Jammu and Kashmir assembly elections
-
అనుకున్నదొకటి... అయ్యిందొకటి!
నాలుగు రోజుల క్రితం ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు వచ్చాయి. మంగళవారం కౌంటింగ్ మొదల య్యాక ఉదయం 9 గంటల వేళ తొలి ఫలితాల సరళీ వచ్చింది. కానీ, ఆశ్చర్యకరంగా అంతా మారి పోయింది. హర్యానా, జమ్ము–కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు, ఆశాభావాలు తలకిందుల య్యాయి. పోటాపోటీతో హంగ్ అవుతుందని బీజేపీ ఆశపడ్డ జమ్ము – కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి గెలిచింది. హర్యానాలో కాంగ్రెస్‌దే విజయం అని ఎగ్జిట్‌పోల్స్ కోడై కూసినచోట అవన్నీ తోసిరాజని విజయంతో బీజేపీ అబ్బురపరిచింది. 1966 హర్యానా ఏర్పాటయ్యాక ఇప్పటి దాకా ఏ పార్టీ సాధించని హ్యాట్రిక్‌తో రికార్డ్ సృష్టించింది. పార్టీల నుంచి ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకుల దాకా ప్రతి ఒక్కరికీ ఈ ఫలితాలు పాఠాలు నేర్పడం గమనార్హం. ఏ ఎన్నికా చిన్నది కాదనీ, ప్రతిదీ కీలకమేననీ, అతి విశ్వాసం పనికిరాదనీ మరోసారి ఈ ఫలితాలు తేల్చాయి. దశాబ్దం తర్వాత, అదీ 2019 ఆగస్ట్‌లో ఆర్టికల్ 370 రద్దు చేశాక, జమ్ము–కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాక... తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ప్రజాతీర్పు ఆసక్తికరమే. కొన్నేళ్ళుగా ‘నయా కశ్మీర్’గా ఎంతో చేశామని చెప్పుకున్నప్పటికీ, జమ్మూను దాటి కశ్మీర్ లోయలో బీజేపీ తన ప్రభావం చూపలేకపోయింది. దోడా స్థానం గెలిచి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కశ్మీర్లో ఖాతా తెరవడం విశేషం. మరోపక్క హర్యానాలో ‘తిమ్మిని బమ్మిని చేసి బీజేపీ తెచ్చుకున్న గెలుపు’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్ ఫలితాల సరళిని చూపిన తీరు, ఈవీఎంల బ్యాటరీల శాతమూ అనుమానాస్పదమన్నది ఆ పార్టీ ఆక్షేపణ, ఆరోపణ. ఆ మధ్య లోక్ సభ ఎన్నికల్లో లానే ఇప్పుడూ ఈసీ ఆ ఆరోపణల్ని బాధ్యతారహితమంటూ కొట్టిపారేసింది. ఆరోపణల్ని పక్కనబెట్టి అసలు జరిగింది ఇప్పటికైనా పరిశీలించుకోవడం అన్ని వర్గాలకూ కీలకం. కశ్మీర్ సంగతి అటుంచి, హర్యానానే తీసుకుంటే... ‘జవాన్... కిసాన్... పహిల్వాన్’ నినాదంతో ముందుకెళ్ళిన కాంగ్రెస్ హర్యానాలో ఆ అంశాలు బీజేపీని మట్టికరిపిస్తాయని భావిస్తూ వచ్చింది. కానీ, జరిగింది వేరు. పదేళ్ళుగా హర్యానాను పాలిస్తున్న బీజేపీ పట్ల అధికారపక్ష వ్యతిరేకత ఒకటికి రెండింతలు ఉన్నప్పటికీ దాని నుంచి ఎందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ లబ్ధి పొందలేకపోయింది. అందుకు కారణాలను ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాలి. సమైక్య ప్రతిపక్షంగా బీజేపీకి అడ్డుకట్ట వేయాల్సింది పోయి, కాంగ్రెస్ తన బలాన్ని అతిగా అంచనా వేసుకొని భంగపడింది. ఆప్‌కి హర్యా నాలో చెప్పుకోదగిన స్థాయిలో ఓటు బ్యాంకు ఉందని తెలిసినా, సీట్ల సర్దుబాటు, పొత్తు విషయంలో కాంగ్రెస్ మొండిపట్టుతో పోవడం గట్టి దెబ్బ తీసింది. ఆప్ సీట్ల డిమాండ్ 20 దగ్గర మొదలై, 10 దగ్గరకు వచ్చి ఆగి, చివరకు 5 స్థానాల దగ్గరకు వచ్చి ఆగినా, పొత్తు పొడవనే లేదు. తప్పక గెలిచే 3 సీట్లిచ్చినా చాలు... ‘ఆప్’ ఓకే అంటుందని తెలిసినా, ఆఖరికి రాహుల్ సైతం పొత్తుకే మొగ్గు చూపినా, కాంగ్రెస్ దూతలు పడనివ్వలేదు. చివరకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అధిష్ఠానం జోక్యం చేసుకొని పరాజయానికి బాధ్యులెవరో చూడాలంటూ కుమారి సెల్జా గొంతు విప్పారు. దీన్నిబట్టి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌లో వర్గవిభేదాలకు కొదవ లేదని అర్థమవుతోంది. సీట్ల పంపిణీ వేళ భూపీందర్ సింగ్ హూడా తన వర్గం వారికే ఎక్కువ సీట్లివ్వడం ఇతర సీనియర్ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. ఆ అంతర్గత కుమ్ములాటలు ఆఖరికి మొత్తంగా రాష్ట్రంలో పరాజయానికీ దారి తీశాయన్నది ప్రాథమిక విశ్లేషణ. కాంగ్రెస్ ప్రధానంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా జాతీయ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. స్థానిక అంశాలతో పాటు సూక్ష్మపరిశీలనతో ఎన్నికల మేనేజ్మెంట్పై శ్రద్ధ పెట్టడం, సీఎంనూ, కొన్నిచోట్ల అభ్యర్థులనూ మార్చడం కమలనాధులకు కలిసొచ్చింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కనిపించని ఆర్ఎస్ఎస్ ఈసారి ప్రభావం చూపింది. అలాగే, ప్రధాని మోదీ సభలు, మాటలు నాన్ – జాట్ వర్గాలను ఆకర్షించాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పూర్తిగా జాట్లు – దళితుల ఓట్బ్యాంక్పైనే అతిగా ఆధారపడి, జాట్లు మినహా మిగతా వర్గాలు, ఓబీసీలు కాషాయఛత్రం కింద ఏకమవుతున్న సంగతి కనిపెట్టలేకపోవడం ఘోర తప్పిదమైంది. కాంగ్రెస్ పక్షాన సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై నెలకొన్న గందరగోళం, గతంలో సాగిన హుడా హయాం పట్ల అసంతృప్తి, ఆయనే మళ్ళీ సీఎం కావచ్చనే అభిప్రాయం ఓటర్లను కాంగ్రెస్ వైపు మొగ్గకుండా ఆపింది. మొత్తంగా రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 1 శాతం కన్నా తక్కువే. అయితే, సీట్ల పరంగా బీజేపీ గణనీయ విజయం సొంతం చేసుకోవడం క్షేత్రస్థాయి వ్యూహ∙ఫలితం. ఎగ్జిట్ పోల్స్‌లో ఓట్ల శాతం అంచనా కాస్త అటూ ఇటూగా అంతేవున్నా, వచ్చే సీట్ల సంఖ్యపై అతిగా జోస్యం చెప్పడం ఎదురుతన్నింది. వెరసి, ఎగ్జిట్ పోల్స్ కచ్చితత్వాన్ని అనుమానంలోకీ, నిర్వాహకుల్ని ఆత్మపరిశీలనలోకీ నెట్టాయి. ఆప్, కాంగ్రెస్ గనక కలసి పోటీ చేసివుంటే, ఆ రాష్ట్ర ఫలితాలు కచ్చితంగా మరోలా ఉండేవని ఓట్ షేర్ శాతాన్ని బట్టి విశ్లేషణ. కశ్మీర్లో వాస్తవం గుర్తించి, పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఆ పని హర్యానాలో చేయకపోవడమే విడ్డూరం. ఇప్పుడిక రానున్న మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికలపైకి ఫోకస్ మారనుంది. ఇప్పటికే హర్యానా ఫలితానికి కాంగ్రెస్‌ను ఆప్ తప్పుబట్టడం మొదలుపెట్టింది. మరి, ఫిబ్రవరిలోగా జరగనున్న ఢిల్లీ ఎన్నికలకైనా ఈ పార్టీలు జత కడతాయో, లేదో చూడాలి. ఏమైనా, తప్పక గెలుస్తారనుకున్న ఎన్నికల్లో సైతం ఆఖరి క్షణంలో కోరి చేతులారా ఓటమి కొని తెచ్చుకోవడం కాంగేయులకు పరిపాటి అయింది. క్షేత్రస్థాయి లోపాల్ని సరిదిద్దక, పోటీకి ముందే గెలుపు ధీమాతో అతిగా వ్యవహరిస్తే ఎవరికైనా ఎదురుదెబ్బలు ఖాయమని గుర్తిస్తే మంచిది. -
ఎన్నికల ఫలితాలు.. హర్యానా, జమ్మూలో ఓడిన ప్రముఖులు వీరే
జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవ్వడంతో.. పార్టీలు కంగుతున్నాయి. హర్యానా పోరులో బీజేపీ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.90 స్థానాలకు గానూ 48 చోట్ల విజయ కేతనం ఎగురవేసి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది.. ఇక హర్యానా ఫలితాలు హస్తానికి తీవ్ర నిరాశపరిచాయి. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పక్కా అంటూ ధీమా మీదున్న కాంగ్రెస్ కేవలం 37 స్థానాలకే పరిమితమైంది.అటు జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ - కాంగ్రెస్ కూటమికి ఓటర్లు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. మెజార్టీ ఫిగర్‌ను దాటి 49 స్థానాలను గెలుచుకుంది. దీంతో ఎన్సీ నేత ఓమర్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్ సీఎంగా అవతరించనున్నారు. బీజేపీ 29 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖ నేతలకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. పార్టీ చీఫ్‌లు, మాజీ సీఎంలు ఓటమిని చవిచూశారు.. వారిలోహర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్ హోడల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భాన్.. బీజేపీ అభ్యర్థి హరీందర్ సింగ్ చేతిలో 2,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హోడల్ సీటును గెలుచుకున్న ఆయనతే 2019 ఎన్నికల్లో బీజేపీకి చెందిన జగదీష్ నాయర్ చేతిలో ఓడిపోయారు. ఇక 2022 నుంచి హర్యానా కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు.అభయ్ చౌతాలాఐఎన్ఎల్డీకి చెందిన అభయ్ చౌతాలా ఎల్లినాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి భరత్ సింగ్ బెనివాల్ చేతిలో 15,000 ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు.అనురాగ్ ధండాకలయత్ నుంచి బరిలోకి దిగిన ఆప్ సీనియర్ నేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనురాగ్ ధండా ఓటమి చెందారు. కలయత్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగిన ధండా.. ఏడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌కు చెందిన వికాస్ సహారన్ గెలుపొందారు.దుష్యంత్ చౌతాలాజననాయక్ జనతాపార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలా భారీ ఓటమిని ఎదుర్కొన్నారు. ఉచానా కలాన్ నుంచి బరిలో దిగిన దుష్యంత్ చౌతాలా .. ఐదో స్థానానికి పరిమితయ్యారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ భుజ్ 32 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారి బ్రిజేంద్ర సింగ్‌పై విజయం సాధించారు.దిగ్విజయ్ సింగ్ చౌతాలాననాయక్ జనతాపార్టీ మరో నేత దిగ్విజయ్ సింగ్ చౌతాలా దబ్వాలి నియోజకవర్గం నుంచి ఓటమిని చవిచూశారు. తన దూరపు బంధువు ఆదిత్య దేవి లాల్ చేతిలో ఓడిపోయారు. కాగా దిగ్విజయ్, ఆదిత్య ఇద్దరూ హర్యానా మాజీ ముఖ్యమంత్రి దేవి లాల్‌తో బంధుత్వం కలిగి ఉన్నారు. వీరు భారతదేశ ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు.గెలిచిన ప్రముఖులుహర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ఘన విజయం సాధించారు. లాడ్వా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగిన సైనీ.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్ సింగ్రోహాపై గెలుపొందారు.హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా విజయం సాధించారు. గర్హి సంప్లా-కిలోయ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిపి మంజుపై 71, 465 ఓట్ల తేడాతో గెలుపొందారు.స్వతంత్ర అభ్యర్థి, భారతదేశపు అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ హిసార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆమె బీజేపీకి చెందిన కమల్ గుప్తా, కాంగ్రెస్ అభ్యర్థి రామ్ నివాస్ రారాపై 18,941 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జిందాల్ కుటుంబానికి చెందిన 74 ఏళ్ల మాతృమూర్తి.. మూడోసారి హిసార్‌లో గెలిచారు, గతంలో 2005, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. భారత రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వినేశ్ ఫొగట్ హర్యానా ఎన్నికల్లో విజయం సాధించారు. జులానా నియోజవర్గంలో తమ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై 5763 ఓట్ల తేడాతో వినేశ్ పైచేయి సాధించారు.జమ్ము కశ్మీర్- ఓటమి చెందిన నాయకులుఇల్తిజా ముఫ్తీపీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీఓటమి పాలయ్యారు. శ్రీగుఫ్వారా – బిజ్బెహరా నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి బషీర్ అహ్మద్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈ మేరకు తన ఓటమిని ఇల్తిజా అంగీకరించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. తన గెలుపు కోసం కష్టపడిన పీడీపీ కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.బీజేపీ చీఫ్ రవీందర్ రైనానౌషేరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాష్ట్ర బీజేపీచీఫ్ రవీందర్ రైనా ఓటమి చెందారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి సురీందర్ చౌదరి చేతిలో 7, 819ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈసీ ప్రకారం.. చౌదరికి 35,069 ఓట్లు రాగా, రైనాకు 27,250 ఓట్లు వచ్చాయి.పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా ఉన్న అఫ్జల్ గురు సోదరుడైన స్వతంత్ర అభ్యర్థి ఐజాజ్ అహ్మద్ గురూ ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్ నియోజకవర్గంలో 26,846 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఇర్షాద్ రసూల్ కర్ విజయం సాధించారు.జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ అధినేత సయ్యద్ అల్తాఫ్ బుఖారీ శ్రీనగర్‌లోని చన్నపోరా నియోజకవర్గంలో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ముస్తాక్ గురూ చేతిలో ఓడిపోయారు.జమ్ముకశ్మీర్‌లోని రియాసి నుంచి బీజేపీ నేత కుల్దీప్ రాజ్ దూబే 18815 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన ముంతాజ్ అహ్మద్‌ను ఓడించాడు.ఇక జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన గందర్ బాల్, బుద్గాం స్థానాల్లో విజయం సాధించారు. -
జమ్ముకశ్మీర్ ఫలితాలు.. బీజేపీ చీఫ్ ఓటమి
పదేళ్ల తర్వాత జరిగిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకుపోతుంది. మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన మెజార్జీకి(45)మించి 49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో కేంద్రపాలిత ప్రాంతంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు లాంఛనంగా మారింది.ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. నౌషేరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాష్ట్ర బీజేపీచీఫ్ రవీందర్ రైనా ఓటమి చెందారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి సురీందర్ చౌదరి చేతిలో 7, 819ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈసీ ప్రకారం.. చౌదరికి 35,069 ఓట్లు రాగా, రైనాకు 27,250 ఓట్లు వచ్చాయి.కాగా జమ్ముకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. హంగ్ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాటికి భిన్నంగా ఫలితాల్లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్లింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు దక్కించుకుంది. దీంతో బుద్గామ్‌లో గెలుపొందిన ఒమర్ అబ్దుల్లానే సీఎంగా బాధ్యతలు చేపడతారని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దులా పేర్కొన్నారు. -
కశ్మీర్, హరియాణాల్లో నేడే ఓట్ల లెక్కింపు
చండీగఢ్: హరియాణా, జమ్మూకశ్మీర్‌ల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల రక్షణ వ్యవస్థ ఉంటుందని తెలిపింది. జమ్మూ కశ్మీర్లో మొత్తం మూడు విడతలుగా, హరియాణాలో ఈనెల 5న ఒకే విడతలో పోలింగ్ జరగడం తెలిసిందే. -
ప్రధానికి ‘మన్‌కీ బాత్’ పైనే ఎక్కువ దృష్టి: రాహుల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ప్రజల సమస్యలపై కంటే ఆయన ‘మన్ కీ బాత్’ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు.మోదీకి తన మన్ కీ బాత్ గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ, ఉద్యోగాలు కల్పించడం, పెరుగుతున్న ధరలను నియంత్రించడం వంటి కామ్ కీ బాత్ గురించి మాట్లాడరని విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ ప్రభావం పెరుగుతండటంతో ప్రధాని మోదీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని అన్నారు. భారత కూటమి, కాంగ్రెస్‌లు మోదీ సైకాలజీని మార్చేశాయని అన్నారు.‘ఈ రోజుల్లో ప్రధాని మోదీ ముఖం మారిపోయింది, ఆయన మూడ్ మారిపోయింది. దీనికి కారణం భారత కూటమి, కాంగ్రెస్ పార్టీ, ఈ దేశ ప్రజలే. ప్రధాని, బీజేపీ విభజన రాజకీయాలు వ్యప్తి చేస్తున్నారు. గత 10 ఏళ్లలో మోదీ, బీజేపీ ఎక్కడికి వెళ్లినా విద్వేషాన్ని వ్యాపింపజేశారు. అన్నదమ్ములు ఒకరితో ఒకరు పోట్లాడుకునేలా చేశారు, మతాల మధ్య చిచ్చులు పెట్టారు. చదవండి: సోనియాపై ఆరోపణలు.. కంగనాకు కాంగ్రెస్ వార్నింగ్విద్యావంతులకు ఉద్యోగాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. విద్యావంతులకు ఉద్యోగాలు దొరక్కపోవడంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోంది. ఇది నరేంద్ర మోదీ యువతకు ఇచ్చిన బహుమతి’ అంటూ సెటైర్లు వేశారు. జమ్మూ కాశ్మీర్‌ను రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా తగ్గించడం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించారని విమర్శించారు. ఇక్కడి ప్రజలు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణకు అర్హులని అన్నారు. కాగా జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ సెప్టెంబర్ 18న జరగ్గా, రెండో దశ ఓటింగ్ సెప్టెంబర్ 25న, మూడో దశ అక్టోబర్ 1న జరగనుంది. అక్టోబర్ 8న ఓట్లను లెక్కించనున్నారు. -
తొలగని ప్రతిష్టంభన
* కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుపై ముందుకు సాగని యత్నాలు * నేడు గవర్నర్‌తో పీడీపీ భేటీ * జమ్మూ కశ్మీర్, అసెంబ్లీ ఎన్నికలు, మెహబూబా ముఫ్తీ శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన తొలగలేదు. 87 స్థానాల అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లతో అతిపెద్దపార్టీగా అవతరించిన పీడీపీగానీ, రెండవ స్థానం సాధించిన బీజేపీగానీ ప్రభుత్వం ఏర్పాటుకు సంఖ్యాబలాన్ని సాధించలేక పోతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చకోసం జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా విధించిన గడువు సమీపిస్తోంది. కాగా, ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని 28మంది పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం గవర్నర్‌ను కలుసుకోనున్నారు. తన 25మంది సభ్యులతో బీజేపీ గురువారం తన ప్రతిపాదనలను గవర్నర్‌కు సమర్పించనుంది. ప్రస్తుత రాజకీయ ప్రతిష్టంభనను తొలిగించగలిగే పరిష్కారమేదీ ప్రస్తుతానికి తమవద్ద లేదని పీడీపీ ప్రతినిధి నయీం అక్తర్ చెప్పారు. పీడీపీకి మద్దతుగా 15మంది ఎమ్మెల్యేల నేషనల్ కాన్ఫరెన్స్ తీర్మానం ఆమోదించినట్టు వదంతులు రాగా, వాటిని పార్టీ ఖండించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, జమ్మూ కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు జుగల్ కిశోర్ శర్మలు గవర్నర్‌తో చర్చలు జరిపారు. ప్రభుత్వం ఏర్పాటుపై జనవరి 1న తమ ప్రతిపాదనలను గవర్నర్‌కు సమర్పిస్తామని రాం మాధవ్ చెప్పారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలతో పీడీపీ ‘మహాకూటమి’గా ఏర్పడితే అది కశ్మీర్ ప్రజలకు విద్రోహం చేసినట్టే అవుతుందని జగల్ కిశోర్ శర్మ చెప్పారు. కాగా, కశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు సైఫుద్దీన్ సోజ్ కూడా మంగళవారం గవర్నర్‌తో చర్చించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోరాదంటూ పీడీపీకి సూచన చేశారు. -
‘రెండో దశ’లోనూ ఓట్ల చైతన్యం
జమ్మూకశ్మీర్‌లో 72%, జార్ఖండ్‌లో 65.46% పోలింగ్ శ్రీనగర్/జమ్మూ/రాంచీ: జమ్మూకశ్మీర్, జార్ఖండ్‌లలో మంగళవారం జరిగిన రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చైతన్యం వెల్లివిరిసింది. జమ్మూకశ్మీర్‌లోని 18 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదవగా, జార్ఖండ్‌లోని 20 మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 65.46 శాతం పోలింగ్ నమోదైంది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల భయం, జార్ఖండ్‌లో మావోయిస్టుల దాడుల భయం మధ్య జరిగిన ఈ దశ పోలింగ్ ఒక్క అవాంఛనీయ ఘటనా జరగకుండానే ప్రశాంతంగా ముగియడం విశేషం. జమ్మూకశ్మీర్‌లో నవంబర్ 25న 15 సీట్లకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 71.28 శాతం పోలింగ్ నమోదవగా, జార్ఖండ్‌లో 13 సీట్లకు అదే రోజు జరిగిన తొలి దశ ఎన్నికల్లో 61.92 శాతం పోలింగ్ నమోదవడం తెలిసిందే. వేర్పాటువాదులకు చెంపపెట్టు జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదుల ఎన్నికల బహిష్కరణ పిలుపును బేఖాతరు చేస్తూ ఓటర్లు ఉదయం నుంచే భారీ క్యూలలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమ్మూ ప్రాంతంలోని మూడు జిల్లాలు, కశ్మీర్ లోయలోని రెండు జిల్లాల పరిధిలో ఈ పోలింగ్ జరిగింది. రెండో దశ ఎన్నికలకు ముందు జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల ఉగ్ర దాడులు, ఎన్కౌంటర్లు జరిగిన నేపథ్యంలో పోలింగ్ రోజున భద్రతను కట్టుదిట్టం చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తుది గణాంకాలు అందాక పోలింగ్ శాతం ఒకటి, రెండు శాతం మేర పెరుగుతుందని ఆశిస్తున్నట్లు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్షీ ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. జిల్లాలవారీగా చూస్తే రీసీలో అత్యధికంగా 80 శాతం, ఉధంపూర్‌లో 76 శాతం, పూంచ్‌లో 75 శాతం, కుప్వారాలో 68 శాతం, కుల్గామ్‌లో 60 శాతానికిపైగా పోలింగ్ నమోదైందన్నారు. వాతావరణం అనుకూలించి మంచు కురవకపోవడం కూడా పోలింగ్ భారీగా నమోదవడానికి కారణమైందన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 61.04 శాతం పోలింగ్‌కన్నా, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 68.79 శాతం పోలింగ్ కన్నా రెండో దశ పోలింగ్ శాతం అధికమన్నారు. రెండో దశ ఎన్నికల్లో 175 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో నలుగురు మంత్రులు, 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈవీఎంలలో అర్జున్ ముండా, కోడా భవిత జార్ఖండ్‌లోని ఏడు జిల్లాల పరిధిలో రెండో దశ పోలింగ్ జరిగింది. మావోయిస్టుల దాడుల నేపథ్యంలో 18 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకే పోలింగ్ చేపట్టగా మరో రెండు నియోజకవర్గాలైన జంషెడ్పూర్ తూర్పు, జంషెడ్పూర్ పడమర నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరిగింది. ఈ దశ ఎన్నికల్లో మొత్తం 223 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా వారిలో మాజీ ముఖ్యమంత్రులు అర్జున్ ముండా, మధు కోడా, ముగ్గురు మంత్రులు, 18 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.