
సింహాచలం అప్పన్న ఆలయంలో హాహాకారాలు.. మృత్యు ఘోష.. ఎవరికైనా బాధనిపిస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మాత్రం అవేమీ పట్టినట్లు లేదు. కూటమి నేతలందరూ అమరావతి సంబరంలో మునిగి తేలుతున్నారు. పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇంకోసారి శంకుస్థాపన చేయిస్తున్నారు.
సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలి అయింది సామాన్యులే.. అమరావతి హంగామాతో తీవ్రంగా నష్టపోతున్నదీ పేదలే. హిందూ మతంలో ఒక నమ్మకం ఉంటుంది. ఏదైనా ఒక కుటుంబంలో అశుభం జరిగితే నిర్దిష్టంగా కొన్నాళ్లపాటు ఎలాంటి శుభ కార్యక్రమాలు జరపరు. హిందూ మతోద్దారకులమని ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సనాతన హిందూ అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. శంకుస్థాపన కార్యక్రమాలను వాయిదా వేసుకోలేదు. పాలకులు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కుటుంబంలా పరిగణిస్తారు. ఆ ప్రకారం చూస్తే ఒక ప్రముఖ ఆలయంలో జరిగిన ఈ దుర్ఘటనలో కొత్తగా కట్టిన గోడ కూలి ఏడుగురు మరణించినా తమ ప్రోగ్రాం ఆపుకోవడానికి ఇష్టపడలేదు. సింహాచలం మృతుల కుటుంబాలను పరామర్శించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు వెళ్లలేదు.అంటే వారికి ఏదో అనుమానం ఉండబట్టే అటువైపు వెళ్లకుండా ఉన్నట్లు అనిపిస్తుంది.
మామూలుగా అయితే ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు సంభవిస్తే వెంటనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు అంతా వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించి బాధితులకు స్వాంతన చేకూర్చడానికి యత్నిస్తారు. కాని వీరిద్దరూ ఆ పని చేయలేదు. కొద్ది నెలల క్రితం వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల కోసం తిరుపతి వెళ్లిన వేలాది భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఆ తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆ సమాచారం వచ్చిన వెంటనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పోటీ పడి తిరుపతి వెళ్లారు.
ఏదో చేస్తున్నట్లు హడావుడి చేశారు. అలాంటి వారు సింహాచలం ఎందుకు వెళ్లలేదు? ప్రధాని మోడీ అమరావతి వస్తున్నందున వెళ్లలేక పోయారని చెప్పవచ్చు కానీ మూడు గంటల ఖాళీ కూడా లేదనడం అతిశయోక్తి అవుతుంది. పైగా ఇప్పుడు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ నుంచైనా పర్యవేక్షణ చేయవచ్చు. పవన్ కళ్యాణ్ కు ఆ ఇబ్బంది లేదు కదా?మరి ఆయన ఎందుకు సింహాచలం వెళ్లలేదు? దీనికి రెండు,మూడు కారణాలు చెబుతున్నారు. అక్కడకు వెళ్లితే భక్తులలో ఉన్న కోపం అంతా తమపై చూపే అవకాశం ఉందని, వారు ప్రభుత్వ నిర్వాకంపై నిలదీస్తే ఇబ్బంది అవుతుందని అనుకుని ఉండవచ్చ అంటున్నారు. అమరావతి పునః శంకుస్థాపన పనుల పేరుతో తప్పించుకునే అవకాశం ఉండడం. మరొకటి చావుల వద్దకు వెళ్లి రావడం అశుభం అని ఎవరైనా సలహా ఇచ్చారేమో తెలియదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నిజంగానే హిందూ మతాచారాలపై అంత శ్రద్దగా ఉంటారా అంటే అదీ గ్యారంటీ లేదు. ఏ మతం వారివద్దకు వెళ్లితే ఆ మతమే గొప్పదని చెప్పి వస్తుంటారు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటారు.
గత గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు కుటుంబం స్నానమాచరించే ఘట్టాన్ని సినిమా తీయడం కోసం సామాన్య భక్తులను నిలిపి వేయడం, ఒక్కసారిగా గేటు తెరవడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో యత్నాలు చేశారు. చివరికి రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలో చనిపోలేదా? అంటూ వితండ వాదం చేశారు. అంతే తప్ప అంత పెద్ద ఘటన జరిగితే మామూలుగా అయితే పదవి నుంచి తప్పుకుంటారు. ప్రాంతీయ పార్టీ కనుక ఆయనను పార్టీలో ఎవరూ ప్రశ్నించరు కనుక ఆ ప్రస్తావనే ఉండదు. పోనీ కనీసం ఒక కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోకపోవడం విశేషం. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిన తర్వాత పవన్ కళ్యాణ్ క్షమాపణల డ్రామా తెలిసిన సంగతే.
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు ఏమి మాట్లాడింది అందరికి తెలుసు. అక్కడ చైర్మన్ లేదా, అధికారులపై చర్య తీసుకోలేదు. వారిని పదవుల నుంచి తప్పించలేదు. నిజంగా హిందూ మత విశ్వాసాలు నమ్మేవారైతే అలా చేస్తారా? అన్న విమర్శలను పలువురు చేశారు. చివరికి ఒక రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. గోదావరి పుష్కరాల మరణాలపై వేసిన కమిషన్ ఏ తరహా రిపోర్టు ఇచ్చిందో, తిరుపతి ఘటనపై కూడా రిపోర్టు అందుకు భిన్నంగా వస్తుందా అన్నది కొందరి సందేహం. పుష్కరాల తొక్కిసలాటలో తప్పు భక్తులదే అని ఆ కమిషన్ తేల్చింది. ఇప్పుడు సింహాచలం ఘటనపై కూడా విచారణ కమిటీని నియమించినా, ఎంతవరకు ప్రయోజనం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. గోడ కూలడానికి నాణ్యత లోపమని కాకుండా, భక్తుల రద్దీ, తోపులాట అని నివేదికలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆలయాలలో ఏ చిన్న ఘటన జరిగినా, దాని వెనుక టీడీపీ, జనసేన రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నా, దానినంతటిని జగన్ కు ఆపాదించి ఎంత రచ్చ చేసేవారో గుర్తు చేసుకుంటేనే కంపరం కలుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం అదే ధోరణి ప్రదర్శించారు. తిరుమల లడ్డూ లో జంతు కొవ్వు కలిసిదంటూ దారుణమైన అసత్యాన్ని చంద్రబాబు, పవన్ లు ప్రజలకు చెప్పారు. దీనివల్ల కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, దైవానికి అపచారం చేసినట్లు అవుతుందని వారు ఫీల్ కాలేదు. తమ రాజకీయ ప్రయోజనం కోసం ఎంతకైనా దిగజారతామన్నట్లుగా వారు వ్యవహరించారు. ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి తాను అన్ అప్పాలజిటిక్ సనాతన హిందూ అని ప్రకటించుకుని కొత్త వేషం కట్టారు.
అసలు సనాతన హిందూయిజం ఏమి చెబుతుందో తెలియకుండానే, తానేదో వేద శాస్త్రాలు అన్నిటిని పుక్కిట పట్టినట్లుగా మాట్లాడారు. విశేషం ఏమిటంటే ఆయన భార్య విదేశీయురాలు. క్రైస్తవ మతానికి చెందిన వారు.అలాగే పవన్ కు పుట్టిన వారు సైతం క్రైస్తవమే తీసుకున్నారు. మరి అక్కడ ఈయన సనాతనమేమైందో తెలియదు. అనవసరంగా సినిమా డైలాగులు చదివితే ఇలాంటి అప్రతిష్టే వస్తుంది. చంద్రబాబు తన రాజకీయం కోసం ఏ మతాన్ని అయినా వాడుకోగలరు.ఆయన తెలివితేటలు వేరు.ఆయనను మించి ఏదో చేసి బీజేపీ వారి మెప్పు పొందాలని పవన్ చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల ఆయన పరువు పోగొట్టుకుంటున్నారు. పోనీ నిజంగానే అంత సనాతన హిందూ అయితే సింహాచలం ఎందుకు వెళ్లలేదు.ఒక సంతాప సందేశం ఇచ్చి వదలివేశారే.
అమరావతి కార్యక్రమ ఆహ్వానంలో తన పేరు వేయలేదని మొదట అలిగారని, దాంతో ప్రభుత్వం మరో కార్డు వేసిందని చెబుతున్నారు. తన డిమాండ్ నెరవేరకపోతే ఏమైనా సింహాచలం వెళ్లేవారేమో. తిరుమల గోవుల మరణాలు, కాశీనాయన క్షేత్రంలో భవనాల కూల్చివేత, తిరుమల, బ్రహ్మం గారి మఠం తదితర ఆధ్యాత్మిక కేంద్రాలలో మత్తు పదార్ధాల వాడకం వంటి ఆరోపణలు వస్తున్నా ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేక పోతోందన్న విమర్శలు వస్తున్నాయి. సింహాచలంలో చందనోత్సవానికి ఐదుగురు మంత్రుల కమిటీ కూడా ఉందట. వారంతా ఏమి చేశారో తెలియదు. కాని గోడ కూలి ఏడుగురు మరణించారు. చిన్న ఆలయ గోడ నిర్మాణమే చేయలేని వారు రాజధాని నిర్మాణం చేస్తారట అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి.
అదే టైమ్ లో జగన్ విజయవాడ వద్ద కృష్ణానదికి కట్టిన రిటైనింగ్ వాల్ ఏ రకంగా స్ట్రాంగ్ గా ఉందీ వివరిస్తూ కూడా వీడియోలు వచ్చాయి. సింహాచలం ఘటన తర్వాత జగన్ వెంటనే అక్కడకు వెళ్లి మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చివచ్చారు. చంద్రబాబు, పవన్ లు మాత్రం సాకులు వెతుక్కుంటూ కూర్చున్నారు. ఎల్లో మీడియా మాత్రం సింహాచలం ప్రమాదాన్ని తగ్గించి చూపడానికి నానా పాట్లు పడింది. ఏది ఏమైనా మత సెంటిమెంటును రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదు.అది ఎప్పటికైనా వారికే తగులుతుంది.ఈ నేపథ్యంలో పాలకులు చేసే పాపాలు తమకు శాపాలుగా మారుతున్నాయని ప్రజలు సెంటిమెంట్ గా భావించే పరిస్థితి ఏర్పడింది.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.