
జ్ఞానవాపి మసీదు బేస్‌మెంట్‌లో పూజలు...
వారణాసి: కాశీలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో బుధవారం అర్ధరాత్రి పూజలు ప్రారంభమయ్యాయి. ఇక్కడున్న హిందూ దేవతల విగ్రహాలకు అర్చకులు హారతులు ఇచ్చారు. ఈ మసీదులో హిందూ దేవతలకు పూజలు జరగడం 31 సంవత్సరాల తర్వాత మొదటిసారి అని కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్టు అధ్యక్షుడు నరేంద్ర పాండే చెప్పారు. పూజల కోసం వ్యాసుడి సెల్లార్ 31 ఏళ్ల తర్వాత తెరుచుకుందని అన్నారు.
దక్షిణ సెల్లార్‌ను బుధవారం రాత్రి 10.30 గంటలకు తెరిచినట్లు వెల్లడించారు. అనంతరం కోర్టు ఉత్తర్వులను పాటిస్తూ పూజలు నిర్వహించామని, ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.
కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోనే ఉన్న జ్ఞానవాపీ మసీదు భూగర్భ గృహంలో హిందూ దేవతలకు పూజలు చేసుకోవడానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అంగీకరించిన సంగతి తెలిసిందే. కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే పూజలు ప్రారంభం కావడం గమనార్హం. పూజల విషయంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారమే నడుచుకున్నామని వారణాసి జిల్లా మేజి్రస్టేట్ ఎస్.రాజలింగం చెప్పారు. మసీదు ప్రాంగణంలోని సెల్లార్‌ను శుభ్రం చేసిన తర్వాత లక్ష్మీదేవికి, వినాయకుడికి హారతి ఇచి్చనట్లు స్థానికులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment