జీవీ రెడ్డి ‘ఔట్‌’ | AP Fiber Net Chairman GV Reddy resigns | Sakshi
Sakshi News home page

జీవీ రెడ్డి ‘ఔట్‌’

Published Tue, Feb 25 2025 4:40 AM | Last Updated on Tue, Feb 25 2025 4:40 AM

AP Fiber Net Chairman GV Reddy resigns

ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా 

టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా.. 

ఇటీవల ఏపీ ఫైబర్‌ నెట్‌ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన జీవీ రెడ్డి

సాక్షి, అమరావతి: ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీ­నామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి(GV Reddy) వెల్లడించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని తెలిపారు. న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో తన రాజీనామా లేఖను జీవీ రెడ్డి పోస్ట్‌ చేశారు. 

నాలుగు రోజుల కిందటే తీవ్ర ఆరోపణలు 
నాలుగు రోజుల క్రితం ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌కుమార్‌ రాజద్రోహానికి పాల్పడుతున్నాడంటూ జీవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఫైబర్‌ నెట్‌ సంస్కరణల్లో భాగంగా 410 మంది ఉద్యోగులను తొలగించడంతోపాటు సంస్థ పని తీరు మెరుగుపరిచేందుకు చైర్మన్‌గా తాను తీసుకున్న నిర్ణయాలను ఎండీ అమలు చేయడం లేదని విమర్శించారు. ఫైబర్‌ నెట్‌ అభివృద్ధికి ఏ మాత్రం సహకరించకపోగా, సంస్థను మూసివేసే విధంగా ఆయన చర్య­లు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ ఆరోపణలపై ఐఏఎస్‌ అధికారులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఐఏఎస్‌ అధికారుల ఆగ్రహాన్ని గమనించిన ప్రభుత్వం తక్ష ణం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. జీవీ రెడ్డి, దినేష్‌కుమార్‌ను మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి పిలిచి మాట్లాడారు. అన్ని ఆరోపణలపై ఆధారాలతో వివరణ ఇవ్వాలని జీవీ రెడ్డిని ఆదేశించారు. దీంతో ఆయన ఆధారాలు అందించలేకపోయారని సమాచారం. సీఎం కూడా జీవీ రెడ్డిని పిలిచి తీవ్రంగా మందలించి నట్లు తెలిసింది.

అసత్య ఆరో­ప­ణలు, అర్థంలేని మాటలతో పలచనకావొద్దని గట్టిగా హెచ్చరించారని సమాచారం. ఈ నేపథ్యంలో సంస్థను రూ.1,000 కోట్ల టర్నోవర్‌కు తీసుకువెళ్లడానికి కృషి చేస్తుంటే దానికి అడ్డుపడుతున్న అధి­కారికి అందరూ మద్దతు పలుకుతున్నారని, గౌరవం లేని చోట పనిచేయడం కష్టమంటూ సన్నిహితుల వద్ద జీవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం.  

ఫైబర్‌నెట్‌ ఎండీ దినేష్‌కుమార్‌పై బదిలీ వేటు
జీవీ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ ఎండీ, ఐఏఎస్‌ అధికారి కె. దినేష్‌కుమార్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం పెట్టుబడులు, మౌలి క వసతుల శాఖ కింద ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీగా ఉన్న దినేష్‌కుమార్‌ను జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని సోమవారం సీఎస్‌ విజయానంద్‌ ఉత్తర్వులు జారీచేశారు. వీటితోపాటు ఆర్‌టీజీఎస్‌ సీఈఓ, ఏపీ గ్యాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఎండీ, ఏపీ డ్రోన్‌ కార్పొరేష్‌న్‌ ఎండీగా నిర్వహిస్తున్న పూర్తిస్థాయి బాధ్యతల నుంచి కూడా దినేష్‌కుమార్‌ను తప్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement