ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలోగల 26 మాంసం దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. న్యూ రోడ్, బెనియాబాగ్ ప్రాంతంలో మాంసం, చికెన్ దుకాణాలను అధికారులు మూసివేయించారు.
కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలోని మాంసం, చికెన్ దుకాణాలను మూసివేయాలని ఆదేశిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ గత నెలలో తీర్మానం చేసింది. ఈ నేపధ్యంలో వెటర్నరీ అధికారి డాక్టర్ అజయ్ ప్రతాప్ సింగ్ ఇటీవల బెనియాబాగ్, న్యూ రోడ్‌లో గల మాంసం, చికెన్ దుకాణాలను తనిఖీ చేశారు.
వీటిలో 26 దుకాణదారులు ఆహార భద్రతా విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని తేలింది. ఈ తనిఖీల తర్వాత, ఆయా దుకాణాలను మూసివేయాలని వెటర్నరీ అధికారి గత వారం నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికీ దుకాణాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు(శనివారం) వెటర్నరీ అధికారి నేతృత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం బెనియాబాగ్, కొత్తరోడ్డు ప్రాంతంలోని 26 దుకాణాలను సీజ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment