ఆకట్టుకున్న ఇన్నోవేటర్స్‌ స్టార్టప్‌ కన్‌క్లేవ్‌    | Innovators Startup Conclave In Rangareddy | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ఇన్నోవేటర్స్‌ స్టార్టప్‌ కన్‌క్లేవ్‌   

Published Fri, Aug 31 2018 10:26 AM | Last Updated on Fri, Aug 31 2018 10:26 AM

Innovators Startup Conclave In Rangareddy - Sakshi

వస్తువుల్ని పరిశీలిస్తున్న వెంకయ్యనాయుడు

రాజేంద్రనగర్‌ : రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రూరల్‌ ఇన్నోవేటర్స్‌ స్టార్టప్‌ కన్‌క్లేవ్‌ కార్యక్రమాన్ని గురువారం ఉదయం ఉపరాష్ట్రపతి ఆర్‌.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. 23 రాష్ట్రాలకు చెందిన 300 మంది ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 190 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లోని రైతులతో పాటు పారిశుధ్ధ్యం, ఆరోగ్యం, పర్యావరణం తదితర వాటిపై వివిధ రకాల పనిముట్లు, నమూనాలను ఈ స్టాల్స్‌లో ప్రదర్శించారు. స్టాల్స్‌ను ప్రారంభించిన అనంతరం ఉపరాష్ట్రపతి వాటి పనితీరు, ఉపయోగాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి రాంక్రిపాల్‌యాదవ్, ఉపముఖ్యమంత్రి మహ్మద్‌ మహమూద్‌ ఆలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ డీజీ డాక్టర్‌ డబ్ల్యూఆర్‌.రెడ్డి, డిప్యూటీ డిజీ రాధికారస్తోగి తదితరులు పాల్గొన్నారు.

 పంట రక్షణకు లేజర్‌ పరికరం

చిన్న, సన్నకారు రైతులు పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అడవి పందులు, ఇతర జంతువుల కారణంగా 20 శాతం పంటను కోల్పొతున్నారు. దీని నివారణకు కరీంనగర్‌ జిల్లా పోలారం గ్రామానికి చెందిన బి.నాగరాజు లేజర్‌ టెక్నాలజీతో సౌండ్‌ సిస్టాన్ని కనుగోన్నాడు. కేవలం రెండు వేల రూపాయలతో పంటను కాపాడుకోవచ్చునని తెలుపుతున్నాడు. రాత్రి సమయంలో పంటలోకి ఏ జంతువులు వచ్చిన లేజర్‌ కిరణంతో అనుసంధానమైన స్పీకర్‌ ద్వారా చప్పుడు అవుతుందన్నారు. దీంతో జంతువులు పారిపోతాయన్నారు.

ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. గర్భిణులకు ప్రత్యేక  పౌష్టికాహారం హైదరాబాద్‌లోని మూడు పాఠశాలలకు చెందిన త్రిపురా, కీర్తి, జెస్సికాలు గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులతో పాటు నిరుపేదలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కొత్తగా చాక్లెట్‌ తరహాలో చిరుధాన్యాలు, విటమిన్స్‌తో కూడిన బిస్కెట్లను తయారు చేశారు. వారానికి మూడు బిస్కెట్లను తింటే గర్భిణులలో రక్తహీనత, ఫొలిక్‌ యాసిడ్, విటమిన్స్‌ల సమస్య ఉండదని తెలుపుతున్నారు. ప్రస్తుతం గర్భిణులు మందు బిల్లలను వేసేందుకు అనాసక్తి చూపుతారన్నారు.

గ్రామాల్లో వారికి సరైన పౌష్టికాహారం లేక పుట్టే పిల్లలు సైతం విటమిన్స్‌ లోపంతో అనారోగ్యంగా పుడతారని, ఈ బిస్కెట్లను తీసుకుంటే వాటిని నివారించవచ్చునని తెలుపుతున్నారు. ఇది కేవలం 20 రూపాయలకు చొప్పున దొరుకుతుందన్నారు.

 సోలార్‌ సెల్ఫ్‌ ఆటో వాటరింగ్‌ సిస్టమ్‌

డ్రిప్‌ ఇరిగేషన్‌తో పండిస్తున్న పంటలకు ఖర్చు తగ్గించేందుకు సోలార్‌ సెల్ఫ్‌ ఆటో వాటరింగ్‌ సిస్టమ్‌ను రూపొందిస్తున్నట్లు చర్లపల్లికి చెందిన మేఘన తెలిపారు. ఇది సోలార్‌ సిస్టమ్‌తో పూర్తిగా పని చేస్తుందన్నారు. నేలను తడిగా ఉంచడంతో పాటు  అతి తక్కువ ఖర్చు అవుతుందన్నారు.

చిటికెలో చిరుధాన్యాల డ్రింక్స్‌

కాఫీ, టీ తరహాలో చిరుధాన్యాలతో ఇన్స్‌టెంట్‌ డ్రింక్స్‌ను తయారు చేశారు. కాఫీ, టీలను అందించే యంత్రాన్ని ఉపయోగించి రాగి, జొన్న, తైదులు(అంబలి) తదితర మిలెట్‌ ద్రవాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఇది మార్కెట్‌లోకి విక్రయించేందుకు సిద్ధమవుతున్నామని హైదరాబాద్‌ ప్రగతినగర్‌కు చెందిన కళ్యాణ్‌ చక్రవర్తి తెలిపారు. అలాగే మైదాను ఉపయోగించకుండా రాగి, సజ్జ, జోన్న, మొక్కజోన్న బిస్కెట్లను తయారు చేస్తున్నామన్నారు. ఇక్రిశాట్‌తో మొట్టమొదటిసారిగా పేటెంట్‌ హక్కులను పొందామన్నారు. త్వరలో మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

ఎకో టూత్‌బ్రెష్‌తో ఆరోగ్యం మెండు

విజయనగరానికి చెందిన వి.రమేష్, తేజలు ఎకో టూత్‌బ్రెష్‌లను తయారు చేశారు. తాటి పీచును ఉపయోగించి ఈ బ్రెష్‌ను ఉపయోగించుకోవచ్చు. కట్టెతో తయారైన ఈ బ్రెష్‌కు తాటి పీచును జోడించారు. పీచు పాడైన అనంతరం తిరిగి తీసి వాడుకునే సౌకర్యం ఉంది. పది రోజులకు ఒక్కసారి పీచును తీసి వేసి కొత్తగా ఏర్పాటు చేసుకోవాలని రమేష్‌ తెలిపారు. రూ.10కి ఒక టూత్‌బ్రెష్‌ను విక్రయించేందుకు నిర్ణయించామన్నారు. ఒక్కసారి కొనుగోలు చేస్తే 3–4 సంవత్సరాల వరకు వాడవచ్చునన్నారు. పర్యావరణానికి సైతం ఇది ఎలాంటి హాని ఉండదన్నారు. ప్లాస్టిక్‌తో చేస్తున్న టూత్‌బ్రెష్‌లతో ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. చిగుళ్లకు సైతం ఈ బ్రెష్‌ల వల్ల ఎలాంటి హాని ఉండదన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

తాటిపీచుతో తయారుచేసిన బ్రష్‌లు,  పంట రక్షణకు లేజర్‌ పరికరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement