
సాక్షి, గుంటూరు: క్రికెట్ మైదానంలో ఇదో అనూహ్య ఘటన... నేరుగా కోర్టు ఉత్తర్వులు పట్టుకొని అధికారులు మైదానంలోకి రావడం, అప్పటికప్పుడు మ్యాచ్ నిలిపివేస్తూ ఆదేశించడం... ఏ స్థాయిలోనూ ఎప్పుడూ జరగనిది! గుంటూరు శివార్లలోని పేరిచర్ల క్రికెట్ స్టేడియంలో జమ్మూ కశ్మీర్, గోవా జట్ల మధ్య జరుగుతున్న అండర్–23 మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాలతో బీసీసీఐ అధికారిక టోర్నీ కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ మ్యాచ్‌ను ఉన్నపళంగా నిలిపివేయడం ఆటగాళ్లకు షాక్ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ జట్టులో ఒక ఆటగాడి ఎంపికకు సంబంధించిన వివాదమే ఇందుకు కారణం.
సీకే నాయుడు ట్రోఫీ కోసం ఇటీవల జమ్మూ కశ్మీర్ జట్టు ఎంపిక జరిగింది. అయితే సెలక్షన్ ట్రయల్స్‌లో, అంతకుముందు టోర్నీలలో కూడా తన ప్రదర్శన బాగున్నా తనను ఎంపిక చేయలేదని హిషామ్ సలీమ్ అనే కుర్రాడు కోర్టుకెక్కాడు. పైగా సెలక్టర్లలో ఒకరైన మన్సూర్ అహ్మద్ తన కొడుకు మోమిన్ మన్సూర్‌కు చోటిచ్చాడని అతను పిటిషన్ వేశాడు. హిషామ్ తండ్రి కశ్మీర్ వైద్య శాఖలో డైరెక్టర్‌గా ఉన్నతాధికారి హోదాలో పని చేస్తుండటంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జట్టును ప్రకటించవద్దంటూ కోర్టు ఆదేశించింది. అయితే అప్పటికే జమ్మూ కశ్మీర్ క్రికెట్ సంఘం 16 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసి మ్యాచ్ ఆడేందుకు గుంటూరుకు పంపించింది. ఆదివారం పేరిచర్లలోని ఏసీఏ క్రికెట్ గ్రౌండ్‌లో కశ్మీర్, గోవా నాలుగు రోజుల మ్యాచ్ ప్రారంభమైంది.
టాస్ గెలిచిన కశ్మీర్ ఫీల్డింగ్ ఎంచుకోగా 13 ఓవర్లలో గోవా వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. అయితే సరిగ్గా ఆ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాదులు జమ్మూ కశ్మీర్ హైకోర్టు ఆదేశాలతో వచ్చారు. దాని ప్రతిని వారు మ్యాచ్ రిఫరీకి అందజేశారు. మ్యాచ్‌ను కొనసాగిస్తే కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కిందకు వస్తుందని భావించిన రిఫరీ సుహైల్ అన్సారీ మ్యాచ్‌ను నిలిపేశారు. ఆ తర్వాత సోమ, మంగళవారాలు కూడా ఈ విషయంపై మరింత స్పష్టత తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రయత్నించినా లాభం లేకపోయింది. దాంతో వరుసగా మూడో రోజు కూడా మ్యాచ్ జరగలేదు. అయితే ఒక్కరి కోసం మ్యాచ్‌ను మధ్యలో ఆపేయడం దురదృష్టకరమన్న కశ్మీర్ అధికారులు... ఇకపై ఎంపిక కాని ప్రతీ ఆటగాడు కోర్టును ఆశ్రయించే చెడు సాంప్రదాయానికి ఇది దారి తీస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment