traditions
-
హోలీ రోజున అక్కడ దుస్తులు చించేసి..ఏకంగా తేళ్లతో..!
హోలీ అనగానే చిన్నా, పెద్దా రంగులు జల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. మత పర భేదం లేకుండా అందరూ రంగులతో ఆనందహేళిలో మునిగి తేలుతుంటారు. అలాంటి హోలీని భారతదేశంలోని పలు రాష్ట్రల ప్రజలు విభిన్న సంప్రదాయాల్లో చేసుకుంటారు. అక్కడి ఆచారాలకు అనుగుణం చేసుకోవడం వరకు ఓకే. కానీ కొన్ని చోట్ల హోలీ పండుగా చాలా విచిత్రంగా జరుపుకుంటారు. ఎంతలా అంటే వామ్మో..! ఏంటిది..! అని విస్తుపోయాలా వింతగా జరుకుంటారు. అంత విలక్షణమైన సంప్రదాయాలు ఎక్కడున్నాయంటే.. రంగులు బదులు కర్రలతో.. ఉత్తరప్రదేశ్‌లోని బర్సానాలో హోలీ రోజున రంగులు చల్లుకోవడమే కాదు మహిళలు కర్రలతో పురుషులను వెంటపడి కొడతారు. స్త్రీలంతా కర్రలనే తమ ఆయుధాలుగా ధరించి ఎక్కడ పురుషులు కనిపించినా వారిని వెంబడించి మరీ కొడతారు. అయితే ఇది సరదాగా ఆడే సంప్రదాయమే. ఈ సంప్రదాయం శ్రీకృష్ణుడు గోపికల మధ్య జరిగిన కథకు గుర్తుగా జరుపుకుంటారు. ఆ రోజున బర్సానాలో చిన్న చిన్న యుద్ధ పోటీలు, పాటలు, నృత్యాలు, వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటారు. బూడిద జల్లుకుంటూ.. వారణాసిలో చితా భస్మా హోలీని నిర్వహిస్తారు. అక్కడ సాధువులు, అఘోరాలు... తమ భక్తులతో మణికర్ణిక ఘాట్ దగ్గర కలిసి చితి నుంచి వచ్చే బూడిదను తీసి హోలీగా ఆడతారు. వారణాసి అంటే మనం ముక్తి నగరంగా భావిస్తాం. అందుకు గుర్తుగా తమ శరీరాలపై ఈ చితా భస్మాన్ని పూసుకుంటారు. తద్వారా శివునికి తమ భక్తిని తెలియజేస్తారు. వీరంతా వీధుల్లో తిరుగుతూ శివనామస్మరణ చేస్తారు. నిజానికి శ్మశానేశ్వరుడైన శివుడు నిత్యం ఈ చితా భస్మాన్ని ఒంటికి పూసుకుంటాడు కాబట్టి తాము కూడా నీలోని వాళ్లమే, నీ బిడ్డలమే అని చెప్పేందుకు ఇలాంటి వింత ఆచారాన్ని అక్కడ వారణాసి ప్రజలు పాటిస్తారు. గంజాయితో హోలీ.. భాంగ్ అంటే గంజాయితో చేసిన పేస్టు. ఏంటీ గంజాయిని హోలీలోనా..! అని ఆశ్చర్యపోవద్దు. అయితే ఆరోజు ఇలా చేసినా.. పోలీసులు అరెస్ట్ చెయ్యరు. అందువల్లే దీన్ని హోలీ వేడుకల్లో భాగంగా అక్కడి ప్రజలు ధైర్యంగా ఉపయోగించి పండుగ జరుపుకుంటారు. అంతేగాదు ఆరోజు తయారు చేసిన పానీయాలు, ఆహారాలలోనూ కూడా ఈ పేస్టును వినియోగిస్తారు. గంజాయిపై నిషేధం ఉన్నప్పటికీ హోలీ సమయంలో మాత్రం దీన్ని చట్టబద్ధంగా వినియోగిస్తారు. భాంగ్ తయారీ అనేది అక్కడ ఒక కళగా చెప్పుకుంటారు. కుటుంబ వంటకాలలో దీన్ని భాగం చేసుకుంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని చాలా చోట్ల హోలీ రోజున భాంగ్‌ను ఆహారంగా వాడతారు. తేళ్లతో హోలీ.. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో సంతన అనే గ్రామం ఉంది. అక్కడ స్థానికులు హోలీ వచ్చిందంటే సాహసోపేతమైన సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ పవిత్రమైన రోజున బైసన్ దేవి ఆలయం కింద ఉన్న రాతి భూభాగంలో ఉన్న తేళ్ళను సేకరించి తమ శరీరాలపై పెట్టుకుంటారు. అయితే ఆ తేళ్లు తమని కుట్టమని ఆ గ్రామస్తుల నమ్మకం. దుస్తులు చించేసి.. మధుర సమీపంలో దౌజీ అనే గ్రామం ఉంది. ఇక్కడ మాత్రం హోలీ మరుసటి రోజు వేడుకలు నిర్వహించుకుంటారు. పురుషులు, స్త్రీలు రంగులు జల్లు కావడం తోపాటు స్త్రీలు, పురుషుల దుస్తులను చింపివేయడం వంటివి చేస్తారు. ఇది చాలా వేడుకగా జరుగుతుంది. (చదవండి: 'పఖాలా'తో వేసవి తాపం పరార్!) -
విఘ్నేశ్వరుని పూజ తరువాత వాయనదానం మంత్రం
శో‘‘ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను) మంత్రము – దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూషోహస్తాభ్యామా దదా! (ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను) ఉద్వాసన మంత్రము: (ఈ కింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః‘ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‘‘ తేహనాకం మహిమానస్యచంతే‘ యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయకస్వామిన్ యథాస్థాన ముద్వాసయామి‘‘ పూజా విధానం సంపూర్ణమ్. (వ్రతకల్ప పూజా విధానం సమాప్తం) -
సాంస్కృతిక ఏకీకరణతో సుస్థిరాభివృద్ధి
వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూనే, ప్రపంచంలోని భిన్న సంస్కృతులను కాపాడుకునే దిశగా జీ 20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశం కాశీ కల్చరల్ పాత్వేకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కాశీలో మూడు రోజులపాటు జరిగిన జీ20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ప్రపంచంలోని వైవిధ్యమైన సంస్కృతి మనందరినీ కలుపుతుందని సమావేశంలోని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తన సహచర దేశాల మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ...అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి సంస్కృతి, సంప్రదాయాలకే ఉందన్నారు. ‘కల్చర్ యునైట్స్ ఆల్’అని వ్యాఖ్యానించారు. భిన్న ప్రాంతాల్లో భిన్న సంస్కృతుల నిలయమైన భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ప్రదర్శిస్తున్నట్లే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యత అన్ని దేశాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఒకరినొకరు సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకునేందుకు వీలవుతుందన్నారు. యావత్ మానవాళిని ఏకం చేసే విషయంలో సంస్కృతి కీలకపాత్ర పోషిస్తోందని, విలువలు, భాషలు, కళలు మొదలైనవి దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తాయని మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ఒకరోజు ముందు జరిగిన నాలుగో వర్కింగ్ గ్రూప్ సమావేశంలోనూ ఈ అంశాలపై మరింత విస్తృతమైన చర్చ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా ‘కాశీ కల్చరల్ పాత్వే’కు రూపకల్పన జరిగిందని ఆయన వెల్లడించారు. రోమ్ డిక్లరేషన్, బాలి డిక్లరేషన్లలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు అంశాలు, సభ్యుల అభిప్రాయాల ఆధారంగానే ‘కాశీ కల్చరల్ పాత్వే’ను రూపొందించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. ‘కాశీ కల్చరల్ పాత్వే’లోని కొన్ని ముఖ్యాంశాలు సాంస్కృతిక ఆస్తులకు పునర్వైభవాన్ని కల్పించడం, వాటిని ఆయా దేశాలకు తిరిగి అప్పగించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు నైతిక విలువలకు పట్టం గట్టాలని నిర్ణయించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న శక్తి, సామర్థ్యాలను గుర్తెరిగి సరైన ప్రాధాన్యత కల్పించాలి. సంస్కృతికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు సరైన పరిష్కారాలను కనుగొనడం. అన్ని సభ్యదేశాల మధ్య సమయానుగుణంగా చర్చలు జరుపుతూ.. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లడం. ఈ సమావేశంలో పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రులు.. ఆయా దేశాలకు ప్రతినిధులుగానే కాకుండా.. ఆయా దేశాలలో సాంస్కృతిక సంరక్షకులుగా ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు ఏకతాటిపైకి వచ్చి పని చేయాలి. రోమ్, బాలి డిక్లరేషన్లు ఈ దిశగా వేసిన బలమైన పునాదుల ఆధారంగా మరింత స్పష్టమైన విధానాలతో ముందుకెళ్లాలి. -
వేరేవాళ్ల భార్యలను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవచ్చు.. అది అక్కడి సంప్రదాయం
ఒక్కరి జీవితంలోనూ పెళ్లి అనేది ఒక అందమైన వేడుక. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. మన దేశంలోనూ కులం, మతం, ప్రాంతాన్ని బట్టి ఆచార వ్యవహారాలు మారిపోతుంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెళ్లిళ్లు ఎవరూ ఊహించని విధంగా జరుగుతాయి. ఆడవాళ్లు ఒక్కసారే స్నానం చేయాలి, పెళ్ళిలో విష సర్పాలను మామ అల్లుడికి కానుకగా ఇవ్వడం, వేరొకరిని భార్యను దొంగలించి పెళ్లి చేసుకోవడం ..లాంటి చిత్రవిచిత్రమైన సంప్రదాయాలు ఉన్నాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దిక్కుమాలిన, వింతైన ఆచారాలు ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ► పశ్చిమ ఆఫ్రికాలో వోడబ్బే అనే తెగ ప్రజలు పెళ్లి చేసుకోవాలనుకుంటే,లేదా అప్పటికే వివాహం అయినప్పటికీ.. వేరే వారి భార్యలను ఎత్తుకెళ్లి మరీ పెళ్లి చేసుకుంటారట. ఇదెక్కడి దిక్కుమాలిన ఆచారాం అనుకుంటున్నారా? వినడానికి వింతగా అనిపించినా ఇది అక్కడి ఆచారమట. పూర్వీకుల కాలం నాటినుంచి దీన్ని ఆచరిస్తున్నారట. ఆఫ్రికాలోని వోడాబ్బే తెగ ప్రజలు ప్రతి ఏడాది గారెవోలు అనే పండుగను నిర్వహిస్తారు. ► ఈ వేడకలో వేరొకరి భార్య ఇంకొకరితో పారిపోతే.. దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు. అందరి ఆమోదంతో మళ్లీ వివాహం చేస్తారు. ఈ పండుగలో అబ్బాయిల ముఖం మీద పెయింట్ వేసుకుంటారట. ఈ సమయంలోనే వివాహిత మహిళలను ఆకర్షించడానికి శతవిధాలా ప్రయత్నిస్తారట.అలా వారి ప్రయత్నాలకు ఎవరైతే ఆకర్షితులై వేరొకరితో పారిపోతే.. దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు. ► చైనాలో ఓ వింత ఆచారం ఉంది. పెళ్లికి నెల రోజుల ముందు నుంచిపెళ్లి కూతురు రోజుకో గంట తప్పకుండా ఏడ్వాల్సిందేనట. అంతేకాదు, పది రోజుల తర్వాత ఆ నవ వధువుకు తోడుగా వాళ్ల అమ్మ కూడా ఆ ఏడుపులో పాలు పంచుకోవాలి. మరో పది రోజుల తర్వాత ఆమెకు వాళ్ల అమ్మమ్మ తోడవుతుంది. నెల చివర్లో అమ్మాయి కుటుంబ సభ్యుల్లో మహిళలంతా ఆమెకు సహాయంగా ఏడుస్తారు. అలా ఆడవారి ఏడుపుతో వచ్చే వివిధ రాగాలను పెళ్లి వారంతా ఆనందిస్తారట. ► ఇంకో వింతైన ఆచారం ఏంటంటే..పెళ్లి తంతు ముగిసే వరకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు నవ్వకూడదట. అలా నవ్వితే అరిష్టంగా భావించి వివాహమే రద్దు చేస్తారట. ► ఇండోనేసియాలోని సుంబా దీవిలో ఏ కుర్రాడికైనా అమ్మాయి నచ్చితే కిడ్నాప్ చేసి తరువాత ఆమెను పెళ్లి చేసుకుంటాడట. ► మన దేశంలో బీహార్‌లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ వింతైన ఆచారాన్ని పాటిస్తున్నారు. దాని పేరే ‘రాక్షస వివాహం‘. ఈ ఆచారం ప్రకారం వరుడిని దొంగతనంగా ఎత్తుకెళ్లి వధువుతో తాళి కట్టిస్తారట. ఒకవేళ ఆ వరుడికి ఇష్టం లేకపోతే బలవంతంగా బెదిరించి మరీ పెళ్లి చేస్తారట. ► మౌంట్ అబు పెళ్లి ఆచారం గమ్మత్తుగా ఉంటుంది. ఇక్కడ పెళ్లైన తరువాత అబ్బాయిలు ఇల్లరికం వస్తారు. అబ్బాయి అత్తవారింటికి వచ్చి అక్కడే స్థిరపడతాడు. అంతేకాదు అక్కడే పనులు చూసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ► ఇక దక్షిణ సూడాన్‌లో పాటించే ఆచారాలు గురించే తెలిస్తే.. ముక్కున వేలు వేసుకుంటారు. వార్ని.. ఇదేం దిక్కుమాలిన ఆచారంరా బాబు అని తలలు పట్టుకుంటారు. అక్కడి అమ్మాయిలను శవాలకు ఇచ్చి పెళ్లి చేసే సంప్రదాయం ఉందట. వినడానికి వింతగా ఉన్నా ఇంకా అక్కడి ప్రజలు ఈ ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. ►ఇటలీ పెళ్లిళ్లలో ప్రత్యేకంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో వధూవరులు ఉద్దేశపూర్వకంగా అద్దాలు పగలకొడతారు. ఆ అద్దం ఎన్ని ముక్కలయితే అంత ఆనంద పడతారు. ఆ అద్దం ఎన్ని ముక్కలుగా పగిలిందో అంత కాలం ఈ దంపతులు ఆనందంగా జీవిస్తారని నమ్ముతారు. పగిలిన అద్దం ముక్కలను లెక్కబెడుతూ సంతోషంతో నృత్యం చేస్తారు. ► జపాన్‌లో పెళ్లి పూర్తికాగానే ఆ జంట చేత మూడు గ్లాసుల్లో ఉండే వైన్‌ను తాగిస్తారు. రెండు కుటుంబాలు ఏకం అయ్యారని ప్రకటించటమే ఈ సంప్రదాయమట. -
అప్పటి పెళ్లి సరదా వేడుకలు ఉన్నాయా?
పెళ్లంటె ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, ఉద్వేగాలు, సరదాల సమ్మేళనం. హిందూమత ప్రకారం జరిగే పెళ్లిలో ఒకప్పుడు కనిపించిన ఆచార సంప్రదాయాలు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. భవిష్యత్తులో ఇవి పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. హిందూ కుటుంబాల్లో పెళ్లిరోజుకు ఒక రోజు ముందర ‘స్నాతకం’ అనే ముఖ్య మైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంట్లో కానీ, కల్యాణ మండపంలో కానీ లేదా విడిది (ఆడ పెళ్ళివారు ఏర్పాటుచేసిన అతిథిగృహం)లో కానీ, పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ధి కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ ‘సంస్కారం’, ప్రధానంగా, వరుడిని ‘బ్రహ్మచర్యం’నుండి గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో, అంగీకారంతో ‘గృహస్థాశ్రమం’ స్వీకరించడానికి సిద్ధం చేస్తున్న వేడుక. ఆ సమ యంలో గురువు చేయాల్సిన హితబోధ తైత్తిరీయోపనిషత్తులోని ‘సత్యాన్న’ అన్న ఒక శ్లోక రూపంలో ఉంటుంది. ‘సత్యం, ధర్మం, తెలివితేటల విషయాల్లో పొరపాటు పడవద్దు’ అన్న ఆదేశం అది. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని, వారు అనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ... ‘వరుడికి శుభం కలుగుగాక’ అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. స్నాతకానికి ‘సమావర్తనం’ అన్న పేరు కూడా ఉంది. సమావర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమావర్తనం అంటారు. హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం మరో ముఖ్యమైన ఆచారం. వరుడు కాశీ ప్రయాణం, బాజా భజంత్రీల మధ్య గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావుకోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు కాశీకి పోతున్నానని చెప్పి బయలుదేరుతాడు. కాశీ యాత్రా ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నాననీ; దానికి బంధు, మిత్రుల అనుజ్ఞ కావాలనీ వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదనీ, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మబద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాలనీ పురోహితుడు హితవు పలుకుతాడు. వధువు సోదరుడు వచ్చి ‘అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసు కొని గృహస్థుగా జీవించండి’ అని చెప్పి బొట్టు పెట్టి, బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి వరుడిని వెనుకకు తీసుకొని వస్తాడు. శాస్త్రం ప్రకారం కాబోయే బావమరిదికి వరుడు నూతన వస్త్రాలను బహుకరిస్తాడు. ఆనాటి పెళ్లిళ్లలో ఇదొక ప్రధానమైన వేడుక. చాలా కోలాహలంగా పెళ్ళికి ‘తరలి పోయే ముందర’ జరిగే సరదా కార్యక్రమం ఇది. ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధు, మిత్రులందరూ బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించుకోవడం, పల్లకీ లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. శుభకార్యానికి బయలుదేరుతున్నామనీ, వెనక్కు పిలవడం, నిందించడం, దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా ఉండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు. పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ; స్నాతకం, అంకు రార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును, పెళ్ళికూతురును (సిద్ధం) చేయడం ఒక ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూవరుల ఇళ్లలో, ఉదయం తెల తెలవారుతుండగానే, మంగళ వాద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగు తుంది. వధువుకు, కన్యాదాత దంపతులకు, తోటి పెళ్ళి కూతు రుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తయిదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికీ, తల్లితండ్రులకూ, తోటి పెళ్ళికొడుకుకూ (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యాదాత దగ్గరి బంధు వులందరూ వస్తారు. నవధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని ‘అంకురార్పణ’ అంటారు. అలనాటి మంగళ స్నానాలు, మామిడితోరణాలు, స్నాతకం, కాశీయాత్ర లాంటి వేడుకలు ఇంకా ఉన్నాయా? అక్కడక్కడా ఉండవచ్చునేమో! వనం జ్వాలా నరసింహారావు వ్యాసకర్త తెలంగాణ సీఎం సీపీఆర్ఓ -
వరప్రదం.. దేవర వృషభం
సంస్కృతి, సంప్రదాయాలకు పట్టుగొమ్మలు గ్రామసీమలు. అవి సంబరాలకు నెలవులు. విశిష్ట ఆచారాలకు పుట్టినిళ్లు. అలాంటి గ్రామాల్లో కొనసాగుతున్న ఒక అరుదైన విశేషమే.. దేవరెద్దు, దేవరభక్తుల పరంపర.. (షేక్ ముజుబుద్దీన్, సాక్షి, కడప డెస్క్) : దేవరెద్దులు.. అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. అనాదిగా వస్తున్న ఆచారానికి ఇవి ప్రతీకలుగా ఉంటున్నాయి. గ్రామానికి శుభం చేకూరుస్తాయనే ప్రజల నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. గ్రామాలు సస్యశ్యామలం దేవరెద్దులు కలిగిన గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయని నమ్మకం. దేవరెద్దును పోషిస్తున్న భక్తుల వంశాభివృద్ధి చెంది, సుఖసంతోషాలతో ఉంటారని విశ్వాసం. దాన్ని మేపడానికి వదిలేసినప్పడు ఏ పొలంలో అయినా మేయవచ్చు. అది మేసిన పొలం యజమానులు తమ అదృష్టంగా భావిస్తారు. అలాగే గ్రామస్తులు తమకు తోచిన పదార్థాలను ప్రసాదంగా దేవరెద్దుకు అందజేస్తుంటారు. దేవరెద్దు మృతి చెందితే ఆ ఊరికి, గ్రామస్తులకు అరిష్టం జరుగుతుందనే భయంతో తక్షణం కొత్తదాన్ని ఎంపిక చేస్తారు. విశేషాల సమాహారం దేవరెద్దు పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు ఎన్నో వేడుకలు నిర్వహిస్తారు. వీటిని సంరక్షించేందుకు ప్రత్యేకంగా దేవరభక్తులుంటారు. తిరునాల, ఉత్సవాల సందర్భంగా వీటిని అలంకరించి సంబరాలు చేసుకుంటారు. దేవరెద్దును దేవుడిలా పూజిస్తారు. దీని పై ఎవ్వరూ దెబ్బ వేయరు. ఇది చనిపోయినా.. కొత్త దేవరెద్దును, దేవరభక్తులను ఎంపిక చేయాలన్నా వేడుక నిర్వహిస్తారు. బంధుమిత్రులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల వారు కూడా తరలివస్తారు. సంప్రదాయ వాయిద్యాలతో పాటు మద్దిళ్లు, కొమ్ములు ఊదడం, పలకలు కొట్టడం లాంటివి చేస్తారు. కొత్త ఎద్దును ఎంపిక చేసిన తర్వాత దానికి సంప్రదాయ అలంకరణ అనంతరం ఊరేగిస్తారు. దేవరెద్దు చనిపోతే... ఎక్కడైనా దేవరెద్దు చనిపోతే అంత్యక్రియలు వేడుకలా నిర్వహిస్తారు. అడవికి వెళ్లి పచ్చారు కొయ్యలు తెస్తారు. వాటితో విశ్వబ్రాహ్మణుల ద్వారా ప్రత్యేకంగా రథం తయారు చేయిస్తారు. ఎద్దు ప్రాణంతో ఉన్నప్పుడు ఎలా పడుకుని ఉంటుందో.. ఆ విధంగా రథంలో ఉంచుతారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఊరేగింపుగా తీసుకెళ్తారు. చెక్కభజనలు, పిల్లనగ్రోవి, డప్పులు, సాంస్కతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా సేవ చేస్తారు. భూమిలో గుంత తీసి ఖననం చేసే సమయంలో కూడా ఎద్దును కూర్చున్న స్థితిలోనే ఉంచుతారు. ఈ కార్యక్రమం ఒక తిరునాళ్లలా జరిపిస్తారు. దీనికి ఇతర గ్రామాల్లోని దేవరెద్దులు, దేవరభక్తులు కూడా తరలివస్తారు. నియమానుసారం.. దేవరభక్తులను నియమించడానికి గ్రామస్తులు స్నానం ఆచరించి నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటారు. ప్రతి ఒక్కరూ చేతిలో పండ్లు, ప్రసాదం పట్టుకుని కూర్చుంటారు. దేవరెద్దును తీసుకొచ్చి అక్కడ వదిలేస్తారు. మొదటిసారి ఎవరి ప్రసాదం స్వీకరిస్తే వారిని ఎద్దుభక్తుడిగా ఎంపిక చేస్తారు. ఈ విధంగా వరుసగా కదిరిభక్తుడు, గుర్రప్ప భక్తుడు, పూల భక్తుడులను నియమిస్తారు. ► దేవరభక్తుడు దేవరెద్దుకు పూజలు చేయడంతో పాటు ఉత్సవాలకు తీసుకెళ్లాలంటే ప్రత్యేకంగా అలంకరించాల్సి ఉంటుంది. కత్తి (బెత్తం) చేతపట్టుకుని దేవరెద్దుతో పాటు ఊరేగింపుగా వెళతాడు. ► కదిరి భక్తుడు నరసింహస్వామికి పూజలు చేయాల్సి ఉంటుంది. ఉత్సవాలకు నరసింహస్వామి చిత్రపటంతో వెళతాడు. ► గుర్రప్పభక్తుడు ఎద్దుకు సంబంధించిన ఆభరణాలు, ఉత్సవ సామగ్రి, గుర్రప్పస్వామి శిలతో కూడిన ఓ పెట్టెను ఎత్తుకుని వెళ్లాల్సి ఉంటుంది. ► పూల భక్తుడు ఏదైనా ఉత్సవాలు, తిరునాళ్లు జరిగినప్పుడు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి భక్తులను ఆహ్వానించాల్సి ఉంటుంది. కేవీ పల్లెలో.. అధిక సంఖ్యలో.. అన్నమయ్య జిల్లాలోని కేవీపల్లె, కురబలకోట, కలికిరి, సంబేపల్లె మండలాల్లో ప్రధానంగా దేవరెద్దుల సంస్కృతి ఉంది. కేవీపల్లె మండలంలో 12 గ్రామాల్లో ఒక్కో దేవరెద్దు చొప్పున ఉన్నాయి. తోటి దళితవాడ, నారమాకుపల్లె, గొర్లకణంపల్లె, గుట్టలపై బండకాడపల్లె, దిగువగడ్డ, పెండ్లిపెంట, పేయలవారిపల్లె, తీతవగుంటపల్లె, తువ్వపల్లె, బొప్పసముద్రం, తిమ్మాపురం, వంకవడ్డిపల్లెలో దేవరెద్దులు ఉన్నాయి. సంబేపల్లె మండలంలో అన్నప్పగారిపల్లె, శెట్టిపల్లె, గున్నికుంట్ల, గురిగింజకుంట, కలకడ మండలంలో పాళెంమూల, బాలయ్యగారిపల్లె పంచాయతీ నాయనవారిపల్లె, కలికిరి మండలంలో అద్దవారిపల్లెలోనూ దేవరెద్దులు ఉన్నాయి. కురబలకోట మండలంలో కూడా అక్కడక్కడా ఉన్నాయి. కాగా.. ఒకటి, రెండు గ్రామాల్లో మాత్రమే కొత్తగా దేవరెద్దులు పుట్టాయి. దేవరెద్దు అంటే.. ఏ గ్రామంలో అయినా పుట్టిన దూడ వారం రోజులైనా పాలు తాగకుండా ఉంటే.. దాన్ని దేవాలయం వద్దకు తీసుకెళ్లి ప్రసాదం పెడతారు. అది తింటే దానిని దేవరెద్దుగా పరిగణిస్తారు. దానిని సంరక్షించుకుంటే గ్రామాలకు శుభం కలుగుతుందని నమ్ముతారు. ఉత్సవాలకు ఊరేగింపుగా.. దేవరెద్దు ఉన్న ఊళ్లతో పాటు సమీప ప్రాంతాల్లో ఎక్కడ ఉత్సవాలు జరిగినా వీటిని ప్రత్యేకంగా ఊరేగింపుగా తీసుకెళతారు. ప్రధానంగా శివరాత్రి సందర్భంగా జరిగే ఝరి ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా ఇవి నిలుస్తాయి. ఆ రోజున జాగరణ నిర్వహించిన ప్రజలు మరుసటి రోజు ఉదయాన్నే ఝరికోనలో స్నానమాచరిస్తారు. అక్కడికి దేవరెద్దును, నాణ్యాలు(దెవరెద్దు పూజసామగ్రి)ని ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. దీనిని చూడటానికి జనం పెద్ద ఎత్తున తరలివస్తారు. పూజ సామగ్రి కోసం దేవరిల్లు దేవరెద్దు కోసం ప్రత్యేకంగా ఇల్లు ఏర్పాటు చేస్తారు. దానిని దేవరిల్లు అంటారు. అందులో దేవుని చిత్రపటాలు ఉంచుతారు. దేవరెద్దు అక్కడే ఉంటుంది. దానికి అలంకరణ సామగ్రి కోసం ప్రత్యేకంగా పెట్టె ఉంటుంది. గంట, గజ్జెలు, మువ్వలు, మల్లముట్లు, గొడుగులు, వస్త్రం తదితరాలుంటాయి. వాటిని దేవరింటిలో భద్రపరుస్తారు. కొత్త దేవరెద్దు ఎంపిక ఇలా.. దేవరెద్దు చనిపోయిన స్థానంలో కొత్త దాన్ని ఎంపిక చే సేందుకు గ్రామస్తులంతా పూజలు నిర్వహిస్తారు. గ్రా మంలో పండ్లు, ప్రసాదాలు పెట్టి దూడలు, ఎద్దులను ఒక చోట వదులుతారు. ఏది అయితే ప్రసాదం స్వీకరిస్తుందో.. దాన్ని దేవరెద్దుగా పరిగణిస్తారు. కొత్తగా దేవరెద్దు ఎంపికైన అనంతరం మూడేళ్లకు తిరునాల నిర్వహిస్తారు. దానికి మిగతా గ్రామాల్లోని దేవరెద్దులను కూడా ఆహ్వానిస్తారు. గ్రామానికి వచ్చిన వాటికి మంగ ళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలుకుతారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సంబరాలు చేసుకుంటారు. దేవర భక్తులు.. సదా సంరక్షకులు గ్రామంలో దేవరెద్దును సంరక్షించడానికి, పూజలు చేయడానికి, ఉత్సవాలకు తీసుకు వెళ్లడానికి నలుగురు వ్యక్తులుంటారు. వీరిని దేవర భక్తులు అంటారు. ఎక్కువగా ఏళ్ల తరబడి ఒకే కుటుంబ సభ్యులు దేవరెద్దు భక్తులుగా ఉంటారు. వారిని ఎద్దు భక్తుడు, కదిరి భక్తుడు, గుర్రప్పభక్తుడు, పూల భక్తుడిగా పిలుస్తారు. నిష్టగా ఉంటాం మేము చాలా నిష్టగా ఉంటాం. భక్తుడిగా నియమించినప్పటి నుంచి ఎద్దు బాగోగులు నేనే చూసుకుంటున్నా. 25 ఏళ్లుగా మా వంశస్తులే దేవరెద్దు భక్తులుగా ఉన్నాం. దేవరెద్దు భక్తులతో పాటు ఇతర భక్తులు దేవరెద్దుకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. – యల్లయ్య, వీఆర్ఓ, ఎద్దు భక్తుడు, తోటిదళితవాడ, కేవీపల్లె మండలం. పురాతనకాలం నుంచి వస్తున్న ఆచారం మా గ్రామంలో దేవరెద్దును సంరక్షించడం, పూజలు నిర్వహించడం పురాతన కాలం నుంచి ఆచారంగా వస్తోంది. కొన్ని కట్టుబాట్లు పాటిస్తూ దేవరెద్దును సంరక్షించడం జరుగుతోంది. – నాగులయ్య, గుర్రప్ప భక్తుడు, తోటిదళితవాడ, కేవీపల్లె మండలం అదృష్టంగా భావిస్తున్నాం దేవరెద్దు రూపంలో దేవుడే ప్ర త్యక్షంగా కన్పిస్తున్నాడు. అలాంటి దేవరెద్దుకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. పండుగలు, ఉత్సవాలతోపాటు ప్రతి శనివారం క్రమం తప్పకుండా పూజలు నిర్వహిస్తాం. – నాగరాజ, పూల భక్తుడు, తోటిదళితవాడ, కేవీపల్లె మండలం ఒక్కపొద్దు పాటిస్తున్నాం ప్రతి శనివారం, పండుగల సమయంలో మేము ఒక్కపొద్దు పాటిస్తాం. దేవరింటిలో పూజ లు నిర్వహించడంతో పాటు అక్కడే భోజనం వండుకుని దేవరెద్దుకు పూజలు నిర్వహించిన తరువాతనే ఒక్కపొద్దు విడుస్తాం. – శశికుమార్, కదిరి భక్తుడు, తోటిదళితవాడ, కేవీపల్లె మండలం గౌరవంగా చూసుకుంటాం దేవరెద్దు సంప్రదాయం పెద్దల కాలం నుంచి వస్తోంది. ఎద్దును గౌరవంగా చూసుకుంటున్నాం. మాలో ఎవరైనా చనిపోతే కొత్త భక్తుడిని దేవరెద్దే ఎంపిక చేసుకుంటుంది. – కె.వంశీ, దేవరభక్తుడు, దిగువబోయపల్లె, కురబలకోట మండలం 40 ఏళ్లుగా.. దేవరెద్దును దేవుడితో సమానంగా చూస్తారు. పండుగలు, ఉత్సవాల సందర్భాల్లో అలంకరించి ఊరేగిస్తారు. 40 ఏళ్లుగా భక్తుడిగా ఉన్నా. – శిద్దప్ప, దేవరభక్తుడు, మండ్యంవారిపల్లె, కురబలకోట మండలం -
మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. !?
భారతదేశంలో మరణానికి ముందు వెనుకల కూడా సనాతనమైన, అమానవీయమైన సాంప్రదాయాలు మనిషిని వెంటాడుతున్నాయి. ఆ సంప్రదాయాల్లో పడి గంజిలో పడ్డ ఈగల్లా బయ టకు రాలేక, అందులో పడి చావలేకా... కొట్టుమిట్టాడుతున్నాం. అద్దె ఇంట్లో ఆత్మీయులు, కుటుంబ సభ్యులు మరణిస్తే కనీసం అక్కడ ఉండి కర్మకాండలు నిర్వహించుకోవడానికి వీలులేని దయనీయ సామాజిక వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అందుకే అద్దె ఇంట్లో ఉండేవారు అంతిమ దశలో తమకంటూ సొంత గుడిసె అయినా ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ తల్లి తన కుమారుణ్ణి ఊరు చివర చిన్న గుడిసె అయినా పరవాలేదు, సొంత ఇల్లు కట్టమని వేడుకుంది. దీంతో ఆమె కుమారుడు లోన్ తీసుకుని సొంతిల్లు కట్టి తల్లి భయాన్ని పోగొట్టాడు. కరీంనగర్ పట్టణంలో బస్వరాజు కనకయ్య, భార తమ్మ అనే రజక దంపతులు ఎన్నో ఏళ్ళుగా తమ చేతనైన పనిచేసుకొని బతుకుతున్నారు. వాళ్లకు ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి స్వప్న దివ్యాంగురాలు. ఒక కాలు పని చేయదు. రెండో అమ్మాయి సరితకు పెళ్ళయ్యింది. నిజానికి బసవయ్యకు పెళ్లయిన ఒక కుమారుడు ఉన్నా అతడు తొమ్మిదేళ్ల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. అప్పుడు కూడా అప్పటి అద్దె ఇంటి యజమాని ఇంటికి రానివ్వలేదు. ఇపుడు బసవరాజు కనకయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడి మరణించాడు. ఆసుపత్రి యాజమాన్యం ఆయన బతికే అవకాశం లేదని, ఇంటికి తీసుకుపోతే బాగుంటుందని చెప్పింది. ఆ స్థితిలో ఉన్న కనకయ్యను ఇంటికి తీసుకుపోతే, ఇంటి యజమానులు రానీయలేదు. గత్యంతరం లేక కరీంనగర్ పట్టణంలోని శ్మశానంలోకి తీసుకెళ్ళారు. ప్రాణం ఉండగానే కనకయ్యను శ్మశానంలోకి తీసుకెళ్ళిన కుటుంబం ఆయన చావుకోసం ఎదురు చూసింది. ఒక రోజు తర్వాత కనకయ్య కన్నుమూశాడు. మరణానంతరం జరగాల్సిన కర్మకాండ అంతా ముగించుకొని మాత్రమే తిరిగిరావాలని ఇంటి యజమాని చెప్పడంతో ఇద్దరు ఆడపిల్లలతో మృతుని భార్య 14 రోజులు శ్మశానంలోనే గడిపింది. హైదరాబాద్‌లోని అపార్ట్మెంట్లలో ఎవరైనా అద్దెకు ఉండి, అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, ఆ కాంపౌండ్ నుంచి శవాన్ని తీసివేయాలి. ఒకవేళ ఆసుపత్రిలో మరణిస్తే అటునుంచి అటే సొంత ఊరికైనా తీసుకెళ్ళాలి. లేదా నేరుగా శ్మశానానికి తీసుకెళ్ళాలి. కొన్ని గ్రామాల్లో మరొక వింత సాంప్రదాయం ఉంది. ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళి, చికిత్స పొందుతూ మరణిస్తే, ఆ వ్యక్తి మృతదేహాన్ని రానివ్వని గ్రామాలు కూడా ఉన్నాయి. పది సంవత్సరాల క్రితం మంథని దగ్గర్లోని ఒక ఊరి ప్రజలు ఇట్లాగే ప్రవర్తిస్తే, పోలీసుల సహకారంతో ఆ మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. దీనికి నేనే ప్రత్యక్ష సాక్షిని. అదేవిధంగా తిరుపతి పట్టణంలో, దాని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినట్టు, జరుగుతున్నట్టు పాత్రికేయ మిత్రుల ద్వారా తెలిసింది. విశాఖతో పాటు అనేక చోట్ల ఇంటి అద్దె కోసం వచ్చిన వాళ్ళను కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు ఉంటే ఇంటి యజమానులు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. మనిషికి మరణం తథ్యమనీ, అది ఎప్పుడైనా, ఎవరికైనా రావొచ్చనీ తెలిసి కూడా మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారనేది అర్థం కాని ప్రశ్న. దీనికి గాను నేను ఎవ్వరినీ నిందించడం లేదు. కానీ దీని గురించి ఆలో చించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కొందరు పుట్టించిన సాంప్రదాయాలు కారణమవుతున్నాయని భావించక తప్పదు. ఇంట్లో ఒక మరణం జరిగితే, కొందరు పురోహి తుడిని సంప్రదిస్తుంటారు. ఇటీవల ఇటువంటి వారి సంఖ్య మరింత పెరిగింది. ఆ పురోహితుడు... వ్యక్తి ఏ ముహూర్తంలో చనిపోయాడో నిర్ణయించి దుర్ముహూర్తమైతే, దానికి శాంతి ఉపాయాలు సూచించి, కొన్నిసార్లు కొన్ని నెలల పాటు మరణించిన ఇంటిని విడిచి పెట్టాలని సూచిస్తున్నారు. దీనిని చూసి ఇంటి యజమానులలో... తమ ఇంట్లో వేరే వాళ్ళ మరణం జరగరాదని, మృతదేహాన్ని ఇక్కడపెట్టరాదనే ఛాందస భావనలు కూడా బాగా పెరుగుతున్నాయి. తమ ఇంట్లో పెళ్లి జరగబోతున్న వారు సొంత బంధువుల అంత్యక్రియలకూ హాజరు కావడానికి ఇష్టపడటం లేదు. ఇట్లా మరణం చుట్టూ అల్లుకున్న ఈ ప్రవర్తన మన సమాజం డొల్లతనాన్ని చూపెడుతున్నది. నిజానికి మన రచనలలో, ప్రసంగాల్లో మృత దేహాన్ని పార్థివ దేహం అంటారు. అంటే పంచభూతాలతో నిండిన శరీరం జీవం పోవడం వల్ల... వాయువును, అగ్నిని, నీటిని, తన సహజ స్వభావాన్ని కోల్పోయి కేవలం మట్టిగా మిగిలిందని చెబుతారు. మట్టి మట్టిలో కలుస్తుంది. పంచ భూతాలతో నిండిన శరీరంలో మట్టి మిగిలినందున ఎంతో పవిత్రమైందిగా చూడాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండడం వింత సాంప్రదాయంగా భావించొచ్చు. కానీ చావును ఒక భయంకరమైన ఘటనగా చూపించి, దాని చుట్టూ ఒక మూఢనమ్మకాన్ని సృష్టించి, ఆ అంధ విశ్వాసాన్ని సమాజం అంతటా వ్యాప్తి చేస్తున్నారు. ఇటువంటి మూఢ నమ్మకాలను తొలగించకుండా, సమాజంలో మానవత్వాన్ని నింపలేం. ఈ మూఢ నమ్మకాలను ప్రేరేపిస్తున్న వారే ముందుకు వచ్చి, ఇవి సరైనవి కావని చెప్పాలి. లేదా అవి శాస్త్రీయమైనవైతే వాటిని ఆధారాలను, శాస్త్రాలను బయటపెట్టాలి. ఒకవేళ వాళ్ళు ఆ పని చేయలేకపోతే, మానవత్వమున్న ప్రతి ఒక్కరం దీని మీద ఒక కార్యాచరణకు పూనుకోవాలి. అదే విధంగా ప్రభుత్వం వైపు నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయాలి. ఇంటి యజమానులు ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడితే, శిక్షించడానికి వీలుగా ఆ చట్టంలో సవరణలు చేసి, వాళ్ళను శిక్షార్హులుగా చేయాలి. దీని గురించి న్యాయనిపుణులు, ప్రజా ప్రతినిధులు ఆలోచిం చాలి. మన దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న పట్టణీకరణ, అద్దె ఇండ్ల సమస్యలను పెంచుతున్నది. కావున ఇది కోట్ల మంది సమస్య. రాజకీయ పార్టీలు, సంఘాలు మానవత్వంతో తమ పాత్రను నిర్వహించాల్సి ఉంది. (క్లిక్ చేయండి: 66 ఏళ్లుగా సర్వసాధారణం.. ఇప్పుడెందుకు వివాదం!) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
పెళ్లికి కట్నకానుకలు రద్దు.. ఏకగ్రీవ తీర్మానం
సాక్షి, ఇంద్రవెల్లి: తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను కాపాడడానికి ఆదివాసీలు దృష్టి సారిస్తున్నారు. రోజురోజుకూ మారుతున్న కాలంలో ఆదివాసీలు పాత ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికి కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల్లో రాయిసెంటర్ల సార్మెడిల ఆధ్వర్యంలో గ్రామాల పెద్దలతో సమావేశాలు నిర్వహించి తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పాత పద్ధతిలో పెళ్లిలు నిర్వహణ, కట్నకానులకు దూరంగా ఉండాలని ఆయా ఆదివాసీ గ్రామాల పెద్దల సమక్షంలో తీర్మానాలు చేస్తున్నారు. ఫంక్షన్ హాల్లో పెళ్లిలు రద్దు... ప్రస్తుతం మారుతున్న కాలంలో ఒక్కరిని చూసి ఒక్కరూ ఉన్న కుటుంబీకులు పెళ్లి వేడుకలు వరుడు ఇంట్లో కాకుండా ఫంక్షన్ హాల్లో నిర్వహించడంపై చర్చించారు. పెళ్లి వేడుకలు వరుడు ఇంట్లో లేదా.. ఇల్లరికం అయితే వధువు ఇంట్లో నిర్వహించాలని ఆదివాసీ పెద్దలు తీర్మానాలు చేశారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం... తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు యథావిధిగా కొనసాగించడం, పెళ్లిల్లో అక్కాచెల్లెల్లు తప్ప ఇతరులకు అహేరి(కానుక)లు రద్దు చేయుడం, సామూహిక వివాహాలు చేయడం, ఎర్రబోట్టు కార్యక్రమంలో సాల్ ముద్ద(బంగారపు ఉంగరం) ఇవ్వరాదు. పెళ్లిచూపులకు పది మంది కంటే ఎక్కువ మంది వెళ్లరాదు. పెళ్లి వేడుకల్లో నాలుగు డోళ్లు మాత్రమే ఉపయోగించాలి. వధువును పెళ్లికి ఒక రోజు ముందే పెళ్లి కొడుకు గ్రామానికి పంపించాలి. నిర్ణయించిన సమయంలో పెళ్లి చేయాలి. అక్షింతలు పసుపుతో కలిపిన బియ్యం మాత్రమే వాడాలి. వధూవరులకు ముఖాముఖిగా తమకు తోచిన కట్నకానుకలు ఇవ్వాలి. వివాహ వేడుకల్లో వరుడు దోతి, రూమల్ ధరించాలి. పెళ్లి మండపంలో కరెకోపాల నీటితో మండపం వద్దనే స్నానం చేయించాలి. కట్నం, హుండీ, బండి, బెడ్, కూలర్, ప్రీజ్ ఇవ్వడం రద్దు చేస్తూ తీర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్, వడగామ్, ఇంద్రవెల్లి తదితర రాయిసెంటర్లలో సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేశారు. పాత ఆచారాలను అమలు చేయాలి ప్రస్తుత కాలంలో కొనసాగుతున్న వరకట్నాలు, కానుకలతో నిరుపేద కుటుంబీకులు పెళ్లిలు చేయాలంటే ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. రాయిసెంటర్ సమావేశంలో ఆదివాసీ పెద్దలు చేసిన తీర్మానాన్ని ఆదివాసీ గ్రామాల్లో అమలు చేసి పాత పద్ధతి, తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహరాలు, సంస్కృతి, సంప్రదాయాలను అన్ని గ్రామాల్లో అమలు చేయాలి. – ఆత్రం మారు, వడగామ్ కట్నం లేని పెళ్లి చేద్దాం.. సిర్పూర్(యూ): పేదల ఇంట్లో ఖర్చు లేకుండా పెళ్లి చేయలాంటే ఆదివాసీ పెళ్లిళ్లు ఎంతో ఆదర్శం. గతంలో ఆదివాసీ ప్రజలు తమ కూతురుకు పెళ్లి చేయాలంటే నయా పైస ఖర్చు లేకుండా జరిగిపోయేది. పెళ్లికి సంబంధించిన ప్రతి పనిని గ్రామస్తులు అన్ని తామై చేసేవారు. కాలక్రమంలో వరకట్నాలు, బహుమతులు, కానుకలు ఇవ్వడం మొదలైంది. ఇలాంతి సంస్కృతి సమాజానికే ప్రమాదమని గ్రహించి ఆదివాసీ పెద్దలు తిరిగి తమ పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు. కట్నకానుకలు నిషేధిస్తూ తీర్మానాలు చేస్తున్నారు. సిర్పూర్(యు) గ్రామ పటేలు ఆత్రం ఆనంద్‌రావు కట్నాకానుకలు తీసుకోవద్దని తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని రాయిసెంటర్‌లో సమర్పించి అన్ని గ్రామాల్లో ఇదే పద్ధతి అమలయ్యేలా నాంది పలకనున్నట్లు గ్రామపటేళ్లు చెబుతున్నారు పెళ్లి పేదలకు భారం కాకూడదు.. గతంలో ఆదివాసీ ప్రజలు తమ కూతురుకు పెళ్లి చేస్తున్నారంటే ఎలాంటి ఖర్చు లేకుండా జరిగేది. కానీ నేటి ఆధునిక యుగంలో ఒకరిని చూసి ఒకరు కట్నాలు ఇవ్వడం, తీసుకోవడం మొదలు పెట్టారు. ఈ పద్ధతి సమాజానికి మంచిది కాదని భావించాం. పేదవారికి పెళ్లి అనేది భారం కాకూడదనే ఉద్దేశంతో కట్నాలను నిషేధిస్తూ గ్రామ తీర్మానం చేశాం. పెద్దలతో చర్చిస్తూ అన్నీ గ్రామాల్లో ఇదే పద్ధతిని అమలు చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నం. పాత ఆచారాలు, సంప్రదాయాలు అందరికీ మేలుచేస్తాయి. – ఆత్రం ఆనంద్‌రావు, గ్రామపటేలు మంచి నిర్ణయం ప్రస్తుతం కట్నకానుకలతో ఆడ పిల్లల పెళ్లిలు నిర్వహించడానికి నిరుపేద కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతన్నారు. అదే విధంగా రోజురోజుకూ మారుతున్న కాలంలో పాత ఆచారాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. రాయిసెంటర్‌లో చేసిన తీర్మానం ప్రకారం పెళ్లిలు, వేడుకలు నిర్వహించాలి. ప్రతి గ్రామంలో అమలు చేయాలి. – రాయిసిడం అన్నపుర్ణ, గోండ్‌గూడ మా కాలంలో కట్నాలు లేవు మా కాలంలో కట్నాలు లేవు.. కానుకలు లేవు... సాధారణంగా పెళ్లి చూపులు చూసి ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పెళ్లిలు జరిగాయి. రోజురోజుకూ పెళ్లి వేడుకల్లో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు పెళ్లిలు చేయడానికి కట్నాలు, కానుకల పేరుతో లక్షలు కూడా సరిపోవడం లేదు. పాత పద్ధతిలో వేడుకలు నిర్వహించాలి. – ఆత్రం లక్ష్మిబాయి, ఇంద్రవెల్లి, గోండ్‌గూడ -
మగువల తెగువ.. జల్లికట్టు.. కొత్తరూటు
ఎర్ర తువ్వాలును గాల్లో గిర్రాగిర్రా తిప్పుతూ.. పొగరుతో బుసలు కొట్టే బసవన్నలను కనుసన్నలతో శాసిస్తూ.. క్రీడాకారులకు వాటిని చిక్కకుండా దౌడు తీయించే సాహస క్రీడా చాణక్యాన్ని ప్రదర్శించడంలో మగువలు సైతం తెగువ చూపుతున్నారు. వీరత్వం పురుష పుంగవులకే పరిమితం కాదని.. నారీమణుల ధీరత్వం సైతం మగధీరులకు ఏ మాత్రం తీసిపోదని ఎలుగెత్తి చాటుతున్నారు. సాహస క్రీడ జల్లికట్టు పోటీల్లో తమిళ తంబిలతో తలపడుతూ వారికే సవాల్ విసురుతున్నారు. మధురై పౌరుషానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. సాక్షి, చెన్నై: సంస్కృతి.. సంప్రదాయాలు.. కళలు.. ఆలయాలు.. వారసత్వ సంపదల వంటి విభిన్న విశేషాల సమాహారంతో నిండిన రాష్ట్రం తమిళనాడు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయులపై తిరగబడ్డ వీర నారీమణి వేలునాచ్చియార్, తన భర్తకు జరిగిన అన్యాయంపై తిరగబడి మధురైను తగులబెట్టిన కన్నగి లాంటి వారెందరో తమిళ మంగై (తమిళ నారీమణి)లుగా చరిత్రకెక్కారు. వీరత్వానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన వారే కాకుండా.. దేశ రాజకీయాలతోపాటు ప్రాధాన్యతా రంగాల్లోనూ సత్తా చాటుతున్న మంగైలు ఎందరో ఈ గడ్డపై పుట్టారు. తమిళనాట అత్యంత భయంకరమైన సాహస క్రీడగా పేరొందిన జల్లికట్టులోనూ ప్రవేశిస్తూ ఇక్కడి మహిళలు మధురై వీరత్వాన్ని, పౌరుషాన్ని చాటుతామంటూ తెరపైకి వస్తున్నారు. బరిమే సవాల్ తమిళ గడ్డపై పూర్వం వరుడిని ఎంపిక చేసుకునేందుకు జల్లికట్టు క్రీడను యువతులు వేదికగా చేసుకున్నట్టు చరిత్ర చెబుతోంది. ఆ తరువాత కాలంలో యువతుల్ని మెప్పించేందుకు యువకులు ఈ సాహసాన్ని ప్రదర్శించగా.. రానురాను ఇదో రాక్షస క్రీడగా మారింది. సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున ప్రారంభమయ్యే ఈ క్రీడ ఒకప్పుడు ఆరు నెలలపాటు జిల్లాల వారీగా తమిళనాడు వ్యాప్తంగా జరిగేది. ప్రతి జిల్లాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న యువకులు తమ వీరత్వాన్ని చాటుకునేందుకు జల్లికట్టు బరిలోకి దిగేవారు. ఆకర్షణీయమైన బహుమతుల్ని తన్నుకెళ్లేందుకు రానురాను ఎద్దులను హింసించడం పెరిగింది. పొగరెక్కిన ఎద్దుల దాడిలో ఎన్నో మరణాలు సైతం చోటుచేసుకున్నాయి. బసవన్నలు బుసలు కొట్టేవిధంగా వాటికి మద్యం, సారా వంటివి పట్టిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో జంతు ప్రేమికులు రంగంలోకి దిగడంతో జల్లికట్టుపై ఆరేళ్ల క్రితం సుప్రీంకోర్టు నిషేధించింది. సంప్రదాయ సాహస క్రీడను తిరిగి సాధించుకునేందుకు 2017లో యావత్ తమిళావణి మహోద్యమంతో కదం తొక్కింది. జల్లికట్టును మళ్లీ సాధించుకున్న తర్వాత తమిళ వీర మంగైలు సైతం సత్తా చాటుకునే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎద్దులను మచ్చిక చేసుకుని శిక్షణ ఇవ్వడంతోపాటు వాటిని జల్లికట్టుకు సిద్ధం చేయడం మొదలెట్టారు. అయితే, వీరికి క్రీడా మైదానంలోకి కొన్నేళ్లుగా అవకాశం దక్కలేదు. దీంతో వారంతా వాడివాసల్ (ప్రవేశ మార్గం) వెనుకకే పరిమితమయ్యారు. కాగా, ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా తమిళ మగువలు క్రీడా మైదానంలో అడుగు పెట్టి సత్తా చాటారు. అందుకే తిరస్కరించా.. నాకు ప్రోత్సాహక బహుమతి ఇచ్చారు. వీరత్వాన్ని చాటుకున్న తర్వాతే బహుమతి తీసుకోవాలన్నది నా లక్ష్యం. అందుకే తిరస్కరించాను. ప్రతిరోజు నా తమ్ముడు(ఎద్దు)తో రెండు గంటలపాటు పొలంలో సాధన చేయిస్తాను. వాడికి మంచి పౌష్టికాహారం అందిస్తాను. ఈసారి తమ్ముడు తీవ్రంగానే పోరాటం చేశాడు. వచ్చేసారి గెలిచి తీరుతాడు. – యోగదర్శిని, అవనియాపురం ఆ ఉద్యమం స్ఫూర్తిగా.. 2017లో జరిగిన జల్లికట్టు ఉద్యమమే నాకు స్ఫూర్తి. నాన్నతో పట్టుబట్టి ఓ ఎద్దును కొనిపించి శిక్షణ ఇచ్చాను. చెరువు, నీటి పరీవాహక ప్రదేశాలు, మట్టి దిమ్మెలు అధికంగా ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లి మరీ సాధన చేయిస్తున్నా. అందుకే వాడిద్వారా బంగారు నాణెం బహుమతిగా లభించింది. ఇది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో మరింత ముందుకు దూసుకెళ్తా. – స్నేహ, అలంగానల్లూరు తమిళనాట ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ మధురై జిల్లా అవనియాపురం వేదికగా భోగి రోజున జరిగిన జల్లికట్టులో అదే ప్రాంతానికి చెందిన 9 తరగతి విద్యార్థినులు అన్నలక్ష్మి, నిషా, పదో తరగతి విద్యార్థిని యోగదర్శిని తొలిసారిగా క్రీడా మైదానంలోకి తమ ఎద్దులతో దూసుకొచ్చారు. అన్నలక్ష్మి, నిషా వద్ద శిక్షణ పొందిన ఎద్దులు బుసలు కొడుతూ క్రీడాకారులకు చిక్కకుండా ఆకర్షణీయమైన బహుమతుల్ని తన్నుకెళ్లాయి. యోగదర్శిని ఎద్దు క్రీడాకారులకు చిక్కడంతో ఆ బాలికకు నిర్వాహకులు ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు. అయితే, యోగదర్శిని ఆ బహుమతిని తిరçస్కరించి.. ‘మరోసారి కలుద్దాం.. కచ్చితంగా గెలుద్దాం’ అంటూ వాడివాసల్ వేదికగా ప్రతిజ్ఞ చేసి వెళ్లింది. ప్రస్తుతం తమిళనాట అంతటా ఇదే హాట్ టాపిక్. ఆ మరుసటి రోజున పాలమేడులో కొందరు బాలికలు తమ ఎద్దుల్ని వాడివాసల్ నుంచి బయటకు రప్పించి మెరిశారు. ఇక ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరులో సోమవారం జరిగిన జల్లికట్టులో స్నేహ అనే 16 ఏళ్ల బాలికతో పాటుగా మరో ఇద్దరు బాలికలు తమ ఎద్దులతో వచ్చి బంగారు నాణేలను గెలుచుకెళ్లారు. ఇదే సందర్భంలో తమిళ సంప్రదాయాల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని.. మన సంస్కృతిని భావితరాలకు సైతం అందించాలంటే ప్రతి నారీ జల్లికట్టులో భేరీ మోగించాల్సిందేనని పిలుపునిచ్చారు. దీనినిబట్టి చూస్తే భవిష్యత్‌లో మగధీరులకు జల్లికట్టు పోటీల్లో మరింత పోటీ తప్పదన్న మాట. -
అపాయం తొలగిస్తూ అడుగెట్టవమ్మా శ్రీశార్వరి
ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ‘ఉగాది’ అన్న తెలుగుమాట ‘యుగాది’ అన్న సంస్కృత పద వికృతి రూపం. బ్రహ్మ ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు. దీనికి ఆధారం వేదాలను అధారం చేసుకొని వ్రాయబడిన ‘సూర్య సిద్ధాంతం’ అనే ఖగోళ జ్యోతిష గ్రంథం. బ్రహ్మ కల్పం ఆరంభమయే మొదటి సంవత్సరం (ప్రభవ) లో మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం ( చైత్ర మాసం)లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్ధం. అందుకే మొదటి సంవత్సరానికి ‘ప్రభవ’ అని పేరు. చివరి అరవయ్యవ సంవత్సరం పేరు ‘క్షయ’ అంటే నాశనం అని అర్థం. ఉగాది సంప్రదాయాలు ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షం లో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు, ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఉగాదిరోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబ కుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం) పంచాంగ శ్రవణం తదితర పంచకృత్యాలను నిర్వహించాలని వ్రతగ్రంథ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారమే. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాది పూజ అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినక ముందే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో ‘నింబ కుసుమ భక్షణం’, ‘అశోకకళికా ప్రాశనం’ అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేప పూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులు కానీ, పదిహేను రోజులు కానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు. ప్రస్తుతం కరోనా వైరస్ భయం మూలంగా ఉగాదికి పంచాంగ శ్రవణం చేసే అవకాశం లేదు కాబట్టి కనీసం యూట్యూబ్‌లో లేదా టీవీలలో, రేడియోలలో అయినా పంచాంగంలో రాశిఫలాలను తెలుసుకోవచ్చు. ఉగాది పర్వదినాన శిరఃస్నానం చేయకుండా ఉండటం, విడిచిన లేదా చిరిగిన దుస్తులు ధరించటం వల్ల జన్మజన్మల దరిద్రం, అనారోగ్యం పీడిస్తాయని పెద్దలు చెబుతారు కాబట్టి ఇంటిని, ఒంటిని శుభ్రంగా ఉంచుకోవడం విధాయకం. ఎక్కడికీ కదలలేని చెట్లు కూడా తమ ఆకులను రాల్చేసుకుని చివుళ్లు తొడిగి పూత, పిందెలతో కళకళలాడే ఈ వసంతరుతువులో మనం కూడా మనలోని చెడు అలవాట్లను, నకారాత్మక ఆలోచనలను వదిలేసి, శుచి, శుభ్రత, సంయమనం, సమయపాలన, సమయోచిత కార్యాలను ఆచరించటమనే సద్గుణాలను అలవరచుకుందాం. – డి.వి.ఆర్. భాస్కర్ శ్రీ శార్వరి అంటే ఏమిటి? నేడు మనం అడుగిడుతున్న కొత్త తెలుగు సంవత్సరానికి శ్రీశార్వరి అని పేరు. కాళరాత్రి అని, శుభకరి అని, చంద్రకాంత అని, హిమం అనీ, పంటలు బాగా పండేదనీ అనేక అర్థాలున్నాయి ఈ పదానికి. అంతేకాదు... శ్రీ శార్వరి అనేది అమ్మవారి నామాలలో ఒకటి. అమ్మవారి ముఖం ఎప్పుడూ పచ్చగా ఉంటుంది కాబట్టి పసుపు పూసుకునేది మన సంప్రదాయం ప్రకారం సుమంగళి కాబట్టి ఈ సంవత్సరం అందరికీ ఆరోగ్యాలు మెరుగవుతాయనీ, పంటలు బాగా పండి అందరూ సుఖసంతోషాలతో ఉంటారనీ ఆశిద్దాం. -
మానవతా స్ఫూర్తి
తెలుగువారి పెద్ద పండుగ మకర సంక్రాంతి. మకర సంక్రాంతి నాడే ఉత్తరాయణం ప్రారంభమౌతుంది. సూర్యరశ్మి ప్రభావం భూగోళంపై క్రమంగా పెరుగుతుంది. ఆ సమయంలో దానధర్మాలు ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంధాలు చెప్పాయి. అందుకే మకర సంక్రాంతి మనవతా స్ఫూర్తి అయింది. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి ‘ధనుర్మాసం’గా అనేక రూపాలలో.. తెలుగు లోగిళ్లలో స్త్రీలు, పురుషులు, పండితులు, పామరులు, ధనవంతులు, పేదవారు అందరూ పాలుపంచుకునే విధంగా కళలు, సంస్కృతి, సంప్రదాయలు రూపొందాయి. వీటిల్లో రంగవల్లులు, జానపద కళారూపాలు, పొంగలి, పిండివంటలు ప్రధానమైనవి. రంగవల్లులు సంప్రదాయంలో సూచించిన విధంగా బియ్యప్పిండితో ఎనిమిది రేకుల పద్మం ముగ్గు మొదలు అనేక ముగ్గులను పోటీపడి మరీ మహిళలు నెలంతా తీర్చిదిద్దుతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, అమ్మవారికి సంకేతంగా పసుపు, కుంకుమ వంటి రంగులు చల్లుతారు. పర్యావరణ పరిశుభ్రత, పరిరక్షణ వంటి ఐహిక ప్రయోజనాలు కూడా ఈ ముగ్గులు వేయడంలో ఉన్నాయి. కళారూపాలు తెలుగు సంక్రాంతి పండుగకు ప్రత్యేకమైనవి జానపద కళారూపాలు. కళాకారులు భారతీయ సంస్కృతి, పురాణాలు, కథలు, గాథలు అన్నీ ఈ నెలరోజులు ఇంటి ముందుకు వచ్చి పిల్లలను, స్త్రీలను అక్కడికక్కడే విజ్ఞానవంతులను చేసేవిధంగా వీధి ప్రదర్శనలు ఇస్తారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తన చిన్నతనంలో ఇంటి ముందుకు వచ్చే జానపదకళారూపాలను చూసి భారత భాగవత రామాయణాలు, శాస్త్రీయ విషయాలు తెలుసుకున్నానని వాటి ఆవ«శ్యకతను వివరించారు. పొంగలి ధర్మశాస్త్రం చెప్పిన పాయసం తెలుగు నేలలో పొంగలి అయింది. అదీ కొత్త బియ్యంతో, ఆవు పాలతో ఉడికించిన పొంగలి. తెలుగువారికి ఇది పొంగలి పండుగ. రైతులకు, వ్యవసాయ కూలీలకు, వ్యవసాయంపై ఆధారపడిన అన్ని వృత్తులవారికీ, పశువులకు అందరికీ ఆనందాన్ని, విశ్రాంతిని ఇచ్చే సామాజిక పర్వం ఇది. ధాన్యపురాశులను ఇంటికి చేర్చటం, పనివారికి ధాన్యాన్ని పంచటం, కొత్త బియ్యం పొంగలి చేసి బంధుమిత్రులకు, పనివారికి అందరికీ పంచటమే అసలైన ప్రధానమైన పండుగ అయింది. పిండివంటలు ‘వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి’ అనుకునే తెలుగువారు.. సంక్రాంతి నాడు గారెలు తప్పనిసరిగా వండుతారు. అరిసెలు సంక్రాంతికి సంకేతమైన పిండివంట. ఈ రోజు కోసం ఎవరు ఏం చేసుకున్నా చుట్టుపక్కల వాళ్లందరికీ పంచుతారు. ఇవ్వడంలోని తీపిదనాన్ని పంచుకుంటారు. – డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
కొత్త సంవత్సరమంటే కొన్ని నమ్మకాలు..
ఎన్నో కలలతో మరెన్నో ఆకాంక్షలతో కొత్త దశాబ్దంలోకి అడుగు పెట్టబోతున్నాం. గ్రాండ్‌గా న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పబోతున్నాం. కొత్త ఏడాదంటేనే కొత్త ఉత్సాహం, కొత్త ఉల్లాసం, కొత్త ఉత్తేజం. అంత జోష్‌లోనూ కొత్త సంవత్సరమంటే కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వివిధ దేశాల ప్రజలు పాటించే ఆ సంప్రదాయాలు ఆసక్తిని రేపుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం. స్పెయిన్ డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మేల్కొని గడియారం ముల్లు సరిగ్గా 12 మీదకి రాగానే స్పెయిన్ దేశస్తులు 12 ద్రాక్షపళ్లు తింటారు. అలా తింటే అదృష్టం కలిసొస్తుందని వారి నమ్మకం. ఈక్వెడార్ ఈక్వెడార్‌లో డిసెంబర్ 31 రాత్రి ఎవరూ ఇళ్లల్లో ఉండరు. అందరూ రోడ్లపైనే గడుపుతారు. ప్రధాన కూడళ్లలో మంటలు రాజేసి రాజకీయ నాయకుల దిష్టి బొమ్మలను తగుల బెడతారు. ఈ చర్యతో గత ఏడాది కాలంలో జరిగిన చెడు అంతా పోయినట్టుగా భావిస్తారు. ఈ సంప్రదాయం 1895 నుంచి వస్తోంది. గ్రీస్ గ్రీస్‌లో జనవరి 1న చర్చికి వెళ్లి వచ్చిన వాళ్లందరికీ అక్కడ ఉల్లిపాయలు పంచుతారు. వాటిని తీసుకువచ్చి దండలా తయారు చేసి ఇంటి గుమ్మానికి వేళ్లాడతీస్తారు. ఉల్లిపాయలు అంటే ఆరోగ్యానికి, సంతానం వృద్ధికి, ఆయుఃప్రమాణాలు పెంచడానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే కొత్త సంవత్సరం ఉల్లిపాయల దండ గుమ్మానికి వేళ్లాడదీయడం శుభ పరిణామంగా విశ్వసిస్తారు. చెక్ రిపబ్లిక్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా చెక్ రిపబ్లిక్లో యాపిల్ కట్ చేస్తారు. అదీ కొత్త ఏడాది తమ అదృష్టం ఎంతో తెలుసుకోవడం కోసం. యాపిల్‌ను మధ్యకి కోస్తారు. యాపిల్ మధ్య భాగంలో విత్తనాలు ఉన్న చోట స్టార్ వస్తే కొత్త ఏడాదంతా మంచే జరుగుతుందని, అదే క్రాస్ వస్తే చెడు జరుగుతుందని వారి నమ్మకం. జపాన్ జపాన్‌లో కొత్త సంవత్సరం అంటే అర్ధరాత్రి గంటల్ని గణగణమని మోగిస్తారు. రాత్రి 12 అవగానే 108 సార్లు గంటలు మోగుతాయి. అలా చేస్తేనే తమ జీవితం ఆనందంగా సాగుతుందని అంటారు. ఇటలీ ఇటలీలో కొత్త సంవత్సరం కాస్త వినూత్నంగా ఉంటుంది. చెత్త సామాను వదిలించుకోవడానికి ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఇంట్లో ఉన్న చెత్త సామానంతటినీ బయట పడేస్తారు. అంటే మనసుల్లో ఉన్న చెడు జ్ఞాపకాల్ని వదిలించుకోవడం అన్నమాట. దక్షిణాఫ్రికావంటి దేశాలూ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. చిలీ కొత్త ఏడాది ఉత్సవాల్ని వివిధ దేశాల ప్రజలు చర్చిల్లో జరుపుకుంటే చిలీ వాసులు తమ రూటే సెపరేటు అంటున్నారు. తమకు అత్యంత ప్రియమైన వారి సమాధుల వద్ద ఈ సంబరాలు నిర్వహిస్తారు. సమాధుల్ని పూల తో అలంకరించి, దీపాలు ఉంచుతారు. ఈ లోకంలో లేకపోయినా సరే కొత్త సంవత్సరం ప్రియమైన వారిని తలచుకోవడం కంటే మించినదేదీ ఉండదని చిలీ వాసులు 1995 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. డెన్మార్క్ డెన్మార్క్‌లో రకరకాల పింగాణి పాత్రలు (క్రాకరీ)ని బద్దలు కొడతారు. ప్లేట్లు, కప్పులు, స్పూన్లు లాంటివన్నీ డిసెంబర్ 31 అర్ధరాత్రే విరగ్గొట్టేస్తారు. అప్పుడే అదృష్టం తమకి కలిసివస్తుందని వారి నమ్మకం. -
శారీ స్పీక్
భారతీయ మహిళల సంప్రదాయ కట్టు అయిన చీర ప్రత్యేకతను సోషల్ మీడియాలో చాటుతూ.. ఆ నేతను బతికించుకోవడానికి ఉత్సవాలూ నిర్వహిస్తోంది ‘శారీ స్పీక్’ గ్రూప్! మొన్న శనివారం హైదరాబాద్ లోని కర్మ శాంగ్రిల్లాలో జరిగిన ఫెస్టివల్ సందర్భంగా ‘శారీ స్పీక్’’ గురించి... శారీ స్పీక్ అనేది ఫేస్బుక్లో ఒక పేజీ. లక్షా పాతిక వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్! చీరకట్టు మీద ఉన్న ప్రేమతో మూడేళ్ల కిందట వినీ టండన్ అనే మహిళ ఈ గ్రూప్‌ను ప్రారంభించారు. మారిన జీవన శైలి దృష్ట్యా సౌకర్యం కోసం వస్త్రధారణ కూడా మారింది. దాంతో ప్రత్యేక సందర్భాలకే పరిమితమైపోయింది చీర. ఈ సంప్రదాయ కట్టుకు, దానితో కలబోసి ఉన్న నేతకూ పునర్వైభవం తెప్పించి, నేత కార్మికులకూ ఎంతో కొంత సహాయపడ్డానికి ‘శారీ స్పీక్’ గ్రూప్‌ను మొదలుపెట్టారు వినీ టండన్. ఆరంభించిన అనతికాలంలోనే సభ్యుల సంఖ్య లక్షకు చేరింది. పద్దెనిమిదేళ్లు నిండిన వాళ్లనుంచి అరవై ఏళ్లు పైబడ్డ వాళ్ల దాకా, దేశీ మహిళలతోపాటు విదేశీ వనితలూ ఇందులో సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్ ‘శారీ స్పీక్’ ఉత్సవంలో పాల్గొన్న సభ్యులు వీళ్లంతా చీర నేత, కట్టుతీరుతో పాటు తమ ప్రాంతపు జీవన విధానం, సంస్కృతీ సంప్రదాయల గురించి ఫేస్‌బుక్‌లోని ఈ శారీ స్పీక్ పేజీలో రాస్తుంటారు... ఆ చీరతో ఉన్న తమ ఫొటోను జతచేసి మరీ. ‘‘దీని వల్ల ఆ నేతే కాదు, ఆ ప్రాంతం గురించీ, దాని ప్రత్యేకత గురించీ ఇతర సభ్యులకు తెలుస్తుంది. కల్చరల్ ఎక్స్ఛేంజ్ జరుగుతుంది. భిన్న సంస్కృతి, సంప్రదాయాల మీద గౌరవం పెరుగుతుంది. ఐక్యతా ఏర్పడుతుంది. అయితే ఈ గ్రూప్‌లో చీరల అమ్మకాలు, కొనుగోళ్లుండవు’’ అని చెప్తారు శారీ స్పీక్ సభ్యురాలు భాను ఇలపావులూరు. థీమ్స్‌తో ఫ్యాషన్ షో శారీ స్పీక్ కేవలం సోషల్ మీడియా గ్రూప్‌కే పరిమితం కాకుండా యేడాదికి రెండుసార్లు భిన్నమైన థీమ్స్‌తో సమావేశమూ అవుతోంది. దాన్నో పండగలా నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా వాళ్ల వాళ్ల నగరాల్లో ఈ ఫెస్టివల్‌ను జరుపుకుంటారు. సంప్రదాయపు ఆటలు, పాటలు, ఫ్యాషన్ పరేడ్స్ ఉంటాయి. థీమ్స్ కూడా చాలా గమ్మత్తుగా పెట్టుకుంటారు. ఒకసారి 70, 80ల్లోని సినిమా నటీమణుల్లాగా చీర కట్టుకోవడం, ఇంకోసారి కంచి పట్టు చీరలో, ఒకసారి కాటన్ శారీస్‌లోనే రావడం... ఇలా రకరకాల థీమ్స్ ఉంటాయి. మొన్న శనివారం (14, డిసెంబర్) జరిగిన ఫెస్టివల్‌కు థీమ్... ఇతర రాష్ట్రాల చీరకట్టు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలు సంప్రదాయ చీరకట్టును థీమ్‌గా పెట్టారు. ఈ ఉత్సవాన్ని శ్రీకళా గణపతి, మధు గౌర్, రాహత్ ఖాన్ నిర్వహించారు. స్థానికంగా సరే... యేడాదికి ఒకసారి ‘గోవా’లోనూ శారీ స్పీక్ సంబరాలు జరుగుతుంటాయి. ఆ పండక్కి విదేశీ వనితలూ హాజరవుతారు. హైదరాబాద్ ‘శారీ స్పీక్’ నిర్వాహకులు మధు గౌర్, రాహత్ ఖాన్, భాను ఇ లపావులూరు, శ్రీకళా గణపతి -
భారతీయ సంస్కృతి చాలా గొప్పది
కడ్తాల్: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని హైదరాబాద్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రిఫ్మన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన దసరా ఉత్సవాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (సీజీఆర్) వ్యవస్థాపకుడు కె.లక్ష్మారెడ్డి, చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు ఆయుధపూజ, జమ్మిపూజలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి కోలాటం వేశారు. ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు తమను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. సీజీఆర్ సంస్థ, గ్రేస్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన తూర్పు కనుమల పర్యావరణ నివేదికను ఆండ్రూ ఫ్లెమింగ్, జోయల్ రిఫ్మన్లకు అందించారు. కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ మాజీ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, పారిశ్రామికవేత్తలు విజయభాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సూదిని పద్మారెడ్డి, దేవేంద్ర ఫౌండేషన్ డైరెక్టర్ విజయేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎత్తు మడమలు
హక్కులు లేవు ఉద్యమించారు. సమానత్వం లేదు. ఉద్యమించారు. పురుషుడు తిన్నగా లేడు. ఉద్యమించారు. ఉద్యమించడం అంటేనే కదలడం కదా.. ఇప్పుడిక ‘కదలడం’ కోసం కూడా ఉద్యమించారు! ఈ ఉద్యమంలో తొలి కదలిక.. ‘కూటూ’ మూవ్మెంట్. మున్ముందు జరిగే యుద్ధాలన్నీ నీళ్ల కోసమేనన్నట్లు.. ఇకపై స్త్రీలు జరిపే ఉద్యమాలన్నీ ‘కదిలే స్వేచ్ఛ’ కోసమే కావచ్చు! మాధవ్ శింగరాజు స్త్రీలో పైకి కనిపించని దేహభాగం ‘ఒద్దిక’! ఆమె పుట్టగానే ఒద్దికను ఆమె ఒంటికి కలిపి కుట్టేస్తుంది సంప్రదాయం. అందుకే ఒద్దికకు, ఆడపిల్లకు చాలాసార్లు తేడా తెలియదు మనకు. కొన్నిసార్లైతే ఒద్దికనే ఆడపిల్ల అని భ్రమపడతాం. ఒద్దికలేని ఆడపిల్లను ఆడపిల్లగా అస్సలే గుర్తించలేం. అయినా సంప్రదాయాలు ఆడపిల్ల వెంటే ఎందుకు పడతాయి? ఆమె అందంగా ఎదగాలి.. ఎట్ ద సేమ్ టైమ్.. ఒళ్లు విరుచుకోకుండా ఎదగాలి. ఎలా? ఆమె దేహభాగాలను మూసల్లో, వస్త్రాల్లో బిగించడం ఉపాయం. స్త్రీ పాదాలు చిన్నవిగా ఉండడం అందం అనుకున్నారు. అవి అందంగా, చిన్నవిగా పెరగడం కోసం గూడుచెప్పులు కుట్టించి, ఇవి తొడుక్కోవడం సంప్రదాయం అన్నారు. పాదాలు పెరక్కుండా అవి నొక్కి పడతాయి. ఆమె పెరుగుతున్నా పాదాలు ఆ గూళ్ల పరిమితిని దాటి ఎదగవు. బాడీ మొత్తాన్ని కవర్ చేసే మరో సంప్రదాయం చీర. అప్పటికీ వీపు, మెడ, నడుము బయటపడుతున్నాయి. ఏమిటి సాధనం? నడుము చుట్టూ చీర కొంగును తిప్పుకోవడం సంప్రదాయం అయింది. వీపు, మెడ కనిపించకుండా తల చుట్టూ కొంగు కప్పుకోవడం సంప్రదాయం అయింది. సంప్రదాయం సంపూర్ణం! చీర పరుగులు పెట్టనివ్వదు. పెద్ద అంగలు వెయ్యనివ్వదు. పరుగెత్తవలసిన అవసరంలోనూ చీర తట్టుకుని స్త్రీ పడిపోవలసిందే తప్ప, సంప్రదాయం పడిపోదు. అలా ప్లాన్ చేశాం. ఇంకా చాలా ఉంటాయ్, మగాళ్లకు తెలియనివీ, ఊహించనివీ.. ఆడవాళ్ల ఒంటి మీద సంప్రదాయాల దుస్తులు, ధారణలు. తెలీదు నిజమే. ఊహించలేం నిజమే. వాళ్లొచ్చి బాధగా ముఖం పెట్టి కంప్లయింట్ చేసినప్పుడైనా వినాలి. మనం చేయగలిగింది చెయ్యాలి. చేయ తగనిది మానాలి. స్త్రీ అని కాదు. సాటి మనిషి కదా. ఆ మాత్రం కన్సర్న్ ఉండాలి. ‘అమ్మో! సంప్రదాయం. దాన్ని బ్రేక్ చెయ్యలేం’ అని దూరంగా జరిగితే.. వాళ్లకై వాళ్లు బ్రేక్ చేసుకుని బయటికి వచ్చేయడం న్యాయమే! పాదాలు ఎన్నాళ్లని అలా ఉక్కులాంటి పాదరక్షల్లోపలే ఉండిపోతాయి. శరీరం ఎన్నాళ్లని ఉక్కపోత చీరలో మెల్లిగా ఊపిరి తీసుకుంటుంది? చెప్పుల్ని కాళ్లు, చీరల్ని ఒళ్లు వదిలించుకుని బయటికి వచ్చేస్తాయి. సంప్రదాయాల్ని గౌరవించేవారు.. సంప్రదాయాల్ని ‘బ్రేక్ చేసే సంప్రదాయాన్నీ’ గౌరవించాలి.. ఫర్ ద సేక్ ఆఫ్.. హ్యూమన్ పెయిన్. నొప్పిని పోగొట్టడం కోసం. ఆ నొప్పిని అనుభవిస్తున్నది ఆడమనిషైనా, మగమనిషైనా. జపాన్‌లో ఆఫీస్‌లకు ఉద్యోగినులు హైహీల్స్ వేసుకుని వెళ్లాలి. డ్రెస్ కోడ్‌లో భాగం అది. హైహీల్స్ నడకను అందంగా మార్చవచ్చు. దేహాన్ని సొగసైన ఆకృతిలో చూపించవచ్చు. హై హీల్డ్ కదలికల వల్ల ఆఫీస్‌లకు ‘ఎలిగెన్స్’ లాంటిదేదో ఒనగూడవచ్చు. మరి ఆ ఎత్తు మడమలు పెట్టే బాధ సంగతేమిటి? పాదాల బాధ ఒక చోటే స్థిరంగా ఉండదు. దేహంలో ఏ మూలకు ఎఫెక్ట్ ఇస్తుందో చెప్పలేం. జపాన్వాళ్లకు, చైనావాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. చూశారు.. చూశారు.. ఇక లాభం లేదనుకుని ఈ ‘ఆఫీస్ సంప్రదాయం’పై మహిళలు ‘కూటూ’ ఉద్యమం మొదలుపెట్టారు. అవును. జపాన్‌లో ఇప్పుడు ‘కూటూ’ ఉద్యమం నడుస్తోంది. పురుషులు వేధిస్తున్నట్లుగానే, హైహీల్సూ వాళ్లను వేధిస్తున్నాయి మరి. అందుకే ‘మీటూ’ స్ఫూర్తితో.. ‘కూటూ’ మూవ్‌మెంట్‌ని తెచ్చారు. పనిచేసే చోట వేధింపులపై ‘మీటూ’, పనిచేసే చోట హైహీల్స్‌పై ‘కూటూ’.. ఇప్పుడా దేశంలో రెండు మహిళా ఉద్యమాలు సమాంతరంగా నడుస్తున్నాయి. ‘కు’ అంటే జపాన్‌లో షూ అని, ‘కూ’ అంటే నొప్పి అని అర్థం అట. రెండిటినీ కలిపి, ‘కూటూ’ అని కాయిన్ చేశారు. అక్కడి మగాళ్లకు ఇది మీనింగ్లెస్లా అనిపిస్తోంది. ‘అతి కాకపోతే, ఏంటిదీ’ అని అప్పుడే కామెంట్స్ మొదలుపెట్టేశారు! బాడీకి కంఫర్ట్‌గా లేకపోతే జీవితం ఎంత నరకప్రాయంగా ఉంటుందో ఆ ‘ఇరుకు’ను ఫీల్ అయ్యేవాళ్లకే తెలుస్తుంది. ఆడవాళ్ల కంఫర్ట్‌ని మింగేసి కంఫర్ట్‌గా కూర్చునే ఇన్స్టింక్ట్ మగపుట్టుకలోనే ఉంటుందేమో. టూ మచ్ స్పేస్ తీసేసుకుంటారు. పక్కన మనిషి ఉందనే జ్ఞానమూ, స్పృహ ఉన్నా కూడా.. దిస్ ఈజ్ మై ఆటిట్యూడ్ అన్నట్టు! ‘కిక్ 2’ సినిమాలో ఒక పాట ఉంది. రవితేజ పాడతాడు. ‘మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదనీ.. లిజన్ టు మై వర్డ్ డూడ్ / నేను ఏడూ నెల్లకే బయటికి తన్నుకు వచ్చాను.. దిస్ ఈజ్ మై ఆటిట్యూట్’ అని. కంఫర్ట్ కోసం బయటికి వచ్చేయడం అది. అలా కాకుండా, కంఫర్ట్ కోసం పక్కకు నేట్టేసేవాళ్లుంటారు. ‘మ్యాన్ స్పేసింగ్’ అంటారు అలా నెట్టేయడాన్ని. అర్బన్ డిక్షనరీలో ఆ మాటకు అర్థం ‘పక్క మనిషిని నెట్టేసి, స్పేస్ తీసుకోవడం’. కంఫర్ట్ కోసం నెట్టేయడమే అనాగరికం అనుకుంటే.. మరింత కంఫర్ట్ కోసం పక్కవాళ్ల కంఫర్ట్‌ని లాగేసుకోవడం ఆదిమానవరికం. పనిచేసే చోట, ప్రయాణిస్తున్న చోట చేతులు ఆడిస్తారు. కాళ్లు చాపుతారు. ఆవలిస్తారు. పెద్దగా అరుస్తారు. సర్వావయాలను ఊపుతుంటారు. తోకక్కటే లేదు. ఉంటే దాన్ని కూడా గాల్లోకి తిప్పుతూ కూర్చుంటారు. ఇవన్నీ మ్యాన్ స్పేసింగే. వీటితోపాటు సంప్రదాయాల మ్యాన్ స్పేసింగ్! ఆడపిల్లల్ని సంప్రదాయబద్ధంగా పెంచడం, వాళ్లు సంప్రదాయంగా పెరగడం మంచిదే. అయితే ఎంత వరకు? వాళ్ల బాడీ అండ్ సోల్ పాడవనంత వరకు. పుట్టకముందు వరకు బిడ్డను తల్లి గర్భం కాపాడుతుందని, పుట్టాక సంప్రదాయమే తల్లి గర్భమై బిడ్డను సంరక్షిస్తుందని అనుకున్నా.. కడుపులో కంఫర్ట్‌గా లేకపోతే బిడ్డ ఎంతకాలమని లోపలే ఉండిపోతుంది?! కదలికల స్వేచ్ఛ కోసం తన్నుకుని బయటికి వచ్చేయదా? గుండె నిండా గాలిని పీల్చుకుని బతుకు జీవుడా అనుకోదా?! -
కన్నెత్తయినా చూడలేదు
శిరిడీలో బాబా అరవై ఏళ్లపాటు నడయాడితే, ఆ అరవై ఏళ్లపాటూ బాబా వెన్నంటే నడిచిన పునీతుడు మహల్సాపతి. సాయిప్రేమను సంపూర్ణంగా పొందిన మహల్సాపతి సదాచార సంపన్నుడు. సంస్కృతీ సంప్రదాయాల పట్ల మక్కువ కలిగినవాడు. ఒక రోజు మహల్సాపతి తన ఇంట్లోంచి ప్రసాదం తీసుకుని బాబా ఉండే మసీదుకు బయల్దేరాడు. అతని చేతిలోని ఫలహారం పళ్లెం వైపు చూసిన గజ్జి కుక్క ఒకటి ఆశగా తోక ఊపుకుంటూ మహల్సాపతి వెంటపడింది. మహల్సాపతి రెండు మూడుమార్లు దానిని అదిలించాడు. అయినా అది తన వెనకే రావడంతో విసుగెత్తి కర్ర తీసుకుని ఈడ్చిపెట్టి కొట్టాడు. పాపం ఆ కుక్క దీనంగా రోదిస్తూ వెళ్లిపోయింది. మహల్సాపతి ప్రసాదం తీసుకుని వెళ్లి బాబా ఎదుట పెట్టి భక్తితో రెండు చేతులూ జోడించాడు. బాబా ఆ ప్రసాదం పళ్లెం వైపు కన్నెత్తయినా చూడకుండా ఇలా అన్నారు. ‘‘మహల్సా! పాపం ఆ కుక్క నలుగురిపై ఆధారపడి ఎలాగో బతుకీడుస్తోంది. దానిని కొట్టడానికి మనసెలా వచ్చింది?’’ అంటూ తన వీపుపై తగిలిన దెబ్బను చూపించారు. అన్ని జీవుల్లోనూ తానే ఉన్నాననేది బాబా ఉవాచ. బాబాతో అన్నేళ్లు సావాసం చేసి కూడా మహల్సాపతి ఆ నీతిని గ్రహించలేకపోయాడు. తోటి ప్రాణుల పట్ల భూతదయ కలిగి ఉండడం, ఉన్నంతలో సత్కర్మలు ఆచరించడం, చిత్తశుద్ధితో మనసును పరిశుద్ధం చేసుకోవడం... ఇవే భగవంతునికి మనం ఇవ్వగల నివేదనలు. డా. కుమార్ అన్నవరపు -
3 వేల మందితో భారతమాతకు హారతి
-
3 వేల మందితో భారతమాతకు హారతి
హైదరాబాద్: భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ భారతమాత వేషధారణలో మూడు వేల మంది విద్యార్థినులు అలరించారు. వీరంతా కలిసి శనివారం భారతమాతకు హారతి ఇచ్చారు. ఈ అద్భుత కార్యక్రమానికి హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వేదికైంది. మూడు వేల మందితో నిర్వహించిన ఈ కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. భారతమాత ఫౌండేషన్ చైర్మన్ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘భారతమాతకు హారతి’కార్యక్రమానికి ప్రవచన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల్లో దేశభక్తిని పెంచేందుకు స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలను చదివేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, దక్షిణామూర్తి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భారతమాత ఫౌండేషన్ కన్వీనర్ శ్యాంసుందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కోకిల గీతం... తుమ్మెద రాగం
‘అన్వేషణ’ సినిమాలో భానుప్రియ, కార్తీక్ లాంటివాళ్లు.. అక్షిత, పీయూష్! ఆ సినిమాలో భానుప్రియ చెట్టూ పుట్టా తిరిగి శ్రావ్యమైన శబ్దాలను అన్వేషిస్తూ ఉంటే, కార్తీక్ ఆమెకు హెల్ప్ చేస్తుంటాడు. ఇక్కడా అంతే. అక్షితకు ఆమె భర్త పీయూష్ పరిశోధన సహకారం అందిస్తున్నారు. ఈ దంపతులకు వినాయక్ అనే మరో ప్రకృతి ప్రేమికుడు కూడా తోడయ్యాక.. అంతరించిపోతున్న గిరిజన గీతాలన్నీ ఒకటొకటిగా మళ్లీ ప్రాణం పోసుకుంటున్నాయి. భారతదేశంలో కొన్ని వేల గిరిజన జాతులు ఉన్నాయి. వారి సంప్రదాయాలు, వేషధారణ, సంగీతం అన్నీ వేటికవే ప్రత్యేకం. అటువంటి జాతులలో కొన్ని జాతులు రానురాను అంతరించిపోతున్నాయి. వాటికి సంబంధించిన సమాచారాన్ని ఎవరో ఒకరు జాగ్రత్త చేయకపోతే, కొంతకాలానికి ఈ జాతుల గురించి ప్రపంచానికి తెలిసే అవకాశం ఉండదనే ఉద్దేశంతో పీయూష్ గోస్వామి, అక్షిత దంపతులు ‘ది పార్గాటెన్ సాంగ్స్’ అనే ఒక ప్రణాళిక రూపొందించారు! బియాట్ పాట ‘బీట్’ ఆగింది! పీయూష్, అక్షిత దంపతులు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటారు. అలా ఒకసారి అస్సాంలోని డిమో హసావ్ జిల్లాను సందర్శించారు. అక్కడ ‘ఎపా లల్లురా’ అనే బియాట్ గిరిజన తెగ నాయకుడిని కలిశారు.ఆయనతో మాట్లాడుతూండగా ఆ తెగ వారి సంగీతం కాలగర్భంలో కలిసిపోతోందన్న బాధ ఆ నాయకుడి ముఖంలో కనిపించింది. వారు బియాట్ భాషతో పాటుగా యాసతో కూడిన హిందీ, బెంగాలీ, అస్సామీ, థింసా భాషలు, నాగాలాండ్‌లోని మాండలికాలు మాట్లాడగలరని లల్లూరా మాటల నుంచి తెలుసుకున్నారు. వారి భాష కేవలం మౌఖికంగా మాత్రమే మిగిలే స్థితికి వచ్చింది. వారిలోని కొత్తతరానికి.. బియాట్ భాష రాకపోవడం వల్ల సంప్రదాయ సంగీతానికి కాలం చెల్లుతోందని ఈ దంపతులకు లల్లూరా చెప్పారు. బియాట్ జాతి వారు ఈశాన్య భారతంలో ఉంటారు. వీరు చైనా నుంచి ఇక్కడకు వలస వచ్చినట్లుగా భావిస్తారు. అక్కడ వారు మైనారిటీలే అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా గుర్తించలేదు. ఈ విషయం గోస్వామి దంపతులను కదిలించింది. వీరు అప్పటికే ‘రెస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ’ (ఈ ఊరు, ఈ నేల) అనే ఒక లాభాపేక్ష లేని సంస్థను స్థాపించారు. గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సాంఘిక, ఆర్థిక సమస్యలను తెలుసుకుని, పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. లల్లూరా మాటలు విన్నాక ‘‘ఏదో ఒకటి చేద్దాం’’ అన్నారు గోస్వామి. ఎక్కడ దొరికితే అక్కడ 2018 లో ఈ దంపతులు గిరిజన సంప్రదాయ గీతాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఎక్కడ బియాట్ పాటలు దొరికితే అక్కడ, ఎవరు పాడుతుంటే వారివి అక్కడికక్కడే రికార్డు చేయడం మొదలుపెట్టారు.ఈ జాతి వారికి సంబంధించి తాము సేకరించినవాటిని ఒక డాక్యుమెంటరీ సినిమాగా రూపొందించారు. ‘ద ఫర్గాటెన్ సాంగ్స్’ అని పేరు పెట్టి ఈ ఏడాది జనవరి 8వ తేదీన విడుదల చేశారు. గోస్వామి దంపతులతో గ్రామీణ కళాకారులు చాలామంది ప్రయాణిస్తున్నారు. దారిలో వారు వింటున్న కొత్త కొత్త శబ్దాలను, కథలను రికార్డు చేస్తూ, పాటలకు జోడిస్తున్నారు. అలాగే ఆయా జాతుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. గిరిజనుల జానపదాలను షార్ట్ ఫిల్మ్‌లుగా తీసి, ఆడియో రిలీజ్లు కూడా పెడుతున్నారు. సంగీత శంఖంలో కథల తీర్థం చెన్నైలో నివసిస్తున్న వినాయక్ అనే మరో యువకుడు గోస్వామి దంపతులతో కలిసి, వారు చేపట్టిన ప్రాజెక్టును విజయవంతంగా నడుపుతున్నారు. ప్రకృతిలో ఉండే శబ్దాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కలిపి, జానపదులకు సంబంధించిన కథలను సంగీతం ద్వారా చెబితే అందరికీ త్వరగా చేరుతుందని, సమాజంలో అందరికీ అవేర్నెస్ కలుగుతుందని భావించాడు వినాయక్. బియాట్ తర్వాత.. బోండా, బస్తర్ కనుమరుగైపోతున్న సంస్కృతిని కాపాడటం కోసం లల్లూరా పాడుతున్న పాటలను ఒకచోట పొందుపరచడం కోసం గోస్వామి, వినాయక్‌లు అడవుల్లో అడుగులు వేస్తున్నారు. భయంకరమైన రోడ్ల మీద ప్రేమగా ప్రయాణిస్తున్నారు. వినాయక్‌కి వారి గురించిన విశేషాలు అర్థమయ్యాక, పాటలు, వివిధ శబ్దాలను సేకరించారు. అనేకమంది గాయకులను కలుసుకుంటున్నారు. బియాట్ సంప్రదాయ గీతాలను ఎపా లల్లూరా, ఎపా రొయిలియానాలు పాడుతుండగా వినాయక్ రికార్డు చేస్తున్నారు. ఇక్కడ పని పూర్తయ్యాక, ఒరిస్సాకు చెందిన బోండా జాతివారి గురించి, బస్తర్‌లో ఉన్న గోండు జాతి గురించి పరిశోధన చేయనున్నారు. – జయంతి -
అక్కడ జనవరి 7న క్రిస్మస్..!
నేడు ఏసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవ సోదరులంతా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకొంటున్నారు. ఇందులో భాగంగా బంధువులను కలవడం.. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయడం.. స్వీట్లు పంచుకోవడం ఇవి దాదాపుగా అన్ని చోట్ల జరిగేవే. అయితే కొన్ని దేశాల్లో మాత్రం క్రిస్మస్ రోజున కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. ఆ వివరాలు ఓ సారి చూద్దాం.. రోడ్లపై తిరగొద్దు వెనుజులా, కరాకస్ వంటి ప్రాంతాల్లో క్రిస్మస్ రోజున కార్లు రోడ్ల మీద తిరగకూడదు. పండగ పూట ప్రజలు గుంపులుగా స్కేటింగ్ చేసేందుకు వీలుగా రోడ్లను ఖాళీగా ఉంచాలని నియమం. ఈ రూల్ ఎన్నో ఏళ్లుగా అక్కడ అమల్లో ఉంది. ఇక జర్మన్ల విషయానికొస్తే... వారు క్రిస్మస్ ట్రీలో పచ్చళ్లను దాచి పెట్టుకుంటారు. మేక బొమ్మ దహనం దసరా పండుగ రోజున మన దగ్గర రావణ దహనం చేసినట్లుగానే... క్రిస్మస్ పర్వదినాన స్వీడన్లో పెద్ద మేక బొమ్మను దహనం చేస్తారు. 1966 నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. సంపద కలిసి వస్తుందని.. స్లోవేకియాలో ఓ వింత ఆచారం ఉంది. క్రిస్మస్ డిన్నర్‌ని ప్రారంభించడానికి ముందు ఇంటి పెద్ద ఆ రోజు తయారు చేసిన ఓ ప్రత్యేక వంటకాన్ని స్పూన్‌తో తీసుకుని ఇంటి సీలింగ్ మీదకు విసురుతాడు. ఎంత ఎక్కువ పదార్థం సీలింగ్‌కు అంటుకుంటే వారికి ఆ ఏడాది అంత ఎక్కువ సంపద కలిసి వస్తుందని నమ్మకం. అక్కడ జనవరి 7న.. ప్రపంచమంతా డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకొంటే.. రష్యా, ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం జనవరి 7న క్రిస్మస్ జరుపుకుంటారు. ఆర్థోడాక్స్ సంప్రదాయాలు పాటించే చర్చిల్లో దాదాపు 40 రోజుల ముందుగానే ఈ వేడుకలు ప్రారంభిస్తారు. జనవరి 6 సాయంత్రం తొలి నక్షత్రం కనిపించేంత వరకూ ప్రార్థనలు జరుపుతారు. దెయ్యాల భయంతో.. క్రిస్మస్ రోజున చీపుర్లను, ఇంటిని శుభ్రం చేసే వస్తువులను దాచి పెడతారు నార్వే ప్రజలు. క్రిస్మస్ రోజున దెయ్యాలు, ఆత్మలు చీపుర్ల సాయంతో ఆకాశంలో ఎగురుతాయని నార్వే ప్రజలు నమ్మకం. అందుకే ఆ రోజున వారు తమ చీపుర్లను దాచి పెడతారు. దెయ్యాలను బెదిరించడం కోసం మగవారు ఆరుబయట నిల్చుని తుపాకి కాలుస్తారు. బీర్‌తో స్వాగతం సాధారణంగా అందరూ క్రిస్మస్ రోజున స్వీట్లు, స్నాక్స్‌తో సాంటా క్లాజ్‌కు ఆహ్వానం పలికితే ఐర్లాండ్ ప్రజలు మాత్రం తమ దేశ సంప్రదాయం ప్రకారం బీర్‌తో ఆయనకు స్వాగతం చెబుతారు. సెలవు రోజుల్లోనే ఎక్కువగా.. క్రిస్మస్కు ముందు రోజు రాత్రంతా చదువుకుంటూ కూర్చుంటారు ఐస్‌ల్యాండ్ ప్రజలు. స్నేహితులకు, బంధువులకు కూడా పుస్తకాలనే బహుమతులుగా ఇస్తారు. ఒక సంవత్సరంలో ఐస్‌ల్యాండ్ పబ్లిష్ అయినన్ని బుక్స్ మరే దేశంలోనూ పబ్లిష్ కావు. మిగతా రోజుల్లో కంటే సెలవుల్లో ఇక్కడ ఎక్కువ పుస్తకాలు అమ్ముడు పోతాయి. -
ముస్లిం సంప్రదాయాలకు అడ్డుతగలొద్దు
తాండూరు: ముస్లిం మత ఆచారాలపై ప్రభుత్వాలు, కోర్టులు కల్పించుకుంటే సహించేది లేదని ఆవర్గం నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. త్రిబుల్ తలాక్‌పై వెలువడిన కోర్టు తీర్పును నిరసిస్తూ బుధవారం రాత్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముస్లిం పర్సనల్ లాబోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభు త్వం, ఆర్ఎస్ఎస్ ముస్లింలపై తప్పు డు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలకు తమ మతంలో ఇచ్చే గౌరవం.. మరే మతంలోనూ లభించదని తెలిపారు. పలువురు మత పెద్దలు మాట్లాడుతూ.. తాండూరులో 30 వేల మంది ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఉంటే ఇందులో 3 వేల మంది మాత్రమే తమ మతానికి చెందిన పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇత ర పాఠశాలల్లో చేరిన తమ పిల్లలకు మతాచారానికి విరుద్ధంగా వందేమాతరం, సరస్వతీ శ్లోకాలను పఠనం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పిల్లలకు ముస్లిం మతాచారం ప్రకారం విద్యావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశంలో ముస్లింల మనుగడ కష్టంగా మారిం దని ఆవేదన వ్యక్తంచేశారు. పదివేల మందికి పైగా సభకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నేతలు అబుల్ రవూఫ్, జుబేర్‌లాల, ఖలీల్ పాష, జాఫర్ పాష, ముర్తుజా, కమల్ అత్తార్, సాధిక్, అహద్, ఖాజాపాష, జావేద్, జియావొద్దీన్ ఉన్నారు. -
ప్రెగ్నెన్సీ వస్తేనే పెళ్లి!
చెన్నై: అడవుల్లో నివసించే ఆదివాసీల సంప్రదాయాలు ఆధునికులకు వింతగా ఉంటాయి. ఒక్కో తెగ పద్దతులు ఒక్కోలా ఉంటాయి. అలాగే తమిళనాడు అడవుల్లో నివసించే టోడ అనే గిరిజన తెగ సంప్రదాయాలు చూడటానికి, వినడానికి విచిత్రంగా ఉంటాయి. నీలగిరి అడవుల్లో ఉండే ఈ తెగ పెళ్లి విషయంలో వింత ఆచారాన్ని పాటిస్తారు. ఆ పెళ్లి స్పెషాలిటీ ఏమిటంటే.... టోడ గిరిజన తెగలో పెళ్లివేడుక సాధారణంగా నిర్వహిస్తారు. పెళ్లి తర్వాత వధువు, వరుడితో గడుపుతుంది. అనంతరం వధువు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో పెళ్లి కూతురు కచ్ఛితంగా నెల తప్పాల్సిందే. గర్భం ధరించకపోతే ఆ వివాహం చెల్లదు. నెల తప్పితే ఏడో నెలకు భర్త అడవికి వెళ్ళి పవిత్రంగా భావించే చెట్టు కాండంతో విల్లు, బాణం తయారు చేసి భార్యకు ఇస్తారు. ఆవస్తువులు భార్యకు నచ్చి తీసుకొంటే అతడిని భర్తగా అంగీకరించినట్లు. అంతేకాదు కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిగా కూడా ఒప్పుకొంటుంది. ఈకార్యక్రమం అనంతరం విల్లు, బాణం వేడుకలు భారీ ఎత్తున జరుపుతారు. సంప్రదాయ నృత్యాలు పాటలతో ఘనంగా సంబరాలు చేసుకొంటారు. ఈ వేడుకలు అనంతరం ఇరువురు పెద్దల ఆశీర్వాదంతో అప్పటి నుంచి భార్యాభర్తల్లా జీవితాంతం కలిసి ఉంటారు. -
సంప్రదాయాలను కొనసాగిద్దాం
–రాష్ట్రస్థాయి బలప్రదర్శనలో ఎమ్మెల్యే –కర్నూలు ఎడ్లకు ప్రథమ స్థానం ఎమ్మిగనూరు: మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించాలని, అందులో భాగమే ఎడ్ల బండలాగుడు ప్రదర్శన అని ఎమ్మెల్యే డాక్టర్ బి.జయ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శ్రీ నీలకంఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి జ్ఞాపకార్థం రాష్ట్రస్థాయి వృషభాల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు. మూడో రోజు సబ్‌జూనియర్ సైజు ఎడ్ల పోటీలను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. సబ్‌జూనియర్ సైజ్ ఎడ్ల పోటీల్లో మొత్తం 7జట్లు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన ఈపోటీల్లో కర్నూలు వీఆర్ నగర్‌కు చెందిన గీతామృత చౌదరి ఎడ్లు 20 నిమిషాల్లో రాతిబండ (16ఘనపుటడుగుల)ను 3172 అడుగుల దూరంలాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. ఉయ్యాలవాడ మండలం తడమలదిన్నెకు చెందిన పేరెడ్డి సుబ్బారెడ్డి ఎడ్లు 3020 అడుగులు లాగి ద్వితీయ స్థానం, వెల్దుర్తి మండలం బాపురానికి చెందిన నడిపి సోమిరెడ్డి వృషభాలు 2908 అడుగులతో తృతీయ స్థానం, అనంతపురం జిల్లా తాడిచెర్లకు చెందిన బీమిరెడ్డి లవకుమార్ ఎడ్లు 2752.8అడుగులు లాగి నాలుగో స్థానం, బెళగల్ మండలం పోల్కల్కు చెందిన మహేంద్రనాయుడు ఎడ్లు 2532.3అడుగులు లాగి ఐదో స్థానం పొందాయి. బుధవారం విజేత ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు కొండయ్యచౌదరి, హరిప్రసాద్‌రెడ్డి, మిఠాయి నరసింహులు, రాందాస్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముగతి ఈరన్నగౌడ్, పల్లెపాడు రామిరెడ్డి, రైస్‌మిల్ నారాయణరెడ్డి, కౌన్సిలర్లు స్వామిగౌడ్, రామకృష్ణ, పరశురాముడు, రంగన్న,జయన్న తదితరులు పాల్గొన్నారు. నేడు సీనియర్ కేటగిరి పోటీలు రాష్ట్రస్థాయి ఒంగోలు ఎడ్ల బలప్రదర్శనలో భాగంగా బుధవారం సీనియర్ కేటగిరి సైజు ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో గెలుపొందిన ఎడ్ల జతకు మొదటి బహుమతిగా రూ.60,000,ద్వితీయ బహుమతిగా రూ.50,000, తృతీయ బహుమతిగా రూ.35,000 , నాలుగో బహుమతిగా రూ.25,000,ఐదవ బహుమతిగా రూ.15,000 ఇస్తామని పోటీల నిర్వాహకులు బీవీ రైతు సంఘం కన్వీనర్లు కొండయ్యచౌదరి, మిఠాయి నరసింహులు, హరిప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. -
మహిళలు మందిరాలు
► స్త్రీలను నిరోధిస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు ► శని శింగణాపూర్‌లో తైలాభిషేకానికి స్త్రీలకు అనుమతి లేదు ► హాజీ అలీలో ప్రవేశం కోసం హైకోర్టు జోక్యం ► కాలంతో పాటు ఆచారాలూ మార్చుకోవాలని స్త్రీల ఉద్యమం ► మహిళా పూజారుల ఏర్పాటు కోసం డిమాండ్ ► ఖాజీల స్థానం తీసుకుంటున్న ముస్లిం మహిళలు ► శబరిమలపై కూడా సాగుతున్న చర్చ వ్యక్తులు ఎప్పటికప్పుడు తమను తాము కనుగొంటూ ఉంటారు. తాము ఏమి పొందుతున్నారో, ఏమి కోల్పోతున్నారో చైతన్యవంతమైన దృష్టితో తెలుసుకుంటూ ఉంటారు.ఆ తెలుసుకున్నది వెంటనే సాధించుకుంటే ఘర్షణ లేదు. ఆ తెలుసుకోవడమే ఒక ఘర్షణకు కారణమైతే అది శింగణాపూర్ ఘటన అవుతుంది. గుడికొస్తాం. రండి. పూజిస్తాం. పూజించండి. తైలాభిషేకం చేస్తాం. అది మాత్రం కుదరదు. కేవలం మగవారికి మాత్రమే. ఏం... ఆడవాళ్లు ఏం పాపం చేశారు? అదీ ప్రశ్న. అదీ ఘర్షణ. అదే ఇప్పుడు దేశంలో నలుగుతున్న చర్చ. 2015.. నవంబర్ 28. ఆ రోజు ఉదయం.. ఓ మహిళ శింగణాపూర్ దేవాలయంలోకి వెళ్లింది. ఆ ఆలయంలో స్త్రీలకు ప్రవేశం ఉంది కాబట్టి అది విశేషం కాదు. కాని ఆవరణలోని శని శిలకు మగవాళ్లు నిర్వహించినట్టే తైలాభిషేకం చేసింది. అది మాత్రం విశేషమే. ఆ సమయంలో దీనికి ఆలయ పూజారులు కానీ, అక్కడున్న సిబ్బంది కానీ అడ్డు చెప్పలేదు. కాని ఈ సంఘటన సోషల్ మీడియాలో వీడియోగా ప్రచారం కావడంతో ఆలయ ధర్మకర్తల మండలి విస్తుపోయింది. మహిళ చేసిన తైలాభిషేకం వల్ల శనిదేవుడి శిల, ఆ ప్రదేశం అపవిత్రమైందంటూ శని దేవుడి శిలకు క్షీరాభిషేకం చేసి శుద్ధి నిర్వహించింది. సమస్య మొదలు.. ఈ ఉదంతం దావానలంలా వ్యాపించింది. కొందరు తప్పు పట్టారు. కొందరు దీనికి మద్దతు పలికారు. మహారాష్ట్రలోని ‘భూమాతా రణరాగిణి బ్రిగేడ్’ అనే మహిళా ఉద్యమాల సంస్థ ఈ సమస్యను తన ప్రస్తుత ఎజెండాగా స్వీకరించింది. ఈ బ్రిగేడ్ అధ్యక్షురాలైన 32 ఏళ్ల తృప్తి దేశాయ్ శని శింగణాపూర్ ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలనే ఆందోళనకు అభిప్రాయ సమీకరణ చేస్తున్నారు. ‘ఇప్పటికే అనేక మూఢనమ్మకాలు, అర్థంలేని ఆచారాలతో మహిళలను అణగదొక్కుతున్నారు. స్త్రీలను దేవుడి దగ్గరకు కూడా రానీయకుండా చేస్తున్నారు. దైవం దైవమే. అక్కడ ఆడ, మగ తేడా ఏంటి? ఏ సంప్రదాయాలైనా మనం సృష్టించుకున్నవే. సతి ఆచారంగా సాగిన భూమి మీదే అది దురాచారంగా మారిన సందర్భం లేదా? మారుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలూ మారాలి.. మార్చుకోవాలి. ఆ మాటకొస్తే రాజ్యాంగమే స్త్రీ, పురుషులకు సమాన హక్కులు కల్పించింది’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తృప్తి ్తదేశాయ్. వీళ్లకు మహారాష్ట్రలోని అంధశ్రద్ధ నిర్మూలన సమితి (మూఢనమ్మకాల నిర్మూలన సమితి)తోపాటు దేశంలోని ఎన్నో మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. అయితే శని శింగణాపూర్ ధర్మకర్తల మండలి మాత్రం శని దేవుడి శిలకు మహిళలు తైలాభిషేకం చేసేందుకు ససేమిరా అన్నది. దీనికి తృప్తి దేశాయ్ సేన వెనక్కి తగ్గలేదు. జనవరి 26న మొత్తం 400 మంది మహిళలతో కలిసి శనిశింగణాపూర్‌లో పూజలు చేసేందుకు ప్రయత్నించారు. వీళ్ల ప్రయత్నాన్ని మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. దీనిపై ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ఓ మధ్యేమార్గాన్ని సూచించడానికి ముందుకు వచ్చారు. ఆ ప్రస్తావనా తమకు సమ్మతంగా లేదని తృప్తి దేశాయ్ బృందం నిరాకరించింది. ట్రస్టీలో మహిళలకు చోటు పదకొండు మంది సభ్యులున్న శని శింగణాపూర్ ఆలయ ట్రస్టీలో ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా స్థానం లేదు. పూజలు ఎలాగూ చేయనివ్వట్లేదు కనీసం ట్రస్టీలోనైనా స్త్రీలకు స్థానం కల్పించాల్సిందిగా స్థానిక మహిళలు పోరాడారు. దాంతో మొన్న జనవరి 11న జరిగిన ట్రస్టీ ఎన్నికల్లో ఆడవాళ్లకు అవకాశం కల్పించారు. అనితా శెట్యే అనే మహిళ గెలవడమే కాక ట్రస్టీ అధ్యక్షురాలు కూడా అయ్యింది. అయితే ఆ పాయింట్‌నే పట్టుకొని తమ నిరసనను తీవ్రం చేసింది తృప్తి దేశాయ్ బృందం. మహిళా అధ్యక్షురాలు ఉన్న ఆలయంలో మహిళలకు పూజార్హత లేకపోవడమేంటి? అంటూ ప్రశ్నలపరంపరను సంధించింది. శని దేవుని పూజలు చేసేందుకు మహిళలను అనుమతించేంత వర కు ఆందోళన విరమించేది లేదు అంటూ హెచ్చరిక కూడా చేసింది ఈ బృందం. హాజీ అలీ... శని శింగణాపూర్‌లో మహిళల ప్రవేశానికి పోరాటం జరుగుతుండగానే ఇంకోవైపు ముంబైలో హజీ అలీ దర్గాలోకీ మహిళలకు ప్రవేశం కల్పించాలని ఆ వర్గపు స్త్రీల పోరాటం ప్రారంభమైంది. దానికీ తృప్తి దేశాయ్ బృందం మద్దతు పలికింది. అయితే ఇటీవలే ముంబై హైకోర్ట్ హజీ అలీ దర్గాలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని చెప్పింది. మరోవైపు రాజస్థాన్‌లోని దేవ్బంద్లో దారుల్ ఉలూమ్ ఇద్దరు మహిళలను ఖాజీలుగా నియమించింది. ఇంతకాలం కేవలం పురుషుల గుత్తాధిపత్యంలో ఉన్న ఖాజీ హోదా ఇప్పుడు మహిళలకు కూడా దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నవారు ఉన్నారు. ఈ సందర్భంగా దారుల్ ఉలూమ్ అధికార ప్రతినిధి మౌలానా అష్రాఫ్ ఉస్మానీ మాట్లాడుతూ ‘ఖాజీలు, పండితులు అవడానికి జ్ఞానం, అనుభవం, శిక్షణ ముఖ్యం కానీ జెండర్ ప్రధానం కాదు. ఈ లెక్కన ముస్లిం మహిళలకూ అన్ని హక్కులూ ఉన్నాయి’ అని స్పష్టం చేశారు. - గుండారపు శ్రీనివాస్ / చక్రవర్తి సాక్షి ముంబై దైవం దైవమే.. అక్కడ ఆడ, మగ తేడా ఏంటి? ఏ సంప్రదాయాలైనా మనం సృష్టించుకున్నవే. మగవాళ్లు తమ ప్రయోజనాలకు అనుగుణంగా పెట్టుకున్నవే. సతి ఆచారంగా సాగిన భూమి మీదే అది దురాచారంగా మారిన సందర్భం లేదా? మారుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలూ మారాలి.. మార్చుకోవాలి. ఆ మాటకొస్తే రాజ్యాంగమే స్త్రీ, పురుషులకు సమాన హక్కులు కల్పించింది. - తృప్తి దేశాయ్, భూమాతా రణరాగిణి బ్రిగేడ్ అధ్యక్షురాలు శని దేవుడిని శుభంగా ఎవరూ భావించరు. నిరాశనిస్పృహలు, రోగాలురొష్టులు, వినాశకాలకు అధిపతిగా ఉంటాడు. శని వెలసిన చోటు చాలా ప్రమాదకర శక్తులకు ఆలవాలం. స్త్రీ, పురుషులు సమానమైనప్పటికీ శరీరనిర్మాణరీత్యా పురుషులకు ఉన్న దృఢత్వం స్త్రీలకు ఉండదు. శని ఆలయంలోని ఆ ప్రమాదకర శక్తులను పురుషుడు తట్టుకోగలడు.. కానీ స్త్రీ తట్టుకోలేదు. అందుకే అలాంటి చోట్లకు ఆడవాళ్లు వెళ్లకపోవడం మంచిది అనే ఆచారం వచ్చింది. - జగ్గీవాసుదేవ్, ఆధ్యాత్మిక గురువు నిషిద్ధ ప్రదేశాలు శని శింగణాపూర్తోపాటు మన దేశంలో పదేళ్ల నుంచి యాభై ఏళ్ల మహిళలదాకా ప్రవేశంలేని మరో ఆలయం కేరళలోని శబరిమలై అయ్యప్పస్వామి దేవాలయం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ వివక్ష మందిరాల్లో కనిపించకపోయినా మరికొన్ని చోట్ల కనిపిస్తుంది. అమెరికాలోని బెతెస్డా అనే ప్రాంతంలో ఉన్న బర్నింగ్ట్రీ క్లబ్ అనే గోల్ఫ్కోర్స్కి స్త్రీలు వెళ్లడం నిషిద్ధం.సౌది అరేబియాలో మహిళలకు పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదు. అలాగే వాటికన్లో కూడా మహిళలను పోలింగ్ కేంద్రాలకు అనుమతించరు. టూర్ దె ఫ్రాన్స్ అనేది ప్రతి యేడు ఫ్రాన్స్‌లో జరిగే ఓ సైకిల్ పందెం. ఈ పందెంలో పాల్గొనడానికి మహిళలకు అనుమతి లేదు. ఇరాన్‌లోని ‘ఆజాద్ సాకర్ స్టేడియం’ లోకి మహిళలను నిషేధించి ఫుట్‌బాల్ ఆటను చూడాలనే వాళ్ల ఇచ్ఛను, స్వేచ్ఛను హరించారు. జపాన్‌లోని అతిపెద్ద కొండ ప్రాంతం మౌంట్ ఒమైన్. 1300 ఏళ్ల కిందటి ఈ బౌద్ధక్షేత్రంలో మహిళలకు ప్రవేశం లేదు. {Xస్లోని మౌంట్ అథోస్ తీర ప్రాంతం ఎంతోమంది సన్యాసుల తపోకేంద్రం. అయితే ఇప్పటికీ ఇక్కడికి మహిళలు వెళ్లకూడదనే నిబంధన అమల్లో ఉంది. -
అభివృద్ధే ఎన్డీఏ సర్కార్ జెండా,ఎజెండా
-
స్వీట్ లైట్స్
మనవన్నీ తియ్యటి సంప్రదాయాలు. మనవన్నీ తియ్యటి అనుబంధాలు. మనవన్నీ తియ్యటి అతిథి మర్యాదలు ఈ తియ్యదాన్ని కొనసాగిద్దాం. ‘స్వీట్ లైట్స్’తో దీపావళిని వెలిగిద్దాం. ఆపిల్ గుజియా కావలసినవి: గోధుమపిండి - 2 కప్పులు, కరిగించిన నెయ్యి లేదా వెన్న - కప్పు, చన్నీళ్లు - కప్పు, ఉప్పు - కొద్దిగా ఆపిల్ కోయా కోసం: పచ్చి కోవా - కప్పు, ఆపిల్స్ - 4 (మీడియం సైజువి, సన్నగా తురమాలి), దాల్చిన చెక్క పొడి - అర టీ స్పూను, ఏలకుల పొడి - అర టీ స్పూను, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పుల తరుగు - 3 టేబుల్ స్పూన్లు, పంచదార - 3 టేబుల్ స్పూన్లు, నూనె-డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ఒక పెద్ద పాత్రలో గోధుమపిండి, పంచదార కలిపి జల్లించాలి కరిగించిన నెయ్యి జత చేసి, మిశ్రమం బాగా కలిసేవరకు కలపాలి చన్నీళ్లు పోస్తూ చపాతీపిండిలా క లిపి, పైన మూత ఉంచి సుమారు అరగంటసేపు నాననివ్వాలి స్వీట్ స్టఫింగ్ తయారీ బాణలి వేడి చేసి, పంచదార, ఆపిల్ తురుము వేసి బాగా కలిపి, సుమారు పది నిమిషాలు ఉడకనివ్వాలి దాల్చినచెక్క, ఏలకుల పొడులు జత చేయాలి ఐదు నిమిషాల తర్వాత కోవా మిశ్రమం వేసి బాగా కలపాలి కోవా కరుగుతుండగా బాగా కలుపుతుండాలి డ్రైఫ్రూట్స్ తరుగు జత చేసి, బాగా కలిపి దించి, చల్లారనివ్వాలి చపాతీ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, గుండ్రంగా పూరీలా మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఒత్తాలి తయారుచేసి ఉంచుకున్న ఆపిల్ మిశ్రమాన్ని కొద్దిగా ఇందులో ఉంచి అంచులు మూసేయాలి. (కొద్దిపాటి నీళ్లతో తడి చేస్తే బాగా అతుకుతుంది) ఇదేవిధంగా అన్నీ తయారుచేసుకుని పక్కన ఉంచుకోవాలి బాణలిలో నూనె వేడయ్యాక, తయారుచేసి ఉంచుకున ఘుజియాలను ఒక్కొక్కటిగా వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి. తీపి చక్రాలు కావలసినవి: పెసలు - కప్పు, బియ్యం - 6 కప్పులు, ఉప్పు - కొద్దిగా, బెల్లం - 2 కప్పులు, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా పెసలను బాణలిలో నూనె లేకుండా వేయించాలి రోట్లో వేసి తేలికగా దంచి పప్పులా అయిన తర్వాత, చేటలో వేసి పొట్టు చెరగాలి పెసరపప్పు, బియ్యం కలిపి మర పట్టించాలి ఒక పెద్ద గిన్నెలో తగినన్ని నీళ్లు, ఉప్పు, నూనె వేసి నీళ్లు మరిగించాలి ఒక పెద్ద పాత్రలో పిండికి కాచిన నీళ్లు జతచేస్తూ జంతికల పిండి మాదిరిగా కలపాలి బాణలిలో నూనె కాగాక, ఈ పిండిని చిన్న చిన్న జంతికల్లా వేసి (బాగా సన్నటి రంధ్రాలు ఉన్న దాని నుంచి వీటిని తయారుచేయాలి) దోరగా వేగిన తర్వాత పళ్లెంలోకి తీసుకోవాలి ఒక పాత్రలో బెల్లం,తగినన్ని నీళ్లు వేసి తీగపాకం పట్టాలి తయారుచేసి ఉంచుకున్న చక్రాల మీద ఈ పాకం కొద్దికొద్దిగా పోసి ఆరనివ్వాలి బాగా చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. బాదాం పూరీ కావలసినవి: గోధుమపిండి - కప్పు, బాదం పప్పులు - పావు కిలో, పంచదార పొడి - అర్ధ పావు, కుంకుమ పువ్వు - కొద్దిగా, ఏలకుల పొడి - టేబుల్ స్పూను, కండెన్స్డ్ మిల్క్ - తగినంత తయారీ: బాదం పప్పుల మీద తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ఒక పాత్రలో బాదం పప్పుల పొడి, పంచదార పొడి, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, గోధుమ పిండి వేసి, కలపాలి. (అవసరమనుకుంటే తగినన్ని పాలు జత చేస్తూ చపాతీపిండిలా కలపాలి) చిన్న చిన్న ఉండలుగా చేసి, నూనె పూసిన బేకింగ్ ట్రే మీద ఉంచాలి 350 ఫారెన్‌హీట్ దగ్గర ప్రీ హీట్ చేసిన అవెన్‌లో ఉంచి పది నిమిషాలు బేక్ చేసి తీసేయాలి. మేథీ మటర్ మలై కావలసినవి: మెంతి ఆకులు - 2 కప్పులు, ఉడికించిన బఠాణీ - కప్పు, తాజా క్రీమ్ - కప్పు, నెయ్యి లేదా నూనె - 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు - అర కప్పుకి తక్కువగా, పంచదార - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత పేస్ట్ కోసం: ఉల్లి తరుగు - అర కప్పు, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 4, అల్లం తురుము - అర టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, జీడిపప్పులు - అర కప్పు, కొత్తిమీర తరుగు - కొద్దిగా తయారీ: మిక్సీలో ఉల్లి తరుగు, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పులు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జతచేయాలి బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న ఉల్లి ముద్ద వేసి ఆరేడు నిమిషాలు ఆపకుండా కలుపుతూ వేయించాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేయాలి మెంతి ఆకులు, పావు కప్పు నీళ్లు జత చేసి బాగా కలిపి, సుమారు పది నిమిషాలు సన్నని మంట మీద ఉంచాలి ఉడికించిన బఠాణీ, తాజా క్రీమ్ జత చేసి, సుమారు ఆరేడు నిమిషాలు సన్నని మంట మీద ఉంచాలి ఉప్పు, పంచదార జత చేసి మరోమారు బాగా కలిపి దించేయాలి కొత్తిమీరతో అలంకరించి, నాన్ లేదా పుల్కాలతో కలిపి వడ్డించాలి. (తీపి ఇష్టపడని వారు పంచదార లేకుండా తయారుచేసుకోవచ్చు) అరటిపండు బూరెలు కావలసినవి: గోధుమపిండి - కప్పు, బెల్లం పొడి - అర కప్పు, కొద్దిగా పండిన అరటిపండ్లు - 2 (అర కప్పు గుజ్జు), బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి - టీ స్పూను, బేకింగ్ సోడా - పావు టీ స్పూను, ఉప్పు - చిటికెడు, నూనె-డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ఒక పాత్రలో బెల్లం తరుగు, కొద్దిగా నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి కరిగించి, వడకట్టాలి అరటిపండును మెత్తగా గుజ్జు చేయాలి ఒక పాత్రలో గోధుమ పిండి, బియ్యప్పిండి, ఏలకుల పొడి, బేకింగ్ సోడా, ఉప్పు, అరటి పండు గుజ్జు వేసి బాగా కలపాలి బెల్లం పాకం జత చేసి మరోబమారు కలపాలి కొద్దిగా నీళ్లు జత చేస్తూ, గట్టిగా ఉండేలా కలపాలి బాణలిలో నూనె కాగాక, గరిటెడు పిండిని నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి వేడివేడిగా అందించాలి. -
సంగీత సారథి
హిందుస్థానీ సంగీతంలో కిరానా ఘరానా, బెనారసీ ఘరానా సంప్రదాయాల మేళవింపుగా రాగాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు సారథి ఛటర్జీ. తండ్రి వద్ద కిరానా ఘరానా, గురువు వద్ద బెనారసీ ఘరానా సంప్రదాయాల్లో పొందిన శిక్షణ, నిరంతర సాధనతో సంగీత ప్రపంచంలో తనదైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. హైదరాబాదీ శ్రోతలను అలరించేందుకు తొలిసారిగా ఇక్కడకు వచ్చిన సారథి ఛటర్జీ కొద్దిసేపు ‘సిటీప్లస్’తో ముచ్చటించారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. నేను పుట్టి పెరిగిందంతా కోల్‌కతా. నాన్న ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ ఛటర్జీ హిందుస్థానీ సంగీతంలో కిరానా ఘరానా సంప్రదాయానికి చెందిన గాయకుడు. అమ్మ సెఫాలీ బెంగాలీ భక్తి పాటలు పాడేది. అక్క మహువా కూడా మంచి గాయని. సంగీత నేపథ్యంలో పుట్టిపెరగడంతో సహజంగానే రాగాలు ఒంటబట్టాయి. అలాగని సంగీతం నేర్చుకోవాలంటూ నాన్న నాపై ఎన్నడూ ఒత్తిడి తేలేదు. చిన్నప్పుడు కూనిరాగాలు తీసేవాడిని. కూనిరాగాలు విన్న అమ్మ ఓ రోజు సంగీతంపై శ్రద్ధపెట్టమని సలహా ఇచ్చింది. తనకు తెలిసిన కొన్ని రాగాలు కూడా నేర్పింది. ఆ రాగాలు నా నోట విన్న నాన్న కూడా ప్రశంసించారు. నాన్న ప్రశంసతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఐదేళ్ల ప్రాయంలోనే ఆకాశవాణిలో రవీంద్రనాథ్ ఠాగోర్ పద్యాలు పాడాను. పదిహేడేళ్ల ప్రాయంలోనే 1981లో ఆకాశవాణి సంగీత పోటీల్లో మొదటి బహుమతి సాధించాను. నాన్న దగ్గర కిరానా ఘరానా సంప్రదాయంలో సాధన చేశా. తర్వాత పండిట్ రాజన్ మిశ్రా, సాజన్ మిశ్రాల వద్ద బెనారసీ ఘరానా నేర్చుకున్నా. గాత్రంతో పాటు తబలా వంటి వాద్యాలనూ అప్పుడప్పుడు వాయిస్తుంటా. ఇక నా కుటుంబం గురించి చెప్పాలంటే.. నా భార్య షర్మిల లెక్చరర్. మా అబ్బాయి సప్తక్ ఛటర్జీ కూడా సింగర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. సంప్రదాయ సంగీతాన్ని భావి తరాలకు అందించాలనే లక్ష్యంతో 2006లో ‘సంగీతం’ పేరుతో సొసైటీని ఏర్పాటు చేశా. రిచ్ మ్యూజిక్ సిటీ... నేను హైదరాబాద్ రావడం తొలిసారి. ఎప్పటి నుంచో ఈ సిటీలో నా గాత్రాన్ని లైవ్‌గా వినిపించాలనుకుంటున్నా. ‘స్పిక్‌మాకే’ సంస్థ వారు ఇక్కడ కచేరీ చేయాలని ఆహ్వానించగానే మారు మాట్లాడకుండా ఓకే చేశా. సిటీవాసులు హిందూస్థానీ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తారని విన్నా. ఈ నగరంలో నాన్నకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. భవిష్యత్‌లో ఇక్కడ మరిన్ని కచేరీలు చేయాలనుకుంటున్నా. ..:: వాంకె శ్రీనివాస్ -
సంప్రదాయాన్ని ఆధరిద్దాం
మనసులో ఎంతగా తపనున్నా... మనదైన సంప్రదాయాలపై ఎంత మక్కువున్నా... తప్పనిసరై ‘తెలుగుదనాన్ని’ దూరంగా పెట్టాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రెడిషనల్ వేర్ మీద పెరిగిన మక్కువ ప్రతి చోటా కనపడుతోంది. అందుకు అనుగుణంగానే నగరంలో జరిగే ప్రతి ఫ్యాషన్‌షోలో ఏదో ఒక ట్రెడిషనల్ వేర్ సీక్వెన్స్ పెడుతున్నారు. పేరున్న బ్రాండ్స్ సైతం సంక్రాంతి స్పెషల్ కలెక్షన్స్‌ని సంప్రదాయాల్ని దృష్టిలో ఉంచుకుని విడుదల చేస్తున్నాయి. ‘సంక్రాంతి వేడుకల్లో సంప్రదాయ దుస్తులకు డిమాండ్ ఎక్కువ. అందుకే ఫెస్టివ్ కలెక్షన్స్‌ను లాంచ్ చేశాం’ అని సాహిబా డెరైక్టర్ యాష్ సలూజా అంటున్నారు. నేటి పరిస్థితుల్లో ఆసక్తి ఉన్నంత మాత్రాన ఆహార్యం మార్చేయలేం. పండుగలు, పెళ్లిళ్లు వంటి ప్రత్యేకమైన సందర్భాలకు మాత్రం ట్రెడిషనల్ వేర్ని పరిమితం చేసుకుంటున్నాం. దీనివల్ల వస్తున్న చిక్కు... అరుదుగా వాడుతుండడం వల్ల వాటి వినియోగంలో ఉన్న సౌకర్యం ఎప్పటికీ వంటబట్టడం లేదు. ఇటువంటి వారికి ఆధునిక విపణి కొన్ని మార్గాలు అందిస్తోంది. ‘పంచె’తంత్రం... తెలుగు‘వాడి’కి చిహ్నమైన పంచెకట్టు ఎంతో అందంగా, హుందాగా ఉంటుంది. ఎందరో తెలుగు ప్రముఖులు పంచెకట్టుతో ప్రపంచాధినేతలనే కట్టిపడేశారు. దీనిపై మక్కువ ఉన్నా కట్టడంలో ఇబ్బందులు ఎదుర్కునేవారి కోసం స్టిచ్చింగ్ పంచెలు మార్కెట్లోకి వచ్చేశాయి. తరచుగా జారిపోవడం, దోపుకోవడానికి ఇబ్బంది పడుతున్నవారి కష్టాలకు ఇవి చెక్ పెడుతున్నాయి. వీటిని డిజైనర్, రెడీమేడ్ పంచెలు అని కూడా వ్యవహరిస్తున్నారు. వేడుకలకు తగ్గట్టుగా... సంక్రాంతి వంటి పండుగలకు పంచెకట్టు వంటివి ధరించడం, పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల సమయంలో షేర్వాణి, కుర్తా పైజమా వగైరాలతో పురుషులు సంప్రదాయాన్ని పండించవచ్చు. ఇక మహిళల విషయానికి వస్తే యువతులైతే హాఫ్శారీలు, మహిళలైతే చీరలు బావుంటాయని వేరే చెప్పనక్కర్లేదు. వీటిలో కూడా సులువుగా ధరించేలా స్టిచ్డ్ శారీస్ అందుబాటులో ఉన్నాయి. అలవాటు చేసుకొంటే మేలు ట్రెడిషనల్ వేర్‌కు ఇప్పుడు ప్రాధాన్యం బాగా పెరిగింది. అయితే ఎంత ఇష్టం ఉన్నా చీరలు, హాఫ్శారీలు ఉపయోగించడంలో అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లోయింగ్ స్టైల్ ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకుంటే మరింత సులభంగా చీర కట్టుకోవచ్చు. దళసరి ఫ్యాబ్రిక్‌తో చేసే చీర ధరిస్తే కొత్తవారికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాగే జార్జెట్స్, షిఫాన్స్ వంటివి పార్టీలకు, ఫంక్షన్లకు... పెళ్లిళ్లకు బెనారస్, ఉప్పాడ వంటివి... పండగలకు పోచంపల్లి, కలంకారి, ఇకత్ తదితర వెరైటీలు ఎంచుకోవాలి. - అజితారెడ్ది, హామ్స్టెక్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ -
సంప్రదాయాలను భావితరాలకు చాటుదాం
మంత్రి పరిటాల సునీత అనంతపురం ఎడ్యుకేషన్ : తెలుగింటి అభిరుచులు, అలవాట్లు, సంప్రదాయాలు భావితరాలకు చాటుదామని పౌర సరఫరాల శాఖ మంత్రి పల్లె సునీత పేర్కొన్నారు. సాంస్కృతిక వ్యవహార శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్లో సంక్రాతి సంబరాలు-15 జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘సంక్రాంతి వేడుకలు’ నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు రూ. కోటి రూపాయలు నిధులు విడుదల చేశారన్నారు. ఇక్కడ స్టాళ్లు, ముగ్గుల పోటీలు, గురవయ్యలు, కబడ్డీ, సాంస్కృతిక కార్యక్రమాలు పల్లెలను గుర్తు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబమూ సంక్రాంతి పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ‘చంద్రన్న సంక్రాతి కానుక’ అందజేశామన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మాట్లాడుతూ తెలుగు సంస్కృతికి నిలువుటద్దంలా ఉన్న అనంతపురం జిల్లా ఔన్నత్యాన్ని చాటిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జెడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ పల్లె వంటకాలతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. ఇన్చార్జి కలెక్టరు లక్ష్మీకాంతం మాట్లాడుతూ భాషా ప్రయుక్తంగా ఏర్పడిన సంక్రాంతి పండుగను ఆడంబరంగా జరుపుకుంటున్నామన్నారు. అనంతపురం మేయర్ మదమంచి స్వరూప, ఏజేసీ ఖాజామొహిద్దీన్, డీఆర్వో హేమసాగర్, జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
నో కన్ఫ్యూజన్
Guest Time అందరిలోనూ సృజన అంతర్లీనంగా దాగి ఉంటుంది. సాధనతో మనకు మనమే దానిని వెలికి తీసుకోవాలి అంటారు ప్రముఖ సంతూర్ వాద్యకారుడు పండిట్ రాహుల్ శర్మ. సాధనతోనే రాణింపు వస్తుందనేది ఆయన మాట.ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన ‘జాదవ్‌పూర్ యూనివర్సిటీ హైదరాబాద్ చాప్టర్ అలుమ్ని’ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయనను సాక్షి సిటీప్లస్ పలకరించినపుడు తన సంగీత ప్రయాణం గురించి ఇలా వివరించారు. నాన్న, ప్రముఖ సంతూర్ విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ నా తొలిగురువు. సంగీత ప్రపంచంలో ఆయన పేరు తెలియని వారు లేరు. నేను 13వ ఏట నుంచే సంతూర్ వాయించడం నేర్చుకున్నాను. నాన్నతో కలసి ఎన్నో ప్రదర్శనలిచ్చాను. సంగీతం నేర్చుకోవటంతో పాటు పాటలు పాడటం, వేదికలపై ప్రదర్శలివ్వడం చిన్న వయసులోనే ప్రారంభించాను. ఏ రంగమైనా సృజన ముఖ్యం సృజనతో మాత్రమే ఏ రంగంలోనైనా రాణించగలం. క్రియేటివిటీతోనే ప్రతి సందర్భాన్నీ సంగీతమంత అందంగా మలుచుకోవచ్చు. సాధనతోనే హోదా, గుర్తింపు లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి చదువుతో పాటే సంగీతం లేదా మరేదైనా అంశాన్ని హాబీగా మలచుకోవాలి. హిందుస్థానీ మ్యూజిక్‌తో పాటు ఫ్యూజన్ మ్యూజిక్‌లోనూ నా ముద్ర ఉంది. ముఖ్యంగా ఫ్యూజన్‌ను కన్ఫ్యూజ్ చేయకూడదు. కచేరీకి ముందు పరికరాల శబ్దాలను, మైకుల నుంచి వచ్చే ధ్వనులను సరిచేసుకోవాలి. అప్పుడే ఫ్యూజన్ సూటిగా హృదయాలను తాకుతుంది. ఇక్కడ ధ్వని బదలాయింపు చాలా ముఖ్యం. వెస్ట్రన్, ఇండియన్ మ్యూజిక్ల తీరు వేరు. ఫ్యూజన్ మ్యూజిక్ తీరు వేరు. మై ఫేవరెట్ ప్లేస్ హైదరాబాద్ నాకు ఇష్టమైన ప్రాంతం. నేను సంగీత కచేరీలు ఇవ్వడం ప్రారంభించిన నాటి నుంచి ఇక్కడకు వస్తూనే ఉన్నాను. ఖాదర్ అలీ బేగ్‌తో పాటు ఆయన కుమారుడు మహ్మద్ అలీ బేగ్ ప్రోగ్రామ్‌లకు ఎన్నోసార్లు వచ్చాను. హైదరాబాదీలు సంగీతప్రియులు. వారు చూపించే ఆదరణ కళాకారులకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. యువత ఇటు వైపు రావాలి మన సంస్కృతి, సంప్రదాయాలు విలక్షణమైనవి. వీటి పరిరక్షకులు యువతే. అన్నింటా, అంతటా సంగీతమే ప్రాముఖ్యం వహిస్తుంది. యువత దీనినో కెరీర్‌గా మలచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. నేను ముంబైలోని మిథిబాయి కాలేజీ నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశాను. కానీ, విచిత్రంగా సంగీత ప్రపంచం వైపు అడుగులు వేశాను. 1996 నుంచి నా సంగీత ప్రదర్శనలు మొదలయ్యాయి. 2000 సంవత్సరం నుంచి సొంతంగా కచేరీలు ఇస్తున్నాను. అప్పటి నుంచి దేశ, విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చాను. హిమాలయశర్మ, భవానీశంకర్, తబలా ఉస్తాద్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి చేసిన ప్రదర్శనలు రికార్డులు సృష్టించాయి. 2002లో నా సంగీత ప్రదర్శనలకు సంబంధించి ఆరు టైటిల్స్ గెలుచుకొన్నాను. ‘ముసే దోస్తీ కరోగే’ సినిమాకి సంగీతం అందించినందుకు ‘ఉత్తమ తొలి సంగీత దర్శకుడు’ అవార్డ్ అందుకున్నాను. -
చెన్నై సినీ చిత్రోత్సవాలు బాలచందర్‌కు అంకితం
తమిళసినిమా: 12వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల ముగింపు కార్యక్రమం స్ఫూర్తి దాయకంగా ప్రోత్సాహకరంగా జరిగింది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన చిత్రోత్సవ కార్యక్రమాలు 46 దేశాలకు చెందిన చెన్నై సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన 171 చిత్రాల ప్రదర్శన చెన్నై సినీ ప్రముఖులను పులకరింప చేసింది. అదే విధంగా ఉన్నత విలువలతో కూడిన మంచి కథా వస్తువుగా తమిళ చిత్రాలకు చక్కనిగుర్తింపు, గౌరవం దక్కింది. ఈ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో యువతరానికి తగిన ప్రాధాన్యత లభించిందని చెప్పవచ్చు. గురువారం సాయంత్రం స్థానిక రాయపేటలోని ఉడ్‌ల్యాండ్ థియేటర్లో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఉత్తమ చిత్రాలకు అవార్డులను అందించారు. కుట్రం కడిదల్కు ప్రథమ అవార్డు ముందుగా ప్రతి ఏడాదీ అందిస్తున్న టెలిఫిలిం బఫ్ అవార్డు కోసం అత్యధికంగా 138 ఎంట్రీలు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. వాటిలో టెలిఫిలిం బఫ్ అవార్డును మద్రాసు స్కూల్ ఆఫ్ ఎకనామిక్ అధ్యాపకుడు ఎస్.వినాయక్ గెలుచుకున్నారు. అదేవిధంగా ఎంజీఆర్ ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థులు రూపొం దించిన ఐదు షార్ట్ ఫిలింస్లు ‘ఛీ’ అనే షార్ట్ ఫిలిం అమ్మా అవార్డును గెలుచుకున్నాయి. ఈ లఘు చిత్రరూపకర్త మనోజ్‌కుమార్ ఈ అవార్డుతో పాటు పదివేల రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. అమితాబ్‌బచ్చన్ యూత్ ఐకాన్ అవార్డును ఈ ఏడాది యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు దక్కింది. ఆయన అవార్డుతో పాటు లక్ష రూపాయల బహుమతిని అందుకున్నారు. కాగా తమిళ చిత్రాల పోటీలు మహిళాదర్శకురాలు తావిత్ షమీమ్ తెరకెక్కించిన పూవరసం పీపీ, నట దర్శకుడు పార్దీపన్ రూపొందించిన కథై తిరె కథై ఇయక్కం చిత్రంలో ప్రత్యేక జూరి అవార్డులను గెలుచుకున్నాయి. వీటికి తలా లక్షరూపాయల నగదు బహుమతుల్ని అందించారు. ఇక రెండో ఉత్తమ కథా చిత్రంగా నవ దర్శకుడు హబ్ వినోద్ దర్శకత్వంలో నటుడు మనోబాల నిర్మించిన చదరంగవేట్టై గెలుచుకుంది. ఈ అవార్డుతో పాటు నిర్మాతకు లక్ష, దర్శకుడిగి లక్ష నగదు బహుమతితో సత్కరించారు. ప్రథమ ఉత్తమ కథా చిత్రంగా కుట్రం కడిదల్ చిత్రం ఎంపికైంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన బ్రహ్మజీకి రెండు లక్షలు, నిర్మాతలు సతీష్‌కుమార్, కిష్టి సిలువప్పన్లకు లక్ష రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. ఇండో సినీ అప్రిషియోషన్ సంస్థ నిర్వహించిన ఈ చిత్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ రాధిక ఫిలిం చాంబర్ అధ్యక్షుడు వాసుదేవన్, నటి సుహాసిని, పూర్ణిమా భాగ్యరాజ్, శ్రీప్రియన రాజ్‌కుమార్, పీ.వాసు మొదలగు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఉత్తమ చిత్రాల ఎంపిక కష్టమనిపించింది ముందుగా అవార్డు బ్యూరీ కమిటీ సభ్యుడు, దర్శకుడు పీ.వాసు మాట్లాడుతూ ఈ రోజు తమిళ సినిమా హెడ్మాస్టర్ లేని పాఠశాలగా మారిపోయిందన్నారు. కారణం అందరికీ తెలిసిందే. కె.బాలచందర్ లేని లోటు తీర్చలేనిదన్నారు. ఇక ఈ చిత్రోత్సవాల గురించి చెప్పాలంటే 171 విదేవీ చిత్రాలను తమిళ సినీ ప్రేక్షకుల చూసే భాగ్యం కలిగిందన్నారు. అవార్డుల పోటీలో పాల్గొన్న 12 తమిళ చిత్రాలలో ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేయడం చాలా కష్టమైందని అన్నారు. మంచి కథా చిత్రాలను చూడాలంటే ఇంతకుముందు కోల్కత్తా, బెంగళూరు, కేరళ చిత్రాలను ఉదాహరణగా చెప్పేవారన్నారు. అలాంటిదిప్పుడు తమిళ సినిమా అని గర్వంగా చెప్పుకునే స్థాయికి మన చిత్రాలు ఉంటున్నాయని అన్నారు. కె.బాలచందర్ అవార్డు గత ఏడాది ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్ యువ కళాకారులను ప్రోత్సహించే విధంగా 11 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఆ మొత్తాన్ని అమితాబ్ యువ ఐకాన్ అవార్డును ప్రవేశ పెట్టి ప్రతి ఏడాదీ ఒకవర్ధమాన కళాకారుడికి అవార్డుతో పాటు *లక్ష అందిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి మరో అవార్డు నెలకొననుంది. అదే బాలచందర్ అవార్డు. ఈ అవార్డు కోసం ప్రతి ఏడాది నటి శ్రీప్రియ రాజ్‌కుమార్ *లక్ష రఅందించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ 12వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను దర్శక శిఖరం బాలచందర్‌కు అంకితం ఇస్తున్నట్లు శరత్‌కుమార్ తెలిపారు. -
తెస్తారా.. వదిలేస్తారా..?
తెలంగాణ ప్రాంతంలోని నీళ్లు, భూములు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కొల్లగొట్టిన గత పాలకులు చారిత్రక సంపదనూ వదల్లేదు. ఎనిమిదేళ్ల క్రితం గుంటూరు జిల్లా అమరావతిలో జరిగిన కాలచక్రలో ప్రదర్శించడానికి కొలనుపాక, పానగల్లు నుంచి తరలించిన బుద్ధుని విగ్రహాలను తిరిగి స్వస్థలాలకు చేర్చలేదు. అత్యంత అమూల్యమైన బౌద్ధ సంపదను తెలంగాణ రాష్ట్రంలోనైనా రాబట్టుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందంటున్నారు పలువురు. -భువనగిరి ⇒ ఎనిమిదేళ్ల క్రితం అమరావతికి ⇒ తరలిన మన బౌద్ధ సంపద ⇒ రాష్ట్ర విభజన వరకు స్వస్థలానికి చేర్చని పాలకులు ⇒ తెలంగాణ ప్రభుత్వంపైనే ఆశలు కొలనుపాక.. బౌద్ధ చరిత్రకు నిలయంగా, ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ప్రాంతం. నల్లగొండ జిల్లా ఆలేరుకు సమీపంలో ఉన్న ఈ గ్రామం అత్యంత విలువైన చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లు. అయితే గత పాల కుల హయాంలో గుంటూరులో జరిగిన ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో ప్రదర్శించడానికి ఇక్కడి నుంచి తరలించిన విలువైన బుద్ధుని విగ్రహాలను తిరిగి తీసుకురాలేదు. అసలేం జరిగిందంటే.. 2005 నవంబర్‌లో గుంటూరు జిల్లా అమరావతిలో బౌద్ధులకు సంబంధించి ‘కాలచక్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామాతో పాటు దేశవిదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో బౌద్ధ మతస్తులు హాజరయ్యారు. వారి సందర్శనార్థం ఉంచటానికి జిల్లాలోని పానగల్, కొలనుపాక మ్యూజియం నుంచి బౌద్ధ సంస్కృతి, సంప్రదాయాలు, బౌద్ధ మతానికి చెందిన దేవతామూర్తుల విగ్రహాలు, పీఠాలను అమరావతికి తరలించారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి స్వస్థలాలకు చేర్చాల్సిన ఉండగా ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఈ విషయమై అప్పట్లో శాసనసభలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరగగా పానగల్ మ్యూజియానికి బుద్ధుని విగ్రహం మాత్రం వచ్చింది. పానగల్ మ్యూజియానికి ఇంకా రెండు విగ్రహాలు రావాల్సి ఉంది. అలాగే కొలనుపాక మ్యూజియంలో వజ్రపాణి (బుద్ధుడు సూర్యునిగా వెలుగొందిన ప్రతిరూపం), బుద్ధుని పీఠం (పెడస్టల్ ఆఫ్ బుద్ధ), లైన్‌స్టోన్ పిల్లర్ (బుద్ధ ఇమేజ్) బౌద్ధ మతానికి సంబంధించిన అత్యంత విలువైన రాత్రి విగ్రహాలు అక్కడే ఉండిపోయాయి. తవ్వకాలలో బయల్పడిన విగ్రహాలలో కొన్ని.. కొలనుపాకతో పాటు పరిసర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో అత్యంత విలువైన చారిత్రక శిలా శాసనాలు, దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. వీటిలో ప్రధానంగా వీరశైవ మతానికి సంబంధించిన విగ్రహాలతో పాటు బౌద్ధ మతానికి సంబంధించిన రాత్రి విగ్రహాలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఉన్న జైన మతానికి సంబంధించిన ప్రాచీనమైన దేవాలయంలో పురావస్తు శాఖ వారు మ్యూజియం ఏర్పాటు చేసి లభించిన విగ్రహాలను భద్రపరిచింది. చరిత్ర కనుమరుగయ్యే ప్రమాదం అమరావతికి తరలించిన అత్యంత విలువైన బుద్ధుని విగ్రహాలను తిరిగి స్వస్థలాలకు తీసుకురాకపోతే వాటికున్న చారిత్రక నేపథ్యం కోల్పోయే ప్రమాదం ఉందని పురావస్తు పరిశోధకులు అంటున్నారు. ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో బయల్పడ్డ బౌద్ధ మతానికి సంబంధించిన విగ్రహాల వల్ల పూర్వకాలంలో ఇక్కడ బౌద్ధమతం విలసిల్లిందన్న ఆధారాలు ఉన్నాయి. వాటిపై పురావస్తు శాఖ పూర్తి స్థాయిలో పరిశోధన జరిపితే అత్యంత విలువైన సమాచారం లభించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేల తరలిపోయిన సంపదను తిరిగి రాబట్టుకోనట్లయితే ఈ ప్రాంతాలకు ఉన్న ప్రాముఖ్యత తెరమరుగయ్యే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. -
సంస్కృతికి వారసులుగా పిల్లల్ని పెంచండి
ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు రాజమండ్రి: పిల్లలను భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వారసులుగా పెంచాలని ప్రముఖ రచయిత, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు తల్లిదండ్రులకు సూచిం చారు. రాజమండ్రిలోని శ్రీ షిర్డీసాయి విద్యానికేతన్, డ్యాఫ్నీ ఏసియాటిక్ పాఠశాలల ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎస్వీ ఫంక్షన్ హాలులో జరిగిన తల్లుల సదస్సులో ఆయన మాట్లాడారు. విదేశీ విద్యను బలవంతంగా అంటగడుతూ పిల్లలను సంస్కృతికి దూరం చేస్తున్నారని గొల్లపూడి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ విష్ణుప్రియ, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు దారపు నాగిరెడ్డి, స్కూలు కరస్పాండెంట్ తంబాబత్తుల శ్రీధర్, ప్రిన్సిపాల్ శ్రీవిద్య పాల్గొన్నారు. -
10 వేల మంది పిల్లలతో ఒకేసారి వందేమాతరం
* కేంద్ర మంత్రి అనంతకుమార్ సాక్షి,బెంగళూరు: భారతీయ సంస్కృతి,సంప్రదాయాలపై అవగాహన కల్పించడానికి వీలుగా డిసెంబర్ 31 అర్ధరాత్రి పదివేల మంది పిల్లలతో ఒకేసారి వందేమాతరం గీతాలాపన చేయించనున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనశాఖ మంత్రి అనంతకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న అదమ్య చేతన సంస్థ ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో మహిళా సేవా సమాజ ఉన్నతి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ‘స్వచ్ఛభారత్-హసిరుభారత్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పిల్లల్లో దేశభక్తిని పెంచాల్సి ఉందన్నారు. ఇందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్-హసిరుభారత్లో భాగంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి నేషనల్ కళాశాల క్రీడా మైదానంలో 10 వేల మంది పిల్లలు ఒకే చోట చేరి వందేమాతరం గీతాన్ని ఆలాపిస్తారన్నారు. అదేవిధంగా డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకూ పిల్లల్లో భారతీయ సంస్కృతి, కళలు తదితర విషయాల పై అవగాహన కల్పించడం కోసం అదమ్య చేతన సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరులో చిత్రలేఖనం, పాటల పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అనంతకుమార్ తెలిపారు. ఇందులో రాష్ట్రానికి చెందిన వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొననున్నారన్నారు. కార్యక్రమంలో అదమ్య చేతన వ్యవస్థాపక అధ్యక్షురాలు తేజశ్వినీ అనంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వేయి గ్రంథాలను వెలుగులోకి తెస్తాం
శ్రీరామనగరం (శంషాబాద్ రూరల్): దేశ సం సృ్కతి, సంప్రదాయాలను కాపాడుకోవడానికి వేయి పురాతన గ్రంథాలను వెలుగులోకి తీసుకురానున్నట్లు శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి పేర్కొన్నారు. మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలోని జీవా ప్రాంగణంలో నెలకొల్పనున్న ‘సమతామూర్తి శ్రీమద్రామనుజ స్ఫూర్తి’ కేంద్రం నిర్మాణం సందర్భంగా ఆదివారం ఇక్కడ విద్వాంసులతో సదస్సు నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది విద్వాంసులు హాజరైన ఈ సదస్సులో జీయర్‌స్వామి పలు మార్గదర్శకాలు చేశారు. భగవద్రామానుజులు ఆవిర్భవించి వేయి సంవత్సరాలు కానున్న సందర్భంగా 2016-17లో జీవా ప్రాంగణంలో స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సహస్రాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఇందులో 216 అడుగుల ఎత్తు శ్రీరామానుజుల లోహపు మూర్తిని నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. స్ఫూర్తి కేంద్రంలో శ్రీరామానుజుల సంచలనాత్మకములు, స్ఫూర్తిదాయకములు, ఆయన జీవిత విశేషాల దర్శనము, 108 సుప్రసిద్ధ వైష్ణవ దివ్యదేశాలు ఒకే చోట దర్శనమిచ్చేలా సుమారు రూ.400 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వెయ్యి గ్రంథాలను వివిధ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. పుస్తకరూపం, ఈ-లైబ్రరీ, ప్రసార మాధ్యం ద్వారా గ్రంథాలను వెలుగులోకి తేవడానికి చేపటా ్టల్సిన చర్యలపై సదస్సులో చర్చించారు. ముంబై, మైసూరు, బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, పూరి, మధురాంతకం, హైదరాబా ద్ ప్రాంతాల నుంచి విద్వాంసులు సదస్సులో తమ అభిప్రాయాలను తెలియజేశారు. శ్రీ అహోబిల జీయర్ స్వామి, సుప్రసిద్ధపండితులు రఘునాథాచార్యులు, సదస్సులో పాల్గొన్నారు. స్ఫూర్తి కేంద్రం నమూనా ప్రదర్శన.. జీవా ప్రాంగణంలో నెలకొల్పనున్న స్ఫూర్తి కేంద్రం నమూనాను ఇక్కడి వేద పాఠశాల విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించారు. స్ఫూర్తి కేంద్రంలో ఏర్పాటు చేయనున్న వివిధ నిర్మాణాల నమూనాలను అందంగా తయారు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను చినజీయర్ స్వామి అభినందించారు. -
పిల్లలకు సంస్కృతీ సంప్రదాయాలు నేర్పాలి
తిరుపతి : ప్రాథమిక విద్యా స్థాయి నుంచే పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పాలని ఎస్వీయూ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.కృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలోని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటైన క్లస్టర్ లెవెల్ సోషియల్ సైన్స్ ఎగ్జిబిషన్, జాతీయ సమైక్యతా శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యావ్యవస్థలో మార్పులు అవసరమన్నారు. మార్కులు, ర్యాంకులు లక్ష్యంగా సాగుతున్న విద్యార్థులకు దేశం గురించి ఆలోచించే తీరిక లేకుండా పోతోందన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని, సంస్కృతి సంప్రదాయాలను నేర్పడానికి కేంద్రీయ విద్యాలయాలు కృషి చేయడం అభినందనీయమన్నారు. సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో భాగంగా తెలుగు, హిందీ, ఇంగ్లిషు భాషల్లో వ్యాసరచన, వక్తృత్వ, సంప్రదాయ నృత్యం, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్లస్టర్ లెవెల్ పోటీల్లో విజేతలు డిసెంబర్ 28, 29 తేదీల్లో హైదరాబాద్ బేగంపేటలో జరిగే రీజనల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. తిరుపతి కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు 2014 సెంట్రల్ సీనియర్ సెకండరీ, సెంట్రల్ సెకండరీ సర్టిఫికెట్ పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించారన్నారు. అనంతరం తిరుపతి, వెంకటగిరి, ఒంగోలు, సూర్యలంక, గుంటూరు, నెల్లూరు కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు తయారు చేసిన ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే నమూనాల ఎగ్జిబిషన్‌ను కృష్ణారెడ్డి ప్రారంభించారు. ప్రదర్శనలో స్వాతంత్య్ర సమరంలో పాలుపంచుకున్న ధీర వనితల చిత్రపటాలు, స్మార్ట్‌సిటీ నమూనాలు, ఈజిప్టు దేశానికి చెందిన పిరమిడ్లు, పగోడాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధిచిన నమూనాలు చోటు చేసుకున్నాయి. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో భాగం గా విద్యాలయం విద్యార్థినులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
‘తంగెడి పువ్వులు తెచ్చేవాడిని’
-జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నిజామాబాద్ కల్చరల్, ప్రగతినగర్ : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం లభించడం ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ చం ద్రశేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో సోమవారం రాత్రి జరిగిన ‘బంగా రు బతుకమ్మ’ సంబురాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన చిన్నతనంలో బతుకమ్మ పండుగ ఎంతో వైభవంగా జరిగేదన్నారు. బతుకమ్మ కోసం తంగడి పువ్వును తెంపుకు వచ్చేవాడినని గుర్తుచేశారు. ఘనంగా నిర్వహిస్తున్నాం : కలెక్టర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలు ప్రతిబించే పండుగైన బతుకమ్మను మహిళలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారన్నారు. ఈ పం డుగను వైభ వంగా నిర్వహించేందుకు అధికారి కంగా తమవంతు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
ఇద్దరక్కచెల్లెళ్లు ఉయ్యాలో..
చిన్నశంకరంపేట: ఇద్దరక్క చెల్లెళ్లు ...ఉయ్యాలో ఒక్కూరికిచ్చినారు...ఉయ్యాలో..ఒక్కడే మాఅన్న...ఉయ్యాలో..వచ్చన్నపోడే ఉయ్యాలో అంటూ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. సోమవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ప్రభుత్వం తరఫున నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా తనకిష్టమైన బతుకమ్మ పాటను పాడి మహిళలతో కలిసి పోయారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మన సంప్రదాయలు, సంస్కృతులకు సమైక్య రాష్ట్రంలో సరైన గౌరవం దక్కలేదని అందుకే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన గౌరవం కల్పించారన్నారు. ఇది తెలంగాణ మహిళలకు దక్కిన అరుదైన గౌరవమన్నారు. మన సంస్కృతి, మన సంప్రదాయాలను మన ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట ఎంపీపీ అధ్యక్షురాలు కృపావతి, జెడ్పీటీసీ స్వరూప, ఉపాధ్యక్షురాలు బుజ్జి,మాజీ సర్పంచ్ విజయలక్ష్మి, సర్పంచ్‌లు కుమార్‌గౌడ్,ే హమలత, మాధవి,శోభ, ప్రియా నాయక్, రంగారావు,సత్యనారాయణ,మూర్తి పెద్దులు, అంజయ్య, ఎంపీడీఓ రాణి, తహశీల్దార్ నిర్మల, ఐకేపీ ఏపీఎం ఇందిర, టీఆర్ఎస్ నాయకులు లకా్ష్మరెడ్డి,ర ామ్రెడ్డి, రాజు,నరేందర్,రమేష్‌గౌడ్ పాల్గొన్నారు. శుద్ధమైన నీటితోనే ఆరోగ్యం మెదక్‌రూరల్: శుద్ధి చేసిన నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని బ్యాతోల్ గ్రామ ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరందించేందుకు బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి సోమవారం డిప్యూటీ స్పీకర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాలవికాస్ సంస్థ ఆధ్వర్యంలో మారుమూల గ్రామ ప్రజలకు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి తాగునీటిని అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న నీటి శుద్ధి కేంద్రాల వల్ల డయేరియా, కలరా తదితర వ్యాధులు దరిచేరవని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మీ కిష్టయ్య, బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ సువర్ణ నారంరెడ్డి, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, నాయకులు జయరాంరెడ్డి, అంజాగౌడ్, కిష్టయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నవ తెలంగాణ కోసం పోరాడాలి
తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) రాష్ట్ర కో-కన్వీనర్ విమలక్క షాబాద్ : తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడమే బతుకమ్మ పండుగ ఉద్దేశమని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) రాష్ట్ర కో-కన్వీనర్ విమలక్క పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బహుజన బతుకమ్మలో ఆమె పాలుపంచుకున్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీమాంధ్ర పాలనలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు పూర్తిగా అణచివేయబడ్డాయని విమర్శించారు. రోజురోజుకూ ఆదరణ కోల్పోయిన ఈ పండుగలను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని సూచించారు. నవ తెలంగాణ కోసం ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐదు లక్షల ఎకరాల భూములను పారిశ్రామికులకు అప్పగిస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రైవేట్ రంగ సంస్థలకు ప్రభుత్వ భూములు అప్పగిస్తే పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. ముందుగా మైనింగ్ మాఫియా భూములను రద్దు చేయాలని హితవుపలికారు. ఫిరంగినాలాకు మరమ్మతులు చేపట్టాలని గతంలో చందనవెళ్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు పాదయాత్ర చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సాగునీటి వనరులపై చిత్తశుద్ధితో పనిచేయకపోతే ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు. తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ సభ్యులు భీంభరత్, జిల్లా కార్యదర్శి నారాయణదాస్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల న్నారు. కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్బైరాగి, యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు మహేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనిత, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి, సర్పంచ్‌లు రాములుగౌడ్, లక్ష్మమ్మ, సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు పోచయ్య, సత్యనారాయణ, నాయకులు విశ్వ నాథం, శ్రీను, మహేశ్ పాల్గొన్నారు. -
ఒక్కడు విశ్వనాథ
అది ఒక విశ్వవిద్యాలయం. మన సాంప్రదాయాలు కట్టుబాట్లు చెదరరాదని గస్తీ తిరిగిన యుద్ధనౌక! గాఢ ప్రతిభాశాలి. ధిషణాహంకారి. ఆంధ్ర సాహిత్య క్షేత్రంలో విశ్వనాథ సత్యనారాయణ చేయని సేద్యం లేదు, పండించని పంట లేదు. తెలుగుజాతి పట్ల విశ్వనాథకు అలవిమాలిన ఆపేక్ష. ఉత్తరాదిన పుట్టి పెరిగిన రాముడు, విశ్వనాథ ప్రాపకంలో తెలుగురాముడు అయినాడు. నా రాముడని తనివితీరా కలవరించి పలవరించారు. విశ్వనాథకున్న అనుచర వర్గం, శిష్య వర్గం మరొకరికి లేదు. ఇష్టులు, అయిష్టులు కలిసి విశ్వనాథను నాడు నేడు కూడా సజీవంగా ఉంచుతూ వస్తున్నారు. సెప్టెంబర్10 ఆయన జయంతి. ఆ సందర్భంగా ఈ ‘వివరం’. సాహిత్యం, సంస్కృతి అవిభాజ్యమని, వాటి ఉద్ధరణ కూడా ఏకబిగిని జరగాలని విశ్వనాథ విశ్వాసం. మన దేశ రాజకీయ రంగంలో పండిత మదన్ మోహన మాలవ్యా గారెలాంటివారో, సాహిత్య రంగంలో సత్యనారాయణ అలాంటివారు. ఎన్ని ఎదురుదాడులు తగిలినా, తాను నమ్మిన సిద్ధాంతాలను వీడలేదు. తన మతం మార్చుకోలేదు. అందుకే ఆయనొక యుద్ధనౌక. ఒక మహాశిల్పి గొప్ప ఆలయాన్ని నిర్మించ సంకల్పించాడు. ఏడు ప్రాకారాలు, గాలి గోపురం, ముఖ మండపాలు, సింహద్వారాలు, మహాగోపురం, కోవెల కొలను, చుట్టూ మెట్లు... యింకా ఎన్నో కలిస్తే ఆలయం అవుతుంది. ఆ బృహత్కార్యాన్ని చేస్తూ మధ్య మధ్య ఆ శిల్పి కొన్ని చెక్కుళ్లను రూపొందిస్తాడు. విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం మహాలయం. సమాంతరంగా వారు వెలువరించిన ఖండకావ్యాలు, లఘు కావ్యాలు, నవలలు, నాటకాలు, గీతాలు, ప్రసంగ వాక్యాలు కల్పవృక్షంతో పాటు పెరిగిన పొగడలు, పొన్నలు, పున్నాగలు. వి॥బాగానే రాస్తారు గానీ ఒక పట్టాన అర్థం కాదనేవారున్నారు. ‘పాషాణపాక ప్రభూ’ అని సంబోధించినవారున్నారు. అయినా కల్పవృక్ష మహా నిర్మాణాన్ని ఆయన ఆపలేదు. రామాయణంలో ముఖ్య ఘట్టమైన సీతా స్వయంవరాన్ని సీస పద్యంలో వర్ణించి, తర్వాత తేటగీతిలో: అతని దృష్టికి జానకి యాగలేదు అతని కృష్టికి శివధనుస్సాగలేదు సీత పూజడ వెన్నుగా శిరసు వంచె చెరుకు గడవోలె నడిమికి విరిగె ధనువు. సీతను చూపిన తీరు ఇది. కవి సమ్రాట్కి సందర్భ శుద్ధి ఉంది. ఒక్కొక్క సందర్భానికి తగినట్టు పూర్వకవిని ఆవాహన చేసుకుని ఆ మార్గంలో కథ నడిపించారు. ఆదికవి నన్నయ్య నుంచి నాచన సోమన్నదాకా కల్పవృక్షంలో సాక్షాత్కరిస్తారు. మీ కల్పవృక్షం చాలామందిని కదిలించింది. దాని ప్రేరణలో విషవృక్షం కూడా మొలిచిందండీ అంటే ‘‘ఔనౌను, ఎవరి మార్గం వారిది. నేను వెర్రివాడిని. నాకు ఏడు జన్మలకు గాని ముక్తి లేదు. వారిది వైరిమార్గం. జయ విజయులు చూపిన దారి. మూడు జన్మలకే ముక్తి!’’ అనేవారు, అలవాటుగా ఉండే థూ... థూల మధ్య. తెలుగునాట చాలా ప్రాచుర్యం పొందిన విశ్వనాథ నవల వేయి పడగలు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీ కోసం రాశారు. వెయ్యి పేజీల నవల. ఆ పోటీలో కడదాకా నిలచిన నవలలు మూడు. వేయి పడగలు, అడివి బాపిరాజు నారాయణరావు నవల, చలం మైదానం. మైదానం పేజీల నియమావళికి నిలవలేదు. ఇక నిలిచినవి రెండు. విశ్వవిద్యాలయం ప్రకటించిన వెయ్యి రూపాయల బహుమతిని చెరి సగం చేశారు. బాపిరాజుకి అయిదు వందల యాభై, విశ్వనాథకి అయిదు వందలు ఇచ్చారు. అందులో కథానాయకుడు నారాయణరావు బాపిరాజే. వేయి పడగల కథానాయకుడు ధర్మారావు విశ్వనాథే. వందేళ్ల తెలుగు జీవితాన్ని అద్భుతంగా చిత్రించి, వేయి పడగలు నవల తెలుగుజాతి స్వీయకథ అనిపించారు. నైతిక సూత్రాల పట్ల, సాంప్రదాయ జీవన మార్గం పట్ల విశ్వనాథకు ప్రగాఢ గౌరవం, తిరుగులేని విశ్వాసం ఉన్నాయి. ఆయన వేయి పడగలు నవలలో ప్రతిపాదించిన అంశాలు, వారి తర్వాతి నవలలకు విస్తరించి కనిపిస్తాయి. విశ్వనాథ ఏకవీర నవల తెలుగు కాల్పనిక సాహిత్యంలో విలక్షణమైనది. నాలుగు పాత్రలను నాలుగు స్తంభాలుగా మలచి మహామండపాన్ని నిర్మించారు. మధురై దగ్గరి వైగై నది చుట్టూ ఈ కథ తిరిగి, చివరకు వైగై నదిలోనే ముగుస్తుంది. ప్రేమ, ప్రణయం ఎంతటి గొప్ప ఉద్వేగపూరితమైనవి అయినా, శృంగార భావాలు మధురమైన కోరికలు ఎంతటి విశృంఖలమైనవి అయినా, హద్దు మీరకుండా నిగ్రహించుకోవడమే భారతీయ సంప్రదాయమని ఏకవీర తీర్మానిస్తుంది. విశ్వనాథ చెలియలికట్ట నవల మరో కడలి తరంగం. అప్పట్లో ‘ఫ్రీ లవ్ సొసైటీ’ పేరుతో ఒక సమాజం తెరమీదకు వచ్చింది. ఆ వెర్రితలని దృష్టిలో పెట్టుకుని చెలియలి కట్ట రచించారు. ఇది కేవలం సాంఘిక నవల మాత్రమే కాదు, మానసిక పరిణామ దశలను విశ్లేషించిన ఒక సూత్ర గ్రంథం. సిగ్మండ్ ఫ్రాయిడ్ నుంచి భారతీయ మనో విశ్లేషణలన్నింటినీ పుక్కిలిపట్టిన విశ్వనాథ చెలియలికట్ట నవలలో రత్నావళిని విశిష్టంగా రూపొందించారు. చివరకు ఆమెనొక కర్మయోగినిగా మలచారు. చెలియలికట్ట చలం మైదానం నవలకి కౌంటర్‌గా రాశారని కొందరంటారు. కాని అది కాదు. బరి తెగించిపోతున్న నైతిక సూత్రాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చెలియలి కట్ట. నవలల్లో యదార్థ జీవన చిత్రణ చేసే సంప్రదాయాన్ని అంటే డాక్యుమెంటరీలను విరివిగా విశ్వనాథ రాశారు. వేయి పడగలు నవలలో చాలా పాత్రలకు మాతృకలు ఉన్నాయి. తెరచిరాజు నవల ముంజులూరి కృష్ణారావు జీవితం. ఆయన గొప్ప నటుడు. విశ్వనాథ కొంతకాలం కరీంనగరం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అక్కడ లాయర్ వృత్తిలో ఉంటూ సంగీతాన్ని ఉపాసించే గాయక సార్వభౌముడు నారాయణరావు ఉన్నారు. కరీంనగర్ పరిసరాలలోనే మ్రోయు తుమ్మెద అనే వాగు ఉంది. నిరంతరం లయాత్మకంగా ధ్వనిస్తూ ప్రవహించే ఆ వాగు పేరుతో ఆ సంగీత సార్వభౌముని జీవితాన్ని సాక్షాత్కరింపజేశారు. విశ్వనాథ నవలలన్నింటినీ ఒక లక్ష్యంతో ఒక ప్రయోజనంతో రాశారు. వాటిని చాలామంది ఆ విధంగా అర్థం చేసుకోలేదని విశ్వనాథ ఆవేదన పడేవారు. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, దమయంతి స్వయంవరం వీటిలో విశ్వనాథ వ్యంగ్య వైభవపు అంచులు చూడచ్చు. బద్దన్న సేనాని, వీరవల్లడు వీటిదొక తీరు. మా బాబు, జేబుదొంగలు మరొక తీరు. తర్వాత్తర్వాత ఎమెస్కో పాకెట్ బుక్స్‌గా రాసిన కాశ్మీర పట్టమహిషి, చిట్లీ చిట్లని గాజులు, దిండు కింద పోకచెక్క, దంతపు దువ్వెన లాంటి కాశ్మీర కథల పరంపర వేరొక తీరు. విశ్వనాథ ఖండ కావ్యాలు రాసినా, వచనం రాసినా, లఘు కావ్యాలు రాసినా కండ పుష్టి గల రచనలే చేశారు. తన ప్రతిభను గ్రంథాలలోకి దించి, జాతికి అందించగలిగిన మహానుభావుడు విశ్వనాథ. సనాతన భారతీయ తత్వాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన జ్ఞాని. విశ్వనాథ రచనలలో ‘జీవుడి వేదన’ అనే మాట తరచూ వినిపిస్తుంది. ఇది ఆయన స్వేచ్ఛాచింతనకు ఒక ఉదాహరణ. ప్రతి మనిషికీ కొన్ని తనవైన ఆలోచనలు ఉంటాయి. సొంత ఘోష ఒకటి ఉంటుంది. అదే ఆయన ప్రతిపాదించిన జీవుడి వేదన. దీనిని విశ్లేషించి, సమగ్రంగా పరిశోధిస్తే ఒక వినూత్న తాత్విక సిద్ధాంతం ఆవిష్కృతమవుతుంది. విశ్వనాథ నాటకాలలో వేనరాజు, నర్తనశాల, అనార్కలి ప్రసిద్ధమైనవి. ప్రాచీన కవుల రచనలపై విశ్వనాథ విశ్లేషణ వ్యాసాలు నేటి విమర్శకులకు పాఠ్య గ్రంథాలు. ఏ కవిని ఎక్కడ ఎలా దర్శించాలో ఆయనకు తెలుసు. ‘మెంతి మజ్జిగ రుచి మెంతి మజ్జిగదే. పరవాన్నం రుచి పరవాన్నందే. బాగుండడమంటే వాటి జీవలక్షణాలను బట్టి తేల్చాలి’... ఇలాంటి కొలత బద్దలతో విశ్వనాథ విమర్శ సాగుతుంది. సాహిత్యంలో ఉన్న శాఖలన్నీ విశ్వనాథకు ఆటపట్లు. కోకిలమ్మ పెండ్లి, కిన్నెరసాని పాటలు, ఉయ్యాల తాళ్లు లాంటి గేయ కావ్యాలు, విశ్వనాథ మధ్యాక్కరలు వేటికవే ప్రత్యేకం. 1895 సెప్టెంబర్ 10న కృష్ణా జిల్లా నందమూరులో జన్మించిన విశ్వనాథ కార్యక్షేత్రాన్ని కడదాకా బెజవాడనే చేసుకున్నారు. విశ్వనాథకు సాహిత్యంలోనే కాదు, జీవితంలోనూ ముందుచూపు ఉంది. తన పుస్తకాలు కనుమరుగు కాకుండా కొత్తతరాల వారికి లభిస్తూ ఉండాలంటే, స్వయంగా తనే ఒక ప్రచురణ సంస్థని స్థాపించి ముద్రించాలని అనుకున్నారు. ‘విశ్వనాథ సత్యనారాయణ అండ్ కో’ని ప్రారంభించారు. ఆయన రచనలన్నీ అప్పటికీ ఇప్పటికీ ఆ సంస్థ పేరు మీదే వెలువడుతున్నాయి. విశ్వనాథ సహస్ర మాసోప జీవి. పొందతగిన అన్ని గౌరవాలూ పొందారు. తీసుకోవలసిన అన్ని బిరుదులూ తీసుకున్నారు. ఆనాటి ప్రముఖులు పి.వి.నరసింహారావు, తెన్నేటి విశ్వనాథం, టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకటరావు, మండలి కృష్ణారావు ఆయన శిష్యవర్గంలోని వారు. విశ్వనాథ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగా, శాసన మండలి సభ్యులుగా తమ సేవలు అందించారు. జాతీయోద్యమం నేపథ్యంలో తన మొదటి నవల ‘అంతరాత్మ’ని ప్రారంభించారు గాని, అది అసంపూర్ణంగానే మిగిలింది. ప్రచురితమైన తొలి నవల ఏకవీర. విశ్వనాథ మంచి భోజనప్రియులు. ఆయన రుచులు వింతగా ఉండేవి. తీవ్రస్థాయిలో ఆవకాయ కలుపుకుని, ఆ ముద్ద తింటూ పచ్చిమిరపకాయ కొరుక్కునేవారు. అదీ ఆంధ్ర పౌరుషం! విశ్వనాథ సమకాలికులెవరూ సామాన్యులు కారు. చెళ్లపిళ్లవారు విద్య నేర్పిన గురువులు. అప్పుడప్పుడే రకరకాల ఇజాలు రెక్క విప్పుతున్న రోజుల్లో, విశ్వనాథ ఒంటరిపోరుకి తలపడ్డారు. తలపడి నిలిచారు. నిలిచి గెలిచారు. శతాధిక గ్రంథకర్త. ప్రతి గంథం ఒక ప్రత్యేకతను సంతరించుకుని బతికి బట్టకట్టింది. భోజన ప్రియులు విశ్వనాథ మంచి భోజనప్రియులు. ఆయన రుచులు వింతగా ఉండేవి. తీవ్రస్థాయిలో ఆవకాయ కలుపుకుని, ఆ ముద్ద తింటూ పచ్చిమిరపకాయ కొరుక్కునేవారు. అదీ ఆంధ్ర పౌరుషం! విశ్వవేదన జీవితాన్ని సంపూర్ణంగా తరచి చూసినవాడు, అర్థం చేసుకున్నవాడు విశ్వనాథ. హాలాహలం ఎలాంటిదో తెలుసు, అమృతమేమిటో తెలుసు. ‘‘బాల్యంలో తల్లిని, యవ్వనంలో భార్యని, వృద్ధాప్యంలో కొడుకుని పోగొట్టుకున్నవాణ్ని. వేదనకి అర్థం నాకు తెలిసినంతగా మరెవరికి తెలుస్తుంది’’ అన్నారొక చోట. విన్నవారికి కనులు చెమర్చాయి. నూత్న యవ్వనంలో అంటే ఇరవై రెండేళ్ల వయసులో విశ్వనాథ రాసిన పద్యాలలోంచి - అతి సామాన్యమైన, సార్వజనీనమైన విషయాన్ని చెప్పి, కనిపించని దేవుణ్ని ప్రశ్నార్థకం చేశారు. ఇది ఎన్నిసార్లు చదివినా మనసు ఆర్ద్రమవుతుంది. ఒక దిగులు, ఒక అశక్తత ఆవరిస్తాయి. విశ్వనాథ సామాన్యుడు. ఆయన ఆలోచనలు అసామాన్యాలు. ఈ పద్యపాదాలు శరణాగతికి పరాకాష్ట. నా కనుల యెట్టయెదుటన నా జనకుని నా జనని కుత్తుకలను కోసి నన్నెడిగెన తండు ‘‘నే దయాంబుధిని కాదా’’ యటంచు ఓ ప్రభూ! యగునంటి నే నొదిగి యుండి నా కనుల యెట్టయెదుటన నా లతాంగి ప్రాణములు నిల్వునందీసి యడిగెనను న తండు ‘‘నే దయాంబుధిని కాదా’’ యటంచు ఓ ప్రభూ! యగునంటి నేనొదిగి యొదిగి తనుజు కుత్తుక నులిమి తానను నడిగెన తండు ‘‘నే దయాంబుధిని కాదా’’ యటంచు ఓ ప్రభూ! యగునంటి నేనొదిగి పోయి. ఉపమా విశ్వనాథస్య విశ్వనాథ ఉపమానాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇంతకుముందు ఎక్కడా మనకు కనిపించవు. తర్వాత కనిపించడం లేదు. కారణమేమంటే విశ్వనాథ చూపు వేరు. - ఆమె మంచముపై పరున్న గోధుమవన్నె త్రాచువలెనున్నది. - ఒంటినిండ మసి పూసికొనిన దొంగవలె సంజ చీకటి తొంగి చూచినది. - జొన్న చేనిలో మంచెయే గాని సౌధము. - ఆమె వదనము పావురాయి పొట్టవలె మృదువుగా తళతళలాడుచున్నది. - ఆమె కంకె విడిచి మురువు వొలుకు పంటచేను. - ఆ సువాసనల చేత దీపం ఆరిపోవునేమోనని భయపడితిని. - ఇంద్ర ధనుసు ముక్క పులి తోకలా ఆకాశంలో కనిపిస్తోంది. - శరదృతువులో కొంగలబారు ఎగురుతుంటే, ఆకాశమనే పాముల చిన్నదాని మెడలోని నత్తగుల్లల పేరులా వుంది. - గుమ్మడి పువ్వులో కులికే మంచు బిందువు, తట్టలో కూర్చుండబెట్టిన నవవధువులా తోచింది. - గుండెలపై బోర్లించి పెట్టిన పుస్తకము వలె పసివాడు పడుకున్నాడు. గడ్డం అచ్చిరాని విశ్వనాథ (డాక్టర్ భార్గవి తెలుగు చేసిన గీతాంజలి పుస్తక ఆవిష్కరణ వేళ - విశ్వనాథ పరంగా శ్రీరమణ చెప్పిన పేరడీ మాటలివి.) పసిబిడ్డ బాలాది యాతని చిత్తరువుని చూడగనే టాగూర్యని గుర్తింతురు. ఘనమైన గుబురు గడ్డము ఆయనకు దేశాంతర గుర్తింపు తెచ్చినది. పైగా రవీంద్రనాథుడు కవి కూడా యగుట గడ్డమునకు వన్నె పెరిగినది. గుర్తింపునకై యారాటపడుట మానవ నైజము. ఆరాటములనేక విధములు. బెల్లముకొండ సుబ్బరావని ఒకడున్నాడు. ఆతడు చక్కని గాత్రము గలవాడు. స్ఫురద్రూపి. కృష్ణ పాత్రను ధరించుటలో కొంత సాధన చేసి యున్నాడు. అప్పటికే కృష్ణ పాత్రలో పేరుగాంచినవారెందరో యున్నారు. అయినచో తనకెట్లు పేరు రావలెను? మీసములు పెంచినాడు. మీసాల కృష్ణునిగా వాసికెక్కినాడు. కృష్ణునికి మీసములుండెడివా, లుండనివాయని బెద్ద చర్చయే నడిచినది. అదియెల్ల మీసాల కృష్ణునికి బ్రాచుర్యము పెంచినవి. భావ కవులకేమి బెంచవలనో తెలియక జులపాలు పెంచుటకుద్యమించినారు. వారి కదియే నొక గుర్తింపు అయినది. ఇది యొక వైచిత్రి! నేను బందరులో నుండగా గడ్డము పెంచుటకు పూనుకొంటిని. దాని పర్యవసానమేమి? కొందరు సుస్తీ చేసినదా యనియు, మరికొందరు తిరుపతి మొక్కాయని, ఇంకొందరు చనువుగా మరల అక్కయ్యగారు నీళ్లోసుకున్నారా యనియు నడుగ నారంభించిరి. ఇది నాకు అచ్చిరాలేదని గ్రహించి, ఆదిలోనే యా జ్ఞాన వూడలను తొలగించుకుని తేటపడితిని. అయినచో, గీతాంజలికిది యనువాదము. ఎన్ని అనువాదములు రాలేదు కనుక. అయిననూ ఎవని ఘోష వానిది. గీతాంజలి కావ్యములో మనకు పలుచోట్ల జీవుడి వేదన కానుపించును. డాక్టర్ భార్గవికిని నాకును యొక బాదరాయణ సంబంధమున్నది. నాది కృష్ణామండలము, ఆమెది పామర్రు, నదియును కృష్ణామండలము. ఆమె డాక్టరు. నేను కాను. అయినచో నేమైనది. ఈమెది ప్రసూతి వైద్యము. గ్రంథ రచనల విషయముననేమో గాని వైద్యమున మాత్రము హస్తవాసి మంచిదని వినియుంటిని. పురుళ్ల ఆసుపత్రిలోనొక వైచిత్రి యున్నది. ఒక్కరు వచ్చి ఇద్దరు వెళ్లెదరు. మిగిలిన చోట్ల నట్లు కాదు. ఒక్కరు వచ్చి యొక్కరు వెళ్లుటే గగనము. ప్రతి తల్లి జాతిని మరో తరమునకు నడిపించును. పచ్చి బాలింతలో ఆ గర్వము యా ఆనందము తొణికిసలాడుచుండును. అయినచో ఆనాటి నడికట్లు లేవు. పథ్యములు లేవు. పోషణలు లేవు. కన్నబిడ్డకు పాలిచ్చుట తల్లికవమానము. ఇంతకూనిది తెలుగు అనువాదము. సమకాలికులు విశ్వనాథని ఒక మెట్టుపైనే కూచోపెట్టి గౌరవించారు. కొందరాయన మార్గాన్ని అనుసరించలేక, కొందరాయన అభిప్రాయాలతో ఏకీభవించలేక దూరంగా జరిగారు. అభిప్రాయాల గురించి మాట్లాడితే, ఆయనకు చిరాకు. ఒకసారి ప్రసిద్ధ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు, ‘‘వారికీ మాకూ అభిప్రాయ భేదాలున్నప్పటికీ...’’ అనేసరికి, వి॥స॥నా రెచ్చిపోయారు. ‘‘ఏడ్చి, సొంత అభిప్రాయాలున్నవారికి భేదాలు గాని, నీకూ నాకూ ఎందుకు? మీరు మార్క్స్‌ని భుజాన వేసుకుని, నేను శంకరాచార్యుని పట్టుకుని వేలాడుతున్నాం. మనకెందుకు అభిప్రాయ భేదాలు...’’ అని వాదన పూర్తిచేశారు. సినిమా లాంటి శక్తివంతమైన మాధ్యమాలతో సంబంధం లేకున్నా, తెలుగునాట ఆబాల వృద్ధులకు విశ్వనాథ పేరు యెరుకే. అంతగా తెలుగువారిని చదివించినవారు లేరు. అంతగా అర్థం కానివారూ లేరు. విశ్వనాథతో పోల్చదగినవారు విశ్వనాథ మాత్రమే! అందుకే ఒకడు విశ్వనాథ. కాదంటే ఒకే ఒక్కడు విశ్వనాథ. - శ్రీరమణ -
ఎగ‘తాళి’!
కామారెడ్డి: పెళ్లంటే మూడు ముళ్లు.. ఏడడుగులు.. రెండు మనస్సులు ఒక్కటై కలకాలం కలిసి బతికే అనుబంధం. అలాంటి పవిత్రబంధం కట్నదాహానికి, అనుమానపు పిశాచానికి బలవుతోంది. మద్యానికి బానిసై కొందరు, అదనపు కట్నం తెమ్మంటూ కొందరు, అనుమానాలు పెంచుకుని మరికొందరు... తమ బంధాన్ని ఎగతాలి చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కన్నవారిని వదిలి కట్టుకున్నోడే సర్వస్వం అని నమ్మిన పాపానికి భర్త చేతిలో హతమయ్యేవారు కొందరైతే, అత్తింటి ఆరళ్లను భరించలేక ఆత్మహత్యలకు పాల్పడేవారు కొందరు. ఇటీవలి కాలంలో జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచం మొత్తం మన దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తున్న నేటి రోజుల్లో కట్టుకున్న ఆలిని బలితీసుకుంటున్న ఘటనలు సమాజాన్ని ప్రశ్నిస్తున్నాయి. పెరిగిపోతున్న వేధింపులు, హత్యలు, ఆత్మహత్యల ఘటనలు ఒకవైపు, అత్యాచారాలు, చీత్కరింపులు, ఈవ్‌టీజింగ్, మోసాలు మరోవైపు మహిళల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట మహిళల హత్యలు, ఆత్మహత్యల సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని శేర్గల్లీలో నివసించే గద్దె హేమలత (33)ను ఆమె భర్త విజయ్‌రెడ్డి ఈ నెల 10 ఇంట్లోనే గొంతునులిమి హత్య చేశాడు. ఆత్మహత్యగా కథ అల్లే ప్రయత్నం చేయగా మృతురాలి తల్లి ఫిర్యాదుతో నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లిలో ఆకిటి లత ఉరఫ్ సువర్ణ(34)ను ఆమె భర్త లింగారెడ్డి ఈ నెల 17న చీరతో గొంతుకు భిగించి హతమార్చాడు. ఇద్దరిమధ్య ఏర్పడ్డ విభేదాలతో భార్యను హత్యచేశాడు. భర్తపై హత్యానేరం కేసు నమోదైంది. నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ఈ నెల 7న డబ్బుల కోసం భార్యను తన స్నేహితులకు అప్పగించి కాటేయమన్న ప్రబుద్ధున్ని, ఆ కామాంధుల్ని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కామాంధుల బారినుంచి తప్పించుకున్న మహిళ జరిగిన ఘటనను చెప్పడంతో గ్రామస్తులు వారిని పట్టుకుని చితకబాదారు. నందిపేట మండలం తల్వేదలో ఈ నెల 18న బరికె సుమలత(24) అనే వివాహిత భర్తతో గొడవ జరిగి ఉరివేసుకుని చనిపోయింది. ఆమె పిల్లలు అనాథలయ్యారు. గాంధారి మండలం గండివేటకు చెందిన కల్పన (22) ఈ నెల 16న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. ఈ యేడాది ఫిబ్రవరిలో కల్పన వివాహం జరిగింది. ఆషాడ మాసం అని తల్లిగారింటికి వచ్చిన కల్పన ఆత్మహత్యకు పాల్పడింది. భీంగల్ మండలం రహత్‌నగర్‌లో సునీత(23) అనే మహిళ తన కూతురుకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. బతకలేక...బతికించుకోలేక... భర్తను భరించలేని కొందరు మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతుండ గా, మరికొందరు తమ పిల్లలను కూడా బలితీసుకుంటున్నారు. సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేయకుండానే చావును వెతుక్కుంటుండడంతో వారి జీవితాలు అర్ధంతరంగా ముగుస్తున్నాయి. భర్త అనుమానాలను భరించలేని కొందరు తమ పిల్లలను బలిచేస్తున్నారు. కారణం ఏదైనా ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 20న దోమకొండ మండలం అంబారీపేట గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను నీటిలో ముంచి హతమార్చింది. తనను అవమానిం చడం వల్లే భరించలేక ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు పేర్కొంది. పిల్లలను చంపిన ఆ తల్లిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. ఈ నెల 20న డిచ్పల్లి మండలం వెస్లీనగర్లో ఓ మహిళ తన కూతురుకు విషమిచ్చి తానూ తాగింది. ఈ ఘటనలో కూతురు మృతిచెందగా తల్లి చావుబతుకుల మధ్యన ఉంది. -
న్యాయ వ్యవస్థకు మనమే ఆదర్శం
సాక్షి, బెంగళూరు : మానవ హక్కుల సంబంధించిన కేసులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు సంబంధించిన వ్యాజ్యాల విషయంలో భారత న్యాయ వ్యవస్థ ఇస్తున్న తీర్పులు ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి హెచ్.ఎన్ నాగమోహన్ దాస్ పేర్కొన్నారు. అలియన్స్ యూనివర్శిటీ న్యాయ విభాగంలో ఆదివారం జరిగిన ఫ్రెషర్స్ పార్టీకి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... కొన్ని కేసులను వాదించే విషయంలో, తీర్పు సమయంలో సాక్ష్యాధారాల ఆధారంగానే కాకుండా మనసుతో కూడా ఆలోచించాలన్నారు. దీని వల్ల సామన్య ప్రజలకు న్యాయవ్యవస్థపై గౌరవం పెరుగుతుందన్నారు. న్యాయ విద్యను అభ్యసించే వారు పుస్తక పరిజ్ఞానంతో పాటు సమాజంలో జరుగుతున్న వివిధ విషయాలను సూక్ష్మదృష్టితో పరిశీలించాలన్నారు. అప్పుడు మాత్రమే ఉత్తమ న్యాయనిపుణులుగా పేరు తెచ్చుకోవడానికి సాధ్యమవుతుందని సూచించారు. ప్రస్తుతం బహుళ జాతీయ కంపెనీలు ఉత్తమ నైపుణ్యాలు కలిగిన న్యాయ విద్యార్థులకు లక్షల్లో వేతనాలు ఇచ్చి ఉద్యోగులుగా తీసుకోవడానికి ముందుకు వస్తున్నాయన్నారు. గతంతో పోలిస్తే మూడు నాలుగేళ్లుగా న్యాయ విద్యను అభ్యసిస్తున్న వారికి మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, వీటిని అందుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాగమోహన్ దాస్ విద్యార్థులకు సూచించారు. -
దశాబ్ది సంబురం
నేడు తెలంగాణ విద్యావంతుల వేదిక * జిల్లాకేంద్రంలో ఏర్పాట్లు పూర్తి * తెలంగాణ ఉద్యమానికి * ప్రాణవాయువు అయిన వేదిక నల్లగొండ కల్చరల్ : తెలంగాణ సాంస్కృతిక వైభవం, సంప్రదాయాలు, పండగలు, యాస వెక్కింరితకు గురై శిథిలావస్థకు చేరుకుంటున్న దశలో.. తెలంగాణ సంస్కృతిని కాపాడాలని, తద్వారా ఉద్యమానికి ఆక్సిజన్ అందించాలంటూ జయశంకర్‌సార్ మదిలో మెదిలిన ఆలోచనకు ప్రతి రూపమే తెలంగాణ విద్యావంతుల వేదిక. వేదిక ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపనుంది. ఈ మేరకు జిల్లాకేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉద్యమ భావాజాలాన్ని ప్రజల్లోకి.. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించాలని కేసీఆర్ లాంటి వాళ్లు పార్టీని స్థాపించి సీమాంధ్రుల పాలనపై, దోపిడీపై యుద్ధం మొదలుపెట్టారు. కొంతకాలం గడిచిన తర్వాత ఉద్యమ భావజాలాన్ని ప్రజల దాకా వెళ్లాలంటే ఒక వేదిక అవసరమని భావించి తెలంగాణ విద్యావంతుల వేదిక పురుడు పోసుకుంది. అప్పటినుంచి ఈ వేదిక.. తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి ఎలా విస్మరించబడిందో అందరికీ తెలిపేలా చర్చలు నిర్వహించి తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్యపరిచింది. సీమాంధ్ర రాజకీయ నాయకుల అర్థం లేని విమర్శలను తిప్పికొడుతూ ఉద్యమ చైతన్య రథానికి బంగారు బాటలు వేసింది. ఉద్యమ సంస్థగా.. ప్రస్థానంలో విద్యావంతుల వేదిక ఉద్యమ సంస్థగా రూపాంతరం చెంది తెలంగాణ జేఏసీలో కీలకపక్షంగా వ్యవహరించింది. విద్యార్థులను, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, వృత్తి, వ్యాపార, ప్రజా సంఘాలను సమన్వయపరిచి తెలంగాణ సాధన దిశలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. సీమాంధ్ర పాలకులు పెట్టిన ఎన్నో అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్లను ఎదుర్కొంటూ ఆత్మస్థైర్యంతో ముం దుకు నడిచింది. నల్లగొండ జిల్లాలో 2004 నవంబర్‌లో జిల్లా శాఖగా, కోదాడ వేదికగా కొంతమంది సభ్యులతో ఏర్పడింది. ఈ శాఖ ద్వారా జిల్లాలోని ప్రజలను చైతన్యపరిచేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. సెమినార్లు నిర్వహించడం, కరపత్రాలు ప్రచురించి ఉద్యమ భావజాలవ్యాప్తికి విశేషంగా కృషి చేసింది. పాట ఉద్యమానికి ప్రాణం అని తెలుసుకునిధూం...ధాం... నిర్వహణల ద్వారా ఉద్యమ లక్ష్యాలను, సీమాంధ్రుల ఆగడాలను, దోపిడీని ప్రజలకు కళ్లకు కట్టడంలో తనవంతు పాత్ర పోషించింది. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారానే రాష్ట్రం సాధించుకోవాలని లక్ష్యంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోరాటాన్ని నడిపింది. అనుకున్నట్లుగానే శుభం కార్డు పడింది. తెలంగాణ రాష్ట్రం అవతరించింది. దశాబ్ద కాలంగా జరిగిన పోరాటాల చరిత్రను నెమరువేసుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోటానికే ఈ దశాబ్ద ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవన్లో ఉదయం 10 గంటలకు ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొననున్నారు. -
ప్ర‘వరుడు కావలెను’
జెంటిల్మన్ పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా... పెళ్లాం ఎంత అందంగా ఉన్నా సరే, మరో పడతిని పక్కచూపులు చూడటం చాలామందికి అలవాటు. అలాంటిది... కట్టుకున్న భార్య సాదాసీదాగా ఉండి... ఎదురుగా ఎంత ముద్దుగుమ్మ ఉన్నా కనీసం కళ్లు తిప్పట్లేదంటే... అతడు భార్యావిధేయుడన్నా అయి ఉండాలి, లేదా అపర ప్రవరాఖ్యుడన్నా అయి ఉండాలి. అన్నట్లు ప్రవరాఖ్యుడంటే ఎవరో కాదు, ప్రబంధనాయకుడు. అల్లసాని వారు అతడి గురించి ఏకంగా ఓ కావ్యాన్నే రచించారు. ఇంతకీ ఎవరీ ప్రవరుడు, ఏమిటతని గొప్పదనం అంటారా..! అతనిది అరుణాస్పదమనే ఊరు. డబ్బూ దస్కం... పాడీపంటా, ఇల్లూ వాకిలీ ఆచారమూ సంప్రదాయమూ, నిష్ఠా నియమమూ ఉన్నవాడు. వేదవిద్యాసంపన్నుడు. తాను నేర్చిన వేదపాఠాలను పదిమందికీ చెప్పే సుశిక్షితుడైన గురువు. నిరంతరం మాతాపితరుల సేవలో తరించేవాడు, నిత్యాగ్నిహోత్రుడు. అతిథికి అన్నం పెట్టనిదే పచ్చిగంగ కూడా ముట్టని ఆదర్శ గృహస్థు. అన్నింటికీ మించి చక్కదనాల చుక్క అయిన సోమిదమ్మకు ముద్దుల మగడు. అటువంటి ప్రవరుడు ఒక సిద్ధుడిచ్చిన పాదలేపనం సాయంతో హిమాలయాలకు వెళ్లాడు. అయితే ఆ లేపనం కరిగిపోవడంతో తిరిగి రాలేక దారికోసం వెతుకుతుండగా... ఓ అతిలోక సౌందర్యరాశి అతణ్ణి చూసి మనసు పారేసుకుంది. ఆ కాంత ఎవరో కాదు, వరూధిని అనే అప్సరస. ఆమె అందచందాలను అల్లసాని వారు ఎలా వర్ణించారంటే... మెరుపు తీగలాంటి ఒళ్లు, కలువల్లాంటి కళ్లు, నల్లద్రాక్ష గుత్తుల వంటి కనుగుడ్లు, తుమ్మెదలాంటి నల్లని జుట్టు, చంద్రబింబం లాంటి ముఖం, పగడాల్లాంటి పెదవులు, లోతైన నాభి. హంసలాంటి నడక. గరుడ పచ్చల భవనంలో... చంద్రకాంత మణులు పొదిగిన పీటపై కూర్చొని తామరతూళ్లలాంటి అందమైన వేళ్లతో వీణ తీగలను మీటుతూ... పాట పాడుతూ వుంటే పడి పోని వారుండరు. అంతటి అందాల భామ ప్రవరుణ్ణి చూసి... ‘ఆహా ఈ అందగాని కళ్లు కమలాలే! ఛాతీ మన్మధుని సింహాసనంలా ఉంది. పాదాలు ఎర్రని ముఖమల్ తివాచీని ధిక్కరిస్తున్నాయ్. సూర్యుణ్ని సానబట్టి పొడి తీసి ఆ బంగారు అడుసులో ఈ రజను కలిపి, దానిపై కాస్తంత అమృతాన్ని చిలకరించి మరీ ఆ బ్రహ్మ ఇతణ్ణి సృష్టించాడా అన్నంత అందంగా ఉన్నాడే... ఇతణ్ణి చూస్తూంటే నా మనసు, శరీరం వశం తప్పుతున్నాయే, మన్మధ తాపం నా మనస్సును వివశం చేసేస్తోంది... అసలింతటి సౌందర్యవంతుణ్ని నేను ఇన్నాళ్లూ చూడకుండా ఎలా ఉన్నానో...’ అని వాపోయిందట. అలా వాపోయి ఊరుకోలేదు. అతణ్ణి అనేక విధాలుగా కవ్వించింది. ఎంతో పుణ్యం చేస్తే తప్ప అందని స్వర ్గసుఖాలను ఇప్పుడే అందిస్తా రమ్మని రెచ్చగొట్టింది. చలించకపోయేసరికి తానుగా వచ్చి బిగి కౌగిట బంధింప జూసింది. అయినా అతను కేశమెత్త్తు కూడా కదల్లేదు. అపురూప లావణ్యవతి.. అమూల్యమైన మణిమాణిక్యాలకూ, అంతులేనంత సంపదకూ సామ్రాజ్ఞి అయిన వరూధిని క్రీగంటి చూపులకే కలల్లో తేలిపోయేవారున్నారుగానీ, తానుగా కోరి వచ్చినా కళ్లు తిప్పని నిష్ఠాగరిష్ఠుడు మన నాయకుడు. కళ్లు మిరుమిట్లు కొలిపే అందం రారమ్మంటూ కవ్విస్త్తుంటే... ‘‘అయ్యో! సాయం సంధ్య వార్చే సమయం మించిపోతున్నదే, శిష్యులకు వేదశిక్షణ ఇచ్చే వేళ మీరుతున్నదే! నా తలిదండ్రులు నాకోసం తల్లడిల్లుతుంటారే, నా ఇల్లాలు నా గురించి వెదుకుతుంటుందే’’ అని ఆలోచించాడంటే... అతనిలాంటి అందగాడు, యోగ్యుడు, గుణవంతుడు అయిన వరుడి కోసం అమ్మాయిలు వెయ్యి లెన్సులు పెట్టుకుని వెతికినా తప్పు లేదు కదా! ఈలోగా ప్ర‘వరుడు’ కావలెను అని ఓ ప్రకటన ఇచ్చేస్తే పోలా!? - డి.వి.ఆర్. -
జాతీయ చేనేత ప్రదర్శన అదుర్స్
- ఆర్కాట్రోడ్డులో ప్రారంభమైన ఎక్స్పో - జూన్ 15 వరకు కొనసాగనున్న ప్రదర్శన కొరుక్కుపేట, న్యూస్‌లైన్:భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే చేనేత, హస్తకళా వస్తువులు దశాబ్దాల నుంచి ఆదరణ పొందుతూనే ఉన్నాయి. హస్తకళలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న కళాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వంతోపాటు, పలు సంఘాలు కృషి చేస్తున్నాయి. భారత దేశానికే వన్నె తెచ్చిన చేనేత, హస్తకళలు మరింతగా బతికించుకునేందుకు పుష్పాంజలి ఖాదీ గ్రామోద్యోగ్ సంస్థాన్ ప్రత్యేకంగా కృషి చేస్తూ చేనేత హస్తకళా ఉత్పత్తులతో ప్రదర్శనలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా చెన్నై, సాలిగ్రామం, భరణీ హాస్పిటల్ సమీపంలోని ఆర్కాట్ రోడ్డులో జాతీయ చేనేత ఎక్స్పోను గురువారం నుంచి ప్రారంభించింది. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, హస్త కళాకారులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేలా ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రదర్శనలోని వస్తువులు, హస్తకళాఖండాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బీహార్‌కు చెందిన మధుబానీ రింట్ శారీలు, జైపూర్‌కు చెందిన తుషార్ సిల్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాంతా సిల్క్ శారీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మధ్య ప్రదేశ్‌కు చెందిన కాశ్మీర్ ప్లోరల్ ఎంబ్రాయిడరీ డ్రెస్ మెటీరియల్స్, ప్యూర్ సాఫ్ట్ కాటన్ బందిని శారీలు, బెంగాళ్ కాటన్ శారీలు, మదురై కాటన్ చీరలు మగువలకు కనువిందు చేస్తున్నాయి. అదేవిధంగా హస్తకళా ప్రియులను లెట్ ఉడ్‌తో, రోజ్ ఉడ్‌తో చేసిన బొమ్మలు, ఆర్ట్ జ్యువలరీ, చిన్నారుల ఆట బొమ్మలు అలరిస్తున్నాయి. జూన్ 15వ తేదీ వరకు కొనసాగనున్న ప్రదర్శన ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. -
నింగే హద్దుగా.. తెలంగాణ పండగ
సాక్షి, నల్లగొండ, నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్ష, 60 ఏళ్ల పోరాటం ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం వచ్చే నెల 2వ తేదీన మనుగడలోకి రానుంది. ఈ శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి కనీవిని ఎరుగని రీతిలో అధికారికంగా స్వాగతం పలికేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. మొత్తం ఆరు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రాథమిక ప్రణాళిక రూపొందించింది. 1947లో దేశ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు పీల్చినప్పుడు కలిగినంత ఆనందం కంటే రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణ అవతరణ ఉత్సవాలను జరపాలని కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. రెండు మూడు తరాలపాటు సంబరాలు గుర్తిండిపోయేలా ఉత్సవాలు నిర్వహించాలన్న కృత నిశ్చయంతో అధికారులు అడుగులు వేస్తున్నారు. ఉత్సవాల తోరణం.. ‘నీలగిరి తెలంగాణ అవతరణ ఉత్సవాలు’ పేరిట ఈనెల 28 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు కార్యక్రమా లు చేపట్టాలని ప్రణాళిక తయారు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కట్టు, బొట్టుకు అద్దం పట్టే లా ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. సామన్యుడి నుంచి జిల్లా ఉన్నతాధికారి వరకు ఈ ఉత్సవాల్లో పాలుపంచుకునేలా కార్యక్రమాలను రూపకల్పన చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానం ఇందుకు వేదిక కానుంది. ఈ క్రమంలో కళాశాల మైదానాన్ని సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దనున్నారు. ఉత్సవాల కోసం ఇప్పటికే 14 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ఒకరు నుంచి నలుగురు వరకు అన్ని శాఖల జిల్లా అధికారులు ఉంటారు. ఒక్కో కమిటీకి ఒక్కో బాధ్యత అప్పగించారు. నిర్వహణ, ఆహ్వాన, ఆర్థిక, క్రీడలు, సాంస్కృతిక, ప్రచార కమిటీలు ఏర్పాటయ్యాయి. కార్యక్రమాలు ఇలా.. ఈనెల 28న మండలస్థాయిలో పురుషులు, మహిళలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ముగ్గులు, బతుకమ్మ పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు 29న డివిజన్‌స్థాయి పోటీలు నిర్వహిస్తారు. 30వ తేదీన జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తారు. 31వ తేదీన ఉదయం జిల్లా చరిత్ర సంస్కృతి-సాహిత్యంపై కవి సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం జిల్లాలోని జానపద కళారూపాలను క్రోడీకరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వచ్చేనెల ఒకటో తేదీ రాత్రి ఏడు నుంచి 10 గం టల వరకు కార్నివాల్ (తిరునాలు) నిర్వహిస్తా రు. ఎన్జీ కళాశాల మైదానం నుంచి మొదలుకొని క్లాక్‌టవర్ వరకు రోడు పక్కన తిరునాలు నిర్వహించాలని యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకోసం అక్కడక్కడ ఆరు ప్రధాన వేదికలు ఏర్పా టు చేసి సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. అంతేగాక తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్, ఖవ్వాలి వంటి కార్యక్రమాలు చేపడతారు.అదేరోజురాత్రి 10.30 నుంచి 12 గంటలకు వరకు సెలబ్రిటీని ఆహ్వానించి ఆర్కెస్ట్రా నిర్విహ స్తారు. అనంతరం ‘ఫైర్ వర్క్స్’ కార్యక్రమం పేరిట టపాసులు కాల్చి తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం పలుకుతారు. వ తేదీన ఉదయం ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్, పట్టణ ప్రాంతాల్లో ర్యాలీలు చేపడతారు. -
కలంకారి ఇంపుగా.. హాయిగా..
సౌకర్యం, సంప్రదాయాలను అనుసరించి కాలానుగుణంగా వేషధారణల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటికే మళ్ళీ చిన్న చిన్న మార్పులను జోడించి, ట్రెండ్ సృష్టించడమే ఫ్యాషన్. వేసవిలో చెమటను పీల్చుకునే దుస్తులను, లేత రంగులను ఇష్టపడతారు. ఆ విధంగా కాటన్ క్లాత్‌కు, ‘కలంకారి’ డిజైన్లకు చరిత్ర ఎంతో ఉంది. ఈ రెండింటినీ జోడించి కొత్త కొత్త దుస్తులను సృష్టిస్తే... ఈ వేసవి కూల్‌గానే కాదు మరింత ‘కళ’ గానూ మారిపోతుంది. నూలు వస్త్రంపై సహజసిద్ధమైన రంగులతో చేసిన డిజైన్లు కాబట్టి ‘కలంకారి’ దుస్తులు కంటికి ఇంపుగా, ఒంటికి మెత్తగా, మనసుకు హాయిగా అనిపిస్తాయి. వీటిలో ‘పెన్ కలంకారి’ డిజైన్లు ఖరీదు ఎక్కువ. ప్రింటెడ్ ‘కలంకారి’ వస్త్రాలు ఖరీదు తక్కువే! కాబట్టి స్తోమతను బట్టి, సౌకర్యాన్ని బట్టి కలంకారికి ఆధునిక సొబగులను ఎన్నైనా అద్దవచ్చు. వేసవి ఫ్యాబ్రిక్స్‌తో... వేసవిలో సింథటిక్ దుస్తులు చర్మంపై ర్యాష్‌కు కారణం అవుతాయి. అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అందుకని వేసవికి అనుకూలమైన నూలు, నార, లినెన్, రేయాన్, కోటా, మల్మల్, శాటిన్, కోరా ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవచ్చు. వీటికి ‘కలంకారి’ ఫ్యాబ్రిక్‌ను జోడిస్తే వినూత్నమైన దుస్తులు వేషధారణలో ‘కళ’తీసుకువస్తాయి. టాప్ టు బాటమ్... తలపైన కలంకారి టోపీ, అదే కాంబినేషన్లో కలంకారి వెయిస్ట్‌కోట్, ముదురు ఆకుపచ్చ లెహంగాకు చేసిన కలంకారి ప్యాచ్ వర్క్, హ్యాండ్ బ్యాగ్.. ఎండలో చార్మ్‌గా వెలిగిపోవడానికి మంచి ఎంపిక కలంకారి. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళ కలంకారి. ఎన్ని రకాలుగా ఉపయోగించినా బోర్ అనిపించని కలంకారి ఫ్యాబ్రిక్‌తో లెక్కలేనన్ని డిజైన్లు తీసుకురావచ్చు. సహజంగా ‘కలంకారి’ని బెడ్‌షీట్స్, దిండుగలేబులుగా వాడుతుంటారు. నేను దీంట్లో ఒక ట్రెండ్‌ను సృష్టించి, స్టైలిష్ ఫ్యాబ్రిక్‌గా పరిచయం చేయాలనుకున్నాను. ఆ విధంగానే జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపైన ఆధునిక దుస్తుల్లో కలంకారి డిజైన్లను మెరిపించాను. నేను ఎక్కువగా ఆకుపచ్చ, నీలం, ఎరుపు, నలుపు, ఆలివ్.. రంగుల కలంకారి ఫ్యాబ్రిక్‌ను ఉపయోగిస్తాను. దాంట్లో టాప్స్ పై వేసుకొని జాకెట్స్, బాటమ్‌గా చురీ ప్యాంట్స్, పొడవైన కుర్తాలు.. ఇలా చాలా రకాలుగా సృష్టించాను. చీరలు, లెహంగాలు, కుర్తాలు, జంప్‌సూట్స్...ఇలా ఎన్నో రకాల ప్రయోగాలు చేశాను. చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ముంబయ్, ఢిల్లీ, ప్యారిస్ నుంచి కూడా నాకు కలంకారి దుస్తులకు ఆర్డర్లు వస్తుంటాయి. ఇది రీ సైకిల్ ఫ్యాబ్రిక్. కాస్త ఎంబ్రాయిడరీ టచ్ ఇచ్చామంటే మరింత వెలిగిపోతుంది. వేసవిలో కలంకారి రంగులు, ప్రింట్లు కూల్ ఫీలింగ్‌ను ఇస్తాయి. - అస్మితా మార్వా, ఫ్యాషన్ డిజైనర్ ఖర్చు తక్కువ... ‘అచ్చు కలంకారి’ ఖరీదు తక్కువే! ప్రింటెడ్ కలంకారి ఫ్యాబ్రిక్ మీటర్ ధర రూ.100 నుంచి లభిస్తుంది. అదే పెన్ కలంకారి అయితే డిజైన్ బట్టి ధర వేల రూపాయల్లో ఉంటుంది. వెరైటీ డిజైన్లు... పొడవు పొట్టి లెహంగాలు, వెయిస్ట్ కోట్లు, జాకెట్లు, కుర్తాలు, హారమ్ ప్యాంట్స్, ఫ్రాక్‌లు.. ‘కలంకారి’తో వీటిలో ఎన్నో ప్రత్యేకతలను చూపించవచ్చు. యాక్ససరీస్.. పర్సులు, బ్యాగులు, పాదరక్షలు, టోపీలు, చెవి ఆభరణాలు.. కలంకారి డిజైన్లతో కనువిందు చేస్తుంటే వాటిని అలంకరణలో భాగం చేసుకొని మరింత ప్రత్యేకంగా వెలిగిపోవచ్చు. -
ఉగాది ఉషస్సు
-
సంప్రదాయానికి దర్పణం ‘స్త్రీ’
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణాలుగా భారతీయ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్న శాంతమూర్తు లు మహిళలని డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి అన్నారు. అభినయ ఆర్ట్స్ హ నుమ అవార్డ్స్ నాటక పోటీలలో భా గంగా శనివారం మహతిలో మహిళా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె చీరకట్టు, నుదుట బొట్టు, కాలిమెట్టు అనే అంశంపై ప్రసంగించారు. ప్రపంచ దేశాలల్లో భారతీయ స్త్రీ మూర్తికి ప్రత్యేక స్థానం ఉందంటే అం దుకు సంస్కృతి, సంప్రదాయాలే కారణమని తెలిపారు. ఎక్కడ స్త్రీ గౌరవిస్తారో అక్కడ సుభిక్షత ఉంటుందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో భారతీయ సంస్కృతి దారితప్పుతోం దని చెప్పారు. పుట్టుకతో బిడ్డగా, వివాహ బంధంతో భార్యగా, ప్రసవంతో తల్లిగా, వృద్ధాప్యంలో అందరికి పెద్ద దిక్కుగా అనేక బాధ్యతలను మోస్తూ స్త్రీ కుటుంబాన్ని సంరక్షిస్తుం దని తెలిపారు. గౌరవ అతిథులు డా క్టర్ అశాలత, విశ్వం విద్యాసంస్థల కరస్పాండెంట్ నగరిమడుగు తులసి మాట్లాడుతూ ఆప్యాయత, అనురాగానికి స్త్రీ నిదర్శనమన్నారు. స్త్రీని గౌరవించే సమాజం మనదని తెలిపారు. పేదల విద్యార్థులకు ఆర్థిక సాయం మహిళా వేదికలో భాగంగా సేవా దృక్పథంతో ఇద్దరు పేద విద్యార్థులకు రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేజింగ్ డెరైక్టర్ ఆర్థికసాయం ప్రకటించారు. పేద విద్యార్థులు కె.వందన, మునిజ్యోతిని దత్త కు తీసుకొని, వారి ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును తాను అందిస్తానని ప్రకటించి తన సేవా తత్పరతను చాటుకున్నారు. అక్షయ క్ష్రేత్ర నిర్వాహకులకు అభినందన పురస్కారాలు అనుభవించడానికి ఆస్తులు, జీవి తాన్ని గడిపే సంపద ఉండి ఆదరణ కోల్పోయిన మానసిక వికలాంగుల ను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న అక్షయ క్షేత్ర నిర్వాహకులు ఎం.రామస్వామి, ఎం.వరలక్ష్మికి అభినయ ఆర్ట్స్ నిర్వాహకులు పురస్కారాలతో అభినందించారు. వారికి సంస్థ ద్వా రా పితృ దేవోభవ, మాతృదేవోభవ పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, బ్లిస్, మిక్రమ్ హోటల్స్ డెరైక్టర్ మబ్బురాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భం గా అక్షయ క్షేత్రం విద్యార్థుల నృ త్యాలు అబ్బుర పరిచాయి. -
కజన్ పర్యాటక విశేషాల ఖజానా!
విహారం ఒకే నగరం అనేక విశేషాలు... రెండు పెద్ద నదుల సంగమం, అనుకూలమైన వాతావరణం, అత్యాధునిక రవాణా సదుపాయం, ప్రపంచ స్థాయి క్రీడా మైదానాలు, అద్భుతమైన చారిత్రక సంపద, మోడ్రన్ లైఫ్ స్టైల్, సంప్రదాయాలు, నమ్మకాలు... మత ఘర్షణల రహితం.. ఇన్ని భిన్న విశేషాలకు ఒకే నగరం కేంద్రం కావడం చాలా అరుదైన విషయం. 2015లో ఆక్వాటిక్స్ ఛాంపియన్ షిప్, 2018లో ఫిఫా వరల్డ్ కప్ పోటీలు ఇక్కడ జరగనున్నాయి. 2013లో ఇక్కడ వరల్డ్ యూనివర్సియాడ్ జరిగింది. దీంతో ఇపుడు రష్యా క్రీడా రాజధాని అని కూడా పిలుస్తున్నారు. ఒక మనిషిలో ఎన్నో భావోద్వేగాలు. మరెన్నో సృ్మతులు.. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు.. ఉంటే ఆ మనిషిది పరిపూర్ణ జీవితం.ఒక నగరానికి ఎంతో చరిత్ర, మరెంతో ఖ్యాతి... అంతకుమించిన సంస్కృతి, సదుపాయాలు ఉంటే ఆ నగరానిది పరిపూర్ణత్వం. ఈ కోణంలో చూస్తే రష్యాలో కజన్ నగరానికి ఓ పరిపూర్ణత ఉంది. ఎందుకంటే దానికి చెప్పుకోదగిన చరిత్ర ఉంది. ఎంతో ఖ్యాతి ఉంది. అన్ని కోణాల్లో ఆకట్టుకుంటున్న ఆ నగరం విశిష్టతల సమాహారమిది. రష్యా.. అంటే గుర్తొచ్చే నగరాలు మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్... మరి అవేనా గొప్పవి అంటే బయటివారికి తెలిసినంత వరకు అవే గొప్పవి. కానీ వాటితో ఎందులోనూ తీసిపోని నగరం ‘కజన్’. ఇంకా చెప్పాలంటే వాటికి మించిన కొన్ని విభిన్నతలు కూడా ఇక్కడున్నాయి. దీన్ని ‘రష్యా మూడో రాజధాని’ అని అధికారికంగా పిలుస్తారు అంటే మీకు ఆ నగరం స్థాయేంటో సులువుగా అర్థమవుతుంది. నది ఒడ్డున జీవించడమే ఒక అదృష్టం. కజన్ ప్రజలకు ఆ లెక్కన అదృష్టం రెట్టింపుగా ఉందేమో. ఎందుకంటే అది కజంకా, వోల్గా అనే రెండు నదుల ఒడ్డున, అవి రెండూ కలిస సంగమం వద్ద ఉంది. నిజంగా ఎంత అద్భుతమైన దృశ్యమది. ఇలాంటి దృశ్యం చాలా తక్కువగా చూస్తాం. రష్యా ఉత్తర ధృవం వైపు ఉండటం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు కొంతకాలం మైనస్ డిగ్రీలకు కూడా పడిపోతాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ఏప్రిల్-అక్టోబరుల మధ్య సందర్శిస్తే బాగుంటుంది. నది నుంచి వచ్చే చల్లని గాలులకు సేదదీరుతూ నగరం హొయలను అలా చూస్తూ స్థానిక చిరుతిళ్లు తింటూ గడిపేయడం ఒక మంచి అనుభూతి. ఇక్కడ వినోదం కోసం ఏర్పాటుచేసిన బోటింగ్‌తో పాటు రష్యాలోని కొన్ని నగరాల నుంచి పడవ ప్రయాణం చేస్తూ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. రెండు నదులున్నా రవాణాకు ఇబ్బంది లేకుండా ఏవైపునకు ఆ వైపు కంజకా నది పై ఐదు బ్రిడ్జిలు నిర్మించారు. క్రీ.శ.1005లో ఏర్పడిన ఈ నగరానికి 2005లో మిలీనియం ఉత్సవాలు జరిపారు. ఉత్సవాలు జరపడం అంటే ఏమిటో వారిని చూసే నేర్చుకోవాలి. మిలీనియంను పురస్కరించుకుని నగరంలో ఏకంగా మిలీనియం బ్రిడ్జి కట్టారు. దానిపై ‘ఎం’ ఆంగ్ల అక్షరం ఆకారంలో పెద్ద పైలాన్ ఏర్పాటుచేశారు. నగరంలో అన్ని చారిత్రక, ప్రభుత్వ ఆస్తులన్నిటినీ రినోవేట్ చేశారు. మెట్రో ఏర్పాటు చేసుకున్నారు. వారధులు నిర్మించుకున్నారు... బహుశా మిలీనియం ఉత్సవాలు ఇంత సంపూర్ణంగా మరెవరూ నిర్వహించి ఉండరు. ఇవి స్థానిక అవసరాలను తీర్చేవిగానే కాకుండా పర్యాటకులకు ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇచ్చే సందర్శనీయ స్థలాలుగా వెలుగొందుతున్నాయి. పాత - కొత్తల కలయిక క్రెమ్లిన్ కజన్‌లోని క్రెమ్లిన్... టాటర్స్తాన్ రాష్ట్ర పాలన వేదిక. ఇది వెయ్యేళ్ల క్రితం నాటి భవనం. కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంతో అద్భతంగా ఉంది. వెయ్యేళ్ల క్రితం కట్టిన ఈ భవనాన్ని వందేళ్ల క్రితం పునరుద్దరిస్తే మిలీనియం ఉత్సవాల సందర్భంగా దాని స్వరూపం మారకుండానే ఆధునికీకరించారు. ఈ భవనంలోకి పర్యాటకులను అనుమతిస్తారు. ఇది అతిపెద్ద ఆవరణ. అందులో తిరుగుతూ అలనాటి నిర్మాణశైలిని గమనిస్తూ ఉంటే మధ్యయుగాల్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఆధునిక సదుపాయాలు అన్నీ కన్పిస్తూ ఉంటాయంతే. ఇదే ఆవరణలో ఓ పెద్ద మసీదు ఉంది. అది కూడా ఈ భవనం వయసులో ఉన్నదే. క్రెమ్లిన్ చారిత్రక గొప్పదనాన్ని గుర్తించి యునెస్కో దానిని ప్రపంచ వారసత్వపు సంపద జాబితాలో చేర్చింది. ఇది కంజకా నది పక్కన ఉండటం వల్ల ఇక్కడి నుంచి అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ రైల్వేస్టేషన్, ఆధ్మాత్మిక కేంద్రాలు, భవనాలు అన్నీ చారిత్రక సాక్ష్యాలుగా నిలవగా... తాజా నిర్మాణాలు, అభివృద్ధి నాగరికతకు సూచికలవుతున్నాయి. ఇటీవల నిర్మించిన ‘కజన్ స్మార్ట్ సిటీ’ ఒక డ్రీమ్ ప్లేస్. ఇది ఆర్థిక ఉపాధి కేంద్రం. నగరానికి చివరన నిర్మించిన ఈ స్మార్ట్ సిటీ పూర్తి ఆధునిక కేంద్రం. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఫైవ్ స్టార్ హోటళ్లు, గేమ్ సెంటర్లు, విజిటర్ ప్లేస్‌లు, అమ్యూజ్మెంట్లు పెద్ద ఎత్తున ఉంటాయి. ప్రతిదీ అబ్బరం అనిపిస్తుంది. ఇంత విశాలమైన కేంద్రం నగరంలో నిర్మిస్తే ఎన్నో చారిత్రక కేంద్రాలకు ముప్పు వాటిల్లుతుందన్న కారణంతో దీన్ని శివారున ఏర్పాటుచేశారు. అభిరుచులను బట్టి ఇక్కడ వినోదాన్ని పొందవచ్చు. గొప్ప సహజీవనం... కజన్ నగరంలో అనేక మతాల ప్రజలు ఉన్నా... ఎక్కువ మంది ముస్లింలు, క్రిస్టియన్లు. కానీ ఇక్కడ మతఘర్షణలు అత్యంత అరుదు. రెండు మతాల మధ్య శాంతి సహజీవనం అద్భుతంగా ఉంది. భిన్నసంప్రదాయాలకు నెలవు. ఇక్కడ ఉన్న మూడు ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా పర్యాటక ప్రదేశాలు కావడం మరో అరుదైన విషయం. రష్యాలోని అతిపెద్ద మసీదు ఖోల్షరీఫ్ ఇక్కడే ఉంది. దీనిని బయటి నుంచి చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో... లోపల నుంచి చూస్తే అంతకు రెట్టింపు మనోహరంగా లోపల డోమ్‌తో సహా ప్రతి గోడ అత్యద్భుతమైన కళాఖండాలతో అలరారుతుంటుంది. చరిత్ర అన్ని నగరాలకు ఉంటుంది. కానీ కజన్కు మాత్రం నిగనిగలాడుతూ ఉంటుంది. నగరంలోని క్యాథలిక్ చర్చి కూడా అత్యద్భుతమైన నిర్మాణతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఉష్ణోగ్రతలతో సంబంధం లేకుండా ఇది చల్లగా ఉంటుంది. అద్భతమైన ఆలోచన.. సర్వమత ఆధ్యాత్మిక కేంద్రం టెంపుల్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్... కజన్ కేరాఫ్ అడ్రెస్‌లలో ఒకటి. ఇది కజన్కు చెందిన ఓ ఆర్టిస్టు ఊహకు వాస్తవ రూపం. పద్దెనిమిది మతాల కేంద్రం. ఈ టెంపుల్లో 18 శిఖరాలకు 18 మతాల గుర్తులుంటాయి. ఇందులోకి అన్నిమతాల వారు వస్తారు. అన్ని మతాలకు చెందిన ఆధ్మాత్మిక చిహ్నాలుంటాయి. ఇది ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది. చేరుకోవడం చాలా సులువు కజన్ నగరానికి లేని రవాణా సదుపాయమంటూ లేదు. రష్యాలోని అన్ని నగరాల నుంచి ఇక్కడికి విమానాలున్నాయి. కజన్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ సర్వీసులు నడిచే విమానాశ్రయం. రష్యా రాజధాని మాస్కో నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లు. కానీ కేవలం పది గంటల్లో చేరుకోగలిగిన ఆధునిక రైలు రవాణా ఉంది. నిరంతరం విమానాలుంటాయి. బస్సు ద్వారా, బోటు ద్వారా కూడా చేరుకోవచ్చు. స్విస్ హోటల్ లాంటి నది ఒడ్డున వెలిసిన ఐదు నక్షత్రాల హోటల్స్‌తో పాటు అన్ని రకాల హోటల్స్ ఇక్కడ ఉన్నాయి. -
హరిలో రంగ హరి
హరిదాసు అంటే హరి భక్తుడని అర్థం. సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపమే తానుగా ధరించిన హరిదాసు ఆబాల గోపాలుని తన్మయులను చేస్తూ, ఆనందపరుస్తూ తిరుగుతుంటారు. హరిదాసు తలపై ఉన్న నామాలు కలిగిన అక్షయ పాత్ర తరగని సంపదలకు గుర్తుగా భావిస్తారు. త్రిలోక సంచారి అయిన విష్ణుమూర్తి భక్తుడైన నారదులవారే నేటి మన ఈ హరిదాసులుగా గ్రామాలలో ప్రజలు భావిస్తారు. వేకువ జామునుంచే వీధుల్లో శ్రీమద్రమారమణ గోవిందో హరి... హరిలో రంగ హరి... అంటూ వీరు ఆలపించే గీతాలు మన సంస్కృతిని వివరిస్తాయి. రైతుల లోగిళ్లు ధాన్యరాశులతో నిండాలని, రైతులు సుఖసంతోషాలతో వర్ధిలాలని, ఇలాగే ప్రతిఒక్కరూ దానధర్మాలు చేస్తూ చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. మహిళలు. పిల్లలు ఆనందంగా ఎవరికి తోచిన విధంగా వారు విష్ణుమూర్తి అవతారమైన హరిదాసుకు దానధర్మాలు చేస్తుంటారు. రానురాను తగ్గుతున్న ఆదరణ.. మండలంలో రాజుపాలెం గ్రామంలో సుమారు 60 కుటుంబాలకు చెందిన హరిదాసులు జీవనం సాగిస్తున్నారు. గతంలో వీరి కుటుంబాల్లో ఒకటి నుంచి ఐదుగురు చొప్పున సంక్రాంతి నెలలో తిరుగుతుంటారు. రానురాను హరిదాసులకు పల్లెల్లో ఆదరణ తగ్గిపోవడంతో నేడు ఒకరిద్దరే తిరుగుతున్నారు. అందులో గ్రామానికి చెందిన తొట్టెంపూడి నరసింహాదాసు హరిదాసు వేషంలో రోజు చుట్టు ప్రక్కల గ్రామ వీధుల్లో తిరుగుతూ, దేవుని గీతాలు ఆలపిస్తూ సందడి చేస్తారు. -
మూడిళ్ల పండగ
ఉండేవి ఉంటాయి. ఉంటూనే ఉంటాయి. అంతమాత్రాన... పండగలు లేకుండా పోతాయా? పలకరింపులు బంద్ అయిపోతాయా? రాకపోకలు తెగిపోతాయా? ఇచ్చిపుచ్చుకోవడం ఆగిపోతుందా? ఒకనాటి సంస్కృతా, ఒకనాటి సంప్రదాయమా? ఒకనాటి ఆత్మీయతలా, ఒకనాటి అనుబంధాలా? ప్రాంతాలు లెక్క కాదు... అంతరంగం ముఖ్యం. పరమాన్నాలు ఎన్నిరకాలని కాదు... తియ్యదన మే ప్రధానం. భక్ష్యాలు, బొబ్బట్లు, ఓలిగలు... వేర్వేరు కావచ్చు. అదే బెల్లం, అదే పంచదార, అదే పిండి... అందరం ఒక్కటే... నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు. కలిసి జరుపుకుందాం... కలిసి తీపిని పంచుకుందాం. శుభాకాంక్షలు తెలుపుకుందాం. పాలముంజలు కావలసినవి: శనగపప్పు - ముప్పావు కప్పు; బెల్లంతురుము - కప్పు; పచ్చికొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - పావు టీ స్పూను; బొంబాయిరవ్వ - ఒకటిన్నర కప్పులు; పాలు - మూడు కప్పులు; నూనె-డీప్ ఫ్రైకి సరిపడా తయారి: శనగపప్పును శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసి కుకర్‌లో ఉడికించాలి ఉడికిన తర్వాత నీరు ఎక్కువగా ఉంటే వడపోసి, పప్పు చల్లారాక, మిక్సీలో వేసి పొడిపొడిగా వచ్చేలా చేయాలి ఒక పాత్రలో బెల్లం తురుము, కొద్దిగా నీరు వేసి స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగి, మరిగేవరకు ఉంచాలి శనగపప్పు పొడి, కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసి కలపాలి మిశ్రమమంతా దగ్గర పడేవరకు ఉడికించి దించేయాలి చల్లారాక, ఉండల్లా చే సి పక్కన ఉంచాలి గిన్నెలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి బొంబాయిరవ్వ నెమ్మదిగా వేస్తూ, కలుపుతుండాలి మంట తగ్గించి, మిశ్రమం దగ్గర పడేవరకు రెండు నిముషాలు ఉడికించాలి చల్లారిన తరవాత మిశ్రమం బాగా మెత్తగా అయ్యేవరకు కలపాలి చేతికి నూనె లేదా నెయ్యి రాసుకుని, ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలు చే సుకోవాలి ఒక్కో ఉండను చేతిలోకి తీసుకుని పూరీ షేప్‌లోకి ప్రెస్ చేయాలి శనగపప్పు మిశ్రమాన్ని మధ్యలో ఉంచి అంచులను మూసేయాలి బాణలిలో నూనె వేసి కాగాక ఒక్కో ఉండను నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. కొబ్బరి సద్ది కావలసినవి: అన్నం - మూడు కప్పులు; కొబ్బరి ముక్కలు - కప్పు; పచ్చిమిర్చి - 3 (మధ్యకు కట్ చేయాలి); ఎండుమిర్చి - 3; పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు - పది పలుకులు; ఆవాలు - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; నూనె - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; నువ్వులపొడి - రెండు టేబుల్ స్పూన్లు. తయారి: కొబ్బరిముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచాలి బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి వేయించాలి జీడిపప్పు, పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు జత చేసి రెండు నిముషాలు వేయించాలి కొబ్బరిపేస్ట్ వేసి బాగా కలిపి, వేయించాలి అన్నం, ఉప్పు వేసి కలపాలి మంట తగ్గించి రెండు నిముషాలు ఉంచి దించేయాలి. కజ్జి కాయలు కావలసినవి: మైదా - 250 గ్రా; బొంబాయిరవ్వ - కప్పు; పంచదార - ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; ఎండుకొబ్బరి తురుము - అరకప్పు; ఏలకుల పొడి - అర టీ స్పూను; ఉప్పు - చిటికెడు; నెయ్యి - 2 టీ స్పూన్లు; నూనె - డీప్ ఫ్రైకి తగినంత తయారి: ఒక పాత్రలో బొంబాయిరవ్వ, ఎండుకొబ్బరి తురుము, ఏలకులపొడి, పంచదార వేసి కలిపి పక్కన ఉంచాలి వేరే పాత్రలో మైదా, నెయ్యి, ఉప్పు వేసి చపాతీపిండిలా కలిపి, పైన వస్త్రం వేసి, సుమారు గంటసేపు నాననివ్వాలి నానిన పిండిని చిన్నచిన్న ఉండలు చేసి, పూరీలా ఒత్తి కజ్జికాయ మౌల్డ్ మీద ఉంచాలి టేబుల్ స్పూను బొంబాయిరవ్వ మిశ్రమాన్ని ఇందులో ఉంచి మౌల్డ్‌ని మూసి, అంచులు తీసేయాలి బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న కజ్జికాయలను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. గుమ్మడి హల్వా కావలసినవి: తీపిగుమ్మడికాయ తురుము - 2 కప్పులు; పాలు - 2 కప్పులు; పంచదార - కప్పు; నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు; బాదంపప్పులు - 15; ఏలకులపొడి - అర టీ స్పూను తయారి: బాణలిలో నెయ్యి వేసి కరిగాక బాదంపప్పుల తరుగు వేసి వేయించి, తీసి పక్కన ఉంచాలి అదే బాణలిలో గుమ్మడికాయ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు సుమారు ఐదు నిముషాలు వేయించాలి రెండు కప్పుల పాలు పోసి బాగా కలిపి, పాలు ఇగిరిపోయేవరకు ఉడికించాలి పంచదార వేసి కలపాలి అన్నీ బాగా ఉడికిన తరవాత దించేయాలి ఏలకులపొడి, బాదంపప్పు ముక్కలు వేసి కలిపి సర్వ్ చేయాలి. పెరుగన్నం కావలసినవి: అన్నం - రెండు కప్పులు; ఉప్పు - కొద్దిగా; పెరుగు - రెండు కప్పులు; కొత్తిమీర - చిన్న కట్ట; దానిమ్మ గింజలు - పావుకప్పు; కిస్మిస్ ద్రాక్ష - రెండు టీస్పూన్లు; జీడిపప్పులు - టేబుల్ స్పూను; తయారి: ఒకపాత్రలో అన్నం, పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి దానిమ్మ గింజలు, కిస్మిస్ ద్రాక్ష వేసి కలపాలి కొత్తిమీర, జీడిపప్పులతో గార్నిష్ చేయాలి. మురుకులు కావలసినవి: బియ్యప్పిండి - 3 కప్పులు; వేయించిన శనగపిండి - కప్పు ; వాము - టీ స్పూను; కారం - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; నూనె - తగినంత తయారి: ఒక పాత్రలో బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, కారం, వాము వేసి కలపాలి ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు, రెండు టేబుల్స్పూన్ల నూనె వేసి మరిగించి, ఆ నీటిని పిండిలో వేసి కలపాలి అవసరమనుకుంటే కొద్దిగా చన్నీరు వేస్తూ పిండి మెత్తగా అయ్యేవరకు కలపాలి పిండిని కొద్దికొద్దిగా తీసుకుని, మురుకుల గొట్టంలో ఉంచి, ఒక ప్లేట్ లాంటి దాని మీద గుండ్రంగా మురుకు ఆకారం వచ్చేలా తిప్పుతుండాలి బాణలిలో నూనె పోసి కాగాక, వీటిని జాగ్రత్తగా నూనెలో వేసి, మంట తగ్గించి వేయించాలి బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేయాలి. పాల్ పోలీ కావలసినవి: మైదా - కప్పు; పాలు - అర లీటరు; కండెన్స్డ్ మిల్క్ - 3 టేబుల్ స్పూన్లు; నూనె - టీ స్పూను; నీరు - పావు కప్పు; నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా; పంచదార - 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు - చిటికెడు; బాదంపప్పులు - కొద్దిగా; కుంకుమపువ్వు - చిటికెడు; ఏలకులపొడి - పావు టీ స్పూను తయారి: ఒక పాత్రలో మైదా వేసి నీరు పోస్తూ పూరీ పిండిలా క లిపి, మూత పెట్టి గంటసేపు నాననివ్వాలి కడాయిలో పాలు మరిగించి, మంట తగ్గించి, కండెన్స్డ్ మిల్క్ పోయాలి చిన్న గ్లాసులో కొద్దిగా నీరు, కుంకుమపువ్వు వేసి బాగా కలిపి, మరుగుతున్న పాలలో వేయాలి పంచదార, ఏలకుల పొడి వేసి కలపాలి ఈ పాలను వెడల్పాటి పాత్రలో పోయాలి పిండిని చిన్నచిన్న ఉండలుగా తీసుకుని, పూరీల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి వేయించాలి పూరీలన్నీ తయారుచేసుకుని, పాలలో వేయాలి గంటసేపు నానినతర్వాత పూరీలను బయటకు తీసి, బాదంపప్పులతో గార్నిష్ చేసి, చల్లగా సర్వ్ చేయాలి. సజ్జ ముద్దలు కావలసినవి: సజ్జపిండి - 2 క ప్పులు; బెల్లంతురుము - కప్పు; నీరు - తగినంత; ఏలకులపొడి - చిటికెడు; డ్రైఫ్రూట్స్ - (బాదం, జీడిపప్పు, కిస్మిస్) - 2 టీ స్పూన్లు; నెయ్యి - 2 టే బుల్ స్పూన్లు తయారి: తగినన్ని నీరు మరిగించాలి ఒక గిన్నెలో సజ్జపిండి వేసి, వేడినీరు కొద్దికొద్దిగా పోస్తూ కలిపి ముద్ద చేయాలి కావలసిన పరిమాణంలో ముద్ద తీసుకొని, కొద్దికొద్దిగా నీరు చిలకరిస్తూ, రొట్టె చేసి, పెనం మీద వేసి రెండువైపులా కాల్చాలి వేడిగా ఉన్నప్పుడే సజ్జ రొట్టెలకు నీళ్లు అద్దుకుంటూ చేత్తో ముక్కలు ముక్కలు చేసి, రోట్లో వేసి దంచాలి స్టౌ మీద బాణలి ఉంచి అందులో నెయ్యి, బెల్లం, ఏలకులపొడి, సజ్జరొట్టె ముక్కల పొడి వేసి కొద్దిగా వేయించి దించాలి కావలసిన పరిమాణంలో ఈ పొడిని తీసుకొని బాదం, జీడిపప్పులు, కిస్మిస్లు అద్దుకుంటూ ముద్దలు చేయాలి. ఓలిగలు కావలసినవి: కందిపప్పు - కప్పు; బెల్లంతురుము - కప్పు; నీరు - 3 కప్పులు. పైన కవరింగ్ కోసం: మైదా - కప్పు; నువ్వుపప్పు - 2 టేబుల్‌స్పూన్లు; నూనె - అర కప్పు; నీరు - అరకప్పు; పసుపు - అర టేబుల్ స్పూను తయారి: ఒక పాత్రలో కందిపప్పు, తగినంత నీరు వేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి చల్లారాక అధికంగా ఉన్న నీరు తీసేసి, పప్పును మెత్తగా చిదిమి, బెల్లం తురుము జత చేసి స్టౌ మీద ఐదు నిముషాలు ఉంచి దించి చల్లారనివ్వాలి ఏలకులపొడి జత చేసి, ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి ఒక పాత్రలో మైదా, నీరు, పసుపు, నూనె వేసి చపాతీపిండిలా కలిపి మూడుగంటలసేపు నాననివ్వాలి ఈ పిండిని చిన్న ఉండలా తీసుకుని చేతితో ఒత్తి, పూర్ణం ముద్దను ఇందులో ఉంచి, అప్పడాల పీట మీద ఉంచి అప్పడాల కర్రతో నెమ్మదిగా ఒత్తాలి స్టౌ మీద పెనం ఉంచి, కొద్దిగా నూనె వేసి, తయారుచేసి ఉంచుకున్న ఓలిగను పెనం మీద వేసి చుట్టూ నూనె వేసి, రెండువైపులా నూనె వేసి కాలాక తీసేయాలి. సేకరణ డా.వైజయంతి పిండివంటలు రుచిగా ఉండాలంటే... బొంబాయిరవ్వ వేయించి వాడితే పిండివంటలు రుచిగా ఉంటాయి. ఎండుకొబ్బరి వాడితే స్వీట్లు ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి. మైదాపిండిని కలిపిన తరవాత చిన్నగిన్నెడు నూనె వేసి చేత్తో బాగా మర్దన చేసి, గిన్నె మీద తడి వస్త్రం కప్పి, గంటసేపు నాననిస్తే పిండివంటలు గుల్లగా వస్తాయి. గుమ్మడికాయ వంటి వాటిని స్వీట్లలో ఉపయోగించేటప్పుడు, వీటిలోని నీరు బాగా పిండేసి, నేతిలో దోరగా వేయించాలి. మిల్క్ స్వీట్లు తయారుచేసేటప్పుడు... పాల బదులు కండెన్స్డ్ మిల్క్ ఉపయోగిస్తే స్వీట్లు రుచిగా ఉంటాయి. ఏ పిండివంటలనైనా నూనెలో వేయించేటప్పుడు మంట తగ్గిస్తే, వంటకాలు మాడిపోకుండా, దోరగా వేగుతాయి. -
నేటి నుంచి ‘హైడరేట్’ వంద రోజుల పండుగ
రాంగోపాల్‌పేట్: హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ‘హైడరేటర్’పేరుతో వందరోజుల పండుగలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రామకృష్ణ, కెప్టెన్ ఆనంద్, మనోజ్ చంద్రశేఖర్‌లు బుధవారం విలేకరులకు తెలిపారు. స్వాంతత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం శిల్పకళావేదికలో ఈ కార్యాక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. గురువారం ఉదయం 7గంటలకు ఎబిలిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగ పిల్లలు వీల్‌చైర్స్‌తో చేసే సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. నగరంలోని ప్రముఖ వేదికల్లో ప్రతి శనివారం ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. శిల్పకళావేదిక, తాజ్ వివంతా, సికింద్రాబాద్ క్లబ్ ఒక్కో వీకెండ్ ఒక చోట నిర్వహిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జాషువా బ్యాండ్, రవిచారి క్రాసింగ్, పద్మశ్రీ శోభన నృత్యం, రోనూ ముజుందార్ సంగీత విభావరి, దశావతారం, మనోరంజన్ టాక్స్ ప్రీ హాస్య నాటిక వంటి విభిన్న సాంస్కృతి కార్యక్రమాల సమాహారమే ‘హైడరేట్’. దేశంలోని ప్రముఖల చిత్రకళా ప్రదర్శన మూడు వారాలపాటు ప్రసాద్ ఐ మ్యాక్స్‌లో నిర్వహిస్తారు. స్పాట్ పెయింటింగ్స్ ఉంటాయి.నవంబర్ 23వ తేదీన శివమణి ఆద్వర్యంలో సంగీత కార్యక్రమం ఉంటుంది.‘హైడరేట్’ కార్యక్రమాలు ఉచితంగా వీక్షించవచ్చు. టికెట్లను ఎబిలిటీ ఫౌండేషన్‌లో పొందాలి. వివరాలకు040-66335533, 040-64646262 సంప్రదించాలి.