నవంబరు 11 నుంచి కనిపించకుండా పోయిన మహిళలు, పిల్లలవిగా భావిస్తున్న ఆరు మృతదేహాలు మణిపుర్ సరిహద్దులోని నది నుండి స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన నివేదికల తర్వాత రాజధాని ఇంఫాల్ లోయలో భయంకర వాతావరణం నెలకొంది. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి, వాహనాలను తగుల బెట్టి, పలువురు ఎమ్మెల్యేల నివాసాలపైనా, సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం పైనా దాడి చేశారు. దీంతో గిరిజనేతర మెయితీల ఆధిపత్యంలో ఉన్న లోయలోని ఏడు జిల్లాల్లో ప్రభుత్వం ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.
గిరిజన కుకీ– జోలు ఎక్కువగా ఉండే చుట్టుపక్కల కొండలు, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్ జిల్లాలలో కూడా కర్ఫ్యూ విధించారు. ప్రపంచమంతా తిరిగొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ... ఈ క్లిష్ట పరిస్థితు ల్లోనూ మణిపుర్ రాష్ట్రాన్ని సందర్శించి అక్కడ శాంతిని పునరుద్ధరించే పని చేపట్టక పోవడం దిగ్భ్రాంతిని కలిగించే అంశం.
ఇరవై నెలలుగా ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌లో హింస రాజుకుంటోంది. 2023 మే 3న రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు దగ్గరగా ఉన్న చురాచాంద్‌పూర్ పట్టణంలో మెయితీ కమ్యూనిటీ– కుకీ తెగ మధ్య హింస చెలరేగింది. తమకు షెడ్యూల్డ్ తెగ హోదా ఇవ్వాలని గిరిజనేతర మెయితీ ప్రజలు డిమాండ్ చేయడం ఘర్షణలకు తక్షణ అని అంటున్నారు. కుకీలను మెయితీలు బయటి వ్యక్తులుగా, మాదకద్రవ్యాల వ్యాపారులుగా చూస్తారు.
తమకు ఎస్టీ హోదా లేనందువల్ల తాము కుకీ ప్రాంతాల్లో భూములు కొనలేక పోతున్నట్లు వారు భావిస్తారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పరిపాలనా స్థానాలను కలిగి ఉన్న మెయితీలే తమ అవకాశాలన్నింటినీ కొట్టేస్తున్నట్లు కుకీలు భావి స్తారు. కొన్నేళ్లుగా రెండు వర్గాల మధ్య అనేక గొడవలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ప్రస్తుత అల్లర్లు ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి, విద్యలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
మణిపుర్ జనాభాలో 53 శాతం ఉన్న మెయితీ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ ఒక్కటే ప్రస్తుత హింసకు కారణం అని చెప్పలేం. అంతర్లీనంగా ఒకరి పట్ల ఒకరికి ఉన్న కోపం, చాలా కాలంగా వారి మధ్య కొనసాగుతున్న వైరుధ్యం లాంటివి అన్నీ కలిసి నేటి దుఃస్థితికి దారితీశాయి. రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలోని రక్షిత అడవులపై ప్రభుత్వ నిర్బంధం, తాము హింసకు గురవుతున్నామన్న భావన కుకీలలో అసంతృప్తిని కలిగిస్తోంది. మయన్మార్ నుంచి అక్రమంగా భారత్‌లో ప్రవేశించిన కుకీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
సరిహద్దు ఆవల, మణిపూర్‌లో తాము నివసించే ప్రాంతాలను కలిపి ప్రత్యేక కుకీ ల్యాండ్ కావాలనే వేర్పాటువాదులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం కూడా మరో కారణం. అలాగే కుకీలు మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారని పేర్కొంటూ కుకీ ప్రజలందరినీ ‘డ్రగ్ లార్డ్స్’ అని ప్రస్తావించడాన్ని వారు నిరసిస్తున్నారు. గిరిజన గ్రామాలలో జనాభా పెరగడంతో, వారు తమ పూర్వీకుల హక్కుగా భావించే చుట్టుపక్కల అటవీ ప్రాంతాలకు వ్యాపిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇదీ కుకీల్లో ఆగ్రహానికి హేతువే.
కొత్త గ్రామాలను ఎలా గుర్తించాలనే అంశంపై ప్రభుత్వానికి అసలు ఒక విధానం లేదు. అలాగే మణి పుర్‌లో పారదర్శకమైన అటవీ విధానం లేదు. దీంతో పాలక బీజేపీ కూటమిలోనూ దుమారం రేగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరింత విషమించకుండా కేంద్రం మరింత వివేకంతో వ్యవహరించాలి.
– డా‘‘ ముచ్చుకోట సురేష్ బాబు
ప్రజా సైన్స్ వేదిక అధ్యక్షుడు ‘ 99899 88912
ఘర్షణలకు ముగింపెప్పుడు?
Published Wed, Nov 20 2024 12:10 AM | Last Updated on Wed, Nov 20 2024 12:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment