సాక్షి, హైదరాబాద్: ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకుండా స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. తీర్పులో మనకు వ్యతిరేకంగా ఉన్న పలు అంశాలను సవరించాల్సిందిగా కోరనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్రం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ) పెండింగ్‌లో ఉంది. 2010 డిసెంబర్ 30న వెలువరించిన ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో పలు అంశాలు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే. దాంతో తీర్పును వ్యతిరేకిస్తూ 2010 మార్చి 28న ప్రభుత్వం సుప్రీంలో ఎస్‌ఎల్‌పీని దాఖలు చేసింది.
అయితే ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడ్డాక రావాలని సుప్రీం పేర్కొంది. ప్రస్తుతం ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడిన నేపథ్యం లో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రావాలంటే ముందుగా గెజిట్‌లో ప్రచురించాలి. ఇది జరగకుండా సుప్రీంద్వారా అడ్డుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. తీర్పులో కేంద్రం జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. ఇందులో మార్పుచేర్పులు చేయాలన్నా... అమల్లోకి రాకుండా ఉంచాలన్నా సుప్రీంకోర్టు ద్వారానే సాధ్యమవుతుంది. అయితే తీర్పుపై సుప్రీం స్టేకు నిరాకరిస్తే మాత్రం రాష్ట్రానికి కష్టకాలం మొదలైనట్టే!
కరువొస్తే అంతే
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలకు ఆకుల్లో, దిగువ రాష్ట్రమైన మనకు కంచంలో అన్న రీతిగా ఉన్నాయి. మనమెంత మొత్తుకున్నా వినకుండా మిగులు జలాలను కూడా లెక్కగట్టి మరీ మూడు రాష్ట్రాల మధ్యా పంచేసి తీరని అన్యాయం చేసిన ట్రిబ్యునల్, కరువు సంవత్సరాల్లో తగ్గే నీటి లభ్యత తాలూకు భారాన్ని కూడా అదేవిధంగా మూడింటికీ పంచమంటే మాత్రం ససేమిరా అంది. డిస్ట్రెస్ షేరింగ్ (కరువునూ సవూనంగా అనుభవించడం) కుదరదని తేల్చిచెప్పింది. ఆ విధంగా మనకు మరో భారీ అన్యాయానికి ఒడిగట్టింది. ఫలితంగా ఇకపై కరువు సంవత్సరాల్లో మన రాష్ట్రానికి చుక్క నీరు కూడా వస్తుందన్న ఆశల్లేవు. ఎందుకంటే మహారాష్ట్ర, కర్ణాటక రెండూ తమ ప్రాజెక్టులన్నీ నిండేదాకా దిగువనున్న మనకు నీటిని వదలకపోయినా ప్రశ్నించే దిక్కు లేదు.
అదేమని అడిగే హక్కు కూడా మనకు ఉండబోదు. పైగా ఈ అసంబద్ధ నిర్ణయానికి సమర్థనగా బచావత్ అవార్డును కూడా బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఉదాహరించింది. ‘‘మొత్తం జలాల్లో దాదాపు ఐదో వంతును అదనపు జలాలుగా పరిగణించి మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసిన బచావత్ ట్రిబ్యునల్ కూడా డిస్ట్రెస్ షేరింగ్ సదుపాయం కల్పించలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి అవసరమేదీ లేదు. పైగా డిస్ట్రెస్ షేరింగ్ కోసమని బచావత్ అవార్డు ప్రకారం కొనసాగుతున్న నీటి వినియోగ వ్యవస్థను కాదని ఇప్పుడింకో కొత్త వ్యవస్థను ప్రవేశపెడితే అది లేనిపోని గందరగోళానికి దారి తీయవచ్చు’’ అంటూ మనకు మొండిచేయి చూపింది.
ఆలమట్టి ఎత్తు పెంపును ఇలా సమర్థించారు...
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాలపై ఇచ్చిన తీర్పులో ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు అత్యంత కీలకమైంది. ప్రస్తుతమున్న 519 అడుగుల స్థాయి నుంచి 524 అడుగుల స్థాయికి డ్యాం ఎత్తు పెంచితే తమకు తీవ్ర నష్టమని, బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు అనుగుణంగా కేటాయించిన నీటినీ వాడుకోలేమన్నది ఆంధ్రప్రదేశ్ వాదన. అంతేకాదు.. కర్ణాటక ఈ డ్యాం ద్వారా ఇప్పటికే తనకు కేటాయించిన 173 టీఎంసీలకు మించి వాడుకుంటోందని కూడా వాదించింది. అయితే బ్రిజేశ్‌కుమార్ ఈ వాదనలన్నింటినీ కొట్టిపారేశారు.
ఆలమట్టి డ్యాం ప్రాంతంలో నీటి లభ్యతకు సంబంధించి ఏరకమైన వివాదమూ లేదని తన తీర్పులో స్పష్టం చేశారు. ఎత్తు పెంపుతో తమకు ఇన్‌ఫ్లోస్ పూర్తిగా తగ్గిపోతాయన్న ఆంధ్రప్రదేశ్ వాదన అర్థరహితమని వ్యాఖ్యానించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు హక్కులే లేవు కాబట్టి ఎగువ రాష్ట్రమైన కర్ణాటక ఆలమట్టి ఎత్తును పెంచుకున్నా నష్టమేమీ జరగదని తీర్పునిచ్చారు. తాజాగా మిగులు జలాలను కూడా మూడు రాష్ట్రాలకూ పంచిన కారణంగా ఆ నీటిని వాడుకునేందుకు వీలుగా ఆలమట్టి ఎత్తు పెంచుకోవచ్చునని తేల్చారు!
ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంలో సర్కారు సవాల్!
Published Sat, Nov 30 2013 4:05 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement