విశ్లేషణ
కొన్ని వారాలుగా జమ్ము తీవ్రవాదుల దాడులతో దద్దరిల్లుతోంది. కశ్మీర్ లోయ నుండి ఉగ్రదాడులు జమ్మూకి ఎందుకు మారినట్టు? ప్రపంచంలోనే అత్యంత సైనికీకరించిన ప్రదేశాల్లో కశ్మీర్ ఒకటి. సైన్యానికి తెలియకుండా ఆకు కూడా కదలదు. కశ్మీర్‌తో పోల్చితే జమ్మూ తక్కువ సమస్యాత్మకం. జమ్ము–కశ్మీర్‌కు ఆర్టికల్ 370 రద్దు అయిదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ పాలిత కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ఈ దాడులు జరుగుతుండటం గమనార్హం. సాధారణ స్థితికి సంబంధించిన ప్రభుత్వ వాదనలను జమ్మూలో కూడా తోసిపుచ్చడమే ఉగ్రవాదుల లక్ష్యం అయి వుండాలి. శాశ్వత శాంతిని కనుగొనడంలో ‘పాకిస్తానీ హస్తం’ ఇప్పటికీ తప్పనిసరని ఈ దాడులు గుర్తు చేస్తాయని వాళ్లు భావిస్తూవుండొచ్చు.
ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ ప్రాంతంలోని రియాసీ నుంచి కాశ్మీర్‌లోని బారాముల్లా వరకు చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన వంతెన మీదుగా ఈ నెలాఖరులో తొలి రైలు రన్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కానీ ప్రశ్న ఏమిటంటే, పీర్ పంజాల్‌కు దక్షిణాన ఇటీవల జరిగిన ఉగ్రదాడుల కారణంగా ఈ ప్రాంత వాసుల్లో ఏర్పడుతున్న ఆందోళనకు ప్రధాన మంత్రి సమక్షంలో భరోసా లభిస్తుందా?
గత కొన్ని వారాలు రక్తంతో తడిసిన భీకర శబ్దాన్ని గుర్తుచేస్తున్నాయి: జూలై 8న కఠువా జిల్లాలో ఐదుగురు సైనికులు హతమయ్యారు. జూలై 7న కుల్గామ్‌లో ఆరుగురు ఉగ్రవాదులతో సహా ఎనిమిది మంది హతమయ్యారు. జూన్ 26న డోడా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 9న ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున రియాసి జిల్లాలో తొమ్మిది మంది యాత్రికులు హత్యకు గురయ్యారు.
మరో నెల రోజుల్లో, జమ్ము–కశ్మీర్‌కు ఆర్టికల్ 370 రద్దు అయిదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ పాలిత కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ‘సబ్ చంగా సీ’ (అంతా బాగుంది) పిలుపునకు ఏమైంది? ముడుచుకుపోయిన పెదవులు, పిడచకట్టుకుపోయిన నాలుకలపై కదులుతున్న ప్రశ్న ఏమిటంటే, ముస్లింలు మెజారిటీగా ఉన్న కశ్మీర్ లోయ నుండి ఉగ్రవాద దాడులు హిందూ మెజారిటీ జమ్మూకి ఎందుకు మారాయి?
మొదట, వాస్తవాలు చూద్దాం. దాడులు చేస్తున్న ఉగ్రవాదులు విదేశీయులు. అంటే వారు పాకిస్తాన్‌కు చెందినవారు. అఫ్గాన్లు, చెచెన్లు మొదలైన ఇతర విదేశీ ఉగ్రవాదుల్ని ఇక్కడ గుర్తించలేదు. రెండవది, వారు అమెరికా తయారీ ఎమ్4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్స్ వంటి అధునాతన ఆయుధాలను కలిగి ఉన్నారు. ఇవి తరచుగా జమ్ము–కశ్మీర్‌లో కంటే అఫ్గాన్ యుద్ధరంగంలో ఎక్కువగా కనిపిస్తాయి. మూడవది, వారు దాడులను నిర్వహించడానికి అత్యున్నత శిక్షణ పొందారు. నాల్గవది, ఈ ఉగ్రవాదులు అటవీ, అంతర్జాతీయ సరిహద్దు విభాగం నుండి జమ్మూ ప్రాంతంలోకి చొరబడ్డారు. వారు వేగవంతమైన ప్రవాహాల నుండి ఈదుకుంటూ వచ్చారు, అంతే తప్ప నిజంగా నియంత్రణ రేఖను దాటి కాదు.
అంతర్జాతీయ సరిహద్దు నుంచి చొరబడవచ్చని చెబితే ఎక్కువగా ఆశ్చర్యపోవద్దు. రియాసీ, డోడా, కఠువా, సాంబాలో నేల మెత్తటిది. గతంలో ఉగ్రవాదులు సొరంగాల ద్వారా చొరబడ్డారు. ఇప్పుడైతే పాకిస్తానీ డ్రోన్లు వారికి సాయపడుతున్నాయి – 2021లో జమ్మూ వైమానిక క్షేత్రంపై దాడితో సహా!
మరీ ముఖ్యంగా, పాకిస్తానీ వ్యూహంలో మార్పు – అంటే, లక్ష్య ప్రాంతాన్ని కశ్మీర్ నుండి జమ్మూకి మార్చడం అనేది కశ్మీరీ జనాభాకు ‘ఉపశమనం‘ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో స్పష్టంగా జరిగిన చర్య. కశ్మీర్ లోయ చాలా నిశితంగా పరిశీలించబడుతోంది. అక్కడ చెట్టు నుండి పడే ఆకు వేగం, కోణం, దూరం గురించి కూడా భద్రతా బలగాలకు తెలుసు. వారికి ముందుగా తెలియకుండా చిగురుటాకు కూడా రాలడం కష్టం. కశ్మీర్‌లోని పెద్ద భూభాగాలు ప్రపంచంలోనే అత్యంత సైనికీకరించబడిన వాటిలో ఒకటిగా ఉన్నాయనడంలో సందేహం లేదు. వ్యవస్థ గురించి మాట్లాడితే లేదా వ్యతిరేకంగా మాట్లాడితే దానికి చెల్లించే మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు తమ పనులు తాము చూసుకుంటారు.
జమ్మూ ప్రాంతంలో అలా కాదు. పూంఛ్–రాజౌరీ సెక్టార్‌లో నిరంతరం దాడులు జరుగుతున్నప్పటికీ, ఈ భూభాగాల భద్రత చాలావరకు సడలించబడింది. హిందూ మెజారిటీతో కూడిన జమ్మూ మరింత జాతీయవాదంతో, తక్కువ సమస్యాత్మకంగా ఉంటుంది. వాస్తవానికి, 2020 వేసవిలో వాస్తవ నియంత్రణ రేఖ అంతటా చైనీయులు కాలిడినట్లు గుర్తించిన వెంటనే, రాష్ట్రీయ రైఫిల్స్ వారి బ్రిగేడ్‌ను తూర్పు లద్దాఖ్‌కు తరలించారు. భద్రత పలుచబడిపోవడం వల్ల జమ్మూకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడు మాత్రమే ఇక్కడి బ్రిగేడ్ కొంతమంది రిజర్వ్ బలగాలతో భర్తీ అయింది.
ఇక్కడ మరొకటి కూడా జరుగుతోంది. ఇది భద్రతా పరిస్థితులతో నేరుగా సంబంధం కలిగి ఉండకపోయినా, మారుతున్న పరిస్థితుల గురించి మీకు కొంత ఆలోచన ఇస్తుంది. అదేమిటంటే ఆర్టికల్ 370 రద్దు అనంతరం కూడా బీజేపీ బలహీనపడటం!
ఇది ఇలా ఉండకూడదు. ఆర్టికల్ 370ను రద్దు చేయడం వల్ల జమ్మూను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో మరింత అనుసంధానం చేయాలని భావించారు. దానికి బదులుగా, ఇప్పుడు స్థానిక నివాసితులు పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బయటి వ్యక్తులకు భూమి అమ్మకం, మద్యం వ్యాపారంలో పెరుగుదలతో పాటుగా, శ్రీనగర్ నుండి ఐదు లక్షల మందితో కూడిన బలమైన సైన్యం తరలింపును గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఇది స్థానిక వ్యాపారానికి ఊతమిచ్చేది.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికలు ఆ అసంతృప్తిని కొంతమేరకు ప్రదర్శించాయి. ఉధమ్‌పుర్ (40.11 శాతం ఓట్లు సాధించిన చౌధురీ లాల్ సింగ్‌ను 51.28 శాతంతో జితేంద్ర సింగ్ ఓడించారు), జమ్మూ (42.4 శాతం ఓట్లు సాధించిన రామన్ భల్లాను 52.8 శాతంతో జుగల్ కిషోర్ శర్మ ఓడించారు) స్థానాలను బీజేపీ గెలుచుకున్నప్పటికీ, వారి గెలుపు మార్జిన్లు చాలా తక్కువగా ఉన్నాయి.
రెండూ 1.5 లక్షల కంటే తక్కువ. ఇలా జరగడం పట్ల అధికార పార్టీ ఒకింత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. బహుశా, పాకిస్తానీ ఉగ్రవాదులు చేయాలనుకుంటున్నది అదే కావచ్చు. ఆర్టికల్ 370 రద్దు అయిదో వార్షికోత్సవం సందర్భంగా, సాధారణ స్థితికి సంబంధించిన ప్రభుత్వ వాదనలను జమ్మూలో కూడా తోసిపుచ్చడమే. తీవ్రవాద దాడుల స్థాయి ఇంకా కొద్దో గొప్పో నియంత్రణలోనే ఉందనీ, వ్యూహాలు మారినప్పటికీ అది ఎక్కువ ప్రతీకార చర్యలకు పురిగొల్పదనీ కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులు సైనిక శిబిరాలకు ఎక్కువ నష్టం కలిగించడానికి ఉద్దేశించబడ్డాయి. జమ్మూలో ఇవి సాయుధ గస్తీపై, పౌర వాహనాలపై మెరుపుదాడిగా మారాయి.
బహుశా, మరొక కారణం ఉంది. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ బలం తగ్గినప్పటికీ, ఆయన ప్రపంచంలో పర్యటిస్తున్నారనీ, ఆయన గౌరవం పొందుతున్నారనీ పాకిస్తాన్ సర్వశక్తిమంతమైన సైనిక వ్యవస్థ గమనించకుండా ఉండదు. న్యూఢిల్లీని దాని ఆత్మసంతృప్తి దశ నుండి కదిలించి, ఒక పరిష్కారాన్ని, శాశ్వత శాంతిని కనుగొనడంలో ‘పాకిస్తానీ హస్తం’ ఇప్పటికీ తప్పనిసరని గుర్తించేలా ఈ దాడులు చేస్తాయని బహుశా రావల్పిండి భావిస్తూవుండొచ్చు.
అయినప్పటికీ, అంతర్గత ఒత్తిడికి మోదీ చాలా ఎక్కువగా స్పందిస్తారని స్పష్టంగా తెలుస్తుంది. 2019లో కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను బలవంతంగా ప్రారంభించిన పంజాబ్ మాదిరిగానే, మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కశ్మీర్‌కు అవకాశం వస్తుంది. కశ్మీర్ లేదా జమ్మూ నుండి ఎన్నికైన ప్రతినిధులను ఢిల్లీ గానీ, రావల్పిండి గానీ విస్మరించలేవు. చేతిలో ఒక క్షణం ఉంటుంది. ఇది త్వరలో మళ్లీ రాకపోవచ్చు. భారతదేశం, పాకిస్తాన్ రెండూ
ప్రయత్నించాలి, దానికి సిద్ధం కావాలి.
జ్యోతీ మల్హోత్రా
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment