బెడిసికొట్టిన టీడీపీ ఫేక్‌ ట్రిక్‌ | False propaganda that Chandrababu was given clean chit in skill scam | Sakshi
Sakshi News home page

బెడిసికొట్టిన టీడీపీ ఫేక్‌ ట్రిక్‌

Published Thu, Oct 17 2024 4:51 AM | Last Updated on Thu, Oct 17 2024 7:10 AM

False propaganda that Chandrababu was given clean chit in skill scam

స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబుకు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం

ఈడీ ప్రకటనను ట్యాంపర్‌ చేసి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌

చంద్రబాబుతోపాటు ఎవరికీ క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదని స్పష్టం చేసిన ఈడీ 

షెల్‌ కంపెనీల ఆస్తులు జప్తు.. కొనసాగనున్న దర్యాప్తు.. 

బోగస్‌ పత్రాలతో ప్రజాధనం కొల్లగొట్టారని వెల్లడి.. ఈడీ వైఖరితో మూగబోయిన ‘పచ్చ’ మీడియా నోళ్లు 

తదుపరి దర్యాప్తు చంద్రబాబు పాత్రపైనే అంటున్న పరిశీలకులు 

బెంబేలెత్తిపోతున్న టీడీపీ పెద్దలు

దీని అర్థమేంటి చంద్రబాబూ..
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్టు కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడిన నిందితులకు చెందిన రూ.23.54 కోట్ల స్థిర, చర ఆస్తులను అటాచ్‌ చేశాం. డిజైన్‌ టెక్‌ కంపెనీ ఎండీ వికాస్‌ వినాయక్‌ ఖన్విల్కర్, భారత్‌లో సీమెన్స్‌ కంపెనీ మాజీ ఎండీ సుమన్‌ బోస్, ముకుల్‌చంద్‌ అగర్వాల్, సురేశ్‌ గోయల్‌ బోగస్‌ ఇన్వాయిస్‌లతో నిధులను షెల్‌ కంపెనీల ద్వారా అక్రమంగా మళ్లించినట్లు మా దర్యాప్తులో వెల్లడైంది. వారి బ్యాంకు ఖాతాలు, షేర్లు, స్థిరాస్తు లను జప్తు చేశాం. గతంలోనే డిజైన్‌టెక్‌కు చెందిన రూ.31.20 కోట్లను జప్తు చేశాం. వికాస్, సుమన్, ముకుల్, సురేశ్‌లను అరెస్టు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోంది.     
– ఈడీ

సాక్షి, అమరావతి: అడ్డంగా దొరికిన ప్రతిసారి తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టడం చంద్రబాబు మార్కు రాజకీయ ఎత్తుగడ అని మరోసారి రుజువైంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిగ్గు తేల్చడంతో మరోసారి ఫేక్‌ ప్రచారం చీప్‌ ట్రిక్‌ను టీడీపీ తెరపైకి తెచ్చింది. 

ఈడీ జారీ చేసిన అధికారిక ప్రకటననే ట్యాంపర్‌ చేస్తూ మరీ చంద్రబాబుకు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడంతోపాటు కొన్ని ఇంగ్లీష్‌ పత్రికల్లో కూడా తప్పుడు సమాచారం ప్రచురితమయ్యేలా చేశారు. తద్వారా అబద్ధపు ప్రచారానికి రెక్కలు తొడిగుతూ తిమ్మినిబమ్మి చేసేందుకు యత్నించారు. అయితే ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టులో ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు ఈడీ స్పష్టం చేయడంతోపాటు, చంద్రబాబుతోపాటు తాము ఎవరికీ క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదని ఈడీ తేల్చి చెప్పడంతో టీడీపీ ఎత్తుగడ బెడిసికొట్టింది. 

బోగస్‌ ఇన్వాయిస్‌లతో ప్రజాధనం కొల్లగొట్టారు 
2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ పేరిట భారీ అవినీతికి పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ ఓ ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. అంతేకాదు అసలు ఆ ప్రాజెక్ట్‌నే చేపట్టలేదని, పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టు బోగస్‌ ఇన్వాయిస్‌లు సమర్పించి నిధులు విడుదల చేసినట్టు గుర్తించామని తెలిపింది. 

ఆ నిధులను సీమెన్స్‌ కంపెనీకి అప్పటి ఎండీ సుమన్‌ బోస్, డిజైన్‌టెక్‌ కంపెనీ ఎండీ వికాస్‌ వినాయక్‌ ఖన్విల్కర్‌.. తమ సన్నిహితులు ముకుల్‌చంద్ర అగర్వాల్‌ (స్కిల్లర్‌ కంపెనీ ప్రతినిధి), సురేశ్‌ గోయల్‌ (చార్టెడ్‌ అకౌంటెంట్‌) ద్వారా అక్రమంగా దారి మళ్లించినట్టు వెల్లడించింది. ఆ నిధులను షెల్‌ కంపెనీల ద్వారా సింగపూర్‌కు తరలించి.. అక్కడి నుంచి తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు తిరిగి వచ్చాయన్న విషయాన్ని గుర్తించామని తెలిపింది. 

ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్‌ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్‌ బోస్, వికాస్‌ ఖన్విల్కర్, ముకుల్‌చంద్ర అగర్వాల్, సురేశ్‌ గోయల్‌లను అరెస్టు చేయడంతోపాటు విశాఖపట్నంలోని పీఎంఎల్‌ఏ న్యాయస్థానంలో చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. 

డిజైన్‌ టెక్‌కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఈడీ గతంలోనే అటాచ్‌ చేసింది. తాజాగా రెండో విడతగా మరో రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను మంగళవారం అటాచ్‌ చేసింది. దాంతో ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్టైంది.

టీడీపీ ఫేక్‌ ట్రిక్‌ ఇదీ..
స్కిల్‌ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు పెంచేసరికి చంద్రబాబు బెంబేలెత్తు­తు­న్నారు.  ఇప్పటికే  ఆయన అవినీతిని సిట్‌ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. దాంతోనే చంద్రబాబును గతేడాది సెపె్టంబర్‌ 9న అరెస్ట్‌ చేసింది. సిట్‌ నివేదికతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో 52 రోజులు రిమాండ్‌ ఖైదీగా ఉండాల్సి వచ్చింది.  

⇒  ప్రస్తుతం ఈడీ కూడా దర్యాప్తు వేగవంతం చేసి స్కిల్‌ స్కామ్‌లో నిధులు కొల్లగొట్టిన తీరును నిరూపిస్తోంది. తాను నిధులు కొల్లగొట్టడంలో పాత్రధారులుగా చేసుకున్న షెల్‌ కంపెనీల ప్రతినిధులు వికాస్‌ ఖన్విల్కర్, సుమన్‌బోస్, ముకుల్‌ చంద్ర అగర్వాల్, సురేశ్‌ గోయల్‌లను ఇప్పటికే అరెస్ట్‌ చేసింది. ఇక రెండో విడతలో వికాస్‌ ఖన్విల్కర్, సుమన్‌ బోస్‌ ఆస్తులను అటాచ్‌ చేసింది. అదీ టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఉన్నప్పటికీ.. ఆ కుట్రలో తన భాగస్వాముల ఆస్తులను అటాచ్‌ చేయడం చంద్రబాబును బేంబేలెత్తిస్తోంది. 



⇒  ఇక ఈడీ తదుపరి చర్యలు తనపైనే  అని ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ తనకు అలవాటైన రీతిలో తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చింది. ఈ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్టు ఓ ఫేక్‌ ప్రకటనను సోషల్‌ మీడియాలో మంగళవారం రాత్రి నుంచి వైరల్‌ చేసింది. ఏకంగా ఈడీ అధికారికంగా ఇచ్చిన ప్రకటనలకు ముందు వెనుకా రెండు వాక్యాలు జోడించడం ద్వారా ట్యాంపర్‌ చేసి ఈ ప్రచారం చేయడం గమనార్హం. ⇒  ఈడీ పేరుతో రూపొందించిన ఆ ఫేక్‌ ప్రకటనను టీడీపీ సోషల్‌ మీడియాలో  ప్రచారంలోకి తెచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. ఏకంగా కొన్ని ఇంగ్లిష్‌ పత్రికల్లోనూ ఆ తప్పుడు సమాచారం ప్రచురితమయ్యేట్టు చేయడం చంద్రబాబు మార్కు మీడియా మేనేజ్మెంట్‌కు నిదర్శనం.

ఎవరికీ క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదన్న ఈడీ 
చంద్రబాబుకు ఈడీ క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్టు టీడీపీ చేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. తాము చంద్రబాబుతోపాటు ఎవరికీ క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదని ఈడీ హైదరాబాద్‌ విభాగం అధికారులు మీడియాకు తేల్చి చెప్పారు. షెల్‌ కంపెనీల ఆస్తులను అటాచ్‌ చేశామన్నారు. ఈ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోందని, ఇంకా పూర్తి కాలేదని కూడా ఈడీ తన అధికారిక ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. దీంతో ఫేక్‌ ట్రిక్‌తో తాము చేసిన తప్పుడు ప్రచార ఎత్తుగడ బెడిసి కొట్టడంతో బుధవారం ఉదయం నుంచి టీడీపీ మౌన ముద్ర దాల్చింది. 

ఇక అసలు విషయం ఏమిటంటే.. గతంలో సీఐడీ సిట్‌ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ప్రాతిపదికగా చేసుకునే ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబును ఏ–1గా సీఐడీ పేర్కొంది. షెల్‌ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించారని ఇప్పటికే నిగ్గు తేల్చింది. స్కిల్‌ స్కామ్‌ కేసులో సిట్‌ న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపించింది. అంటే చంద్రబాబు.. ఏ–1గా ఉన్న ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్‌ ఆధారంగానే ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని స్పష్టమవుతోంది. 

మరో వైపు ఈ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులు అందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని కూడా  ఈడీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. అటువంటిది ఈడీ చంద్రబాబుకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని, టీడీపీ తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరం.  స్కిల్‌ కేసులో ఇప్పటికే పాత్రధారులైన షెల్‌ కంపెనీల ప్రతినిధుల బండారాన్ని బయటపెట్టిన ఈడీ.. ఇక అసలు సూత్రధారి చంద్రబాబు పాత్రను నిగ్గు తేల్చేందుకు ఉద్యుక్తమవుతున్నట్టేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement