Eco friendly idols
-
Eco Friendly Ganesha: వెరైటీ కప్పుల గణపయ్య
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా వినాయక విగ్రహాలను సుద్దా, లేదా మట్టితో తయారు చేస్తారు. కానీ.. నాచారం డివిజన్ బాబానగర్‌కు చెందిన సూర్యప్రకాష్ వివిధ రకాల వస్తువులతో భిన్నవిభిన్న ఆకృతుల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కాలనీ వాసులతో కలిసి ప్రతి ఏటా గణనాథుడిని కాలనీలో ప్రతిష్టించేవాడు. తానే స్వయంగా వైరటీగా తయారు చేయాలని నిర్ణయించుకొని 2010లో ప్రారంభించాడు. పర్యావరణ రహిత గణనాథుడిని తయారు చేయాలనే సంకల్పంతోనే వైరటీగా తయారు చేయడానికి శ్రీకారం చుట్టినట్లు సూర్యప్రకాష్ ‘సాక్షి’కి తెలిపారు. 11 ఏళ్లుగా.. 2010 మొదటగా ఏకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని న్యూస్ పేపర్లలతో తయారు చేశాడు. 2011లో 35వేల టీ కప్పులతో, ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో రకంగా లక్ష ప్రమీదాలతో, 5 వేల లీటర్ల టాటా వాటర్ ప్యాకెట్ల్‌తో వాటర్ పెడల్స్‌తో 18వేల టిష్యూ పేపర్లతో డోరమెన్ బాల్స్‌తో, 6 వేల ఐస్‌క్రీమ్‌లతో వినాయకుడిని తయారు చేశాడు. రెండేళ్ల క్రితం 20 వేల ఇయర్ బడ్స్‌తో 2021కి మూడు కిలోల కాఫీ గింజలతో తయారు చేశాడు. ఈ సారి 25 వేల టీ కప్పులతో తయారు భారీ వినాయకుడిని తయారు చేస్తున్నట్లు సూర్య ప్రకాష్ పేర్కొన్నాడు. 15 మంది సభ్యులతో.. సూర్యప్రకాష్ తాతా, పెద్ద నాన్న, నాన్న మొదటి నుంచి మంచి ఆర్టిస్ట్‌లు సూర్య ప్రకాష్ ఇంటికి కూడా చిత్రకళ అనే పేరు పెట్టారు. వారింట్లో ఎక్కడా చూసిన బొమ్మలు, మొక్కలే కనిపిస్తాయి. తాను వెరైటీగా తయారు చేస్తున్నట్లు తెలుసుకున్న చాలా మంది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, కర్నూలు, చిలుక లూరిపేట, తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలు, హైదరాబాద్‌లో కూడా ఆర్డర్స్ మీదా తన 15 మంది టీమ్ సభ్యులతో తయారు చేయడానికి వెళ్తుంటారు. టీకప్ గణనాథుడి తయారీతో తనకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. -
Suchitra Divvela: అరటి ఆకు లేకపోతేనేం.. అరెక్కా పళ్లెం ఉందిగా!
పెళ్లంటే... బంధువులు, స్నేహితులతో కలిసి పచ్చటి ఆరిటాకులో పిండివంటలన్నీ చక్కగా వడ్డించుకుని ఆకు పచ్చిదనాన్ని, పచ్చదనాన్నీ ఆస్వాదిస్తూ భోజనం చేయాలని ఎవరికి మాత్రం ఉండదు? అయితే ఇప్పుడన్నీ నిలబడి తినే బఫే భోజనాలే. అరటి ఆకు లేకపోతేనేం... అరెక్కా ప్లేట్ ఉంది. సుచిత్ర దివ్వెలది మచిలీపట్నం. చదువు, ఉద్యోగం అన్నీ హైదరాబాద్‌లోనే. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా జీతం బాగానే ఉంది. లైఫ్ అంటే నెల చివర బ్యాంకు బాలెన్స్‌లో మిగులు చూసుకుని సంతృప్తి చెందడం కాదనిపించేది. పిల్లలు వేసే అనేక ప్రశ్నల్లోంచి ఆమెకు అనేక సందేహాలు వస్తుండేవి. ఉద్యోగం, మోడరన్లైఫ్ పరుగులో పడి ఏదో కోల్పోతున్నామని కూడా అనిపిస్తుండేది. ఇప్పుడు మనం కాలుష్యరహితంగా జీవించిన గడచిన తరాన్ని చూస్తున్నాం. రేపటి రోజున పిల్లలకు ఎలాంటి జీవితాన్ని మిగులుస్తున్నాం... అని తనను తాను ప్రశ్నించుకునేది. నిజానికి ఇది తన ఒక్క ఇంటి సమస్య కాదు. కొంత సమయం తీసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తే రాబోయే తరంలో ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులకు పిల్లల నుంచి ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతాయి. ఇంత ఆలోచించిన తర్వాత సుచిత్ర తనవంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. కర్ణాటకలో ఉన్న తన స్నేహితుల ద్వారా అక్కడ విరివిగా లభించే పోకచెట్ల బెరడును ఇలా ఉపయోగించవచ్చని తెలుసుకుంది. ఇక ఆ ప్రయత్నాన్ని ఒక క్రమపద్ధతిలో పెట్టగలిగింది. వెయ్యిలో ఒకరైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే ఇకపై ఏ వేడుకలోనూ ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు వాడాల్సిన అవసరం ఉండదంటారామె. చెట్టును కొట్టకుండానే..! ‘‘పోక చెట్టు నుంచి సేకరించిన మెటీరియల్‌తో ప్లేట్ అనగానే చెట్టుకు హాని కలిగిస్తారని అపోహ పడడం సహజమే. కానీ పోకచెట్టు కూడా కొబ్బరి చెట్టులాగానే కాయల కోసం గెల వేస్తుంది. పూత దశలోనే గెలను కప్పి ఉంచిన పొర విచ్చుకుంటుంది. కాయలు ముదిరి, గెలను కోసే సమయానికి ఈ పొర కూడా ఎండిపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అలా సేకరించిన బెరడు లాంటి పొరను శుభ్రం చేసి, గుండ్రగా కానీ నలుచదరంగా కానీ కత్తిరించి మౌల్డ్‌లో పెట్టి వేడి చేస్తే ప్లేట్ రెడీ అవుతుంది. స్పూన్లు, కప్పులకు కూడా ఇదే పద్ధతి. ఈ చెట్లు కర్ణాటకలో దావణగెరె, చెన్నగిరి, షిమోగా, తుమ్కూరులో ఎక్కువ. ఇక కేరళ, అస్సాంలో కూడా ఉంటాయి. కానీ నాకు పరిచయమైన మిత్రులు కర్ణాటక వాళ్లు కావడంతో నేను అక్కడి నుంచి నా యాక్టివిటీని మొదలుపెట్టాను. మనిషి పుట్టినప్పటి నుంచి పోయే వరకు ప్రతి అవసరాన్నీ చెట్టు తీరుస్తుంది. మనం చెట్టుకు హాని కలిగించకుండా, ఇచ్చిన వాటిని ఉపయోగించుకుంటే చాలు. ఆదాయం తక్కువే! అరెక్కా ప్లేట్, కప్పుల యూనిట్లు భారీస్థాయిలో రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఇందులో లాభాలు పరిమితంగా ఉంటాయి. నాలాగ ఉద్యోగం చేసుకుంటూ, ప్రవృత్తిగా వీటిని ప్రచారంలోకి తీసుకురావడమే తప్ప, పూర్తిస్థాయి వృత్తిగా చేపట్టాలంటే కొంచెం ముందువెనుకలు ఆలోచిస్తారు. అందుకే పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి ఉన్న వాళ్లు, పర్యావరణ పరిరక్షణ కోసం పని చేయాలనుకునే వాళ్లు తమ వంతు బాధ్యతగా ఇలాంటి ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాను. ’’ అన్నారు సుచిత్ర. మనకు వేడుకలు చాలానే ఉంటాయి. శ్రావణ మాసం నోముల నుంచి, గణేశ చతుర్థి, దసరా వేడుకల్లో ప్రసాదాలు పంచుకుంటారు. దేవుడి వేడుకలకు విరాళాలిచ్చే వాళ్లు తమవంతు విరాళంగా ఇలాంటి కప్పులను ఇవ్వడం అలవాటు చేసుకుంటే ‘ప్లాస్టిక్‌ని వాడవద్దు’ అని గొంతెత్తి చాటే పనే ఉండదు. ప్లాస్టిక్ దానంతట అదే కనుమరుగవుతుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చాక్లెట్ గణేశ్.. పిల్లలకు పలహారం..
పంజాబ్: దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు ప్రారంభమైనాయి. పర్యావరణ ప్రేమికులు విభిన్న రకాల కాలుష్యరహిత విగ్రహలను రూపొందించి తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాకు చెందిన బేకరీ యజమాని హర్జిందర్ సింగ్ కుక్రెజా మాత్రం ఇంకొంచెం వెరైటీగా ఆలోచించాడు. చాక్లెట్ గణేశ్ విగ్రహాన్ని తయారు చేసి, పాలల్లో నిమజ్జనం చేసి, ఈ పాలను పేదపిల్లలకు పంచి పెట్టే వినూత్న కార్యక్రమాన్ని 6 యేళ్ల క్రితమే చేపట్టాడు. వృధాని అరికట్టి, పర్యావరణానికి హితం చేకూరేలా ఉన్న ఇతని ఆలోచనను అందరూ ప్రశంశిస్తున్నారు. కాగా ఈ యేడాది కూడా 2 వందల కిలోల బెల్జియం డార్క్ చాక్లెట్లతో గణేశ్ విగ్రహాన్నితయారు చేసినట్టు గురువారం మీడియాకు వెల్లడించారు. ప్రతి వినాయక చవితికి చాక్లెట్‌తో ఎకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాన్ని తయారు చేస్తున్నామని, ఈ విధంగా 2016 నుంచి చేస్తున్నామని అన్నారు. అయితే ఈ యేడాది విగ్రహాన్ని మాత్రం ప్రొఫెషనల్ షెఫ్ టీమ్ పది రోజుల పాటు శ్రమించి తయారు చేశారని తెలిపారు. ఇది అంత తేలికైన విషయం కాదని, తయారు చేసే సమయంలో ఏ కొంచెం లోపం తలెత్తినా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించేవారని తెలియజేశారు. కానీ దేనిమీదైనా అత్యంత అభిమానం ఉన్నట్లయితే, కష్టం కూడా సరదాగానే ఉంటుందని అన్నారు. చాక్లెట్‌తో తయారు చేసిన ఈ గణేశ్ విగ్రహాన్ని మూడో రోజు 45 లీటర్ల పాలల్లో నిమజ్జనం చేస్తామని తెలిపారు. అనంతరం ఆ పాలను పేద పిల్లలకు పంచిపెడతామని అన్నారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రతీ యేట దాదాపుగా 5 వందలకుపైగా పిల్లలకు ఒక్కొక్కరికి గ్లాసెడు చాక్లెట్ మిల్క్ పంచుతున్నామని తమ అనుభవాలను పంచుకున్నారు. -
ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తులు క్యూ
-
వెరైటీ వినాయకుడు..
సాక్షి, కవిటి: శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రంగా బొరివంకలో శ్రీబాలగణపతి ఉద్దానం యూత్ క్లబ్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా లేఖినీరూప కాణిపాక గణపతిని రూపొందించారు. గత ఏడేళ్లుగా పర్యావరణానికి హాని చేయని రీతిలో గణనాథుని విగ్రహాల తయారీలో అందివేసిన చెయ్యిగా పేరు తెచ్చుకున్న ఉద్దానం యూత్ క్లబ్ సభ్యుడు, శిల్పి భైరి తిరుపతిరావు ఈ విగ్రహాన్ని రూపొందించారు. 3,500 సుద్దముక్కలను తీసుకుని ప్రతీ సుద్ద ముక్కపై గణనాథుడిని చెక్కాడు. వీటిని మట్టితో చేసిన గణనాథుడి శరీర ఉపరితలంపై అందంగా అలంకరించాడు. వాటికి ప్రకృతి సిద్ధమైన రంగులను అద్ది ఆకర్షణీయంగా సిద్ధం చేశాడు. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ వరి నారు, నారికేళ, నలుగుపిండి, వనమూలిక, గోధుమ నారు, కొబ్బరిపూలతో వివిధ రూపాల్లో గణేశుని విగ్రహాలను తయారు చేశారు. వీటికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కడం విశేషం. ఫోటోలు ‘సాక్షి’కి పంపండి... నవరాత్రుల పాటు ఆ దేవదేవుడిని కొలవడానికి మీరు ఏర్పాటు చేసే అపురూపమైన మట్టి ప్రతిమల ఫోటోలను ‘సాక్షి’ పంపించండి. మీ సామాజిక కర్తవ్యాన్ని నలుగురికి తెలియజేసి అందరికీ స్పూర్తిగా నిలవండి. మీ నగరంలో, మీ ఊరిలో, మీ వీధిలో, మీ గల్లీలో, మీ ఇంట్లో ఎక్కడైనా సరే వినాయకుడి మట్టి ప్రతిమల ఫోటోలను మొబైల్ ద్వారా మాకు పంపించండి. ఫోటోతో పాటు ఎక్కడ నెలకొల్పిందీ, పేరు, ఊరు, వీధి, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలతో lordganapati@sakshi.comకు మెయిల్ ద్వారా పంపించండి. వాటిని మేము www.sakshi.com వెబ్ సైట్లో ప్రచురిస్తాం. ఇంకెందుకు ఆలస్యం... ప్రకృతిని కాపాడుకుందాం. నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం. -
తెలుగు రాష్ట్రాలో వినాయక చవితి శోభ
-
సాక్షి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
-
‘మట్టి గణపతులనే పూజిద్దాం’
సాక్షి, సిటీబ్యూరో: మట్టి గణపతిని పూజిద్దాం...పర్యావరణాన్ని రక్షిద్దామంటూ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మట్టి గణపతులు పంపిణీ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడంలో ముందుందని మునిసిల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ అన్నారు. గురువారం మైహోం నవదీపలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతుల కార్యక్రమంలో తన కుమార్తెతో కలిసి మట్టివిగ్రహలు పంపిణీ చేశారు. ఉద్యోగులందరికీ మట్టి విగ్రహాలు హెచ్ఎండీఏ ఉద్యోగులందరికీ హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ మట్టి గణేష విగ్రహాలను పంపిణీ చేశారు. చీఫ్ అకౌంట్ ఆఫీసర్ శరత్ చంద్ర, సూపరింటెండెంట్ పరంజ్యోతి, పీఆర్ఓ లలిత ప్రతి ఉద్యోగికి మట్టి గణపతి తో పాటు తులసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు పర్యావరణ హితానికి అనుగుణంగా వ్యవహరించాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను విరివిగా పెంచాలని కోరారు. -
వినాయకుడికి వినమ్రతతో...
జైజై గణేశా.. జై బోలో గణేశా! మళ్లీ వినాయక చవితి వస్తోంది. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గణనాధుడి మహాపర్వదినం సందర్భంగా ఊరూ-వాడా మంటపాలతో ముస్తాబవుతున్నాయి. ప్రతి గల్లీలోని మంటపాల్లో గజాననుడు కొలువుదీరబోతున్నాడు. అయితే, ప్రకృతికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనాలతో చేసే విగ్రహాలకు స్వస్తి పలుకుదాం. సర్వ విఘ్నాలను మాపే విగ్నేషుడి విగ్రహాలు ప్రకృతికి విఘాతం కలిగించరాదన్న లక్ష్యం కోసం అందరూ నడుం బిగించాల్సిన సమయమిది. గణనాధుడి మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం. ప్రకృతిని ఆరాదించే ఆ దేవదేవుడి ఆశీర్వచనాల కోసం నిండు మనసుతో కొలుద్దాం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రకృతిహితమైన గణనాథులను ఏర్పాటు చేసి మనవంతు సామాజిక కర్తవ్యాన్ని నెరవేర్చుదాం. నవరాత్రుల పాటు ఆ దేవదేవుడిని కొలవడానికి మీరు ఏర్పాటు చేసే అపురూపమైన మట్టి ప్రతిమల ఫోటోలను ‘సాక్షి’ పంపించండి. మీ సామాజిక కర్తవ్యాన్ని నలుగురికి తెలియజేసి అందరికీ స్పూర్తిగా నిలవండి. మీ నగరంలో, మీ ఊరిలో, మీ వీధిలో, మీ గల్లీలో, మీ ఇంట్లో ఎక్కడైనా సరే వినాయకుడి మట్టి ప్రతిమల ఫోటోలను మొబైల్ ద్వారా మాకు పంపించండి. ఫోటోతో పాటు ఎక్కడ నెలకొల్పిందీ, పేరు, ఊరు, వీధి, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలతో lordganapati@sakshi.comకు మెయిల్ ద్వారా పంపించండి. వాటిని మేము www.sakshi.com వెబ్ సైట్లో ప్రచురిస్తాం. ఇంకెందుకు ఆలస్యం... ప్రకృతిని కాపాడుకుందాం. నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం. -
ప్రజలు ఎందుకు మారడం లేదు ?
సాక్షి, ముంబై : ముంబై వీధుల్లో ప్రతి ఏటలాగా ఈసారి కూడా దాదాపు రెండు లక్షల విగ్రహాలను ప్రతిష్టించారు. వీటిలో కేవలం 18 శాతం విగ్రహాలు మాత్రమే మట్టి విగ్రహాలు. మిగతా వన్నీ కూడా ‘ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ’ తో చేసినవే. పర్యావరణానికి హాని కలిగించే ఇలాంటి పీవోపీ విగ్రహాలకు స్వస్తి చెప్పాలనీ, పర్యావరణానికి మేలు కలిగించే మట్టి లేదా కాగితపు గుజ్జు విగ్రహాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆ విఘ్నేశ్వరుడి సాక్షిగా చెబుతున్నా ప్రజల్లో ఆశించిన చైతన్యం ఎందుకు రావడం లేదు? కారణాలు ఏమిటీ? ఇదే విషయమై మట్టి విగ్రహాలను మాత్రమే తయారు చేసి అమ్ముతున్న 46 ఏళ్ల వినోద్ విజయ్ నెవ్సేను ప్రశ్నించగా, మట్టి విగ్రహాలను తయారు చేయడానికి చాలా సమయం పట్టడమే కాకుండా డబ్బు ఖర్చు కూడా ఎక్కువవుతుందని, లాభాలు తక్కువ వస్తాయని చెప్పారు. రెండు అడుగుల మట్టి విగ్రహాన్ని విక్రయించడం ద్వారా తనకు 300 నుంచి 400 రూపాయల వరకు లాభం వస్తుందని, అదే రెండు అడుగుల పీవోపీ విగ్రహాన్ని అమ్మితే 1200 రూపాయల లాభం వస్తుందని ఆయన చెప్పారు. పైగా మట్టి విగ్రహాలు ఎక్కువగా అమ్ముడు పోవని, ఈ సీజన్లో తాను కేవలం 175 విగ్రహాలను మాత్రమే అమ్మగలిగానని చెప్పారు. అదే ఇతరులు పీవోపీ విగ్రహాలను వెయ్యి వరకు విక్రయించారని చెప్పారు. మరో వృత్తితో కొనసాగుతున్నందున తనకు ఈ మట్టి విగ్రహాల తయారీ పెద్ద భారం అనిపించడం లేదని ఆయన తెలిపారు. వినోద్ విజయ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచే స్తున్నారు. ఈ సీజన్లో మాత్రమే మట్టి విగ్రహాలను తయారు చేసి అమ్ముతుంటారు. వినోద్ విజయ్‌కి సమీపంలోనే చేతన్ వరాస్కర్ ప్రతీకార్త్ వినాయక విగ్రహాల పరిశ్రమ ఉంది. ఈ సీజన్లో ఆయన దాదాపు వెయ్యి విగ్రహాలను విక్రయించారట. అందులో 20 శాతం మాత్రమే మట్టి విగ్రహాలు ఉన్నాయట. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణం పట్ల అవగాహన కలిగిస్తున్నప్పటికీ ఎందుకు పీవోపీ విగ్రహాల తయారీకే ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించగా, మట్టి విగ్రహాలను పరిమిత సైజులోనే తయారు చేయ గలమని, పెద్ద విగ్రహాలను తయారు చేయలేమని చెప్పారు. వీధుల్లో ప్రతిష్టించే విగ్రహాలు పెద్దవిగా ఉండాలని ప్రజలు డిమాండ్ చేస్తారుకనుక తాము పీవోపీనే ఆశ్రయించాల్సి వస్తోందని చెప్పారు. అంతేకాకుండా మట్టి విగ్రహాలకు పగుళ్లు వస్తాయని, రంగును కూడా ఎక్కువ పీల్చుకుంటాయని, అవే పీవోపీ విగ్రహాలకు పగుళ్లు రావని, రంగు తక్కువ పడుతుందని, పైగా ఆకర్షణీయంగా ఉంటాయని ఆయన చెప్పారు. అన్నింటికన్నా లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయని విగ్రహాల తయారీలో మూడో తరానికి చెందిన చేతన్ వరాస్కర్ వివరించారు. ఈ కారణాల వల్లనే తాను కూడా పీవోపీ విగ్రహాలనే ప్రోత్సహిస్తానని ఆయన చెప్పారు. కేవలం వృత్తిగురించి ఆలోచించే చేతన్ వరాస్కర్ లాంటి వాళ్లకు పీవోపీ విగ్రహాల వల్ల కలిగే నష్టం గురించి పెద్దగా తెలియదు. తెలిసినా పట్టించుకోరు. వినాయక విగ్రహాలన్నింటిని తీసుకెళ్లి నిమజ్జనం రోజున నీటిలో వేస్తారన్న విషయం తెల్సిందే. మట్టి విగ్రహాలయితే 45 నిమిషాల్లోనే నీటిలో కరిగి పోతాయి. పీవోపీ విగ్రహాలు నీటిలో కరగాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. అది కరగడం వల్ల నీటిలో క్లోరిన్, లవణాలు, మురికి పెరుగుతాయి. పర్యవసానంగా నీటి సాంద్రత పెరిగి ఆక్సిజన్ తగ్గుతుంది. ఫలితంగా చేపలు, కప్పల లాంటి జలచరాలు చనిపోతాయి. పీవోపీ విగ్రహాలకు ఉపయోగించే రసాయనిక రంగుల వల్ల నీరు విషతుల్యమై జల చరాలు చనిపోతాయి. విషతుల్యమైన నీటి ప్రభావం మానవులపై కూడా పడుతుంది. మట్టి విగ్రహాల వల్ల నీటిలో మట్టి పెరగడం తప్ప మరో ముప్పు లేదు. ఇప్పుడు మట్టి విగ్రహాలను కూడా నీటిలో నిమజ్జనం చేయకుండా నేలలో నిమజ్జనం చేయడం కోసం వివిధ రకాల చెట్ట గింజలు కలిగిన మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. తద్వారా చెట్ల పెరుగుదలకు దోహదపడవచ్చని స్వచ్ఛంద సంస్థల ఆలోచన. కాగితపు విగ్రహాలను ప్రోత్సహించేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయిగానీ కాగితపు గుజ్జుతో తయారుచేసే ఆ విగ్రహాలు మట్టివాటికన్నా ఖరైదనవి. పాలల్లో ముంచి పేదలకు పంచేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు చాక్లెట్ విగ్రహాలను తయారు చేస్తుండగా, మరికొన్ని సంస్థలు చేపలు తినడానికి వీలుగా చెరకు గడలు, కొబ్బరి చిప్పలతో విగ్రహాలను తయారు చేయించి ప్రోత్సహిస్తున్నాయి. ఇలా ఎన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నా ప్రజల్లో ఆశించిన మార్పు రాకపోవడానికి కారణం కాసులపైనున్న మమకారమే. కొన్ని రాష్ట్రాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించినట్లుగా పీవోపీ వాడకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధిస్తే తప్పా మార్పు వచ్చే పరిస్థితి లేదు. ఓట్ల రాజకీయాలను ఆశ్రయించే ప్రభుత్వాలు అంత పెద్ద నిర్ణయం తీసుకంటాయని ఆశించలేం! -
ఆకట్టుకున్న ఇన్నోవేటర్స్ స్టార్టప్ కన్క్లేవ్
రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రూరల్ ఇన్నోవేటర్స్ స్టార్టప్ కన్క్లేవ్ కార్యక్రమాన్ని గురువారం ఉదయం ఉపరాష్ట్రపతి ఆర్.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. 23 రాష్ట్రాలకు చెందిన 300 మంది ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 190 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులతో పాటు పారిశుధ్ధ్యం, ఆరోగ్యం, పర్యావరణం తదితర వాటిపై వివిధ రకాల పనిముట్లు, నమూనాలను ఈ స్టాల్స్‌లో ప్రదర్శించారు. స్టాల్స్‌ను ప్రారంభించిన అనంతరం ఉపరాష్ట్రపతి వాటి పనితీరు, ఉపయోగాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాంక్రిపాల్‌యాదవ్, ఉపముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ ఆలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎన్ఐఆర్డీపీఆర్ డీజీ డాక్టర్ డబ్ల్యూఆర్.రెడ్డి, డిప్యూటీ డిజీ రాధికారస్తోగి తదితరులు పాల్గొన్నారు. పంట రక్షణకు లేజర్ పరికరం చిన్న, సన్నకారు రైతులు పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అడవి పందులు, ఇతర జంతువుల కారణంగా 20 శాతం పంటను కోల్పొతున్నారు. దీని నివారణకు కరీంనగర్ జిల్లా పోలారం గ్రామానికి చెందిన బి.నాగరాజు లేజర్ టెక్నాలజీతో సౌండ్ సిస్టాన్ని కనుగోన్నాడు. కేవలం రెండు వేల రూపాయలతో పంటను కాపాడుకోవచ్చునని తెలుపుతున్నాడు. రాత్రి సమయంలో పంటలోకి ఏ జంతువులు వచ్చిన లేజర్ కిరణంతో అనుసంధానమైన స్పీకర్ ద్వారా చప్పుడు అవుతుందన్నారు. దీంతో జంతువులు పారిపోతాయన్నారు. ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. గర్భిణులకు ప్రత్యేక పౌష్టికాహారం హైదరాబాద్‌లోని మూడు పాఠశాలలకు చెందిన త్రిపురా, కీర్తి, జెస్సికాలు గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులతో పాటు నిరుపేదలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కొత్తగా చాక్లెట్ తరహాలో చిరుధాన్యాలు, విటమిన్స్‌తో కూడిన బిస్కెట్లను తయారు చేశారు. వారానికి మూడు బిస్కెట్లను తింటే గర్భిణులలో రక్తహీనత, ఫొలిక్ యాసిడ్, విటమిన్స్‌ల సమస్య ఉండదని తెలుపుతున్నారు. ప్రస్తుతం గర్భిణులు మందు బిల్లలను వేసేందుకు అనాసక్తి చూపుతారన్నారు. గ్రామాల్లో వారికి సరైన పౌష్టికాహారం లేక పుట్టే పిల్లలు సైతం విటమిన్స్ లోపంతో అనారోగ్యంగా పుడతారని, ఈ బిస్కెట్లను తీసుకుంటే వాటిని నివారించవచ్చునని తెలుపుతున్నారు. ఇది కేవలం 20 రూపాయలకు చొప్పున దొరుకుతుందన్నారు. సోలార్ సెల్ఫ్ ఆటో వాటరింగ్ సిస్టమ్ డ్రిప్ ఇరిగేషన్‌తో పండిస్తున్న పంటలకు ఖర్చు తగ్గించేందుకు సోలార్ సెల్ఫ్ ఆటో వాటరింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తున్నట్లు చర్లపల్లికి చెందిన మేఘన తెలిపారు. ఇది సోలార్ సిస్టమ్‌తో పూర్తిగా పని చేస్తుందన్నారు. నేలను తడిగా ఉంచడంతో పాటు అతి తక్కువ ఖర్చు అవుతుందన్నారు. చిటికెలో చిరుధాన్యాల డ్రింక్స్ కాఫీ, టీ తరహాలో చిరుధాన్యాలతో ఇన్స్టెంట్ డ్రింక్స్‌ను తయారు చేశారు. కాఫీ, టీలను అందించే యంత్రాన్ని ఉపయోగించి రాగి, జొన్న, తైదులు(అంబలి) తదితర మిలెట్ ద్రవాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఇది మార్కెట్లోకి విక్రయించేందుకు సిద్ధమవుతున్నామని హైదరాబాద్ ప్రగతినగర్‌కు చెందిన కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. అలాగే మైదాను ఉపయోగించకుండా రాగి, సజ్జ, జోన్న, మొక్కజోన్న బిస్కెట్లను తయారు చేస్తున్నామన్నారు. ఇక్రిశాట్‌తో మొట్టమొదటిసారిగా పేటెంట్ హక్కులను పొందామన్నారు. త్వరలో మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఎకో టూత్‌బ్రెష్‌తో ఆరోగ్యం మెండు విజయనగరానికి చెందిన వి.రమేష్, తేజలు ఎకో టూత్‌బ్రెష్‌లను తయారు చేశారు. తాటి పీచును ఉపయోగించి ఈ బ్రెష్‌ను ఉపయోగించుకోవచ్చు. కట్టెతో తయారైన ఈ బ్రెష్‌కు తాటి పీచును జోడించారు. పీచు పాడైన అనంతరం తిరిగి తీసి వాడుకునే సౌకర్యం ఉంది. పది రోజులకు ఒక్కసారి పీచును తీసి వేసి కొత్తగా ఏర్పాటు చేసుకోవాలని రమేష్ తెలిపారు. రూ.10కి ఒక టూత్‌బ్రెష్‌ను విక్రయించేందుకు నిర్ణయించామన్నారు. ఒక్కసారి కొనుగోలు చేస్తే 3–4 సంవత్సరాల వరకు వాడవచ్చునన్నారు. పర్యావరణానికి సైతం ఇది ఎలాంటి హాని ఉండదన్నారు. ప్లాస్టిక్‌తో చేస్తున్న టూత్‌బ్రెష్‌లతో ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. చిగుళ్లకు సైతం ఈ బ్రెష్‌ల వల్ల ఎలాంటి హాని ఉండదన్నారు. -
మట్టి వినాయకులనే పూజిద్దాం
జేవీవీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ నెల్లూరు(అర్బన్): మానవాళి ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టివిగ్రహాలనే పూజిద్దామని మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో జిల్లా కాలుష్యనియంత్రణ మండలి సహకారంతో స్థానిక ఫత్తేఖాన్‌పేటలోని రైతు బజార్లో శుక్రవారం మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ మాట్లాడారు. రసాయనాలు వాడే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జలచరాలు మరణిస్తున్నాయన్నారు. ఆ నీటిని తాగిన ప్రజలకు కేన్సర్ వస్తుందన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో ఉచితంగా 10వేల మట్టి విగ్రహాలను విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జనవిజ్ఞాన వేదిక ప్రజాసైన్సువేదిక రాష్ట్ర నాయకుడు నూనె నారాయణ మాట్లాడుతూ మన దేశ సంప్రదాయానికి అనుగుణంగా మట్టి వినాయకులనే పూజిద్దామని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారి ప్రమోద్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో రూ.15 విలువైన మట్టి విగ్రహాలను రూ.5కే రైతుబజార్లో అందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు, న్యాయవాది నన్నేసాహెబ్, కార్పొరేటర్లు రాజేష్, రాజానాయుడు, నూనె మల్లికార్జున, పెంచలయ్య, నాగేశ్వరరావు, జేవీవీ నాయకులు గాలిశ్రీనివాసులు, శ్రీధర్, చక్రపాణి పాల్గొన్నారు. -
'పర్యావరణాన్ని పరిరక్షిద్దాం'
సుల్తానాబాద్ (కరీంనగర్) : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సమిష్టిగా గణేషుని మట్టి ప్రతిమలనే ఏర్పాటు చేసుకోవాలని సీఐ తులా శ్రీనివాస్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో శనివారం పీస్‌కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నందున మైక్సెట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కోరారు. మతసామరస్యాన్ని పాటించాలని సూచించారు. రాత్రి వేళల్లో మండపాల వద్ద మద్యం, అశ్లీలతకు తావివ్వరాదని సూచించారు.