
విశ్లేషణ
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ .బీరేన్ సింగ్ ఎట్టకేలకు ఈ నెల 9న రాజీనామా చేశారు. సుమారు 21 నెలలపాటు రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేసిన తెగల కొట్లాటలకు ఈయన ఆజ్యం పోశారని అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైన కొద్ది సమయానికి సీఎం తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మణిపూర్‌లో దీర్ఘకాలం కొనసాగిన అనిశ్చితి, ద్వేషపూరిత వాతావరణం కారణంగా మాన భంగాలు, హత్య, విధ్వంసాలు రాజ్యమేలిన సంగతి తెలిసిందే.
దేశ ఈశాన్య ప్రాంతం ఒకప్పుడు ఉగ్రవాదానికి, చొరబాట్లకు, మత్తుమందులకు, ఆయుధాల అక్రమ తరలింపులకు కేంద్రంగా ఉండిందనీ, ప్రస్తుతం అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, వ్యవ సాయాభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులకు మారుపేరుగా నిలిచిందనీ అమిత్ షా పేర్కొనడం గమనార్హం. దశాబ్ద కాలంలో కేంద్ర మంత్రులు ఈ ప్రాంతాన్ని 700 సార్లు సందర్శించారని కూడా ఆయన అన్నారు.
అగర్తలలో కొంతమంది యువకులకు ఉద్యోగ నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి ఆన్ లైన్ మాధ్యమంలో హాజరైన హోం శాఖ మంత్రి మాట్లాడుతూ, త్రిపుర సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నా యని అన్నారు. ఆశ్చర్యకరంగా ఇదే రకమైన భరోసా, సాంత్వన మాటలు మణిపూర్ విషయంలో ఈ నేత నుంచి వెలువడలేదు!
వ్యతిరేకత స్పష్టమయ్యాకే...
బీరేన్ సింగ్ రాజీనామాకు కొన్ని రోజుల క్రితం అమిత్ షా మణి పూర్ పంచాయతీ రాజ్ మంత్రి, సీఎం వ్యతిరేకి వై.ఖేమ్‌చంద్ సింగ్, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ టోక్‌చోమ్ సత్యబ్రత సింగ్‌లతో సమావేశ మయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మంది సత్యబ్రతను కలిసి సీఎం నేతృత్వం పట్ల తమ అసంతృప్తిని స్పష్టం చేశారు. ప్రజలు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తాము నిర్దిష్ట నిర్ణయాలు తీసుకుంటామనీ, ఇంకా వేచి ఉండటం సాధ్యం కాదని కూడా వీరు తేల్చారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పున రుద్ధరణ తక్షణం జరగాలనీ, లేదంటే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని అనూహ్య పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందనీ వీరు హెచ్చరించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10న ప్రారంభం కావాల్సి ఉండగా... సీఎం రాజీనామాతో అవి నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు త్రిపురలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలతోనూ విభేదించడం గమనార్హం.
2023 మే నెలలో మణిపూర్‌లో రెండు తెగల మధ్య హింస మొదలైనప్పటి నుంచి బీరేన్ సింగ్ నాయకత్వం మీద అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. అయితే ప్రధాని, హోంశాఖ, బీజేపీ అధి ష్టానం బీరేన్ ను పదవి నుంచి తప్పించేందుకు ఇష్టపడలేదు. ఈ సమయంలోనే రాష్ట్రంలో నేతల మధ్య కుమ్ములాటలు అంతకంతకూ పెరగడం మొదలైంది. కుకి–జో వర్గానికి చెందిన పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని ప్రకటించారు.
బీజేపీ భాగస్వామ్య పక్షాలైన నాగాస్ పీపుల్స్ ఫ్రంట్, జనతా దళ్(యునైటెడ్) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాయి. ఈ క్రమంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసింది. అవిశ్వాస తీర్మా నాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే హోం శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసి, 2024 డిసెంబర్‌లో మణిపుర్ గవర్నర్‌గా నియమితులైన అజయ్ భల్లాకు రాష్ట్ర రాజకీయ, శాంతి భద్రతల పరిస్థితుల మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన తన అనుభ వంతో రాజకీయ సంక్షోభాన్ని నియంత్రించగలిగారని అంచనా.
ఘర్షణల్లో సీఎం పాత్ర?
అయితే రాష్ట్రంలో తెగల మధ్య కొట్లాటను సీఎం స్వయంగా ఎగ దోశారన్న ఆరోపణలు వచ్చిన తరువాత పరిస్థితి ఆసక్తికరమైన మలుపు తిరిగింది. మానవ హక్కులపై ఏర్పాటైన కుకీ సంస్థ ఒకటి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొట్లాటల్లో సీఎం ప్రమేయంపై ఆడియో టేపులు ఉన్నాయని ఈ సంస్థ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. ఈ టేపులను పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్ ్స లాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపడమే కాకుండా... ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ఈ టేపులను విశ్లేషించిన ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సర్వీసెస్ అందులోని గొంతు 93 శాతం బీరేన్ సింగ్‌దేనని స్పష్టం చేసింది.
ట్రూత్‌ల్యాబ్ ఫలితాలు, సీఎఫ్‌ఎస్‌ఎల్‌తో సరిపోలితే దాని ప్రభావం మణిపూర్ రాజకీయాలపై మాత్రమే కాకుండా... జాతీయ స్థాయిలోనూ తీవ్రంగానే ఉండనుంది. బీరేన్ సింగ్ బీజేపీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వాలకు అనుగుణంగానే పనిచేశారు. ఘర్షణలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించినా పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆయన్ని తొలగించేందుకు ఇష్టపడకపోవడమే అందుకు నిదర్శనం. ప్రతిపక్షం బీరేన్ సింగ్‌ను తొలగించేందుకు ఒత్తిడి తీసుకు రావడమే కాకుండా... బీజేపీ కేంద్ర నాయకత్వంపై కూడా విమర్శల దాడికి సిద్ధమైంది. బీరేన్ సింగ్ కూడా మోదీ–షా తరహా హిందుత్వ రాజకీయాల స్ఫూర్తితో మెయితీలందరినీ ఒక ఛత్రం కిందకు తీసుకు రాగా... ఆర్‌ఎస్‌ఎస్ తన వంతు పాత్రను పోషించింది.
మయన్మార్‌తో మణిపూర్ సుమారు 390 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగివుంది. ఈ సరిహదులో కంచె వేసిన ప్రాంతం 10 కిలోమీటర్లు మాత్రమే. చొరబాట్లకు కుకీ–జో తెగలు కారణమనీ,అందువల్లనే రాష్ట్రంలో అశాంతి పెరిగిపోతోందనీ బీజేపీ ఆరోపిస్తుంటే... ఆ తెగల ప్రతినిధులు మాత్రం ఘర్షణలను ఎగదొసేందుకు బీరేన్ సింగ్ ఈ చొరబాట్లను ఒక నెపంగా వాడుకున్నారని ఆరోపి స్తున్నారు. మయన్మార్ సరిహద్దులో మొత్తం కంచె వేయడం భౌగో ళికంగా అసంభవమని తెలిసినా, అవినీతి ఆర్థికశాస్త్రంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలున్నాయి.
స్వపరిపాలనే మార్గం
ఈ ప్రాంతంలో మత్తుమందుల రవాణా విచ్చలవిడిగా కొనసాగేందుకు మయన్మార్, థాయ్‌ల్యాండ్ సరిహద్దులు అంత సురక్షితంగా లేకపోవడమే కారణం. అక్రమ రవాణా, మత్తుమందుల వ్యాపారాలతో వచ్చే ఆదాయం సహజంగానే అయా ప్రాంతాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు వెళ్తుంది. మణిపూర్‌లో అధికారంలో ఉన్న బీజేపీ వీటికి అతీతంగా పనిచేస్తుందని అనుకోలేము.
వేర్వేరు తెగలు ఉన్న మణిపూర్ వంటి రాష్ట్రాల్లో సమాఖ్య తరహా పాలన, స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలను ఏర్పాటు చేసు కోవడం మేలని నేను చాలాకాలంగా సూచిస్తూ ఉన్నాను. ఈ ఏర్పాట్ల వల్ల వేర్వేరు స్థాయుల్లో స్వపరిపాలనకు మార్గం ఏర్పడుతుంది. మణిపూర్‌లో కేవలం రెండు తెగలు మాత్రమే లేవు. హమార్, వైఫీ, గాంగ్టే, కోమ్, చిరు, ఆనల్, మారింగ్ తెగలూ ఉన్నాయి. కానీ మోదీ ప్రభుత్వం, బీజేపీ రెండూ తమకు రాజకీయంగా లాభం ఉంటే తప్ప స్వపరిపాలన వ్యవస్థల ఏర్పాటుకు అనుకూలంగా ఉండవు.
ప్రకృతి వనరులు, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాల్లో కుకీలు ఎక్కువగా ఉంటారు. వీరికి స్వపరిపాలన మార్గం చూపితే అక్కడ కేంద్ర ప్రభుత్వానికి దగ్గరైన కార్పొరేట్ కంపెనీల ఆటలు చెల్లవు. దశాబ్ద కాలం అధికారంలో ఉన్నప్పటికీ మణిపూర్‌లాంటి సంక్షోభాలు తలెత్తిన ప్రతి సందర్భంలోనూ బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూంటుంది. అయితే కాషాయ పార్టీ స్వయంగా కొట్లాటలకు ఆజ్యం పోసిన సందర్భంలో మాత్రం ఈ విమర్శలకు విలువ ఉండదు. అన్నింటికీ మించి అందరం అడగా ల్సిన ప్రశ్న ఒకటి ఉంది... ఈ కల్లోలం నుంచి మణిపూర్ బయటపడే రోజు ఎప్పుడొస్తుంది?
అజయ్ కె. మెహ్రా
వ్యాసకర్త పొలిటికల్ సైంటిస్ట్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment