గులాబీలు అందంగా ఉన్నా, వాటి కొమ్మలకు ముళ్లు ఉంటాయి. ముళ్లు గుచ్చుకోకుండా మొక్క నుంచి గులాబీలు కోయడం కొంత కష్టమే! ఈ కష్టాన్ని తొలగించడానికి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ముందుకొచ్చి, ముళ్లులేని గులాబీలను సృష్టించే ప్రక్రియను కనుగొన్నారు. గులాబీలు సహా వివిధ మొక్కల్లో పూలు, కాయలు కాసే కొమ్మలకు ముళ్లు ఏర్పడటానికి కారణమైన జన్యువును కనుగొన్నారు.
ఈ జన్యువుకు వారు ‘లోన్లీ గై’ (ఎల్‌ఓజీ) అని పేరు పెట్టారు. గులాబీలు సహా ఇరవై జాతుల మొక్కల్లో ముళ్లు ఏర్పడటానికి ఈ జన్యువే కారణమవుతోందని గుర్తించారు. అటవీ ప్రాంతాల్లో పెరిగే వంకాయలకు ముళ్లు ఉంటాయి. తోటలు, పొలాల్లో పెంచే వంకాయలకు ముళ్లు ఉండవు. అటవీ ప్రాంతాల్లోని వంకాయల నుంచి పొలాలు, తోటల్లో పెంచే వంకాయ జాతులు వేరుపడి వేలాది సంవత్సరాలు గడిచిపోయాయి.
ఈ సుదీర్ఘకాలంలో సంభవించిన జన్యు ఉత్పరివర్తనల వల్ల పొలాలు, తోటల్లో పెంచే వంకాయల్లో ముళ్లు వాటంతట అవే అంతరించిపోయాయి. మరికొన్ని రకాల ముళ్ల మొక్కల్లోనూ వేరుపడిన జాతుల్లో ముళ్లు అంతరించాయి. కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల జన్యుమార్పిడి ద్వారా కొన్ని రకాల ఎడారి మొక్కల్లో ముళ్లను మాయం చేయగలిగారు. ఇదే పద్ధతిలో గులాబీలను కూడా ముళ్లు లేకుండా పూయించవచ్చని వారు చెబుతున్నారు. ముళ్లులేని గులాబీల సృష్టి కోసం చేయవలసిన జన్యుమార్పిడి పద్ధతిని వివరిస్తూ వారు సమర్పించిన పరిశోధన వివరాలను ఇటీవల ‘సైన్స్’ జర్నల్ ప్రచురించింది. కళకళలాడే పూలచెట్లతో పెరటి తోటలను పెంచుకునేవారికి ఇది శుభవార్తే!
Comments
Please login to add a commentAdd a comment