Kommineni Analysis On TS High Court Judgment On The Vanpic Case - Sakshi
Sakshi News home page

బాబు, సోనియా ఏపీకి అన్యాయం చేశారా? ఇదిగో ఇలా బయటపడింది..!

Published Wed, Jul 12 2023 9:00 AM | Last Updated on Wed, Jul 12 2023 1:10 PM

Kommineni Analysis On Ts High Court Judgment On The Vanpic Case - Sakshi

వాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌కు మరో ఆభరణం లభించినట్లయిందా? ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడప ఎంపీగా ఉన్న సమయంలో సొంతంగా పార్టీ పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలిసి ఆయనపై పెట్టిన కేసులలోని డొల్లతనం ఒక్కొక్కటి బయటపడుతోంది. ఆ కేసులను న్యాయస్థానాలు కొట్టివేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఒకరకంగా సంచలనంగా ఉన్నాయని చెప్పాలి.

వాన్ పిక్ ప్రాజెక్టు ఆస్తులను జప్తు చేస్తున్న రోజులలోనే, ఈ కంపెనీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్‌ను జగన్ కేసులలో ఇరికించి అరెస్టు చేసినప్పుడే ఇది చాలా అన్యాయమని నేను అభిప్రాయపడ్డారు. పలు ఆర్టికల్స్ కూడా రాశాను. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టినందుకు వాన్ పిక్‌కు భూములు కేటాయించారంటూ సీబీఐ పెట్టిన కేసు ఎంత అధ్వాన్నమైనదో ఇప్పుడు రుజువు అయింది. ఎక్కడైనా పరిశ్రమలు పెడతామని రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేస్తే అరెస్టు చేయాలి కాని, పరిశ్రమల స్థాపనకు భూములు సేకరించిన కంపెనీపైన, ఆ కంపెనీ చైర్మన్ పైన కేసు పెట్టడం ఏమిటా అన్న బాధ కలిగేది.

కాని మన దేశంలో ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో బ్యాంకులకు రుణాలు ఎగవేసినవారు హాపీగా కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతల సరసన ఉండగలుగుతున్నారు. వాన్‌పిక్ ప్రాజెక్టు కనుక అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఉంటే, ఈ రోజున ఏపీకి పెద్ద ఆభరణం లభించినట్లయ్యేది. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చీరాల, రేపల్లె ప్రాంతంలో బారీ ఎత్తున పవర్ ప్రాజెక్టులు, ఇతర ఓడరేవు ఆధారిత పరిశ్రమలు స్థాపించడానికి గాను వాన్ పిక్ సంస్థకు సుమారు 13 వేల ఎకరాల భూములను కేటాయించారు. వీటిలో ఎక్కువగా ప్రభుత్వ అస్సైన్డ్ భూములుఉన్నాయి.

అస్సైన్డ్ లబ్దిదారులు ఎవరికైనా తమ భూమిని అమ్ముకున్నా, ఆ కొనుగోలుదారులతో పాటు, ఒరిజినల్ యజమానులకు కూడా నిర్దిష్ట పరిహారం చెల్లించి అందరిని సంతృప్తిపరిచి భూములు సేకరించారు. అవి కూడా సేద్యానికి పనికిరాని భూములే అత్యధికం. కాని జగన్ మీద అక్కసుతో సీబిఐ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టి పారిశ్రామికవేత్తలను అరెస్టు చేసింది. సిబిఐకి తోడు ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా అదే ప్రకారం ఆస్తులను జప్తు చేసింది. ఇదంతా దశాబ్దం క్రితం జరిగింది. అప్పటి నుంచి ఆ భూములన్నీ వృధాగా పడి ఉన్నాయి. రావల్సిన పరిశ్రమలు రాకుండా పోయాయి. ఈ రకంగా ఏపీకి సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు, సిబిఐ ఆనాటి జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తీరని అన్యాయం చేశారు. పరిశ్రమలు రాకుండా చేశారు.
చదవండి: పవన్‌ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని..

అదే కనుక అప్పుడే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా ఉంటే, ఈ పాటికి అక్కడ అభివృద్ది జరిగి ఉండేది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ప్రాజెక్టు ఏపీకి పెద్ద ఆస్తిగా మారి ఉండేది. వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చి ఉండేవి. చిత్రం ఏమిటంటే పరిశ్రమలు పెట్టిన జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, ఆనాటి మంత్రి మోపిదేవి వెంకటరమణ వంటివారు జైళ్లలో మగ్గవలసి వచ్చింది. పరిశ్రమలు పెట్టకుండా వేల కోట్లు ఎగవేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సుజన చౌదరి, లగడపాటి రాజగోపాల్, టి.సుబ్బరామిరెడ్డి , రాయపాటి సాంబశివరావు.. ఇలా టీడీపీ,కాంగ్రెస్, బీజేపీలో చేరిన కొందరు టీడీపీ నేతలకు రాజభోగాలు అనుభవించగలుగుతున్నారు.

ఆ రోజుల్లో ఈడి జప్తు చేసిన ఈ భూమి విలువను సుమారు నలభై మూడు వేల కోట్లుగా లెక్కగట్టారు. ఈ ఆస్తి అంతా జగన్ దేనని చంద్రబాబు, టీడీపీ నేతలు, తప్పుడు ప్రచారం చేశారు. వైఎస్ ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును చేపట్టినప్పుడు భూ సేకరణకు కూడా టీడీపీ అడ్డుపడింది. అయినా వైఎస్ ముందుకు వెళ్లారు. ఆయన ఆకస్మిక మరణం మొత్తం రాష్ట్రానికి తీరని నష్టం చేసింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో సోనియా, చంద్రబాబు ఏకమవడం, సిబిఐ లక్ష్మీనారాయణను అడ్డు పెట్టుకుని కేసులు నడిపించడం వంటివి చేశారని పలు విమర్శలు వచ్చేవి.

ఈనాడు రామోజీరావు వంటివారు పలు తప్పుడు కథనాలు ఇచ్చి ప్రజలను తప్పుదారి పట్టించడం నిత్య కృత్యంగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి కనువిప్పు అవుతుంది. దేశానికి ఇలాంటి ప్రాజెక్టులు ఎంత అవసరమో ఆ గౌరవ న్యాయ స్థానం గుర్తించినట్లయింది. కింది కోర్టు మైండ్ అప్లై చేయకుండా యాంత్రికంగా ఆస్తుల జప్తును సమర్ధించిందని అభిప్రాయపడింది. మొత్తం ఈడి చార్జీషీట్‌ను తప్పుపట్టింది. ఇది ఏపీకి శుభకరమైన విషయం అని చెప్పాలి. తీర ప్రాంతంపై బాగా దృష్టి పెట్టి అభివృద్ది చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఈ తీర్పును అవకాశంగా తీసుకుని నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఎంకరేజ్ చేసి ఇప్పటికైనా ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చేలా చేయగలగాలి.
చదవండి: ‘వాన్‌పిక్‌’ ఆస్తుల అటాచ్‌మెంట్‌ చెల్లదు

నిజానికి నిమ్మగడ్డ ప్రసాద్ ఈ ప్రాజెక్టు టేకప్ చేయకుండా ఉంటే జైలుకు వెళ్లవలసి వచ్చేదికాదు. విదేశాలలో సైతం ఇబ్బంది పడవలసి వచ్చేదికాదు. కేవలం సీబిఐ,ఈడీ వంటి సంస్థల నిర్వాకం వల్ల ఇలా జరిగింది. వీటన్నిటిని మనసులో పెట్టుకుని ప్రాజెక్టును వదలివేయకుండా నిమ్మగడ్డ దీనిని ముందుకు తీసుకువెళితే బాగుంటుంది. రాష్ట్రాభివృద్దికి అడ్డుపడిన తెలుగుదేశం, కాంగ్రెస్ వంటి పార్టీలు పైకి మాత్రం అభివృద్ది కాముకులుగా పిక్చర్ ఇస్తుంటాయి. కాని లోపల మాత్రం ఇలాంటి కుట్రలు పన్ని ఏపీ అభివృద్దికి విఘాతం కలిగించాయి. నలభై మూడువేల కోట్ల అక్రమాలు జరిగాయని ఇంత కాలం ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన వాదన తప్పని అంగీకరిస్తారా? లేక కొత్తగా ఏదో ఒక దిక్కుమాలిన ప్రచారం చేస్తారా? అన్నది చూడాలి.


-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement