tribunal judgment
-
‘వాన్‌పిక్’ ఆస్తుల అటాచ్మెంట్ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని వాడరేవు–నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు (వాన్‌పిక్) కోసం సేకరించిన 11,804.78 ఎకరాల అసైన్డ్ భూమిని అటాచ్మెంట్ నుంచి వెంటనే విడుదల చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆ జప్తు చెల్లదని సీజే ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. అంతేకాక.. 11,804.78 ఎకరాల భూమిని జప్తుచేస్తూ ఈడీ జారీచేసిన ఉత్తర్వులను, వాటిని అడ్జ్యుడికేటింగ్ అథారిటీ సమర్థించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అలాగే, వాన్‌పిక్ భూముల జప్తును కొనసాగిస్తూ, భూముల విడుదల కోసం మనీలాండరింగ్ నిరోధక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ వాన్‌పిక్‌కు అప్పిలేట్ ట్రిబ్యునల్ సూచించడం కూడా సరికాదంది. ఒకవైపు ఆస్తుల జప్తు చట్టవిరుద్ధమని చెబుతూనే విడుదలకు కింది కోర్టును ఆశ్రయించమని ట్రిబ్యునల్ ఎలా సూచిస్తుందని ప్రశ్నించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం తీర్పునిచ్చింది. కేసు నేపథ్యం ఇదీ.. ‘వాన్‌పిక్’ ఏర్పాటు నిమిత్తం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రకాశం–గుంటూరు జిల్లాల పరిధిలో 13,221.69 ఎకరాల భూములను కేటాయించింది. వాన్‌పిక్ ప్రాజెక్టు విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల్లో ఒకటైన రస్ అల్ ఖైమాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్టు అమలుకు వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషల్ పర్సస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఏర్పాటయ్యాయి. అయితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకుగాను క్విడ్ ప్రో కోలో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన కంపెనీలకు ఈ కేటాయింపులు జరిగాయంటూ సీబీఐ ఆరోపించింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఆ తరువాత వాన్‌పిక్‌కు భూకేటాయింపులపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్ ఆధారంగా వాన్‌పిక్‌కు చెందిన 1,416.91 ఎకరాల భూమిని 2014లో జప్తుచేస్తూ ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై వాన్‌పిక్ పోర్ట్స్, వాన్‌పిక్ ప్రాజెక్స్.. అప్పీలెట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉండగానే మరో 11,804.78 ఎకరాల అసైన్డ్ భూమిని 2017లో జప్తుచేస్తూ ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులతో 13,221.69 ఎకరాలను పూర్తిగా జప్తుచేసింది. ఈ ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్ అథారిటీ సమర్థించింది. క్విడ్ ప్రో కో అన్నదే లేదు.. ఈ జప్తుపై కూడా ‘వాన్‌పిక్’ కంపెనీలు అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ రెండు జప్తులపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ 2019, జూలైలో తీర్పు వెలువరించింది. తాత్కాలిక జప్తు సమయంలో ఇది నేరపూరిత సొమ్ము అని దర్యాప్తు సంస్థ విశ్వాసంలోకి తీసుకోవడానికిగాను సంబంధించి కారణాలను వివరించాల్సి ఉందని.. కానీ, ఎలాంటి కారణాలు లేకపోయినా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జప్తును సమర్థించడం సరికాదని పేర్కొంది. ఎలాంటి క్విడ్ ప్రోకో లేదని, జప్తువల్ల ఎలాంటి ప్రయోజనంలేదని, కోర్టులో కేసు విచారణ పూర్తిచేయడానికి ఏళ్లు పడుతుందని, అంతవరకు ప్రజాప్రయోజనాలకు చెందిన ఆస్తుల జప్తు సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలా ఈడీ, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీచేసిన జప్తు ఉత్తర్వులను తప్పుబట్టడమే కాకుండా వాటిని రద్దుచేసింది. అయితే, భూముల జప్తును మాత్రం కొనసాగిస్తూ వాటి విడుదల కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని ట్రిబ్యునల్ సూచించింది. హైకోర్టును ఆశ్రయించిన వాన్‌పిక్.. భూమి విడుదలకు సంబంధించి అప్పిలెట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ ప్రాజెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో వేర్వేరుగా మూడు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వాన్‌పిక్ తరఫున సీనియర్ న్యాయవాది అతుల్ నంద, ఈడీ తరఫున అనిల్ ప్రసాద్ తివారీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. 561 ఎకరాలు, 855 ఎకరాల జప్తు విషయంలోని రెండు అప్పిళ్లకు సంబంధించి గత సెప్టెంబర్‌లో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వెంటనే 1,416.91 ఎకరాలను విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, 11,804.78 ఎకరాల జప్తునకు సంబంధించి మాత్రం కొంత అస్పష్టత ఉండటంతో దీనిపై విచారణను కొనసాగించి.. శుక్రవారం తీర్పునిచ్చింది. నిబంధనలను పాటించకుండా ఈడీ జప్తు చేసిందని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. ఈడీ చర్యను సమర్థిస్తూ చట్ట విరుద్ధంగా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు ఇచ్చిందంటూనే ఆ చట్ట ఉల్లంఘనను కొనసాగించాలంటూ అప్పీలేట్ ట్రిబ్యునల్ చెప్పడం సరికాదని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టవిరుద్ధమని తేలినప్పుడు ఆస్తులను విడుదల చేయాలని చెప్పే తన అధికారాన్ని ట్రిబ్యునల్ వినియోగించుకోకుండా కింది కోర్టుకు వెళ్లమనడం ఎంతమాత్రం సరికాదంది. 11,804.78 ఎకరాల అసైన్డ్ భూములను వెంటనే విడుదల చేయాలని ఈడీ ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. -
ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే మహానది–గోదావరి అనుసంధానం
సాక్షి, అమరావతి: మహానది జలాల వినియోగంలో ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మధ్య తలెత్తిన వివాదంపై ట్రిబ్యునల్ విచారణ నేపథ్యంలో మహానది–గోదావరి అనుసంధానానికి న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని టాస్క్‌ఫోర్స్ అభిప్రాయపడింది. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే అనుసంధానంపై ముందుకెళ్లాలని ఇటీవల నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. మహానది ట్రిబ్యునల్ తీర్పు వెలువడిన తర్వాతే ఆ రెండు నదుల అనుసంధానానికి మార్గం సుగమం అవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒడిశాలో బర్మూర్ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలించి, గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సరఫరా చేయాలని పేర్కొంది. ఈ ప్రతిపాదన, నదుల అనుసంధానంపై కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ సమగ్రంగా చర్చించింది. ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మధ్య మహానది జలాలపై తలెత్తిన వివాదం పరిష్కారానికి 2018లో కేంద్రం ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసింది. మూడేళ్ల గడువులోగా ట్రిబ్యునల్ విచారణ పూర్తి చేయలేదు. దాంతో గడువును కేంద్రం 2023 మార్చి వరకు పొడిగించింది. ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతుండగా అనుసంధానంపై నిర్ణయం తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దాంతో న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని టాస్క్‌ఫోర్స్ నిర్ణయించింది. గోదావరికి మహానదిని జత చేసి జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్‌డబ్ల్యూడీఏ గతేడాది ఏప్రిల్‌లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను సిద్ధం చేసింది. దీనిపై ఆ నదుల పరిధిలోని రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. 247 టీఎంసీల గోదావరి జలాలకు 408 టీఎంసీల మహానది జలాలను జత చేయడం ద్వారా మహానది–గోదావరి–కావేరిలను అనుసంధానించి ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమింవచ్చునని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదిస్తోంది. -
మరోసారి బ్రేకులు, వీడియోకాన్ టేకోవర్‌పై స్టే
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియ కింద వేలానికి వచ్చిన వీడియోకాన్‌ను ట్విన్ స్టార్ టెక్నాలజీస్ టేకోవర్ చేసే ప్రయత్నాలకు బ్రేక్ పడింది. దీనిపై జాతీయ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్టే విధించింది. రుణ దాతల కమిటీ (సీవోసీ) నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఎఫ్సీఐ దాఖలు చేసిన పిటీషన్లపై ఎన్సీఎల్ఏటీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. వీటిపై తమ సమాధానాలను రెండు వారాల్లోగా సమర్పించాలని సీవోసీ, పరిష్కార నిపుణుడు, ట్విన్ స్టార్‌కు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది. బ్యాంకులకు సుమారు రూ. 64,838 కోట్లు బాకీపడి, వేలానికి వచ్చిన వీడియోకాన్‌ను దాదాపు రూ. 2,962 కోట్లకు కొనుగోలు చేసేందుకు ట్విన్ స్టార్ టెక్నాలజీస్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఉత్తర్వులు ఇచ్చింది. -
ఖ్మేర్ రోజ్ నేతలకు జీవితఖైదు
ఫనోమ్ పెన్హ్: కాంబోడియాలో 1975–79 కాలంలో పోల్‌పాట్ నేతృత్వంలో జరిగిన ఖ్మేర్ రోజ్ సామూహిక హత్యాకాండకు సంబంధించి నాడు అధికారంలో ఉన్న ఇద్దరు కీలక నేతలకు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. నాటి ప్రధాని పోల్‌పాట్ నేతృత్వంలోని ఖ్మేర్ రోజ్ పార్టీ అనేక దారుణాలకు ఒడిగట్టింది. నాటి దేశ జనాభాలో దాదాపు పాతిక శాతం (20 లక్షలు) మందిని చంపేసింది. కార్మికుల చేత విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల కొందరు, ఆకలికి తాళలేక మరికొందరు మరణించగా ప్రభుత్వం ఉరిశిక్షలు విధించి మరికొంత మందిని పొట్టనబెట్టుకుంది. నాడు ప్రభుత్వ దారుణాలకు సూత్రధారులుగా, కీలక పదవుల్లో ఉన్న ఖీయూ సంఫన్ (87)కు, నువోన్ చియా (92)కు ప్రస్తుతం కోర్టు శిక్షలు విధించింది. -
కర్ణాటక జల దోపిడీని అడ్డుకుందాం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంలో ఎగువనున్న కర్ణాటక రాష్ట్రం నీటి ఒప్పందాలు, ట్రిబ్యునల్ తీర్పును అపహాస్యం చేసే రీతిలో వ్యవహరిస్తోందని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఇష్టారీతిన బ్యారేజీలు కడుతూ దిగువ పరీవాహకానికి రావాల్సిన నీటిని అడ్డుకుంటూ జల దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించింది. తాజాగా కృష్ణా-భీమా నదుల సంగమానికి ఎగువన రాష్ట్ర సరిహద్దుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో కర్ణాటక మరో బ్యారేజీ నిర్మాణాన్ని చేపడుతోందని, దీని ద్వారా సమీపంలో నిర్మిస్తున్న భారీ విద్యుదుత్పత్తి కేంద్రాలకు నీటిని సరఫరా చేసే యోచనలో ఉందని నీటిపారుదల శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ఈ మేరకు నీటిపారుదల శాఖలోని అంతరాష్ట్ర నదీ వివాదాల విభాగం అధికారులు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఇతర ప్రభుత్వ పెద్దలకు మంగళవారం లేఖలు రాసినట్లు తెలిసింది. కర్ణాటక బ్యారేజీ కడుతున్న ప్రాంతంలో ఇటీవలే రహస్యంగా పర్యటించిన అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు సమర్పించిన పలు డాక్యుమెంట్లు, నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలను లేఖతోపాటు పంపినట్లుగా సమాచారం. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపేలా ఆ ప్రభుత్వంతో ముఖాముఖి చర్చలు జరపాలని లేనిపక్షంలో కేంద్ర జల సంఘానికి నేరుగా ఫిర్యాదు చేసి తగిన చర్యల కోసం విన్నవించాలని నీటిపారుదల శాఖ కోరింది. -
ట్రిబ్యునల్ తీర్పుతో పాలమూరుకు తీవ్ర నష్టం
గద్వాలటౌన్, న్యూస్‌లైన్: బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున ల్ ఎదుట సరైన వాదనలు వినిపించకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి మండిపడ్డా రు. సోమవారం టీపీఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిబ్యునల్ తీర్పుతో పాలమూరు జిల్లా తీవ్రంగా న ష్టపోయిందని చెప్పారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి సాగునీటి హక్కు లేకుండా పోయిందన్నారు. కేంద్ర జల సంఘం అనుమతి, నీటి కేటాయింపుల ఉత్తర్వులు లేకుండానే ట్రయల్ రన్ నిర్వహించారన్నారు. ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ వాదనలో నెట్టెంపాడు అంశమే లేకపోవడం దారుణమన్నారు. పోతిరెడ్డి పాడు ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానీటిని అక్రమంగా సీమాంధ్ర నాయకులు తరలించుకపోతున్నారని ఆరోపించారు. ఆర్డీఎస్ నీటి వాటాలో ప్రతి ఏడాది 12 టీఎంసీల నీటిని కేసీ కెనాల్ ద్వారా తరలించుక పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనాప్రభుత్వం స్పందించి నెట్టెంపాడు, కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు నీటి కేటాయింపులు చేసేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు జ్యోతి, ప్రభాకర్, కావలి మణ్యం, చిట్టెం కిష్టన్న, సుభాన్,తదితరులు పాల్గొన్నారు. -
ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్రానికి శరాఘాతంగా మారిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు ధ్వజమెత్తారు. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పును నిరసిస్తూ శనివారం జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించి, డీఆర్సీ సమావేశాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి టి.జి.వెంకటేష్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి బయటకు రాకపోవడంతో వినతిపత్రాన్ని ఆయన కారుకు అంటించారు. డీఎస్పీ పి.వి.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మోహరించిన పోలీసులుకు నిరసనకారులకు మధ్య తోపులాట జరగగా కొందరు నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులు మన్నవ సుబ్బారావు, శనక్కాయల అరుణ, జియావుద్దీన్, మల్లి తదితర నాయకులను అరెస్టు చేసి నగరంపాలెం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా స్టేషన్ ముందు బైటాయించి నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్ధత వలన రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోనున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరుణ మాట్లాడుతూ నీటి పారుదల నిపుణులు చేసిన సూచనలు, ప్రతిపక్షాల ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో భారీ మూల్యం చెల్లించవలసి వచ్చిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ ఫిరోజ్, రావిపాటి సాయికృష్ణ, సిహెచ్. ఏడుకొండలు, షేక్ లాల్‌వజీర్, కసుకుర్తి హనుమంతరావు, గని, వి.హర్షవర్ధన్, కె.నాగేశ్వరరావు, సిహెచ్ చిట్టిబాబు, ఎస్ఎస్పి జాదా, పి.థామస్, ఎస్.కిరణ్, ఈర్ల గురవయ్య, కె.మాలకొండయ్య, బి.సాయి, జి.దయారత్నం, ఎం.లక్ష్మీనారాయణ, ఎన్.అగస్టీన్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంలో సర్కారు సవాల్!
సాక్షి, హైదరాబాద్: ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకుండా స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. తీర్పులో మనకు వ్యతిరేకంగా ఉన్న పలు అంశాలను సవరించాల్సిందిగా కోరనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్రం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) పెండింగ్‌లో ఉంది. 2010 డిసెంబర్ 30న వెలువరించిన ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో పలు అంశాలు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే. దాంతో తీర్పును వ్యతిరేకిస్తూ 2010 మార్చి 28న ప్రభుత్వం సుప్రీంలో ఎస్ఎల్పీని దాఖలు చేసింది. అయితే ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడ్డాక రావాలని సుప్రీం పేర్కొంది. ప్రస్తుతం ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడిన నేపథ్యం లో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రావాలంటే ముందుగా గెజిట్‌లో ప్రచురించాలి. ఇది జరగకుండా సుప్రీంద్వారా అడ్డుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. తీర్పులో కేంద్రం జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. ఇందులో మార్పుచేర్పులు చేయాలన్నా... అమల్లోకి రాకుండా ఉంచాలన్నా సుప్రీంకోర్టు ద్వారానే సాధ్యమవుతుంది. అయితే తీర్పుపై సుప్రీం స్టేకు నిరాకరిస్తే మాత్రం రాష్ట్రానికి కష్టకాలం మొదలైనట్టే! కరువొస్తే అంతే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలకు ఆకుల్లో, దిగువ రాష్ట్రమైన మనకు కంచంలో అన్న రీతిగా ఉన్నాయి. మనమెంత మొత్తుకున్నా వినకుండా మిగులు జలాలను కూడా లెక్కగట్టి మరీ మూడు రాష్ట్రాల మధ్యా పంచేసి తీరని అన్యాయం చేసిన ట్రిబ్యునల్, కరువు సంవత్సరాల్లో తగ్గే నీటి లభ్యత తాలూకు భారాన్ని కూడా అదేవిధంగా మూడింటికీ పంచమంటే మాత్రం ససేమిరా అంది. డిస్ట్రెస్ షేరింగ్ (కరువునూ సవూనంగా అనుభవించడం) కుదరదని తేల్చిచెప్పింది. ఆ విధంగా మనకు మరో భారీ అన్యాయానికి ఒడిగట్టింది. ఫలితంగా ఇకపై కరువు సంవత్సరాల్లో మన రాష్ట్రానికి చుక్క నీరు కూడా వస్తుందన్న ఆశల్లేవు. ఎందుకంటే మహారాష్ట్ర, కర్ణాటక రెండూ తమ ప్రాజెక్టులన్నీ నిండేదాకా దిగువనున్న మనకు నీటిని వదలకపోయినా ప్రశ్నించే దిక్కు లేదు. అదేమని అడిగే హక్కు కూడా మనకు ఉండబోదు. పైగా ఈ అసంబద్ధ నిర్ణయానికి సమర్థనగా బచావత్ అవార్డును కూడా బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఉదాహరించింది. ‘‘మొత్తం జలాల్లో దాదాపు ఐదో వంతును అదనపు జలాలుగా పరిగణించి మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసిన బచావత్ ట్రిబ్యునల్ కూడా డిస్ట్రెస్ షేరింగ్ సదుపాయం కల్పించలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి అవసరమేదీ లేదు. పైగా డిస్ట్రెస్ షేరింగ్ కోసమని బచావత్ అవార్డు ప్రకారం కొనసాగుతున్న నీటి వినియోగ వ్యవస్థను కాదని ఇప్పుడింకో కొత్త వ్యవస్థను ప్రవేశపెడితే అది లేనిపోని గందరగోళానికి దారి తీయవచ్చు’’ అంటూ మనకు మొండిచేయి చూపింది. ఆలమట్టి ఎత్తు పెంపును ఇలా సమర్థించారు... బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాలపై ఇచ్చిన తీర్పులో ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు అత్యంత కీలకమైంది. ప్రస్తుతమున్న 519 అడుగుల స్థాయి నుంచి 524 అడుగుల స్థాయికి డ్యాం ఎత్తు పెంచితే తమకు తీవ్ర నష్టమని, బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు అనుగుణంగా కేటాయించిన నీటినీ వాడుకోలేమన్నది ఆంధ్రప్రదేశ్ వాదన. అంతేకాదు.. కర్ణాటక ఈ డ్యాం ద్వారా ఇప్పటికే తనకు కేటాయించిన 173 టీఎంసీలకు మించి వాడుకుంటోందని కూడా వాదించింది. అయితే బ్రిజేశ్‌కుమార్ ఈ వాదనలన్నింటినీ కొట్టిపారేశారు. ఆలమట్టి డ్యాం ప్రాంతంలో నీటి లభ్యతకు సంబంధించి ఏరకమైన వివాదమూ లేదని తన తీర్పులో స్పష్టం చేశారు. ఎత్తు పెంపుతో తమకు ఇన్‌ఫ్లోస్ పూర్తిగా తగ్గిపోతాయన్న ఆంధ్రప్రదేశ్ వాదన అర్థరహితమని వ్యాఖ్యానించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు హక్కులే లేవు కాబట్టి ఎగువ రాష్ట్రమైన కర్ణాటక ఆలమట్టి ఎత్తును పెంచుకున్నా నష్టమేమీ జరగదని తీర్పునిచ్చారు. తాజాగా మిగులు జలాలను కూడా మూడు రాష్ట్రాలకూ పంచిన కారణంగా ఆ నీటిని వాడుకునేందుకు వీలుగా ఆలమట్టి ఎత్తు పెంచుకోవచ్చునని తేల్చారు!