ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ప్రజల సమస్యలపై కంటే ఆయన ‘మన్ కీ బాత్’ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు.
మోదీకి తన మన్ కీ బాత్ గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ, ఉద్యోగాలు కల్పించడం, పెరుగుతున్న ధరలను నియంత్రించడం వంటి కామ్ కీ బాత్ గురించి మాట్లాడరని విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ ప్రభావం పెరుగుతండటంతో ప్రధాని మోదీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని అన్నారు. భారత కూటమి, కాంగ్రెస్‌లు మోదీ సైకాలజీని మార్చేశాయని అన్నారు.
‘ఈ రోజుల్లో ప్రధాని మోదీ ముఖం మారిపోయింది, ఆయన మూడ్ మారిపోయింది. దీనికి కారణం భారత కూటమి, కాంగ్రెస్ పార్టీ, ఈ దేశ ప్రజలే. ప్రధాని, బీజేపీ విభజన రాజకీయాలు వ్యప్తి చేస్తున్నారు. గత 10 ఏళ్లలో మోదీ, బీజేపీ ఎక్కడికి వెళ్లినా విద్వేషాన్ని వ్యాపింపజేశారు. అన్నదమ్ములు ఒకరితో ఒకరు పోట్లాడుకునేలా చేశారు, మతాల మధ్య చిచ్చులు పెట్టారు.
చదవండి:
విద్యావంతులకు ఉద్యోగాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. విద్యావంతులకు ఉద్యోగాలు దొరక్కపోవడంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోంది. ఇది నరేంద్ర మోదీ యువతకు ఇచ్చిన బహుమతి’ అంటూ సెటైర్లు వేశారు. జమ్మూ కాశ్మీర్‌ను రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా తగ్గించడం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించారని విమర్శించారు. ఇక్కడి ప్రజలు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణకు అర్హులని అన్నారు. కాగా జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ సెప్టెంబర్ 18న జరగ్గా, రెండో దశ ఓటింగ్ సెప్టెంబర్ 25న, మూడో దశ అక్టోబర్ 1న జరగనుంది. అక్టోబర్ 8న ఓట్లను లెక్కించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment