శారీ స్పీక్‌ | Womens Sarees Traditions Event At Hyderabad | Sakshi
Sakshi News home page

శారీ స్పీక్‌

Published Thu, Dec 19 2019 12:46 AM | Last Updated on Thu, Dec 19 2019 12:50 AM

 Womens Sarees Traditions Event At Hyderabad - Sakshi

మహారాష్ట్ర చీరకట్టులో ‘శారీ స్పీక్‌’ మెంబర్‌

భారతీయ మహిళల సంప్రదాయ కట్టు అయిన చీర ప్రత్యేకతను సోషల్‌ మీడియాలో చాటుతూ..  ఆ నేతను బతికించుకోవడానికి ఉత్సవాలూ నిర్వహిస్తోంది ‘శారీ స్పీక్‌’ గ్రూప్‌! మొన్న శనివారం హైదరాబాద్‌ లోని కర్మ శాంగ్రిల్లాలో జరిగిన ఫెస్టివల్‌ సందర్భంగా ‘శారీ స్పీక్‌’’ గురించి...

శారీ స్పీక్‌ అనేది ఫేస్‌బుక్‌లో ఒక పేజీ. లక్షా పాతిక వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్న సోషల్‌ మీడియా గ్రూప్‌! చీరకట్టు మీద ఉన్న ప్రేమతో మూడేళ్ల కిందట వినీ టండన్‌ అనే మహిళ ఈ గ్రూప్‌ను ప్రారంభించారు.  మారిన జీవన శైలి దృష్ట్యా సౌకర్యం కోసం వస్త్రధారణ కూడా మారింది. దాంతో ప్రత్యేక సందర్భాలకే పరిమితమైపోయింది చీర. ఈ సంప్రదాయ కట్టుకు, దానితో కలబోసి ఉన్న నేతకూ పునర్వైభవం తెప్పించి, నేత కార్మికులకూ ఎంతో కొంత సహాయపడ్డానికి ‘శారీ స్పీక్‌’ గ్రూప్‌ను మొదలుపెట్టారు వినీ టండన్‌. ఆరంభించిన అనతికాలంలోనే సభ్యుల సంఖ్య లక్షకు చేరింది. పద్దెనిమిదేళ్లు నిండిన వాళ్లనుంచి అరవై ఏళ్లు పైబడ్డ వాళ్ల దాకా, దేశీ మహిళలతోపాటు విదేశీ వనితలూ ఇందులో సభ్యులుగా ఉన్నారు.

హైదరాబాద్‌ ‘శారీ స్పీక్‌’ ఉత్సవంలో పాల్గొన్న సభ్యులు

వీళ్లంతా చీర నేత, కట్టుతీరుతో పాటు తమ ప్రాంతపు జీవన విధానం, సంస్కృతీ సంప్రదాయల గురించి ఫేస్‌బుక్‌లోని ఈ శారీ స్పీక్‌ పేజీలో రాస్తుంటారు... ఆ చీరతో ఉన్న తమ ఫొటోను జతచేసి మరీ.  ‘‘దీని వల్ల ఆ నేతే కాదు, ఆ ప్రాంతం గురించీ, దాని ప్రత్యేకత గురించీ ఇతర సభ్యులకు  తెలుస్తుంది. కల్చరల్‌ ఎక్స్ఛేంజ్‌ జరుగుతుంది. భిన్న సంస్కృతి, సంప్రదాయాల మీద గౌరవం పెరుగుతుంది. ఐక్యతా ఏర్పడుతుంది. అయితే ఈ గ్రూప్‌లో చీరల అమ్మకాలు, కొనుగోళ్లుండవు’’ అని చెప్తారు  శారీ స్పీక్‌ సభ్యురాలు భాను ఇలపావులూరు. థీమ్స్‌తో ఫ్యాషన్‌ షో శారీ స్పీక్‌ కేవలం సోషల్‌ మీడియా గ్రూప్‌కే పరిమితం కాకుండా యేడాదికి రెండుసార్లు భిన్నమైన థీమ్స్‌తో సమావేశమూ అవుతోంది. దాన్నో పండగలా నిర్వహిస్తోంది.

దేశవ్యాప్తంగా వాళ్ల వాళ్ల నగరాల్లో ఈ ఫెస్టివల్‌ను జరుపుకుంటారు. సంప్రదాయపు ఆటలు, పాటలు, ఫ్యాషన్‌ పరేడ్స్‌ ఉంటాయి. థీమ్స్‌ కూడా చాలా గమ్మత్తుగా పెట్టుకుంటారు. ఒకసారి 70, 80ల్లోని సినిమా నటీమణుల్లాగా చీర కట్టుకోవడం, ఇంకోసారి కంచి పట్టు చీరలో, ఒకసారి కాటన్‌ శారీస్‌లోనే రావడం... ఇలా రకరకాల థీమ్స్‌ ఉంటాయి. మొన్న శనివారం (14, డిసెంబర్‌) జరిగిన ఫెస్టివల్‌కు థీమ్‌... ఇతర రాష్ట్రాల చీరకట్టు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలు సంప్రదాయ చీరకట్టును థీమ్‌గా పెట్టారు. ఈ ఉత్సవాన్ని శ్రీకళా గణపతి, మధు గౌర్, రాహత్‌ ఖాన్‌ నిర్వహించారు. స్థానికంగా సరే... యేడాదికి ఒకసారి ‘గోవా’లోనూ శారీ స్పీక్‌ సంబరాలు జరుగుతుంటాయి. ఆ పండక్కి విదేశీ వనితలూ హాజరవుతారు.


హైదరాబాద్‌ ‘శారీ స్పీక్‌’ నిర్వాహకులు మధు గౌర్, రాహత్‌ ఖాన్, భాను ఇ లపావులూరు, శ్రీకళా గణపతి


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement