ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం
Published Sun, Dec 1 2013 1:30 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్రానికి శరాఘాతంగా మారిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు ధ్వజమెత్తారు. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పును నిరసిస్తూ శనివారం జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించి, డీఆర్సీ సమావేశాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి టి.జి.వెంకటేష్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి బయటకు రాకపోవడంతో వినతిపత్రాన్ని ఆయన కారుకు అంటించారు. డీఎస్పీ పి.వి.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మోహరించిన పోలీసులుకు నిరసనకారులకు మధ్య తోపులాట జరగగా కొందరు నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ సందర్భంగా పోలీసులు మన్నవ సుబ్బారావు, శనక్కాయల అరుణ, జియావుద్దీన్, మల్లి తదితర నాయకులను అరెస్టు చేసి నగరంపాలెం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా స్టేషన్ ముందు బైటాయించి నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్ధత వలన రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోనున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అరుణ మాట్లాడుతూ నీటి పారుదల నిపుణులు చేసిన సూచనలు, ప్రతిపక్షాల ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో భారీ మూల్యం చెల్లించవలసి వచ్చిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ ఫిరోజ్, రావిపాటి సాయికృష్ణ, సిహెచ్. ఏడుకొండలు, షేక్ లాల్‌వజీర్, కసుకుర్తి హనుమంతరావు, గని, వి.హర్షవర్ధన్, కె.నాగేశ్వరరావు, సిహెచ్ చిట్టిబాబు, ఎస్‌ఎస్‌పి జాదా, పి.థామస్, ఎస్.కిరణ్, ఈర్ల గురవయ్య, కె.మాలకొండయ్య, బి.సాయి, జి.దయారత్నం, ఎం.లక్ష్మీనారాయణ, ఎన్.అగస్టీన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement