అండర్-23 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ 2024 ఎడిషన్ తొలి క్వార్టర్ ఫైనల్లో ఉత్తర్‌ప్రదేశ్ ఆటగాడు, చెనై సూపర్ కింగ్స్ ప్లేయర్ సమీర్ రిజ్వి ట్రిపుల్ సెంచరీతో ఇరగదీశాడు. సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో రిజ్వి 266 బంతులు ఎదుర్కొని 33 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 312 పరుగులు చేశాడు. రిజ్వి ట్రిపుల్ సెంచరీతో విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ అతి భారీ స్కోర్ చేసింది.
147 ఓవర్ల అనంతరం ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 719 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. రిజ్వికి జతగా రితురాజ్ శర్మ (132) సెంచరీతో కదంతొక్కాడు. స్వస్తిక్ (57), సిద్దార్థ్ యాదవ్ (84) అర్దసెంచరీలతో రాణించారు. విప్రాజ్ నిగమ్ (19), ఆకిబ్ ఖాన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. సౌరాష్ట్ర బౌలర్లలో ఆదిత్యసిన్హ్ జడేజా 5 వికెట్లు పడగొట్టగా.. నీల్ పాండ్యా 2, గజ్జర్ సమ్మార్ ఓ వికెట్ దక్కించుకున్నారు. రెండో రోజు ఆట కొనసాగుతుంది.
మిగతా మూడు క్వార్టర్ ఫైనల్స్ విషయానికొస్తే.. రెండో క్వార్టర్ ఫైనల్లో విదర్భ, తమిళనాడు.. మూడో క్వార్టర్ ఫైనల్లో జార్ఖండ్, కర్ణాటక.. నాలుగో క్వార్టర్ ఫైనల్లో రైల్వేస్, ముంబై జట్లు తలపడుతున్నాయి.
తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ.. మోఖడే (151), మహళే (117) సెంచరీలతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 380 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.
జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగులు చేసి ఆలౌటైంది. ప్రకార్ చతుర్వేది (147), స్మరణ్ (106) సెంచరీలతో చెలరేగారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ రెండో రోజు టీ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.
ముంబైతో జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసి రైల్వేస్ 165 పరుగులకు ఆలౌటైంది. హిమాన్షు సింగ్ ఏడు వికెట్లు తీసి రైల్వేస్ పతనాన్ని శాశించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. దివ్యాంశ్ సక్సేనా సెంచరీతో (104) రాణించడంతో 6 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది.
జాక్‌పాట్ కొట్టిన సమీర్ రిజ్వి..
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సమీర్ రిజ్వి ఐపీఎల్ 2024 వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. 20 ఏళ్ల రిజ్విని చెన్నై సూపర్ కింగ్స్ 8.4 కోట్ల రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో ఓ అన్ క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌కు లభించిన అత్యధిక ధర ఇదే.
ఈ వేలంలో రిజ్వి కోసం గుజరాత్ టైటాన్స్ సైతం తీవ్రంగా ప్రయత్నించింది. కుడి చేతి వాటం డాషింగ్ బ్యాటర్ అయిన రిజ్వి.. యూపీ టీ20 లీగ్‌లో మెరుపు శతకం బాదడం ద్వారా వెలుగులోకి వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment