court orders
-
16న విచారణకు హాజరుకండి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’కేసు విచారణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గైర్హాజరు కావడంపై నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ జరిగే అక్టోబర్ 16న న్యాయస్థానం ఎదుట తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో మంగళవారం జరిగిన విచారణకు మత్తయ్య ఒక్కరే హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి, వేం కృష్ణ కీర్తన్, ఉదయ్ సింహ, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ హాజరుకాలేదు. ఒకరోజు విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిందితులు వేసిన పిటిషన్లను కోర్టు అనుమతించింది. అయితే అభియోగాల నమోదుపై విచారణ కోసం వచ్చే నెల 16న మాత్రం హాజరుకావాల్సిందేనని రేవంత్ సహా నిందితులందరికీ స్పష్టం చేసింది. ఏసీబీ, ఈడీ విచారణలతో.. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను టీడీపీ అభ్యరి్థకి మద్దతు ఇవ్వాలంటూ రూ.కోట్లు ఆశచూపిన ఆరోపణలపై నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్టీఫెన్సన్ ఇంట్లో రేవంత్ డబ్బు సంచులతో ఉన్న వీడియోలు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఈ కేసులో రేవంత్ జైలుకు వెళ్లి, తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చారు. రేవంత్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన వద్ద రూ.50 లక్షల నగదును ఏసీబీ స్వా«దీనం చేసుకుంది.ఈ నగదు అక్రమ మార్గాల్లో వచి్చందన్న ఏసీబీ ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఏసీబీ, ఈడీ రెండు విచారణలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంలో నిందితులు మంగళవారం విచారణకు గైర్హాజరవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణకు హాజరు కా వాలని రేవంత్‌తో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహ, మత్తయ్య జెరూసలేం, సండ్ర వెంకట వీరయ్య, వేం కృష్ణ కీర్తన్‌లను ఆదేశించింది. -
Big Question: పచ్చి అబద్దాలు.. కోర్టు ఆర్డర్ బయటపెట్టిన మాజీ ఏఏజీ పొన్నవోలు
-
కడప కోర్టు ఉత్తర్వుల రద్దు కోరుతూ పిటిషన్లు
సాక్షి, అమరావతి: సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నర్రెడ్డి సునీత, టీడీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) హైకోర్టును ఆశ్రయించారు. కడప జిల్లా కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వారు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి బీటెక్ రవి తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అత్యవసర విచారణ అవసరం లేదన్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరుపుతామంది. ఈ వ్యాజ్యం విచారణ నుంచి తాము తప్పుకుంటామని ధర్మాసనం మౌఖికంగా తెలిపింది. ‘మా వాదన వినలేదు’ కడప జిల్లా కోర్టు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, తమ వాదన వినకుండా ఏకపక్షంగా తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని బీటెక్ రవి, సునీత తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నారు. బాధితులు సూట్ దాఖలు చేయాల్సి ఉండగా.. పార్టీ తరఫున దాఖలు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదన్నారు. ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కావన్నారు. కడప కోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వుల ద్వారా కడప కోర్టు తమ వాక్ స్వాతంత్య్రపు హక్కును నిరోధించిందని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. మధ్యంతర ఉత్తర్వుల పేరుతో జిల్లా కోర్టు తుది అభిప్రాయానికి వచ్చిందన్నారు. ఎన్నికల వేళ ప్రజాబాహుళ్యంలో ఉన్న వాస్తవాలను ప్రజలకు తెలియచేసే హక్కు తమకు ఉందన్నారు. -
హాంకాంగ్ కోర్టు సంచలన తీర్పు.. చిక్కుల్లో చైనా కంపెనీ!
చైనా రియల్ ఎస్టేట్ కంపెనీ 'ఎవర్‌గ్రాండే' గ్రూప్‌ను లిక్విడేషన్ చేయాలని హాంకాంగ్ కోర్టు ఆదేశించింది. రుణదాతలతో పునర్వ్యవస్థీకరణ ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆచరణాత్మకమైన పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక అమలు చేయలేకపోవడంతోపాటు, కంపెనీ దివాళా దిశగా అడుగులేస్తున్న కారణంగానే కంపెనీ మూసివేస్తేనే మంచిదని పేర్కొంటూ హాంకాంగ్ కోర్టు న్యాయమూర్తి లిండా ఛాన్ పేర్కొన్నారు. ఈ ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఎవర్‌గ్రాండే గ్రూప్ లిక్విడేషన్ జరిగితే.. స్టాక్ మార్కెట్లో వివిధ సంస్థల స్టాక్స్‌పై అమ్మకాల ఒత్తిళ్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ ఆస్తుల విలువ మొత్తం 240 బిలియన్ డాలర్లు, కాగా.. సంస్థ చేసిన అప్పులు విలువ సుమారు 300 బిలియన్ డాలర్లు. ఇదీ చదవండి: అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ హాంకాంగ్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఎవర్‌గ్రాండే స్టాక్స్ 20 శాతానికి పైగా నష్టపోయాయి. ఫలితంగా కొంత సేపు హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీలో ట్రేడింగ్ కూడా నిలిపేశారు. చైనాలోని రియాల్టీ రంగంలో రుణాలు అదుపు తప్పాయి. వాటిని నియంత్రించడంతో పాటు.. రియాల్టీ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు చైనా రెగ్యులేటరీ సంస్థలు కఠినమైన నిబంధనలు అమలులోకి తెచ్చాయి. ఫలితంగా ఎవర్‌గ్రాండే వంటి చాలా కంపెనీలు చిక్కుల్లో పడ్డాయి. ఇదే ప్రస్తుతం కంపెనీని దివాళా అంచులకు తీసుకువెళ్ళింది. -
టెట్.. ఇదేమి టెస్ట్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించడం విద్యాశాఖకు సవాల్‌గా మారింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించిన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు. అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొండిగా టెట్ పెట్టే ఆలోచన చేస్తే ఉద్యమించడానికి సిద్ధమంటూ కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. టెట్ తప్పని సరి అనుకుంటే కొత్తవారితో కలిపి కాకుండా టీచర్ల వరకే అంతర్గత పరీక్ష నిర్వహించాలని మరికొన్ని సంఘాలు అంటున్నాయి. కానీ దీన్ని అంగీకరించేది లేదని 2012 తర్వాత నియమితులైన టీచర్లు స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే కోర్టుకెళ్తామని చెబుతున్నారు. దీంతో విద్యాశాఖ గందరగోళంలో పడింది. ఎన్ని లింకులో..: టెట్‌లో ఉత్తీర్ణులైన వారే టీచర్ పోస్టుకు అర్హులు. టెట్‌లో అర్హత సాధిస్తేనే ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం సాధ్యమవుతుంది. ఈ మేరకు కేంద్రం నిబంధన విధించింది. పదోన్నతులు లభిస్తేనే విద్యాశాఖలో వాస్తవ ఖాళీలు తెలుస్తాయి. అప్పుడే మెగా డీఎస్ఈ చేపట్టడం సాధ్యమవుతుంది. ఇలా ఒకదానికి మరొకటి లింక్ ఉండటంతో సమస్య కొలిక్కి వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. మరోవైపు మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్న ప్రభుత్వ హామీ విషయంలో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇలా సంక్లిష్టంగా మారిన ఈ సమస్యపై త్వరలో చర్చించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి ఓ నివేదిక ఇచ్చే యోచనలో ఉన్నారు. టీచర్లలో సిలబస్ ఆందోళన టెట్ రాయాల్సిన చాలామంది ఉపాధ్యాయుల్లో ఆందోళన క న్పిస్తోంది. ఇప్పుడున్న సిలబస్ ప్రకారం పరీక్ష రాయడం కష్టమని వారు భావిస్తున్నారు. సర్విస్‌లో ఉన్న టీచర్లు దశాబ్దాల తరబడి ఏదో ఒక సబ్జెక్టును మాత్రమే బోధిస్తున్నారు. మేథ్స్ చెప్పే టీచర్‌కు సైన్స్, సైన్స్ చెప్పే టీచర్‌కు మేథ్స్‌లో అవగాహన ఉండే అవకాశం లేదు. అన్ని సబ్జెక్టులపై పట్టు ఉంటే తప్ప టెట్ అర్హత పొందడం కష్టం. ఇప్పటి యువకులతో పరీక్షలో పోటీ పడలేమని భావిస్తున్నారు. ఈ కారణంగానే టెట్ అనివార్యమైతే సులభంగా ఉండే డిపార్ట్మెంటల్ పరీక్ష మాదిరి ప్రత్యేకంగా నిర్వహించాలని కోరుతు న్నారు. జనరల్ అభ్యర్థులకు 150 మార్కులకు 90 మార్కులు వస్తేనే అర్హత లభిస్తుంది. కాగా కోచింగ్ తీసుకున్నప్పటికీ బీఈడీ అభ్యర్థులు రాసే పేపర్–2లో ఓసీలు 5 శాతం మాత్రమే అర్హత సాధిస్తుండటం గమనార్హం. టెట్ ఎంతో కీలకం కేంద్ర ప్రభుత్వం 2010లో విద్యా హక్కు చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం టీచర్‌గా పనిచేయాలనుకునే వారు టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఆ అర్హత ఉంటేనే పదోన్నతి పొందడానికి కూడా అర్హులు. దీని అమలుకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ 2012లో ఆదేశాలు జారీ చేసింది. అయితే 2012 కన్నా ముందు ఎక్కడా టెట్ లేదనే అభిప్రాయంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇదే 2022 వరకు కొనసాగుతూ వచ్చింది. కాగా 2022లో పదోన్నతులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో సమస్య మొదలైంది. టెట్ అర్హత ఉన్న టీచర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని కోర్టు తీర్పు చెప్పింది. ఫలితంగా టెట్ పరీక్ష నిర్వహించడం విద్యాశాఖకు అనివార్యమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో 2012 కన్నా ముందు నియమితులైన వారు 80 వేల మంది ఉంటారు. మిగతా వాళ్ళంతా టెట్ అర్హత ఉన్నవాళ్ళే. కాగా పదోన్నతులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విద్యాశాఖ మరోసారి కోరినప్పటికీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ అంగీకరించలేదు. టెట్‌పై ఉద్యమిస్తాం ఏళ్ళ తరబడి బోధించే ఉపాధ్యాయుడికి టెట్ తప్పనిసరి చేయడం సహేతుకం కాదు. ఈ చట్టం తెచ్చినప్పుడే వ్యతిరేకించాం. ఈ ఒక్కసారైనా టెట్ లేకుండా పదోన్నతులు ఇవ్వాలి. కానీ టెట్‌నే కొలమానంగా భావిస్తే మాత్రం ఉద్యమిస్తాం. - పి.నాగిరెడ్డి (టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ప్రభుత్వమే ఆలస్యం చేసింది టెట్‌పై ప్రభుత్వమే ఆలస్యం చేసింది. ఈ కారణంగానే పదోన్నతులు రాకుండా ఆగిపోయాయి. శాఖపరమైన టెట్ నిర్వహిస్తే ఇప్పటికే ఉపాధ్యాయులు అర్హత సాధించే వాళ్ళు. టెట్ లేకుండా ముందుకెళ్ళడం కష్టమే. కాబట్టి ఉపాధ్యాయులు దీనికి సిద్ధపడాల్సిందే. – చావా రవి (టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి) డిపార్ట్మెంటల్ పరీక్షలా నిర్వహించాలి టెట్ అర్హత పొందకుండా పదోన్నతులు పొందడం కష్టమే. అయితే దీర్ఘకాలంగా పనిచేస్తున్న టీచర్లకు టెట్ పరీక్ష అంతర్గతంగా నిర్వహించాలి. ఇతర విద్యార్థులతో కాకుండా వేరుగా చేపట్టాలి. దీన్నో డిపార్ట్మెంటల్ టెస్ట్లా చేపడితే మేలు. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి (పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు) -
షాహీ ఈద్గాలో సర్వే చేయండి
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని మథుర నగరంలో శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశంలో షాహీ ఈద్గాను నిర్మించారంటూ దాఖలైన కేసు గురువారం కీలక మలుపు తీసుకుంది. కోర్టు పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న మసీదు ప్రాంగణంలో ఒకప్పటి హిందూ ఆలయ ఆనవాళ్లు ఉన్నాయంటూ కోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సర్వే కోసం కమిషనర్‌ను నియమించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. ‘త్రిసభ్య కమిషన్ ఈ సర్వేను పర్యవేక్షిస్తుంది. సర్వే సందర్భంగా అక్కడి కట్టడాలు దెబ్బ తినకుండా చూడాలి. డిసెంబర్ 18న జరిగే ఈ కేసు తదుపరి విచారణలో సర్వే విధివిధానాలపై నిర్ణయం తీసుకుంటాం. శాస్త్రీయ సర్వేను ఇరు పక్షాల తరఫు ప్రతినిధులు ప్రత్యక్షంగా గమనించవచ్చు. పూర్తి పారదర్శకమైన నివేదికను కోర్టును కమిషన్ అందించాలి. ఈ నివేదికపై అభ్యంతరాలుంటే ఈద్గా తరఫు లాయర్లు తమ అభ్యంతరాలు తెలుపుతూ కోర్టును ఆశ్రయించవచ్చు’ అని జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ తన ఉత్వర్వులో పేర్కొన్నారు. కాగా, కోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తా మని షాహీ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ తెలిపింది. ఇటీవలి కాలంలో ఆలయం–మసీదు వివాదాల్లో అలహాబాద్ హైకోర్టు ఇలా సర్వేకు ఆదేశాలివ్వడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవలే వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలివ్వడం, సర్వే పూర్తయి భారత పురావస్తు శాఖ నుంచి తుది నివేదిక కోసం వేచి ఉన్న సంగతి తెల్సిందే. ‘‘మసీదు ప్రాంగణంలో కమలం ఆకృతిలో ఉన్న పునాదులతో ఒక నిర్మాణం ఉంది. అది హిందువులు పూజించే శేషనాగును పోలి ఉంది. పునాదిపై హిందూ మత సంబంధ గుర్తులు, నగిïÙలు స్పష్టంగా కనిపిస్తున్నాయి’’ అని ఇటీవల పిటిషనర్ తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ కోర్టులో వాదించారు. -
కోర్టు ఆదేశాలు బేఖాతరు
-
‘వాన్‌పిక్’ ఆస్తుల అటాచ్మెంట్ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని వాడరేవు–నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు (వాన్‌పిక్) కోసం సేకరించిన 11,804.78 ఎకరాల అసైన్డ్ భూమిని అటాచ్మెంట్ నుంచి వెంటనే విడుదల చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆ జప్తు చెల్లదని సీజే ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. అంతేకాక.. 11,804.78 ఎకరాల భూమిని జప్తుచేస్తూ ఈడీ జారీచేసిన ఉత్తర్వులను, వాటిని అడ్జ్యుడికేటింగ్ అథారిటీ సమర్థించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అలాగే, వాన్‌పిక్ భూముల జప్తును కొనసాగిస్తూ, భూముల విడుదల కోసం మనీలాండరింగ్ నిరోధక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ వాన్‌పిక్‌కు అప్పిలేట్ ట్రిబ్యునల్ సూచించడం కూడా సరికాదంది. ఒకవైపు ఆస్తుల జప్తు చట్టవిరుద్ధమని చెబుతూనే విడుదలకు కింది కోర్టును ఆశ్రయించమని ట్రిబ్యునల్ ఎలా సూచిస్తుందని ప్రశ్నించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం తీర్పునిచ్చింది. కేసు నేపథ్యం ఇదీ.. ‘వాన్‌పిక్’ ఏర్పాటు నిమిత్తం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రకాశం–గుంటూరు జిల్లాల పరిధిలో 13,221.69 ఎకరాల భూములను కేటాయించింది. వాన్‌పిక్ ప్రాజెక్టు విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల్లో ఒకటైన రస్ అల్ ఖైమాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్టు అమలుకు వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషల్ పర్సస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఏర్పాటయ్యాయి. అయితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకుగాను క్విడ్ ప్రో కోలో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన కంపెనీలకు ఈ కేటాయింపులు జరిగాయంటూ సీబీఐ ఆరోపించింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఆ తరువాత వాన్‌పిక్‌కు భూకేటాయింపులపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్ ఆధారంగా వాన్‌పిక్‌కు చెందిన 1,416.91 ఎకరాల భూమిని 2014లో జప్తుచేస్తూ ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై వాన్‌పిక్ పోర్ట్స్, వాన్‌పిక్ ప్రాజెక్స్.. అప్పీలెట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉండగానే మరో 11,804.78 ఎకరాల అసైన్డ్ భూమిని 2017లో జప్తుచేస్తూ ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులతో 13,221.69 ఎకరాలను పూర్తిగా జప్తుచేసింది. ఈ ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్ అథారిటీ సమర్థించింది. క్విడ్ ప్రో కో అన్నదే లేదు.. ఈ జప్తుపై కూడా ‘వాన్‌పిక్’ కంపెనీలు అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ రెండు జప్తులపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ 2019, జూలైలో తీర్పు వెలువరించింది. తాత్కాలిక జప్తు సమయంలో ఇది నేరపూరిత సొమ్ము అని దర్యాప్తు సంస్థ విశ్వాసంలోకి తీసుకోవడానికిగాను సంబంధించి కారణాలను వివరించాల్సి ఉందని.. కానీ, ఎలాంటి కారణాలు లేకపోయినా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జప్తును సమర్థించడం సరికాదని పేర్కొంది. ఎలాంటి క్విడ్ ప్రోకో లేదని, జప్తువల్ల ఎలాంటి ప్రయోజనంలేదని, కోర్టులో కేసు విచారణ పూర్తిచేయడానికి ఏళ్లు పడుతుందని, అంతవరకు ప్రజాప్రయోజనాలకు చెందిన ఆస్తుల జప్తు సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలా ఈడీ, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీచేసిన జప్తు ఉత్తర్వులను తప్పుబట్టడమే కాకుండా వాటిని రద్దుచేసింది. అయితే, భూముల జప్తును మాత్రం కొనసాగిస్తూ వాటి విడుదల కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని ట్రిబ్యునల్ సూచించింది. హైకోర్టును ఆశ్రయించిన వాన్‌పిక్.. భూమి విడుదలకు సంబంధించి అప్పిలెట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ ప్రాజెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో వేర్వేరుగా మూడు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వాన్‌పిక్ తరఫున సీనియర్ న్యాయవాది అతుల్ నంద, ఈడీ తరఫున అనిల్ ప్రసాద్ తివారీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. 561 ఎకరాలు, 855 ఎకరాల జప్తు విషయంలోని రెండు అప్పిళ్లకు సంబంధించి గత సెప్టెంబర్‌లో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వెంటనే 1,416.91 ఎకరాలను విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, 11,804.78 ఎకరాల జప్తునకు సంబంధించి మాత్రం కొంత అస్పష్టత ఉండటంతో దీనిపై విచారణను కొనసాగించి.. శుక్రవారం తీర్పునిచ్చింది. నిబంధనలను పాటించకుండా ఈడీ జప్తు చేసిందని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. ఈడీ చర్యను సమర్థిస్తూ చట్ట విరుద్ధంగా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు ఇచ్చిందంటూనే ఆ చట్ట ఉల్లంఘనను కొనసాగించాలంటూ అప్పీలేట్ ట్రిబ్యునల్ చెప్పడం సరికాదని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టవిరుద్ధమని తేలినప్పుడు ఆస్తులను విడుదల చేయాలని చెప్పే తన అధికారాన్ని ట్రిబ్యునల్ వినియోగించుకోకుండా కింది కోర్టుకు వెళ్లమనడం ఎంతమాత్రం సరికాదంది. 11,804.78 ఎకరాల అసైన్డ్ భూములను వెంటనే విడుదల చేయాలని ఈడీ ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. -
బాబ్రీని పొగొట్టుకున్నాం.. చాలు!: అసదుద్దీన్ ఒవైసీ
లక్నో: జ్ఞానవాపి మసీద్ వ్యవహారంలో వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మసీదు ప్రాంగణంలోని వుజు ఖానా(కొలను)లో శివలింగం బయట పడడం, ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి ఎవరినీ అనుమతించకూడదంటూ స్థానిక కోర్టు అధికారులను, భద్రతా సిబ్బందిని ఆదేశించడం లాంటి పరిణామాలు వారణాసిలో వేడిని పుట్టించాయి. ఈ క్రమంలో ఒవైసీ స్పందిస్తూ.. ముస్లింలు ఇప్పటికే బాబ్రీ మసీదును కోల్పోయారని, మరో మసీదును పోగొట్టుకోబోమని అన్నారు. ఈ సందర్భంగా వారణాసి కోర్టు తీర్పుపై ఆయన స్పందించారు. మసీదులో వీడియోగ్రఫీ సర్వే.. ప్రార్థనామందిరాల ప్రత్యేక చట్టం 1991ను ఉల్లంఘించడమే కాదు.. బాబ్రీ మసీద్ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పును సైతం తప్పుబట్టినట్లు అవుతుంది. అగష్టు 15, 1947 సమయంలో అక్కడ ఏ ప్రార్థనా స్థలం ఉంటే.. అదే కొనసాగాలని చట్టం చెబుతోంది. ఇప్పటికే ఓ మసీదును కోల్పోయాం. మరొకటి కోల్పోయేందుకు సిద్ధంగా లేం అంటూ వ్యాఖ్యానించారు ఒవైసీ. జ్ఞానవాపి ఒక మసీదుగానే ఎప్పటికీ ఉంటుందంటూ పేర్కొన్నారాయన. ఒవైసీ కంటే ముందు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సైతం బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై మండిపడ్డారు. వాళ్లంతా మసీదుల వెంటే పడుతున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చారు ఆమె. సంయమనం పాటించండి కోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్పందించారు. చరిత్రను ఒకసారి తిరగేయండి. శాంతి, సోదరభావాన్ని పాటించండి. కోర్టులో ఈ వ్యవహారం ఉన్నందున.. జోక్యం చేసుకుని పరిస్థితిని మరోలా మార్చకండంటూ లేఖి విజ్ఞప్తి చేశారు. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగర్ గౌరీ ఆలయంలో నిత్యం పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మొదలైంది. దీనిపై మూడు రోజులు పాటు కోర్టు ఆదేశానుసారం వీడియోగ్రఫీ సర్వే జరిగింది. సోమవారం సర్వే ముగియగా.. మసీదులో ఉన్న కొలను నుంచి శివలింగం బయటపడడంతో.. కోర్టు మళ్లీ జోక్యం చేసుకుని ఆ ప్రాంతాన్ని సీల్ చేయమని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ ప్రాంగణం మొత్తం కాశీ విశ్వనాథ్ ఆలయానికి చెందినదే అని.. మసీదు అందులో ఓ భాగం మాత్రమే అని దాఖలైన ఓ పిటిషన్ 1991 నుంచి కోర్టులో పెండింగ్‌లో ఉండడం విశేషం. -
కోర్టు ఆదేశాలు ‘ఫాస్టర్’గా..
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ ఆదేశాలు జాప్యం కాకుండా వేగంగా కక్షిదారులకు చేరడానికి రూపొందించిన ఫాస్ట్, సెక్యూర్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్(ఫాస్టర్) సాఫ్ట్‌వేర్‌ను గురువారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. కోర్టు ఉత్తర్వులు ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా వేగంగా, సురక్షితంగా చేరేలా రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ప్రారంభోత్సవ ఆన్లైన్ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్‌గుప్తా, పలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. వేగంగా సాఫ్ట్వేర్ రూపొందించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులు, కోర్టు రిజిస్ట్రీని అభినందించారు. ఈ వ్యవస్థ నిమిత్తం దేశవ్యాప్తంగా 1887 ఈ–మెయిల్ ఐడీలు సృష్టించారని, సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ఫాస్టర్ సెల్ ప్రారంభించారని తెలిపారు. కోర్టు ఆమోదించిన బెయిల్, విడుదలకు సంబంధించిన ప్రోసీడింగ్స్, ఆదేశాలను ఈ–మెయిళ్ల ద్వారా వెంటనే సంబంధిత నోడల్ అధికారులకు చేరేలా ఈ సాఫ్ట్వేర్ చేస్తుందన్నారు. ధ్రువీకరణ నిమిత్తం డిజిటల్ సంతకాలు, సంస్థాగత డిజిటల్ సంతకాలు ఉంటాయన్నారు. సమీప భవిష్యత్తులో హార్డ్‌కాపీలు అవసరం ఉన్న అన్ని రికార్డులు పూర్తిగా ఫాస్టర్ ద్వారా చేరవేయొచ్చని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. 16.7.2021న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆగ్రా సెంట్రల్ జైలులో నిందితుల్ని మూడు రోజుల తర్వాత కూడా విడుదల చేయలేదంటూ పత్రికల్లో వచ్చిన కథనాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. న్యాయ ఆదేశాలు త్వరగా చేరకపోవడం వల్ల దోషుల విడుదలలో జాప్యాన్ని గ్రహించిన సీజేఐ జస్టిస్ రమణ ఈ సాఫ్ట్వేర్ రూపకల్పనకు సూచనలు చేశారు. -
జామా మసీదు ముందు భీమ్ ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: సీఏఏ వ్యతిరేక నిరసనల్లో అరెస్టయి, బెయిల్‌పై విడుదలైన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ శుక్రవారం జామా మసీదు ముందు ప్రత్యక్షం అయ్యారు. ఆయన గత నెలలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో ప్రజలను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అరెస్టు కాగా.. ఆజాద్‌కు ఢిల్లీలోని స్థానిక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో పాల్గొనరాదని ఆయనకు కోర్టు నిబంధన విధించింది. నాలుగు వారాల వరకు ఢిల్లీకి రావద్దని ఆయనపై కోర్టు ఆంక్షలు విధించింది. కాగా మతపరమైన ప్రార్థనా మందిరాలకు వెళ్లడానికి మాత్రం అనుమతి కల్పించింది. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా గురువారం రాత్రి విడుదలయ్యారు. (భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ అరెస్ట్) ఢిల్లీ వదిలి వెళ్లడానికి 24 గంటల సమయం ఉండడంతో శుక్రవారం ఆయన జామా మసీదు దగ్గర జరుగుతున్న నిరసన ప్రదర్శనలో రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు ఆర్డర్స్‌ను ఉల్లంఘించలేదని ఆయన పేర్కొన్నారు. శాంతియుత నిరసనే తమ బలమన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు మాత్రమే ఆందోళన చేపట్టడంలేదని, అన్ని మతాల ప్రజలు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. వాస్తవానికి ఇదే మసీదు ముందు నెల రోజుల క్రితం భీమ్ ఆర్మీ చీఫ్ ధర్నా చేపట్టి అరెస్టయ్యారు. కోర్టు షరతులకు అనుగుణంగానే తాను 24 గంటల్లో ఢిల్లీ వదిలి వెలతానని చెప్పారు. అయితే ఆయన జామా మసీదు వద్ద జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్నట్లే కనిపిస్తున్నా.. ఆయన మాత్రం నేను నిరసనల్లో పాల్గొనలేదని కేవలం రాజ్యాంగ ప్రవేశికను మాత్రమే చదివి వినిపించానని చెప్పారు. ఆయన జామా మసీదు ప్రాంగణంలో ఉన్నంతసేపు నిరసనకారులు ఆజాదీ.. ఆజాదీ అంటూ నినదించారు. (జామా మసీద్ పాక్‌లో ఉందా..?) -
రామోజీ రావు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు
-
మాట వినని అధికారులపై ‘ధిక్కారం’
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్ వేసే యోచనలో ఆప్ నాయకత్వం ఉంది. ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అధికారాల పరిధిని పేర్కొంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం.. అధికారుల నియామకాలు, బదిలీలు చేసే అధికారాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అప్పగించింది. అయితే సేవల విభాగం (సర్వీసెస్ డిపార్ట్మెంట్) దీన్ని వ్యతిరేకిస్తోంది. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలు చేసే అధికారం కేంద్ర హోం శాఖకు అప్పగిస్తూ 2016లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీం కోర్టు రద్దు చేయలేదని చెబుతోంది. దీనిపై ఆప్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేయాలని యోచి స్తోంది. దీనిలో భాగంగా కోర్టు ధిక్కార పిటిషన్ వేయనున్నట్టు ఆప్ అధికార ప్రతినిధి చెప్పారు. అధికారులు సహకరించాలి: కేజ్రీవాల్ న్యాయస్థానం తీర్పును గౌరవించి, ఢిల్లీ అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విజ్ఞప్తి చేశారు. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం సలహాలు, సూచనల ఆధారంగా ఎల్జీ నడుచు కోవాలని, శాంతిభద్రతలు, పోలీస్, భూవ్యవ హారాలు తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొందని.. దీన్ని పరిగణనలోకి తీసుకుని అధికారులు తమకు సహకరించాలని కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీ అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేద్దామని అధికారులకు ఆయన ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. ‘ఢిల్లీ అభివృద్ధి కోసం అధికారులు, నాయకులు.. అందరూ కలసి కట్టుగా కృషి చేద్దామని కోరుతున్నాను. ఎల్జీని కూడా కలిసేందుకు సమయం తీసుకోనున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు డిప్యూటీ సీఎం సిసోడియా మీడియాతో మాట్లాడుతూ సర్వీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఆదేశాలు పాటించదని చీఫ్ సెక్రటరీ లిఖితపూ ర్వకంగా తెలిపారన్నారు. వారు తమ ఆదేశాలు పాటించ కున్నా, బదిలీ ఫైళ్లు ఇప్పటికీ ఎల్జీకే పంపినా అది కోర్టు ధిక్కారం కిందకి వస్తుంద న్నారు. ఏం చేయాలనే విషయమై న్యాయనిపుణులను సంప్రదిస్తున్నామన్నారు. ఆప్ వాదన తప్పు: జైట్లీ కేంద్రపాలిత ప్రాంత అధికారులపై పాలనాధికారాలు సుప్రీంకోర్టు తమకే ఇచ్చిందని ఆప్ ప్రభుత్వం వాదించడం పూర్తిగా తప్పని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఐఏఎస్ అధికారులు, దర్యాప్తు బృందాల నియామకం వంటి అంశాల్లో ఢిల్లీ సర్కార్‌కు అధికారాలు లేవని జైట్లీ ఫేస్బుక్ బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమని, పోలీస్, శాంతిభద్రతలు, భూవ్యవహారాలు వంటి అంశాలపై కేంద్రానికే అజమాయిషీ ఉంటుందని, అధికారుల నియామకం, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం లేదన్నారు. ఢిల్లీ రాష్ట్రం కానందున, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే అధికారాలన్నీ ఎన్నికైన కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వానికి ఉంటాయనే వాదన అర్థరహితమని జైట్లీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వానికి పోలీస్ అధికారాలు లేనందున రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను విచారణ నిమిత్తం నియమించలేదని జైట్లీ వివరించారు. -
ఆపండి...ఈ మ్యాచ్ జరగడానికి వీల్లేదు!
సాక్షి, గుంటూరు: క్రికెట్ మైదానంలో ఇదో అనూహ్య ఘటన... నేరుగా కోర్టు ఉత్తర్వులు పట్టుకొని అధికారులు మైదానంలోకి రావడం, అప్పటికప్పుడు మ్యాచ్ నిలిపివేస్తూ ఆదేశించడం... ఏ స్థాయిలోనూ ఎప్పుడూ జరగనిది! గుంటూరు శివార్లలోని పేరిచర్ల క్రికెట్ స్టేడియంలో జమ్మూ కశ్మీర్, గోవా జట్ల మధ్య జరుగుతున్న అండర్–23 మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాలతో బీసీసీఐ అధికారిక టోర్నీ కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ మ్యాచ్‌ను ఉన్నపళంగా నిలిపివేయడం ఆటగాళ్లకు షాక్ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ జట్టులో ఒక ఆటగాడి ఎంపికకు సంబంధించిన వివాదమే ఇందుకు కారణం. సీకే నాయుడు ట్రోఫీ కోసం ఇటీవల జమ్మూ కశ్మీర్ జట్టు ఎంపిక జరిగింది. అయితే సెలక్షన్ ట్రయల్స్‌లో, అంతకుముందు టోర్నీలలో కూడా తన ప్రదర్శన బాగున్నా తనను ఎంపిక చేయలేదని హిషామ్ సలీమ్ అనే కుర్రాడు కోర్టుకెక్కాడు. పైగా సెలక్టర్లలో ఒకరైన మన్సూర్ అహ్మద్ తన కొడుకు మోమిన్ మన్సూర్‌కు చోటిచ్చాడని అతను పిటిషన్ వేశాడు. హిషామ్ తండ్రి కశ్మీర్ వైద్య శాఖలో డైరెక్టర్‌గా ఉన్నతాధికారి హోదాలో పని చేస్తుండటంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జట్టును ప్రకటించవద్దంటూ కోర్టు ఆదేశించింది. అయితే అప్పటికే జమ్మూ కశ్మీర్ క్రికెట్ సంఘం 16 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసి మ్యాచ్ ఆడేందుకు గుంటూరుకు పంపించింది. ఆదివారం పేరిచర్లలోని ఏసీఏ క్రికెట్ గ్రౌండ్లో కశ్మీర్, గోవా నాలుగు రోజుల మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన కశ్మీర్ ఫీల్డింగ్ ఎంచుకోగా 13 ఓవర్లలో గోవా వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. అయితే సరిగ్గా ఆ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాదులు జమ్మూ కశ్మీర్ హైకోర్టు ఆదేశాలతో వచ్చారు. దాని ప్రతిని వారు మ్యాచ్ రిఫరీకి అందజేశారు. మ్యాచ్‌ను కొనసాగిస్తే కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కిందకు వస్తుందని భావించిన రిఫరీ సుహైల్ అన్సారీ మ్యాచ్‌ను నిలిపేశారు. ఆ తర్వాత సోమ, మంగళవారాలు కూడా ఈ విషయంపై మరింత స్పష్టత తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రయత్నించినా లాభం లేకపోయింది. దాంతో వరుసగా మూడో రోజు కూడా మ్యాచ్ జరగలేదు. అయితే ఒక్కరి కోసం మ్యాచ్‌ను మధ్యలో ఆపేయడం దురదృష్టకరమన్న కశ్మీర్ అధికారులు... ఇకపై ఎంపిక కాని ప్రతీ ఆటగాడు కోర్టును ఆశ్రయించే చెడు సాంప్రదాయానికి ఇది దారి తీస్తుందని అన్నారు. -
పంతం కోడి
-
18 వ సారి స్టే...
-
ఓటుకు కోట్లు: 8 వారాల పాటు హైకోర్టు స్టే
-
మసీదుల తొలగింపుపై ముస్లింల మౌన దీక్ష
దేవాలయాల తొలగింపులో భాగంగా ధ్వంసం చేసిన మసీదులను ప్రార్థన స్థలాలను తిరిగి నిర్మించాలని కోరుతూ మస్లింలు మౌన దీక్ష చేపట్టారు. ప్రార్థనా స్థలాలను, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ఉత్తర్వులను పాటించాలనే డిమాండ్‌తో నగరంలోని తారా మసీదువద్ద శుక్రవారం సామూహిక ప్రార్థనల అనంతరం మౌన దీక్షకు దిగారు. -
జడ్జి సరితపై సస్పెన్షన్ ఎత్తివేత
నిజామాబాద్ లీగల్ : జిల్లా కోర్టు జూనియర్ సివిల్ జడ్జి సరితపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తెలంగాణ హైకోర్టు కోసం హైదరాబాద్‌లో జుడీషియల్ ఉద్యోగులు గన్‌పార్కు వద్ద అమరులకు నివాళులర్పించి రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. ర్యాలీలో జడ్జి సరిత పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న 11 మంది జడ్జీలను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇందులో సరిత ఒకరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ ప్రత్యేక హైకోర్టు విషయాన్ని తాను చూస్తానని మొదట జుడీషియల్ అధికారులు విధుల్లో చేరాలని తెలపడంతో అధికారులు విధుల్లో చేరారు. అలాగే 11 మందిపై సస్పెన్షన్ ఎత్తివేసి వారిని విధుల్లోకి తీసుకున్నారు. -
వరంగల్ కలెక్టరేట్ జప్తునకు కోర్టు ఆదేశాలు
హన్మకొండ అర్బన్: బాధితులకు డబ్బులు చెల్లించే విషయంలో జిల్లా యం త్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం (మూవబుల్ ప్రాపర్టీ) జప్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు అమలు బాధ్యతను జిల్లా కోర్టుకు అప్పగించింది. 2006లో జిల్లా యంత్రాంగం ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో జిల్లాలోని సుమారు 500 మంది టీచర్లకు ఆంగ్ల బోధనపై శిక్షణ ఇప్పించింది. ఇందుకు సంబంధించి ఎల్టా అనే సంస్థకు రూ.1.50 లక్షలు చెల్లించే విష యంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఎల్టా ప్రతినిధులు జిల్లా కోర్టును ఆశ్రయించగా, కలెక్టరేట్ జప్తునకు ఆదేశాలు ఇచ్చింది.. దీనిపై అధికారులు స్టే తెచ్చుకుని అప్పీలుకు వెళ్లారు. చివరకు హైకోర్టు కూడా ఎల్టాకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బాధితులకు డబ్బు చెల్లించని కారణంగా కలెక్టరేట్ జప్తునకు గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఎత్తివేస్తూ ఆవే ఉత్తర్వులు అమలు చేయాలని చెప్పింది. ఈ క్రమంలో బాధితులు జిల్లా కోర్టులో ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసుకుని గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరారు. స్పందించిన కోర్టు ఖర్చులతో కలిపి బాధితులకు రూ.2.06 లక్షలు చెల్లించాలని ఆదే శించింది. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని జప్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు ఉత్తర్వులు అమల్లో భాగంగా ఫీల్డ్ అధికారి సత్తార్, ఎల్టా తరపున జిల్లా కోర్టులో వాదించిన న్యాయవాది హరిహరరావు కలెక్టరేట్ అధికారులకు ఉత్తర్వుల కాపీలు అందజేశారు. దీంతో వారంలో డబ్బులు చెల్లించే విధంగా అధికారులకు- ఎల్టా ప్రతినిధులకు మధ్య ఒప్పందం కుదిరిందని ఎల్టా ప్రతినిధులు కొమురయ్య, శ్రీనివాస్ తెలిపారు. -
ఆ ముగ్గురు ఐఏఎస్‌లకు ఊరట
హైదరాబాద్ : కోర్టు ఉత్తర్వుల అమలులో అలసత్వం ప్రదర్శించినందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులకు జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన తీర్పు అమలును ధర్మాసనం నిలుపుదల చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం పోచంపల్లి గ్రామంలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ చేసిన రోడ్డు ఆక్రమణలను తొలగించాలన్న ఉత్తర్వులను అమలు చేయనందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తీరుపై న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. అదే విధంగా కార్వాన్‌లోని కూరగాయల మార్కెట్‌ను గుడిమల్కాపూర్‌కు మార్చినప్పుడు దుకాణాల కేటాయింపులో జరిగిన అన్యాయంపై కొందరు వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి నిర్ణీత కాల వ్యవధిలోపు షాపుల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవాలని మార్కెటింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో మార్కెటింగ్‌శాఖ కమిషనర్ శరత్‌కుమార్‌కు కోర్టు ధిక్కారం కింద సింగిల్ జడ్జి రూ.5 వేల జరిమానా విధించారు. అలాగే మరో కేసులో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవికి రూ.1,116 జరిమానా విధించారు. ఈ తీర్పులను సవాల్ చేస్తూ శరత్‌కుమార్, శ్రీదేవి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిన్నింటినీ శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుల అమలును నిలిపి వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
అవినీతి నిరూపించాలి
► తన కార్యాలయం ఎదుట ఎంపీడీవో ధర్నా ► రోడ్డెక్కిన మండల పరిషత్ కార్యాలయ గొడవ శాయంపేట : తనపై అవినీతి ముద్ర వేసిన ఎంపీపీ బాసని రమాదేవి తన అవినీతి నిరూపించాలని ఎంపీడీవో బానోతు భద్రునాయక్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట మంగళవారం నల్లబ్యాడ్జీ ధరించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీడీవోగా మండలంలో 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ఏ రోజు నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. కార్యాలయానికి సంబంధించిన ప్రతి ఖర్చు రికార్డుల్లో ఉన్నాయన్నారు. ఎక్కడ అవినీతికి పాల్పడ్డానో ఎంపీపీ నిరూపించాలని డిమాండ్ చేశారు. మండల కోఆర్డినేటర్ దైనంపల్లి కుమారస్వామికి కోర్డు ఉత్తర్వుల ప్రకారమే వేతన బిల్లును ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు చెప్పారు. కాగా, ఎంపీపీ బాసని రమాదేవి మాట్లాడుతూ గతంలో ఆసరా పింఛన్లకు సంబంధించిన రూ.50వేల చెక్కును తనకు తెలియకుండానే విడిపించుకుని తన సొంతానికి వాడుకున్నాడని ఆరోపించింది. అంతే కాకుండా సాక్షరభారత్ పథకానికి చైర్మన్‌గా ఉన్న తనకు సాక్షరభారత్ మండల కోఆర్డినేటర్ 16 నెలల వేతనాన్ని పని చేయకుండానే ఉన్నతాధికారులకు సిఫారసు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అసలే జరిగిందంటే.. కొన్ని నెలల క్రితం జరిగిన సమావేశానికి సాక్షరభారత్ కోఆర్డినేటర్ హాజరు కాలేదని, ఆయనను తొలగించాలని మండల సర్వసభ్య సమావేశంలో తీర్మాణించారు. అనంతరం ఎంపీపీ గ్రామ కోఆర్టినేటర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. తరువాత మండల కోఆర్టినేటర్ కుమారస్వామిని తనను ఎలా తొలగించారంటూ కోర్టుకెళ్లాడు. దీంతో ఎంపీపీ, ఎంపీడీవోలకు నోటీసులు జారీ అయినట్లు సమాచారం. అంతేకాకుండా కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్, టీ, టీఫిన్, జిరాక్స్ బిల్లులులకు సంబంధించిన చెక్కుల సంతకాల విషయంలో ఎంపీడీవో భద్రునాయక్ సంతకాలు చేయడంలేదని ఎంపీపీ ఆరోపణ. -
పదోన్నతులకు పచ్చజెండా
యూనివ ర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీలో అధ్యాపక పదోన్నతులకు పాలకల మండలి పచ్చజెండా ఊపింది. కెరీర్ అడ్వాన్స్ స్కీమ్(సీఏఎస్) కింద అసిస్టెంట్ నుంచి అసోసియేట్, అసోసియేట్ నుంచి ప్రొఫెసర్‌కు పదోన్నతుల కోసం ఫిబ్రవరి చివరి వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో అర్హత పొందినవారికి పదోన్నతులు ఇవ్వడానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. ఎస్వీ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం దాదాపు సంవత్సరం తర్వాత జరిగింది. ఇటీవలే పాలకమండలి పునరుద్ధరణ అనంతరం జరిగిన తొలి సమావేశం ఇదే. కొత్తగా పాలకమండలి సభ్యులుగా నియమితులైన 9 మందిలో 8 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. అమరరాజా గ్రూపు సంస్థల చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు ఈ సమావేశానికి రాలేదు. ఎస్వీయూ వీసీ దామోదరం అధ్యక్షత వహించారు. పదోన్నతుల విషయంలో కోర్టు ఉత్తర్వులకు లోబడి అర్హులైన అధ్యాపకలకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని తీర్మానించారు. ఎస్వీయూ 54వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్‌లో జరపాలని పాలకమండలి నిర్ణయించింది. రూ.163.8 కోట్లతో బడ్జెట్ రూ.163.8 కోట్లతో యూనివర్సిటీ బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ నిధుల వినియోగంపై ఫైనాన్స్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ కమిటీకి వీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పాలకమండలి సభ్యులు గురుప్రసాద్, బాలసిద్ధముని ఈ కమిటీలు సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ కమిటీ యూనివర్సిటీలో నిధుల వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో ఏపనికి ఎంత ఖర్చు చేశారో పూర్తి వివరాలతో పాలకమండలి ముందు ఉంచాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి సూచించారు. అకడమిక్, అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్ అంశాలపై వచ్చే సమావేశంలో పూర్తిస్థాయి చర్చ జరగాలని సభ్యులు సూచించారు. రెక్టార్ ఎం.భాస్కర్, రిజిస్ట్రార్ దేవరాజులు, పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్ అబ్బయ్య, బాలసిద్ధముని, గురుప్రసాద్, రెడ్డిల్యాబ్స్ సీఈవో జీవీ ప్రసాద్, హరి, చంద్రయ్య, అరుణ, బాబు పాల్గొన్నారు. -
మహాజన్ కుట్రదారు కాదు
2జీ స్పెక్ట్రమ్ కేసులో కోర్టు ఉత్తర్వులు న్యూఢిల్లీ: 2002 నాటి 2జీ స్పెక్ట్రం కేసులోకి మునుపటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని లాగాలన్న ప్రయత్నాలకు ప్రత్యేక కోర్టు చెక్‌పెట్టింది. నాటి టెలికం మంత్రి ప్రమోద్ మహాజన్, కార్యదర్శి శ్యామ్‌లాల్ ఘోష్‌లు కుట్రపన్ని అదనపు కేటాయింపుల ద్వారా ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలను నిరూపించడంలో సీబీఐ విఫలమైందని తేల్చిచెప్పింది. స్పెక్ట్రమ్ కేటాయింపులపై మహాజన్, ఘోష్‌లకు విభిన్న అభిప్రాయాలుండేవని, అలాంటప్పుడు వీరిని కుట్రదారులుగా ఎలా పేర్కొంటారని సీబీఐని నిలదీసింది. ఈమేరకు కేసులో ఘోష్‌తోపాటు మరో మూడు టెలికం కంపెనీలు హచిసన్ మ్యాక్స్, స్టెర్లింగ్ సెల్యులార్, భారతి సెల్యులార్‌లపై నమోదుచేసిన అభియోగాలను ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి ఓపీ సైనీ కొట్టివేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు స్పెక్ట్రమ్‌పై సంబంధిత అధికారులతో మంత్రి, కార్యదర్శి సమగ్రంగా చర్చించారని, ప్రైవేటు కంపెనీలకు ఉన్న అవసరాన్ని గుర్తించారని, ఆ సమయంలోనే తదనుగుణంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టు స్పష్టంచేసింది. అలాంటప్పుడు నిర్ణయాన్ని ఏకపక్షంగా, హడావుడిగా తీసుకున్నారని ఎలా చెబుతారని సీబీఐని ప్రశ్నించింది. పూర్తిగా తప్పుడు అభియోగాలతో చార్జిషీట్‌ను పొందుపరిచి, కోర్టును తప్పుదోవ పట్టించాలని దర్యాప్తు సంస్థ ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనికి బాధ్యులైన అధికారులపై విచారణ జరిపించాలని సీబీఐ డెరైక్టర్‌ను కోర్టు ఆదేశించింది. ఇదిలాఉండగా, వాజ్‌పేయి హయాంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్పెక్ట్రం కుంభకోణానికి పాల్పడిందంటూ మరకలంటించాలని కాంగ్రెస్ ప్రయత్నించినట్లు కోర్టు ఉత్తర్వులతో రుజువైందని బీజేపీ పేర్కొంది. -
కోర్టు ఉత్తర్వులు పాటించని ఆస్పత్రులపై చర్యలేవి?: సీఐసీ
న్యూఢిల్లీ: నిరుపేదలకు వైద్యసేవలు అందించని ప్రయివేటు ఆస్పత్రులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ఆరోగ్యశాఖ అధికారులను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ప్రశ్నించింది. ఢిల్లీ హైకోర్టు 2007లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాయితీలతో భూములు పొందిన ప్రయివేటు ఆస్పత్రులు ఆర్థికంగా బలహీనులైన (నెలసరి ఆదాయం రూ. 4,000 కంటే తక్కువ) వారికి ఉచితంగా వైద్య సేవలు అందించాలి. ఆస్పత్రిలోని మొత్తం పడకల్లో 10 శాతం వాటిని పేదలకు కేటాయించాలి. అలాగే ఔట్ పేషంట్ విభాగంలోని(ఓపీడీ) రోగుల్లో 25 శాతం మంది పేదవారికి ఉచితంగా వైద్యం అందించాలి. అయితే కోర్టు ఆదేశాన్ని అమలు చేయడంలో జరుగుతున్న ఆలస్యాన్ని సీఐసీ గుర్తించింది. ఇందుకు బాధ్యులైన ఆరోగ్య శాఖ సమాచార అధికారులైన ఆర్ఎన్.దాస్, లిలీ గాంగ్మైయికి రూ. 25 వేల మేర జరిమానా విధించింది. పిటిషినర్, బాధిత అధికారుల వాదన విన్న తర్వాత ఈ ఆలస్యం వెనుక స్వార్ధపూరిత ఆసక్తి, అవినీతి జరిగి ఉండవచ్చని సీఐసీ అభిప్రాయపడింది. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పింది. భవిష్యత్తులో కూడా కోర్టు తీర్పు అమలు జరుగుతుందనే ఆశ కలగడం లేదని సీఐసీ కమిషనర్ ఆచార్యులు పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే ప్రయివేటు ఆస్పత్రులకు లాభాలు చేకూర్చడానికి కాకుండా పేదవారికి సేవచేసేందుకు ఆరోగ్య శాఖ పనిచేయాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఈ ఆస్పత్రుల నుంచి పన్ను వసూలు చేసి ప్రజాధనాన్ని కాపాడాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నానన్నారు. వీటిని వసూలు చేయడంలో ఆలస్యం జరిగితే అది ప్రజలపై ప్రభావానికి కారణమవుతుందని, తద్వారా అధికారులు తమ బాధ్యతల నుంచి తప్పుకోవడమే అవుతుందని ఆచార్యులు పేర్కొన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును రికవరీ చేయాలి ఢిల్లీ హైకోర్టు 2007లో ఇచ్చిన తీర్పు ఆధారంగా ప్రయివేటు ఆస్పత్రులు అక్రమంగా సంపాదించిన డబ్బును హెల్త్ డెరైక్టరేట్ రికవరీ చేయాలని రాకేశ్ కుమార్ గుప్తా సీఐసీలో ఫిర్యాదు చేశారు. ‘ఆరోగ్య శాఖకు చెందిన ఇద్దరు అధికారులకు వరుసగా ట్రాన్స్పరెన్సీ ప్యానల్ షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ వారు వాటిని పట్టించుకోలేదు. సమాచారాన్ని అందించాల్సిన అధికారులు ఆలస్యం చేస్తున్నారు’ అని పిటిషనర్ గుప్తా ఆరోపించారు. అంతేకాకుండా కొన్ని ఆస్పత్రులకు సంబంధించి ఎలాంటి వివాదం లేదని, కానీ వాటి నుంచి డబ్బును రికవరీ చేయడానికి అధికారులు సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. ప్రయివేటు ఆస్పత్రుల నుంచి అధికారులు పెద్దమొత్తంలో డబ్బు తీసుకొని వారిపై సరైన చర్యలు చేపట్టడం లేదనే అనుమానం వ్యక్తం చేశారు. ఆర్టీఐ ప్రశ్నకు సమాధానమివ్వకుండా ఉండడానికి అధికారులు కొత్త దారులు వెతుకుంటున్నారనే సంగతిని సీఐసీ కమిషనర్ ఆచార్యులు దృష్టికి పిటిషినర్ తీసుకెళ్లారు. ఇది ‘స్పెషల్ కమిటీ అధీనంలో ఉందని, కేసు పురోగతిపై తాము సమాధానం ఇవ్వాల్సిన పనిలేదని’ వారు చెబుతున్నారన్నారు. కాగా, ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంద నే దానికి సంబంధించిన కారణాలను నివేదిక రూపంలో అందించాలని ఆరోగ్య సేవల విభాగం డెరైక్టర్ ఎన్వీ కామత్‌ను సీఐసీ ఆదేశించినట్లు రాకేష్ తెలిపారు. నివేదిక సమర్పించడానికి 30 రోజుల గడువు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు అమలుకు సంబంధించిన ఫైలును అకారణంగా వివిధ విభాగాలు ఎందుకు అట్టిపెట్టుకున్నాయో చెప్పాలని ఆరోగ్య శాఖను సీఐసీ కోరినట్లు పిటిషినర్ తెలియజేశారు. -
టీవీ ప్రసారాలకు సెన్సార్
కేంద్రానికి హైకోర్టు ఉత్తర్వులు టీనగర్: హింస, అసభ్య సన్నివేశాలను అరికట్టేందుకు టీవి ప్రసారాలను సెన్సార్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించి హైకోర్టు న్యాయవాది అలెక్స్ పెన్సికార్ సహా నలుగురు దాఖలు చేసిన ప్రజాహిత పిటిషన్లో ప్రైవేటు చానళ్లు ప్రసారం చేస్తున్న టీవీ కార్యక్రమాల్లో హింస, అశ్లీలం అధికంగా చోటుచేసుకుంటోందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజాన్ని కలుషితం చేస్తాయన్న భీతి కలుగుతోందని, అందువల్ల సినిమాలకు సెన్సార్ ఉన్న విధంగా టీవీ కార్యక్రమాలకు కూడా సెన్సార్ తప్పనిసరి చేయాలని పిటిషన్లో కోరారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఎంఎం సుందరేష్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ విధంగా ఉత్తర్వులిచ్చింది. ఈ కేసులో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ టీవీ కార్యక్రమాలను సెన్సార్ చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఉత్తర్వు లిచ్చారు. -
కోర్టు ధిక్కారం కేసులో ఆర్డీవోకు జైలు, జరిమానా
నరసరావుపేట ఆర్డీవో అరుణ్‌బాబుపై హైకోర్టు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమే కాకుండా పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినందుకు గుంటూరు జిల్లా, నరసరావుపేట రెవిన్యూ డివిజినల్ అధికారి(ఆర్డీవో) పి.అరుణ్‌బాబుకు ఉమ్మడి హైకోర్టు కోర్టు ధిక్కారం కింద వారం రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తీర్పు వెలువరిం చారు. దీనిపై అప్పీల్‌కు వీలుగా ఆర్డీవో తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును నెల రోజుల పాటు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో ఎస్.నరసింహారావు అనే వ్యక్తి రెండెకరాల డీకేటీ పట్టా భూమిని సాగు చేసుకుంటున్నారు. దీనిపై నడిచిన వ్యవహారంలో న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. -
కోర్టు ఉత్తర్వులను గౌరవించడం నేర్చుకోండి
ప్రభుత్వ అధికారులకు హైకోర్టు హితవు హైదరాబాద్: న్యాయస్థానాల పట్ల, అవి ఇచ్చే ఉత్తర్వుల పట్ల అధికారులు గౌరవం చూప డం నేర్చుకోవాలని హైకోర్టు హితవు పలికింది. కోర్టు ఉత్తర్వులకన్నా అధికారులు విదేశీ పర్యటనలకే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోందంటూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాస నం ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశాలిచ్చినా పట్టించుకోకుండా విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన(రాజకీయ) శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీపై ధర్మాసనం ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. బుధవారం తివారీ అప్పీళ్లన్నింటినీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ విచారణకు తివా రీ కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టులు రా జ్యాంగబద్ధంగా ఏర్పాటయ్యాయన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని హితవు పలికింది. కోర్టు ఉత్తర్వుల అమలు చేయకుంటే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో అధికారులు వివరించాలని తివారీ తరఫున హాజరైన ఆంధ్రప్రదేశ్ అ డ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్‌కు ధర్మాసనం సూచించింది. విదేశీ పర్యటనలకన్నా కోర్టు ఉత్తర్వులు, ఆదేశాలు ముఖ్యమన్న విషయంపై అధికారులను చైతన్యపరచాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామని, సిం గిల్ జడ్జి ముందు హాజరై క్షమాపణ కోరాలని, అలా చేయని పక్షంలో వారెంట్ అమల్లోకి వస్తుం దని తివారీకి ధర్మాసనం తేల్చి చెప్పింది. -
హెచ్‌సీఏపై మరో పిడుగు
- విశాకకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు - స్టేడియం హక్కుల వివాదం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కొత్త కార్యవర్గానికి ఎన్నికైన రెండు వారాల్లోపే షాక్ తగిలింది. ఉప్పల్ మైదానంలో ‘ఇన్ స్టేడియా’ హక్కులకు సంబంధించి హెచ్‌సీఏ తరఫున అధ్యక్షుడు అర్షద్ అయూబ్ వేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు తోసిపుచ్చింది. ఆర్బిట్రేషన్ ప్రక్రియ పూర్తి కానంత వరకు విశాక ఇండస్ట్రీస్‌కు అనుకూలంగా గతంలో వేర్వేరు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులే అమలవుతాయని స్పష్టం చేసింది. ఫలితంగా ప్రస్తుతం జరుగుతున్న సీఎల్ టి20 టోర్నీకి సంబంధించి విశాకకు హెచ్‌సీఏ నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే కోర్టు ఉల్లంఘన కింద హెచ్‌సీఏపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అదే జరిగితే బుధవారంనుంచి జరగాల్సిన మ్యాచ్‌లు సందేహంలో పడినట్లే! హెచ్‌సీఏ, విశాక మధ్య జరిగిన 2004లో ఒప్పందం ప్రకారం స్టేడియంలో ఏ మ్యాచ్ జరిగినా మైదానం లోపల ప్రకటనలు ప్రదర్శించుకునేందుకు విశాక ఇండస్ట్రీస్‌కు హక్కు ఉంది. అలా కాని సందర్భంలో దానికి తగిన మొత్తం వారికి హెచ్‌సీఏ చెల్లించాల్సి ఉంటుంది. 2011లో ఈ విధంగా ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగినప్పుడు హెచ్‌సీఏ రూ. 75 లక్షలు చెల్లించింది. అయితే ఆ తర్వాత రెండేళ్లు హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జి. వినోద్ ఉన్న సమయంలో ఇది జరగలేదు. ఆర్బిట్రేషన్ ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని నిర్ణయించినా అది వేగంగా సాగలేదు. ఈ మధ్య కాలంలో హెచ్‌సీఏ సిటీ సివిల్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించినా తీర్పు వ్యతిరేకంగానే వచ్చింది. అయితే ఈ నెల 7న ఎన్నికల్లో ఓడిపోగానే వినోద్ మరో సారి హెచ్‌సీఏకు నోటీసు పంపించారు. ఈ దశలో చర్చలతో సమస్యను పరిష్కరించుకోకుండా అర్షద్ అయూబ్ మళ్లీ కోర్టుకెక్కారు. -
లాడ్ సోదరులకు అమేజింగ్ షాక్
అటవీ భూమిని ఆక్రమించుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు 47.24 ఎకరాల్లో రిసార్ట్ ఏర్పాటు కోర్టు ఆదేశాలతో వెలుగు చూసిన వాస్తవాలు భారీ బందోబస్తు మధ్య స్వాధీనం చేసుకున్న అధికారులు సాక్షి, బళ్లారి : అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల అక్రమాలు బహిర్గతమయ్యాయి. బళ్లారి సిటీ ఎమ్మెల్యే, గనుల యజమాని అనిల్‌లాడ్, కలఘటిగి ఎమ్మెల్యే సంతోష్‌లాడ్ కుటుంబసభ్యులు సండూరు - మురారీపుర మధ్య అటవీ భూమిని ఆక్రమించుకుని ఏర్పాటుచేసిన రిసార్ట్‌ను అధికారులు సీజ్ చేశారు. బళ్లారి జిల్లా సహాయ అటవీ సంరక్షణాధికారి బసవరాజప్ప నేతృత్వంలో భారీ బందోబస్తు మధ్య సండూరు శివారులోని అమేజింగ్ వ్యాలీ రిసార్ట్‌ను అధికారులు గురువారం ఉదయం చేరుకున్నారు. మొత్తం 47.24 ఎకరాల్లో రిసార్ట్ ఏర్పాటు చేసి నెలకు రూ. లక్షల్లోనే గడిస్తున్నట్లు గుర్తించారు. చుట్టూ సుందరమైన కొండలు, పక్కనే నది ఉన్న అటవీ భూమిలో రిసార్ట ఏర్పాటు చేసుకుని, అక్రమార్జనకు తెరలేపారన్న ఫిర్యాదులు అందడంతో విచారణకు లాడ్ సోదరులకు ‘అమేజింగ్’ షాక్ న్యాయస్థానం ఆదేశించింది. దీంతో వాస్తవాలు బహిర్గతమయ్యాయి. జూలై 30 లోపు రిసార్ట ఖాళీ చేయాలని అదే నెల 10న అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై అనిల్‌లాడ్ కుటుంబసభ్యులు స్పందించకపోవడంతో అధికారిక చర్యలు చేపట్టారు. రిసార్‌టకు చేరుకుని సీజ్ చేశారు. అక్కడ ఆదేశ పత్రాలు అతికించారు. అనిల్‌లాడ్ అన్న భార్య పేరుపై... అమేజింగ్ వ్యాలీ రిసార్ట అనిల్‌లాడ్ అన్న భార్య రజనీలాడ్ పేరుపై ఉంది. ఈ రిసార్‌టకు అనుకుని ఉన్న సర్వే నంబర్ 410లో 3.65 ఎకరాల భూమిని అప్పట్లో అనిల్ సోదరుడు అశోక్ లాడ్ కొనుగోలు చేశాడు. 1999-2000లో అప్పటి అసిస్టెంట్ కమిషనర్ నుంచి ఈ భూమిని వ్యవసాయేతర కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు ఎన్ఓ కూడా పొందారు. అనంతరం ఆ భూమి పక్కనే ఉన్న 47.24 ఎకరాల భూమిని ఆక్రమించుకుని విలాసవంతమైన రిసార్ట నిర్మించారు. అశోక్‌లాడ్ మరణానంతరం ఆ రిసార్టను అతని భార్య రజనీ లాడ్ పేరిట బదిలీ చేయించారు. అటవీ భూమి చుట్టు పక్కల వంద మీటర్ల పరిధిలో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు లేకుండా చేశారు. నిబంధనలు అతిక్రమించి రిసార్ట నిర్మించారంటూ 2012లో హైకోర్టులో బెంగళూరుకు చెందిన ఆర్టీ కార్యకర్త శ్రీనివాస్.... పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అటవీ భూమిని ఖాళీ చేయించాలని ఆదేశించింది. అంతేగాకుండా ఈ కేసును అటవీ శాఖ కోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించింది. ఆ మేరకు ముఖ్య అటవీ సంరక్షణ న్యాయాలయం జూలై 30లోగా రిసార్ట్‌ను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. స్వాధీన ప్రకియలో వలయ అటవీ అధికారి గణేష్, మంజునాథ్, భాస్కర్, సిబ్బంది పాల్గొనగా, వీరికి డీఎస్పీ పీడీ గజకోశ, సీఐ రమేష్ రావ్, ఎస్ఐ షన్ముఖప్ప, సిబ్బంది పాల్గొన్నారు. -
దక్షిణ ఢిల్లీ మేయర్‌పై తాజా ఎఫ్ఐఆర్కు ఆదేశం
గుర్గావ్: బోగస్ ఓట్ల కేసుకు సంబంధించి హర్యానా యువజన, క్రీడా శాఖమంత్రి సుఖ్బీర్ కటారియాతోపాటు దక్షిణ ఢిల్లీ మేయర్ సరితాచౌదరిపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మహేందర్‌సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా హర్యానా యువజన, క్రీడా శాఖమంత్రి సుఖ్బీర్ కటారియాపై ఇప్పటికే ఆరు ఎఫ్ఐఆర్లు నమోదైన సంగతి విదితమే. తాజాగా ఆయనతోపాటు మరో 55 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1407 నంబరుగల ఇంట్లో నివాసముంటున్నట్టు పేర్కొన్న సరిత... గుర్గావ్ ఓటర్ల జాబితాలో చోటుసంపాదించుకున్నారని ఫిర్యాదుదారుడు, సామాజిక కార్యకర్త ఓంప్రకాశ్ కటారియా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదే చిరునామాపై మొత్తం 81 ఓట్లు ఉన్నాయని, అయితే ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంలో అదొక ఖాళీ స్థలమని తేలిందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి భారతీయ శిక్షాస్మృతిలోని 420, 467, 468, 471, 120-బి సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. -
ఏసీబీ వలలో ఫారెస్ట్‌చేపలు
దొరికిపోయిన సెక్షన్ అధికారి, బీట్ ఆఫీసర్ రూ. 15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇద్దరు ఉద్యోగులు కలప వ్యాపారి ఫిర్యాదు ఫలితం అరకులోయ, న్యూస్‌లైన్ : ఆమ్యా మ్యా ముట్టజెప్పందే కలప తరలింపు కుదరదన్నారు. హైకోర్టు ఉత్తర్వు ఉందని మొత్తుకున్నా మాకేమిటన్నారు. కలప కదలాలంటే క్యాష్ పడాల్సిందేనని పట్టుబట్టా రు. చివరికి ఏసీబీ పన్నిన ఉచ్చులో చిక్కుకుని ఉసూరంటున్నారు. అరకులోయ అటవీ శాఖ టెరిటోరియల్ రేంజిలో పని చేస్తున్న ఇద్దరు అటవీ శాఖ అధికారులు శుక్రవారం లంచం పుచ్చుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ ఎం.నరసింహారావు అందించిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా సాలూరు మండలం సామంతవలస గ్రామానికి చెందిన టి.వి.శివరావు అనే కలప వ్యాపారి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు పెంచుతున్న నీలగిరి చెట్లను కొనుగోలు చేసి మైదాన ప్రాంతానికి తరలిస్తూ ఉంటారు. అటవీ శాఖ ఉద్యోగులు నిత్యం ఇబ్బందులు పెడుతూ ఉండడంతో వ్యాపారి హైకోర్టును ఆశ్రయించి నీలగిరి దుంగలను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి తరలించడానికి అనుమతి పొందారు. కానీ ఇద్దరు ఉద్యోగులు మళ్లీ అడ్డుపడ్డారు. కోర్టు అనుమతితో తమకు సంబంధం లేదని, అటవీ శాఖ అనుమతి లేకుండా తరలిస్తున్నందుకు ఒక లోడుకు రూ. 20 వేలు లంచం కావాలని సుంకరమెట్ట సెక్షన్ అధికారి వి.వి నాయుడు, బీట్ ఆఫీసర్ పి.అప్పలరాజు శివరావును డిమాండ్ చేశారు. దీంతో వ్యాపారి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. రూ. 15 వేలు ఇస్తానని అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈలోగా ఏసీబీ అధికారులు వల పన్ని అరకులోయ అటవీశాఖ కార్యాలయం ఆవరణలో శుక్రవారం సాయంత్రం మాటు వేశారు. కార్యాలయంలోనే వారిద్దరూ రూ. 15 వేలు నగదు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి డబ్బు స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ చెప్పారు. వారి గదిలో ఉన్న రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. డుంబ్రిగుడ ఎస్ఐ మురళీకృష్ణ ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన మరువక ముందే ఇద్దరు అటవీ శాఖ ఉద్యోగులు ఏసీబీకి పట్టు బడడంతో అవినీతి ఉద్యోగులు హడలెత్తుతున్నారు. లంచం అడిగితే ఫిర్యాదు లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, ఎవరు లంచం అడిగినా వెంటనే తమకు సమాచారం అందివ్వాలని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. 9440446170 నంబర్‌కు ఫోన్ చేయాలని చెప్పారు. చాలా ఇబ్బంది పెట్టేవారు నీలగిరి దుంగలను తరలించడానికి అటవీ శాఖ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పెట్టారు. అందుకే ఏసీబీని ఆశ్రయించవలసి వచ్చింది. కోర్టు అనుమతితోనే వృక్షాలను నరికించి తరలిస్తున్నాను. శివరావు, కలప వ్యాపారస్తుడు, సాలూరు, విజయ నగరం జిల్లా. -
బళ్లారి ఏసీ కార్యాలయ ఫర్నీచర్ జప్తు
సాక్షి, బళ్లారి : ఓ రైతుకు పరిహారం ఇవ్వడంలో బళ్లారి జిల్లా అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) కార్యాలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ కార్యాలయ ఫర్నీచర్‌ను కోర్టు ఆదేశాల మేరకు కోర్టు సిబ్బంది బుధవారం జప్తు చేశారు. బళ్లారి జిల్లా తోరణగల్లు వద్ద ఏర్పాటు చేసిన వీఎస్‌పీఎల్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం 1979లో కుడితినికి చెందిన రైతు వెంకటప్ప ఆధీనంలోని 20.47 ఎకరాల భూమిని ఎకరా రూ.6,500 ప్రకారం సేకరించింది. పరిహారం పూర్తిగా అందకపోవడంతో సదరు రైతు 1997లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్పందించి రైతుకు రూ.3లక్షల పరిహారం ఇవ్వాలని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ అధికారులను ఆదేశించినా ఎలాంటి స్పందన లేకపోయింది. దీంతో కార్యాలయ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని వెంకటప్ప కుమారుడు ఘన శ్యామ సుందరమూర్తికి సూచిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈనేపథ్యంలో మంగళవారం శ్యామసుందరమూర్తి ఏసీ కార్యాలయాన్ని జప్తు చేసేందుకు వెళ్లగా ఏసీ అందుబాటలో లేరు. దీంతో అధికారులు ఒకరోజు గడువు తీసుకున్నారు. బుధవారం ఉదయం వరకూ పరిహారం విషయంపై అధికారులు ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారు. దీంతో ఘన శ్యామ సుందరమూర్తితో పాటు కోర్టు సిబ్బంది శ్రీకాంత్, సంబంధిత లాయరు ఏసీ కార్యాలయానికి చేరుకుని ఏసీ కుర్చీతో పాటు పలువురు అధికారుల కుర్చీలు, ఇతర సామగ్రిని జప్తు చేసి లారీలోకి వేసి కోర్టుకు అప్పగించారు. రైతుకు ప్రభుత్వం పరిహారం అందించిన తర్వాతనే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న సామగ్రిని తిరిగి ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. కార్యాలయానికి తాళాలు: కోర్టు సిబ్బంది ఏసీ కుర్చీతోపాటు ఇతర అధికారుల కుర్చీలను జప్తు చేసి స్వాధీనం చేసుకోవడంతో కూర్చునేందుకు కుర్చీలు లేక అధికారులు కార్యాలయానికి తాళం వేశారు. జిల్లాధికారి తర్వాత అంతే హోదా కలిగిన అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని జప్తు చేయడం, ఆ తర్వాత అధికారులు కార్యాలయానికి తాళాలు వేయడం నగరంలో చర్చనీయాంశమైంది. దాదాపు 30 ఏళ్లపాటు రైతుకు పరిహారం అందించకుండా అధికారులు ఎందుకు కాలయాపన చేశారనే విషయంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా పలువురు రైతులు అక్కడికి చేరుకుని ఘనశ్యామసుందరమూర్తికి మద్దతు తెలిపారు.