సాంస్కృతిక ఏకీకరణతో సుస్థిరాభివృద్ధి | Cultural heritage both pillar of past and pathway to future: Kishan Reddy at G20 ministerial meeting | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక ఏకీకరణతో సుస్థిరాభివృద్ధి

Published Sun, Aug 27 2023 1:39 AM | Last Updated on Sun, Aug 27 2023 1:39 AM

Cultural heritage both pillar of past and pathway to future: Kishan Reddy at G20 ministerial meeting - Sakshi

వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూనే, ప్రపంచంలోని భిన్న సంస్కృతులను కా­పాడుకునే దిశగా జీ 20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశం కాశీ కల్చరల్‌ పాత్‌వేకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కాశీలో మూడు రోజులపాటు జరిగిన జీ20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ప్రపంచంలోని వైవిధ్యమైన సంస్కృతి మనందరినీ కలుపుతుందని సమావేశంలోని మంత్రులు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌ రెడ్డి తన సహచర దేశాల మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ...అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి సంస్కృతి, సంప్రదాయాలకే ఉందన్నారు. ‘కల్చర్‌ యునైట్స్‌ ఆల్‌’అని వ్యాఖ్యానించారు. భిన్న ప్రాంతాల్లో భిన్న సంస్కృతుల నిలయమైన భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ప్రదర్శిస్తున్నట్లే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యత అన్ని దేశాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఒకరినొకరు సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకునేందుకు వీలవుతుందన్నారు. యావత్‌ మానవాళిని ఏకం చేసే విషయంలో సంస్కృతి కీలకపాత్ర పోషిస్తోందని, విలువలు, భాషలు, కళలు మొదలైనవి దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తా­యని మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశానికి ఒకరోజు ముందు జరిగిన నాలుగో వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశంలోనూ ఈ అంశాలపై మరింత విస్తృతమైన చర్చ జరిగిందని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా ‘కాశీ కల్చరల్‌ పాత్‌వే’కు రూపకల్పన జరిగిందని ఆయన వెల్లడించారు. రోమ్‌ డిక్లరేషన్, బాలి డిక్లరేషన్‌లలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు అంశాలు, సభ్యుల అభిప్రాయాల ఆధారంగానే ‘కాశీ కల్చరల్‌ పాత్‌వే’ను రూపొందించినట్లు కిషన్‌ రెడ్డి వివరించారు. 

‘కాశీ కల్చరల్‌ పాత్‌వే’లోని కొన్ని ముఖ్యాంశాలు

  • సాంస్కృతిక ఆస్తులకు పునర్వైభవాన్ని కల్పించడం, వాటిని ఆయా దేశాలకు తిరిగి అప్పగించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు నైతిక విలువలకు పట్టం గట్టాలని నిర్ణయించారు. 
  • సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న శక్తి, సామర్థ్యాలను గుర్తెరిగి సరైన ప్రాధాన్యత కల్పించాలి. 
  • సంస్కృతికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు సరైన పరిష్కారాలను కనుగొనడం. 
  • అన్ని సభ్యదేశాల మధ్య సమయానుగుణంగా చర్చలు జరుపుతూ.. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లడం. 
  • ఈ సమావేశంలో పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రులు.. ఆయా దేశాలకు ప్రతినిధులుగానే కాకుండా.. ఆయా దేశాలలో సాంస్కృతిక సంరక్షకులుగా ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు ఏకతాటిపైకి వచ్చి పని చేయాలి. 
  • రోమ్, బాలి డిక్లరేషన్లు ఈ దిశగా వేసిన బలమైన పునాదుల ఆధారంగా మరింత స్పష్టమైన విధానాలతో ముందుకెళ్లాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement