ఏణ్ణర్ధం దాటినా... మణిపుర్ మండుతూనే ఉంది. జాతుల మధ్య ఘర్షణ తగ్గకపోగా, అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా పదిరోజుల క్రితం ఓ కుకీ మహిళ అత్యాచారం – హత్య, దానికి ప్రతిగా మెయితీలపై కుకీ తీవ్రవాదుల దాడులు, చివరకు ఓ సహాయ శిబిరం నుంచి నవంబర్‌లో అపహరణకు గురైన ఓ పసిబిడ్డతో సహా ఆరుగురు అమాయక మెయితీలు ప్రాణాలు కోల్పోవడం... ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
సీఎం సహా రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల ఇళ్ళపై దాడులతో చివరకు రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ స్తంభన, వివాదాస్పదమైన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం విధింపు, కేంద్రం నుంచి అదనపు బలగాలను పంపడం దాకా వెళ్ళింది. ప్రభుత్వ మనుగుడకు ముప్పేమీ లేకున్నా, బీజేపీ సర్కారుకు తమ మద్దతును ఉపసంహరించుకున్నట్టు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించడం మిత్రుల్లోనూ బీజేపీ పట్ల పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం.
గత 2023 మేలో హింసాకాండ మొదలైనప్పటి నుంచి జాతుల ఘర్షణల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఎంతసేపటికీ బాహ్య శక్తులు కారణమంటూ ఆరోపించడం, శుష్కవాగ్దానాలు చేయడమే తప్ప, రాష్ట్రం రావణకాష్ఠమైనా పరిస్థితిని అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు పూర్తిగా విఫలమయ్యారు.
మణిపుర్ సామాజిక – ఆర్థిక జీవితంలో జాతుల ఉనికి అత్యంత కీలకమైనది. దాన్నిబట్టే ఆ ఈశాన్య రాష్ట్రంలో భూములపై హక్కులు, తదనుగుణంగా రాజకీయ సైద్ధాంతిక విభేదాలు రూపు దిద్దుకుంటూ వచ్చాయి. దాదాపు డజనుకు పైగా గిరిజన తెగలను కలిపి, బ్రిటీషు పాలనా కాలంలో కుకీలు అని పేరుపెట్టారు. విభిన్న జాతుల్లో ప్రధానమైనవైన మెయితీ వర్గానికీ, కుకీలకూ మధ్య పాలకులు తమ స్వార్థప్రయోజనాల కోసం అగ్నికి ఆజ్యం పోశారు.
అదే అసలు సమస్య. జనరల్ వర్గానికి చెందిన మెయితీలు తమకు కూడా షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా కల్పించాలని కోరు తున్నారు. అయితే, దానివల్ల తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయని కుకీల ఆందోళన. మరోపక్క మిజోరమ్‌తోనూ, పొరుగున మయన్మార్‌లోని చిన్ రాష్ట్రంతోనూ జాతి సంబంధాలున్న కుకీల వాంఛ వేరు. మణిపుర్ నుంచి తమ ప్రాంతాన్ని విభజించి, ప్రత్యేక పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని వారు బలంగా వాదిస్తున్నారు.
ఇది చాలదన్నట్టు మెయితీ వర్గానికి చెందిన మణిపుర్ ప్రస్తుత ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ, కుకీలను అణచివేస్తున్నారనే అభిప్రాయం రోజురోజుకూ బలపడుతూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమయ్యాయి.
కారణాలు ఏమైనా, రాష్ట్రంలోని బీజేపీ పాలిత ప్రభుత్వ సారథి అన్ని వర్గాలనూ ఒక తాటి మీదకు తీసుకురావడంలో విఫలమవడంతో బాధ్యత అంతా కేంద్రం భుజాల మీద పడింది. కేంద్ర హోమ్‌శాఖ మొన్న అక్టోబర్‌లో మెయితీ, కుకీల వర్గాల రాజకీయ ప్రతినిధులతో సమావేశం జరిపింది కానీ, శాంతిసాధన దిశగా అడుగులు పడలేదు. ప్రత్యేక శాసనవ్యవస్థతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం తమకు కావాల్సిందేనని కుకీలు భీష్మించుకు కూర్చున్నారు.
మణిపుర్ విభజనతో మాత్రమే సాధ్యం. అయితే, కేంద్ర జోక్యంతో సమస్యను పరిష్కరించవచ్చని ఇప్పటికీ కుకీలు భావిస్తున్నారు. ఇంత సంక్షోభంలోనూ అది ఓ సానుకూల అంశం. ఢిల్లీ పెద్దలు దాన్ని వినియోగించుకోవాలి. కానీ, అలా జరుగుతున్నట్టు లేదు.
విధానపరంగా, రాజకీయంగా సీఎం విఫలమయ్యారని తెలుస్తున్నా, గద్దె మీది బీరేన్‌సింగ్‌ను మార్చడానికి బీజేపీ, కేంద్రంలోని ఆ పార్టీ పెద్దలు ఎందుకు ముందుకు రావడం లేదో తెలియదు. బీరేన్‌పై అంత ప్రేమ ఎందుకన్నది బేతాళప్రశ్న. డబుల్ ఇంజన్ సర్కార్‌తో ప్రగతి అంటే ఇదేనా? మణిపుర్‌ను దేశంలో అంతర్భాగమని వారు అనుకోవట్లేదా? ఈశాన్యంలో పార్టీ విస్తరణపై ఉన్న శ్రద్ధలో కాసింతైనా శాంతిస్థాపనపై కాషాయ పెద్దలకు ఎందుకు లేదు?
అంతకంతకూ క్షీణిస్తున్న పరిస్థితులు ప్రభుత్వంతో పాటు రాజకీయ పక్షాలు సైతం బాధ్యతను వదిలేశాయనడానికి సూచన. ఈ సంక్షుభిత ఈశాన్య రాష్ట్రానికి ఇప్పుడు కాస్తంత సాంత్వన కావాలి. బాధిత వర్గాలన్నిటినీ ఓదార్చి, ఉపశమనం కలిగించే పెద్ద మనసు కావాలి. పౌరసమాజాన్ని కూడా భాగస్వామ్యపక్షం చేసి, సమస్యకు రాజకీయ పరిష్కారం చూడడమే మార్గం. అందుకు కేంద్ర సర్కారు ఇప్పటికైనా చిత్తశుద్ధితో చొరవ తీసుకోవాలి.
పాలకులు మణిపుర్‌ను వట్టి శాంతిభద్రతల కోణం నుంచే చూస్తే కష్టం. దాని వల్ల సామాన్య ప్రజానీకానికీ, ఈశాన్య ప్రాంతంలోని సాయుధ బలగాలకూ కష్టాలు పెరుగుతాయి. రాష్ట్రంలో చేజారిన పరిస్థితుల్ని ఇప్పటికైనా చక్కదిద్దేందుకు కేంద్రం ప్రయత్నించకపోతే, అది దేశ సమగ్రతకే ప్రమాదం. పొరుగున మయన్మార్, బంగ్లాదేశ్‌లలో సంక్షుభిత వాతావరణం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తత అత్యవసరం.
అనేక సాయుధ తీవ్రవాద గ్రూపులతో, ఇట్టే చొరబాట్లకు చాలా అవకాశం ఉన్న సరిహద్దుల్లో మణిపుర్ ఉందని విస్మరించరాదు. కేవలం సాయుధ బలగాల మోహరింపుతో అక్కడ శాంతి సాధ్యంకాదు. హింసలో తాత్కాలిక విరామాన్ని చూపి, అదే శాంతి అని నమ్మబలకడం మూర్ఖత్వం. అన్ని వర్గాల మధ్య సామరస్యం, సహజీవనం సాగేలా రాజకీయ ఏర్పాటు చేయగలిగితేనే హింసకు తెర పడుతుంది.
కేంద్రం ఇప్పటికైనా చిత్తశుద్ధితో అందుకు సర్వశక్తులూ ఒడ్డాలి. లేదంటే, అగ్ని పర్వతం సమీపంలోనే ఉన్నా అలసత్వంతో వ్యవహరిస్తున్నట్టే! దాదాపు 33 లక్షల సోదర భారతీయ జనాభాను స్వార్థ ఆర్థిక, అధికార ప్రయోజనాల కోసం గాలికి వదిలేస్తున్నట్టే! గుజరాత్, ముజఫర్ నగర్, ఢిల్లీ లాంటి అనేక చోట కొద్ది రోజుల్లో హింసకు ముకుతాడు వేయగలిగినచోట ఇన్ని నెలలుగా ఒక రాష్ట్రాన్ని మంటల్లో వదిలేయడం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ పాలకులకు సిగ్గుచేటు!
రగులుతున్న అగ్నిపర్వతం!
Published Tue, Nov 19 2024 4:10 AM | Last Updated on Tue, Nov 19 2024 4:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment