దేశ ప్రజలు తమ ప్రియతమ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి (డిసెంబర్ 25)ని జరుపుకొంటున్న వేళ ఇది. ఆయన ఎంతో మందికి ప్రేరణను ఇస్తూ ఒక రాజనీతి కోవిదునిగా సమున్నత స్థానంలో నిలిచారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన సామాన్య పౌరుల కష్టాలను అర్థం చేసుకున్నారు. ప్రభుత్వానికి దక్షత ఉంటే ఎంతటి పరివర్తనను తీసుకురావచ్చో చేతల్లో చూపించారు. దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపిన మహనీయునిగా అటల్‌జీకి దేశ ప్రజలు ఎన్నటికీ రుణపడి ఉంటారు.
అటల్‌జీ 1998లో ప్రధా నిగా పదవిని స్వీకరించిన తరుణంలో మన దేశం రాజకీయ అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు తొమ్మిదేళ్లలో నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికలు జరగడాన్ని మనం చూశాం. దేశ ప్రజానీకం సహనాన్ని కోల్పోతూ, ఈ ప్రభుత్వాలు వాటి బాధ్యతను సమర్థంగా నెరవేర్చ గలుగుతాయా? అనే అనుమానంలో పడిపోయారు. ఈ స్థితిని అటల్‌జీ మార్చి స్థిరమైన, ప్రభావవంతమైన పాలనను అందించారు.
అటల్‌జీ నాయకత్వం ఎన్నో రంగాల్లో గణనీయ ప్రభావాన్ని చూపించింది. ఆయన పదవీ కాలంలో సమాచార సాంకేతిక విజ్ఞానం (ఐటీ), టెలికం, కమ్యూనికేషన్స్ రంగాల్లో గొప్ప పురోగతి చోటు చేసుకొంది. యువశక్తి అత్యంత చైతన్యవంతంగా ఉన్న భారత్ వంటి దేశానికి ఇది చాలా ముఖ్యం. అటల్‌జీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం టెక్నాలజీని సామాన్య పౌరులకు అందుబాటులోకి తేవడానికి శ్రద్ధ తీసుకుంది. భారత్‌లో సంధాన సదుపాయాల కల్పన విషయంలోనూ ముందుచూపు కనిపించింది. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును ఈనాటికీ చాలామంది గుర్తు పెట్టుకుంటున్నారు.
ఇది దేశంలో అనేక ప్రాంతాలను అనుసంధానం చేసింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి కార్యక్రమాలను అమలుచేయడం ద్వారా స్థానికంగా కూడా సంధానాన్ని పెంపొందింప చేయడానికి వాజ్‌పేయి ప్రభుత్వం చేసిన కృషి అంతే గుర్తించదగ్గది. ఇదే మాదిరి ఆయన ప్రభుత్వం ఢిల్లీ మెట్రోను ఏర్పాటు చేయడానికి పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఢిల్లీ మెట్రోకు ఒక ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల రంగ ప్రాజెక్టు అనే పేరు ప్రఖ్యాతులున్నాయి. వాజ్‌పేయి ప్రభుత్వం ఆర్థిక వృద్ధిని పెంచడమే కాక, దూరదూరాల్లో ఉన్న ప్రాంతాలను చేరువచేసి ఏకత, సమగ్రత వర్ధిల్లేటట్టు చూసింది.
సర్వ శిక్షా అభియాన్ వంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజలకు, ముఖ్యంగా పేదలకూ, సమాజంలో ఆదరణకు నోచుకోకుండా ఉండి పోయిన వర్గాలకూ ఆధునిక విద్యను అందుబాటులోకి తేగలిగే భారత దేశాన్ని ఆవిష్కరించాలన్న అటల్‌జీ కలను గురించి చెబుతుంది. ఆశ్రిత పక్షపాతం, దశాబ్దాల పాటు ఎదుగూబొదుగూ లేని ఆర్థిక విధా నాలతో సాగిన దేశంలో... అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వం చొరవ తీసుకుంది.
వాజ్‌పేయి అద్భుత నాయకత్వానికో చక్కటి ఉదాహరణ 1998 వేసవి. ఆయన ప్రభుత్వం అప్పుడే పదవీ బాధ్యతలు చేపట్టింది. వెంటనే మే 11న పోఖ్రాన్‌లో అణు పరీక్షలను నిర్వహించింది. ‘ఆప రేషన్ శక్తి’ పేరిట జరిగిన ఈ పరీక్షలు భారత శాస్త్రవేత్తల శక్తిని నిరూ పించాయి. భారత్ ఈ రకమైన పరీక్షలను నిర్వహించడమా? అని ప్రపంచం విస్తుపోయింది. ప్రపంచ దేశాలు వాటి ఆగ్రహాన్ని స్పష్టంగా వ్యక్తం చేశాయి.
ఆ సమయంలో ఏ సామాన్య నేత అయినా ఒత్తిడికి తలొగ్గేవారు. కానీ, అప్పుడు జరిగిందేమిటి? భారత్ దృఢంగా నిల బడటమే కాక, మరో రెండు రోజుల తరువాత అంటే మే 13న రెండో దఫా పరీక్షలు నిర్వహించింది. 11వ తేదీ పరీక్షలు విజ్ఞానశాస్త్ర నైపు ణ్యాన్ని చాటితే, 13వ తేదీన నిర్వహించిన పరీక్షలు సిసలైన నాయకత్వం అంటే ఏమిటో రుజువుచేశాయి. బెదిరింపులకో, ఒత్తిడికో లొంగిపోయే రోజులు గతించాయని ప్రపంచానికి ఆయన ఒక సందేశాన్ని పంపారు. అప్పటి ఎన్ డీఏ ప్రభుత్వం అంతర్జాతీయ ఆంక్షల్ని ఎదుర్కొంటూనే గట్టిగా నిలబడింది. భారత్ తన సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకొనే హక్కును నిలబెట్టుకొంటూ, ప్రపంచ శాంతిని బలంగా సమర్థించే దేశంగా కూడా నిలిచింది.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అటల్‌జీ అర్థం చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో సంకీ ర్ణాలను పునర్నిర్వచించిన ఎన్‌డీఏకు ఆయన నాయకత్వం వహించారు. ఆయన రాజకీయ ప్రయాణంలో అడుగడుగునా రాజనీతిజ్ఞత కనిపిస్తుంది. గుప్పెడు మంది ఎంపీలున్న పార్టీకి చెందిన వ్యక్తి అయి నప్పటికీ ఆయన మాటలు శక్తిమంతమైన కాంగ్రెస్ పార్టీని గడగడ లాడించేవి. ప్రధానమంత్రిగా తనదైన శైలిలో విపక్షాల విమర్శలను తిప్పి కొట్టేవారు. తనను ద్రోహిగా ముద్ర వేసే స్థాయికి కాంగ్రెస్ దిగ జారినప్పటికీ ఎవరిపైనా ద్వేషం పెంచుకోలేదు.
అధికారం కోసం ఏనాడూ ఆయన అవకాశవాద రాజకీయాలకు పాల్పడలేదు. 1996లో ప్రతికూల పరిస్థితుల్లో సైతం రాజీనామా చేయడానికి మొగ్గు చూపారే తప్ప బేరసారాలకు పాల్పడలేదు. 1999లో కేవలం ఒక్క ఓటు తేడాతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో జరిగిన అనైతిక రాజకీయాలను సవాలు చేయమని చాలా మంది చెప్పినప్పటికీ, న్యాయబద్ధంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చివరకు అద్భుతమైన ప్రజాతీర్పుతో తిరిగి అధికారాన్ని చేపట్టారు.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం ఆయన్ని తీవ్రంగా ప్రభా వితం చేసింది. కొన్నేళ్ల తర్వాత జరిగిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. ఆత్యయిక పరిస్థితి తర్వాత, 1977 ఎన్నికలకు ముందు తాను స్థాపించిన (జన్ సంఘ్) పార్టీని జనతా పార్టీలో విలీనం చేసేందుకు అంగీకరించారు. ఇది ఆయనతో పాటు ఇతరులను సైతం బాధించిన నిర్ణయమని నేను భావిస్తున్నాను. కానీ రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ఆయనకు ప్రధానం.
భారతీయ సంస్కృతితో అటల్‌జీ ఎంతగా మమేకమయ్యారో కూడా గమనించాల్సిందే. విదేశీ వ్యవహారాల మంత్రిగా ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ నేతగా నిలిచారు. భారతీయ వారసత్వం, గుర్తింపు పట్ల ఆయన ఎంత గర్వంగా ఉండే వారో చెప్పడానికి అంతర్జాతీయ వేదికపై చెరగని ముద్ర వేసిన ఈ ఒక్క ఉదాహరణ చాలు.
ఆయన ఓ గొప్ప రచయిత, కవి. స్ఫూర్తి నింపేందుకు, ఆలోచన లను రేకెత్తించేందుకు, ఓదార్పును అందించేందుకు తన మాటలను ఉపయోగించేవారు. ఆయన అంతర్మథనానికి, దేశం పట్ల ఉన్న ఆకాంక్షలకు ఆయన కవిత్వం అద్దం పడుతుంది.
అటల్‌జీతో సంభాషించే, నేర్చుకొనే అవకాశం దక్కడం నాలాంటి ఎంతో మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఓ గొప్ప వరం. బీజేపీకి ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. పార్టీ తొలినాళ్ళ నుంచి ఎటువంటి సవాళ్లు ఎదురైనప్పటికీ ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి లాంటి దిగ్గజాలతో కలసి వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ పార్టీని విజయపథంలో నడిపించారు. సిద్ధాంతం, అధి కారం మధ్య ఒకదాన్ని ఎంచుకోవాల్సిన సందర్భాలు ఎదురైతే ఆయన మొదటిదానినే ఎంచుకొనేవారు.
అటల్‌జీ శత జయంతి వేళ ఆయన ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనల్ని మనం పునరంకితం చేసుకోవాలి. ఆయన అనుసరించిన సుపరిపాలన, ఐక్యత, ప్రగతి అనే నియమాలను ప్రతిబింబించే భారత్‌ను నిర్మించడానికి మనం కృషి చేద్దాం. మన దేశ సామర్థ్యంపై అటల్‌జీకి ఉన్న అచంచలమైన విశ్వాసం ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, కష్టపడి పనిచేసేలా మనల్ని ప్రేరేపిస్తుంది.
నరేంద్ర మోదీ
భారత ప్రధాని
(మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ముగింపు నేడు.)
Comments
Please login to add a commentAdd a comment