Scientific survey
-
ముళ్లు లేని గులాబీలు.. కానీ..?
గులాబీలు అందంగా ఉన్నా, వాటి కొమ్మలకు ముళ్లు ఉంటాయి. ముళ్లు గుచ్చుకోకుండా మొక్క నుంచి గులాబీలు కోయడం కొంత కష్టమే! ఈ కష్టాన్ని తొలగించడానికి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ముందుకొచ్చి, ముళ్లులేని గులాబీలను సృష్టించే ప్రక్రియను కనుగొన్నారు. గులాబీలు సహా వివిధ మొక్కల్లో పూలు, కాయలు కాసే కొమ్మలకు ముళ్లు ఏర్పడటానికి కారణమైన జన్యువును కనుగొన్నారు.ఈ జన్యువుకు వారు ‘లోన్లీ గై’ (ఎల్ఓజీ) అని పేరు పెట్టారు. గులాబీలు సహా ఇరవై జాతుల మొక్కల్లో ముళ్లు ఏర్పడటానికి ఈ జన్యువే కారణమవుతోందని గుర్తించారు. అటవీ ప్రాంతాల్లో పెరిగే వంకాయలకు ముళ్లు ఉంటాయి. తోటలు, పొలాల్లో పెంచే వంకాయలకు ముళ్లు ఉండవు. అటవీ ప్రాంతాల్లోని వంకాయల నుంచి పొలాలు, తోటల్లో పెంచే వంకాయ జాతులు వేరుపడి వేలాది సంవత్సరాలు గడిచిపోయాయి.ఈ సుదీర్ఘకాలంలో సంభవించిన జన్యు ఉత్పరివర్తనల వల్ల పొలాలు, తోటల్లో పెంచే వంకాయల్లో ముళ్లు వాటంతట అవే అంతరించిపోయాయి. మరికొన్ని రకాల ముళ్ల మొక్కల్లోనూ వేరుపడిన జాతుల్లో ముళ్లు అంతరించాయి. కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల జన్యుమార్పిడి ద్వారా కొన్ని రకాల ఎడారి మొక్కల్లో ముళ్లను మాయం చేయగలిగారు. ఇదే పద్ధతిలో గులాబీలను కూడా ముళ్లు లేకుండా పూయించవచ్చని వారు చెబుతున్నారు. ముళ్లులేని గులాబీల సృష్టి కోసం చేయవలసిన జన్యుమార్పిడి పద్ధతిని వివరిస్తూ వారు సమర్పించిన పరిశోధన వివరాలను ఇటీవల ‘సైన్స్’ జర్నల్ ప్రచురించింది. కళకళలాడే పూలచెట్లతో పెరటి తోటలను పెంచుకునేవారికి ఇది శుభవార్తే! -
అస్తిత్వాన్ని వెలికి తీద్దాం
మనం పై పైన చూసే ఎన్నో విషయాలు మూలాల్లో ఉన్న అస్తిత్వానికి గొడ్డలిపెట్టుగా ఉండవచ్చు. అది మొక్కలకు సంబంధించినవైనా సరే...ప్రపంచంలో తెల్లజాతీయుల ఆధిపత్య వలసవాదులు పెట్టిన వృక్ష జాతుల శాస్త్రీయనామాల మూలాలను శోధించి తిరిగి వాటికి పూర్వపు పేర్లు ఉండేలా కృషి చేస్తోంది భాను సుబ్రమణ్యం. అమెరికాలోని వెల్లెస్లీ కాలేజీలో ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్ ప్రోఫెసర్‌గా ఉన్న భారతీయురాలు.తెల్లజాతీయుల ఆధిపత్య వలసవాదులు పెట్టిన 126 వృక్ష జాతుల మూలాలను శోధించి, తిరిగి వాటి పూర్వపు పేర్లతోనే పిలిచేలా కృషి చేశారు.దీంతో ఆ వృక్షజాతుల పేర్ల గురించి ఎవరు చర్చించినా భాను సుబ్రమణ్యాన్ని గుర్తుంచు కుంటారు. ‘దీనిని అత్యంత క్లిష్టమైన సమస్యగా ఎవరూ గుర్తించరు. అధికారంలో ఉన్నవారు దీనికి అనేక కారణాలు చూపుతారు’ అంటారామె.మొక్కల పేర్ల నుండి స్థానిక జాతుల వరకు ప్రంచంలోని అనేక అంశాలు వలస సామ్రాజ్యాల ద్వారా రూపొందించబడ్డాయి. మనం ఈ వలసరాజ్యాల ఆధిపత్యాన్ని తొలగించాలి’ అంటారు వృక్షశాస్త్రంలో ఎంపరర్‌గా పేరొందిన భాను సుబ్రమణ్యం. తన కొత్త పుస్తకమైన ‘బోటనీ ఆఫ్ ఎంపైర్’లో వలసవాదం సృష్టించే సమస్యలు ఎప్పటికీ అంతం కావని, దాని వెనక తీవ్రమైన ప్రయత్నం ఎలా ఉండాలో తను రాసిన పుస్తకం ద్వారా సమాజం దృష్టికి తీసుకువచ్చింది. జాతుల వర్గీకరణ, మొక్కల పునరుత్పత్తి, దండయాత్రల ద్వారా ప్రవేశపెట్టబడిన జాతుల వ్యాప్తికి సంబంధించిన శాస్త్రంగా ఈ పుస్తకం మనకు వివరిస్తుంది. ‘నేను పరిణామాత్మక జీవశాస్త్రవేత్త, మొక్కల శాస్త్రవేత్తగా పేరొందాను. స్త్రీవాద, సాంకేతిక రంగాలలో మానవీయ, సామాజిక శాస్త్రాలను కూడా అధ్యయనం చేశాను. జెండర్, జాతి, కులానికి సంబంధించిన శాస్త్రాలు, వైద్యం, తత్వశాస్త్రం, చరిత్ర, సంస్కృతులను అన్వేషిస్తాను. నా ఇటీవల పరిశోధన వలసవాదం, జీనోఫోబియా చరిత్రలకు సంబంధించిన వృక్షశాస్త్రం వీటన్నింటినీ పునరాలోచింపజేస్తుంది. వలస, ఆక్రమణ జాతులకు సంబంధించి శాస్త్రీయ సిద్ధాంతాలు, ఆలోచనలు, విస్తృత ప్రయాణాలను అన్వేషిస్తుంది.భారతదేశంలో సైన్స్, హిందూ జాతీయవాదం సంబంధంపై కూడా పని చేస్తున్నాను. ఇప్పటివరకు మూడు పుస్తకాలను తీసుకువచ్చాను. వీటిలో ΄్లాంట్ వరల్డ్స్ అండ్ ది సైంటిఫిక్ లెగసీస్ ఆఫ్ కలోనియలిజం ఈ యేడాది తీసుకువచ్చాను. ది బయోపాలిటిక్స్ ఆఫ్ హిందూ నేషనలిజం సొసైటీ ఫర్ లిటరేచర్ బుక్ ప్రైజ్‌ను గెలుచుకుంది. ఈ పుస్తకం భారతదేశంలో పుట్టుకువస్తున్న జాతీయవాద రాజకీయాలు, ఆధునికత, సైన్స్, మతం ఒకదానికి ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో తెలియజేస్తుంది’ అని వివరిస్తుంది. భాను సుబ్రమణ్యం స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో పెరిగారు. దీంతో బ్రిటిషర్లు దేశంలో మూలాంశాలను ఎలా మార్చేశారో తెలుసుకున్నారు. ఫెమినిస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యయనాల కోసం అమెరికాలో పరిణామాత్మక జీవశాస్త్రంలో పీహెచ్‌డి చేశారు. తన రచనల ద్వారా జీవశాస్త్ర పండితురాలిగా పేరొందారు. ఈ ఏడాది జూలైలో జరిగే అంతర్జాతీయ బొటానికల్ కాంగ్రెస్‌లో పాల్గొని, అనేక సవరణలపై చర్చించబోతున్నారు.మొక్కల శాస్త్రీయ నామకరణాన్ని నియంత్రించే అంతర్జాతీయ కోడ్‌కు బాధ్యత వహించే నామకరణ విభాగం, వర్గీకరణ, శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన అనేక సవరణలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రోఫెసర్ సమావేశంలో ΄ాల్గొన బోతున్నారు. ఏడేళ్ల క్రితం జరిగిన సమావేశంలో తీసుకున్న కోడ్ మెకానిజంలో అనుచితమైనవిగా పరిగణించబడే మరెన్నో మొక్కల పేర్లను ఈ సమావేశం తిరస్కరించవచ్చు. దీని వెనకాల ఈ సీనియర్ ప్రోఫెసర్ చేస్తున్న కృషి మనల్ని ఆలోచింపజేస్తుంది. వలసవాదం సుసంపన్నమైన వృక్ష ప్రపంచాలను జీవశాస్త్ర జ్ఞానంగా ఎలా మార్చింది అనే క్లిష్టమైన చరిత్రను అన్వేషించడానికి బాను సుబ్రమణ్యం దేశీయ అధ్యయనాలను శోధించారు. లాటిన్-ఆధారిత నామకరణ వ్యవస్థ, మొక్కల లైంగికతను వివరించడానికి యూరోపియన్ ఉన్నత వర్గాల ఊహాజనిత విధానాలను ‘బాటనీ ఆఫ్ ఎంపైర్’ పుస్తకం ద్వారా వివరించారు. వలసవాదులు మొక్కల కాలపు లోతైన చరిత్రను ఎలా నిర్మూలించారో మనం ఇందులో చూస్తాం. జాత్యాహంకారం, బానిసత్వం, వలసవాద చరిత్రలలోని దాని మూలల నుండి కేంద్రీకృతమైన వృక్షశాస్త్రానికి సంబంధించిన మరింత సమగ్రమైన, సామర్థ్యం గల రంగాన్ని ఊహించడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. -
Gyanvapi: కోర్టుకు చేరిన జ్ఞానవాపి సర్వే నివేదిక
వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో చేపట్టిన శాస్త్రీయ సర్వే నివేదికను సోమవారం ఏఎస్ఐ(ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) అధికారులు సీల్డు కవర్లో వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించారు. దీనిపై ఈ నెల 21న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న 17వ శతాబ్ధం నాటి మసీదును అప్పట్లో ఉన్న ఆలయంపైనే నిర్మించారంటూ అందిన పలు పిటిషన్లపై కోర్టు సర్వే చేపట్టాలని జూలైలో ఆదేశించిన విషయం తెలిసిందే. సర్వే నివేదిక ప్రతులను ముస్లిం పక్షం వారికి కూడా ఏఎస్ఐ అధికారులు అందజేసినట్లు హిందూ పిటిషనర్ల తరఫున న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ వెల్లడించారు. తదుపరి విచారణ 21న ఉంటుందని కోర్టు పేర్కొందని తెలిపారు. సర్వే నివేదిక వివరాలను బహిర్గతం చేయరాదంటూ ముస్లిం పక్షం కోర్టులో వేసిన పిటిషన్‌ను తాము సవాల్ చేస్తామన్నారు. మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతల శిల్పాల వద్ద పూజలు చేసేందుకు అనుమతించాలంటూ కొందరు మహిళలు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జూలై 21న జిల్లా కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత నిర్మాణాలకు ఎటువంటి నష్టం కలగని రీతిలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని శాస్త్రీయంగా సర్వే చేపట్టాలని ఏఎస్ఐకి పురమాయించింది. ‘మసీదు గోపురాలు, సెల్లార్లు, పశ్చిమ దిక్కు గోడ కింద సర్వే చేయాలి. పిల్లర్ల వయస్సును నిర్ధారించాలి. భవనం రీతిని విశ్లేషించాలి’అని సూచించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా చుక్కెదురైంది. ఏఎస్ఐ అధికారులు సకాలంలో సర్వేను పూర్తి చేయలేకపోవడంతో కోర్టు ఆరు పర్యాయాలు గడువును పొడిగించింది. కృష్ణ జన్మభూమి–షాహీ ఈద్గా కేసు విచారణ వాయిదా ప్రయాగ్‌రాజ్: మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై వచ్చే జనవరి 9వ తేదీన విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టుకు తెలిపింది. దీంతో, సర్వే కమిషన్ విధివిధానాలు, కూర్పుపై సోమవారం జరగాల్సిన విచారణను హైకోర్టు వాయిదా వేసింది. హిందూ ఆలయంపైనే మసీదును నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయంటూ కొందరు వేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు.. మసీదు సర్వేను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అధికారిని నియమించేందుకు అంగీకరించింది. -
షాహీ ఈద్గాలో సర్వేపై స్టేకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గాలో సర్వే చేపట్టాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టు పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సర్వేను పరిశీలించేందుకు అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించేందుకు కూడా అంగీకరించింది. ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలంటూ శుక్రవారం షాహి మసీద్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ ట్రస్ట్ చేసిన వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను పిటిషన్ రూపంలో సవాల్ చేయాలని సూచించింది. దీనితో పాటు దీనిపై ట్రస్ట్ వేసిన మరో పిటిషన్‌పై కూడా జనవరి 9వ తేదీన విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. -
షాహీ ఈద్గాలో సర్వే చేయండి
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని మథుర నగరంలో శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశంలో షాహీ ఈద్గాను నిర్మించారంటూ దాఖలైన కేసు గురువారం కీలక మలుపు తీసుకుంది. కోర్టు పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న మసీదు ప్రాంగణంలో ఒకప్పటి హిందూ ఆలయ ఆనవాళ్లు ఉన్నాయంటూ కోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సర్వే కోసం కమిషనర్‌ను నియమించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. ‘త్రిసభ్య కమిషన్ ఈ సర్వేను పర్యవేక్షిస్తుంది. సర్వే సందర్భంగా అక్కడి కట్టడాలు దెబ్బ తినకుండా చూడాలి. డిసెంబర్ 18న జరిగే ఈ కేసు తదుపరి విచారణలో సర్వే విధివిధానాలపై నిర్ణయం తీసుకుంటాం. శాస్త్రీయ సర్వేను ఇరు పక్షాల తరఫు ప్రతినిధులు ప్రత్యక్షంగా గమనించవచ్చు. పూర్తి పారదర్శకమైన నివేదికను కోర్టును కమిషన్ అందించాలి. ఈ నివేదికపై అభ్యంతరాలుంటే ఈద్గా తరఫు లాయర్లు తమ అభ్యంతరాలు తెలుపుతూ కోర్టును ఆశ్రయించవచ్చు’ అని జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ తన ఉత్వర్వులో పేర్కొన్నారు. కాగా, కోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తా మని షాహీ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ తెలిపింది. ఇటీవలి కాలంలో ఆలయం–మసీదు వివాదాల్లో అలహాబాద్ హైకోర్టు ఇలా సర్వేకు ఆదేశాలివ్వడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవలే వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలివ్వడం, సర్వే పూర్తయి భారత పురావస్తు శాఖ నుంచి తుది నివేదిక కోసం వేచి ఉన్న సంగతి తెల్సిందే. ‘‘మసీదు ప్రాంగణంలో కమలం ఆకృతిలో ఉన్న పునాదులతో ఒక నిర్మాణం ఉంది. అది హిందువులు పూజించే శేషనాగును పోలి ఉంది. పునాదిపై హిందూ మత సంబంధ గుర్తులు, నగిïÙలు స్పష్టంగా కనిపిస్తున్నాయి’’ అని ఇటీవల పిటిషనర్ తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ కోర్టులో వాదించారు. -
Gyanvapi case: జ్ఞానవాపి నివేదికకు మరో 10 రోజుల గడువు
వారణాసి(యూపీ): జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) శాస్త్రీయ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించేందుకు మరో 10 రోజుల గడువును వారణాసి జిల్లా కోర్టు మంజూరుచేసింది. నవంబర్ 17(శుక్రవారం)లోగా సర్వే వివరాలను నివేదించాలని గతంలో ఆదేశించగా మరో 15 రోజుల గడువుకావాలంటూ శుక్రవారం కోర్టును ఏఎస్ఐ తరఫు లాయర్లు అభ్యర్థించారు. టెక్నికల్ రిపోర్ట్ ఇంకా అందుబాటులో లేని కారణంగా గడువును పెంచాలని ఏఎస్ఐ కోరడంతో జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్ నవంబర్ 28 వరకు గడువు ఇచ్చారని హిందువుల తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ వెల్లడించారు. ఆలయ పురాతన పునాదులపైనే 17వ శతాబ్దంలో మసీదు నిర్మించారంటూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ సర్వే చేపట్టిన విషయం తెల్సిందే. ఆగస్టు నాలుగో తేదీన నివేదిక సమర్పించాలని మొట్టమొదటిసారిగా కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసు విచారణల సందర్భంగా గడువు పొడిగిస్తూ వచ్చారు. తాజాగా గడువును జిల్లా కోర్టు నవంబర్ 28గా నిర్దేశించింది. ‘న్యాయం జరగాలంటే సర్వే జరగాల్సిందే’ అంటూ వారణాసి కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సమర్థించడంతో ఈ సర్వే ప్రక్రియకు తొలి అడుగు పడింది. -
అప్రమత్తత అవసరం
మరపునపడిందనుకున్న ఆ పేరు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. మనిషి మెదడును దెబ్బ తీసే ప్రాణాంతక నిపా వైరస్ (ఎన్ఐవీ) మరోసారి దేశంలో జడలు విప్పుతోంది. వస్తూనే కేరళలో ఇద్దరి ప్రాణాలు బలి తీసుకొని, పాజిటివ్ వచ్చిన మరికొందరి ఆరోగ్యాన్ని అయోమయంలోకి నెట్టి, సన్నిహితంగా మెలిగిన మరో 800 మందిపై వైద్యపర్యవేక్షణ పెట్టాల్సిన పరిస్థితి తెచ్చింది. వీరిలో 77 మంది ప్రమాదస్థితిలో ఉన్నారనీ, వైరస్ సోకినవారిలో 155 మంది ఆరోగ్య కార్యకర్తలూ ఉన్నారనీ వస్తున్న వార్త ఆందోళన పెంచుతోంది. నిపా సోకితే సహాయక చికిత్సే తప్ప, రోగాన్ని తగ్గించే మందులు కానీ, నివారించే టీకా కానీ ఇప్పటిదాకా లేకపోవడమే పెద్ద సమస్య. కోళిక్కోడ్ జిల్లాలోని 9 గ్రామ పంచాయతీలను ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి, స్కూళ్ళు – ఆఫీసులు – ప్రజారవాణాకు సెలవిచ్చి, సభలూ సమావేశాలపై నియంత్రణలు పెట్టాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేరళలో మొదలైన ఈ ప్రకంపనలు ఇప్పుడు దేశం మొత్తాన్నీ అప్రమత్తం చేస్తున్నాయి. కలుషిత ఆహారం, రోగితో సాన్నిహిత్యం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించడం నిపా వైరస్ స్వభావం. 1998లో తొలిసారిగా మలేసియా, సింగపూర్లలో పందుల పెంపకందార్లలో, వాటితో సన్నిహితంగా మెలిగే ఇతరుల్లో ఈ వైరస్ తొలిసారి బయటపడింది. అప్పట్లో 300 పైచిలుకు మందికి వైరస్ సోకితే, వంద మందికి పైగా మరణించారు. ఆపై అది వేలాది మైళ్ళు ప్రయాణించి, వివిధ దేశాలకు విస్తరించడం, వైరస్ సోకినవారిలో 72 నుంచి 86 శాతం మంది మరణించడం సంచలనమైంది. వైరస్ సోకిన గబ్బిలాలు, పందుల శరీరద్రవాల ద్వారా మనుషుల కిది వ్యాపిస్తుందట. నిపా సోకితే జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, తలనొప్పి, వాంతులతో మొదలై పరిస్థితి తీవ్రమైతే మెదడువాపు, మూర్ఛలతో రోగి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాట. 1998 – 2015 మధ్య 600కు పైగా కేసులు వచ్చాయని అది లెక్క తేల్చింది. ఈ మాయదారి వైరస్ మన దేశంలో పంజా విసరడం ఇదేమీ తొలిసారి కాదు. గడచిన అయి దేళ్ళలో ఇది నాలుగోసారి. మెదడు మీద దాడి చేసే ఈ అనారోగ్య భూతం 2018 మేలో మొదటిసారి వచ్చినప్పుడు దానిని కట్టడి చేసేలోగా వైరస్ సోకిన 23 మందిలో 21 మంది మరణించారు. ఆ తరువాత 2019, 2021ల్లో కూడా కేరళ తీరాన్ని ఈ వైరస్ తాకింది. మలబారు సీమలో బయటపడ్డ ఈ తాజా నిపా కేసులకు బంగ్లాదేశ్ వేరియంట్ కారణమని గుర్తించారు. మిగతావాటితో పోలిస్తే ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువే అయినా, సోకినవారిలో సగటున నూటికి 70 మంది మరణిస్తున్నారన్న గణాంకాలు గుబులు రేపుతున్నాయి. రోగులకు సన్నిహితంగా మెలిగినవారు ఐసొలేషన్‌లోకి వెళ్ళడం, జనమంతా మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి కార్యాచరణ అయింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గబ్బిలపు వైరస్ పదేపదే విరుచుకు పడే ప్రమాదం ఎక్కువని మేలో రాయిటర్స్ పరిశోధన తేల్చింది. విచ్చలవిడిగా అడవుల నరికివేత, ఇష్టారాజ్యపు పట్టణీకరణ, ఫలితంగా వన్యప్రాణులతో మానవ సంఘర్షణ – వీటన్నిటి పర్యవసానం ఇదని ఆ పరిశోధన గుర్తించింది. ఇక, మన దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా 8 రాష్ట్రాల్లోని గబ్బిలాల్లో ఈ ప్రాణాంతక వైరస్ ఛాయలున్నట్టు ఈ ఏడాది జూలైలో భారతీయ వైద్య పరిశోధనా మండలి అధ్యయనం సైతం నిర్ధరించింది. అయితే, కేరళపైనే తరచూ ఈ వైరస్ దాడికి కారణం – జనసాంద్రత, భౌగోళిక పరిస్థితులు, వానలంటూ రకరకాల ప్రచారాలున్నాయి. కచ్చితమైన కారణా ల్నింకా కనిపెట్టాల్సి ఉంది. ప్రస్తుతానికి కేంద్ర బృందం కేరళ వెళ్ళి సంక్షోభంలో సాయపడుతోంది. నిపాకు ప్రధాన కారణమని భావిస్తున్న ఫ్రూట్ బ్యాట్స్ (పండ్లను కొట్టే గబ్బిలాల) సంఖ్య కేరళలో ఎక్కువైతే కావచ్చు కానీ, వాటి నిర్మూలన కుదరదు. కాబట్టి, ఒకేచోట, ఒకేలా కాకపోయినా ఏటా నిపా వైరస్ ముప్పు తప్పదని గ్రహించి, కేరళ సహా అన్ని రాష్ట్రాలూ జాగ్రత్తపడాలి. జంతువుల నుంచి మానవులకు సోకే ఇలాంటి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల ఆనుపానులు పసిగట్టేందుకు మహమ్మారులపై పరిశోధన అవసరం. కానీ, కేరళే కాదు... కేంద్రం కూడా నిపాపై తగినంత శ్రద్ధ చూపలేదనే చెప్పాలి. పుణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తరహాలో తిరువనంతపురంలో అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పినా, అది ఇప్పటికీ పూర్తిగా కార్యాచరణలోకి దిగలేదు. అంతకంతకూ పెరుగు తున్న సాంక్రమిక వ్యాధుల రీత్యా తక్షణమే ఆ సంస్థ సేవలపై దృష్టి సారించాలి. 2018 నిపా తాకి డిలో, తర్వాత కరోనా కాలంలో సమర్థనీయంగా పనిచేసిన కేరళ మరోసారి కృతనిశ్చయం చూపాలి. ఇప్పటి వరకు ఇండియా, బంగ్లాదేశ్, సింగపూర్, మలేసియా, ఫిలిప్పీన్స్ లాంటి ఆసియా దేశాలకే ఈ వైరస్ పరిమితమైంది. ప్రపంచంలోని ఇతర దేశాలకు ఇది విస్తరించకపోవడం అదృష్టమే. కానీ, భవిష్యత్తులో విస్తరించదనే నమ్మకం ఏమీ లేదు. వైరస్ల విజృంభణలు, ప్రాణాంతక రోగాలు... ప్రపంచానికి కొత్త కాకపోవచ్చు. అయితే, చికిత్స లేని రోగాలు, వైరస్‌లపై శాస్త్రీయ పరిశోధనలతో ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా పోరాడాల్సిన అవసరాన్ని తాజా నిపా కేసులు గుర్తుచేస్తున్నాయి. నిన్న కాక మొన్న కరోనా కట్టడిలో అలాంటి పోరే మానవాళికి మేలు చేసిందని మరచిపోరాదు. అయితే, అందుకై పరిశోధన – అభివృద్ధి విభాగానికి కావాల్సిన వనరుల్ని అందించడం తక్షణ అవసరం. ఈలోగా చేతుల శుభ్రత, మాస్కుధారణ, స్వచ్ఛమైన ఆహారాన్నే భుజించడం సదా ఆరోగ్యమనీ, అది మన చేతుల్లోని పని అనీ అందరం గుర్తించాలి. ఎందుకంటే... చికిత్స కన్నా నివారణ, భయం కన్నా అప్రమత్తతే పరమౌషధం! -
జ్ఞానవాపి మసీదులో రెండోరోజూ సర్వే
వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో పురావస్తు శాఖ(ఏఎస్ఐ) అధికారుల సర్వే రెండో రోజూ కొనసాగింది. హిందూ ఆలయ నిర్మాణంపైనే 17వ శతాబ్దంలో ఈ మసీదును నిర్మించారనే పిటిషన్‌పై వారణాసి కోర్టు శాస్త్రీయ సర్వేకు ఆదేశించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వే పనులు సాగాయి. ఏఎస్ఐ అధికారులతోపాటు ప్రభుత్వ న్యాయవాది రాజేశ్ మిశ్రా, ఐఐటీ కాన్పూర్ నిపుణులు, అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సభ్యులు అక్కడున్నారు. ఆదివారం కూడా సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సర్వేకు పూర్తిగా సహకరిస్తున్నట్లు మసీదు కమిటీ తెలిపింది. మసీదులో శాస్త్రీయ సర్వే జరపాలంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచి్చన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు సమరి్థంచడం తెలిసిందే. సెప్టెంబర్ 4 లోగా సర్వే పూర్తి చేయాలని శుక్రవారం వారణాసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
జ్ఞానవాపీ మసీదులో సర్వేకు ఓకే
ప్రయాగ్‌రాజ్/వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే జరపాలంటూ పురావస్తు శాఖ(ఏఎస్ఐ)కు దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. శాస్త్రీయ సర్వేకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. జిల్లా కోర్టు ఉత్తర్వు సముచితమేనని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకునే ఉన్న జ్ఞానవాపీ మసీదు ఆలయంపైనే నిర్మించిందా లేదా తేల్చేందుకు ఏఎస్ఐ శాస్త్రీయ సర్వే జరపాలంటూ వారణాసి జిల్లా కోర్టు జూలై 21న అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలపై అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మసీదు కమిటీకి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలంటూ ఏఎస్ఐ సర్వేపై జూలై 26 సాయంత్రం 5వరకు స్టే ఇచ్చింది. ఈ మేరకు మసీదు కమిటీ సర్వేను ఆపాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై అలహాబాద్ హైకోర్టు సీజే ధర్మాసనం జూలై 27 వరకు హిందు, మసీదు కమిటీ వర్గాల వాదనలు విని, తీర్పు రిజర్వు చేసింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మసీదు ఆవరణలో ఏఎస్ఐ అధికారులు తక్షణమే తమ పనులు ప్రారంభించవచ్చని, సర్వేలో భాగంగా ఆ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు జరపరాదని స్పష్టం చేసింది. ఏఎస్ఐ అధికారులు సర్వేను శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకు సహకరించాలంటూ ఏఎస్ఐ తమను కోరిందని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఎస్.రాజలింగం తెలిపారు.జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సర్వే నిలుపుదల కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. -
ఏఎస్ఐ సర్వేపై సుప్రీంకోర్టుకు జ్ఞానవాపి మసీదు కమిటీ
న్యూఢిల్లీ: యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ పిటిషన్‌పై సత్వరమే విచారణ చేపట్టాలని కోరింది. ఈ పిటిషన్ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందుకు రానుంది. జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన అన్ని ఉత్తర్వులపై వెంటనే స్టే ఇవ్వాలని మసీదు కమిటీ కోరుతోంది. ఇప్పటికే జూలై మొదటి వారంలోనే ఈ పిటిషన్ వేసింది. అయితే, విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలంటూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో మసీదు కమిటీ సత్వర విచారణ కోరుతోంది. -
వ్యోమగాముల మెదడుకు ముప్పు!
అంతరిక్ష ప్రయోగాలంటే అందరికీ ఆసక్తే. అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి వ్యోమగాములు (అస్ట్రోనాట్స్) శ్రమిస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉండాల్సి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్), నాసా స్పేస్ షటిల్స్‌లో వ్యోమగాములు నెలల తరబడి గడపాల్సి ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా కొన్నిసార్లు సంవత్సరానికిపైగానే అంతరిక్షంలో ఉండిపోవాలి. భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగా అక్కడ ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాముల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ప్రధానంగా మెదడులో జరిగే మార్పులేమిటి? దీనిపై అమెరికా సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. ఈ వివరాలను ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురించారు. ► అధ్యయనంలో భాగంగా 30 మంది అస్ట్రోనాట్స్ బ్రెయిన్ స్కానింగ్‌లను క్షుణ్నంగా పరిశీలించారు. అంతరిక్షంలోకి వెళ్లడానికి ముందు, వెళ్లివచ్చిన తర్వాత బ్రెయిన్ స్కానింగ్‌లను సేకరించి, పరిశీలించారు. ► 30 మందిలో 8 మంది రెండు వారాలపాటు అంతరిక్షంలో ఉన్నారు. 18 మంది ఆరు నెలలు, నలుగురు దాదాపు సంవత్సరంపాటు అంతరిక్షంలో ఉండి వచ్చారు. ► ఆరు నెలలకుపైగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల మెదడులోని జఠరికలు(వెట్రికల్స్) కొంత వెడల్పుగా విస్తరించినట్లు గుర్తించారు. ఈ మార్పు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉందంటున్నారు. ► మెదడులోని ఖాళీ భాగాలనే జఠరికలు అంటారు. ఇందులో సెరిబ్రోస్పైనల్ ద్రవం ఉంటుంది. వర్ణ రహితమైన ఈ ద్రవం మెదడుచుట్టూ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మెదడుకు రక్షణ కల్పిస్తుంది. వ్యర్థాలను తొలగిస్తుంది. ► జఠరికల విస్తరణ వల్ల మెదడులోని కణజాలం ఒత్తిడికి గురవుతున్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని చెబుతున్నారు. జఠరికల్లో మార్పుల కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న దానిపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ► అంతరిక్షంలో ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత ఎక్కువగా జఠరికల్లో మార్పులు సంభవిస్తాయని, తద్వారా మెదడు పరిమాణం పెరిగి, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని గమనించినట్లు సైంటిస్టు రేచల్ సీడ్లర్ చెప్పారు. ఆరు నెలలకుపైగా ఉన్నవారికే ముప్పు ఉన్నట్లు తేలిందని అన్నారు. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక మెదడు ఎప్పటిలాగే సాధారణ స్థితికి చేరుకోవడానికి 3 సంవత్సరాలు పడుతున్నట్లు వివరించారు. ► భూమిపై మనిషి శరీరంలో రక్తప్రసరణ ఒక క్రమపద్ధతిలో సాగుతుంది. నరాల్లో కవాటాలు(వాల్వులు) ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తితో రక్తం పైనుంచి పాదాల్లోకి ప్రవహించి, అక్కడే స్థిరపడకుండా ఈ కవాటాలు అడ్డుకుంటాయి. గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో ఇందుకు వ్యతిరేక దిశలో జరుగుతుంది. రక్తం, ఇతర ద్రవాలు నరాల గుండా తలలోకి చేరుకుంటాయి. తలపై ఒత్తిడిని కలుగజేస్తాయి. దీనివల్ల మెదడులో జఠరికలు విస్తరిస్తున్నట్లు, కపాలంలో మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ► ఆరు నెలల్లోగా అంతరిక్షం నుంచి తిరిగివచ్చేవారికి ప్రమాదం ఏమీ లేదని, వారి మెదడులో చెప్పుకోదగ్గ మార్పులేవీ కనిపించడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Khosta-2: గబ్బిలాల నుంచి మానవాళికి కొత్త వైరస్!
కరోనాకి ముందు.. కరోనా తర్వాత అన్నచందాన తయారు అయ్యింది మనిషి పరిస్థితి. కొత్త కొత్త వైరస్లు, వ్యాధుల పేర్లు వినాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు గబ్బిలాల నుంచే మానవాళికి మరో ముప్పు పొంచి ఉందని అమెరికన్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఖోస్టా-2.. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే స్వభావం ఉన్న వైరస్ పేరు. ఇది రష్యా గబ్బిలాలో 2020లోనే గుర్తించామని, అది ఆ సమయంలో అది మనుషులకు అంతగా ప్రమాదం కలిగిస్తుందని అనుకోలేదని సైంటిస్టులు చెప్తున్నారు. సుదీర్ఘ పరిశోధనల అనంతరం.. ఇప్పుడు ఇది మనిషి కణజాలంపై తీవ్ర ప్రభావం చూపెడుతుందని, వైరస్ గనుక మనుషులకు వ్యాపిస్తే.. విజృంభణ, ముప్పు రెండూ తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను జర్నల్ పీఎల్ఓఎస్లో పబ్లిష్ చేశారు. కరోనా కంటే డేంజర్! Khosta-2.. కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ అని అమెరికా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మనిషి కణాలకు ఇన్ఫెక్షన్ సోకించడంతో పాటు ప్రస్తుత వ్యాక్సిన్లకు ఈ వైరస్ నిరోధకతను కలిగి ఉంటుందని సైంటిస్టులు నిర్దారించారు. అంటే.. కరోనా వైరస్ నుంచి ఉపశమనం కోసం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీస్పైనా తీవ్ర ప్రభావం కూడా చూపెడుతుందని వెల్లడించారు. ఖోస్టా-2 అంటే.. ఖోస్టా-2.. సార్స్-కోవ్-2కి చెందిన వైరస్. ఇది కూడా కరోనావైరస్లోనే ఉపవర్గానికి చెందిన వైరస్సే. టైమ్ మ్యాగజైన్ కథనం ప్రకారం.. ఖోస్టా-1 అనేది మనుషులకు సోకదు. కానీ, ఖోస్టా-2 మాత్రం మనుషుల్లో ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. ఒమిక్రాన్ వేరియెంట్ నుంచి కోలుకున్న వాళ్లు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు దీని బారి నుంచి తప్పించుకోలేరు. Omicron వేరియంట్ లాగా.. ఈ వైరస్‌లో తీవ్రమైన వ్యాధిని కలిగించే జన్యువులు లేవని పరిశోధకులు అంటున్నారు. కానీ SARS-CoV-2 జన్యువులతో కలిస్తే అది చివరికి మారే అవకాశాలు ఉన్నాయని ఈ అధ్యయనం నిర్వహించిన మైకేల్ లెట్కో. గబ్బిలాలతో పాటు పాంగోలిన్స్, రకూన్ డాగ్స్, పామ్ సివెట్స్ జీవుల ద్వారా ఖోస్టా-2 వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఈ వైరస్ విజృంభణపై, వ్యాక్సినేషన్ తయారీపై ఒక అంచనాకి రాలేమని ఆయన అంటున్నారు లెట్కో. దురదృష్టవశాత్తూ, ప్రస్తుత వ్యాక్సిన్లు మానవ కణజాలంపై ప్రభావం చూపెడుతున్న.. నిర్దిష్ట వైరస్ల కోసం రూపొందించబడుతున్నాయని, అన్ని సార్బెకోవైరస్ల నుంచి రక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయనే నమ్మకం సన్నగిల్లుతోందని అని ఆయన అంటున్నారు. ఇదీ చదవండి: ఈ దోమలు.. మలేరియాను అడ్డుకుంటున్నాయోచ్! -
శాస్త్రశోధనల గొంతు నొక్కితే ఎలా?
పర్యావరణ పరిరక్షణ విషయంలో ఇండియా పనితీరు అట్టడుగున ఉందని యేల్ యూనివర్సిటీ విడుదల చేసిన ‘ది ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్’ బయటపెట్టింది. దీన్ని కేంద్రం విమర్శించినప్పటికీ, ఇది దేశంలోని శాస్త్ర పరిశోధనా సంస్థల స్వయం ప్రతిపత్తిపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తన పరిశోధనా వ్యాసాలను ప్రచురించే ముందుగా వాటిని అధికారుల పరిశీలన కోసం పంపాలని కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసిన హుకుం ఒకటి బయటపడింది. సామాజిక స్థాయిలో కోవిడ్ వ్యాప్తిని నిర్ధారించే సమాచారాన్ని తొక్కిపెట్టేసినట్లు కూడా వార్తలున్నాయి. దేశ రక్షణ ప్రాజెక్టులను మినహాయిస్తే, మిగిలిన పరిశోధనలపై చర్చించేందుకూ, సమర్థించుకునేందుకూ శాస్త్రవేత్తలకు స్వాతంత్య్రముండాలి. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియా అట్టడుగున ఉందని ఇటీవలే విడుదలైన ‘ది ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్’ (ఈపీఐ) తెలపడం దేశంలో శాస్త్ర పరిశోధన సంస్థల స్వయం ప్రతిపత్తిపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. అమెరికాలోని సుప్రసిద్ధ యేల్ విశ్వవిద్యాలయం సిద్ధం చేసిన ఈ జాబితాపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితి వంటి పదకొండు వర్గాల్లో సుమారు 40 అంశాలను పరిశీలించి యేల్ యూనివర్సిటీ ‘ఈపీఐ’ని సిద్ధం చేయగా కేంద్రం మాత్రం ఈ అంశాల ఎంపికే తప్పని విమర్శించింది. అత్యధిక సమాచారం అవసరమయ్యే అంశాల ఆధారంగా ఒక దేశం పర్యావరణం, వన్యప్రాణి ఆవాస పరిరక్షణలకు చేస్తున్న ప్రయత్నా లను మదింపు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. అయితే కొన్ని ఆసక్తికరమైన పరిణామాలను ఇక్కడ మనం పరిగణనలోకి తీసు కోవాల్సి ఉంటుంది. ఈపీఐ విడుదలైన నేపథ్యంలోనే కేంద్రం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వ్యవహారం ఒకటి వెలుగు లోకి వచ్చింది. డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) తన పరిశోధనా వ్యాసాలను ప్రచురించే ముందుగా వాటిని అధికారుల పరిశీలన కోసం పంపాలని కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసిన హుకుం ఒకటి బయటపడింది. అంటే యేల్ లాంటి సంస్థలు తప్పుడు అవగాహనతో, సమాచారాన్ని ఊహించుకుని ఈపీఐ వంటి జాబితాలను రూపొందిస్తున్నాయని ఆరోపిస్తూనే... ఇంకోవైపు పర్యావరణ సంబంధిత శాస్త్రీయ సమాచారాన్నిచ్చే సంస్థల గొంతు నొక్కే ప్రయత్నం కేంద్ర మంత్రిత్వ శాఖ చేస్తోందన్నమాట! నిజానికి ఇలా మంత్రిత్వ శాఖలు పరిశోధన సంస్థల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం కొత్తేమీ కాదు. డబ్ల్యూఐఐ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థే అయినప్పటికీ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోనే పనిచేస్తూం టుంది. ఇతర మంత్రిత్వ శాఖల్లోనూ ఇలాంటి సంస్థలు చాలానే ఉన్నాయి. నిధుల వితరణ మొదలుకొని అనేక అంశాల్లో మంత్రిత్వ శాఖలు సంస్థల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తూంటాయి. కరోనా మహమ్మారి ప్రబలిన సందర్భంలోనూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), వైద్య పరిశోధన విభాగాలు 2020 మే నెలలోనే దేశంలో సామాజిక స్థాయిలో కోవిడ్ వ్యాప్తిని నిర్ధారించే సమాచారాన్ని తొక్కిపెట్టేసినట్లు వార్తలున్నాయి. ఈ వివరాలు ప్రచురి తమై ఉంటే వైరస్ నియంత్రణలో కేంద్రం భేషుగ్గా పనిచేస్తోందన్న ప్రచారంలోని డొల్లతనం ఇట్టే బయటపడేది. ఆ తరువాతి కాలంలో ఇదే విషయం రుజువైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు తమ పరిధిలోకి రాని పరిశోధనా సంస్థలపై కూడా పెత్తనం చలాయించే ప్రయత్నాలు చేసిన సందర్భాలు బోలెడు. భారత్‌లో ఎన్డీఎం–1 సూపర్ బగ్ ఉనికిని బ్రిటిష్ శాస్త్రవేత్తలు బట్టబయలు చేసినప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ రెండూ ఈ అంశంపై వ్యాఖ్యానించకుండా ప్రైవేట్ సంస్థ లనూ హెచ్చరించినట్లు సమాచారం ఉంది. వైద్యం కోసం పలువురు విదేశీయులు భారత్‌కు విచ్చేస్తున్నారన్న ‘మెడికల్ టూరిజం’ దెబ్బ తినకుండా ఈ ప్రయత్నం అన్నమాట. అయితే కొన్ని నెలల తరువాత ఆరోగ్య శాఖ స్వయంగా ఎన్డీఎం–1 కారణంగా కొన్ని మందులకు నిరోధకత ఏర్పడుతున్నట్లు అంగీకరించాల్సి వచ్చింది. ఈ అంశంపై ఒక టాస్క్‌ఫోర్స్‌నూ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నావీ1సీ పేరుతో ప్రయోగించిన ఓ ఉపగ్రహంలో తీవ్రస్థాయి లోపాలున్నాయనీ,వైఫై సిగ్నళ్లకు స్పందిస్తోందనీ 2018లో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల శాస్త్రవేత్తలు గుర్తించగా... ఇస్రో వారి గొంతును నొక్కేసిందని సమాచారం. డబ్ల్యూఐఐ, నాగ్‌పూర్ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (నీరి) వంటివి ఈ దేశానికి చాలా కీలకమైనవి. ప్రభుత్వ విధానాల రూపకల్పనకూ, పర్యావరణ పర్యవేక్షణకూ అవసరమైన పలు అంశాలపై ఈ సంస్థలు పరిశోధనలు చేస్తూంటాయి. భారీ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే ముందు వాటి కారణంగా వన్యప్రాణులకు, పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై కూడా ఈ సంస్థలే నివేదికలివ్వాలి. 1990ల మధ్యలో డబ్ల్యూఐఐ శాస్త్రవేత్తలు దేశంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల దయనీయ పరిస్థితిపై ఓ శాస్త్రీయ జర్నల్‌లో ప్రచురించడం ఒక రకంగా సంచలనం సృష్టించిం దని చెప్పాలి. తూర్పు తీర ప్రాంతంలో ఈ తాబేళ్లకు భారీ ప్రాజెక్టులు, యాంత్రిక ట్రాలింగ్ల కారణంగా మరింత విపత్తు రానుందని డబ్ల్యూఐఐ హెచ్చరించింది కూడా! గహిర్మాత బీచ్‌లో వేల తాబేళ్లు సంతానోత్పత్తి చేస్తూంటాయి. అయితే ఈ ప్రాంతానికి దగ్గరలోని ఓ ద్వీపంలో క్షిపణి పరీక్షా కేంద్రం ఒకటి ఏర్పాటు కావడంతో తాబేళ్ల ఉనికి ప్రశ్నార్థకమైంది. ‘‘డీఆర్డీవో వాడే ప్రకాశవంతమైన లైట్లు ఆ తాబేళ్లకు ప్రాణాంతకంగా మారాయి’’ అని డబ్ల్యూఐఐ శాస్త్రవేత్త ఒకరు విస్పష్టంగా తన పరిశోధనా వ్యాసంలో రాశారు. ఆ తరువాత డీఆర్డీవో శాస్త్రవేత్తలు లైట్ల కాంతిని నియంత్రిస్తామని ప్రకటించాల్సి వచ్చింది. పర్యావరణ సంబంధిత వ్యాజ్యాల్లో చాలా సందర్భాల్లో న్యాయ స్థానాలు కూడా పరిశోధనా సంస్థల, ఆయా రంగాల్లో నిపుణుల ‘స్వతంత్ర’ నివేదిక కోసం అడుగుతూంటాయి. చార్ధామ్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టుల విషయాన్నే ఉదాహరణగా తీసుకుంటే... జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పినా పర్యావరణ సంబంధిత ఆందోళనలను సమాధాన పరిచేందుకు ఓ పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సాంకేతిక సహాయం డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ‘నీరి’ అందించాయి. ఐఐటీ రూర్కీ వంటి సంస్థలు తయారు చేసిన నివేదికలు పలు జలవిద్యుత్ కేంద్రాలకు అనుమతు లివ్వడంలో ఉపయోగపడ్డాయి. అయితే గతంలో ‘నీరి’ నివేదికలపై కూడా చాలా విమర్శలు వచ్చిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ప్రాజెక్టును ప్రతిపాదించిన వారికి అవి అనుకూలంగా ఉన్నాయని పలువురు వేలెత్తి చూపారు. మధుర రిఫైనరీ వల్ల జరుగుతున్న వాయు కాలుష్యాన్ని తక్కువగా చూపి, చిన్న పరిశ్రమలనే తాజ్‌మహల్ కాలుష్యానికి నిందించినట్టుగా ‘నీరి’పై ఆరోపణలున్నాయి. ‘నీరి’ డైరెక్టర్ సేవలను అవినీతి ఆరోప ణల నేపథ్యంలో అర్ధంతరంగా ముగించాల్సి రావడం, కొత్త డైరెక్టర్ నియామకంలో విపరీతమైన జాప్యం జరగడం ఇటీవలి పరిణామాలే. ఏతావాతా... దేశ పర్యావరణ పరిరక్షణకు కీలకమైన సేవ లందిస్తున్న జాతీయ స్థాయి పరిశోధనా సంస్థల వ్యవహారాల్లో వేలు పెట్టడం ఏ ఒక్కరికీ మంచి చేసే విషయం కాదు. దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో అన్ని స్థాయుల్లోనూ ఈ రకమైన ధోరణి పెరిగి పోతోంది. లక్ష్యిత ప్రయోజనాలు ఏమైనప్పటికీ శాస్త్రీయ పరిశోధన లను మాత్రం స్థిరంగా కొనసాగించాలి. దేశ రక్షణకు సంబంధించిన వ్యూహాత్మక ప్రాజెక్టులను మినహాయిస్తే మిగిలిన పరిశోధనల వివ రాలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి. తమ పరిశోధనలపై చర్చించేందుకూ, సమర్థించుకునేందుకూ శాస్త్రవేత్తలకు పూర్తి స్వాతంత్య్రం ఉండాలి. అయితే దేశంలో అత్యున్నత విధాన నిర్మాతలైన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌తో పాటు ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వంటి సంస్థలు ఈ స్వయం ప్రతిపత్తి విషయంలో మౌనంగా ఉంటున్నాయి. పరిస్థితి చేయి దాటక మునుపే మేలుకోవడం ఎంతైనా అవసరం! దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
శాస్త్రీయ అధ్యయనంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా అధ్యయనం చేశాక జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ముందుకు సాగించింది. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధ్యయన కమిటీని నియమించింది. ఈ కమిటీలోని ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశమై జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండాలి? సరిహద్దుల నిర్ధారణకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలేమిటి? దీనివల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఏ విధానం పాటించాలి? ఇలా అనేక అంశాలపై కూలంకషంగా చర్చించి మార్గదర్శకాలు రూపొందించారు. వాటి ఆధారంగా లోతైన అధ్యయనం తర్వాత 26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరోవైపు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల విభజన– ఆర్థిక అంశాలు, ఐటీ సంబంధిత విషయాలు, ఇతర అంశాలపై అధ్యయనం, మార్గదర్శకాల కోసం మరో నాలుగు సబ్ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. రవాణా, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కొత్త జిల్లాల్లో అవసరమైన మౌలిక వసతులు, కలెక్టరేట్లు, ఎస్పీ ఇతర జిల్లా కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తించింది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల అయ్యే వ్యయం, ఉద్యోగుల విభజన, దానికి సంబంధించిన విధివిధానాలు తదితర అంశాలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చింది. మరో రెండు కమిటీలు ఇతర అంశాలపై నివేదికలు ఇచ్చాయి. వాటి ఆధారంగా ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు సిద్ధమైంది. జనాభా గణన అంశంతో జాప్యం అయితే కేంద్రం జనాభా గణన చేపడుతూ అది పూర్తయ్యే వరకు జిల్లాల సరిహద్దులు మార్చవద్దని రాష్ట్రాలకు సూచించింది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడింది. కానీ కరోనా కారణంగా కేంద్రం జనాభా గణన చేపట్టలేదు. పలుమార్లు షెడ్యూల్‌ని ప్రకటించినా, కరోనా కారణంగా సాధ్యపడలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో జరిపిన సంప్రదింపుల తర్వాత 2022 జూన్ వరకు జనాభా గణన చేపట్టలేమని, అప్పటి వరకు జిల్లాల హద్దులు మార్చడంపై నిషేధం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను 2021 సంవత్సరం చివర్లో తిరిగి కొనసాగించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన కొత్త జిల్లాల ప్రతిపాదనలతో జనవరి 26న రిపబ్లిక్ డే రోజున ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనల కోసం 30 రోజుల గడువు ఇచ్చింది. సూచనలన్నింటిపై క్షుణ్ణంగా అధ్యయనం కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చిన అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసేందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లాల ఏర్పాటు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉండడంతో ప్రజల నుంచి వచ్చే ప్రతి అంశాన్ని పరిశీలించి, అవసరమైన సమాచారంతో విస్తృతంగా అధ్యయనం చేశాకే దానిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ ఈ కమిటీకి సూచించారు. సుమారు 17,500 సలహాలు, సూచనలు రావడంతో వాటిని 284 అంశాలుగా ఈ కమిటీ విభజించింది. ప్రతి అభ్యంతరం, పరిశీలనపై తొలుత సంబంధిత జిల్లా కలెక్టర్ సిఫారసు తీసుకుని, ఆ తర్వాత కమిటీ దాన్ని పరిశీలించి తన నిర్ణయాన్ని నమోదు చేసింది. ఈ కమిటీ సిఫార్సులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలించి తుది సిఫారసు చేసింది. ఇందులో భాగంగానే కొత్త జిల్లాల ఏర్పాటులో పలు మార్పులు జరిగాయి. అంతిమంగా వాటన్నింటినీ రాష్ట్ర మంత్రివర్గానికి పంపి అక్కడ ఆమోదం తీసుకున్నాక ఉగాది రోజున తుది నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తంగా జిల్లాల విభజన ప్రక్రియ అంతా పకడ్బందీగా, శాస్త్రీయంగా ఉండేలా ప్రభుత్వం అడుగడుగునా చర్యలు తీసుకుని.. అందుకనుగుణంగా ఆ పని పూర్తి చేసింది. -
Traditional Chinese Medicines: చైనా మందులు మహా ప్రమాదం!
సంప్రదాయ వైద్యం ప్రపంచానికి కొత్తేం కాదు. ఆసియాలో అందునా.. చైనా సంప్రదాయ మందులకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ గిరాకీ ఉంది. ఈ తరుణంలో శాస్త్రీయ ఆధారాల్లేని ఈ మందుల గురించి భయంకరమైన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ శాస్త్రీయతను విస్మరిస్తోందని, భద్రతా పరమైన సందేహాలకు ఇది తావిస్తోందని తాజాగా కొన్ని పరిశోధనలు బయటపెట్టాయి. న్యూయార్క్ స్టానీ బ్రూక్ యూనివర్సిటీలోని క్యాన్సర్ రీసెర్చర్ ఆర్థర్ గ్రోల్మన్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. టీఎంసీ(Traditional Chinese Medicines)లో Aristolochic అనే యాసిడ్ ఉంటుందని, ఇది కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు క్యాన్సర్‌కు దారి తీస్తుందని వెల్లడించారు. ‘సేఫ్టీ కన్సర్న్స్ ఆఫ్ ట్రెడిషినల్ చైనీస్ మెడిసిన్ ఇంజెక్షన్స్ యూజ్డ్ ఇన్ చైనీస్’ పేరిట ఆ రీసెర్చ్ నివేదిక వెలువడింది. ముఖ్యంగా టీసీఎం ఇంజెక్షన్లు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు రీసెర్చర్లు. క్లినికల్ ట్రయల్స్ లేకుండా, పక్షపాతమైన ధోరణిలో పరిశోధనతో వాటికి అనుమతి దొరుకుతోందని, ముఖ్యంగా పిల్లలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెడుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. టీసీఎం ప్రతికూల ఔషధ ప్రతిచర్యలు.. చైనాతో పాటు నైజీరియా, టాంజానియా, సౌతాఫ్రికాలోనూ కేసులు నమోదు అవుతున్నాయని ఈ పరిశోధనలు గుర్తించాయి. హాంకాంగ్‌కు చెందిన మార్గరేట్ ఛాన్ 2006 నుంచి 2017 మధ్య డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. టీసీఎంకు జబ్బులను నయం చేసే కీలకమైన ప్రాధాన్యం ఉన్న మెడిసిన్లుగా గుర్తింపు ఇచ్చింది ఆమె. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఇక చైనా సంప్రదాయ మందుల వ్యాపారం ఆ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా నడుస్తోంది. 1972 తర్వాత అమెరికా సైతం చైనాతో ఒప్పందం చేసుకోవడంతో.. ఈ వ్యాపారం గ్లోబల్ మార్కెట్‌గా మారింది. అయితే సంప్రదాయ మందుల తయారీ పేరిట మూగ జీవాలను ముఖ్యంగా అడవి జంతువుల్ని అక్రమంగా వేటాడి చంపడంపై అభ్యంతరాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదంతా ఆరోపణలనీ, అగ్రరాజ్యం కుట్ర అని రీసెర్చ్‌ను చైనా తోసిపుచ్చుతోంది. -
Kurnool: జీవాల పెంపకం ఇక శాస్త్రీయం
కర్నూలు (అగ్రికల్చర్) : గొర్రెలు, మేకల పెంపకాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. జీవాల పెంపకాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం పెంపకందారులకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి గొర్రెల పెంపకందారుల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ప్యాపిలి మండలంలోని హుసేనాపురంలో పదెకరాల్లో శిక్షణ కేంద్రం భవన సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. భవనాలు పూర్తయ్యే వరకూ తాత్కాలికంగా డోన్ పట్టణంలోని పశుసంవర్థక శాఖ రైతు శిక్షణ కేంద్రంలో ఈ శిక్షణ ఇస్తారు. విశాఖలోని స్టేట్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైవ్ స్టాక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అధికారులు రూపొందించిన మాడ్యూల్స్ ప్రకారం శిక్షణ ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీద 2 కోట్లకు పైగా జీవాలుండగా, రాయలసీమ జిల్లాల్లోనే కోటి వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్ల కర్నూలులో రాష్ట్ర స్థాయి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. విత్తనపు పొట్టేళ్ల ఎంపిక, టీకాలు వేయించడం తదితర అంశాలపై సమగ్రంగా శిక్షణ ఇస్తారు. వచ్చే నెల 1 నుంచి మూడు రోజుల పాటు.. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి శిక్షణ తరగతులుంటాయి. గొర్రెల పెంపకందారులను బ్యాచ్‌లుగా విభజించి మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. రెండు రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. ఒక్కరోజు అనంతపురం జిల్లాలోని గొర్రెల ఫామ్‌కు తీసుకెళ్లి ప్రాక్టికల్‌గా శిక్షణ ఇస్తారు. గొర్రెల పెంపకందారులకు అదృష్టమే శాస్త్రీయ పద్ధతుల్లో గొర్రెల పెంపకాన్ని చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయం. మాకు 200 గొర్రెలున్నాయి. వీటిని పెంచడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎప్పటికప్పుడు తగిన శిక్షణ ఇస్తే.. గొర్రెల పెంపకం లాభసాటిగా ఉంటుంది. – పరమేష్, గొర్రెల పెంపకందారు, యు.కొత్తపల్లి, డోన్ మండలం -
అయ్యో రైతు
ఖమ్మం: శాస్త్రీయ సర్వేల పేరుతో కొండంత నష్టం జరిగితే గోరంతే జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు పంపారు. అప్పుడు ఆ అధికారులు చేసిన సర్వే పాపమే ఇప్పుడు జిల్లా రైతులకు శాపమైందని జిల్లాలోని రైతులు, రైతుసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రిజర్వుబ్యాంక్ ప్రకటించిన రైతు రుణాల రీ షెడ్యూల్ జాబితాలో జిల్లా పేరు గల్లంతైందని అంటున్నారు. గత సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో వచ్చిన గోదావరి వరదలతో జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర కూరగాయల పంటలు నీటి పాలయ్యాయి. వరదలతో జిల్లాలో 35వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, సుమారు రూ.13 కోట్ల మేరకు పంటనష్టం జరిగిందని అంచనాలు వేశారు. కానీ ఈ పంటలు నాటు వేసే దశలోనే ఉన్నాయని, వీటికి నష్టపరిహారం రాదని వ్యవసాయశాఖ అధికారులు కొట్టిపారేశారు. అక్టోబర్ 22వ తేదీ నుండి ఎడతెరపి లేకుండా వారం రోజులు కురిసిన భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పంటలు నీటిపాలయ్యాయి. జిల్లాలో సుమారు 2.5లక్షల ఎకరాల పత్తి, 28 వేల ఎకరాల వరి, 15 వేల ఎకరాల మిర్చి, 22 వేల ఎకరాల మొక్కజొన్న, 20 వేల ఎకరాల కూరగాయ, ఇతర పంటలు మొత్తం 3.3 లక్షల ఎకరాలకు పైగా దెబ్బతిన్నాయని అధికారులు, రైతు సంఘాల నాయకులు ప్రాథమిక అంచనాల్లో తేల్చారు. పంటనష్టం రూ. 430 కోట్లకు పైగా ఉంటుందని రైతు సంఘాలు, రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో చెప్పారు. కానీ వ్యవసాయశాఖ అధికారులకు మాత్రం చలనం రాలేదు. నష్టం జరిగిన పదిహేను రోజులకు కానీ అంచనాలు వేసేందుకు వెళ్ళలేదని రైతులు ఆరోపిస్తున్నారు. శాస్త్రీయసర్వేలు, అంచనాలు పేరుతో పంటనష్టాన్ని కుదించారు. 50 శాతం కంటే ఎక్కువగా పంటనష్టం జరిగితేనే పరిహారం వస్తుందని చెప్పారు. ఈ లెక్కన జిల్లాలో కేవలం 76 వేల ఎకరాల్లో మాత్రమే పంటనష్టం జరిగిందని నివేదిక పంపించి చేతులు దులుపుకున్నారు. ఇరత జిల్లాలతోపాటు ఖమ్మం జిల్లాలో కూడా పంటనష్టం అధికంగా ఉందని అందరూ ప్రకటించారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను పరామర్శించడానికి జిల్లాకు వచ్చిన వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ముందు రైతులు కన్నీరు పెట్టారు. జిల్లా పరిస్థితులు చూసిన ఆమె ఖమ్మం జిల్లా పంటనష్టంపై రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. అప్పుల ఊబిలో ఉన్న రైతులను ఆదుకున్న నాథుడే కరువయ్యాడు. ఈ లోపు సార్వత్రిక ఎన్నికలు రావడం, టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో కొంత మేరకు ఉపశమన కల్గుతుందని రైతులు భావించారు. రిజర్వ్‌బ్యాంక్ రీషెడ్యూల్‌పై మెలిక పెట్టి గత సంవత్సరం కరువు, వరదల మూలంగా పంటనష్టం వాటిల్లిన జిల్లాలకే రీషెడ్యూల్ చేస్తామని ప్రకటించింది. ఇందులో మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల పేర్లు మాత్రమే ప్రకటించారు. ఈ వార్త విన్న జిల్లా రైతాంగం ఒక్కసారిగి ఖంగుతిన్నది. నాడు వ్యవసాయశాఖ అధికారులు చేసిన పాపం మూలంగానే జిల్లాకు ఆర్బీఐ జాబితాలో చోటు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీషెడ్యూల్ అయితే ఊరట కల్గుతుందని భావించిన రైతులు నిరాశకు లోనవుతున్నారు. రుణమాఫీ వర్తిస్తుందో, లేదో అని ఆందోళన చెందుతున్నారు.