సంప్రదాయ వైద్యం ప్రపంచానికి కొత్తేం కాదు. ఆసియాలో అందునా.. చైనా సంప్రదాయ మందులకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ గిరాకీ ఉంది. ఈ తరుణంలో శాస్త్రీయ ఆధారాల్లేని ఈ మందుల గురించి భయంకరమైన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ శాస్త్రీయతను విస్మరిస్తోందని, భద్రతా పరమైన సందేహాలకు ఇది తావిస్తోందని తాజాగా కొన్ని పరిశోధనలు బయటపెట్టాయి. న్యూయార్క్ స్టానీ బ్రూక్ యూనివర్సిటీలోని క్యాన్సర్ రీసెర్చర్ ఆర్థర్ గ్రోల్మన్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. టీఎంసీ(Traditional Chinese Medicines)లో Aristolochic అనే యాసిడ్ ఉంటుందని, ఇది కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు క్యాన్సర్‌కు దారి తీస్తుందని వెల్లడించారు.
‘సేఫ్టీ కన్సర్న్స్ ఆఫ్ ట్రెడిషినల్ చైనీస్ మెడిసిన్ ఇంజెక్షన్స్ యూజ్డ్ ఇన్ చైనీస్’ పేరిట ఆ రీసెర్చ్ నివేదిక వెలువడింది. ముఖ్యంగా టీసీఎం ఇంజెక్షన్లు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు రీసెర్చర్లు. క్లినికల్ ట్రయల్స్ లేకుండా, పక్షపాతమైన ధోరణిలో పరిశోధనతో వాటికి అనుమతి దొరుకుతోందని, ముఖ్యంగా పిల్లలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెడుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. టీసీఎం ప్రతికూల ఔషధ ప్రతిచర్యలు.. చైనాతో పాటు నైజీరియా, టాంజానియా, సౌతాఫ్రికాలోనూ కేసులు నమోదు అవుతున్నాయని ఈ పరిశోధనలు గుర్తించాయి.
హాంకాంగ్‌కు చెందిన మార్గరేట్ ఛాన్ 2006 నుంచి 2017 మధ్య డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. టీసీఎంకు జబ్బులను నయం చేసే కీలకమైన ప్రాధాన్యం ఉన్న మెడిసిన్లుగా గుర్తింపు ఇచ్చింది ఆమె. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది.
ఇక చైనా సంప్రదాయ మందుల వ్యాపారం ఆ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా నడుస్తోంది. 1972 తర్వాత అమెరికా సైతం చైనాతో ఒప్పందం చేసుకోవడంతో.. ఈ వ్యాపారం గ్లోబల్ మార్కెట్‌గా మారింది. అయితే సంప్రదాయ మందుల తయారీ పేరిట మూగ జీవాలను ముఖ్యంగా అడవి జంతువుల్ని అక్రమంగా వేటాడి చంపడంపై అభ్యంతరాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదంతా ఆరోపణలనీ, అగ్రరాజ్యం కుట్ర అని రీసెర్చ్‌ను చైనా తోసిపుచ్చుతోంది.
Comments
Please login to add a commentAdd a comment