
బయట నుంచి చూస్తే చేయగలను అనిపించింది
అందుకే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చా
ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది
9.74 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. వాటికి వడ్డీలు కట్టాలి
అప్పు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వలేం
టీడీపీ 43వ ఆవిర్భావ వేడుక సభలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ‘ఎన్నికలకు ముందు బయట నుంచి చూస్తే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయగలనని అనిపించింది. అందుకే ప్రజలకు ఆ హామీలు ఇచ్చా.అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత వాటిని కొనసాగించలేం’ ఇవీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సభలో పలికిన మాటలు.
రాష్ట్రంలో అప్పులు రూ. 9.74 లక్షల కోట్లు..
ప్రస్తుతం రూ.9.74 లక్షల కోట్ల అప్పులున్నాయని, వాటికి వడ్డీలు, అసలు కట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి ఉందని చెప్పారు. రాజకీయ కక్షలకు పార్టీ దూరమని, అదే సమయంలో చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తామని హెచ్చరించారు. పార్టీకి కార్యకర్తలే ముందని, నాయకులు తర్వాతని చెప్పారు.
ఏప్రిల్, మేలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ..
ఏప్రిల్, మే నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఉగాది పండుగ రోజున పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ 4 కు శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు.
