వెదురు బ్రష్‌లు ఎప్పుడైనా చూశారా..? | Bamboo Toothbrushes Awareness By VISVA Sustainable Foundation | Sakshi
Sakshi News home page

వెదురు బ్రష్‌లు ఎప్పుడైనా చూశారా..?

Published Mon, Nov 11 2024 11:33 AM | Last Updated on Mon, Nov 11 2024 1:19 PM

Bamboo Toothbrushes Awareness By VISVA Sustainable Foundation

సహజ సిద్ధంగా లభించే వెదురుతో తయారు చేసిన బ్రష్‌లు ఎప్పుడైనా చూశారా.. వినడానికి కాస్త కొత్తగా అనిపించినా ఈ రకం బ్రష్‌లు చాలా కాలంగా వినియోగంలో ఉన్నాయి. ఉదయం లేచి ప్లాస్టిక్‌తో తయారైన బ్రష్‌లు వినియోగిస్తున్నంతగా వెదురు బ్రష్‌లకు ప్రచారం లభించలేదు. అయితే గత కొన్నేళ్లుగా ప్రకృతి ప్రేమికులు మాత్రం ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించేందుకు వెదురు బ్రష్‌ల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. 

ప్లాస్టిక్‌ బ్రష్‌ల స్థానంలో వెదురు వస్తువులను అందుబాటులోకి తెస్తున్నారు. పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లు, తదితర ప్రదేశాల్లో తమవంతు కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ సుమారు 30 వేల మంది ఇలా ప్లాస్టిక్‌ నుంచి వెదురు బ్రష్‌లకు మారినట్లు పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌ నగరంలోని కేబీఆర్‌ పార్కు, యూసఫ్‌గూడ, కృష్ణకాంత్‌ పార్కు, మన్సూరాబాద్‌ పెద్దచెరువు, పీర్జాగూడ, భాగ్యనర్‌ నందనవనం పార్కు తదితర ప్రదేశాల్లో విశ్వ సస్టైనబుల్‌ ఫౌండేషన్‌ సభ్యులు వెదురు బ్రష్‌ల వినియోగం గురించి అవగాహన కల్పిస్తున్నారు. 

అంతేకాకుండా ఎక్స్‌చేంజ్‌ కార్యక్రమంలో సేకరించిన ప్లాస్టిక్‌ బ్రష్‌లను విశాఖలోని రివర్స్‌ ఇంజినీరింగ్‌ ప్లాంట్‌కు తరలించి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌ తయారీకి వినియోగిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకూ ఈ టూత్‌ బ్రష్‌ల ఎక్స్‌చేంజ్‌ కార్యక్రమం ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులోనూ ఈ తరహా కార్యక్రమాలను చేపడుతున్నారు. మనమూ ఈ తరహా వెదురు బ్రష్‌లను ట్రై చేద్దామా.. 

సామాజిక బాధ్యతగానే..
బ్రష్‌ అనేది నిత్యం ప్రతి ఒక్కరూ వినియోగించే వస్తువు. అయితే మార్కెట్‌లో ఎక్కువగా ప్లాస్టిక్‌తో తయారు చేసినవి ప్రాచుర్యంలో ఉన్నాయి. ఫలితంగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.

 ప్రతి రెండు నెలలకు ఒక బ్రష్‌ పడేసినా కోట్ల బ్రష్‌లు వ్యర్థాల్లో కలిసిపోతున్నాయి. వాటిని నియంత్రించాలన్నదే మా ఆలోచన. మేం వ్యాపార ధోరణతో కాకుండా సామాజిక బాధ్యతగా ఈ ప్రమోషన్‌ వర్క్‌ చేస్తున్నాం. శనివారం కేబీఆర్‌ పార్కు దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్‌కు వాకర్స్‌ వచ్చి విషయం అడిగి తెలుసుకున్నారు. చాలా మంది మేమూ మారతాం అంటున్నారు. బ్రష్‌లను తీసుకుంటున్నారు.     
– అనూప్‌కుమార్, వాలంటీర్, విశ్వ సస్టైనబుల్‌ ఫౌండేషన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement