మూడిళ్ల పండగ | Special recipes for navratri celebrations | Sakshi
Sakshi News home page

మూడిళ్ల పండగ

Published Fri, Oct 4 2013 11:32 PM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM

Special recipes for navratri celebrations

 ఉండేవి ఉంటాయి. ఉంటూనే ఉంటాయి.
 అంతమాత్రాన...
 పండగలు లేకుండా పోతాయా?
 పలకరింపులు బంద్ అయిపోతాయా?
 రాకపోకలు తెగిపోతాయా? ఇచ్చిపుచ్చుకోవడం ఆగిపోతుందా?
 ఒకనాటి సంస్కృతా, ఒకనాటి సంప్రదాయమా?
 ఒకనాటి ఆత్మీయతలా, ఒకనాటి అనుబంధాలా?
 ప్రాంతాలు లెక్క కాదు... అంతరంగం ముఖ్యం.
 పరమాన్నాలు ఎన్నిరకాలని కాదు... తియ్యదన మే ప్రధానం.
 భక్ష్యాలు, బొబ్బట్లు, ఓలిగలు... వేర్వేరు కావచ్చు.
 అదే బెల్లం, అదే పంచదార, అదే పిండి...
 అందరం ఒక్కటే...
 నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు.
 కలిసి జరుపుకుందాం... కలిసి తీపిని పంచుకుందాం.
 శుభాకాంక్షలు తెలుపుకుందాం.
 

 పాలముంజలు
 
 కావలసినవి:

 శనగపప్పు - ముప్పావు కప్పు;
 బెల్లంతురుము - కప్పు;
 పచ్చికొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు;
 ఏలకుల పొడి - పావు టీ స్పూను;
 బొంబాయిరవ్వ - ఒకటిన్నర కప్పులు;
  పాలు - మూడు కప్పులు; నూనె-డీప్ ఫ్రైకి సరిపడా
 
 తయారి:

 శనగపప్పును శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసి కుకర్‌లో ఉడికించాలి  
 
 ఉడికిన తర్వాత నీరు ఎక్కువగా ఉంటే వడపోసి, పప్పు చల్లారాక, మిక్సీలో వేసి పొడిపొడిగా వచ్చేలా చేయాలి  
 
 ఒక పాత్రలో బెల్లం తురుము, కొద్దిగా నీరు వేసి స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగి, మరిగేవరకు ఉంచాలి  
 
 శనగపప్పు పొడి, కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసి కలపాలి  
 
 మిశ్రమమంతా దగ్గర పడేవరకు ఉడికించి దించేయాలి  
 
 చల్లారాక, ఉండల్లా చే సి పక్కన ఉంచాలి  
 
 గిన్నెలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి  
 
 బొంబాయిరవ్వ నెమ్మదిగా వేస్తూ, కలుపుతుండాలి  
 
 మంట తగ్గించి, మిశ్రమం దగ్గర పడేవరకు రెండు నిముషాలు ఉడికించాలి
 
 చల్లారిన తరవాత మిశ్రమం బాగా మెత్తగా అయ్యేవరకు కలపాలి  
 
 చేతికి నూనె లేదా నెయ్యి రాసుకుని, ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలు చే సుకోవాలి  
 
 ఒక్కో ఉండను చేతిలోకి తీసుకుని పూరీ షేప్‌లోకి ప్రెస్ చేయాలి
 
 శనగపప్పు మిశ్రమాన్ని మధ్యలో ఉంచి అంచులను మూసేయాలి   
 
 బాణలిలో నూనె వేసి కాగాక ఒక్కో ఉండను నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి.
 
 కొబ్బరి సద్ది
 
 కావలసినవి:
 అన్నం - మూడు కప్పులు; కొబ్బరి ముక్కలు - కప్పు; పచ్చిమిర్చి - 3 (మధ్యకు కట్ చేయాలి); ఎండుమిర్చి - 3; పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు - పది పలుకులు; ఆవాలు - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; నూనె - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; నువ్వులపొడి - రెండు టేబుల్ స్పూన్లు.
 

తయారి:
 కొబ్బరిముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచాలి
 
 బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి వేయించాలి  
 
 జీడిపప్పు, పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు జత చేసి రెండు నిముషాలు వేయించాలి
 
 కొబ్బరిపేస్ట్ వేసి బాగా కలిపి, వేయించాలి అన్నం, ఉప్పు వేసి కలపాలి  
 
 మంట తగ్గించి రెండు నిముషాలు ఉంచి దించేయాలి.
 
 కజ్జి కాయలు
 
 కావలసినవి:
 మైదా - 250 గ్రా; బొంబాయిరవ్వ - కప్పు; పంచదార - ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; ఎండుకొబ్బరి తురుము - అరకప్పు; ఏలకుల పొడి - అర టీ స్పూను; ఉప్పు - చిటికెడు; నెయ్యి - 2 టీ స్పూన్లు; నూనె - డీప్ ఫ్రైకి తగినంత
 
 తయారి:  
 ఒక పాత్రలో బొంబాయిరవ్వ, ఎండుకొబ్బరి తురుము, ఏలకులపొడి, పంచదార వేసి కలిపి పక్కన ఉంచాలి  
 
 వేరే పాత్రలో మైదా, నెయ్యి, ఉప్పు వేసి చపాతీపిండిలా కలిపి, పైన వస్త్రం వేసి, సుమారు గంటసేపు నాననివ్వాలి  
 
 నానిన పిండిని చిన్నచిన్న ఉండలు చేసి, పూరీలా ఒత్తి కజ్జికాయ మౌల్డ్ మీద ఉంచాలి
 
 టేబుల్ స్పూను బొంబాయిరవ్వ మిశ్రమాన్ని ఇందులో ఉంచి మౌల్డ్‌ని మూసి, అంచులు తీసేయాలి  
 
 బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న కజ్జికాయలను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి.
 
 గుమ్మడి హల్వా
 
 కావలసినవి:

తీపిగుమ్మడికాయ తురుము - 2 కప్పులు; పాలు - 2 కప్పులు; పంచదార - కప్పు; నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు; బాదంపప్పులు - 15;  ఏలకులపొడి - అర టీ స్పూను
 
 తయారి:
 బాణలిలో నెయ్యి వేసి కరిగాక బాదంపప్పుల తరుగు వేసి వేయించి, తీసి పక్కన ఉంచాలి  
 
 అదే బాణలిలో గుమ్మడికాయ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు సుమారు ఐదు నిముషాలు వేయించాలి
 
 రెండు కప్పుల పాలు పోసి బాగా కలిపి, పాలు ఇగిరిపోయేవరకు ఉడికించాలి
 
 పంచదార వేసి కలపాలి  
 
 అన్నీ బాగా ఉడికిన తరవాత దించేయాలి
 
 ఏలకులపొడి, బాదంపప్పు ముక్కలు వేసి కలిపి సర్వ్ చేయాలి.
 
 పెరుగన్నం
 
 కావలసినవి:
 అన్నం - రెండు కప్పులు; ఉప్పు - కొద్దిగా; పెరుగు - రెండు కప్పులు; కొత్తిమీర - చిన్న కట్ట; దానిమ్మ గింజలు - పావుకప్పు; కిస్‌మిస్ ద్రాక్ష - రెండు టీస్పూన్లు; జీడిపప్పులు - టేబుల్ స్పూను;
 
 తయారి:  
 ఒకపాత్రలో అన్నం, పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి దానిమ్మ గింజలు, కిస్‌మిస్ ద్రాక్ష వేసి కలపాలి కొత్తిమీర, జీడిపప్పులతో గార్నిష్ చేయాలి.
 
 మురుకులు
 
 కావలసినవి:
 బియ్యప్పిండి - 3 కప్పులు; వేయించిన శనగపిండి - కప్పు ; వాము - టీ స్పూను; కారం - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; నూనె - తగినంత
 
 తయారి:  
 ఒక పాత్రలో బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, కారం, వాము వేసి కలపాలి  ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు, రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి మరిగించి, ఆ నీటిని పిండిలో వేసి కలపాలి  
 
 అవసరమనుకుంటే కొద్దిగా చన్నీరు వేస్తూ పిండి మెత్తగా అయ్యేవరకు కలపాలి
 
 పిండిని కొద్దికొద్దిగా తీసుకుని, మురుకుల గొట్టంలో ఉంచి, ఒక ప్లేట్ లాంటి దాని మీద గుండ్రంగా మురుకు ఆకారం వచ్చేలా తిప్పుతుండాలి  
 
 బాణలిలో నూనె పోసి కాగాక, వీటిని జాగ్రత్తగా నూనెలో వేసి, మంట తగ్గించి వేయించాలి  
 
 బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేయాలి.
 
 పాల్ పోలీ

 
 కావలసినవి:  
 మైదా - కప్పు; పాలు - అర లీటరు; కండెన్స్‌డ్ మిల్క్ - 3 టేబుల్ స్పూన్లు; నూనె - టీ స్పూను; నీరు - పావు కప్పు; నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా; పంచదార - 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు - చిటికెడు; బాదంపప్పులు - కొద్దిగా; కుంకుమపువ్వు - చిటికెడు; ఏలకులపొడి - పావు టీ స్పూను
 
 తయారి:  
 ఒక పాత్రలో మైదా వేసి నీరు పోస్తూ పూరీ పిండిలా క లిపి, మూత పెట్టి గంటసేపు నాననివ్వాలి  
 
 కడాయిలో పాలు మరిగించి, మంట తగ్గించి, కండెన్స్‌డ్ మిల్క్ పోయాలి
 
 చిన్న గ్లాసులో కొద్దిగా నీరు, కుంకుమపువ్వు వేసి బాగా కలిపి, మరుగుతున్న పాలలో వేయాలి
 
 పంచదార, ఏలకుల పొడి వేసి కలపాలి
 
 ఈ పాలను వెడల్పాటి పాత్రలో పోయాలి  
 
 పిండిని చిన్నచిన్న ఉండలుగా తీసుకుని, పూరీల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి వేయించాలి  
 
 పూరీలన్నీ తయారుచేసుకుని, పాలలో వేయాలి  
 
 గంటసేపు నానినతర్వాత పూరీలను బయటకు తీసి, బాదంపప్పులతో గార్నిష్ చేసి, చల్లగా సర్వ్ చేయాలి.
 
 సజ్జ ముద్దలు
 
 కావలసినవి:
 సజ్జపిండి - 2 క ప్పులు; బెల్లంతురుము - కప్పు; నీరు - తగినంత; ఏలకులపొడి - చిటికెడు; డ్రైఫ్రూట్స్ - (బాదం, జీడిపప్పు, కిస్‌మిస్) - 2 టీ స్పూన్లు; నెయ్యి - 2 టే బుల్ స్పూన్లు
 
 తయారి:  
 తగినన్ని నీరు మరిగించాలి  
 
 ఒక గిన్నెలో సజ్జపిండి వేసి, వేడినీరు కొద్దికొద్దిగా పోస్తూ కలిపి ముద్ద చేయాలి  
 
 కావలసిన పరిమాణంలో ముద్ద తీసుకొని, కొద్దికొద్దిగా నీరు చిలకరిస్తూ, రొట్టె చేసి, పెనం మీద వేసి రెండువైపులా కాల్చాలి
 
  వేడిగా ఉన్నప్పుడే సజ్జ రొట్టెలకు నీళ్లు అద్దుకుంటూ చేత్తో ముక్కలు ముక్కలు చేసి, రోట్లో వేసి దంచాలి
 
 స్టౌ మీద బాణలి ఉంచి అందులో నెయ్యి, బెల్లం, ఏలకులపొడి, సజ్జరొట్టె ముక్కల పొడి వేసి కొద్దిగా వేయించి దించాలి  
 
 కావలసిన పరిమాణంలో ఈ పొడిని తీసుకొని బాదం, జీడిపప్పులు, కిస్‌మిస్‌లు అద్దుకుంటూ ముద్దలు చేయాలి.
 
 ఓలిగలు
 
 కావలసినవి:

 కందిపప్పు - కప్పు; బెల్లంతురుము - కప్పు; నీరు - 3 కప్పులు.
 పైన కవరింగ్ కోసం: మైదా - కప్పు; నువ్వుపప్పు - 2 టేబుల్‌స్పూన్లు; నూనె - అర కప్పు; నీరు - అరకప్పు; పసుపు - అర టేబుల్ స్పూను
 
 తయారి:

 ఒక పాత్రలో కందిపప్పు, తగినంత నీరు వేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి  
 
 చల్లారాక అధికంగా ఉన్న నీరు తీసేసి, పప్పును మెత్తగా చిదిమి, బెల్లం తురుము జత చేసి స్టౌ మీద ఐదు నిముషాలు ఉంచి దించి చల్లారనివ్వాలి
 
 ఏలకులపొడి జత చేసి, ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి  
 
 ఒక పాత్రలో మైదా, నీరు, పసుపు, నూనె వేసి చపాతీపిండిలా కలిపి మూడుగంటలసేపు నాననివ్వాలి  
 
 ఈ పిండిని చిన్న ఉండలా తీసుకుని చేతితో ఒత్తి, పూర్ణం ముద్దను ఇందులో ఉంచి, అప్పడాల పీట మీద ఉంచి అప్పడాల కర్రతో నెమ్మదిగా ఒత్తాలి  
 
 స్టౌ మీద పెనం ఉంచి, కొద్దిగా నూనె వేసి, తయారుచేసి ఉంచుకున్న ఓలిగను పెనం మీద వేసి చుట్టూ నూనె వేసి, రెండువైపులా నూనె వేసి కాలాక తీసేయాలి.
 
 సేకరణ
 డా.వైజయంతి

 
 పిండివంటలు రుచిగా ఉండాలంటే...
బొంబాయిరవ్వ వేయించి వాడితే పిండివంటలు రుచిగా ఉంటాయి.
     
 ఎండుకొబ్బరి వాడితే స్వీట్లు ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి.
 
 మైదాపిండిని కలిపిన తరవాత చిన్నగిన్నెడు నూనె వేసి చేత్తో బాగా మర్దన చేసి, గిన్నె మీద తడి వస్త్రం కప్పి, గంటసేపు నాననిస్తే పిండివంటలు గుల్లగా వస్తాయి.
     
 గుమ్మడికాయ వంటి వాటిని స్వీట్లలో ఉపయోగించేటప్పుడు, వీటిలోని నీరు బాగా పిండేసి, నేతిలో దోరగా వేయించాలి.
     
 మిల్క్ స్వీట్లు తయారుచేసేటప్పుడు... పాల బదులు కండెన్స్‌డ్ మిల్క్ ఉపయోగిస్తే స్వీట్లు రుచిగా ఉంటాయి.
     
 ఏ పిండివంటలనైనా నూనెలో వేయించేటప్పుడు మంట తగ్గిస్తే, వంటకాలు మాడిపోకుండా, దోరగా వేగుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement