చంద్రబాబే బాధ్యుడు: వైఎస్‌ జగన్‌ | YS Jagan anger over Simhachalam incident | Sakshi
Sakshi News home page

చంద్రబాబే బాధ్యుడు: వైఎస్‌ జగన్‌

Published Thu, May 1 2025 4:47 AM | Last Updated on Thu, May 1 2025 5:02 AM

YS Jagan anger over Simhachalam incident

సింహాచలం ఘటనపై వైఎస్‌ జగన్‌ మండిపాటు

ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు?

కాంక్రీట్‌తో కట్టాల్సిన గోడను ఫ్లైయాష్‌ ఇటుకలతో నిర్మిస్తారా? 

అదీ నాణ్యత లేకుండా నాలుగు రోజుల్లో కట్టేశారు 

పిల్లర్‌ లేకుండా పది అడుగుల ఎత్తు.. 70 అడుగుల పొడవున నిర్మాణం 

ఏటా చందనోత్సవం రోజు వర్షం వస్తుందని తెలిసినా నిర్లక్ష్యం 

రెండు రోజుల క్రితం కట్టిన గోడ పక్కనే క్యూలైన్‌.. అది కూలి ఏడుగురు మృతి

కేవలం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలు బలి

వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతిలో ఆరుగురిని పొట్టనపెట్టుకున్నదీ బాబు నిర్లక్ష్యమే 

రాజకీయాల కోసం తిరుమల ప్రసాదంపై దుష్ప్రచారం 

గోశాలలో గోవులు మృత్యువాత.. శ్రీకూర్మంలో తాబేళ్ల మృతి 

గతంలో గోదావరి పుష్కరాల్లో అయితే ఏకంగా 29 మంది మృతి 

గుడులు, గోపురాల మీద ఆయన చూపుతున్న అశ్రద్ధకు ఇవన్నీ నిదర్శనం 

ఇన్ని ఘోరాలు జరిగినా చర్యలుండవు.. ఎందుకంటే బాబే దోషి కనుక 

పైగా తప్పును ఎదుటి వారి పైకి తోస్తూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ 

మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి 

లేదంటే రేపు మన ప్రభుత్వం వచ్చాక మిగిలిన బ్యాలెన్స్‌ ఇస్తాం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సింహాచలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. దాదాపు ఏడాది కాలంగా గుడులు, గోపురాల్లో జరుగుతున్న ఘటనలన్నింటిలో చంద్రబాబే అసలు దోషి అని మండిపడ్డారు. వైకుంఠ ఏకాదశి, చందనోత్సవం ఎప్పుడు జరుగుతాయో ముందే తెలిసినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ధ్వజమెత్తారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు, ఇప్పుడు ఇక్కడ చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు చనిపోవడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కళ్లకు కడుతోందని చెప్పారు. 

సింహాచలం ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. మొత్తం ఏడుగురు చనిపోగా, ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. మృతులు పిల్లా ఉమామహేశ్వరరావు, పిల్లా శైలజ కుటుంబ సభ్యులను చంద్రంపాలెం వద్ద ఆయన పరామర్శించారు. 

అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింహాచలంలో చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో.. ఎంత మంది భక్తులు వస్తారో తెలిసినా కనీస ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ముఖ్యమైన గోడను ముందే ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. 70 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తున గోడను నాలుగు రోజుల్లో నిర్మాణం పూర్తి చేశారని, ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ధ్వజమెత్తారు. గాలికి ఫ్లెక్సీ ఊగినట్లు ఈ గోడ కూలిపోయే ముందు ఊగిందని భక్తులు చెబుతున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం అవుతోందన్నారు. 

‘ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? మంత్రుల పర్యవేక్షణ ఏమైంది? ఐదుగురు సభ్యుల కమిటీ ఏం చేసింది? టెండర్లు పిలవకుండానే ఇంత పెద్ద గోడ ఎలా నిర్మించారు? కాంక్రీట్‌ గోడ (రీ ఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ వాల్‌) కట్టాల్సిన చోట ఫ్లైయాష్‌ ఇటుకలతో నిర్మించారు. ఎక్కడా కాలమ్స్‌ లేవు. ఏ మాత్రం నాణ్యత పాటించ లేదు. ఇలాగైతే ఆ గోడ ఎలా నిలబడుతుంది? రెండు రోజుల క్రితం పూర్తయిన ఈ గోడ పక్కనే అంత మంది భక్తులను ఎలా నిలబెట్టారు? ఫలితంగా ఆ గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం దారుణం’ అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

బాబు పాలనలో అన్నీ దారుణాలే.. 
చంద్రబాబు పాలన ప్రారంభమైనప్పటి నుంచి అన్నీ దారుణాలే జరుగుతున్నాయి. రాజకీయాల కోసం తిరుమల శ్రీవారి ప్రసాదంపై దు్రష్పచారం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలం కావడం వల్లే తిరుపతి­లో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయారు. భద్రతా సిబ్బందిని చంద్రబాబు పర్యటనకు కుప్పం పంపారు. అదే సమయంలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వచి్చన భక్తులందరినీ ఓ పార్కులోకి పంపారు. వారందరినీ ఒక్కసారిగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగింది. గోశా­లలో ఆవులు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డాయి. 

వైఎస్సార్‌ జిల్లా కాశినాయన క్షేత్రాన్ని కలెక్టర్‌ సమక్షంలోనే బుల్డోజర్లతో కూల్చి వేశారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. చంద్రబాబు గత పాలనలో గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన ప్రచార ఆర్భాటం కోసం భక్తులను గుంపుగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చంద్రబాబు వస్తారు.. ఎంక్వైరీ వేస్తున్నామంటారు. తీరా ఎలాంటి చర్యలూ ఉండవు. ఎందుకంటే ఆయా ఘటనలన్నింటికీ చంద్రబాబే బాధ్యుడు కాబట్టి. 

తిరుపతి క్యూలైన్లలో తొక్కిసలాట ఘటనలో తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యలు తీసుకున్నారు. పైగా వాటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందుకు సంబంధించిన ఏ అధికారికైనా ఉద్యోగాలు పోతాయి.. యూనిఫాం పోతుందని ఒంట్లో భయం ఉండాలి. అప్పుడే క్రమశిక్షణ ఉంటుంది. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం ఆగిపోతుంది. 

పశ్చాత్తాపం ఉండాలి
» ఈ ఫొటో చూడండి.. ఎక్కడైనా కాల­మ్స్‌ కనిపిస్తున్నాయా చెప్పండి? 10 అడుగుల ఎత్తు.. 70 అడుగుల పొడవున్న గోడ కూలిపోయేటప్పుడు ఫ్లెక్సీ మాదిరిగా ఊగిందని చెబుతున్నారు. ఏం నిర్మాణం చేశారు? ఏ రకంగా పని చేయిస్తున్నారు? జగన్‌ ఇచ్చే లోపే ఆ కుటుంబాలకు రూ.కోటి ఇచ్చి ఆదు­కోవాలని కోరుతున్నా. బాధ్యులపై, బాధ్య­త తీసుకున్న మంత్రులపై, ఆల­యాన్ని నడిపే బాధ్యతలో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పు­డే ఇటువంటివి పునరావృతం కావు.
»    ప్రతీదీ డైవర్షన్‌ పాలిటిక్సే.. ఎక్కడా కూడా తప్పు చేశామన్న పశ్చాత్తాపం వీళ్లలో కనిపించడం లేదు. చంద్రబాబులో అది ఎక్కడా కనిపించదు. నేను ఇక్కడకు వ­స్తున్నానని తెలుసుకుని మృతుల కుటుంబాలకు రూ.­25 లక్షల చొప్పున పరిహారం, ఒక ఉద్యోగం ప్రకటించారు. ప్రభుత్వం అనేది ప్రజలకు భరోసా ఇచ్చేలా ఉండాలి. ప్రజలకు తోడు­గా ఉండాలి.
»    ఏదైనా ప్రమా­దం జరిగి ప్రజలు చనిపోతే.. ప్రభుత్వంలో ఉన్నవారు పశ్చాత్తాపం చె­ందాలి. మనం ఆ కుటు­ంబానికి ఏం చేస్తున్నామనేది మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. మన ప్రభుత్వంలో ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో ఒక్కొ­క్క కుటుంబానికి రూ.కోటి ఇచ్చి ఆదుకున్నాం. ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈ ఘటన జరిగినప్పుడు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తున్నావ్‌ చంద్రబాబూ? నేను ఒకటే చెబుతున్నా.. మీరు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. ఈ కుటుంబాల్ని గుర్తు పెట్టుకు­ంటున్నాను. మేం మళ్లీ అధికారంలోకి వచి్చన తర్వాత రూ.కోటికి మిగిలిన బ్యాలెన్స్‌ నేను ఇప్పిస్తాను.  
»   ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్‌నాథ్, భీమిలి ఇన్‌చార్జ్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మె­ల్సీలు వరుదు కళ్యాణి, తలశిల రఘురాం, జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, మాజీ ఎంపీ బొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్  కుమార్‌ పాల్గొన్నారు.

ఈ గోడ ఎవరు కట్టారో తెలియదట! 
ప్రతి చోటా నిర్లక్ష్యమే. ప్రతిచోటా డైవర్షన్‌ పాలిటిక్సే. డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఏ స్థాయిలో దిగజారిపోయాయో మంత్రుల ప్రకటనలు చూస్తేనే అర్థమవుతోంది. సింహాచలం ఘటనలో మంత్రులు మొదటగా ఏమన్నారంటే.. ఈ గోడ ఎవరి హయాంలో.. ఎవరు కట్టారో చూడాలని మాట్లాడారు. వారి తీరు చూస్తే.. వేరే వాళ్లపై నెట్టేసేందుకేనని అర్థమవుతోంది. వాళ్ల హయాంలోనే వారం రోజుల క్రితమే గోడ కట్టారని ఎప్పుడైతే తెలుసుకున్నారో.. గోడ పిల్లర్లతో కట్టారో.. సిమెంట్‌తో కట్టారో.. బ్రిక్స్‌తో కట్టారో అనేది మాకు తెలీదని మాట్లాడుతున్నారు.

ఏమీ తెలుసుకోకపోతే.. ముందస్తు ఏర్పాట్ల పేరుతో మంత్రుల కమిటీ పేరుతో ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీ సమక్షంలోనే ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ గోడ ఎందుకు కట్టారు? 70 అడుగుల పొడవు.. 10 అడుగుల ఎత్తుతో ఒక్క కాంక్రీట్‌ పిల్లర్‌ కూడా లేకుండా గోడ ఎందుకు కట్టించారు? చందనోత్సవం జరిగిన ప్రతిసారీ వర్షం పడింది. కొత్త గోడ అని తెలిసి.. వర్షం పడుతుందని తెలిసినప్పుడు ఈ గోడ పక్కన ఎందుకు భక్తుల్ని ఉంచారు?

అండగా ఉంటాం..
మృతుల కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ భరోసా 
రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని హామీ
మధురవాడ (విశాఖ): చందనోత్సవంలో గోడ కూలి మృతి చెందిన ఉమా మహేశ్వరరావు, శైలజ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం మధురవాడ చంద్రంపాలెం ఎన్‌జీవోస్‌ కాలనీ శ్మశాన వాటిక వద్ద పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైఎస్‌ జగన్‌ను చూసి మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన బాధితులతో మాట్లాడారు. వారు ఎన్ని గంటలకు దేవస్థానానికి వెళ్లారు.. ప్రమాదం ఎలా జరిగింది.. పిల్లలు ఎంత మంది.. పరిహారం ఎంత ఇస్తున్నారు.. తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తాము రూ.కోటి అడిగామని, రూ.25 లక్షలు, ఉద్యోగం ఇస్తామని మంత్రులు చెప్పారన్నారు. అది ప్రభుత్వ ఉద్యోగమా.. ప్రైవేటు ఉద్యోగమా అని అడగ్గా.. ప్రభుత్వ ఉద్యోగమేనని చెప్పారు. తమ కుటుంబాన్ని అన్ని విధాలుగా పోషించే వ్యక్తి చని పోయాడని, మూడేళ్ల క్రితం అల్లుడు కూడా చనిపోయాడని, చెల్లి పిల్లలను కూడా తమ కొడుకే సాకుతున్నాడని ఇప్పుడు అతడు కూడా చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు అప్పలనాయుడు, శాంతి గుండెలవిసేలా రోదిస్తూ చెప్పారు. తాము అండగా ఉంటామని, రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. బాధితుల తరఫున గట్టిగా మాట్లాడతామని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement