మట్టి వినాయకులనే పూజిద్దాం
-
జేవీవీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ
నెల్లూరు(అర్బన్):
మానవాళి ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టివిగ్రహాలనే పూజిద్దామని మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో జిల్లా కాలుష్యనియంత్రణ మండలి సహకారంతో స్థానిక ఫత్తేఖాన్‌పేటలోని రైతు బజార్‌లో శుక్రవారం మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ మాట్లాడారు. రసాయనాలు వాడే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జలచరాలు మరణిస్తున్నాయన్నారు. ఆ నీటిని తాగిన ప్రజలకు కేన్సర్ వస్తుందన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో ఉచితంగా 10వేల మట్టి విగ్రహాలను విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జనవిజ్ఞాన వేదిక ప్రజాసైన్సువేదిక రాష్ట్ర నాయకుడు నూనె నారాయణ మాట్లాడుతూ మన దేశ సంప్రదాయానికి అనుగుణంగా మట్టి వినాయకులనే పూజిద్దామని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారి ప్రమోద్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో రూ.15 విలువైన మట్టి విగ్రహాలను రూ.5కే రైతుబజార్‌లో అందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు, న్యాయవాది నన్నేసాహెబ్, కార్పొరేటర్లు రాజేష్, రాజానాయుడు, నూనె మల్లికార్జున, పెంచలయ్య, నాగేశ్వరరావు, జేవీవీ నాయకులు గాలిశ్రీనివాసులు, శ్రీధర్, చక్రపాణి పాల్గొన్నారు.