‘రంప’ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి శిరీషాదేవి భర్త మఠం భాస్కర్ అరాచకాలు
గిరిజన నిరుద్యోగులతో చెలగాటం
ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.కోటి వరకూ వసూలు
డబ్బుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న బాధితులు
మధ్యవర్తుల నడుమ ఒప్పందం కుదిరినా చెల్లించని వైనం
రాజవొమ్మంగి పోలీసుస్టేషన్ హెచ్‌సీపై దౌర్జన్యం కేసులో నిందితుడు
జీడితోట దగ్ధం, అశ్లీల నృత్య ప్రదర్శన ఘటనలో కూడా అతనిపై కేసు నమోదు
పాడేరు: మఠం భాస్కర్.. రంపచోడవరం నియోజకవర్గంలో ఈయన పేరు తెలియని వారండరు.. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో సిద్ధహస్తుడు. సొంతూరు రాజవొమ్మంగి మండలం అనంతగిరి. రంపచోడవరం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మిరియాల శిరీషాదేవికి భర్త. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు రూ.కోటి వరకు గతంలో వసూలు చేశాడు.. ఆ సొమ్ముకోసం ఇప్పటికీ బాధితులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆయన నేరచరిత్ర కూడా పెద్దదే. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన పలు కేసుల్లో నిందితుడు. నిరుద్యోగులకు మంచి జరగాలంటే భార్య శిరీషాదేవికి ఓటేయాలని ఇప్పుడు అభ్యర్థిస్తున్నాడు. అతను మాటలు నమ్మితే మన్యాన్ని మడత పెట్టేస్తాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీకి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి మఠం భాస్కర్ రాజవొమ్మంగి పోలీసు స్టేషన్‌లో నమోదైన పలు కేసుల్లో నిందితుడు. ఏజెన్సీలో గిరిజన యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని రెండేళ్ల క్రితం వారి నుంచి సుమారు రూ.కోటి వరకు డబ్బులు వసూలు చేశాడు. నియోజకవర్గంలోని రాజవొమ్మంగి, జడ్డంగి, దేవీపట్నం, వీఆర్‌పురం, డొంకరాయి, అడ్డతీగల గ్రామాల్లో ఆయన ఉచ్చులో పడి మోసపోయిన బాధితులు ఎంతోమంది ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
రాజవొమ్మంగి మండలం చికిలింత గ్రామానికి చెందిన గిరిజన యువకుడికి ఓ ఎయిడెడ్ స్కూల్లో టీచర్ పోస్టు ఇప్పిస్తానని రూ.3 లక్షల వరకు తన ఖాతాకు నగదు బదిలీ చేయించుకున్నట్టు సమాచారం. ఇందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన టీడీపీకి చెందిన ఓ నాయకుడు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడిగినట్టు సమాచారం. డబ్బులు ఇచ్చే వరకు అడగవద్దని హెచ్చరించినట్టు తెలిసింది.
అడ్డతీగల మండలం దుప్పులపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజన యువకుల నుంచి సీఆర్‌టీ పోస్టు ఇప్పిస్తానని ఒకొక్కరి నుంచి రూ.లక్ష చొప్పన మూడు లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా మరో యువకుడి నుంచి టీచర్ పోస్టు ఇప్పిస్తానని రూ.లక్ష, గుమస్తా పోస్టుకు రూ. 60 వేలు మధ్యవర్తుల సమక్షంలో వసూలు చేసినట్టు సమాచారం. ఇలా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించేందుకు ఒప్పుకున్న మఠం భాస్కర్ పూర్తిగా చెల్లించిన దాఖల్లాలేవు. ఉద్యోగాలు మాట దేవుడెరుగు మా డబ్బులు మాకివ్వండి అంటూ గిరిజన యువత గగ్గోలు పెట్టిన ఫలితం లేకుండా పోయింది. అయితే ఎప్పటికైనా ఎంతో కొంత మొత్తం ఇస్తాడన్న ఆశతో వారు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పేందుకు రాలేకపోతున్నారు.
అసెంబ్లీ అభ్యర్థి శిరీషాదేవి భర్త మఠం భాస్కర్‌కు నేర చరిత్ర కూడా ఉంది. రాజవొమ్మంగి పోలీసుస్టేషన్‌లో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.
2016లో రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్Œ వద్ద విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఏకే దొరపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. వాహనాలను తనిఖీ చేస్తున్న అతనిపై దాడికి దిగడంతో (ఎఫ్‌ఐఆర్: 50/2017) అదే పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
2017లో అతని స్వగ్రామం అనంతగిరిలో జీడిమామిడి తోటను దగ్ధం చేశాడు. గ్రామస్తుల సమక్షంలో బాధిత రైతుకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామపెద్దలు చెప్పినప్పటికీ అందుకు అంగీకరించనట్టు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు (ఎఫ్‌ఐఆర్: 15/2017) రాజవొమ్మంగి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయింది.
2019లో జరిగిన ఎన్నికల సమయంలో రాజవొమ్మంగిలో గొడవకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడన్న అభియోగంపై (ఎఫ్‌ఐఆర్:47/2019) కేసు నమోదైంది.
2022లో అనంతగిరి గ్రామ సమీపంలో అశ్లీల నృత్య ప్రదర్శన, పేకాట, గుండాట నిర్వహించాడన్న అభియోగం మేరకు అతనిపై రాజవొమ్మంగి పోలీసులు (ఎఫ్‌ఐఆర్: 10/2022) కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులన్నీ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి.
ఇవి చదవండి: కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్ కళ్యాణ్
Comments
Please login to add a commentAdd a comment