ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని మథుర నగరంలో శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశంలో షాహీ ఈద్గాను నిర్మించారంటూ దాఖలైన కేసు గురువారం కీలక మలుపు తీసుకుంది. కోర్టు పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న మసీదు ప్రాంగణంలో ఒకప్పటి హిందూ ఆలయ ఆనవాళ్లు ఉన్నాయంటూ కోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో సర్వే కోసం కమిషనర్‌ను నియమించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. ‘త్రిసభ్య కమిషన్ ఈ సర్వేను పర్యవేక్షిస్తుంది. సర్వే సందర్భంగా అక్కడి కట్టడాలు దెబ్బ తినకుండా చూడాలి. డిసెంబర్ 18న జరిగే ఈ కేసు తదుపరి విచారణలో సర్వే విధివిధానాలపై నిర్ణయం తీసుకుంటాం. శాస్త్రీయ సర్వేను ఇరు పక్షాల తరఫు ప్రతినిధులు ప్రత్యక్షంగా గమనించవచ్చు. పూర్తి పారదర్శకమైన నివేదికను కోర్టును కమిషన్ అందించాలి.
ఈ నివేదికపై అభ్యంతరాలుంటే ఈద్గా తరఫు లాయర్లు తమ అభ్యంతరాలు తెలుపుతూ కోర్టును ఆశ్రయించవచ్చు’ అని జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ తన ఉత్వర్వులో పేర్కొన్నారు. కాగా, కోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తా మని షాహీ ఈద్గా మేనేజ్‌మెంట్ కమిటీ తెలిపింది. ఇటీవలి కాలంలో ఆలయం–మసీదు వివాదాల్లో అలహాబాద్ హైకోర్టు ఇలా సర్వేకు ఆదేశాలివ్వడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
ఇటీవలే వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలివ్వడం, సర్వే పూర్తయి భారత పురావస్తు శాఖ నుంచి తుది నివేదిక కోసం వేచి ఉన్న సంగతి తెల్సిందే. ‘‘మసీదు ప్రాంగణంలో కమలం ఆకృతిలో ఉన్న పునాదులతో ఒక నిర్మాణం ఉంది. అది హిందువులు పూజించే శేషనాగును పోలి ఉంది. పునాదిపై హిందూ మత సంబంధ గుర్తులు, నగిïÙలు స్పష్టంగా కనిపిస్తున్నాయి’’ అని ఇటీవల పిటిషనర్ తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ కోర్టులో వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment