Almatti dam height
-
గప్‌చుప్‌గా ఆల్మట్టి ‘ఎత్తు’లు
చుక్క నీరు కూడా దిగువకు రాకుండా కృష్ణమ్మను ఒడిసి పట్టుకునేందుకు కర్ణాటక తహతహలాడుతుంటే రాష్ట్ర సర్కారు చోద్యం చూస్తోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 130 టీఎంసీలను అదనంగా దండుకునేందుకు ‘ఆల్మట్టి’ ఎత్తు పెంచుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఎత్తిపోతల పథకాలతో ‘కృష్ణ’ను దారి మళ్లిస్తున్నా గుడ్లప్పగించింది. పాలక పెద్దల స్వార్థం రైతాంగానికి శాపంగా మారనుంది. ఇంకా ఇలాగే ఉపేక్షిస్తే రాష్ట్రంలో సాగు నీటిపై అన్నదాతలు ఆశలొదులుకోవాల్సిందే. సాక్షి, అమరావతి : ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచే పనులను కర్ణాటక ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేయడానికి సిద్ధమైంది. తద్వారా అదనంగా 130 టీఎంసీలను వినియోగించుకుని 5,62,032 హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించే పనులను రూ.30,143 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టింది. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురయ్యే 30,875 హెక్టార్ల భూమిని ఒక వైపు సేకరిస్తూనే, మరో వైపు 22 ముంపు గ్రామాలకు చెందిన 23,561 కుటుంబాల ప్రజలకు పునరావాసం కల్పించే పనులను ప్రారంభించింది. డ్యామ్ ఎత్తు పెంచే పనులను గ్లోబల్ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించడంపై దృష్టి సారించింది. ఈ పనులు పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం పరిధిలోని రైతులపై తీవ్ర ప్రభావం ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం ‘నోటిఫై’ చేయక ముందే.. కర్ణాటక సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తున్నా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. కానీ ఈ తీర్పును అమలు పరుస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య కాకుండా నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని రెండు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. డీపీఆర్ తయారీకి 2014లోనే టెండర్లు కేంద్రం నోటిఫై చేయకపోయినా, సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పటికీ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే పనులు చేపట్టడానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి 2014 డిసెంబర్లోనే కర్ణాటక సర్కారు టెండర్లు పిలిచి, తక్కువ ధరకు కోట్ చేసిన వ్యాప్కోస్‌కు అప్పగించింది. ఈ విషయమై అధ్యయనం చేసిన వ్యాప్కోస్.. 524.256 మీటర్లకు ఎత్తు పెంచితే 30,875 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని, 22 గ్రామాలకు చెందిన 23,561 మంది నిర్వాసితులుగా మారతారని తేల్చింది. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు (యూకేపీ) మూడో దశలో భాగంగా 8 ఎత్తిపోతల పథకాలు చేపట్టి, ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల అందుబాటులోకి వచ్చే 130 టీఎంసీలను వినియోగించుకుని 5,62,032 హెక్టార్లకు నీళ్లందించవచ్చని నివేదించింది. ఇందుకు రూ.30,143 కోట్ల వ్యయం అవుతుందని చెప్పింది. ఈ నివేదికను 2016లోనే ఆమోదించిన కర్ణాటక సర్కార్ ఇప్పుడు భూసేకరణ, పునరావాస పనులను ప్రారంభించింది. డ్యామ్ ఎత్తు పెంచే పనులకు టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. రెండు నెలలు ఆలస్యంగా కృష్ణమ్మ ఆల్మట్టి ఎత్తు పెంచి, నారాయణపూర్ జలాశయం ఎడమ కాలువకు అనుబంధంగా ఎత్తిపోతల పథకాలు చేపట్టడం ద్వారా అదనంగా కనీసం 223 టీఎంసీలను వినియోగించుకోవడానికి కర్ణాటక సర్కార్ సన్నాహాలు చేస్తోంది. కేవలం ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల ఆ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 123.08 టీఎంసీల నుంచి 210.89 టీఎంసీలకు పెరుగుతుంది. ప్రస్తుతం ఆగస్టు నాటికిగానీ ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం జూరాల, శ్రీశైలం జలాశయాలకు చేరడం లేదు. ఆల్మట్టి ఎత్తు పెంచే పనులు పూర్తయినా, నారాయణపూర్ జలాశయానికి అనుబంధంగా ఎత్తిపోతల పథకాలు పూర్తయినా.. ఎగువ నుంచి జూరాల, శ్రీశైలానికి చేరే వరద ప్రవాహంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోనుంది. సెప్టెంబరు ఆఖరు నాటికిగానీ ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం చేరే అవకాశం ఉండదు. అప్పుడు సాగునీటి మాట దేవుడెరుగు.. తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవు. కృష్ణా పరీవాహక ప్రాంతం ఎడారే తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో 811 టీఎంసీల వాటా ఉంది. ఇందులో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్.. 299 టీఎంసీలు తెలంగాణకు తాత్కాలికంగా కేటాయించారు. ఐదేళ్లుగా వర్షాభావం వల్ల కృష్ణా నదిలో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయింది. కేటాయింపుల మేరకు నీటి లభ్యత లేకపోవడం వల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిలో నీటి లభ్యత కనిష్ట స్థాయికి పడిపోతుంది. అప్పుడు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ఆయకట్టు ఎడారిగా మారడం ఖాయమని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక సర్కార్ ఇంత చేస్తున్నా సీఎం చంద్రబాబు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం నోరు మెదపడం లేదంటున్నారు. కనీసం కర్ణాటక చర్యలపై కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు కూడా చేయకపోవడాన్ని బట్టి చూస్తే.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కర్ణాటకకు తాకట్టు పెట్టారన్నది స్పష్టమవుతోంది. -
అటు ఆల్మట్టి పెంపు.. ఇటు దేవెగౌడతో బాబు దోస్తీ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చే నిర్ణయం తీసుకున్న జేడీఎస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంతో టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు దోస్తీ చేస్తుండటంపై సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. జేడీఎస్ అధినేత దేవెగౌడను టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి రప్పిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1996లో ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్లకు పెంచి రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టిన సందర్భంలో దేవెగౌడ ప్రధానిగా ఉండటం.. ఆ సర్కార్‌లో టీడీపీ భాగస్వామి కావడాన్ని సాగునీటిరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఆ నిర్ణయాన్ని అప్పటి సీఎం చంద్రబాబు వ్యతిరేకించి ఉంటే.. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 519.6 మీటర్లకు పెరిగేది కాదని స్పష్టం చేస్తున్నారు. నాడు రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి దేవెగౌడకు మద్దతుగా నిలిచిన రీతిలోనే.. నేడు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన్ని ప్రచారానికి పిలిపించుకుంటున్నారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. నిపుణుల సూచనలు పెడచెవిన పెట్టిన బాబు కృష్ణా నదిపై యూకేపీ (అప్పర్ కృష్ణా ప్రాజెక్టు)లో భాగంగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల ఎత్తుకు పెంచడానికి కర్ణాటక సర్కార్ 1996లో శ్రీకారం చుట్టింది. అప్పట్లో కేంద్రంలో హెచ్డీ దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ సర్కార్ అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వం టీడీపీ భాగస్వామి. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)పై అప్పట్లో దేవెగౌడ ఒత్తిడి తెచ్చి ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల ఎత్తుకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీని వల్ల ఆల్మట్టి డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకు పెరుగుతుందని, ఎగువ నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లోకి కృష్ణా వరద ప్రవాహం ఆలస్యంగా వస్తుందని.. నీటి లభ్యత తక్కువగా ఉన్న సందర్భాల్లో తాగునీటికి ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా ఆల్మట్టి ఎత్తు పెంపును వ్యతిరేకించాలని అప్పట్లో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, సాగునీటి రంగ నిపుణులు సీఎం చంద్రబాబుకు సూచించారు. కానీ వాటిని తుంగలో తొక్కారు. ఇదే అదునుగా కర్ణాటక సర్కార్ ఆగమేఘాలపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్లకు పెంచేసింది. 1997 వరకు జూలై మొదటి వారానికే శ్రీశైలానికి ఎగువ నుంచి వచ్చే కృష్ణా వరద ప్రవాహం.. తర్వాత ఆగస్టు నెలాఖరుకు గానీ రావడం లేదు. దీని వల్ల కృష్ణా పరీవాహక ప్రాంతంలోని రైతులు సకాలంలో నీళ్లందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు అలసత్వాన్ని అస్త్రంగా చేసుకున్న కర్ణాటక సర్కార్ 1996 నుంచి 1999 వరకు.. చిత్రావతిపై పరగోడు, పెన్నాపై నాగలమడక వద్ద జలాశయం నిర్మించి ఆ రెండు నదుల ప్రవాహాన్ని అనంతపురం జిల్లాలోకి ప్రవేశించకుండా కట్టడి చేసింది. అన్యాయంపై నోరు పెగల్చని చంద్రబాబు తాజాగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.26 మీటర్ల ఎత్తుకు పెంచాలని కర్ణాటక సర్కార్ నిర్ణయించి పనులను ఆగమేఘాలపై ప్రారంభించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం నోటిఫై చేసే వరకు ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచకూడదు. ఇది చంద్రబాబుకు తెలుసు. కానీ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే కర్ణాటక నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించడం లేదు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం దేవెగౌడతో దోస్తీ చేస్తున్న చంద్రబాబు, ఆ స్నేహబంధం చెడిపోకుండా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని టీడీపీ నేతలే విమర్శిస్తున్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 524.26 అడుగులకు పెంచితే.. నీటి నిల్వ 200 టీఎంసీలకు పెరుగుతుంది. అప్పుడు శ్రీశైలానికి ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం మరింత ఆలస్యం అవుతుంది. నీటి లభ్యత తక్కువగా ఉన్న సందర్భాల్లో దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండదు. అప్పుడు రాష్ట్రంలోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం ఎడారిగా మారక తప్పదు. కానీ.. ఇవేవీ చంద్రబాబుకు పట్టడం లేదని సాగునీటి రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. -
రైతుల నోట్లో మరోసారి అల్మట్టి మట్టి
-
ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంలో సర్కారు సవాల్!
సాక్షి, హైదరాబాద్: ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకుండా స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. తీర్పులో మనకు వ్యతిరేకంగా ఉన్న పలు అంశాలను సవరించాల్సిందిగా కోరనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్రం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) పెండింగ్‌లో ఉంది. 2010 డిసెంబర్ 30న వెలువరించిన ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో పలు అంశాలు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే. దాంతో తీర్పును వ్యతిరేకిస్తూ 2010 మార్చి 28న ప్రభుత్వం సుప్రీంలో ఎస్ఎల్పీని దాఖలు చేసింది. అయితే ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడ్డాక రావాలని సుప్రీం పేర్కొంది. ప్రస్తుతం ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడిన నేపథ్యం లో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రావాలంటే ముందుగా గెజిట్‌లో ప్రచురించాలి. ఇది జరగకుండా సుప్రీంద్వారా అడ్డుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. తీర్పులో కేంద్రం జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. ఇందులో మార్పుచేర్పులు చేయాలన్నా... అమల్లోకి రాకుండా ఉంచాలన్నా సుప్రీంకోర్టు ద్వారానే సాధ్యమవుతుంది. అయితే తీర్పుపై సుప్రీం స్టేకు నిరాకరిస్తే మాత్రం రాష్ట్రానికి కష్టకాలం మొదలైనట్టే! కరువొస్తే అంతే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలకు ఆకుల్లో, దిగువ రాష్ట్రమైన మనకు కంచంలో అన్న రీతిగా ఉన్నాయి. మనమెంత మొత్తుకున్నా వినకుండా మిగులు జలాలను కూడా లెక్కగట్టి మరీ మూడు రాష్ట్రాల మధ్యా పంచేసి తీరని అన్యాయం చేసిన ట్రిబ్యునల్, కరువు సంవత్సరాల్లో తగ్గే నీటి లభ్యత తాలూకు భారాన్ని కూడా అదేవిధంగా మూడింటికీ పంచమంటే మాత్రం ససేమిరా అంది. డిస్ట్రెస్ షేరింగ్ (కరువునూ సవూనంగా అనుభవించడం) కుదరదని తేల్చిచెప్పింది. ఆ విధంగా మనకు మరో భారీ అన్యాయానికి ఒడిగట్టింది. ఫలితంగా ఇకపై కరువు సంవత్సరాల్లో మన రాష్ట్రానికి చుక్క నీరు కూడా వస్తుందన్న ఆశల్లేవు. ఎందుకంటే మహారాష్ట్ర, కర్ణాటక రెండూ తమ ప్రాజెక్టులన్నీ నిండేదాకా దిగువనున్న మనకు నీటిని వదలకపోయినా ప్రశ్నించే దిక్కు లేదు. అదేమని అడిగే హక్కు కూడా మనకు ఉండబోదు. పైగా ఈ అసంబద్ధ నిర్ణయానికి సమర్థనగా బచావత్ అవార్డును కూడా బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఉదాహరించింది. ‘‘మొత్తం జలాల్లో దాదాపు ఐదో వంతును అదనపు జలాలుగా పరిగణించి మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసిన బచావత్ ట్రిబ్యునల్ కూడా డిస్ట్రెస్ షేరింగ్ సదుపాయం కల్పించలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి అవసరమేదీ లేదు. పైగా డిస్ట్రెస్ షేరింగ్ కోసమని బచావత్ అవార్డు ప్రకారం కొనసాగుతున్న నీటి వినియోగ వ్యవస్థను కాదని ఇప్పుడింకో కొత్త వ్యవస్థను ప్రవేశపెడితే అది లేనిపోని గందరగోళానికి దారి తీయవచ్చు’’ అంటూ మనకు మొండిచేయి చూపింది. ఆలమట్టి ఎత్తు పెంపును ఇలా సమర్థించారు... బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాలపై ఇచ్చిన తీర్పులో ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు అత్యంత కీలకమైంది. ప్రస్తుతమున్న 519 అడుగుల స్థాయి నుంచి 524 అడుగుల స్థాయికి డ్యాం ఎత్తు పెంచితే తమకు తీవ్ర నష్టమని, బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు అనుగుణంగా కేటాయించిన నీటినీ వాడుకోలేమన్నది ఆంధ్రప్రదేశ్ వాదన. అంతేకాదు.. కర్ణాటక ఈ డ్యాం ద్వారా ఇప్పటికే తనకు కేటాయించిన 173 టీఎంసీలకు మించి వాడుకుంటోందని కూడా వాదించింది. అయితే బ్రిజేశ్‌కుమార్ ఈ వాదనలన్నింటినీ కొట్టిపారేశారు. ఆలమట్టి డ్యాం ప్రాంతంలో నీటి లభ్యతకు సంబంధించి ఏరకమైన వివాదమూ లేదని తన తీర్పులో స్పష్టం చేశారు. ఎత్తు పెంపుతో తమకు ఇన్‌ఫ్లోస్ పూర్తిగా తగ్గిపోతాయన్న ఆంధ్రప్రదేశ్ వాదన అర్థరహితమని వ్యాఖ్యానించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు హక్కులే లేవు కాబట్టి ఎగువ రాష్ట్రమైన కర్ణాటక ఆలమట్టి ఎత్తును పెంచుకున్నా నష్టమేమీ జరగదని తీర్పునిచ్చారు. తాజాగా మిగులు జలాలను కూడా మూడు రాష్ట్రాలకూ పంచిన కారణంగా ఆ నీటిని వాడుకునేందుకు వీలుగా ఆలమట్టి ఎత్తు పెంచుకోవచ్చునని తేల్చారు!