సాధారణంగా ఇళ్లలో ఆడవాళ్లే వంటలు చేస్తారు. వృత్తిపరంగా చూస్తే మగ చెఫ్‌లే ఎక్కువ కనిపిస్తారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉంటున్న చెఫ్ నిఖితా ఉమేష్‌ను అడిగితే... ‘‘నేను చెఫ్‌గా ఈ వృత్తిని ఎంచుకోవాలనుకున్నప్పుడు ‘గిన్నెలు కడగడానికి వెళుతున్నావా’ అని వ్యంగ్యంగా అన్నవాళ్లే ఇప్పుడు నా వంటలు రుచి చూసి చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు’’ అని వివరించారు. మాస్టర్ చెఫ్ ఇండియా (తెలుగు) జ్యూరీ ప్యానెల్‌లో స్థానం దక్కించుకున్న నిఖిత ఉమేష్ ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు.
‘‘చదువుకునే రోజుల్లో టీవీలో మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా చూసేదాన్ని. ఇంట్లో రకరకాల వంటలు ప్రాక్టీస్ చేసేదాన్ని. ఆ ఆసక్తితోనే హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ కోర్స్ చేశాను. దుబాయ్, సింగపూర్‌లలో శిక్షణ కోసం రెండేళ్లపాటు పనిచేశాను. పేస్ట్రీ ప్రొఫెషనల్ అండ్ మాస్టర్ చాకోలేటియర్‌గా హైదరాబాద్‌లో ఏడేళ్లు పని చేశాను. అలా హైదరాబాద్ పేస్ట్రీ చెఫ్‌గా, క్యుజిన్ డిజైనర్‌గా పేరొచ్చింది. ఏడాది క్రితం హైదరాబాద్‌లో మావారితో కలిసి మూడు పేస్ట్రీ బ్రాంచ్‌లు ఏర్పాటు చేశాను.
ఏ రంగమైనా మనల్ని మనం నిత్యం నిరూపించుకుంటూనే ఉండాలి. అందులోనూ ఆహారం విషయానికి వస్తే మరీ ప్రత్యేకం. ఇంట్లో తిన్నవారు ఆ వంట రుచి చెప్పేంతవరకు వంట వండినవారు ఒక తెలియని ఒత్తిడిని పీలవుతుంటారు. అలాగే, మేం ప్రతి రోజూ మా పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఎంతోమందికి చేరవవుతుంటాం. కాబట్టి, ఈ రంగంలోనూ ఒత్తిడి ఉంటుంది. నైపుణ్యంతోపాటు రుచిగా అందించాలనే భావన కూడా మమ్మల్ని గెలిపిస్తుంటుంది.
వర్క్ బాగుంటేనే...
ఐటీసీ హోటల్స్‌లో చెఫ్‌గా వర్క్ చేసినప్పుడు నా వయసు 22 ఏళ్లే. టీమ్‌లో పద్దెనిమిది మంది చెఫ్స్ ఉండేవారు. అందరూ మగవాళ్లే. అందులో సీనియర్స్ కూడా ఉండేవారు. నా వర్క్ బాగుంటేనే వారందరూ నన్ను గౌరవిస్తారు. ఈ విషయంలో ఎప్పుడూ నేను అలర్ట్‌గా ఉండేదాన్ని. వారికి తగిన సూచనలు ఇస్తూ ఏడేళ్లు పనిచేశాను. ఈ వర్క్‌లో శారీరక శ్రమతో పాటు టైమ్‌కు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుంది కాబట్టి కుటుంబం కూడా సపోర్ట్‌గా ఉండాల్సి ఉంటుంది. నిజానికి ఇళ్లలో వంటలు చేసేవాళ్లు ఆడవాళ్లే కానీ. హోటల్స్‌లో వృత్తిపరంగా చెఫ్‌లుగా ఉన్న మహిళల శాతం మాత్రం తక్కువగానే ఉంది.
కొత్తగా నేర్చుకుంటూ..
నేను బెంగళూరులో పుట్టి పెరిగాను. అమ్మ ప్రభ డిఫెన్స్‌లో సీనియర్ అడ్మిన్ ఆఫీసర్, నాన్న ఉమేష్ ఎల్‌ఐసీ రిటైర్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్. నేను కన్నడ అమ్మాయిని కాబట్టి తెలుగు రాదు. మాస్టర్ చెఫ్ ఇండియా అవకాశం వచ్చాక తెలుగు నేర్చుకున్నాను. అందుకు ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకున్నాను. చెఫ్ కమ్యూనిటీ నుంచి ఎవరో నన్ను రికమండ్ చేసి ఉంటారు. ఆ విధంగా నాకు జ్యూరీలో సభ్యురాలిగా ఉండే అవకాశం లభించింది. పనిలో చూపించే శ్రద్ధ, తపన మనల్ని విజయమార్గంలో తప్పక నడిపిస్తుంది’’ అని వివరించారు ఈ మాస్టర్ చెఫ్. ఆమె అనుభవ పాఠాలు మరికొందరికి విజయ సోపానాలు అవుతాయి కదా...
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment