వరప్రదం.. దేవర వృషభం | Devareddu tradition has been rooted since past in Annamaya district | Sakshi
Sakshi News home page

వరప్రదం.. దేవర వృషభం

Published Mon, Feb 27 2023 4:05 AM | Last Updated on Mon, Feb 27 2023 4:05 AM

Devareddu tradition has been rooted since past in Annamaya district - Sakshi

కలకడ మండలంలోని బహదానది వద్దకు ఝరి ఉత్సవంలో దేవరెద్దులను ఊరేగింపుగా తీసుకెళ్తున్న భక్తులు, గ్రామస్తులు (ఫైల్‌)

సంస్కృతి, సంప్రదాయాలకు పట్టుగొమ్మలు గ్రామసీమలు. అవి సంబరాలకు నెలవులు. విశిష్ట ఆచారాలకు పుట్టినిళ్లు. అలాంటి గ్రామాల్లో కొనసాగుతున్న ఒక అరుదైన విశేషమే.. దేవరెద్దు, దేవరభక్తుల పరంపర..

(షేక్‌ ముజుబుద్దీన్, సాక్షి, కడప డెస్క్‌) : దేవరెద్దులు.. అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి.  అనాదిగా వస్తున్న ఆచారానికి ఇవి ప్రతీకలుగా ఉంటున్నాయి. గ్రామానికి  శుభం చేకూరుస్తాయనే ప్రజల నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.     

గ్రామాలు సస్యశ్యామలం 
దేవరెద్దులు కలిగిన గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయని నమ్మకం. దేవరెద్దును పోషిస్తున్న భక్తుల వంశాభివృద్ధి చెంది, సుఖసంతోషాలతో ఉంటారని విశ్వాసం. దాన్ని మేపడానికి వదిలేసినప్పడు ఏ పొలంలో అయినా మేయవచ్చు. అది మేసిన పొలం యజమానులు తమ అదృష్టంగా భావిస్తారు. అలాగే గ్రామస్తులు తమకు తోచిన పదార్థాలను ప్రసాదంగా దేవరెద్దుకు అందజేస్తుంటారు. దేవరెద్దు మృతి చెందితే ఆ ఊరికి, గ్రామస్తులకు అరిష్టం జరుగుతుందనే భయంతో తక్షణం కొత్తదాన్ని ఎంపిక చేస్తారు.   

విశేషాల సమాహారం 
దేవరెద్దు పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు ఎన్నో వేడుకలు నిర్వహిస్తారు. వీటిని సంరక్షించేందుకు ప్రత్యేకంగా దేవరభక్తులుంటారు. తిరునాల, ఉత్సవాల సందర్భంగా వీటిని అలంకరించి సంబరాలు చేసుకుంటారు. దేవరెద్దును దేవుడిలా పూజిస్తారు. దీని పై ఎవ్వరూ దెబ్బ వేయరు. ఇది చనిపోయినా.. కొత్త దేవరెద్దును, దేవరభక్తులను ఎంపిక చేయాలన్నా వేడుక నిర్వహిస్తారు. బంధుమిత్రులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల వారు కూడా తరలివస్తారు. సంప్రదాయ వాయిద్యాలతో పాటు మద్దిళ్లు, కొమ్ములు ఊదడం, పలకలు కొట్టడం లాంటివి చేస్తారు. కొత్త ఎద్దును ఎంపిక చేసిన తర్వాత దానికి సంప్రదాయ అలంకరణ అనంతరం ఊరేగిస్తారు.   

దేవరెద్దు చనిపోతే...  
ఎక్కడైనా దేవరెద్దు చనిపోతే అంత్యక్రియలు వేడుకలా నిర్వహిస్తారు. అడవికి వెళ్లి పచ్చారు కొయ్యలు తెస్తారు. వాటితో విశ్వబ్రాహ్మణుల ద్వారా ప్రత్యేకంగా రథం తయారు చేయిస్తారు. ఎద్దు ప్రాణంతో ఉన్నప్పుడు ఎలా పడుకుని ఉంటుందో.. ఆ విధంగా రథంలో ఉంచుతారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఊరేగింపుగా తీసుకెళ్తారు. చెక్కభజనలు, పిల్లనగ్రోవి, డప్పులు,  సాంస్కతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా సేవ చేస్తారు. భూమిలో గుంత తీసి ఖననం చేసే సమయంలో కూడా ఎద్దును కూర్చున్న స్థితిలోనే ఉంచుతారు. ఈ కార్యక్రమం ఒక తిరునాళ్లలా జరిపిస్తారు. దీనికి ఇతర గ్రామాల్లోని దేవరెద్దులు, దేవరభక్తులు కూడా తరలివస్తారు.  

నియమానుసారం..
దేవరభక్తులను నియమించడానికి గ్రామస్తులు స్నానం ఆచరించి నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటారు. ప్రతి ఒక్కరూ చేతిలో  పండ్లు, ప్రసాదం పట్టుకుని కూర్చుంటారు. దేవరెద్దును తీసుకొచ్చి అక్కడ వదిలేస్తారు. మొదటిసారి ఎవరి ప్రసాదం స్వీకరిస్తే వారిని ఎద్దుభక్తుడిగా ఎంపిక చేస్తారు. ఈ విధంగా వరుసగా కదిరిభక్తుడు, గుర్రప్ప భక్తుడు, పూల భక్తుడులను నియమిస్తారు. 

► దేవరభక్తుడు దేవరెద్దుకు పూజలు చేయడంతో పాటు ఉత్సవాలకు తీసుకెళ్లాలంటే ప్రత్యేకంగా అలంకరించాల్సి ఉంటుంది. కత్తి (బెత్తం) చేతపట్టుకుని దేవరెద్దుతో పాటు ఊరేగింపుగా వెళతాడు.
► కదిరి భక్తుడు నరసింహస్వామికి పూజలు చేయాల్సి ఉంటుంది. ఉత్సవాలకు నరసింహస్వామి చిత్రపటంతో వెళతాడు.
► గుర్రప్పభక్తుడు ఎద్దుకు సంబంధించిన ఆభరణాలు, ఉత్సవ సామగ్రి, గుర్రప్పస్వామి శిలతో కూడిన ఓ పెట్టెను ఎత్తుకుని వెళ్లాల్సి ఉంటుంది.
► పూల భక్తుడు ఏదైనా ఉత్సవాలు, తిరునాళ్లు జరిగినప్పుడు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి భక్తులను ఆహ్వానించాల్సి ఉంటుంది. 

కేవీ పల్లెలో.. అధిక సంఖ్యలో.. 
అన్నమయ్య జిల్లాలోని కేవీపల్లె, కురబలకోట, కలికిరి, సంబేపల్లె మండలాల్లో ప్రధానంగా దేవరెద్దుల సంస్కృతి ఉంది. కేవీపల్లె మండలంలో 12 గ్రామాల్లో ఒక్కో దేవరెద్దు చొప్పున ఉన్నాయి.  తోటి దళితవాడ, నారమాకుపల్లె, గొర్లకణంపల్లె, గుట్టలపై బండకాడపల్లె, దిగువగడ్డ, పెండ్లిపెంట, పేయలవారిపల్లె, తీతవగుంటపల్లె, తువ్వపల్లె, బొప్పసముద్రం, తిమ్మాపురం, వంకవడ్డిపల్లెలో దేవరెద్దులు ఉన్నాయి.

సంబేపల్లె మండలంలో అన్నప్పగారిపల్లె, శెట్టిపల్లె, గున్నికుంట్ల, గురిగింజకుంట, కలకడ మండలంలో పాళెంమూల, బాలయ్యగారిపల్లె పంచాయతీ నాయనవారిపల్లె, కలికిరి మండలంలో అద్దవారిపల్లెలోనూ దేవరెద్దులు ఉన్నాయి. కురబలకోట మండలంలో కూడా అక్కడక్కడా ఉన్నాయి. కాగా.. ఒకటి, రెండు గ్రామాల్లో మాత్రమే కొత్తగా దేవరెద్దులు పుట్టాయి.  

దేవరెద్దు అంటే.. 
ఏ గ్రామంలో అయినా పుట్టిన దూడ వారం రోజులైనా పాలు తాగకుండా ఉంటే.. దాన్ని దేవాలయం వద్దకు తీసుకెళ్లి ప్రసాదం పెడతారు. అది తింటే దానిని దేవరెద్దుగా పరిగణిస్తారు. దానిని సంరక్షించుకుంటే గ్రామాలకు శుభం కలుగుతుందని నమ్ముతారు.

ఉత్సవాలకు ఊరేగింపుగా.. 
దేవరెద్దు ఉన్న ఊళ్లతో పాటు సమీప ప్రాంతాల్లో ఎక్కడ ఉత్సవాలు జరిగినా వీటిని ప్రత్యేకంగా ఊరేగింపుగా తీసుకెళతారు. ప్రధానంగా శివరాత్రి సందర్భంగా జరిగే ఝరి ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా ఇవి నిలుస్తాయి. ఆ రోజున జాగరణ నిర్వహించిన ప్రజలు మరుసటి రోజు ఉదయాన్నే ఝరికోనలో స్నానమాచరిస్తారు. అక్కడికి దేవరెద్దును, నాణ్యాలు(దెవరెద్దు పూజసామగ్రి)ని ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. దీనిని చూడటానికి జనం పెద్ద ఎత్తున తరలివస్తారు.  

పూజ సామగ్రి కోసం దేవరిల్లు 
దేవరెద్దు కోసం ప్రత్యేకంగా ఇల్లు ఏర్పాటు చేస్తారు. దానిని దేవరిల్లు అంటారు. అందులో దేవుని చిత్రపటాలు ఉంచుతారు. దేవరెద్దు అక్కడే ఉంటుంది. దానికి అలంకరణ సామగ్రి కోసం ప్రత్యేకంగా పెట్టె ఉంటుంది. గంట, గజ్జెలు, మువ్వలు, మల్లముట్లు, గొడుగులు, వస్త్రం తదితరాలుంటాయి. వాటిని దేవరింటిలో భద్రపరుస్తారు.  

కొత్త దేవరెద్దు ఎంపిక ఇలా.. 
దేవరెద్దు చనిపోయిన స్థానంలో కొత్త దాన్ని ఎంపిక చే సేందుకు గ్రామస్తులంతా పూజలు నిర్వహిస్తారు. గ్రా మంలో పండ్లు, ప్రసాదాలు పెట్టి దూడలు, ఎద్దులను ఒక చోట వదులుతారు. ఏది అయితే ప్రసాదం స్వీకరిస్తుందో.. దాన్ని దేవరెద్దుగా పరిగణిస్తారు. కొత్తగా దేవరెద్దు ఎంపికైన అనంతరం మూడేళ్లకు తిరునాల నిర్వహిస్తారు. దానికి మిగతా గ్రామాల్లోని దేవరెద్దులను కూడా ఆహ్వానిస్తారు. గ్రామానికి వచ్చిన వాటికి మంగ ళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలుకుతారు.  సాంస్కృతిక కార్యక్రమాలతో సంబరాలు చేసుకుంటారు. 

దేవర భక్తులు.. సదా సంరక్షకులు 
గ్రామంలో దేవరెద్దును సంరక్షించడానికి, పూజలు చేయడానికి, ఉత్సవాలకు తీసుకు వెళ్లడానికి నలుగురు వ్యక్తులుంటారు. వీరిని దేవర భక్తులు అంటారు. ఎక్కువగా ఏళ్ల తరబడి ఒకే కుటుంబ సభ్యులు దేవరెద్దు భక్తులుగా ఉంటారు. వారిని ఎద్దు భక్తుడు, కదిరి భక్తుడు, గుర్రప్పభక్తుడు, పూల భక్తుడిగా పిలుస్తారు.  

నిష్టగా ఉంటాం 
మేము చాలా నిష్టగా ఉంటాం. భక్తుడిగా నియమించినప్పటి నుంచి ఎద్దు బాగోగులు నేనే చూసుకుంటున్నా. 25 ఏళ్లుగా మా వంశస్తులే దేవరెద్దు భక్తులుగా ఉన్నాం. దేవరెద్దు భక్తులతో పాటు ఇతర భక్తులు దేవరెద్దుకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 
– యల్లయ్య, వీఆర్‌ఓ, ఎద్దు భక్తుడు, తోటిదళితవాడ, కేవీపల్లె మండలం.  

పురాతనకాలం నుంచి వస్తున్న ఆచారం 
మా గ్రామంలో దేవరెద్దును సంరక్షించడం, పూజలు నిర్వహించడం పురాతన కాలం నుంచి ఆచారంగా వస్తోంది. కొన్ని కట్టుబాట్లు పాటిస్తూ దేవరెద్దును సంరక్షించడం జరుగుతోంది.  
    – నాగులయ్య, గుర్రప్ప భక్తుడు,  తోటిదళితవాడ, కేవీపల్లె మండలం 

అదృష్టంగా భావిస్తున్నాం 
దేవరెద్దు రూపంలో దేవుడే ప్ర త్యక్షంగా కన్పిస్తున్నాడు. అలాంటి దేవరెద్దుకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం.  పండుగలు, ఉత్సవాలతోపాటు ప్రతి శనివారం క్రమం తప్పకుండా పూజలు నిర్వహిస్తాం.   
    – నాగరాజ, పూల భక్తుడు, తోటిదళితవాడ, కేవీపల్లె మండలం 

ఒక్కపొద్దు పాటిస్తున్నాం 
ప్రతి శనివారం, పండుగల సమయంలో మేము ఒక్కపొద్దు పాటిస్తాం. దేవరింటిలో పూజ లు నిర్వహించడంతో పాటు అక్కడే భోజనం వండుకుని దేవరెద్దుకు పూజలు నిర్వహించిన తరువాతనే ఒక్కపొద్దు విడుస్తాం.        
– శశికుమార్, కదిరి భక్తుడు, తోటిదళితవాడ, కేవీపల్లె మండలం 

గౌరవంగా చూసుకుంటాం  
దేవరెద్దు సంప్రదాయం పెద్దల కాలం నుంచి వస్తోంది. ఎద్దును గౌరవంగా చూసుకుంటున్నాం.  మాలో ఎవరైనా చనిపోతే కొత్త భక్తుడిని దేవరెద్దే ఎంపిక చేసుకుంటుంది.     – కె.వంశీ, దేవరభక్తుడు, దిగువబోయపల్లె, కురబలకోట మండలం  

40 ఏళ్లుగా.. 
దేవరెద్దును దేవుడితో సమానంగా చూస్తారు. పండుగలు, ఉత్సవాల సందర్భాల్లో  అలంకరించి ఊరేగిస్తారు. 40 ఏళ్లుగా భక్తుడిగా ఉన్నా.    
 – శిద్దప్ప, దేవరభక్తుడు, మండ్యంవారిపల్లె, కురబలకోట మండలం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement