దేశమంతా నివ్వెరపోయిన వివాదం ఇది. ఘన కుటుంబ వారసత్వం... దేశంలోని అత్యున్నత ప్రజా ప్రాతినిధ్య వేదికైన పార్లమెంట్‌లో సభ్యత్వం... ఇవేవీ మనిషిలోని మకిలినీ, మృగాన్నీ మార్చలేక పోయిన విషాదం ఇది. మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడూ, ఆయన తదనంతరం కర్ణాటకలో హసన్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన యువకుడూ అయిన ప్రజ్వల్ రేవణ్ణ నిస్సహాయులైన పలువురు స్త్రీలతో సాగించిన బలవంతపు లైంగిక చర్యల వ్యవహారం సభ్యసమాజాన్ని తలదించుకొనేలా చేస్తోంది.
ఏప్రిల్ 26 నాటి లోక్‌సభ పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు ఆ వికృత వీడియోలు వందల కొద్దీ బయటకు రావడం సొంత కుటుంబపార్టీ జేడీ(ఎస్)ను సైతం ఆత్మరక్షణలో పడేసింది. అన్నిటికీ మించి సామాన్యులకు రక్షకులమంటూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారే చివరకు భక్షకులుగా తయారవుతున్న రాజకీయ విలువల పతనానికి ఈ వ్యవహారం మరో నగ్నసాక్ష్యంగా నిలిచింది.
2019 నుంచి 2022 మధ్య పలుమార్లు తనను ప్రజ్వల్ రేవణ్ణ లైంగికంగా బలవంతం చేశారంటూ బాధితురాలు ఒకరు ఆరోపించారు. పనివారి నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగినుల దాకా పలువురితో ఈ మాజీ ప్రధాని మనుమడు ఇంట్లో, ఆఫీసులో ఇలానే వ్యవహరించారట. వాటిని స్వయంగా రికార్డ్ చేసి, బ్లాక్‌మెయిల్ చేస్తూ వచ్చారట. దాదాపు 3 వేల వీడియోలతో కూడిన ఆ వికృత చర్యల పెన్‌డ్రైవ్ ఇప్పుడు బయటపడింది.
నిజానికి, ప్రజ్వల్ అకృత్య వీడియోల కథ కొత్తదేమీ కాదు. ఆయన వీడియోలు అనేకం కొన్నేళ్ళ క్రితమే బయటకొచ్చాయి. వాటి ప్రచురణ, ప్రసారాల్ని అడ్డుకొనేందుకు ఈ 33 ఏళ్ళ యువనేత అప్పట్లోనే కోర్టుకెళ్ళారు. మీడియా చేతులు కట్టేస్తూ హైకోర్టు నుంచి నిషేధపుటుత్తర్వులు తెచ్చుకున్నారు.
తీరా ఇప్పుడు ఓ బాధితురాలు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో మరోసారి తేనె తుట్టె కదిలింది. ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొంది. ఈ మురికి చేష్టల కేసుపై ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేసింది. ప్రజ్వల్ వివాదంలో రాజకీయాలున్నాయనే మాట వినిపిస్తున్నది అందుకే!
వీడియోలు అయిదేళ్ళ పాతవనీ, బాధిత మహిళలకు న్యాయం చేసే ఉద్దేశమే నిజంగా ఉంటే, ఈ పార్లమెంట్ సభ్యుడి లైంగిక దుష్ప్రవర్తనపై సాక్ష్యాలు చాలాకాలంగా ఉన్నా కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రస్తుత ఎన్నికల సమయంలోనే ఈ అస్త్రం ఎందుకు బయటకు తీసింది? ఇవీ బీజేపీ ప్రశ్నలు. బాధితురాలు కేసు పెట్టడం, వీడియోల వివాదాన్ని మీడియా బట్టబయలు చేయడంతో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నది అధికార కాంగ్రెస్ జవాబు.
ఆరోపణల పర్వమెలా ఉన్నా, నిందితుడు ప్రజ్వల్ ప్రాతినిధ్యం వహిస్తున్న జెడీ(ఎస్), అలాగే దానితో పొత్తుపెట్టుకున్న బీజేపీలు నష్టనివారణ చర్యలు చేపట్టక తప్పలేదు. బీజేపీ అగ్రనేత – సాక్షాత్తూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సైతం ఈ వివాదాస్పద వీడియోలను ఖండిస్తూ, నారీశక్తినే తాము బలపరుస్తున్నామని మంగళవారం వివరణనివ్వాల్సి వచ్చింది.
ప్రజ్వల్, అతని తండ్రి రేవణ్ణ విడిగా ఉంటారనీ, తమ కుటుంబంతో సంబంధం లేదనీ నిందితుడి బాబాయ్, మాజీ సీఎం కుమారస్వామి అనాల్సి వచ్చింది. ఈ సెక్స్ వీడియోల వివాదం ప్రభావం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా చూడాలనే తాపత్రయం తెలుస్తూనే ఉంది. చివరకు, ‘సిట్’ దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కుమారస్వామి ప్రకటించడం అనివార్యమైంది.
ప్రజ్వల్ రేవణ్ణ కేసు ఏదో నూటికో, కోటికో జరిగిన ఘటన అనుకుంటే పొరపాటే. రాజకీయ బలిమిని చూసుకొని కన్నూమిన్నూ కానని కొందరు... బలవంతపు లైంగిక చర్యలు, దాడులకు పాల్పడుతున్న కేసులు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ బడాబాబులు అధికారాన్నీ, హోదానూ అడ్డుపెట్టుకొని ఈ కేసుల నుంచి ఒంటి మీద దుస్తులు నలగకుండా బయటకు వచ్చేస్తున్నారు.
మహిళా రెజ్లర్లతో లైంగికంగా అనుచిత రీతిలో వ్యవహరిస్తూ వచ్చిన బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ కేసు అంతర్జాతీయంగానూ వార్తల్లో నిలిచినా, ఇప్పటి దాకా అతీగతీ లేదు. బాధితులకు ఇప్పటికీ న్యాయం దక్కలేదు. సందీప్ సింగ్, ఖజన్ సింగ్ లాంటి పలువురు నేతల కేసుల కథ కూడా అంతే. గమ్మత్తేమిటంటే, గతంలోనే ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్వల్ హైకోర్ట్ ‘గ్యాగ్’ ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని, దర్జాగా గడిపేశాడు.
సిగ్గుమాలిన నేరచర్యలు యథేచ్ఛగా కొనసాగించాడు. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు ఇప్పుడు ప్రభుత్వం తాజాగా దర్యాప్తు చేపట్టడంతో కష్టాలు తప్పలేదు. పోలింగైన వెంటనే గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఉడాయించాడు.
ప్రజ్వల్ వ్యవహారశైలి, అతని వీడియోల పెన్‌డ్రైవ్‌పై స్థానిక బీజేపీ నేత ఒకరు గత డిసెంబర్‌లోనే తన పార్టీని అప్రమత్తం చేశారు. జేడీ(ఎస్)తో పొత్తునూ, హసన్‌లో ప్రజ్వల్ అభ్యర్థిత్వాన్నీ వ్యతిరేకించారు. అన్నీ తెలిసినా బీజేపీ ముందుకెళ్ళి పొత్తు కొనసాగించడం, ప్రజ్వల్‌కు మద్దతుగా ఆ పార్టీ అధినాయకత్వం స్వయంగా ఎన్నికల ప్రచారం చేయడం విడ్డూరం. నారీశక్తికి వందనమంటూ కబుర్లు చెప్పి, మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు తంటాలు పడే పార్టీలు, ప్రతినిధులు ఆడ వారికి ఇస్తున్న అసలైన గౌరవం అంతంత మాత్రమే.
పితృస్వామ్య భావజాలంతో స్త్రీని భోగ వస్తువుగా చూసే సంస్కృతి నుంచి ఇవాళ్టికీ మన సమాజం, నేతలు బయటపడనే లేదన్న చేదు నిజం పదే పదే రుజువవుతోంది. చివరకు తాజా లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం సైతం 15 శాతం లోపలే అన్నది మన మహిళా సాధికారత మాటల్లోని డొల్లతనానికి నిదర్శనం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. అధికారం మాటేమో కానీ, ముందుగా వారిని సుఖభోగ యంత్రాలుగా భావించడం మాని, మనుషులుగా గుర్తించాలి. ప్రజ్వల్ సహా కళంకిత నేతల్ని కఠినంగా శిక్షించడం ఆ క్రమంలో తొలి అడుగు.
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
Published Wed, May 1 2024 12:23 AM | Last Updated on Wed, May 1 2024 12:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment