను అమలు చేయడం లేదని కొంత మంది ఆలోచన చేస్తున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. డబ్బులున్నాయి కదా..! ఎందుకు అమలు చేయడం లేదు? నమ్మి ఓట్లు వేశాం కదా..! అనే ఫీలింగ్‌లోకి ప్రజలు వెళ్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరానికి రూ.12,150 కోట్లు రాగా, అమరావతికి రూ.15,000 కోట్లు వచ్చాయని, విశాఖ ఉక్కు రివైవ్ (పునరుద్ధరణ)కు రూ.11,114 కోట్లు ఇచ్చిందని, అయితే వాటిని సంక్షేమానికి వ్యయం చేయలేనని చంద్రబాబు పేర్కొన్నారు.
తొమ్మిదేళ్లు పడుతుందో.. పదేళ్లు పడుతుందో..!
గాడి తప్పిన ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నానని, ఇందుకు తొమ్మిదేళ్లు పడుతుందో పదేళ్లు పడుతుందో తెలియడం లేదని, సూపర్ సిక్స్ హామీల అమలుకు లేట్ అవుతుందని చంద్రబాబు చెప్పారు. విశ్వ ప్రయత్నం చేసినా ఇంకా పూర్తిగా కంట్రోల్‌లోకి రాలేదన్నారు. ఆర్ధికంగా వెసులుబాటు వచ్చిన తరువాత సంపద సృష్టించడం ద్వారా ఆదాయం పెంచిన అనంతరం సంక్షేమ పథకాలను అమలు చేస్తానన్నారు. అందుకే ప్రజలకు వాస్తవాలు చెబుతూ అవగాహన కల్పిస్తున్నామన్నారు.
గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసింది..
గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని, మూలధన వ్యయం తక్కువ చేసిందని, దీంతో వృద్ధి తగ్గిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా వృద్ధి రేటు తగ్గిపోయి అప్పులు పెరిగాయన్నారు. రెవెన్యూ మాత్రం పెరగలేదన్నారు. తద్వారా ఏడాదికి రూ.76 వేల కోట్లు నష్టపోతున్నట్లు చెప్పారు. అభివృద్ధిపై డబ్బులు వ్యయం చేయడం ద్వారా 15 శాతం వృద్ధి సాధించే ప్రయత్నం చేస్తున్నానని, తద్వారా సంపద వస్తుందని, దాన్ని సంక్షేమానికి వెచ్చిస్తానని తెలిపారు.
శ్రీలంకలా రాష్ట్రం..
ప్రజల కోరికలు తీర్చాలంటే రెవెన్యూ రాబడి పెరగాల్సి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థతో పాటు మిగతా వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నానని, అయితే ఇందుకు ఇంకా సమయం పడుతుందన్నారు. రాష్ట్రం శ్రీలంకలా అవుతోందని గతంలోనే చెప్పానని, ఇప్పుడు నీతి ఆయోగ్ కూడా రాష్ట్ర ఆరోగ్య సూచికల్లో అదే చెప్పిందన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి జల్సాలు చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అప్పులు తీర్చే స్థోమత కూడా లేకుండా చేసిందన్నారు. కచ్చితంగా వ్యయం చేయాల్సిన వేతనాలు, పెన్షన్లు, వడ్డీల చెల్లింపు, పరిపాలన వ్యయం గత ప్రభుత్వంలో 64.6 శాతానికి పెరిగిందన్నారు. మరో పక్క మూలధన వ్యయం తగ్గిపోయిందన్నారు.
టీడీపీ మేనిఫెస్టోలో ఇతర హామీలివీ...
⇒ పూర్ టు రిచ్.. పీ–4 పథకాలు అంటూ ఇంతవరకు ఏ ఒక్కటీ ప్రకటించలేదు
⇒ ఏటా జాబ్ క్యాలెండర్ జాడే లేదు
⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను హామీ మేనిఫెస్టోకే పరిమితం.
⇒ రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ అమలు చేయలేదు
⇒ ఉద్యోగుల సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పి కనీసం చర్చ కూడా జరపలేదు
⇒ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐఆర్, డీఏ ప్రకటిస్తామనే హామీని విస్మరించారు
⇒ వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచకపోగా ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పాడారు
⇒ కాపుల సంక్షేమ కోసం ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని బడ్జెట్‌లో అందుకు తగ్గట్టు నిధులు ఇవ్వలేదు
⇒ విద్యుత్ బిల్లుల భారం తగ్గించకపోగా ఆర్నెల్లలోనే రూ.15 వేల కోట్లకుపైగా చార్జీల భారం మోపారు.
⇒ ఉచితంగా ఇసుక అంటూ పచ్చముఠాల దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment