
నేడు నేషనల్ సైన్స్ డే
‘ఆడపిల్లలకు పెద్ద చదువులు ఎందుకు?’ అనుకునే కాలం. ‘ఆడపిల్లలకు సైన్స్ కష్టం’ అనుకునే కాలం. ఎన్నో అనుమానాలు, అవమానాలు, అడ్డంకులను అధిగమించి ఆ తరం మహిళలు సైన్స్‌లో సత్తా చాటారు. ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోషియన్’ ను స్థాపించారు. గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్న ఈ సంస్థ ఈ తరం మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
‘కొందరు మహిళలు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. మేము మాత్రం అలా ఎప్పుడూ భయపడలేదు. మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడ్డాం’ అంటుంది 91 సంవత్సరాల డా.సుధా పాధ్యే. ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ వ్యవస్థాపకులలో ఆమె ఒకరు.
ల్యాబ్‌లో 76 ఏళ్ల డాక్టర్ భక్తవర్ మహాజన్
ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’కు దేశవ్యాప్తంగా పదకొండు శాఖలు ఉన్నాయి. రెండు వేలమంది సభ్యులు ఉన్నారు. ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే రకరకాల కార్యక్రమాల్లో పిల్లలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొంటారు.
ఇంటిపనికి, వృత్తిపనికి మధ్య సమన్వయం చేసుకోలేని ఎంతోమంది మహిళలకు, కొత్తగా వృత్తిలోకి వచ్చిన మహిళలకు ఆర్గనైజేషన్‌కు సంబంధించి డే కేర్ అండ్ హెల్త్ కేర్ సెంటర్, చిల్డ్రన్స్ నర్సరీ, 160 పడక ల విమెన్స్ హాస్టల్ అండగా ఉంటుంది.
‘ఈ సంస్థ మాకు రెండో ఇల్లు’ అంటుంది అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు డా.రీటా ముఖోపాధ్యాయ.
ముప్ఫై తొమ్మిది ఏళ్ల డా. సెరెజో శివ్‌కర్ నుంచి 81 ఏళ్ల డా.సునీత మహాజన్ వరకు శాస్త్రవేత్తల మధ్య ఎంతో వయసు తేడా ఉండవచ్చు. అయితే సైన్స్ అద్భుతాల పట్ల ఉన్న ఆసక్తి, గౌరవం సభ్యులందరినీ ఒకేతాటిపై తీసుకువచ్చింది.
‘కొద్దిమంది మా సంస్థ విలువను గుర్తించడానికి ఇష్టపడక పోవచ్చు. ఆడవాళ్లు కాలక్షేప కబుర్లు చెప్పుకునే కార్యాలయం అని వెక్కిరించవచ్చు. అయితే అలాంటి వారు మా సంస్థ కార్యక్రమాలను దగ్గరి నుంచి చూపినప్పుడు వారిలో తప్పకుండా మార్పు వస్తుంది’ అంటుంది డా. రీటా ముఖోపాధ్యాయ.
‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్ ఏం సాధించింది?’ అనే ఏకైక ప్రశ్నకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన జవాబులు ఉన్నాయి.
సైన్స్ అంటే భయపడే అమ్మాయిలలో ఆ భయాన్ని పోగొట్టి సైన్స్‌ను ఇష్టమైన సబ్జెక్ట్ చేయడం నుంచి కుటుంబ బాధ్యతల భారం వల్ల ఉద్యోగం వదులుకోవాలనుకున్న వారికి అండగా నిలబడి పరిష్కార మార్గం చూపడం వరకు ఈ సంస్థ ఎన్నో చేసింది ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ అనేది ఎన్నో తరాల మహిళా శాస్త్రవేత్తల అనుభవ జ్ఞానసముద్రం. ఈ తరానికి దారి చూపే చుక్కాని.
ఎన్నో అనుభవాలు,
మరెన్నో జ్ఞాపకాలుఅసోసియేషన్ బిల్డింగ్‌లోకి అడుగు పెడితే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఎందరో మహిళా శాస్త్రవేత్తలు, ఎన్నో అనుభవాలు, విలువైన జ్ఞాపకాలకు ఈ భవనం చిరునామా. ఇక్కడికి వస్తే కాలం వెనక్కి వెళ్లవచ్చు. ముందున్న కాలాన్ని చూడవచ్చు. స్థూలంగా చె΄్పాలంటే ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ సైన్స్ పట్ల ఈ తరంలో ఆసక్తిని, అనురక్తిని రేకెత్తించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.
– డా. సెరెజో శివ్‌కర్, శాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment