ఐదేళ్ల వయసు నుంచే వంటకాలు ఆరంభం
ఇన్‌స్టా, యూట్యూబ్‌లో ప్రశంసల వర్షం
చిన్నారి చెఫ్ శ్రీనిత్యను మెచ్చుకుంటున్న నెటిజన్స్
చిన్నారులకు అన్నం తినిపించాలంటే తల్లులకు పెద్ద టాస్క్. కథలు చెప్పాలి.. బుజ్జగించాలి.. లాలించాలి.. అంత చేసినా చివరకు సగం వదిలేస్తుంటారు. ఇప్పుడైతే మొబైల్ ఫోన్‌లో ఏదో ఒక కార్టూన్లు, రైమ్స్ పెట్టి తినిపించేస్తున్నారు. అసలు పిల్లలు ఏం తింటున్నారో కూడా వారికి తెలియట్లేదు. అలా వారిపై ఫోన్ల ప్రభావం ఉంటోంది. ఇలాగే ఈ చిన్నారి కూడా అన్నం తిననంటూ మారాం చేస్తుండేదట. కానీ ఆ పాప తల్లిదండ్రులు మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించారు. ఆ పాపతోనే వంటలు చేయించడం ప్రారంభించారు. వాటిని షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి పలువురి ప్రశంసలు పొందుతున్నారు. – సాక్షి, హైదరాబాద్
లిటిల్ చెఫ్.. తినేటప్పుడు ఏడుపు మానిపించడానికి చేసిన ప్రయత్నం ఆ పాపకు వంటలపై మక్కువను పెంచేలా చేశాయి. దీంతో ప్రస్తుతం ఆ పాప మరింత యాక్టివ్‌గా తన హావభావాలతో వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ పాప పేరే శ్రీనిత్య. బాచుపల్లిలో నివాసం ఉంటున్న నవీన్ చారి, శైలజ కూతురైన శ్రీనిత్య వయసు 8 ఏళ్లు. ప్రస్తుతం మూడో తరగతి చదువుకుంటోంది. కానీ వంటలతో పెట్టే వీడియోలతో యూట్యూబ్‌లో స్టార్‌గా మారింది.
ఇదీ చదవండి: ఫెస్టివ్ సీజన్‌లో మెరిసివాలంటే ఇదిగో చిట్కా, చిటికెలో మ్యాజిక్!
చిన్నప్పటి నుంచే ఆసక్తి..
నాలుగేళ్ల వయసు నుంచే పాప కిచెన్‌లోని వస్తువులతో గడిపేదట. పాప ఆసక్తి చూసిన తండ్రి కిచెన్ సెట్ కొనిచ్చాడు. ఇక ఎప్పుడూ వాటితోనే కాలం గడుపుతూ ఉల్లాసంగా ఉండేదట. అయితే అన్నం తినకపోయేదట. దీంతో పాపకు అన్నంపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో చిన్న చిన్న వంట పాత్రల్లో వంటకాలు చేయించడం నేరి్పంచారట. ఆ పాప చేసిన వంటకాలను చాలా ఇష్టంతో తినడం గుర్తించిన నవీన్.. ఓ రోజు పాప వంటలు తయారుచేస్తున్న సమయంలో వీడియోలు తీసి, ఇన్‌స్టాలో పెట్టాడు. బంధువులు, స్నేహితుల నుంచి ప్రశంసలు రావడంతో వీడియోలు తీయడం కొనసాగించాడు. అందుకోసం డ్రెస్‌లతో పాటు అన్ని రకాల మినియేచర్ వంట పాత్రలనూ కొనుగోలు చేశాడు. దాదాపు 5 ఏళ్ల వయసు నుంచే పాపతో వెరైటీ వంటకాలు చేయించడం, వాటిని అప్‌లోడ్ చేయడం చేస్తున్నాడు. శ్రీనిత్య చిన్నప్పటి నుంచే బుజ్జిగా మాట్లడటమే కాకుండా ముఖంలో హావభావాలు అద్భుతంగా పలికిస్తోంది. దీంతో వీక్షకులు కూడా పాప వంటకాలకే కాకుండా ఆమె ముఖ కవళికలకు కూడా ఫిదా అవుతున్నారు.
ఆహారంపై ఆసక్తి పెంచాలి..
శ్రీనిత్యకు ఎలాగైనా ఆహారంపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో పాటు, వంటలు చేయడం ఎంత కష్టమో తెలియజేసేందుకు ఇలా వంటకాలు నేర్పించాం. వీడియోలు తీసేటప్పుడు ఎలా చెబితే అలా చేస్తుంటుంది. అస్సలు అలిసిపోదు. వీడియో షూటింగ్ అనగానే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అటు స్కూల్‌లో కూడా బాగా చదువుకుంటుంది. వారాంతాల్లో ఎక్కువగా వంటలు చేయిస్తూ వీడియోలు తీస్తుంటాం. పాప వంటలు చేస్తుంటే ముద్దుముద్దుగా అనిపిస్తుంటుంది. వంటలు చేసుకుంటూ పిల్లలకు ఆసక్తి కలిగించే కథలు, మంచి మాటలు చెప్పిస్తుంటాం.
– నవీన్ చారి నారోజు, నిత్య తండ్రి
Comments
Please login to add a commentAdd a comment