జ్ఞానవాపీ మసీదు ముందు శంఖం పూరిస్తున్న భక్తుడు
ప్రయాగ్‌రాజ్/వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే జరపాలంటూ పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ)కు దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. శాస్త్రీయ సర్వేకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. జిల్లా కోర్టు ఉత్తర్వు సముచితమేనని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకునే ఉన్న జ్ఞానవాపీ మసీదు ఆలయంపైనే నిర్మించిందా లేదా తేల్చేందుకు ఏఎస్‌ఐ శాస్త్రీయ సర్వే జరపాలంటూ వారణాసి జిల్లా కోర్టు జూలై 21న అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ ఆదేశాలపై అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మసీదు కమిటీకి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలంటూ ఏఎస్‌ఐ సర్వేపై జూలై 26 సాయంత్రం 5వరకు స్టే ఇచ్చింది. ఈ మేరకు మసీదు కమిటీ సర్వేను ఆపాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై అలహాబాద్ హైకోర్టు సీజే ధర్మాసనం జూలై 27 వరకు హిందు, మసీదు కమిటీ వర్గాల వాదనలు విని, తీర్పు రిజర్వు చేసింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
మసీదు ఆవరణలో ఏఎస్‌ఐ అధికారులు తక్షణమే తమ పనులు ప్రారంభించవచ్చని, సర్వేలో భాగంగా ఆ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు జరపరాదని స్పష్టం చేసింది. ఏఎస్‌ఐ అధికారులు సర్వేను శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకు సహకరించాలంటూ ఏఎస్‌ఐ తమను కోరిందని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఎస్.రాజలింగం తెలిపారు.జ్ఞానవాపి మసీదులో ఏఎస్‌ఐ సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సర్వే నిలుపుదల కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది.
Comments
Please login to add a commentAdd a comment