సాక్షి, హైదరాబాద్: వాన్‌పిక్ భూముల వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి మన్మోహన్‌సింగ్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అభియోగాల నమోదు సమయంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికే అభ్యంతరాలను చెప్పుకోవాలని ఆయనకు స్పష్టం చేసింది. తాను నిందితుడిగా సీబీఐ దాఖలుచేసిన చార్జిషీట్‌ను విచారణకు స్వీకరిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని, నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ మన్మోహన్‌సింగ్ గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై వాదనలు విని గత డిసెంబర్ 6న తీర్పు వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్... ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం తీర్పు వెలువరించారు. వాన్‌పిక్ వ్యవహారంలో చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించడం అన్యాయమన్న పిటిషనర్ వాదనల్లో అర్థం లేదని పేర్కొన్నారు. అభియోగాల నమోదు సమయంలో పిటిషనర్ లేవనెత్తే అభ్యంతరాలను పరిశీలించాలని సీబీఐ కోర్టుకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ తీర్పు ప్రభావానికి లోనుకుండా నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.