vanpic lands
-
బాబు, సోనియా ఏపీకి అన్యాయం చేశారా? ఇదిగో ఇలా బయటపడింది..!
వాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌కు మరో ఆభరణం లభించినట్లయిందా? ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడప ఎంపీగా ఉన్న సమయంలో సొంతంగా పార్టీ పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలిసి ఆయనపై పెట్టిన కేసులలోని డొల్లతనం ఒక్కొక్కటి బయటపడుతోంది. ఆ కేసులను న్యాయస్థానాలు కొట్టివేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఒకరకంగా సంచలనంగా ఉన్నాయని చెప్పాలి. వాన్ పిక్ ప్రాజెక్టు ఆస్తులను జప్తు చేస్తున్న రోజులలోనే, ఈ కంపెనీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్‌ను జగన్ కేసులలో ఇరికించి అరెస్టు చేసినప్పుడే ఇది చాలా అన్యాయమని నేను అభిప్రాయపడ్డారు. పలు ఆర్టికల్స్ కూడా రాశాను. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టినందుకు వాన్ పిక్కు భూములు కేటాయించారంటూ సీబీఐ పెట్టిన కేసు ఎంత అధ్వాన్నమైనదో ఇప్పుడు రుజువు అయింది. ఎక్కడైనా పరిశ్రమలు పెడతామని రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేస్తే అరెస్టు చేయాలి కాని, పరిశ్రమల స్థాపనకు భూములు సేకరించిన కంపెనీపైన, ఆ కంపెనీ చైర్మన్ పైన కేసు పెట్టడం ఏమిటా అన్న బాధ కలిగేది. కాని మన దేశంలో ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో బ్యాంకులకు రుణాలు ఎగవేసినవారు హాపీగా కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతల సరసన ఉండగలుగుతున్నారు. వాన్‌పిక్ ప్రాజెక్టు కనుక అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఉంటే, ఈ రోజున ఏపీకి పెద్ద ఆభరణం లభించినట్లయ్యేది. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చీరాల, రేపల్లె ప్రాంతంలో బారీ ఎత్తున పవర్ ప్రాజెక్టులు, ఇతర ఓడరేవు ఆధారిత పరిశ్రమలు స్థాపించడానికి గాను వాన్ పిక్ సంస్థకు సుమారు 13 వేల ఎకరాల భూములను కేటాయించారు. వీటిలో ఎక్కువగా ప్రభుత్వ అస్సైన్డ్ భూములుఉన్నాయి. అస్సైన్డ్ లబ్దిదారులు ఎవరికైనా తమ భూమిని అమ్ముకున్నా, ఆ కొనుగోలుదారులతో పాటు, ఒరిజినల్ యజమానులకు కూడా నిర్దిష్ట పరిహారం చెల్లించి అందరిని సంతృప్తిపరిచి భూములు సేకరించారు. అవి కూడా సేద్యానికి పనికిరాని భూములే అత్యధికం. కాని జగన్ మీద అక్కసుతో సీబిఐ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టి పారిశ్రామికవేత్తలను అరెస్టు చేసింది. సిబిఐకి తోడు ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా అదే ప్రకారం ఆస్తులను జప్తు చేసింది. ఇదంతా దశాబ్దం క్రితం జరిగింది. అప్పటి నుంచి ఆ భూములన్నీ వృధాగా పడి ఉన్నాయి. రావల్సిన పరిశ్రమలు రాకుండా పోయాయి. ఈ రకంగా ఏపీకి సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు, సిబిఐ ఆనాటి జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తీరని అన్యాయం చేశారు. పరిశ్రమలు రాకుండా చేశారు. చదవండి: పవన్ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని.. అదే కనుక అప్పుడే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా ఉంటే, ఈ పాటికి అక్కడ అభివృద్ది జరిగి ఉండేది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ప్రాజెక్టు ఏపీకి పెద్ద ఆస్తిగా మారి ఉండేది. వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చి ఉండేవి. చిత్రం ఏమిటంటే పరిశ్రమలు పెట్టిన జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, ఆనాటి మంత్రి మోపిదేవి వెంకటరమణ వంటివారు జైళ్లలో మగ్గవలసి వచ్చింది. పరిశ్రమలు పెట్టకుండా వేల కోట్లు ఎగవేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సుజన చౌదరి, లగడపాటి రాజగోపాల్, టి.సుబ్బరామిరెడ్డి , రాయపాటి సాంబశివరావు.. ఇలా టీడీపీ,కాంగ్రెస్, బీజేపీలో చేరిన కొందరు టీడీపీ నేతలకు రాజభోగాలు అనుభవించగలుగుతున్నారు. ఆ రోజుల్లో ఈడి జప్తు చేసిన ఈ భూమి విలువను సుమారు నలభై మూడు వేల కోట్లుగా లెక్కగట్టారు. ఈ ఆస్తి అంతా జగన్ దేనని చంద్రబాబు, టీడీపీ నేతలు, తప్పుడు ప్రచారం చేశారు. వైఎస్ ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును చేపట్టినప్పుడు భూ సేకరణకు కూడా టీడీపీ అడ్డుపడింది. అయినా వైఎస్ ముందుకు వెళ్లారు. ఆయన ఆకస్మిక మరణం మొత్తం రాష్ట్రానికి తీరని నష్టం చేసింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో సోనియా, చంద్రబాబు ఏకమవడం, సిబిఐ లక్ష్మీనారాయణను అడ్డు పెట్టుకుని కేసులు నడిపించడం వంటివి చేశారని పలు విమర్శలు వచ్చేవి. ఈనాడు రామోజీరావు వంటివారు పలు తప్పుడు కథనాలు ఇచ్చి ప్రజలను తప్పుదారి పట్టించడం నిత్య కృత్యంగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి కనువిప్పు అవుతుంది. దేశానికి ఇలాంటి ప్రాజెక్టులు ఎంత అవసరమో ఆ గౌరవ న్యాయ స్థానం గుర్తించినట్లయింది. కింది కోర్టు మైండ్ అప్లై చేయకుండా యాంత్రికంగా ఆస్తుల జప్తును సమర్ధించిందని అభిప్రాయపడింది. మొత్తం ఈడి చార్జీషీట్‌ను తప్పుపట్టింది. ఇది ఏపీకి శుభకరమైన విషయం అని చెప్పాలి. తీర ప్రాంతంపై బాగా దృష్టి పెట్టి అభివృద్ది చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఈ తీర్పును అవకాశంగా తీసుకుని నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఎంకరేజ్ చేసి ఇప్పటికైనా ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చేలా చేయగలగాలి. చదవండి: ‘వాన్‌పిక్’ ఆస్తుల అటాచ్మెంట్ చెల్లదు నిజానికి నిమ్మగడ్డ ప్రసాద్ ఈ ప్రాజెక్టు టేకప్ చేయకుండా ఉంటే జైలుకు వెళ్లవలసి వచ్చేదికాదు. విదేశాలలో సైతం ఇబ్బంది పడవలసి వచ్చేదికాదు. కేవలం సీబిఐ,ఈడీ వంటి సంస్థల నిర్వాకం వల్ల ఇలా జరిగింది. వీటన్నిటిని మనసులో పెట్టుకుని ప్రాజెక్టును వదలివేయకుండా నిమ్మగడ్డ దీనిని ముందుకు తీసుకువెళితే బాగుంటుంది. రాష్ట్రాభివృద్దికి అడ్డుపడిన తెలుగుదేశం, కాంగ్రెస్ వంటి పార్టీలు పైకి మాత్రం అభివృద్ది కాముకులుగా పిక్చర్ ఇస్తుంటాయి. కాని లోపల మాత్రం ఇలాంటి కుట్రలు పన్ని ఏపీ అభివృద్దికి విఘాతం కలిగించాయి. నలభై మూడువేల కోట్ల అక్రమాలు జరిగాయని ఇంత కాలం ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన వాదన తప్పని అంగీకరిస్తారా? లేక కొత్తగా ఏదో ఒక దిక్కుమాలిన ప్రచారం చేస్తారా? అన్నది చూడాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
‘వాన్‌పిక్’ ఆస్తుల అటాచ్మెంట్ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని వాడరేవు–నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు (వాన్‌పిక్) కోసం సేకరించిన 11,804.78 ఎకరాల అసైన్డ్ భూమిని అటాచ్మెంట్ నుంచి వెంటనే విడుదల చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆ జప్తు చెల్లదని సీజే ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. అంతేకాక.. 11,804.78 ఎకరాల భూమిని జప్తుచేస్తూ ఈడీ జారీచేసిన ఉత్తర్వులను, వాటిని అడ్జ్యుడికేటింగ్ అథారిటీ సమర్థించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అలాగే, వాన్‌పిక్ భూముల జప్తును కొనసాగిస్తూ, భూముల విడుదల కోసం మనీలాండరింగ్ నిరోధక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ వాన్‌పిక్‌కు అప్పిలేట్ ట్రిబ్యునల్ సూచించడం కూడా సరికాదంది. ఒకవైపు ఆస్తుల జప్తు చట్టవిరుద్ధమని చెబుతూనే విడుదలకు కింది కోర్టును ఆశ్రయించమని ట్రిబ్యునల్ ఎలా సూచిస్తుందని ప్రశ్నించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం తీర్పునిచ్చింది. కేసు నేపథ్యం ఇదీ.. ‘వాన్‌పిక్’ ఏర్పాటు నిమిత్తం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రకాశం–గుంటూరు జిల్లాల పరిధిలో 13,221.69 ఎకరాల భూములను కేటాయించింది. వాన్‌పిక్ ప్రాజెక్టు విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల్లో ఒకటైన రస్ అల్ ఖైమాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్టు అమలుకు వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషల్ పర్సస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఏర్పాటయ్యాయి. అయితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకుగాను క్విడ్ ప్రో కోలో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన కంపెనీలకు ఈ కేటాయింపులు జరిగాయంటూ సీబీఐ ఆరోపించింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఆ తరువాత వాన్‌పిక్‌కు భూకేటాయింపులపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్ ఆధారంగా వాన్‌పిక్‌కు చెందిన 1,416.91 ఎకరాల భూమిని 2014లో జప్తుచేస్తూ ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై వాన్‌పిక్ పోర్ట్స్, వాన్‌పిక్ ప్రాజెక్స్.. అప్పీలెట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉండగానే మరో 11,804.78 ఎకరాల అసైన్డ్ భూమిని 2017లో జప్తుచేస్తూ ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులతో 13,221.69 ఎకరాలను పూర్తిగా జప్తుచేసింది. ఈ ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్ అథారిటీ సమర్థించింది. క్విడ్ ప్రో కో అన్నదే లేదు.. ఈ జప్తుపై కూడా ‘వాన్‌పిక్’ కంపెనీలు అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ రెండు జప్తులపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ 2019, జూలైలో తీర్పు వెలువరించింది. తాత్కాలిక జప్తు సమయంలో ఇది నేరపూరిత సొమ్ము అని దర్యాప్తు సంస్థ విశ్వాసంలోకి తీసుకోవడానికిగాను సంబంధించి కారణాలను వివరించాల్సి ఉందని.. కానీ, ఎలాంటి కారణాలు లేకపోయినా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జప్తును సమర్థించడం సరికాదని పేర్కొంది. ఎలాంటి క్విడ్ ప్రోకో లేదని, జప్తువల్ల ఎలాంటి ప్రయోజనంలేదని, కోర్టులో కేసు విచారణ పూర్తిచేయడానికి ఏళ్లు పడుతుందని, అంతవరకు ప్రజాప్రయోజనాలకు చెందిన ఆస్తుల జప్తు సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలా ఈడీ, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీచేసిన జప్తు ఉత్తర్వులను తప్పుబట్టడమే కాకుండా వాటిని రద్దుచేసింది. అయితే, భూముల జప్తును మాత్రం కొనసాగిస్తూ వాటి విడుదల కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని ట్రిబ్యునల్ సూచించింది. హైకోర్టును ఆశ్రయించిన వాన్‌పిక్.. భూమి విడుదలకు సంబంధించి అప్పిలెట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ ప్రాజెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో వేర్వేరుగా మూడు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వాన్‌పిక్ తరఫున సీనియర్ న్యాయవాది అతుల్ నంద, ఈడీ తరఫున అనిల్ ప్రసాద్ తివారీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. 561 ఎకరాలు, 855 ఎకరాల జప్తు విషయంలోని రెండు అప్పిళ్లకు సంబంధించి గత సెప్టెంబర్‌లో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వెంటనే 1,416.91 ఎకరాలను విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, 11,804.78 ఎకరాల జప్తునకు సంబంధించి మాత్రం కొంత అస్పష్టత ఉండటంతో దీనిపై విచారణను కొనసాగించి.. శుక్రవారం తీర్పునిచ్చింది. నిబంధనలను పాటించకుండా ఈడీ జప్తు చేసిందని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. ఈడీ చర్యను సమర్థిస్తూ చట్ట విరుద్ధంగా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు ఇచ్చిందంటూనే ఆ చట్ట ఉల్లంఘనను కొనసాగించాలంటూ అప్పీలేట్ ట్రిబ్యునల్ చెప్పడం సరికాదని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టవిరుద్ధమని తేలినప్పుడు ఆస్తులను విడుదల చేయాలని చెప్పే తన అధికారాన్ని ట్రిబ్యునల్ వినియోగించుకోకుండా కింది కోర్టుకు వెళ్లమనడం ఎంతమాత్రం సరికాదంది. 11,804.78 ఎకరాల అసైన్డ్ భూములను వెంటనే విడుదల చేయాలని ఈడీ ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. -
వాన్‌పిక్ భూములకు విముక్తి!
సాక్షి, అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వాడరేవు నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ (వాన్‌పిక్) కోసం సేకరించిన 1,416.91 ఎకరాల పట్టా భూమిని జప్తు నుంచి వెంటనే విడుదల చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఆదేశించింది. వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 561.19 ఎకరాలు, వాన్‌పిక్ ప్రాజెక్స్ ప్రై వేట్ లిమిటెడ్‌కు చెందిన 855.71 ఎకరాల భూమిని జప్తు నుంచి విడుదల చేయాలని ఈడీకి తేల్చిచెప్పింది. 1,416.19 ఎకరాల భూమిని జప్తు చేస్తూ ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను, వాటిని సమర్థిస్తూ ఈడీ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను తప్పుబడుతూ అప్పిలెట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. అయితే వాన్‌పిక్ భూముల జప్తును కొనసాగిస్తూ, జప్తు విడుదల కోసం మనీ లాండరింగ్ నిరోధక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సూచిస్తూ అప్పిలెట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తప్పుపట్టింది. ఒకవైపు ఈడీ, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులు చట్ట విరుద్ధమంటూ మరోవైపు ఆస్తుల జప్తు కొనసాగిస్తూ విడుదల కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని అప్పిలెట్ అథారిటీ పేర్కొనడం ఘోర తప్పదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నంద ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇదీ నేపథ్యం... వాడరేవు నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ (వాన్‌పిక్) ఏర్పాటు నిమిత్తం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభు త్వం ప్రకాశం–గుంటూరు జిల్లాల పరిధిలో 13,221.69 ఎకరాల భూములను కేటాయించింది. వాన్‌పిక్ ప్రాజెక్ట్ విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల్లో ఒకటైన రస్ అల్ ఖైమాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్టు అమలుకు వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషల్ పర్సస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఏర్పాటయ్యాయి. అయితే వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకుగాను క్విడ్ ప్రో కోలో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన కంపెనీలకు ఈ కేటాయింపులు జరిగాయంటూ సీబీఐ ఆరోపించింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. అటు తరువాత వాన్‌పిక్‌కు భూ కేటాయింపులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్ ఆధారంగా ‘వాన్‌పిక్ ’కు చెందిన 1,416.91 ఎకరాల భూమిని జప్తు చేస్తూ ఈడీ తాత్కాలిక జప్తు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వాన్‌పిక్ పోర్ట్స్, వాన్‌పిక్ ప్రాజెక్స్.. అప్పిలెట్ ట్రిబ్యునల్ ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. ఇవి పెండింగ్‌లో ఉండగానే 11,804.78 ఎకరాల అసైన్డ్ భూమిని జప్తు చేస్తూ ఈడీ తాత్కాలిక ఉత్త ర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో 13,221.69 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్ అథారిటీ సమర్థించింది. క్విడ్ ప్రో కో అన్నదే లేదు.. దీనిపై ‘వాన్‌పిక్’ కంపెనీలు అప్పిలెట్ ట్రిబ్యునల్ ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై ట్రిబ్యు నల్ విచారణ జరిపి 2019 జూలైలో తీర్పు వెలువరించింది. ఈడీ, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను తప్పుబట్టింది. ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. అయితే భూముల జప్తును మాత్రం కొనసాగిస్తూ వాటి విడుదల కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని అప్పిలెట్ ట్రిబ్యునల్ సూచించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీళ్లు... దీనిపై వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ ప్రాజెక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లు హైకోర్టులో వేర్వేరుగా మూడు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వాన్‌పిక్ తరఫున సీని యర్ న్యాయవాది అతుల్ నంద, ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. 561 ఎకరాలు, 855 ఎక రాల జప్తు విషయంలో దాఖలైన వ్యాజ్యాల్లో తీర్పు వెలువరించింది. 11,804 ఎకరాల జప్తు వ్యాజ్యంలో మరిన్ని అంశాలపై వాదనలు వినాల్సి ఉందని, విచారణను నవంబర్ 14కి వాయిదా వేసింది. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులివ్వకుండా భౌతిక స్వాధీనం చెల్లదు.. చట్ట నిబంధనలు ఫలానా విధంగా వ్యవహరించాలని చెబుతున్నప్పుడు దాని ప్రకారమే నడుచుకోవాలని సుప్రీంకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేయడానికి ముందే భూములను ఈడీ భౌతికంగా స్వాధీనం చేసుకోవడం తగదని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపింది. జప్తు నుంచి భూముల విడుదలకు ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని, ఆ కోర్టు ఉత్తర్వులిచ్చే వరకు జప్తు కొనసా గుతుందని అప్పిలెట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వు లు ఏ కోణంలో చూసినా సరికాదని తేల్చిచెప్పింది. అందువల్ల ట్రిబ్యునల్ ఉత్తర్వులపై వాన్‌పిక్ కంపెనీలు దాఖలు చేసిన ఈ అప్పీళ్లను అనుమతించేందుకు సంకోచించడం లేదంది. జప్తు చేసిన 1,416.19 ఎకరాలను విడుదలచేయాలని ఈడీని ఆదేశించింది. ఇదిలాఉండగా వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు ఇటీవల కొట్టిసిన విషయం తెలిసిందే. -
వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ చెల్లదని హైకోర్టు తేల్చింది. వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఏపీలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు వాన్‌పిక్ ప్రాజెక్ట్‌కు భూముల కేటాయింపు జరిగింది. చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..! గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూముల కేటాయింపుపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ సీబీఐ కోర్టులో సీబీఐ అధికారుల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ చెల్లదంటూ తెలంగాణ హైకోర్టులో వాన్ పిక్ ప్రాజెక్ట్స్ క్వాష్ పిటిషన్ వేసింది. విచారణ అనంతరం వాన్ పిక్ ప్రాజెక్ట్స్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. -
‘వాన్‌పిక్ భూములను రైతులకు అప్పగించాలి’
ఒంగోలు: వాన్‌పిక్ భూముల్లో పరిశ్రమలు స్థాపించకపోతే తిరిగి రైతులకు అప్పగించాలని సీపీఐ నేత కె. నారాయణ కోరారు. రామాయపట్నం ఓడరేవు సాధన సమితి ఆధ్వర్యంలో నాయకులు ఓడరేవును నిర్మించాలని దీక్షకు దిగారు. ఈ దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన నారాయణ మాట్లాడుతూ.. అణువిద్యుత్ కేంద్రాన్ని ప్రకాశం జిల్లాలో నిర్మించవద్దని అన్నారు. రామాయపట్నం ఓడరేవు ఏర్పాటుకు అవసరమైతే జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ ప్రాంతంలో ఓడరేవు నిర్మించడం వల్ల లక్షలాది మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. జిల్లాలో ఉన్న అందరూ రాజకీయాలకు అతీతంగా పోర్టు కోసం ఉద్యమించాలని కోరారు. జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలన్నారు. నోట్ల రద్దుతో అల్లకల్లోలం సృష్టించిన ప్రధాన మంత్రి మోదీ, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌లపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. -
ఐఏఎస్ మన్మోహన్సింగ్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: వాన్‌పిక్ భూముల వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి మన్మోహన్సింగ్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అభియోగాల నమోదు సమయంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికే అభ్యంతరాలను చెప్పుకోవాలని ఆయనకు స్పష్టం చేసింది. తాను నిందితుడిగా సీబీఐ దాఖలుచేసిన చార్జిషీట్‌ను విచారణకు స్వీకరిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని, నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ మన్మోహన్సింగ్ గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విని గత డిసెంబర్ 6న తీర్పు వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్... ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం తీర్పు వెలువరించారు. వాన్‌పిక్ వ్యవహారంలో చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించడం అన్యాయమన్న పిటిషనర్ వాదనల్లో అర్థం లేదని పేర్కొన్నారు. అభియోగాల నమోదు సమయంలో పిటిషనర్ లేవనెత్తే అభ్యంతరాలను పరిశీలించాలని సీబీఐ కోర్టుకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ తీర్పు ప్రభావానికి లోనుకుండా నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.