Indian womens
-
Oscars 2025: యూకే ఓకే చెప్పిన ఈక్వాలిటీ కథ..
మన దేశంలో అందరికీ సమాన న్యాయం జరగడం సులభమేనా?న్యాయానికి కులం, మతం,ప్రాంతం ఉంటాయా?కంటికి కనిపించేది, చెవికి వినిపించేదంతా న్యాయమేనా?సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’ సంధించే ప్రశ్నలివి. యు.కె. ప్రభుత్వ నిర్మాణ భాగస్వామ్యంతో నిర్మితమైన ఈ సినిమాను ఇప్పుడు ఆ దేశం తన అఫిషియల్ ఎంట్రీగా ఆస్కార్‌కు పంపింది. ‘లాపతా లేడీస్’తో పాటు ఆస్కార్‌లో ‘సంతోష్’ కూడా భారతీయ మహిళల కథను పోటీకి నిలపనుంది.ఈ వ్యవస్థ ఎలా నడుస్తోందో వ్యవస్థతో తలపడినప్పుడే సగటు మనిషికి తెలుస్తుంది. సామాజిక వ్యవస్థలో తన కంటే పై వర్గం ఎలా వ్యవహరిస్తుందో తెలిసొస్తే పాలనా వ్యవస్థలో తన కంటే పై అధికారి ఆ పై అధికారి ఎలా వ్యవహరిస్తారో తెలిసొస్తుంది. ప్రతి వ్యవస్థకు వర్షించే కళ్లు, కాటేసే కోరలు ఉంటాయి.ఎవరి మీద వర్షించాలో, ఎప్పుడు కాటేయాలో దానికి తెలుసు. అది మారాలని అందరికీ ఉంటుంది. వ్యవస్థ కూడా తాను మారాలని అనుకోవచ్చు. కాని మారదు. మారాలనుకున్నా మనుషులు మారనివ్వరు. ఏదో కొద్ది వెసులుబాటులో కాసింతో కూసింతో గాలి ఆడి పనులు అవుతుంటాయి అంతే.డాక్యుమెంటరీ మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ సినిమా మన భారతీయ వ్యవస్థ– అది కుల వ్యవస్థ కాని పాలనా వ్యవస్థ గాని ఎలా వ్యవహరిస్తుందో ఒక బాలిక చావు ఆధారంగా చర్చిస్తుంది. ఒక మహిళా కానిస్టేబుల్ కళ్లతో సామాజిక వ్యవస్థను, న్యాయ వ్యవస్థను చూసి ప్రేక్షకుల మనసుల్లో ప్రశ్నలు నాటుతుంది.కథ ఏమిటి?‘సంతోష్’ సినిమాలో ప్రధాన పాత్రధారి సంతోష్ సైని అనే మహిళా పోలీస్ కానిస్టేబుల్. ఈ పాత్రను చాలా ప్రతిభావంతమైన నటిగా పేరు పొందిన షహానా గోస్వామి పోషించింది. ఉత్తరప్రదేశ్‌లాంటి ఒక కల్పిత రాష్ట్రంలో సంతోష్‌కు ఒక కానిస్టేబుల్‌కు పెళ్లవుతుంది. కానీ డ్యూటీలో ఉండగా భర్త హఠాత్తుగా మరణిస్తాడు. ‘నా కొడుకును మింగింది’ అని అత్తగారు సూటి పోటి మాటలంటే అమ్మ గారింట్లోని వారు తిరిగొచ్చిన కూతురిని రకరకాలుగా బాధలు పెడతారు. దాంతో గత్యంతరం లేక భర్త మరణం వల్ల వచ్చే కారుణ్య నియామకంలో ఆమె కానిస్టేబుల్ అవుతుంది. కాని పోలీసులంటే బయట ఉండే మనుషుల్లాంటి వారేనని అక్కడ దారుణమైన పురుషస్వామ్యం, కుల పెత్తనం, అవినీతి, మత ద్వేషం ఉంటాయని తెలుసుకుంటుంది. ఆ సమయంలోనే ఒక అట్టడుగు వర్గం బాలిక శవం ఊరి బావిలో దొరుకుతుంది. అగ్ర కులాల వారే ఆమెను చంపి బావిలో వేశారని గ్రామస్తులు విచారణకు వెళ్లిన సంతోష్‌కు చెబుతారు. అక్కడి నుంచి ఆమె ఎలాంటి ప్రయాణం చేసిందనేదే కథ.మహిళలపై హింసకు వ్యతిరేకంగాలండన్లో పుట్టి పెరిగిన బ్రిటిష్ ఇండియన్ సంధ్యా సూరి గతంలో ‘ఐ ఫర్ ఇండియా’ డాక్యుమెంటరీలో ‘ఫీల్డ్’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో చాలా అవార్డులు పొందింది. భారతదేశంలో స్త్రీలపై సాగే హింస మీద ఒక డాక్యుమెంటరీ తీయాలని ఇండియాలోని ఎన్జిఓలతో పని చేస్తున్నప్పుడు ‘నిర్భయ’ ఘటన ఆమెను హతాశురాలిని చేసింది. ఆ సమయంలో నిరసనలు చేస్తున్న స్త్రీలను అదుపు చేసే మహిళా కానిస్టేబుళ్ల కళ్లలోని బాధ, ఆవేదన చూసినప్పుడు ఆమెకు ‘సంతోష్’ సినిమా తీయాలని అనిపించింది. అయితే దీని నిర్మాణం కోసం ఆమె యు.కె/జర్మన్/ఫ్రెంచ్ దేశాల ఫిల్మ్ ఫండింగ్ ఏజెన్సీల భాగస్వామ్యం కోరింది. సునీతా రాజ్వర్ (పంచాయత్ ఫేమ్), సంజయ్ బిష్ణోయ్ తదితరులు ఇందులో నటించారు.ఆస్కార్ ఎంట్రీమేలో జరిగిన 77వ కాన్స్‌లో బహు ప్రశంసలు పొందిన ‘సంతోష్’ను 97వ ఆస్కార్ అవార్డుల పోటీలో తన దేశ అఫిషియల్ ఎంట్రీగా పంపాలని యూకే భావించడం ఈ కథకు, దర్శకురాలికి దక్కిన గౌరవంగా భావించాలి. ఇప్పటికే మన దేశం నుంచి వెళుతున్న లాపతా లేడీస్ స్త్రీల కథకాగా ‘సంతోష్’ కూడా స్త్రీల కథే కావడం విశేషం.ఇవి చదవండి: మునుపటి కాలం కాదు ఇది, కానీ.. -
ప్యారిస్ ఒలింపిక్స్-2024: బరిలో ఉన్న తెలుగు అమ్మాయిలు వీరే (ఫొటోలు)
-
Paris Olympics: ఒలింపిక్స్‌కు భారత ఆర్చరీ జట్లు అర్హత
న్యూఢిల్లీ: మూడు క్వాలిఫయింగ్ టోరీ్నల ద్వారా వీలుకాకపోయినా వరల్డ్ ర్యాంకింగ్ ఆధారంగా భారత పురుషుల, మహిళల ఆర్చరీ జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. క్వాలిఫయింగ్ టోరీ్నల ద్వారా ఇప్పటికే ఒలింపిక్ బెర్త్‌లు దక్కించుకున్న 10 జట్లను మినహాయించి... వరల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండు అత్యుత్తమ జట్లకు మిగిలిన రెండు బెర్త్‌లను కేటాయించారు. పురుషుల విభాగంలో భారత్, చైనా... మహిళల విభాగంలో భారత్, ఇండోనేసియా జట్లకు ఈ అవకాశం లభించింది. ఫలితంగా వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ పురుషుల, మహిళల టీమ్ విభాగాల్లో, వ్యక్తిగత విభాగాల్లో, మిక్స్డ్ టీమ్ విభాగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ పారిస్ ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో (టీమ్, వ్యక్తిగత, మిక్స్డ్) పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 44 ఏళ్ల తరుణ్‌దీప్ రాయ్... మాజీ నంబర్‌వన్ దీపికా కుమారి నాలుగోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనున్నారు. మహిళల వ్యక్తిగత విభాగంలో, మిక్స్డ్ విభాగంలో భజన్ కౌర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. భారత పురుషుల ఆర్చరీ జట్టు: తరుణ్‌దీప్ రాయ్, బొమ్మదేవర ధీరజ్, ప్రవీణ్ జాధవ్. భారత మహిళల ఆర్చరీ జట్టు: దీపికా కుమారి, భజన్ కౌర్, అంకిత. -
SKY IS THE LIMIT: నాన్న ఇచ్చిన రెక్కలు
ఇంటి గడప దాటకూడని ఆంక్షలు అక్కడా ఇక్కడా ఇంకా కొనసాగుతున్నా నేడు భారతీయ యువతులు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. ఎగురుతున్నారు. కొడుకు ఎంతో కూతురూ అంతే అనే ఎరుక కలిగిన తల్లిదండ్రులు వారిని ప్రోత్సహిస్తున్నారు. అమ్మ ఆశీస్సులు ఉన్నా నాన్న ప్రోత్సాహమే తమను ముందుకు నడిపిందని ఈ మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్లు అంటున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ల విజయగాథలు ఇవి.నాన్న మాటే ఇంధనంనా పేరు శ్రీప్రియ మోదలే. మాది మహారాష్ట్రలోని పూణే. నాన్న శ్రీకాంత్ మోదలే. అమ్మ ప్రజ్ఞ మోదలే. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే సంతానం. అయినా కూడా మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మా నాన్న పెట్రోల్ పంపులకు సంబంధించిన చిన్న వ్యాపారం చేస్తారు. అమ్మ ఇంట్లోనే ఆహారం తయారు చేసి అమ్ముతుంది. తండ్రి శ్రీకాంత్, తల్లి ప్రజ్ఞతో శ్రీప్రియ ఇలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా నా తల్లిదండ్రులు నన్నెప్పుడూ నిరాశపర్చలేదు. మా నాన్నైతే నీకు నచ్చిన వృత్తిలో వెళ్లు అని వెన్నుతట్టి ప్రోత్సహించారు. నేను పూణే యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత ఎట్మాస్ఫియరిక్ సైన్సెస్‌లో ఎంటెక్ చేశాను. ఆ తర్వాత రీసెర్చ్ అసోసియేట్‌గా, స్విమ్మింగ్ కోచ్‌గా, జాతీయ స్థాయి కరాటే ప్లేయర్‌గా, సెల్ఫ్ డిఫెన్స్ ఇన్ స్ట్రక్టర్‌గా రకరకాల పనులు చేశాను. ఇన్ని చేసినా ఎక్కడో అసంతృప్తి నాలో ఉండేది. దేశసేవలో భాగం అయ్యేందుకు నాకున్న బలాలను, అవకాశాలను ఆలోచించాను. దేశ రక్షణ కోసం పనిచేసే ఉద్యోగం కరెక్ట్ అనిపించింది. అందుకే నేను భారత వాయుసేన వైపు రావాలని నిర్ణయించుకుని కష్టపడ్డాను. చివరకు ఫ్లయింగ్ ఆఫీసర్‌గా శిక్షణ పూర్తి చేయడం సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. వాయుసేన ఆపరేషన్స్ అన్నింటికీ వాతావరణ సమాచారం అత్యంత కీలకమైంది. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందించే కీలక బాధ్యతలు దక్కడం నాకు సంతోషంగా ఉంది. – శ్రీప్రియ, ఫ్లయింగ్ ఆఫీసర్నాన్నే నాకు స్ఫూర్తినా పేరు నందినీ సౌరిత్. హర్యానాలోని పల్వల్ జిల్లా మా స్వస్థలం. నాన్న శివ్‌నారాయణ్ సౌరిత్, అమ్మ సంతోషికుమారి సౌరిత్. మా నాన్న ఫ్లయిట్ లెఫ్టినెంట్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో ఆయనే నాకు స్ఫూర్తి. మా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క సంతానం. పైగా అమ్మాయిని అయినా నాన్న నాకు ఎప్పుడూ ఎలాంటి ఆంక్షలూ లేకుండా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. మా నాన్న కోరిక వల్లే నేను ఎయిర్ ఫోర్స్‌లో చేరాను.తండ్రి శివ్‌నారాయణ్, సంతోషికుమారిలతో నందిని సౌరిత్ ‘నా కూతురు ఎంతో ఉన్నతంగా అందరికంటే ఎత్తులో ఉండాలి’ అని నాన్న నాకు చెబుతూ ఉండేవారు. అదే నాలో చిన్ననాటి నుంచి స్ఫూర్తి నింపింది. నేను ఎన్సీసీ కేడెట్ను. జాతీయ స్థాయిలో అథ్లెట్‌ను. భారత వాయుసేనలో చేరిన తర్వాత శిక్షణ సమయంలో ఇవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. కఠోర శిక్షణ పూర్తి చేసి ఈ రోజు నేను ఫ్లయింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. నా తల్లిదండ్రులు ఇప్పుడు నా పక్కన ఉండడం నాకు మరింత సంతోషంగా ఉంది. నేను శిక్షణలో ఆర్డర్ ఆఫ్ మెరిట్‌తో ఎడ్యుకేషన్ బ్రాంచ్‌కు ఎంపికయ్యాను. వాయుసేనకు సంబంధించిన కీలక బాధ్యతలు అవి. – నందినీ సౌరిత్, ఫ్లయింగ్ ఆఫీసర్నాన్నే దేశసేవ చేయమన్నారుమాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. శామిలి జిల్లా. పుట్టిపెరిగింది అంతా ఢిల్లీలోనే. అక్కడే కేంద్రీయ విద్యాలయ్‌లో చదువుకున్నాను. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకామ్ పూర్తి చేశాను. మా నాన్న రవీందర్‌కుమార్ ఇన్‌కమ్‌ట్యాక్స్ ఆఫీసర్, అమ్మ అంజేష్ గృహిణి. ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి ముందు నేను ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండేదాన్ని.‘ఆ ఉద్యోగాలు చేసేందుకు అందరూ ఉత్సాహపడతారు. కాని దేశ సేవ కోసం కొందరే ముందుకు వస్తారు. నువ్వు దేశ సేవ చేయమ్మా’ అని నాన్న అన్నారు. తండ్రి రవీందర్‌కుమార్, తల్లి అంజేష్లతో మాన్వి నా మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికయ్యాను. మా కుటుంబంలో భారత సైన్యంలోకి వచ్చిన మొదటి ఆఫీసర్ని నేనే. అందుకు నాకు గర్వంగా ఉంది. శారీరకంగా, మానసికంగా ఎంతో గొప్ప ఉద్యోగం ఇది. అకాడమీకి రాక ముందు, ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత నాలో నేనే ఎంతో మార్పు గమనించాను. ఇక్కడ వృత్తిగతంగానే కాదు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఎన్నో అంశాలు నేర్చుకున్నాను. నాపై నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను అకౌంట్స్ బ్రాంచ్‌లో ఉత్తమ కేడెట్‌గా నిలిచాను. నాకు ఇప్పుడు అకౌంట్స్ బ్రాంచ్ ఇచ్చారు. – మాన్వి, ఫ్లయింగ్ ఆఫీసర్ -
ఎన్ఆర్ఐ పెళ్లిళ్ల నమోదు తప్పనిసరి
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు), భారత సంతతికి చెందిన విదేశీయులు(ఓసీఐ)–భారతీయ పౌరుల మధ్య మోసపూరిత వివాహాల పెరుగుతండటం ఆందోళనకరమని న్యాయ కమిషన్ పేర్కొంది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి సమగ్రమైన చట్టం తేవాలని కేంద్రానికి సూచించింది. భారతీయులు–ఎన్ఆర్ఐలు, భారతీయులు–ఓసీఐల మధ్య పెళ్లిళ్లను విధిగా రిజిస్టర్ చేసే విధానం ఉండాలని స్పష్టం చేసింది. జస్టిస్ రితూరాజ్ అవస్థీ నేతృత్వంలోని లా కమిషన్ ‘లా ఆన్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ రిలేటింగ్ టు ఎన్ఆర్ఐ, ఓసీఐ’ అంశంపై అధ్యయనం చేసింది. ఇటీవల కేంద్ర న్యాయ శాఖకు ఇటీవలే నివేదిక సమర్పించింది. దీనిపై కేంద్రం తేదలచిన చట్టం పెళ్లిళ్లకు వివాదాలన్నింటినీ పరిష్కరించేలా సమగ్రంగా ఉండాలని అభిప్రాయపడింది. మోసపూరిత ఎన్ఆర్ఐ వివాహాలతో భారత యువతులు అధికంగా నష్టపోతున్నారని గుర్తుచేసింది. విడాకులు, భాగస్వామికి భరణం, కస్టడీ, చిన్నారుల జీవన వ్యయాన్ని భరించడం వంటి అంశాలను చట్టంలో చేర్చాలని సిఫార్సు చేసింది. వైవాహిక స్థితిని కచి్చతంగా వెల్లడించేలా పాస్‌పోర్టు చట్టం–1967లో సవరణలు చేయాలని పేర్కొంది. పాస్‌పోర్టులో మ్యారేజీ రిజి్రస్టేషన్ నెంబర్ కూడా ఉండాలని తెలిపింది. ఇద్దరు జీవిత భాగస్వాముల పాస్‌పోర్టులను అనుసంధానించాలని, దీనివల్ల మోసాలను అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. -
‘అర్జున’ అందుకున్న ఇషా
సాక్షి, న్యూఢిల్లీ: భారత మహిళా షూటింగ్ రైజింగ్ స్టార్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 2023 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను బుధవారం అందుకుంది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ అవార్డును ఇషా సింగ్‌కు బహూకరించారు. ఈనెల 9న రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అయితే అదే సమయంలో ఇషా జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతుండటంతో ఆమె హాజరుకాలేకపోయింది. ఇషాకు ‘అర్జున’ అందించిన అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇషా పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. -
ప్రధానిలో నిర్దయ చూస్తే బాధేస్తోంది: రాహుల్
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఉదంతంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో కేంద్రం తీరుకు నిరసనగా నిరసనగా ఖేల్ రత్న, అర్జున అవార్డులను రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఢిల్లీలో రోడ్డుపై వదిలేయడం తెలిసిందే. ఆ వీడియోను రాహుల్ ఆదివాంర ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ప్రధానిని వైఖరిని ఎండగట్టారు. ‘‘భారతదేశంలోని ప్రతి అమ్మాయి ఆత్మాభిమానానికి అత్యంత విలువ ఇస్తుంది. అవార్డులు, పురస్కారాలన్నీ ఆ తర్వాతే. ఇలాంటి ధైర్యశాలుల కంటే ‘బాహుబలి’ వంటి పరపతి గల వ్యక్తుల నుంచి పొందే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయా?’’ అని మోదీని ప్రశ్నించారు. ‘‘ప్రధాని అంటే దేశ రక్షకుడు. ఇంతటి తీవ్రమైన అంశంలో ఇంత నిర్దయగా వ్యవహరించడం చాలా బాధేస్తోంది’’ అన్నారు. -
ఫోర్బ్స్ జాబితాలో నలుగురు భారతీయులకు చోటు!
ప్రతి ఏడాది అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ప్రపంచంలోని వంద మంది శక్తిమంతమైన మహిళల జాబితాను విడుదల చేస్తుంది. ఈసారి ఆ జాబితాలో నలుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి చోటు దక్కించుకుని 32వ స్థానంలో నిలిచారు. ఇక ఆమె తోపాటు మరో ముగ్గురు భారతీయ మహిళల్లో..హెచ్‌సీఎల్ కార్పోరేషన్ సీఈవో రోష్నీ నాదర్ మల్హోత్రా(60వ స్థానం), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమ మొండల్(70వ స్థానం), బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా(76వ స్థానం)లో ఉన్నారు. ఇక సీతారామన్ 2019లో భారతదేశ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. ఆమె కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నారు. అంతేగాక రాజకీయాల్లోకి రావడానికి ముందు సీతారామన్ యూకే ఆధారిత అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్లోనూ, BBC వరల్డ్ సర్వీస్‌లోనూ విభిన్న రోల్లో సేవలందించడమే గాక జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా పనిచేశారని ఫోర్బ్స్ పేర్కొంది. అలాగే హెచ్‌సీఎల్ కార్పోరేషన్ సీఈవో మల్లోహత్రా ప్రముఖ పారిశ్రామికవేత్త శివ్ నాడార్ కుమార్తె. ఆమె హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్‌గా, కంపెనీకి సంబంధించిన అన్ని వ్యూహాత్మక నిర్ణయాలకు చాకచక్యంగా తీసుకుంటుందని వెల్లడించింది ఫోర్బ్స్. ఆమె తర్వాత స్థానంలో నిలిచిన మోండల్ సెయిల్‌కి మొదటి మహిళా చైర్పర్సన్ మాత్రమే గాక నాయకురాలిగా బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాదిలోనే మూడు రెట్లు లాభలు అందుకున్నారు. ఆమె ఉక్కు తయారీ రంగంలో అనూహ్యంగా ఆర్థిక వృద్ధిని గడించి ఉక్కులాంటి మహిళ అని నిరూపించుకుందని ఫోర్బ్స్ పేర్కొంది. కాగా, ఫోర్బ్స్ ప్రకారం ఇది నాలుగు కీలక కొలమానాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయిస్తుంది. వాటిలో.. డబ్బు, మీడియా, ప్రభావం, ప్రభావ రంగాలు తదితరాలను పరిగణలోనికి తీసుకుంటుంది. (చదవండి: ఎవరీ ప్రేరణ దేవస్థలి? ఏకంగా యుద్ధ నౌకకే అధికారిణిగా..!) -
కల్లోల ఇజ్రాయెల్‌లో ఇండియన్ సూపర్ ఉమెన్
బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు... అనుకునే భయానక పరిస్థితుల్లో ఉండి కూడా, తమకు ఏమైనా ఫరవాలేదు, నిస్సహాయులైన వృద్ధదంపతులకు ఏమీ కాకూడదని వారిని కంటికి రెప్పలా కాపాడారు ఇజ్రాయెల్‌లో హోమ్ నర్స్‌లుగా పనిచేస్తున్న కేరళకు చెందిన సబిత, మీరా మోహన్‌లు... దక్షిణ ఇజ్రాయెల్... గాజా సరిహద్దుకు రెండో కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్ ఓజ్ కిల్బట్జ్ పట్టణంలో ఒక ఇంట్లో... 85 సంవత్సరాల షౌలిక్, 76 సంవత్సరాల రహెల్ దంపతులకు నలుగురు పిల్లలు. పిల్లలు వేరు వేరు ప్రాంతాలలో ఉంటున్నారు. రహెల్ అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెను చూసుకోవడానికి ఆరోజు ఆ ఇంట్లో సబిత, మీరా మోహన్ అనే ఇద్దరు హోమ్నర్స్లు ఉన్నారు. ఉదయం ఆరున్నర ప్రాంతంలో సైరన్ మోత వినిపించింది. ప్రజలు బాంబ్ షెల్టర్లలో తల దాచుకోవాలని చెప్పే సైరన్ అది. ‘ఆ ఉదయం సైరన్ మోగేసరికి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. సెకండ్ల వ్యవధిలో సేఫ్టీరూమ్లోకి వెళ్లాలి. ఇంతలో రహెల్ కుమార్తె నుంచి ఫోన్ వచ్చింది. బయట పరిస్థితి భయానకంగా ఉంది అని ఆమె చెప్పింది. మాకు ఏం చేయాలో తోచలేదు. ఇంటిముందు, వెనుక తలుపులకు తాళాలు వేసి అమ్మానాన్నలను తీసుకొని, పాస్‌పోర్ట్, డైపర్లు, యూరిన్ పాట్, మందులతో సెక్యూర్ రూమ్‌లోకి వెళ్లాలని ఆమె చెప్పింది. షౌలిక్, అనారోగ్యంతో ఉన్న రహేల్‌ను నడిపించుకుంటూ షెల్టర్ రూమ్‌లోకి వెళ్లాం. ఈలోపే మిలిటెంట్లు ఇంట్లోకి ప్రవేశించారు. అద్దాలు బద్దలు కొట్టారు. వస్తువులు ధ్వంసం చేశారు. షెల్టర్రూమ్పై కాల్పులు జరుపుతున్నారు. ఐరన్ డోర్ వెనకే మా శరీరాలను గట్టిగా ఆనించి ఎన్నో గంటలపాటు నిల్చున్నాం. అదృష్టవశాత్తు ఐరన్ డోర్ ధ్వంసం కాలేదు. ధ్వంసం అయి ఉంటే ఎవరి ప్రాణాలు మిగిలేవి కావు’ అంటూ ఆ భయానక ఘటనను గుర్తు తెచ్చుకుంది 39 సంవత్సరాల సబిత. కేరళకు చెందిన సబిత, మీరా మోహన్ల సాహసం, మానవత్వం గురించి దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ‘ఇండియన్ సూపర్ ఉమెన్’ అంటూ ప్రశంసించింది. -
మహిళా సాధికారతకు చంద్రయాన్–3 చిహ్నం
న్యూఢిల్లీ: ఎటువంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించే నవ భారత స్ఫూర్తికి చంద్రయాన్–3 మిషన్ ఒక ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. మహిళా సాధికారతకు ఈ కార్యక్రమం సజీవ ఉదాహరణ అని కొనియాడారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అనంతమైన అంతరిక్షాన్ని భారతీయ మహిళలు సవాల్ చేస్తున్నారని అన్నారు. ‘ఇండియా డాటర్స్ ఇంత ప్రతిష్టాత్మకంగా ఉంటే భారత్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోగలరు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధి మన దేశ స్వాభావిక లక్షణంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదైనా ఉంటే మహిళా శక్తితో సుసాధ్యంగా చేయొచ్చు. చంద్రయాన్–3 మిషన్ దీనికి నిలువెత్తు ఉదాహరణ’ అని చెప్పారు. చంద్రయాన్ మిషన్‌లో ఎందరో మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రత్యక్షంగా భాగస్వాములైన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. అందరినీ కలుపుకొనిపోయేలా జీ20 సదస్సు ‘సెపె్టంబర్లో ఢిల్లీలో జరిగే జీ20 సదస్సు అందరినీ కలుపుకొని పోయేలా ఉంటుంది. ఈ సదస్సుకు భారత్ నేతృత్వం వహించడమంటే ప్రజల ఆధ్వర్యంలో జరుగుతున్నట్టే. భారత్ సత్తా సెపె్టంబర్లో అందరికీ తెలుస్తుంది. ప్రపంచ క్రీడల్లో భారత్ రాణించాలి. అందుకు ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దేశీయ క్రీడలైన హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడల్లో మనం వెనకబడకూడదు. సెపె్టంబర్ నుంచి దేశంలో ప్రతీ ఇంటి నుంచి, ప్రతీ గ్రామం నుంచి మట్టిని సేకరించే కార్యక్రమం జరుగుతుంది. ఆ మట్టిని అమృత కలశాల్లో భద్రపరిచి అమృత్ కలశ యాత్ర నిర్వహిస్తాం. ఆ మట్టితో ఢిల్లీలో అమృత వాటిక నిర్మాణం జరుగుతుంది’ అని మోదీ అన్నారు. తెలుగు కూడా ప్రాచీన భాషే ‘మన సంస్కృతి సంప్రదాయాలతో మమేకం కావాలంటే మాతృభాష శక్తిమంతమైన మాధ్యమం. తెలుగు భాష సాహిత్యంలో వారసత్వ సంపదలో ఎన్నో వెలకట్టలేని రత్నాలు దాగున్నాయి’ అంటూ తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని మోదీ కొనియాడారు. ‘సంస్కృతం మాదిరిగా తెలుగు ప్రాచీన భాషే. ప్రతీ ఏడాది ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం’ అని గుర్తుచేసిన ప్రధాని మోదీ తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
కొన్ని ఆల్ఫాబెట్స్‌తో ఆస్టియోపోరోసిస్ నివారణ ఇలా!
ఆస్టియోపోరోసిస్ కేసులు భారతీయుల్లో చాలా ఎక్కువ. అందునా మహిళల్లో! యాభై ఏళ్లు దాటాక మహిళల్లో దాదాపు 40% నుంచి 50% మందిలో ఇది కనిపించడం చాలా సాధారణం. దీన్ని బట్టే మన దేశంలో దాని తీవ్రత ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు. మెనోపాజ్ దాటాక కనీసం 40% మందిలో ఇది కనిపిస్తుంది. ఆస్టియోపోరోసిస్ వచ్చిన మహిళల్లో మూడింట ఒక వంతు మందికి ఏదో ఒక దశలో తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిన కేసులు కనిపిస్తాయి. కొన్ని ఆల్ఫాబెట్స్ సాయంతో ఆస్టియోపోరోసిస్‌ను తేలిగ్గా నివారించుకోవచ్చు. సీ, డీ, ఈ, ఎఫ్, జీ...లతో నివారణ ఎలాగంటే...? ఆస్టియోపోరోసిస్ నివారణ కోసం అవసరమైన ప్రాథమిక అంశాలను చాలా సులభంగా గుర్తు పెట్టుకోవచ్చు. ఇంగ్లిష్ అక్షరాలు వరుసగా సీ,డీ,ఈ,ఎఫ్,జీ గుర్తు పెట్టుకుంటే, వాటిని బట్టి ఏంచేయాలో సులువుగా తెలుస్తుంది. ‘సి’ ఫర్ క్యాల్షియమ్ – దీన్ని ఎక్కువగా తీసుకోవాలి. ‘డి’ ఫర్ విటమిన్ డి – తగినంత అందేలా చూడాలి. ‘ఈ’ ఫర్ ఎక్సర్సైజ్ – శరీరాన్ని కాస్తంత శ్రమపెట్టి ఎక్సర్సైజ్ చేయించాలి. ‘ఎఫ్’ ఫర్ ‘ఫాల్స్’–ఇంగ్లిష్‌లో పడిపోవడం. కాస్తంత వయసు పైబడ్డాక బాత్రూమ్ల వంటి చోట్ల, ఇతరత్రా కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ‘జి’ ఫర్ గెయిన్ వెయిట్ – ఒకవేళ మరీ అండర్ వెయిట్ ఉంటే ఎత్తుకు తగినట్లుగా బరువు పెరగాలి. బరువు ఎక్కువ ఉంటే తగ్గాలి. -
రూ.50 వేల శాలరీ, కారు ఉన్న బాయ్‌ఫ్రెండ్ కావాలి.. హీరోయిన్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ సోనాలి కులకర్ణి పెద్దగా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. కన్నడ సినిమాలతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, హిందీతో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించిన ఆమె నేషనల్ అవార్డుని కూడా అందుకుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దేశంలోని చాలా మంది అమ్మాయిలు సోమరిపోతులు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఆమెకు కొందరు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఆధునిక భారతీయ మహిళలపై సోనాలి కులకర్ణి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె భారతీయ మహిళల గురించి మాట్లాడింది. ఈ రోజుల్లో బాగా సంపాదన, స్థిరపడిన వారినే భర్తగా కావాలని కోరుకుంటున్నారని తెలిపింది. సోనాలి మాట్లాడుతూ..'ఇండియాలో చాలా మంది అమ్మాయిలు సోమరిపోతులే. వారికి బాగా సంపాదించి, సొంతిల్లు ఉండాలని కోరుకుంటారు. రెగ్యులర్ ఇంక్రిమెంటట్స్ వచ్చే భర్త కావాలి. ఈ మధ్యకాలంలో మహిళలు తమ సొంతకాళ్లపై నిలబడటం మర్చిపోతున్నారు. తమ కోసం సంపాదించగలిగేలా మీ ఇళ్లలోని అమ్మాయిలను పెంచమని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. ఇంట్లో కొత్త ఫ్రిజ్ కావాలి. అందులో సగం మీరు చెల్లించండి. మిగిలిన సగం నేను చెల్లిస్తానని ఒక్క అమ్మాయియైనా చెప్పగలరా?. పురుషులకు 18 ఏళ్లు రాగానే కుటుంబానికి ఆర్ధికంగా మద్దతుగా ఉండేందుకు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కానీ 25 సంవత్సరాలు వచ్చిన మహిళలు మాత్రం తమ బాయ్ ఫ్రెండ్‌ను కావాల్సినవి కొనివ్వాలని బలవంతం చేస్తున్నారు.' అని ఇంటర్వ్యూలో మాట్లాడారు. (ఇది చదవండి: నా గుండె గుబులుగా ఉంది.. సింగర్ సునీత ఎమోషనల్) అమ్మాయిలు పెళ్లి విషయానికి వచ్చేసరికి.. అబ్బాయికి సొంతిల్లు ఉందా? 50 వేల పైనే శాలరీ, కారు ఉందా? అనేదే చూస్తున్నారు. అసలు అమ్మాయిలకి ఏమి కావాలి మంచి అబ్బాయిల? మంచి ఆఫర్లా? అని ప్రశ్నించారు. అమ్మాయి, అబ్బాయి కష్ట, సుఖాలను సమానంగా పంచుకోవాలి.. కానీ అమ్మాయిలు అది వదిలేసి మానవ హక్కులు అంటున్నారని కులకర్ణి విమర్శించింది. సోనాలి కామెంట్స్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆమెనుప్రశంసిస్తుండగా.. చాలా మంది మహిళలు విమర్శిస్తున్నారు. కాగా.. దిల్ చాహ్తా హై, ప్యార్ తూనే క్యా కియా వంటి సినిమాల్లో సోనాలి నటించింది. I don't know who she is but hats off to her courage to speak the unspoken unpalatable truth! 👏#Equality pic.twitter.com/vB2zwZerul — Amit Srivastava 🕉️ (@AmiSri) March 15, 2023 -
శాంతి కోసం స్త్రీ శక్తి
ఎప్పుడు, ఏ అడుగులో మందుపాతర పేలుతుందో తెలియని కల్లోల ప్రాంతం అది. అక్కడ శాంతిపరిరక్షణ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం అనేది కత్తి మీద సాముకు మించిన కఠినవ్యవహారం. సుడాన్, దక్షిణ సుడాన్ సరిహద్దులలోని రణక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు మనదేశ మహిళా శాంతిపరిరక్షకులు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ ఉద్యమంలో భాగం అవుతూ, లార్జెస్ట్ సింగిల్ యూనిట్‌గా కొత్త చరిత్ర సృష్టించారు ఇండియన్ ఉమెన్ పీస్‌కీపర్స్... సుడాన్, దక్షిణ సుడాన్‌ల సరిహద్దు నగరం అభేయ్. చక్కని వ్యవసాయానికి, సంపన్న చమురు క్షేత్రాలకు ప్రసిద్ధిగాంచిన ‘అభేయ్’పై ఆధిపత్యం కోసం, స్వాధీనం చేసుకోవడం కోసం సుడాన్, దక్షిణ సుడాన్‌లు పోటీ పడుతుంటాయి. ఇరుదేశాల మధ్య సాయుధ ఘర్షణల వల్ల ఈ ప్రాంతానికి శాంతి కరువైంది. రక్తపాతమే మిగిలింది. సరిహద్దు ప్రాంతాలలో జాతి, సాంస్కృతిక, భాష వివాదాలు కూడా హింసకు ఆజ్యం పోస్తున్నాయి. సుడాన్, దక్షిణ సుడాన్‌ల సాయుధ ఘర్షణలలో అభి నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అక్కడ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో అభిలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. యూఎన్ చేపడుతున్న పీస్‌కీపింగ్ మిషన్లలో మన దేశం ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తోంది. వాటిలో మహిళల ప్రాతినిధ్యానికి మొదటి నుంచి తగిన ప్రాధాన్యత ఇస్తోంది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబీరియాలో యూఎన్ పీస్‌కీపింగ్ మిషన్ కోసం మన దేశం 2007లో ‘ఆల్–ఉమెన్ టీమ్’ను ఏర్పాటు చేసి, అలా ఏర్పాటు చేసిన తొలి దేశంగా గుర్తింపు పొందింది భారత్. మన మహిళా బృందాలు లైబీరియాలో శాంతిపరిరక్షణ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాలేదు. వివిధ విషయాలలో స్థానికులను చైతన్యం చేశారు. ప్రజలకు రోల్‌మోడల్‌గా నిలిచారు. అక్షరాస్యతకు ప్రాధాన్యత పెరిగేలా చేశారు. గత కొంత కాలంగా ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ ఉద్యమాలలో మహిళల ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేస్తోంది. 2007లోనే ‘ఆల్ ఉమెన్’ టీమ్ ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచింది భారత్. ‘ఛాంపియన్ ఆఫ్ జెండర్ మెయిన్‌స్ట్రీమింగ్’గా గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి చేపడుతున్న శాంతిపరిరక్షణ ఉద్యమాలలో మన దేశ మహిళలకు మంచి పేరు ఉంది. ధైర్యంగా విధులు నిర్వహించడమే కాదు, స్థానికులత కలిసిపోతున్నారు. వారి కుటుంబాల్లో ఒకరిగా మారుతున్నారు. మహిళల సమస్యలను అర్థం చేసుకొని వారిని చైతన్యం వైపు నడిపిస్తున్నారు. తాజాగా ‘అభేయ్’ ప్రాంతంలో విధులు నిర్వహించే ‘లార్జెస్ట్ సింగిల్ యూనిట్’గా ఇండియన్ ఉమెన్ పీస్‌కీపర్స్ చరిత్ర సృష్టించారు. ఈ యూనిట్లో వివిధ హోదాలలో ఉన్న 27 మంది మహిళలు పనిచేస్తున్నారు. కాస్త వెనక్కి వెళితే... కిరణ్ బేడీ, మేజర్ సుమన్ గవాని, శక్తిదేవి... మొదలైన అధికారులు ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ ఉద్యమాలలో తమదైన ముద్ర వేసి ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చారు. -
4 స్వర్ణాలు 1 రజతం
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళలు ఒకే రోజు ఐదు పతకాలతో మెరిశారు. ఇందులో 4 స్వర్ణాలు కాగా మరొకటి రజతం. లవ్లీనా బొర్గొహైన్, పర్వీన్ హుడా, సవీటీ బూరా, అల్ఫియా పఠాన్ వేర్వేరు విభాగాల్లో బంగారు పతకాలు గెలుచుకోగా, తొలిసారి ఈ పోటీల బరిలోకి దిగిన మీనాక్షి రజతాన్ని అందుకుంది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా 75 కేజీల విభాగం ఫైనల్లో రుజ్‌మెటొవా సొఖిబా (ఉజ్బెకిస్తాన్)ను చిత్తు చేసింది. ఒలింపిక్ పతకం తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో, కామన్వెల్త్ క్రీడల్లో లవ్లీనా విఫలమైంది. టోక్యోలో 69 కేజీల విభాగంలో పాల్గొన్న లవ్లీనా, పారిస్ ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్ లేకపోవడంతో 75 కేజీలకు మారింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొన్న పర్వీన్ 63 కేజీల కేటగిరీ ఫైనల్లో పర్వీన్ 5–0 తేడాతో జపాన్ను చెందిన కిటోమై పై ఘన విజయం సాధించింది. 81 కేజీల ఫైనల్లో సవీటీ కూడా అదే జోరుతో 5–0తో గుల్‌సయా యెర్జాన్ (కజకిస్తాన్)ను ఓడించి విజేతగా నిలిచింది. 81 ప్లస్ కేటగిరీ ఫైనల్లో అల్ఫియా కూడా సత్తా చాటింది. ఆమె ప్రత్యర్థి, స్థానిక జోర్డాన్‌కే చెందిన ఇస్లామ్ హుసైలి తొలి రౌండ్లోనే డిస్క్వాలిఫై కావడంతో అల్ఫియాకు స్వర్ణం దక్కింది. అయితే మీనాక్షి మాత్రం రజతంతో సంతృప్తి చెందింది. ఫైనల్లో 1–4 తేడాతో కినో షియా రింకా (జపాన్) చేతిలో ఓటమిపాలైంది. -
SOMA BANIK: ఆరోగ్యమే ఆత్మవిశ్వాసం
ఓ భారతీయ యువతీ! తెల్లగా ఉండడమే అందానికి కొలమానం అని ఎవరు నిర్దేశించారు? అందంగా ఉన్న వాళ్లే విజేతలవుతారని నీకు ఎవరు చెప్పారు? ఆత్మవిశ్వాసానికి తెల్లగా ఉండడమే గీటురాయి అనే సూత్రం ఎలా వచ్చింది? మీ రెజ్యూమెలో మార్కులతో రాని ఆత్మవిశ్వాసం అందంతో వస్తుందా? నీకు ఉద్యోగం తెచ్చేది నువ్వు సాధించుకున్న మార్కులే... తెల్లదనం కాదు. తెల్లదనమే అందమనే అపోహ కాస్మెటిక్ మార్కెట్ సృష్టించిన మాయాజాలం. ఈ మాయాజాలం ఇప్పుడు భారతీయ మహిళల ఆరోగ్యాన్ని హరిస్తోంది. అరగంట ఎండను తాళలేకపోతే సమానత్వ పోరాటంలో మహిళ స్థానమెక్కడ? భారతీయ మహిళలు ఆరోగ్యం కోసం చేసే ఖర్చు కంటే అందంగా కనిపించడం కోసం చేసే ఖర్చే ఎక్కువగా ఉంటోంది. భవిష్యత్తులో ప్రమాదకరమైన పరిణామాలకు ఇది తొలి సంకేతం. వైటెనింగ్ క్రీమ్‌లు వాడుతున్న వాళ్లను ముంబయిలో ఓ సంస్థ ప్రశ్నించినప్పుడు ‘తెల్లగా ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉంటాననే ఉద్దేశం తో ఫెయిర్నెస్క్రీమ్ని వాడుతున్నాను’ అని కొందరు బదులిచ్చారు. ఇంకా... ‘మా ఇంట్లో వాళ్లు, స్నేహితులు ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడమని చెప్పారు, వాడినప్పుడు బావున్నానని చెప్పారు. అందుకే కంటిన్యూ చేస్తున్నాను... అని, సినిమా వాళ్లు, యాడ్‌లో ఈ క్రీమ్‌లు వాడినందువల్లనే అందంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. కాబట్టి నేను కూడా అలా కనిపించడం కోసం వాడుతున్నాను’... ఇలాంటి సమాధానాలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే... కోల్‌కతాకు చెందిన సోమా బానిక్ చేదు అనుభవం ఇలా ఉంది. ∙∙ అది 2003, సోమా బానిక్కి పద్నాలుగేళ్లు. అప్పుడు సోమా బానిక్ తల్లితో ఓ పక్కింటావిడ అన్న మాటలు ఆ అమ్మాయి జీవితం మీద తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపించాయి. ‘చర్మాన్ని తెల్లబరచడానికి మార్కెట్లో అన్ని క్రీమ్‌లున్నాయి కదా! మీ అమ్మాయికి ప్రయత్నించండి. కొత్తగా ఫలానా క్రీమ్ వచ్చింది. మంచి ఫలితం ఉంటోందట’ అని వైటెనింగ్ క్రీమ్ పేరు కూడా చెప్పిందా పక్కింటావిడ. తెల్లగా ఉంటేనే విజేతలవుతారా! ఒక అమ్మాయి విజేతగా నిలవడానికి దగ్గర దారి తెల్లగా ఉండడమే అన్నంతగా కాస్మెటిక్ కంపెనీలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న రోజులవి. క్రీమ్‌ని వాడడం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే స్కూల్లో ఫ్రెండ్స్ సోమా చర్మంలో వచ్చిన మార్పును గుర్తించడం, ప్రశంసించడం మొదలైంది. రెండు నెలలు గడిచేటప్పటికి అసలు సమస్య మొదలైంది. ఎండలోకి వెళ్తే చర్మం చిరచిరలాడడం, మంట, దద్దుర్లు రావడం మొదలైంది. వైటెనింగ్ క్రీమ్ వాడేవాళ్లు ఇలాంటి మార్పును స్వచ్ఛందంగా స్వాగతిస్తారు. చర్మం తెల్లగా అయ్యే క్రమంలో ఇలాగే ఉంటుందని తమకు తాముగా సమాధానం చెప్పుకుంటారు. సోమా కూడా అందుకు మినహాయింపు కాలేకపోయింది. ఓ రోజు... క్రీమ్ రాసుకోవడం మరిచిపోయింది. స్కూలుకు వెళ్లిన కొద్ది గంటలకే ఆమె గడ్డం మీద చిన్న మచ్చలా మొదలై మొటిమలా తేలింది. ఇక క్రమం తప్పకుండా క్రీమ్ రాస్తూ ఏడాది పాటు కొనసాగించింది. చెంపల మీద మొదలైన సన్నని వెంట్రుకలు ముఖమంతా రావడాన్ని గమనించిందామె. ఇప్పుడామె వయసు 33. కోల్‌కతాలో స్టేట్గవర్నమెంట్ ఉద్యోగిని. ఇప్పుడామె భర్త ఎపిలేటర్ సహాయంతో ముఖం మీది వెంట్రుకలను తొలగించడంలో సహాయం చేస్తున్నాడు. ఇవన్నీ సోమా బానిక్ తన బ్లాగ్‌లో రాసుకున్న వివరాలు. ఈ లక్షణాలను విశ్లేషించిన డెర్మటాలజిస్టులందరూ ముక్తకంఠంతో చెప్పిన మాట ఒక్కటే... ‘చర్మం తెల్లగా మారడానికి ఆమె వాడిన వైటెనింగ్ క్రీమ్‌లో ఉన్న స్టిరాయిడ్స్ కారణం’ అని. అది కూడా దీర్ఘకాలం వాడడం వల్ల వెంట్రుకల వంటి సమస్యకు దారి తీసిందనీ. రంగు మార్చే క్రీమ్‌లు లేవు! చర్మం రంగును క్రీమ్‌లతో మార్చడం సాధ్యమయ్యే పని కాదన్నారు బెంగళూరుకు చెందిన డెర్మటాలజిస్ట్ ప్రియాంక రెడ్డి. ‘‘డెర్మటాలజీలో ఎంతటి అధునాతనమైన యంత్రాలు, ఔషధాలు వచ్చాయంటే... కోటి రూపాయల మెషినరీ కూడా ఉంది. కానీ చర్మాన్ని తెల్లబరిచే యంత్రం కానీ ఔషధం తయారు కాలేదు, కాదు కూడా. ఎందుకంటే చర్మం రంగు జన్యుపరంగా నిర్ణయమవుతుంది. అలా నిర్ణయమైన చర్మాన్ని ఆరోగ్యకరంగా మార్చడానికి వీలుంటుంది. గ్లూమింగ్తోపాటు చర్మం మెరుపుతో కాంతులీనేటట్లు చేసే ట్రీట్మెంట్లున్నాయి. కానీ తెల్లబరిచే ట్రీట్మెంట్లు లేవు. అది ఆరోగ్యకరం కాదు కూడా. కొంతమంది హీరోయిన్లను ఉదాహరణ గా చూపిస్తూ ఉంటారు. కానీ అది మేకప్, కెమెరా టెక్నిక్స్, ఎడిటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే వాళ్లు ఆరోగ్యకరమైన ట్రీట్మెంట్లు చేయించుకుంటారు తప్ప స్టిరాయిడ్స్, హైడ్రోక్వైనోన్లు ఉండే వైటెనింగ్ క్రీమ్‌ల జోలికి వెళ్లరు. చర్మ సంరక్షణలో ఆరోగ్యకరమైన పద్ధతులనే అవలంబిస్తారు’’ అని చెప్పారామె. స్కిన్ వైటెనింగ్, లైటెనింగ్ వంటి హానికారకమైన డ్రగ్స్ మీద ఆంక్షలు విధించాలని 2017లో ఐఏడివీఎల్ (ఇండియన్ అసోసిÄేæషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్ వెనెరియాలజిస్ట్) ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేసింది. నిషేధిత ఔషధాలు మార్కెట్లో యధేచ్ఛగా లభించడం మనదేశంలో జరుగుతున్న అరాచకమే. ‘అప్పియరెన్స్‌లో ఏముంది’ అని చెప్పడం సులువే, కానీ సమాజం అప్పియరెన్స్నే ప్రధానంగా చూస్తూ తోటివారిని న్యూనతకు గురి చేస్తూనే ఉంటుంది. సమాజం ఆలోచన మారి తీరాల్సిందేనన్నారు ప్రియాంక. అసలు ఈ తెల్లదనపు మాయకు ఆజ్యం పోసింది మన ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ అంటే ఆశ్చర్యం కలగక మానదు. రవివర్మ చిత్రలేఖనాన్ని డచ్ చిత్రకారుడి దగ్గర నేర్చుకోవడం... మన భారతీయ మహిళల మీద ఈ స్థాయిలో తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపించింది. ఆయన చిత్రించిన బొమ్మల్లో చాలా వరకు తెల్లగా యూరోపియన్ స్కిన్‌టోన్‌తో ఉంటాయి. ఆ బొమ్మల క్యాలెండర్లు దాదాపుగా అన్ని ఇళ్లకూ చేరాయి. అందంగా ఉండడం అంటే చర్మం తెల్లగా ఉండాలనే అపోహ కూడా ఇంటి గోడల నుంచి మెదడుకు దారి తీసింది. సమాజం ఈ అపోహ నుంచి బయటపడాలంటే మేధోవికసితమైన ఉద్యమం ఒకటి మౌనంగానే అయినా మొదలు కావాలి. అప్పుడు వైటెనింగ్, లైటెనింగ్ క్రీమ్‌ల మార్కెట్ మనదేశం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమిస్తుంది. ఆరోగ్యమే అందం వైటెనింగ్ క్రీమ్‌లను రెండు నుంచి మూడు నెలలు వాడినప్పటి నుంచి చర్మం పలుచబడడం, ఎర్రబారడం మొదలవుతుంది. ఎంతగా అంటే.. రక్తనాళాలు కనిపించేటంతగా పలుచబడుతుంది. ఆపేయగానే మొటిమలు, పిగ్మెంటేషన్ (మంగు) మొదలవుతాయి. దీర్ఘకాలం వాడితే చర్మం మీద వెంట్రుకలు మొదలవుతాయి. చర్మ సంరక్షణకు సాధారణంగా అవసరమయ్యేవి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఫేస్ వాష్‌లు మాత్రమే. అంతకు మించి ఏ అవసరం ఏర్పడినా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాల్సిందే. చర్మతత్వాన్ని స్వయంగా పరిశీలించి, సమస్యను, వయసును దృష్టిలో పెట్టుకుని క్రీమ్ లేదా లోషన్లను వాడాల్సి ఉంటుంది. తెల్లదనం కోసం ఖర్చు పెట్టడం వృథా ప్రయాస మాత్రమే. పొల్యూషన్ చర్మానికి హాని కలిగిస్తుంది. కాబట్టి చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దేహం ఆరోగ్యంగా ఉంటే చర్మం కూడా కాంతులీనుతుంది. మంచి ఆహారం, తగినంత నిద్ర, నీరు తీసుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. అలాగే ఎక్సర్సైజ్ చేసి చెమట ద్వారా మలినాలు బయటకు పంపించడం కూడా చర్మానికి మెరుపునిస్తుంది. – డాక్టర్ ప్రియాంక రెడ్డి, మెడికల్ డైరెక్టర్, డీఎన్ఏ స్కిన్ క్లినిక్, బెంగళూరు – వాకా మంజులారెడ్డి -
భర్తల ఆయురారోగ్యాల కోసం ఇంకా జల్లెడ నుంచి చంద్రుడిని చూస్తారా?
జైపూర్: కర్వాచౌత్ నాడు భారతీయ మహిళలు జల్లెడ ద్వారా చంద్రుడిని చూసి తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు నిర్వహించడం దురదృష్టకరమని రాజస్తాన్ మంత్రి గోవింద్ రామ్ మేఘవాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు సైన్స్ ప్రపంచంలో బతుకుతూ ఉంటే, మన దేశంలో జల్లెడ ద్వారా చంద్రుడిని చూస్తూ భర్త ఆయుష్షు కోసం పూజలు చేస్తున్నారని మరి ఆ భర్తలు భార్యల కోసం జల్లెడలోంచి ఎప్పుడూ చంద్రుడిని చూడలేదని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎందరో భారతీయ మహిళలు విమాన పైలెట్లుగా ఉన్నారని, కల్పనా చావ్లా వంటి వారు అంతరిక్షంలోకి వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే రామ్‌లాల్ శర్మ గుర్తు చేశారు. -
విమానాశ్రయంలో ఏకంగా 109 జంతువులు కలకలం...షాక్‌లో అధికారులు
Indian Women Luggage Contain 109 Live Animals: బ్యాంకాక్ విమానాశ్రయంలో ఇద్దరు భారతీయ మహిళలను అరెస్టు చేశారు. ఏకంగా 109 జంతువులను అక్రమంగా తరలించేందుకు యత్నించి పట్టుబడ్డారు. ఈ మేరకు నిత్య రాజీ, జకియా సుల్తాన్ అనే ఇద్దరు మహిళలు రెండు లగేజ్ల్లో జంతువులు తరలించేందుకు యత్నించారు. ఆ మహిళల లగేజ్ల్లో బతికే ఉన్న రెండు తెల్ల పందికొక్కులు, రెండు అర్మడిల్లోలు, 35 తాజేళ్లు , 50 బల్లులు, 20 పాములు కనిపించాయని అధికారులు వెల్లడించారు. ఆ మహిళిద్దరూ విమానంలో చెన్నైకి వెళ్లాల్సి ఉందని చెప్పారు. వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. ఇటీవల, గత నెలలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు థాయ్‌లాండ్ నుంచి వన్యప్రాణులను స్మగ్లింగ్ చేసేందుకు చేసిన రెండు ప్రయత్నాలను అడ్డుకున్నారు కూడా. -
IND-W Vs SL-W: భారత మహిళల శుభారంభం
దంబుల్లా: ఫామ్ కోల్పోయి వన్డే ప్రపంచ కప్ జట్టుకు దూరమైన జెమీమా రోడ్రిగ్స్ ఇప్పుడు టి20ల్లో పునరాగమనంతో సత్తా చాటింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా (27 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శనతో గురువారం జరిగిన తొలి టి20లో భారత మహిళల జట్టు 34 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (31 బంతుల్లో 31; 4 ఫోర్లు) కూడా రాణించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (1), ఆంధ్రప్రదేశ్ బ్యాటర్ సబ్బినేని మేఘన (0) విఫలం కాగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. చివర్లో దీప్తి శర్మ (8 బంతుల్లో 17 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడింది. లంక బౌలర్లలో ఇనొక రణవీర 3, ఒషాది రణసింఘే 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లంతా సమష్టిగా కట్టడి చేయడంతో చేతిలో వికెట్లున్నా ఛేదనలో శ్రీలంక వెనుకబడిపోయింది. రాధా యాదవ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఇదే వేదికపై ఇరు జట్ల మధ్య రేపు రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది. చదవండి: IRE Vs IND T20 Series: ఆ ఐదుగురు ఆటగాళ్లతో జర జాగ్రత్త.. లేదంటే టీమిండియాకు కష్టమే..! -
ఐపీఎల్ అయితే పట్టించుకుంటారా.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్..!
భారత మహిళల జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలి టీ20 దంబుల్లా వేదికగా నేడు(జూన్ 23)న ప్రారంభమైంది. అయితే భారత్-శ్రీలంక మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు ఒక్క బ్రాడ్ కాస్టర్ కూడా ముందుకు రాలేదు. ఈ విషయంపై బీసీసీఐ సైతం పత్యేక చొరవ తీసుకోకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఐపీఎల్ అయితే పట్టించుకుంటారా.. ఇదేనా మహిళల క్రికెట్ అభివృధ్ది అంటూ బీసీసీఐపై నెటిజన్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటీవల ఐపీఎల్ మీడియా హక్కులు రూ. 48,390 కోట్ల రికార్డు ధరకు అమ్ముడు పోయిన సంగతి తెలిసిందే.ఇక మ్యాచ్‌ల ప్రసారంపై బీసీసీఐ ఏ మాత్రం పట్టించుకోకపోయినా.. శ్రీలంక క్రికెట్ మాత్రం తమ అభిమానులు వీక్షించేందుకు పలు వేదికలను ఏర్పాటు చేసింది. "శ్రీలంక పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌లను శ్రీలంక క్రికెట్ యూట్యూబ్ ఛానల్, డైలాగ్ టెలివిజన్, ఛానల్ వన్ ఎన్ఈ లో వీక్షించొచ్చు" అని శ్రీలంక క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. India Women Tour of Sri Lanka 2022, 3 T20Is & 3 ODIs, from 23rd June to 7th July. 👀 Catch the action LIVE on Sri Lanka Cricket YOUTUBE and ThePapare platforms ⬇️#SLvIND #SLWomens pic.twitter.com/3uP4chbFFR — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 22, 2022 ముందుకు వచ్చిన ఫ్యాన్‌కోడ్ ఇక చివరగా భారత్- శ్రీలంక మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ఫ్యాన్‌కోడ్ ముందుకు వచ్చింది. ఫ్రీగా తమ వెబ్, యాప్ వేదికల్లో ఇండియా వర్సెస్ శ్రీలంక వుమెన్స్ టూర్ ప్రసారం చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా ఫ్యాన్‌కోడ్ వెల్లడించింది. The wait is finally over! And we've got something better in store!🤩 How will the Women in Blue fare against the Sri Lankan lionesses on their home soil?🤔 Watch all the action FOR FREE from @BCCIWomen tour of @OfficialSLC LIVE on #FanCode👉https://t.co/324zYTfups . .#SLvIND pic.twitter.com/iUyaenWM3f — FanCode (@FanCode) June 22, 2022 -
సంతోషాలు... సవాళ్ళు...
భారతీయ గృహాలలో నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. సొంత బ్యాంకు ఖాతాలున్న స్త్రీల సంఖ్య హెచ్చుతోంది. దేశంలో సంతాన సాఫల్య రేటు తగ్గుతోంది. ఇళ్ళలో కాకుండా ఆరోగ్య వసతులున్నచోట శిశు జననాల సంఖ్య 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. అదే సమయంలో స్త్రీలలో నూటికి 30మంది పదిహేనో ఏట నుంచే భౌతిక హింసకు గురవుతున్నారు. అయినా వారిలో 77 శాతం మంది నోరు విప్పలేక, గృహహింసను గుట్టుగా భరిస్తున్నారు. కొండను అద్దంలో చూపుతూ ‘5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) తన జాతీయ నివేదికలో ప్రస్తావించిన వెలుగునీడలివి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించిన ఈ నివేదిక దేశంలో మారుతున్న ధోరణులను ప్రతిఫలిస్తూనే, మరింత పురోగతికి అవసరమైన వ్యూహాల గురించి అప్రమత్తం చేస్తోంది. తాజాగా వెల్లడైన సమాచారం అందుకే అంత కీలకమైనది. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, తదితర అంశాలకు సంబంధించి విశ్వసనీయ, తులనాత్మక సమాచారం అందించడం ‘ఎన్ఎఫ్హెచ్ఎస్’ ప్రధాన ఉద్దేశం. అందుకే వరుసగా అనేక విడతల్లో ఈ సర్వే చేస్తుంటారు. ఆ వరుసలోదే ఈ 5వ సర్వే. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో (2017 మార్చి నాటికి) 6.37 లక్షల ఇళ్ళను శాంపుల్‌గా తీసుకొని, ఈ సర్వే సాగింది. అలా జిల్లా స్థాయి వరకు ఉన్న పరిస్థితిని ప్రతిఫలించే ప్రయత్నం సాగింది. ఆ సర్వే తాలూకు జాతీయ నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పుడు విడుదల చేసింది. మునుపటి ‘ఎన్ఎఫ్హెచ్ఎస్–4’ (2015–16) నాటికీ, ఆ తర్వాతి ‘ఎన్ఎఫ్హెచ్ఎస్–5’ (2019–21) నాటికీ మధ్య వివిధ అంశాల్లో జరిగిన పురోగతికి ఈ తాజా నివేదిక ఓ దర్పణం. గత విడత సర్వేతో పోలిస్తే, ఈ సర్వే పరిధిని విస్తరించారు. మరణాల నమోదు, ప్రీ–స్కూల్ చదువు, పిల్లల టీకాకరణ విస్తరణ, ఋతుక్రమ పరిశుభ్రత, ప్రతి ఒక్కరిలో బీపీ – షుగర్ లాంటి అనేక అంశాల సమాచారం సేకరించారు. తద్వారా ఇప్పటికే అమలులో ఉన్న ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకూ, పటిష్ఠీకరణకూ వీలుంటుంది. అవసరాన్ని బట్టి విధానపరంగా కొత్త వ్యూహాలను సర్కారు సిద్ధం చేసుకోగలుగుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల’కు సంబంధించిన సూచికల్లో ఎంతో కొంత మెరుగుదల సాధించాయన్నది ఈ 5వ సర్వే లెక్క. సొంత ఆరోగ్య సంరక్షణ, ప్రధానమైన వస్తువుల కొనుగోలు, బంధువుల సందర్శన – ఇలా ఇంటికి సంబంధించి 3 ప్రధాన అంశాల్లో వివాహిత మహిళల నిర్ణయాత్మక భాగస్వామ్యం ఇప్పుడు పెరిగిందని సర్వే మాట. సొంతంగా వాడుకొనే బ్యాంక్, లేదా పొదుపు ఖాతా ఉన్న ఆడవారి సంఖ్య గత నాలుగేళ్ళలో 53 నుంచి 79 శాతానికి పెరగడం చెప్పుకోదగ్గ విశేషం. మతాలకు అతీతంగా మహిళలు ఇప్పుడు తక్కువమంది సంతానానికే జన్మనిస్తున్నారు. అలా దేశ జనాభా వృద్ధి నిదానిస్తోందని ఈ సర్వే తీపి కబురు చెబుతోంది. గతంలో మహిళల మొత్తం సంతాన సాఫల్య రేటు (టీఎఫ్ఆర్ – సగటున ప్రతి మహిళా తన జీవితకాలంలో జన్మనిచ్చే శిశువుల సంఖ్య) జాతీయస్థాయిలో 2.2 కాగా, ఇప్పుడది 2కు తగ్గింది. అన్ని మతాల స్త్రీలలోనూ తగ్గుదల కనిపించగా, ముస్లిమ్ స్త్రీలలో ఆ రేటు 2.62 నుంచి 2.36కు సర్రున పడిపోయింది. ఇది సర్వే చెబుతున్న సత్యం. అసలిప్పటి దాకా సాగిన 5 విడతల సర్వేలనూ పరిశీలిస్తే, సంతాన సాఫల్య రేటు హిందువుల (41.2 శాతం) కన్నా ముస్లిమ్లలోనే (46.5 శాతం) ఎక్కువగా తగ్గిందన్నది గమనార్హం. అంటే, సమీప భవిష్యత్తులో ఈ దేశంలో హిందువుల కన్నా ముస్లిమ్‌ల సంఖ్య మించిపోతుందంటూ దుష్ప్రచారంతో నమ్మించడానికి ప్రయత్నిస్తున్నవారి మాటలన్నీ వట్టి డొల్లవే అన్నమాట. అక్షరాస్యులా, నిరక్షరాస్యులా అన్న దాన్ని బట్టి సంతాన సాఫల్య రేటు ఉంటోందన్నది మరో కీలక అంశం. చదువుకున్న మహిళల్లో ఆ రేటు తక్కువగా ఉంటోందంటే, కుటుంబ నియంత్రణను పాటించడంలో స్త్రీ విద్యకున్న ప్రాధాన్యం అర్థమవుతోంది. 15 నుంచి 49 ఏళ్ళ మధ్య పునరుత్పత్తి వయసులో ఉన్న స్త్రీ పురుషుల్లో దాదాపు అందరికీ కుటుంబ నియంత్రణ విధానాలపై అవగాహన ఉందట. అయితే, 56.4 శాతమే వాటిని పాటిస్తున్నారు. అంటే, సామాజికంగా, ఆర్థికంగా దిగువ శ్రేణి వారిలో ప్రభుత్వాలు మరింత చైతన్యం తేవాలన్నమాట. అలాగే, ఇవాళ్టికీ దేశంలో గర్భనిరోధక సాధనాల వాడకం, కుటుంబ నియంత్రణ ఆడవారి పనే అన్న భావన ఉన్నట్టు సర్వే చాటింది. ఆ బాధ్యత తమకు లేదన్న పురుషుల భావన ఏళ్ళ తరబడిగా సమాజంలో మారని ఆధిపత్య ధోరణికీ, లింగ దుర్విచక్షణకూ మచ్చుతునక. హరియాణా, హిమాచల్‌లతో పోలిస్తే పంజాబ్‌లో బాల్య వివాహాలు తగ్గనే లేదు. ఈ వైఖరిని మార్చేందుకు ప్రభుత్వ ప్రచారోద్యమాలు తప్పవు. రెండేళ్ళ లోపు వయసు పిల్లల్లో పూర్తిగా టీకాలు వేయించుకున్నవారి శాతం ఒకప్పుడు 62. గత నాలుగేళ్ళలో అది 77 శాతానికి పెరిగింది. ఆ వయసు పిల్లల్లో నాలుగింట మూడొంతుల మందికి పైగా టీకాలు పూర్తిగా అందుతున్నాయనడం సంతోషకరమే. అదే సమయంలో స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. మన జీవనశైలిలో రావాల్సిన మార్పులను ఇది మరోసారి గుర్తు చేస్తోంది. మొత్తం మీద, దేశం అందుకోవాల్సిన ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల’కు సంబంధించి ఈ 5వ విడత సర్వే అందించిన 34 సూచికల డేటా ప్రభుత్వాల భవిష్యత్ కార్యాచరణకు కరదీపిక. ఇక, రానున్న 2023–24లో జరిగే 6వ సర్వే మరింత లోతైన సమాచారం అందిస్తుందని ఆశించవచ్చు. -
ఫెర్టిలిటీ తగ్గింది.. ఊబకాయం పెరిగింది
న్యూఢిల్లీ: భారత మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదో విడత నివేదిక (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) వెల్లడించింది. జనాభా నియంత్రణ పద్ధతులను పకడ్బందీగా అమలు చేస్తుండటంతో సంతానోత్పత్తి సామర్థ్యం 2.2 నుంచి 2 శాతానికి తగ్గినట్టు తెలిపింది. ఇది బిహార్ (2.98), మేఘాలయ (2.91), ఉత్తరప్రదేశ్ (2.35), జార్ఖండ్ (2.26), మణిపూర్ (2.17) రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. 2019–21 మధ్య దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు 707 జిల్లాల్లో 6.37 లక్షల ఇళ్లలో 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషులతో మాట్లాడి నివేదిక రూపొందించారు. పలు ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడేందుకు వీలుగా పౌరుల సామాజిక, ఆర్థిక, ఇతర నేపథ్యాలను కూడా సర్వేలో పొందుపరిచారు... సాధికారత సంకేతాలు... మహిళలు సాధికారత దిశగా దూసుకుపోతున్నారని సర్వే వివరాలు చెప్పకనే చెబుతున్నాయి. ► బ్యాంకు ఖాతాలున్న మహిళల సంఖ్య గత నాలుగేళ్లలో 53 నుంచి 79 శాతానికి పెరిగింది. ► కాలుష్యరహిత, పరిశుభ్రమైన వంట ఇంధనం వాడేవారి సంఖ్య 44 శాతం నుంచి 59 శాతానికి పెరిగింది. ► పారిశుద్ధ్య సౌకర్యాలు 49 నుంచి 70 శాతానికి పెరిగాయి. ► కరోనా కాలంలో చేతులు పరిశుభ్రం చేసుకోవడం అలవాటుగా మారింది. ► నీళ్లు, సబ్బు సదుపాయాలున్న వారి సంఖ్య 60 నుంచి 78 శాతానికి పెరిగింది! ► 15–49 మధ్య వయసు వివాహితల్లో ఉద్యోగుల సంఖ్య 31 శాతం నుంచి 32కు పెరిగింది. పెరిగిన ఊబకాయం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4తో పోలిస్తే ఊబకాయం సమస్య దేశాన్ని బాగా వేధిస్తోంది. ఊబకాయుల సంఖ్య మహిళల్లో 21 శాతం నుంచి 24 శాతానికి, మగవారిలో 19 నుంచి 23 శాతానికి పెరిగింది. కేరళ, అండమాన్ నికోబర్ దీవులు, ఆంధ్రప్రదేశ్, గోవా, సిక్కిం, మణిపూర్, ఢిల్లీ, తమిళనాడు, చండీగఢ్, లక్షద్వీప్, పాండిచ్చేరిల్లో మూడో వంతుకు పైగా మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నారు. పిల్లల్లో తగ్గిన కుంగుబాటు చిన్నారుల్లో కుంగుబాటు గత నాలుగేళ్లలో తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల్లో కుంగుబాటు 38 నుంచి 36 శాతానికి తగ్గినట్టు తేలింది. పట్టణాల (30 శాతం) కంటే గ్రామీణ బాలల్లో (37 శాతం) కుంగుబాటు ఎక్కువగా ఉంది. మహిళల్లో నాలుగో వంతు యుక్తవయసుకు ముందే పెళ్లాడారు దేశవ్యాప్తంగా 18–29 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 25 శాతం మంది, 21–29 ఏళ్ల పురుషుల్లో 15 శాతం మంది యుక్త వయసుకు ముందే పెళ్లి చేసుకున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. భారత్‌లో అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు పెళ్లికి యుక్తవయసన్నది తెలిసిందే. పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 42 శాతం మంది మహిళలకు యుక్తవయసుకు ముందే పెళ్లయింది. బిహార్ (40 శాతం), త్రిపుర (39), జార్ఖండ్ (35), ఏపీ (33), తెలంగాణ (27) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యుక్తవయసుకు ముందే తాళి కడుతున్న వాళ్ల అబ్బాయిల సంఖ్య బిహార్‌లో అత్యధికంగా 25 శాతంగా తేలింది. తర్వాతి స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్ (24 శాతం), జార్ఖండ్ (22), అరుణాచల్‌ప్రదేశ్ (21) ఉన్నాయి. మొత్తమ్మీద బాల్య వివాహాలు తగ్గుముఖం పడుతున్నాయని సర్వే పేర్కొంది. 12 ఏళ్లపాటు, అంతకుమించి చదువుకునే అమ్మాయిలు మిగతా వారికంటే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారని తెలిపింది. టీనేజీ తల్లుల సంఖ్య ముస్లింల్లో ఎక్కవగా (8 శాతం) ఉంది. గర్భ నిరోధక పద్ధతుల వాడకం పెరిగింది ► గర్భనిరోధక పద్ధతుల వాడకం 54 శాతం నుంచి 67 శాతానికి పెరిగింది. ► కుటుంబ నియంత్రణ పాటించని వారి సంఖ్య 13 శాతం నుంచి 9 శాతానికి తగ్గింది. ► ఆస్పత్రి ప్రసవాల సంఖ్య కూడా 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. ► గ్రామీణ ప్రాంతాల్లో కూడా 87 శాతం గర్భిణులు ఆస్పత్రుల్లోనే పురుడు పోసుకుంటున్నారు. ఇది పట్టణ ప్రాంతాల్లో 94 శాతం. ► గర్భనిరోధం మహిళల బాధ్యతేనని 35.1 శాతం మంది పురుషులు భావిస్తున్నారు. వీరి సంఖ్య చండీగఢ్‌లో అత్యధికంగా (69) ఉంది. ► మహిళల్లో గర్భ నిరోధక పద్ధతుల వాడకం వివాహేతర సంబంధాలకు దారి తీయొచ్చని 19.6 శాతం మగవాళ్లు అనుమానిస్తున్నారు! ఇలా భావిస్తున్న వారి సంఖ్య కేరళలో అత్యధికంగా (44.1) ఉంది!! ► అబార్షన్ చేయించుకుంటున్న వారిలో దాదాపు సగం మంది అవాంఛిత గర్భాన్నే కారణంగా చెప్తున్నారు. ► వీరిలో 16 శాతం అబార్షన్ వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కుటుంబ నియంత్రణ పాటించాలన్న ఆసక్తి ఉన్నా అవగాహన లేక, వాటి వాడకం తెలియక దంపతులు ఎక్కువ మందిని కనేవారు. ఆ పరిస్థితుల్లో మార్పు రావడం మంచి పరిణామం – కేంద్రం -
సెమీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ చేరాలంటే!
వెల్లింగ్టన్: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా తర్వాత సెమీస్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. గురువారం వెస్టిండీస్‌తో జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షార్పణం కావడం ఆ జట్టుకు మేలు చేసింది. వాన వల్ల మ్యాచ్‌కు 26 ఓవర్లకు కుదించగా ఒక దశలో సఫారీ స్కోరు 22/4 వద్ద నిలిచింది. ఆట ఆగిపోయే సమయానికి ఆ జట్టు 10.5 ఓవర్లలో 4 వికెట్లకు 61 పరుగులు చేసింది. మళ్లీ వర్షం కురవడంతో ఇక మ్యాచ్ తిరిగి మొదలయ్యే అవకాశమే రాలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మెగా ఈవెంట్లో రద్దయిన మ్యాచ్ ఇదొ క్కటే! దీని వల్ల 9 పాయింట్లతో దక్షిణాఫ్రికా సెమీస్ చేరగా వెస్టిండీస్ 7 పాయింట్ల వద్ద నిలిచింది. ఇంగ్లండ్ సునాయాస విజయం క్రైస్ట్‌చర్చ్: ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు పాక్‌పై సునాయాస విజయంతో సెమీస్ వైపు అడుగులేస్తోంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది. మొదట పాక్ 41.3 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. సీమర్ క్యాథరిన్ బ్రంట్ (3/17), స్పిన్నర్ సోఫీ (3/18) పాక్ ఇన్నింగ్స్‌ను కూల్చేశారు. వీళ్లిద్దరి దెబ్బకు... ఓపెనర్ సిద్రా అమీన్ (32; 4 ఫోర్లు), సిద్రా నవాజ్ (23; 1 ఫోర్) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఇంగ్లండ్ 19.2 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 107 పరుగులతో ఛేదించింది. ఓపెనర్ డానీ వ్యాట్ (76 నాటౌట్; 11 ఫోర్లు) కెప్టెన్ హీథర్ నైట్ (24 నాటౌట్) రాణించారు. తప్పనిసరిగా గెలవాల్సిందే! భారత జట్టు సెమీస్ చేరాలంటే ఆదివారం దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మిథాలీ సేన ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. సఫారీని ఓడిస్తే వెస్టిండీస్ (7)ను వెనక్కి నెట్టి 8 పాయింట్లతో జట్టు ముందంజ వేస్తుంది. ఇంగ్లండ్ ఖాతాలో కూడా 6 పాయింట్లే ఉన్నప్పటికీ వారికి ఆఖరి పోరులో ఎదురయ్యేది కూన బంగ్లాదేశ్ కావడంతో ఇంగ్లండ్‌కూ మెరుగైన అవకాశాలున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు ఒకే రోజు ఉన్నాయి. అయితే మన మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయితే అప్పుడు భారత్, విండీస్ ఖాతాలో 7 పాయింట్లుంటాయి. అప్పుడు విండీస్‌కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న భారత్, ఇంగ్లండ్ సెమీస్ చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో మన జట్టు పూర్తి సత్తాను ప్రదర్శించాల్సి ఉంది. చదవండి: World Cup 2022: భారత్‌కు బ్యాడ్ న్యూస్.. దక్షిణాఫ్రికాపై తప్పక గెలవాల్సిందే.. లేదంటే! -
వధువు @ 21.. వివాహ చట్టబద్ధ వయసు పెంపుదల
భారతదేశంలో మహిళలకు చట్టబద్ధమైన పెళ్లి వయసు 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. త్వరలో ఈ నిర్ణయం చట్టం రూపం దాల్చుతుంది. బాల్య వివాహాలను నిరోధించడానికి, చిన్న వయసులో గర్భాలను నిరోధించడానికి, యువతుల శారీరక మానసిక ఆరోగ్యాల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా కొందరు భిన్న రంగాల మహిళా ఆలోచనాపరుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? డిసెంబర్ 15, బుధవారం కేంద్ర కేబినెట్ స్త్రీలకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. వివాహానికి అవసరమైన వయసు 21 సంవత్సరాలుగా ప్రతిపాదించింది. గతంలో ఈ వయసు అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21గా ఉండేది. ఇప్పుడు స్త్రీ, పురుషులకు ఒకే వయసు నిర్ణయించినట్టు అయ్యింది. దీని వల్ల జెండర్ తటస్థత పాటించినట్టు భావిస్తోంది. హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం ఆడపిల్ల వయసు వివాహానికి 18 ఏళ్లు ఉండాలి. ఇస్లాంలో అమ్మాయి ఈడేరిన తర్వాత వివాహానికి యోగ్యురాలిగా భావిస్తారు. స్పెషల్ మేరేజ్ యాక్ట్, 1954 ప్రకారం అబ్బాయి వయసు 21, అమ్మాయి వయసు 18గా ఉంది. తాజా ప్రతిపాదన చట్టం దాలిస్తే 21 ఏళ్లు ఉమ్మడి వయసు అవుతుంది. బాల్య వివాహాలను నిరోధించేందుకు, యువతుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉండటం కోసం, బాలింత–శిశు మరణాల నివారణకు, పోషకాహార సమతుల్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం చెబుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015–16లో బాల్య వివాహాలు 27 శాతం ఉంటే 2019–20లలో వీటి శాతం 23కు చేరింది. ఈ శాతాన్ని ఇంకా తగ్గించడంలో వివాహ చట్టబద్ధ వయసు పెంపుదల ఉపయోగపడుతోందని భావిస్తోంది. 2020 కమిటీ స్త్రీల శారీరక పోషక విలువల స్థాయికి, పెళ్లి వయసుకూ మధ్య సమన్వయం, సంబంధం గురించి అంచనాకు రావడానికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ జయా జైట్లీ అధ్యక్షతన 2020లో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ 16 యూనివర్సిటీల విద్యార్థినీ విద్యార్థుల అభిప్రాయాలను తీసుకుంది. అలాగే 15 ఎన్జిఓల సహాయంతో గ్రామీణ ప్రాంతాలలోని అన్ని వర్గాల యువతీ యువకుల అభిప్రాయాలను సేకరించింది. వీటన్నింటి ఆధారంగా కమిటీ యువతుల వివాహ వయసును 21కి పెంచమని రికమండ్ చేసింది. అంతేకాదు అమ్మాయిల చదువు అవకాశాలను పెంచమని, వారి రాకపోకల సౌకర్యాలను పెంచమని, అలాగే ఉపాధికి అవసరమైన ట్రైనింగులను పెంచాలని సూచించింది. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన నిపుణుల, ఆలోచనాపరుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఆడపిల్లలకు డబ్బు ముఖ్యం అని చెప్పాలి ఒకప్పుడు డబ్బుకు పెద్ద విలువ ఇవ్వొద్దని తల్లిదండ్రులు చెప్పేవారు. ఇప్పుడు డబ్బుకు విలువ ఇవ్వండని చెప్పాలి. ముఖ్యంగా ఆడపిల్లకు ఆర్థికంగా తన మీద తాను ఆధారపడే వీలు కల్పించాలి. ఇందుకు బాగా చదివించాలి. వివాహ వయసు 21 సంవత్సరాలకు పెంచడం మంచిది. దాని వల్ల చదువుకుంటారు. ఉద్యోగాలు చేయాలనుకుంటారు. డబ్బు గురించి ఆలోచిస్తారు. కొన్ని వర్గాలలో తల్లిదండ్రులు పనికి వెళ్లాల్సి రావడం వల్ల ఇంట్లో ఆడపిల్లను ఉంచడం ఎందుకు అని పెళ్లి చేస్తున్నారు. పది ఫెయిల్ అయిన ఆడపిల్లకు పెళ్లి తప్పనిసరి అవుతోంది. పెళ్లి చేసి పంపాక అక్కడ అమ్మాయి ఇమడలేకపోతే పుట్టింటి సపోర్ట్ ఉండటం లేదు. అమ్మాయికి తన కాళ్ల మీద తాను నిలబడే ఆర్థిక శక్తి, స్కిల్స్ ఉండటం లేదు. దీని వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా కాకుండా వీళ్లను ఉపాధి పొందే ట్రయినింగుల్లోకి మళ్లించాలి. ఆ మేరకు తల్లిదండ్రులకు చైతన్యం కలిగించాలి. చట్టం తేవడం ఒక విషయం అయితే దానిని గట్టిగా అమలయ్యేలా చూడటం ఒక విషయం. ఆ విషయంపై శ్రద్ధ పెట్టాలి. – పి.సత్యవతి, రచయిత పంచాయతీలు జాగ్రత్త తీసుకోవాలి అమ్మాయి పెళ్లి వయసు 21 పెంచుతూ తీసుకున్న నిర్ణయం మంచిది. దీనిని తల్లిదండ్రులకు, యువతులకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలి. ఎలా చేస్తే చట్టబద్ధమో ఎలా చేస్తే చట్టవిరుద్ధమో విడమర్చి చెప్పాలి. ముఖ్యంగా పల్లెటూళ్లలో పంచాయతీలు అక్కడ జరుగుతున్న పెళ్లిళ్లను గమనించి ఈ నిర్ణయం అమలయ్యేలా చూడాలి. అప్పుడు దాదాపుగా ఈ నిర్ణయం వల్ల ఉపయోగం కలుగుతుంది. గ్రామాల్లో పెళ్లి చేసుకోమనే తల్లిదండ్రులను ఆడపిల్లలు ఎదిరించడం కష్టసాధ్యమైన పని. అలాంటి వారికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. వారు సర్పంచ్ చేతో మరెవరి చేతో ఈ విషయాన్ని చెప్పించి చదువు, ఉపాధిలో రాణించవచ్చు. పెళ్లి వయసు 21 చేయడం అంటే అమ్మాయిలు పరిణితితో నిర్ణయం తీసుకునే వీలు కల్పించడం. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు ఈ వయసు నియమం వల్ల తగ్గితే అదీ మంచిదే. – ఓల్గా, రచయిత టీనేజ్‌లో పెళ్లి అయితే హైరిస్క్ పదకొండు నుంచి పదమూడేళ్ల వయసు అమ్మాయిల్లో రుతుక్రమం ప్రారంభం అవుతుంది. టీనేజ్ దశలో వాళ్ల శరీరం గురించి వారికి సరైన అవగాహన ఉండదు. పెద్దవాళ్లు చెప్పరు. పద్దెనిమిది ఏళ్లు నిండగానే పెళ్ళి చేస్తే అవగాహన లేమి కారణంగా త్వరగా గర్భం దాల్చుతుంటారు. టీనేజ్‌లో రక్త హీనత సమస్య ఎక్కువ. ఈ వయసు గర్భవతుల్లో హైబీపీ రిస్క్ కూడా ఎక్కువగా చూస్తుంటాం. దీని వల్ల వీరికి ఫిట్స్ రావడం, నెలలు నిండకుండా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. అందుకని అమ్మాయిలకు తమ శరీరం గురించి, సెక్స్ఎడ్యుకేషన్ అవగాహన కల్పించాలి. అప్పుడే లైంగికపరంగా వచ్చే జబ్బుల గురించి కూడా అవగాహన ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగున్నవారు పుట్టబోయే పిల్లల ఆరోగ్యం గురించి కూడా సరైన జాగ్రత్తలు తీసుకుంటారు. 21 ఏళ్లకు పెళ్లి అయితే పిల్లలు కోసం ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తల్లి సరైన జాగ్రత్తలు తీసుకునే అవగాహన ఉంటే, రాబోవు తరాలు ఆరోగ్యంగా ఉంటాయి. – డాక్టర్ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్ లక్ష్యానికి రూపం రావాలంటే 21 ఏళ్లు నిండాలి మా ఊరు మొయినాబాద్ మండలంలోని యత్బార్పల్లి. మా ఊళ్లో పద్దెనిమిదేళ్లు నిండకుండానే అమ్మాయిలకు పెళ్లి చేస్తుంటారు. ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉంటుంది. దానికి ఒక రూపం రావాలంటే డిగ్రీ వరకు చదువుకోవాలి. మా ఇంట్లో కూడా నీకు పద్దెనిమిదేళ్లు నిండగానే పెళ్లి చేసేస్తాం అన్నారు. కేంద్రప్రభుత్వం అమ్మాయిలకు పెళ్లివయసు 21 ఏళ్లు చట్టం తీసుకువస్తుందని వినగానే చాలా సంతోషం వేసింది. గ్రామాల్లో ఉన్నవాళ్లకు ఈ విషయం తెలియాలి. మా కాళ్ల మీద మేం నిలబడాలి. నేనిప్పుడు ఇంటర్మీడియెట్ చదువుతున్నాను. డిగ్రీ చేసి, జాబ్ తెచ్చుకోవాలి. మా అమ్మనాన్నలను మంచిగా చూసుకోవాలి. నాకో తమ్ముడు ఉన్నాడు. కానీ, అమ్మనాన్నల బాధ్యత నాది కూడా. జాబ్ చేయాలి అలాగే వ్యవసాయం కూడా చేయాలి. మా నాన్న రైతు. నేనూ పొలం పనులు చేస్తుంటాను. రైతుల కష్టాలు చూస్తూ పెరిగాను కాబట్టి, రైతుల అభివృద్ధికి కృషి చేయాలన్నది నా లక్ష్యం. – బి.భవానీ, విద్యార్థిని చట్టం సరే... చైతన్యం ఇంకా మంచిది ఉత్తరాది రాష్ట్రాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి దక్షిణాదితో పోలిస్తే. తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలు చదువుకుంటున్నారు. కింది వర్గాలలో కూడా బి.టెక్, ఎంటెక్‌లు చేస్తున్నారు. 18 ఏళ్లు అంటే చదువు విషయంలో అటూ ఇటూ కాని వయసు. 21కి పెళ్లి వయసు పెంచడం వల్ల చదువు కొనసాగించి ఉద్యోగాల్లోకి వెళ్లే వీలుంటుంది. ఆ మేరకు ఈ నిర్ణయం మంచిది. అయితే ఈ విషయాన్ని చట్టం తెచ్చి చెప్పడం కన్నా చైతన్యం చేయడం ద్వారా చెప్తే బాగుంటుంది. ఒక రకంగా ఇప్పుడు పెళ్లిళ్లు అయ్యే సరికి అమ్మాయికి కొన్ని వర్గాల్లో 24 వస్తోంది. 20 ఏళ్లకు పెళ్లి చేయాలన్నా అబ్బాయిలు సెటిల్ కాకపోవడం వల్ల పెళ్లికొడుకు దొరకని పరిస్థితి ఉంది. 20 ఏళ్ల తర్వాత పెళ్లిళ్లకే ఇప్పటి విద్య, ఉపాధి, సామాజిక పరిస్థితులు దారి తీస్తున్నాయి. మిగిలిన వర్గాల్లో ఎర్లీ మేరేజస్ తగ్గించాలంటే చైతన్యస్థాయిని పెంచడం ఇంకా మంచి మార్గం అని నా అభిప్రాయం. – ముదిగంటి సుజాతా రెడ్డి, రచయిత డిగ్రీ చదువు పూర్తవ్వాలి నా మనవరాలికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ వచ్చాక పెళ్లి అయ్యింది, ఇప్పుడు పిల్లలు. ఉద్యోగం చేసుకుంటూ, కుటుంబాన్ని చక్కదిద్దుకుంటోంది. ఏ సమస్య అయినా పరిష్కరించుకోగలదు. నా రోజుల్లో స్కూల్ చదువు పూర్తికాగానే పెళ్లి చేసేశారు. దీంతో కాలేజీ చదువులు చదువుకోలేకపోయాను. పెళ్లయ్యాక బాధ్యతల్లోనే జీవితమంతా గడిచిపోయింది. మా అమ్మాయికీ పెద్దవాళ్ల జోక్యంతో చిన్న వయసులోనే పెళ్లి చేశాను. తన సమర్థత వల్ల పెళ్లి తర్వాత కూడా చదువుకుంది, బ్యూటీషియన్‌గా ఎదిగింది. అందరికీ ఆ అవకాశం ఉండదు. సాధారణంగా అమ్మాయిల బాధ్యత త్వరగా తీర్చుకోవాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ, అమ్మాయి అత్తింటికి వెళ్లాక అక్కడ పరిస్థితులకు ఇమడలేకపోయినా, జీవితాన్ని చక్కదిద్దుకునే సామర్థ్యం లేకపోయినా కుటుంబానికి, తనకూ అన్యాయమే జరుగుతుంది. ఆడ–మగ ఇద్దరికీ ఉన్నది ఒకటే జీవితం. ఆనందంగా బతకాలంటే అవగాహన కూడా రావాలి. అందుకని, డిగ్రీ చదువు పూర్తయ్యాక అమ్మాయికి పెళ్లి అయితే అన్ని విధాల బాగుంటుంది. – తుమ్మ సత్యవతి, గృహిణి కలలు నెరవేరాకే పెళ్లి ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఆడపిల్లలకు జీవితంలో సాధించాల్సిన కలలు ఎన్నో ఉంటాయి. కానీ, పెళ్లి కారణంగా పెద్దవాళ్లు ఆ కలలను చంపేస్తున్నారు. బయట అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తల్లిదండ్రుల భయాలకు కారణం అవుతున్నాయి. దీని వల్లే అమ్మాయిలకు పద్దెనిమిది నిండకుండానే పెళ్లి చేసి భారం దించుకున్నాం అనుకుంటున్నారు. చిన్నవయసులో పిల్లలు పుట్టినా ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండరు. అలాగే, ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మాది రంగారెడ్డి జిల్లాలోని తోల్కట్ట అనే ఊరు. పేదింటి అమ్మాయిని. నాన్న ఊరూరు తిరుగుతూ పాతబట్టలు తీసుకొని, కొత్త ప్లాస్టిక్ టబ్బులు అమ్ముతుంటారు. వాటిని సేకరించుకుని వస్తే మేం అవన్నీ ఇంటి వద్ద సపరేట్ చేసి, మరొకరికి ఇచ్చి డబ్బులు తీసుకుంటాం. మా అమ్మనాన్నలకు నేను అన్నయ్య, తమ్ముడు సంతానం. నాకూ పెళ్లి చేస్తామన్నారు. కానీ, నేను బతిమాలుకున్నందుకు నన్ను కాలేజీకి పంపిస్తున్నారు. ఇంకో ఏడాదిలో పెళ్లి చేస్తామన్నారు. నాకు పోలీస్ అవ్వాలన్నది కల. ఇప్పుడు ఈ చట్టం వస్తే నా కల నెరవేరుతుంది. – నిఖిత, విద్యార్థిని -
భారత్ 377/8 డిక్లేర్డ్.. రాణించిన దీప్తి శర్మ
గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ‘పింక్ బాల్’ టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 276/5తో శనివారం ఆటను కొనసాగించిన భారత మహిళల జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 145 ఓవర్లలో 8 వికెట్లకు 377 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియాపై భారత్‌కిదే అత్యధిక స్కోరు. ఆ్రస్టేలియా గడ్డపై విదేశీ జట్టు చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే. ఓవర్‌నైట్ బ్యాటర్ దీప్తి శర్మ (167 బంతుల్లో 66; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను జులన్ గోస్వామి (2/27), పూజా వ్రస్తాకర్ (2/31) ఇబ్బంది పెట్టారు. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 143 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (27 బ్యాటింగ్; 3 ఫోర్లు), గార్డ్నర్ (13 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే ఆ్రస్టేలియా మరో 85 పరుగులు చేయాల్సి ఉంది. నేడు ఆటకు చివరి రోజు కావడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ భారత్ గెలవాలంటే మాత్రం... ఆదివారం జరిగే మూడు సెషన్స్‌లోనూ బౌలర్లు అద్భుతంగా రాణించాలి. తొలి సెషన్లో ఆస్ట్రేలియాను 228 పరుగులలోపు ఆలౌట్ చేయాలి. అప్పుడు ఆ జట్టు ఫాలోఆన్ ఆడే అవకాశం ఉంటుంది. చివరి రెండు సెషన్స్‌లో (దాదాపు 60 ఓవర్లలో) మరోసారి ఆస్ట్రేలియాను 150లోపు ఆలౌట్ చేయగలిగితే భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకోగలదు. -
పసిడి పతకంపై గురి
పారిస్: టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సంపాదించడంలో విఫలమైన భారత మహిళల రికర్వ్‌జట్టు వరల్డ్‌కప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో దీపిక కుమారి, అంకిత భకత్, కోమలికలతో కూడిన భారత జట్టు 6–2తో ఆరో ర్యాంకర్ ఫ్రాన్స్ జట్టును ఓడించింది. తొలి సెట్‌ను 57–51తో... రెండో సెట్‌నూ 57–51తో నెగ్గిన భారత జట్టు 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే మూడో సెట్‌ను దీపిక బృందం 54–55తో కోల్పోయి ఫ్రాన్స్‌కు రెండు పాయింట్లు కోల్పోయింది. కానీ నాలుగో సెట్లో తేరుకున్న భారత్ 56–54తో గెలిచి ఓవరాల్‌గా 6–2 స్కోరుతో విజయాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో మెక్సికో జట్టుతో భారత్ తలపడుతుంది. ఏప్రిల్‌లో గ్వాటెమాలా సిటీలో జరిగిన వరల్డ్‌కప్ స్టేజ్–1 టోర్నీలో భారత మెక్సికోను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్లో 6–0తో (59–52; 55–49; 56–52) స్పెయిన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 6–0తో (54–49; 59–54; 54–51) టర్కీపై విజయం సాధించింది. పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4–5తో ఓడింది. నాలుగు సెట్లు ముగి శాక రెండు జట్టు 4–4తో సమంగా నిలిచాయి. అయితే ‘షూట్ ఆఫ్’లో జర్మనీ 27–26తో భారత్‌ను ఓడించింది. కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ, సాంచీ, అక్షతలతో కూడిన భారత జట్టు తొలి రౌండ్లో 225–228తో ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓడింది. కాంపౌండ్ పురుషుల టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, అమన్, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో ‘షూట్ ఆఫ్’లో 25–29తో ఫ్రాన్స్ చేతిలో ఓటమి చవిచూసింది.