నో కన్‌ఫ్యూజన్
Guest Time
అందరిలోనూ సృజన అంతర్లీనంగా దాగి ఉంటుంది. సాధనతో మనకు మనమే దానిని వెలికి తీసుకోవాలి అంటారు ప్రముఖ సంతూర్ వాద్యకారుడు పండిట్ రాహుల్ శర్మ. సాధనతోనే రాణింపు వస్తుందనేది ఆయన మాట.ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన ‘జాదవ్‌పూర్ యూనివర్సిటీ హైదరాబాద్ చాప్టర్ అలుమ్ని’ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయనను సాక్షి సిటీప్లస్ పలకరించినపుడు తన సంగీత ప్రయాణం గురించి ఇలా వివరించారు.
నాన్న, ప్రముఖ సంతూర్ విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ నా తొలిగురువు. సంగీత ప్రపంచంలో ఆయన పేరు తెలియని వారు లేరు. నేను 13వ ఏట నుంచే సంతూర్ వాయించడం నేర్చుకున్నాను. నాన్నతో కలసి ఎన్నో ప్రదర్శనలిచ్చాను. సంగీతం నేర్చుకోవటంతో పాటు పాటలు పాడటం, వేదికలపై ప్రదర్శలివ్వడం చిన్న వయసులోనే ప్రారంభించాను.
ఏ రంగమైనా సృజన ముఖ్యం
సృజనతో మాత్రమే ఏ రంగంలోనైనా రాణించగలం. క్రియేటివిటీతోనే ప్రతి సందర్భాన్నీ సంగీతమంత అందంగా మలుచుకోవచ్చు. సాధనతోనే హోదా, గుర్తింపు లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి చదువుతో పాటే సంగీతం లేదా మరేదైనా అంశాన్ని హాబీగా మలచుకోవాలి. హిందుస్థానీ మ్యూజిక్‌తో పాటు ఫ్యూజన్ మ్యూజిక్‌లోనూ నా ముద్ర ఉంది. ముఖ్యంగా ఫ్యూజన్‌ను కన్‌ఫ్యూజ్ చేయకూడదు. కచేరీకి ముందు పరికరాల శబ్దాలను, మైకుల నుంచి వచ్చే ధ్వనులను సరిచేసుకోవాలి. అప్పుడే ఫ్యూజన్ సూటిగా హృదయాలను తాకుతుంది. ఇక్కడ ధ్వని బదలాయింపు చాలా ముఖ్యం. వెస్ట్రన్, ఇండియన్ మ్యూజిక్‌ల తీరు వేరు. ఫ్యూజన్ మ్యూజిక్ తీరు వేరు.
మై ఫేవరెట్ ప్లేస్
హైదరాబాద్ నాకు ఇష్టమైన ప్రాంతం. నేను సంగీత కచేరీలు ఇవ్వడం ప్రారంభించిన నాటి నుంచి ఇక్కడకు వస్తూనే ఉన్నాను. ఖాదర్ అలీ బేగ్‌తో పాటు ఆయన కుమారుడు మహ్మద్ అలీ బేగ్ ప్రోగ్రామ్‌లకు ఎన్నోసార్లు వచ్చాను. హైదరాబాదీలు సంగీతప్రియులు. వారు చూపించే ఆదరణ కళాకారులకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది.
యువత ఇటు వైపు రావాలి
మన సంస్కృతి, సంప్రదాయాలు విలక్షణమైనవి. వీటి పరిరక్షకులు యువతే. అన్నింటా, అంతటా సంగీతమే ప్రాముఖ్యం వహిస్తుంది. యువత దీనినో కెరీర్‌గా మలచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. నేను ముంబైలోని మిథిబాయి కాలేజీ నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశాను. కానీ, విచిత్రంగా సంగీత ప్రపంచం వైపు అడుగులు వేశాను. 1996 నుంచి నా సంగీత ప్రదర్శనలు మొదలయ్యాయి. 2000 సంవత్సరం నుంచి సొంతంగా కచేరీలు ఇస్తున్నాను. అప్పటి నుంచి దేశ, విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చాను. హిమాలయశర్మ, భవానీశంకర్, తబలా ఉస్తాద్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి చేసిన ప్రదర్శనలు రికార్డులు సృష్టించాయి. 2002లో నా సంగీత ప్రదర్శనలకు సంబంధించి ఆరు టైటిల్స్ గెలుచుకొన్నాను. ‘ముసే దోస్తీ కరోగే’ సినిమాకి సంగీతం అందించినందుకు ‘ఉత్తమ తొలి సంగీత దర్శకుడు’ అవార్డ్ అందుకున్నాను.