సాక్షి, హైదరాబాద్: ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని వాడరేవు–నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు (వాన్‌పిక్) కోసం సేకరించిన 11,804.78 ఎకరాల అసైన్డ్ భూమిని అటాచ్‌మెంట్ నుంచి వెంటనే విడుదల చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆ జప్తు చెల్లదని సీజే ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది.
అంతేకాక.. 11,804.78 ఎకరాల భూమిని జప్తుచేస్తూ ఈడీ జారీచేసిన ఉత్తర్వులను, వాటిని అడ్జ్యుడికేటింగ్ అథారిటీ సమర్థించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అలాగే, వాన్‌పిక్ భూముల జప్తును కొనసాగిస్తూ, భూముల విడుదల కోసం మనీలాండరింగ్ నిరోధక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ వాన్‌పిక్‌కు అప్పిలేట్ ట్రిబ్యునల్ సూచించడం కూడా సరికాదంది.
ఒకవైపు ఆస్తుల జప్తు చట్టవిరుద్ధమని చెబుతూనే విడుదలకు కింది కోర్టును ఆశ్రయించమని ట్రిబ్యునల్ ఎలా సూచిస్తుందని ప్రశ్నించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం తీర్పునిచ్చింది.
కేసు నేపథ్యం ఇదీ..
‘వాన్‌పిక్’ ఏర్పాటు నిమిత్తం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రకాశం–గుంటూరు జిల్లాల పరిధిలో 13,221.69 ఎకరాల భూములను కేటాయించింది. వాన్‌పిక్ ప్రాజెక్టు విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల్లో ఒకటైన రస్ అల్ ఖైమాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్టు అమలుకు వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషల్ పర్సస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఏర్పాటయ్యాయి.
అయితే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకుగాను క్విడ్ ప్రో కోలో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన కంపెనీలకు ఈ కేటాయింపులు జరిగాయంటూ సీబీఐ ఆరోపించింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఆ తరువాత వాన్‌పిక్‌కు భూకేటాయింపులపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్ ఆధారంగా వాన్‌పిక్‌కు చెందిన 1,416.91 ఎకరాల భూమిని 2014లో జప్తుచేస్తూ ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీచేసింది.
దీనిపై వాన్‌పిక్ పోర్ట్స్, వాన్‌పిక్ ప్రాజెక్స్.. అప్పీలెట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉండగానే మరో 11,804.78 ఎకరాల అసైన్డ్ భూమిని 2017లో జప్తుచేస్తూ ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులతో 13,221.69 ఎకరాలను పూర్తిగా జప్తుచేసింది. ఈ ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్ అథారిటీ సమర్థించింది.
క్విడ్ ప్రో కో అన్నదే లేదు..
ఈ జప్తుపై కూడా ‘వాన్‌పిక్’ కంపెనీలు అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ రెండు జప్తులపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ 2019, జూలైలో తీర్పు వెలువరించింది. తాత్కాలిక జప్తు సమయంలో ఇది నేరపూరిత సొమ్ము అని దర్యాప్తు సంస్థ విశ్వాసంలోకి తీసుకోవడానికిగాను సంబంధించి కారణాలను వివరించాల్సి ఉందని.. కానీ, ఎలాంటి కారణాలు లేకపోయినా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జప్తును సమర్థించడం సరికాదని పేర్కొంది.
ఎలాంటి క్విడ్ ప్రోకో లేదని, జప్తువల్ల ఎలాంటి ప్రయోజనంలేదని, కోర్టులో కేసు విచారణ పూర్తిచేయడానికి ఏళ్లు పడుతుందని, అంతవరకు ప్రజాప్రయోజనాలకు చెందిన ఆస్తుల జప్తు సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలా ఈడీ, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీచేసిన జప్తు ఉత్తర్వులను తప్పుబట్టడమే కాకుండా వాటిని రద్దుచేసింది. అయితే, భూముల జప్తును మాత్రం కొనసాగిస్తూ వాటి విడుదల కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని ట్రిబ్యునల్ సూచించింది.
హైకోర్టును ఆశ్రయించిన వాన్‌పిక్..
భూమి విడుదలకు సంబంధించి అప్పిలెట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ ప్రాజెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో వేర్వేరుగా మూడు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వాన్‌పిక్ తరఫున సీనియర్ న్యాయవాది అతుల్ నంద, ఈడీ తరఫున అనిల్ ప్రసాద్ తివారీ వాదనలు వినిపించారు.
వాదనలు విన్న ధర్మాసనం.. 561 ఎకరాలు, 855 ఎకరాల జప్తు విషయంలోని రెండు అప్పిళ్లకు సంబంధించి గత సెప్టెంబర్‌లో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వెంటనే 1,416.91 ఎకరాలను విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, 11,804.78 ఎకరాల జప్తునకు సంబంధించి మాత్రం కొంత అస్పష్టత ఉండటంతో దీనిపై విచారణను కొనసాగించి.. శుక్రవారం తీర్పునిచ్చింది. నిబంధనలను పాటించకుండా ఈడీ జప్తు చేసిందని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.
ఈడీ చర్యను సమర్థిస్తూ చట్ట విరుద్ధంగా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు ఇచ్చిందంటూనే ఆ చట్ట ఉల్లంఘనను కొనసాగించాలంటూ అప్పీలేట్ ట్రిబ్యునల్ చెప్పడం సరికాదని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టవిరుద్ధమని తేలినప్పుడు ఆస్తులను విడుదల చేయాలని చెప్పే తన అధికారాన్ని ట్రిబ్యునల్ వినియోగించుకోకుండా కింది కోర్టుకు వెళ్లమనడం ఎంతమాత్రం సరికాదంది. 11,804.78 ఎకరాల అసైన్డ్ భూములను వెంటనే విడుదల చేయాలని ఈడీ ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment