సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చే నిర్ణయం తీసుకున్న జేడీఎస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంతో టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు దోస్తీ చేస్తుండటంపై సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. జేడీఎస్ అధినేత దేవెగౌడను టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి రప్పిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1996లో ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్లకు పెంచి రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టిన సందర్భంలో దేవెగౌడ ప్రధానిగా ఉండటం.. ఆ సర్కార్‌లో టీడీపీ భాగస్వామి కావడాన్ని సాగునీటిరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఆ నిర్ణయాన్ని అప్పటి సీఎం చంద్రబాబు వ్యతిరేకించి ఉంటే.. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 519.6 మీటర్లకు పెరిగేది కాదని స్పష్టం చేస్తున్నారు. నాడు రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి దేవెగౌడకు మద్దతుగా నిలిచిన రీతిలోనే.. నేడు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన్ని ప్రచారానికి పిలిపించుకుంటున్నారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
నిపుణుల సూచనలు పెడచెవిన పెట్టిన బాబు
కృష్ణా నదిపై యూకేపీ (అప్పర్ కృష్ణా ప్రాజెక్టు)లో భాగంగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల ఎత్తుకు పెంచడానికి కర్ణాటక సర్కార్ 1996లో శ్రీకారం చుట్టింది. అప్పట్లో కేంద్రంలో హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ సర్కార్ అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వం టీడీపీ భాగస్వామి. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)పై అప్పట్లో దేవెగౌడ ఒత్తిడి తెచ్చి ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల ఎత్తుకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీని వల్ల ఆల్మట్టి డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకు పెరుగుతుందని, ఎగువ నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లోకి కృష్ణా వరద ప్రవాహం ఆలస్యంగా వస్తుందని.. నీటి లభ్యత తక్కువగా ఉన్న సందర్భాల్లో తాగునీటికి ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా ఆల్మట్టి ఎత్తు పెంపును వ్యతిరేకించాలని అప్పట్లో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, సాగునీటి రంగ నిపుణులు సీఎం చంద్రబాబుకు సూచించారు. కానీ వాటిని తుంగలో తొక్కారు.
ఇదే అదునుగా కర్ణాటక సర్కార్ ఆగమేఘాలపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్లకు పెంచేసింది. 1997 వరకు జూలై మొదటి వారానికే శ్రీశైలానికి ఎగువ నుంచి వచ్చే కృష్ణా వరద ప్రవాహం.. తర్వాత ఆగస్టు నెలాఖరుకు గానీ రావడం లేదు. దీని వల్ల కృష్ణా పరీవాహక ప్రాంతంలోని రైతులు సకాలంలో నీళ్లందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు అలసత్వాన్ని అస్త్రంగా చేసుకున్న కర్ణాటక సర్కార్ 1996 నుంచి 1999 వరకు.. చిత్రావతిపై పరగోడు, పెన్నాపై నాగలమడక వద్ద జలాశయం నిర్మించి ఆ రెండు నదుల ప్రవాహాన్ని అనంతపురం జిల్లాలోకి ప్రవేశించకుండా కట్టడి చేసింది.
అన్యాయంపై నోరు పెగల్చని చంద్రబాబు
తాజాగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.26 మీటర్ల ఎత్తుకు పెంచాలని కర్ణాటక సర్కార్ నిర్ణయించి పనులను ఆగమేఘాలపై ప్రారంభించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం నోటిఫై చేసే వరకు ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచకూడదు. ఇది చంద్రబాబుకు తెలుసు. కానీ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే కర్ణాటక నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించడం లేదు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం దేవెగౌడతో దోస్తీ చేస్తున్న చంద్రబాబు, ఆ స్నేహబంధం చెడిపోకుండా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని టీడీపీ నేతలే విమర్శిస్తున్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 524.26 అడుగులకు పెంచితే.. నీటి నిల్వ 200 టీఎంసీలకు పెరుగుతుంది. అప్పుడు శ్రీశైలానికి ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం మరింత ఆలస్యం అవుతుంది. నీటి లభ్యత తక్కువగా ఉన్న సందర్భాల్లో దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండదు. అప్పుడు రాష్ట్రంలోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం ఎడారిగా మారక తప్పదు. కానీ.. ఇవేవీ చంద్రబాబుకు పట్టడం లేదని సాగునీటి రంగ నిపుణులు తప్పుపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment